మాలతీ చందూర్‌ నవలా మంజరి`4, స్త్రీ పాత్రల వైవిధ్యం – మమత వేపాడ

వ్యాస సంగ్రహం: మాలతీ చందూర్‌ అనే పేరు సాహితీ ప్రియులకు చాలా సుపరిచితమైనది. తెలుగు సాహిత్యానికి కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అది ఎలా అంటే ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం మాలతి చందూర్‌ రాసిన ‘ప్రమధావనం’ కాలమ్‌ 40 ఏళ్ళు నిరాటంకంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా అది ప్రపంచ చరిత్ర గురించి కావచ్చు,

లేదా సాధారణ గృహిణి జీవితంలో జరిగే సమస్యల గురించి అయినా కావచ్చు. ఆమె ప్రజలకు సూచించే పరిష్కారాలు మిగిలిన వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. స్వాతి వారపత్రికలో కూడా ‘నన్ను అడగండి’ అనే శీర్షికతో కాలమ్‌ ఉండేది. ఏ విషయాన్నయినా అవలీలగా చెప్పే ఆమె తెలివికి పాఠకులు ఆశ్చర్యపోతూ ఉత్తరాలు రాసేవారు. అసలు ఇంతటి ప్రజ్ఞ మీకు ఎలా అబ్బిందండీ! అనే ప్రశ్నకు నిరంతరాయంగా ప్రపంచ సాహిత్యాన్ని, సంఘటనలు తెలుసుకొంటూ రోజూ గంటల తరబడి చదవడం. చదివితే మీకూ అవుతుందండీ! అనే సమాధానం ఇచ్చేవారు. నవలా మంజరి పేరుతో 6 సంపుటాలను తీసుకువచ్చారు. దీనిలో ప్రపంచంలోని అన్ని భాషల్లో మంచి మంచి నవలలను, గ్రంథాలను, 300కి పైగా ఆంగ్ల నవలలను ఒక దగ్గరికి చేర్చారు. నేను తీసుకున్న పుస్తకం ‘నవలా మంజరి`4’. ఇందులో 30 నవలల గురించి సంక్షిప్తంగా రాసి మనకు అందించారు. ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రపంచంలో ఏ మూలన బ్రతుకుతున్నా స్త్రీకి ఒకటే వ్యథ, ఒకటే ఆక్రందన అని తెలుస్తోంది. దాని రూపం మారవచ్చు. కానీ గుండెల్లో మూట కట్టుకున్న భావాలకు, అన్యాయానికి గురయ్యే పరిస్థితులకు, ఏ ప్రాంతమైనా, ఏ భాషైనా ఒకటేనని ఈ నవలా మంజరి`4 సంపుటిలోని స్త్రీ పాత్రలు మనకు తెలియజేస్తాయి.
కీలక పదాలు: వ్యధ, మాక్జిమ్‌, మాండర్లీ, ఫేర్వెల్‌, మిసెస్‌ డాన్‌ వర్స్‌, విభ్రాంతి, జంద్యాలు, బంగారు చామంతి పువ్వు, వెర్రిబాగులతనం, కిరసనాయిల్‌లో ముంచిన పిడకలు మొదలైనవి.
ఉపోద్ఘాతం: జీవిత విశేషాలు: మాలతీ చందూర్‌ కృష్ణా జిల్లాలోని నూజివీడులో 26 డిసెంబరు 1928లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సంతానం. అందరికంటే ఈమె చిన్నది. 8వ తరగతి వరకు ఎస్‌.ఆర్‌.ఆర్‌. పాఠశాలలో చదివి, తర్వాత ఏలూరు వెళ్ళారు. అక్కడ వారి మామయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా స్కూల్‌లో ఇంగ్లీష్‌ మీడియంలో చేరారు. ఏలూరులో వారు ఉన్న ఇంటికి దగ్గరగా ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, కావలి లక్ష్మీనరసింహ వంటి వారు వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూడటం తటస్థించింది.
1947లో చందూర్‌ గారిని వివాహం చేసుకున్నారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఎస్‌ఎల్‌సి చదువును పూర్తి చే
శారు. 1948లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. ‘వంటలు పిండివంటలు’ అనే పుస్తకం గురించి తెలియలని ఆనాటి తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదట. కొత్తగాపెళ్ళయిన వారి చేతికి ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చేవారంటేనే మనం ఆలోచించవచ్చు. ఈమె రచయిత్రిగా, కాలమిస్టుగా అందరికీ అర్థమయ్యేలా సులభమైన శైలిలో రచనలు చేయడం విశేషం. ఈ శైలే ఎక్కువ పాఠకులకు చేరువయ్యేలా చేసింది.
