స్తీల చరిత్ర పునర్నిర్మాణానికి చారిత్రక పత్రం ‘వెలుగుదారులలో…’ – డా. వెంకటరామయ్య గంపా

“My life is history, politics, geography. It is religion and metaphysics. It is music and language” (Paula Gunn Allen. The Autobiography of a Confluence. (Quoted by Sidonie Smith and Julia Watson,P-1)

పైన పేర్కొన్న అంశం నంబూరి పరిపూర్ణ గారికి పూర్తిగా వర్తిస్తుంది. పరిపూర్ఱ గారి స్వీయచరిత్రలో చరిత్రకు కావలసిన ఆకరాలు ఎన్నో ఉన్నాయి. పుట్టుకతోనే కుటుంబంలో రాజకీయ వాతావరణం ఉండడం, రాజకీయ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం, తెలుగు ప్రాంతంలో ఆనాడు ఉన్న ముఖ్యమైన ఒక రాజకీయ నేతను వివాహం చేసుకోవడం, వివాహంలో వచ్చిన సమస్యలను అధిగమించి ముందుకు ప్రయాణించడం, విద్యాభ్యాసం, ఉద్యోగం, సంతానం వివిధ ప్రాంతాల్లో ఉండడం కారణంగా భౌగోళికంగా దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలలో నివసించాల్సిన అవసరం ఏర్పడడం, ఇంట్లో ప్రారంభంలో వైష్ణవదాసులుగా కొనసాగడం, తదనంతర కాలంలో మత విశ్వాసాలకు దూరంగా ఉండడం, చిన్నతనంలోనే సినిమాలలో ప్రవేశించి అక్కడ తన ప్రతిభను చూపించడం మొదలైన అంశాలన్నీ కనిపిస్తాయి. చరిత్ర నిర్మాణానికి ఈ అంశాలు ఒక ఉత్తమమైన ఆకరాలుగా నిలుస్తాయి.
‘వెలుగు దారులలో’ ఆత్మకథ: ఆటో ఎత్నోగ్రఫీ (Aబ్‌శీవ్‌ష్ట్రఅశీస్త్రతీaజూష్ట్రవ):
స్వీయ చరిత్రలో దాదాపు 50 రకాలకు పైగా ఉన్నట్లు ఆంగ్ల విమర్శకులు పేర్కొన్నారు. వాటిలో ఆటో ఎత్నోగ్రఫీ అనేటటువంటిది ఒక రకమైన ప్రక్రియ. ఈ ఆటో ఎత్నోగ్రఫీ ప్రక్రియలో సామాజికంగా వెనుకబడిన వారు, అణచివేతకు గురైన వారు వారి జీవన సంస్కృతిని పాఠకులకు అందించడం అనేది ముఖ్యమైన అంశం. ఇందులో సంప్రదాయమైన జీవన విధానంలో ఉంటూనే సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ అందుకు అనుకూలంగా తమని తాము మార్చుకుంటూ సామాజికంగా ముందుకు వెళ్ళడం అనేది ముఖ్య లక్షణం. ఈ లక్షణానికి అనుగుణంగా ఉన్న నంబూరి పరిపూర్ణ గారి ఆత్మకథను (వెలుగుదారులలో… నంబూరి పరిపూర్ణ స్వీయ చరిత్ర) ఆటో ఎత్నోగ్రఫీ ప్రక్రియ కింద పరిగణించవచ్చు. సామాజికంగా వెనుకబడిన ఒక కుటుంబం నుంచి వచ్చి, సమాజంలో ఉన్న అనేక సమస్యలను దాటుకొని తాను మాత్రమే కాకుండా తన సంతానానికి విజయవంతమైన ఒక మార్గాన్ని సృష్టించారు. వారి ఆత్మకథను గమనించినట్లయితే దాదాపు ఒక శతాబ్ద కాలంలో వచ్చిన సామాజికపరమైన మార్పులు, భావజాలపరంగా వ్యక్తులు చెబుతున్న లక్షణాలకు, అవలంబిస్తున్న పద్ధతులకు పొంతనలేనితనాన్ని అర్థం చేసుకోవచ్చు.
మన దేశంలో లభిస్తున్న చరిత్ర కొద్దిమందికే ప్రాతినిధ్యం వహించేదిగా విమర్శకులు పేర్కొంటారు. ముఖ్యంగా సామాజికంగా అణచివేతకు గురైన వారి చరిత్ర చాలా తక్కువగా లభిస్తుంది. ఒక ప్రత్యామ్నాయ చరిత్ర రాయాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన ఆధారాలు చాలా ముఖ్యం. ఒక ప్రముఖ విమర్శకులు చరిత్ర ఆధారాల గురించి పేర్కొంటూ ‘కొన్ని సందర్భాలలో ఒక పదం, ఒక వాక్యం కూడా చరిత్ర ఆధారాలకు ఎంతో తోడ్పడతాయనీ, ఆ పదం లేదా వాఖ్యం ఆధారంగా చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం చేయవచ్చ’ని అభిప్రాయపడ్డారు.
మతంపై నంబూరి పరిపూర్ణ అభిప్రాయం:
నంబూరి పరిపూర్ణ గారు వామపక్ష భావజాలానికి చెందిన వారుగా రచనలో కనిపిస్తారు. వారి ఆత్మకథ రాసే సమయానికి వారికి సమాజం పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఆ సందర్భంలో మతంపై వారు వెలిబుచ్చిన అభిప్రాయం చాలా విలువైనదిగా కనిపిస్తుంది. ‘‘ప్రస్తుత కాలంలో మా కుటుంబీకులెవరికీ మత విశ్వాసాలు లేకపోయినప్పటికీ ఆనాటి అస్పృశ్యులు కొందరు వైష్ణవదాసులుగా మారడం ఓ గొప్ప సాంఘిక, చారిత్రక సంఘటనగా పరిగణించాలి. ఎందుకంటే ఈ మతశాఖ వీరికిచ్చింది మతమౌఢ్యం గాదుÑ సదాచారాలను, సద్భావననూ! వైష్ణవులు విష్ణువు రూపుదాల్చిన పది అవతారాల గురించి తెలుసుకునేందుకు తత్సంబంధ పురాణ ఇతిహాసాల్ని అధ్యయనం చేయాల్సి ఉంది గదా. అందుకు అక్షరాస్యులయితేనే అది సాధ్యం. అందుకే ఈ దాసర్లు అక్షరాస్యులవడమేగాదు, పురాణ గ్రంథ అధ్యయనశీలులయ్యారు. రామాయణ, భాగవత, భారతాది గ్రంథాలను శ్రద్ధాభక్తులతో పఠించారు. ఫలితంగా వారికి మంచి వాక్శుద్ధి, పౌరాణిక జ్ఞానం అలవడిరది’’. (పరిపూర్ణ నంబూరి, వెలుగుదారులలో, పుట`11)
ఒక మత సంప్రదాయాన్ని అనుసరించడం కోసం అక్షర జ్ఞానాన్ని అలవరచుకోవడం, ఆ అక్షర జ్ఞానాన్ని పొందడం ద్వారా పరిపూర్ణ గారి తల్లిదండ్రులు విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులుగా మారడం, అక్షర జ్ఞానమే తర్వాత తరాలకు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసింది. మతం అనే అంశాన్ని వామపక్ష భావజాలానికి చెందినటువంటి ఒక వ్యక్తి భిన్న కోణంలో చూడటం అనేది పేర్కొనదగిన అంశం. ‘‘మా అమ్మ లక్ష్మమ్మ రెండో తరగతి చదువుతూ, పన్నెండేళ్ళకే గృహిణిగాను, మా నాయనకు అసిస్టెంట్‌ టీచరుగానూ మారింది. ఆమె పుట్టిల్లు పూర్తిగా ఆధ్యాత్మిక చింతన గల్గినది. నిత్యం గీతాధ్యయనం జరుగుతుండే వాతావరణం నుంచి రావడం వల్ల గాబోలు మా అమ్మ భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా చదువుతుండేది. రామాయణ పారాయణం మాట సరేసరి. అందువల్లనే గావచ్చు ఆమె బడిలో పిల్లలకు చదువు చెప్పగల్గుతుండేది.’’ (వెలుగుదారులలో, పుట`13)
ప్రాచీన కాలం నుంచి ఈనాటికి కూడా అక్షర జ్ఞానం వలన వ్యక్తికి గౌరవం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో సామాజికమైన సమస్యలు ఉన్నప్పటికీ అక్షర జ్ఞానంలో ముందున్న వ్యక్తికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని పరిపూర్ణ గారి ఆత్మ చరిత్ర ద్వారా అవగతమవుతుంది.