సాహిత్య సేవ: తెలుగు ప్రముఖ రచయిత్రులలో మాలతీ చందూర్‌ది కూడా ముందంజలో ఉండే పేరే. ఈమె తెలుగు సాహితీ లోకానికే కాకుండా అతి సామాన్య కుటుంబాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారి వారి జీవితాలకు సహాయపడ్డారనేది వాస్తవం. తెలుగులో కాంచన మృగం, వైశాఖి, మనసులోని మనసు, ఆలోచించు, ఏమిటీ జీవితాలు, భూమిపుత్రి, ఓ మనిషి కథ మొదలైన 25కు పైగా నవలలను రచించారు. చంపకం`చదపురుగులు వంటి కథల సంపుటి, జాబులు`జవాబులు, ప్రశ్నలు`జవాబులు వంటి కాలమ్స్‌, అందాలు`అలంకారాలు, మహిళలకు మధుర జీవనం, పాత కెరటాలు వంటి రచనలు చేశారు. చాలా తక్కువ చదువుకొని అత్యంత ప్రతిభను కనబరిచే స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. ఆమె సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. ‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ అన్నట్లు ‘ప్రతిభకు కాదేదీ అవరోధం’ అనే మాటలు మాలతీ చందూర్‌ గారిని చూస్తే నూటికి నూరుపాళ్ళు నిజమేనని అనిపిస్తుంది. ఈ సంపుటి చూడటానికి వామనుడిలా కనిపిస్తున్నది. కానీ, చెప్పదల్చుకున్న విషయాన్ని చాలా సూటిగా కొన్ని పేజీల్లో చెప్పిన విధం మనం ప్రత్యక్షంగానే ఆ నవలను, లేదా జీవిత చరిత్రను చదువుతున్నట్లే ఉంటుంది. దీనిలోని సారం మాత్రం ‘ఇంతింతై వటుడిరతై’ అన్నట్లుగానే ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు.
స్త్రీ పాత్రలు: రెబెకా: ఈ నవలను రాసింది డాఫ్నడి మారియర్‌. దీన్ని సినిమాగా కూడా తీశారు. 80 సార్లు అచ్చయి, ఇప్పటికీ ముద్రించబడుతూనే ఉంది. ‘‘చనిపోయిన ఒకానొక స్త్రీ గురించి చెప్పే 400 పేజీల కథనీ ఒక్కబిగిన పుస్తకం కింద పెట్టనీయకుండా చదివింప చేస్తుంది. మాక్జిమ్‌ డి వింటర్నీ, అతని భార్యనీ, మాండర్లీ భవనపు మూల మూలల్నీ, తోటల్నీ వెంటాడినట్లే రెబెకా పాఠకులకు కూడా మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా వెంటాడుతుంది. పుస్తకం మొదటిపేజీ తెరిచాక చివరిదాకా చదివితే కానీ రెబెకా మనల్ని వదలదు. ఇటువంటి విచిత్రమైన అద్భుతమైన పాత్రను సృజించింది డిమారియర్‌’’ అంటారు మాలతీ చందూర్‌ (పుట`6). ఈ నవలా మంజరుల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రపంచ సాహిత్యాన్ని కొంచెమయినా రుచి చూపిస్తే దాని పూర్తి రసాస్వాదన కోసం అయినా ఆయా పుస్తకాలను లేదా నవలలను చదివి తెలుసుకుంటారని రచయిత ఉద్దేశ్యం. అందుకే ‘నేను కేవలం ఈ నవలను పరిచయం చేస్తున్నాను. మీరు 400 పేజీల పుస్తకాన్ని కొని చదివితేనే గాని మీరు స్వయంగా ఆ ఆనందాన్ని పొందలేరు’ అంటారు మాలతీ చందూర్‌.