సామాజిక సంబంధాలు:
దేశంలో వివక్షత అనేది ఏదో ఒక రూపంలో మనుషుల మధ్య కొనసాగుతూ ఉంది. కానీ కొన్ని సందర్భాలలో స్నేహ సంబంధాలు అనేవి వర్గానికి అతీతంగా ఉన్నట్లు ఈ రచనలో కనిపిస్తుంది. సామాజిక సంస్కర్తగా సుపరిచితమైన దర్శి చెంచయ్యగారు నంబూర్ణ పరిపూర్ణ గారిని కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకొని చదువుకు కావలసిన ఏర్పాట్లు చేసినట్లు రచనలో తెలుస్తుంది. దర్శి చెంచయ్య గారికి, నంబూరి పరిపూర్ణ గారి సోదరునికి ఉన్న స్నేహ సంబంధం కారణంగా పరిపూర్ణ గారిని తన దగ్గర ఉంచుకున్నట్లు రచయిత్రి పేర్కొన్నారు. ఉన్నత వర్గాలలోని కొంతమందికి సామాజికంగా అనేక కట్టుబాట్లు ఉంటే, మరికొంతమంది ఆ కట్టుబాట్లను తెంచుకొని బయటకు వచ్చి మానవత్వంతో కూడిన జీవితాన్ని, స్నేహ సంబంధాలను పంచుకున్నట్లు ఈ రచన ద్వారా తెలుస్తుంది. అలాగే మరొక వ్యక్తి తనపైన చూపించిన వాత్సల్యాన్ని పేర్కొన్నారు. ‘‘జి.వరలక్ష్మి అక్కయ్యది ఆళ్వారుపేటకి అటు పక్కగా, పెద్ద మైదానం మధ్యనున్న ఐదారు గదుల పెద్ద పెంకుటి లోగిలి. ఆమె తల్లీ, చెల్లెలూ, అన్నగారూ, ఇద్దరు తమ్ముళ్ళూ ఆమె వద్దే ఉండేవారు. గుంటూరు కొత్తపేటలో ‘గడ్డం’ ఇంటిపేరున్న కొన్ని కాపు కుటుంబాలు పేరెన్నిక గలవట. వరక్కయ్య అమ్మగారికి కుల పట్టింపులు మోతాదుకు మించి ఉన్నాయి. కూతురు మమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడమన్నది ఏ మాత్రం నచ్చని విషయం ఆమెకి. దానికితోడు చెల్లి వెంకటరత్నం పట్ల కంటే ఎక్కువ ప్రేమతో, వాత్సల్యంతో అక్కయ్య నన్ను చూస్తుండడం సహించరానిదిగా ఉండేది ఆ తల్లికి’’. (వెలుగుదారులలో, పుట`20)
ఒకే కుటుంబంలో ఉన్న తల్లీ కూతుళ్ళ మధ్య సమాజంపై, మనుషులపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు రచయిత్రి మాటల్లో తెలుస్తుంది. సామాజిక కట్టుబాట్లను దాటి ఉత్తమమైన స్నేహ సంబంధాలను కొనసాగించినవారు కొంతమంది అయితే, మరికొంతమంది సంప్రదాయాల పేరుతో, కట్టుబాట్ల నెపంతో మనుషులను దూరంగా ఉంచినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒకే సమాజంలో ఒకే కుటుంబంలో భిన్నమైన ఆలోచనలు ఉండడం అనేది అన్ని కాలాల్లోనూ సహజంగా కనిపిస్తున్నటువంటి విషయం.
అలాగే మరొక అంశం, సినిమా రంగం విషయానికి వస్తే ప్రారంభం నుంచి కొన్ని సామాజిక వర్గాల వారు ఆధిపత్యం చెలాయించినట్లు తెలుస్తోంది. కానీ వ్యక్తికి ప్రతిభ అనేది ఉంటే సామాజిక అంతరాలు, కట్టుబాట్లు అనేవి ఏ రకంగానూ అడ్డురావు అని నిరూపించిన వారు నంబూరి పరిపూర్ణగారు. బాల్యంలోనే వారు సినిమాలలో నటించినట్లు రచనలో కనిపిస్తుంది. అంతేకాకుండా, పాఠశాలలోనూ వారికున్న ప్రతిభ కారణంగా తక్కిన విద్యార్థుల కంటే వారు ముందు ఉన్నట్లు ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నట్లు రచనలో పేర్కొన్నారు. ‘‘మద్రాసులో చదువుతో పాటు 1943`44 ప్రాంతంలో కొన్ని సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే మంచి అవకాశాలు లభించాయి. చిన్నతనం నుంచీ బాగా పాడే నా కంఠానికి సినిమా అనుభవం మెరుగులు దిద్ది, క్రమబద్ధం చేసింది. మా టీచర్లు కూడా మా స్కూలు అసెంబ్లీ సమయంలో నాచేత తరచుగా ప్రార్థనాగీతాలు పాడిరచుతుండేవారు. అంతేగాక శారదా విద్యాలయం ప్రత్యేకత ఒకటుంది. రెండ్రోజుల వారాంతపు సెలవు దినాల్లో ప్రతి శనివారం నాడూ అన్ని తరగతుల విద్యార్థినుల చేత రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింపజేసేవారు. మా క్లాసు తెలుగు పండిట్‌ శ్రీ శేషాచార్యుల వారికి నా పట్ల మంచి అభిమానమూ, గురీ ఉండేవి. నాచేత జాతీయ గీతాలు పాడిరచడమే గాక కొన్ని పౌరాణిక నాటిక విభాగాల్లోనూ, ఆయన వ్రాసిన లఘు హాస్య నాటికల్లోనూ నా చేత ప్రధాన పాత్రలు నటింపజేసేవారు. ఫలితంగా స్కూల్లో నా పాపులారిటీ బాగా పెరిగింది. మా క్లాసుకు చెందిన ఇతర తమిళ సెక్షన్లలోనూ, హైస్కూలు పై స్థాయి తరగతుల్లోనూ నన్ను అభిమానించేవారు ఎక్కువగా ఉండేవారు’’. (వెలుగుదారులలో, పుట`39)
సంస్కరణ ఉద్యమం కొనసాగుతున్న రోజులు కావడం వలన ఎంతోమంది మహానుభావులు సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపే క్రమంలో వారి వంతుగా అందరినీ సమానంగా చూసే అటువంటి పరిస్థితులను కల్పించినట్లు రచనలో రచయిత్రి పేర్కొన్నారు. వర్గానికి, కులానికి అతీతంగా సమాన అవకాశాలు కల్పించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమం వారి రచన ద్వారా తెలుస్తుంది. ‘‘పి.ఆర్‌ సైన్స్‌ డిగ్రీ కాలేజి ఆవరణలోనే పి.ఆర్‌.హైస్కూలు నడుస్తుండేది. హైస్కూలు, కాలేజీల్లో చదువుతున్న అనాథ నిరుపేద బాలబాలికలకు చాలా కాలంగా ఒక అనాథ శరణాలయాన్ని నెలకొల్పి నడుపుతున్నారు. ‘రాజావారు’ శరణాలయం తాలూకా భవనాలు పిఠాపురం రోడ్డులో, రంగరాయ మెడికల్‌ కాలేజి ఎదురుగా ఇప్పటికీ కనబడుతుంటాయి. అనాథ, నిరుపేద, బడుగు వర్గాల పిల్లలందరికీ శరణాలయంలో ప్రవేశముండేది. కుల, మత, ప్రాంతాల ప్రస్తావనన్నది అసలేమాత్రం ఉండకపోవడంతో పిల్లల మనుగడ ఎలాంటి విభేద వివక్షతలకు తావులేని క్రమంలో కొనసాగుతూ ఉండేది. ఈ పిల్లలకు ‘‘ఏకేశ్వరోపాసన’ తప్ప అన్ని కులమతాల గురించి తెలియదు. ఏ ఒక్కరికీ తమ కులమేదో, మతమేదో బొత్తిగా తెలియదు. మానవుల్లో తామూ ఒకరని మాత్రమే తెలుసు. అందరికీ మంచి తిండి, సరిపడినన్ని దుస్తులు, పుస్తకాలు, లోటెరగని జీవితం! పి.ఆర్‌.హైస్కూలు, కాలేజీలు రెండిరటిలో చదువులు కొనసాగిస్తుండేవారు ఆ పిల్లలు’’. (వెలుగుదారులలో, పుట`67)
మరొక సందర్భంలో పిఠాపురం రాజా వారి ప్రస్తావనలో వారి ఔన్నత్యాన్ని పేర్కొన్నారు. రాజావారు సామాజిక కట్టుబాట్లను దూరంగా ఉంచి అందరినీ సమానంగా చూసినట్లు, విద్యార్థులకు ఉత్తమమైన విద్యా బోదనను, సంస్కారాన్ని నేర్పినట్లు కనిపిస్తుంది.