ఈ కథ అంతా ఫస్ట్‌ పర్సన్‌లో నడుస్తుంది. రెబెకా స్థానంలో వచ్చిన మాండర్లీ అధికారిణి మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు తన జీవితాన్ని, మాండర్లీ భవన జీవితాన్ని, అన్నిటినీ మించి రెబెకా గురించి తాను విన్నవి, చూసినవి చెప్పుకుంటూ వెళ్తుంది. ఎక్కడా రెబెకా కనపడదు. కానీ ప్రతి పేజీలోను రెబెకా పలకరిస్తుంది. అసలు రెబెకా ఎవరు? ఎవరి గురించి మాండర్లీ కోటలోని వారంతా అంత గొప్పగా చెబుతున్నారు. ‘‘చివరి పేజీల్లో గర్వంగా, ఠీవిగా ఎవరినీ లెక్కచేయని మహా సౌందర్యవతి నిజస్వరూపం బయటపడుతుంది’’ (పుట.6) అని రచయిత అంటారు.
రచయిత్రి ముందుగానే కథను సూచన ప్రాయంగానే చెబుతూ ‘‘పుస్తకం అంతా చదివాక, ఏదో వెన్నులోంచి చలి వచ్చినట్లు అనిపిస్తుంది. అది భయమా, అసహ్యమో చెప్పలేం. సన్నగా, పొడుగ్గా, నల్లగా కదలిక లేని విగ్రహం మాదిరి
ఉన్న మిసెస్‌ డాన్‌ వర్స్‌, ఘాటుగా తాగి అసభ్యంగా మాట్లాడుతూ, వెర్రిగా ప్రవర్తించే ఫేవెల్‌, మాండర్లీ భవంతిలో నిశ్శబ్దంగా పాడుపెట్టినట్లుండే తూర్పువైపు భాగం, సర్వవేళలా స్త్రీ విలాపం మాదిరి రొదచేసే సముద్రపు హోరు, ఆ సముద్రపు గట్టున ఉన్న బోట్‌హౌస్‌… వీటన్నిటి మధ్యగా ఉండే రెబెకా నీడ, ఇవేవీ పట్టనట్లు వీటితో సంబంధం లేనట్లు ఆలోచన భారాలతో తిరిగే మాండర్లీ యజమాని మాక్జిమ్‌ డవింటర్సూ, వీళ్ళందరి మధ్యా నిస్సహాయంగా ఈ జమీందారీ ఇళ్ళతో పరిచయం కూడా లేక ఏదో అకస్మాత్తుగా ఈ పరిసరాలకు వచ్చి పడిన మాక్జిమ్‌ భార్య… ఇవన్నీ పాఠకులను ఆశ్చర్యపరచడమే కాక కాస్త భయపెడతాయి కూడా’’ అంటూ ముందే మాలతీ చందూర్‌ హెచ్చరిక చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇక కథలోకి వెళ్తే ‘‘ఆ మధ్యనే అప్పటికి రెండు మూడు నెలల క్రితం ఆయన భార్య రెబెకా సముద్రంలో పడి చనిపోయింది. ఆమె మరణంతో అతనికి లోకమే శూన్యం అయిపోయింది. మంచి తెలివి, తెలివికి తగిన అందం, అన్నింటికీ మించిన స్నేహ స్వభావం, దయార్ద్ర హృదయం అన్నీ కలిగిన రెబెకా చనిపోవడంతో జమీందారు పిచ్చివాని మాదిరి ఊరూరా తిరుగుతున్నాడు’’ అని మిసెస్‌ వాన్‌ హోపర్స్‌ పక్కన ఉన్న పనమ్మాయితో అంటుంది. పనమ్మాయితో పరిచయం పెంచుకొని, పెళ్ళి చేసుకుని తన భవంతికి తీసుకువెళ్తాడు మాక్జిమ్‌. అక్కడ ఎవరూ, కొత్తగా వచ్చిన యజమానురాలిని లెక్కచేయరు. అందులోనూ మిసెస్‌ డాన్‌ వర్స్‌ రెబెకా పుట్టింటి నుంచి వచ్చిన పనిమనిషి. ఆమె ఈమెని చాలా దారుణంగా చూస్తూ ఉంటుంది. రెబెకా చనిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా ఆ వంటల నుంచి, ఫ్లవర్‌వాజ్‌లు, కర్టెన్లు కూడా రెబెకాకి ఎలా నచ్చేదో అలాగే సర్దుతూ, వండుతూ ఉంటారు. తనకు తన పాత యజమాని మాటలు బాగా గుర్తొస్తాయి. ‘తన భార్య రెబెకాని మర్చిపోవడం కోసం నిన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు తప్పితే అసలు అందం, స్థాయి లేని నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకుంటాడు’ అంటుంది ఆమె. కొన్ని రోజుల తర్వాత ఒక పోలీస్‌ అధికారి పడవలో ఒక స్త్రీ శవం దొరికిందని, అది రెబెకాదే అని