నాయకులు`భావజాలం`ద్వంద్వ విధానాలు:
భారతదేశంలో ఉన్న సామాజిక రుగ్మతల కారణంగా అనేక ఉద్యమాలు, నూతన సిద్ధాంతాలు వెలువడ్డాయి. సామాజిక రుగ్మత ఉన్న ప్రతి సందర్భంలోనూ వాటిని రూపుమాపడానికి ఏదో ఒక రూపంలో నూతన సిద్ధాంతం నాయకులు ఉద్భవించారు. దురదృష్టవశాత్తు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి పుట్టుకొచ్చిన నాయకులు అంతకుముందున్న పాత ధోరణిలో కొనసాగడం అనేటువంటిది ఇందులో కనిపిస్తున్నటువంటి ప్రధాన లోపం. ఆ కారణంగా అత్యుత్తమ సిద్ధాంతాలు ప్రజల దగ్గరకు చేరడంలో విఫలమయ్యాయి. ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందినది వామపక్ష భావజాలం. సనాతన ధర్మం పేరుతో కొనసాగుతున్న కొన్ని రుగ్మతలను రూపుమాపడానికి, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఎంతో మందికి ఆయుధమైనటువంటిది వామపక్ష భావజాలం. భారతదేశంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థను ప్రశ్నించి అందరినీ సమానంగా చూసే వెసులుబాటు వామపక్ష భావజాలంలో ఉంది. ముఖ్యంగా వ్యవస్థలో అణచివేతకు గురైన స్త్రీలకు వామపక్ష భావజాలం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపించింది. భావజాలం ఉన్నతమైనప్పటికీ ఇక్కడ ఉన్న నాయకులకు స్థానికంగా ఉన్న పెత్తనపు బుద్ధి అలాగే కొనసాగింది. భూస్వామ్య విధానానికి, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమని చెబుతూనే అదే పద్ధతిని కొనసాగించినటువంటి వారు కొంతమంది వామపక్ష భావజాల నాయకులు. వారు అనుసరించిన ద్వంద్వ విధానాల వలన వారి పార్టీ క్రమంగా కనుమరుగవడం కనిపిస్తుంది.
రచయిత్రి తన ఆత్మకథను ‘‘వెలుగుదారులలో…’’ అనే శీర్షిక పేరుతో రాసినప్పటికీ తన జీవిత భాగస్వామి వలన చీకటి రోజులు చూసినట్లు రచన ద్వారా అర్థమవుతుంది. వామపక్ష భావజాలానికి చెందిన ఒక ప్రముఖ నేత జీవిత భాగస్వామిగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్న ద్వంద్వ విధానాల వలన తనతో పాటు తన సంతానం కూడా ఇబ్బంది పడినట్లు రచయిత్రి పేర్కొన్నారు. ఈ సమాచారం ఆనాటి నాయకుల్లో ఉన్న ఆలోచనా విధానానికి, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ‘‘దాసరి మంచి దృఢ సంకల్పమున్న స్టాంచి కమ్యూనిస్టు. అణచివేత, అన్యాయం ఎక్కడ కనిపించినా సహించడు. తమ స్వంత ఇంటి పాలేళ్ళ చేతనే తన తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయించాడు. ఇటీవలి గుంటూరు ఏ.సి. కాలేజి విద్యార్థుల యాభై రోజుల సమ్మెకు నాయకత్వం వహించి నడిపాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే…’’ (వెలుగుదారులలో, పుట`71)
రచయిత్రి రచనలో ప్రారంభంలో దాసరి నాగభూషణం గారి గురించి ఎంతో ఉన్నతంగా పేర్కొన్నారు. కానీ కొంత భాగం తర్వాత వారి నిజస్వరూపాన్ని తెలియజేసినప్పుడు పాఠకునికి కొంత ఆశ్చర్యం కలుగుతుంది. దాసరి నాగభూషణరావు గారి ప్రతిపాదనతో వర్ణాంతర వివాహం చేసుకున్న నంబూరి పరిపూర్ణ గారు తర్వాత కాలంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు వారి రచన ద్వారా తెలుస్తుంది. వారితో వివాహం వలన, కమ్యూనిస్టు పార్టీలో పని చేయడం వలన రచయిత్రి పలుమార్లు పోలీసు వారితో సమస్యలు ఎదుర్కొన్నారు. తరువాత ఆర్థికంగా, మానసికంగా పలు సమస్యలను ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో పరిపూర్ణ గారికి తన పిల్లల ఆకలిని తీర్చలేని పరిస్థితి కలిగింది. చివరకు తను జన్మనిచ్చిన బిడ్డకు దెబ్బ తగిలితే పలకరించని వ్యక్తిగా తండ్రి ఉండడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ‘‘నాకప్పుడు ఏమనిపించిందంటే మేము తన సాటి కులం వాళ్ళమయి ఉంటే బిడ్డ మీద ప్రేమ కనబరచి, ముద్దు చేసి ఉండేవాడేమోనని. నన్ను కోరి చేసుకుంటేనేం? తనలో పసితనం నుంచీ జీర్ణించిన కులాధిక్యత, ఇటు నా హీన కుల దీనస్థితి నాకు పుట్టిన బిడ్డల్ని చులకనగా, నిర్లక్ష్యంగా చూచేట్టు చేస్తున్నాయేమో అని అనుకుంటుండేదాన్ని’’. (వెలుగుదారులలో, పుట`90)
అయితే అందుకు భిన్నంగా వారి కుటుంబ సభ్యులు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ‘‘దాసరిగారి ఇద్దరు చెల్లెళ్ళు పద్మినీదేవి, అన్నపూర్ణమ్మ, వదినలు తన పాపకూ, తనకూ బట్టలూ, పిండివంటలూ తెచ్చి ఇస్తుండేవారని, ప్రత్యేకించి ఇద్దరాడబిడ్డలూ తననూ, తన పాపనూ బాగా అభిమానంగా పట్టించుకుంటుండిన విషయం ఒక మరువలేని తీపి జ్ఞాపకమనీ, పల్లెటూళ్ళలోని తీవ్ర కుల ఆంక్షలు, కుల బహిష్కరణలు ఉన్న స్థితిలో ఆ మాత్రపు కారుణ్యతనూ, మానవతనూ తన పట్ల చూపుతున్నందుకు అత్తవారి పట్ల మనసు కృతజ్ఞతతో నిండిపోతుండేదని’’ రచయిత్రి పేర్కొన్నారు.
‘‘మా కామ్రేడ్‌ బాగా మితభాషి. ఇంట్లో ఉన్నప్పుడూ, ఇంటి సంబంధ విషయాల్లోనూ ఈ రీతి మరికొంత అధికంగా ఉండేది. వారాల పర్యటనల తర్వాత ఇంటికి చేరినా అనునయ పలకరింపులు శూన్యం! అయితే ఇంటికైనా, ఆఫీసుకైనా వస్తుండేవారితో సంభాషణలు ధారాళంగా సాగుతుండేవి. భార్యకూ, బిడ్డలకూ చనువు బొత్తిగా ఇవ్వని ఈయనగారి ఈ రీతి అతని భూస్వామ్య లక్షణంగా అనిపించేది నాకు. ఆ ఇళ్ళల్లో స్త్రీలకు తగు స్థానం ఉండదు, గౌరవం ఉండదు. మగాళ్ళకు వీలైనంత దూరంలో ఉంచడం రివాజే. అయితే అన్నింటా సమానత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టు నేతకు అవే రీతులు, అవే నీతులా?’’ (వెలుగుదారులలో)
వామపక్ష భావజాలం పేరుతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి నేతలు చివరికి పితృస్వామ్య వ్యవస్థకు ప్రతినిధులుగా మారడం, భూస్వామ్య వ్యవస్థను కొనసాగించడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది.
‘‘క్రమక్రమంగా బ్రతుకు ఏ రోజుకారోజు గడవడం గగనంగా ఉండసాగింది. పిల్లలకు దొరుకుతున్నది అరకొర తిండి. విడవా మడవా రెండు జతల బట్టలు. అవైనా బాగా పాతబడ్డవి. అరుదుగానే అయినప్పటికీ ఆర్థిక సమస్యలు మా ఇద్దరి మధ్య కలహాలు రేపుతుండేవి. ఒక సందర్భంలో తను నా మూలంగా పోగొట్టుకున్న వేల కట్నాల ప్రస్తావన ఆయన నోటి వెంట వచ్చింది. తన పెండ్లి మరో విధంగా అయి ఉంటే కనీసం యాభైవేలు కట్నంగా వచ్చి ఉండేదనీ, తన విలువను నేను గుర్తించడం లేదనీ అంగలార్చడం మొదలుపెట్టాడు. మరికొన్ని కఠినమైన, అవమానకరమైన మాటలతో నన్ను విపరీతంగా గాయపరిచిన దినమది. కామ్రేడ్‌ దాసరి ఆంతర్యం వెలుగు జూచిన దినమది’’. (వెలుగుదారులలో పుట`90,91)
ముఖ్యంగా భూస్వామ్య పద్ధతిలో ఒకరికి మించి స్త్రీలతో జీవనాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా నాగభూషణరావు గారు మరొక స్త్రీని వివాహం చేసుకున్నట్లు రచయిత్రి పేర్కొన్నారు. అందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా తమ వంతు మౌనాన్ని పాటించి, మద్దతు తెలిపినట్లు రచనలో కనిపిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్త్రీల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ఇందులో గమనించాల్సిన అంశం. నాగభూషణరావు గారు ఒకానొక సందర్భంలో పరిపూర్ణ గారి తల్లిగారిని కొట్టడానికి కూడా వెనుకాడనట్లు రచయిత్రి పేర్కొన్నారు. అది ఎంతో అవమానకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఆ వాక్యం రాసే సందర్భంలో రచయిత్రి కంఠస్వరం భిన్నంగా కనిపిస్తుంది. ఆ ఒక్క వాక్యం ద్వారా రచయిత్రి పడ్డ మానసిక వేదన అవగతం అవుతుంది. అంతకు మించిన వ్యవహారంగా మరొక అంశాన్ని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్‌ ఆర్డర్స్‌ పత్రాలను ఆగ్రహంతో చించి ముక్కలుగా చేశారని రచయిత్రి తెలిపారు. ఒక స్త్రీ ఎదుగుదలకు ఒక కమ్యూనిస్టు నాయకుడు అడ్డుపడడం అనేటటువంటిది ఊహించడానికి అవకాశం లేని అంశం. కానీ అదే నాగభూషణరావు గారు తర్వాత కాలంలో పరిపూర్ణ గారు ఉద్యోగం చేసి సంపాదిస్తున్న జీతంలో నాలుగవ వంతు ప్రతినెలా డిమాండ్‌ చేసి తీసుకున్నట్లు కనిపిస్తుంది. డబ్బు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి రావడం మానేశారని పరిపూర్ణ గారు రచనలో తెలిపారు. ‘‘ఇంక ఇప్పుడు దాసరిగారే స్వయంగా అలనాటి అత్తగారి గ్రామం ‘రేమెల్ల’కు కదలివెళ్ళి తమ పూర్వ సతీమణిని ఏలుకునేందుకు సంసిద్ధతని తెలియపరచగా ఇంకేముంది… ఆమె, తల్లిదండ్రులు, అన్నలు ఆకాశం చేతికందినంత సంబరపడడం సహజమూ, న్యాయమే గదా! అమితానందపడుతూ, భర్తకు ఇన్నాళ్ళూ దూరమై ఉన్న కూతురి పేర వ్రాసి పెట్టిన ఆరు ఎకరాల మాగాణినీ, దాని తాలూకు పంట డబ్బులు నలభై వేల బ్యాంకు అకౌంటునీ ఈయన పేరబెట్టేందుకు సిద్ధపడి హడావిడిగా అత్యంత వైభవంగా పునస్సంథాన వేడుకను పురోహితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రబద్ధంగా జరిపించారు. అంతే శాస్త్రబద్ధంగా, సంప్రదాయ రీతిలో దాసరి గారి స్వగృహంలో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో, పురోహితుల మంత్రోచ్ఛారణలతో బంధుజనాలకు బంతి భోజనాలూ అత్యంత వైభవం’’. (వెలుగుదారులలో, పుట`112)
అలాగే తన కుమార్తె శిరీష విషయంలో తన భర్త నాగభూషణరావు అనుసరించిన ఒక సంఘటన గురించి పేర్కొన్నారు రచయిత్రి. తన కుమార్తె శిరీష వివాహానికి భర్తను ఆహ్వానించారని, వారు రాకపోగా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలిపారు. ‘‘అమరేంద్ర, నా తమ్ముడు దాసరిగారికి తెలియపరిచి, వేడుకకి రావలసిందిగా కోరారు. వీరి అభ్యర్థనని ‘దాసరి’ గారు నిష్కర్షగా తిరస్కరించారు. వధువు శిరీష తల్లిదండ్రులుగా నాగభూషణరావు, పరిపూర్ణల పేర్లు శుభలేఖలో ముద్రించి
ఉండడం చూసి భగ్గుమన్నారు. ఎవరి అనుమతితో తన పేరును శుభలేఖలో ముద్రించారంటూ తీవ్రంగా కోప్పడ్డారు. పెళ్ళితో తనకెలాంటి సంబంధం లేదని, తను రానని ఖరాఖండిగా చెప్పడంతో భంగపడి తిరిగొచ్చేశారు అమరేంద్ర, జనార్ధనా. వయస్సులో, చదువుల్లో బాగా ఎదిగిన ముగ్గురు బిడ్డల్లో మొదటి బిడ్డ శిరీష పెళ్ళి! తండ్రేమో గైర్హాజరు. పైకి అగుపడని వివక్ష, బాధ్యతారాహిత్యాలే అసలు కారణాలనిపించాయి నాకు. దేశ నాయకులు, విప్లవ నేతలు కొందరి స్వభావాల్లో బాధ్యతారాహిత్యం అనేది ఒక పార్శ్వమేమో!’’ (వెలుగుదారులలో, పుట`162)
ఈ సంఘటన వ్యక్తిలో ఉన్న ద్వంద్వ విధానాలకు ఒక మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అదేవిధంగా పార్టీకి చెందిన వారు కూడా పరిపూర్ణ గారి గురించి గానీ, వారి సంతానం గురించి గానీ ఏ రకమైన శ్రద్ధ చూపినట్లు కనిపించదు.
తల్లిదండ్రుల ఉత్తమ జీవన విధానం వలన మంచి కుటుంబం ఏర్పడుతుంది. మంచి కుటుంబ విధానం వలన మంచి సమాజం తయారవుతుంది. మంచి సమాజం వలన వ్యవస్థ ఉన్నతంగా ఉంటుంది. కానీ, అందుకు భిన్నమైన ధోరణి నాయకుడైన దాసరి నాగభూషణరావులో ఉన్నట్లు రచన ద్వారా కనిపిస్తుంది. ఒక భర్తగా, తండ్రిగా పూర్తిగా విఫలమైన వారుగా ఆయన కనిపిస్తారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన నేత కట్న కానుకలను ఆశించడం, తన బిడ్డలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ఉండడం అనేవి ఆశ్చర్యకరమైన విషయాలు. ఒక ఉన్నతమైన భావజాలం ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి అందుకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది గమనించాల్సిన విషయం. అయితే, అందుకు భిన్నంగా ఒక స్త్రీ ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైన తల్లిగా ఎన్నో అవాంతరాలను దాటుకొని, తన ముగ్గురు బిడ్డలను జీవితంలో ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దడం అనేది గొప్ప విషయం. ఆలోచనలతో పాటు ఆచరణ కూడా ఉత్తమ జీవన విధానానికి చాలా అవసరం. ముగ్గురు సంతానం సామాజికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండడం, మంచి సాహితీవేత్తలుగా, వ్యక్తులుగా ఉండడమనేది గమనించాల్సిన విషయం.
ముగింపు:
భావజాలం కంటే కూడా వ్యక్తిత్వం ముఖ్యమైన అంశమని, ముఖ్యంగా స్త్రీలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరమని ‘‘వెలుగుదారులలో…’’ రచన ద్వారా తెలుస్తుంది. స్త్రీ ఆర్థికంగా నిలబడినప్పుడు కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలదు. స్త్రీలు ఆర్థికంగా ముందు ఉన్నప్పుడు పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నించగలిగే శక్తి ఏర్పడుతుంది. స్త్రీ తను మాత్రమే కాకుండా తన కుటుంబానికీ, వ్యవస్థకు కూడా తోడ్పాటును అందించగలదు అని ‘‘వెలుగుదారులలో’’ రచన తెలియజేస్తుంది. నంబూరి పరిపూర్ణ గారు ఉద్యోగంలో చేరకుండా ఆర్థికంగా భర్త పైన ఆధారపడి ఉంటే వారి జీవితం మరోలా ఉండేదేమో! విద్య వలన తన నిర్ణయాలను తాను తీసుకోవడం, ఆర్ధికంగా ఇతరులపైన ఆధారపడకపోవడం వలన సమాజంలో తాను ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు పొందడమే కాకుండా తన సంతానం విద్యా, ఉద్యోగాలలో ఉన్నత స్థానంలో ఉండేలా చేశారు. తన సంతానాన్ని మానవత్వం కలిగిన మనుషులుగా తయారు చేయడమే కాకుండా సేవా భావంతో పదిమందికీ సహాయపడే గుణాన్ని నేర్పారు. అటువంటి సేవాభావంతో వెలువడినటువంటిదే ‘ఆలంబన’ అనే సంస్థ. సాహిత్య కార్యక్రమాలలోనూ వారి వంతు సహాయం చేశారు. కేవలం వామపక్ష భావజాలం అని పేర్కొనడం కంటే ఒక మంచి మనిషిగా ఉండడం, ఇతరులను మంచి మనుషులుగా తయారు చేయడం అనేది చాలా అవసరమని నంబూరి పరిపూర్ణ గారి ‘వెలుగుదారులలో’ రచన తెలియజేస్తుంది.

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.