భవంతిలోకి వస్తాడు. ఎన్నోసార్లు రెబెకా గురించి అడుగుదామని ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ జమీందారు మాట్లాడడు. ఆ పంచనామా అంతా అయిన తర్వాత ఊరి పెద్దలు అది రెబెకా శవం కాదని తీర్పిస్తారు. ఈ హడావిడిలో తన భార్య దగ్గరికి వచ్చి అసలు కథను ప్రారంభిస్తాడు మాక్జిమ్‌. ‘‘నేను రెబెకాని చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను. తాను మా మొదటి రాత్రి నాడే తనకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారని, తనకు వాళ్ళందరితో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ఆ మాటతోనే నాకు అసహ్యం వేసింది. బయటకు అందరికీ భార్యాభర్తల్లా అన్యోన్యంగా బాగా కనిపించే వాళ్ళమే కానీ ఇంట్లో ఎవరి తోవ వారిదే. ఆమెను నేను ఏనాడూ ప్రేమించలేదు. ఆమె బయట ఊర్లలో తిరగడమే కాక నా ఎదురుగా కూడా ఈ ఊర్లోనే తిరగడం ప్రారంభించింది. తట్టుకోలేకపోయాను. ఒకరోజు రాత్రి కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. నేను ఆ సమయంలో ఆమె ముందుకు వెళ్ళాను. ఆమె లేచి ఈ జమీందారీ వంశానికి వారసుడు వస్తున్నాడని చెప్పింది. ఆ మాటలకు నాలో రక్తం మరిగిపోయింది. చేతిలో ఉన్న పిస్తోలుతో రెబెకాను కాల్చి చంపేశాను. అదేమిటో రెబెకా కళ్ళల్లో ఏదో గర్వాన్ని చూశాను. చనిపోతున్న బాధ లేదు. ఆ తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి పడవలో పెట్టి ఆ పడవకు తాళం వేసి సముద్రం మధ్యలో వదిలేశాను’’ అని కథను ముగిస్తాడు. ఇంకా పోలీసు అధికారి ఇన్వెస్టిగేషన్‌ చేస్తూనే ఉంటాడు. రెబెకా డైరీలో ఒక ఫోన్‌ నంబర్‌ దొరుకుతుంది. ఆ ఫోన్‌ నంబర్‌ పట్టుకొని వెతికితే అది ఒక డాక్టర్‌దని తెలుస్తుంది. ఆ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి రెబెకా గురించి అడుగుతారు. అప్పుడు అతను రెబెకాకు క్యాన్సర్‌ ఉందని, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేదని చెప్తాడు. పోలీసు అధికారి డాక్టర్ని ఆ కడుపు నొప్పితో బాధ భరించలేక ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అని అడుగుతాడు. నిస్సందేహంగా ఉంటుంది అని చెప్తాడు డాక్టర్‌. అంతటితో పోలీసు అధికారి ఏమీ చేయలేక అది ఆత్మహత్య అని నిర్ధారించి కేసుని క్లోజ్‌ చేస్తాడు. కానీ రెబెకా భర్త అయిన మాక్జిమ్‌కి, అతని రెండవ భార్యకి తప్ప ఆ విషయం ఇంకెవరికీ తెలియదు. మాండర్లీ భవంతిలోకి అడుగుపెట్టిన మాక్జిమ్‌కు, అతని భార్యకు ఆ పూల తోటలో, ఆ భవంతిలో రెబెకా సర్దిపెట్టిన ప్రతి అణువు నిస్సందేహంగా ఏదో చెప్తున్నట్లు నిర్జీవంగా కనిపిస్తాయి. మాక్జిమ్‌ ఆ రోజు రెబెకా కళ్ళల్లో ఆ గర్వాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ‘రెబెకా ఆఖరుకు మరణంలో కూడా భర్తకు నిజం చెప్పలేదు. చావులో కూడా అబద్ధమాడిరది’’ (పుట.16). ఎవరి దారి వారిదే అయిన దాంపత్యంలో ఇంతకంటే ఏమీ ఊహించలేం.
వివరణ: భార్యాభర్తల బంధం అంటే ఎవరికి నచ్చినట్లు వారు జీవించడం కాదుÑ ఒక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా, గౌరవంతో, బాధ్యతతో, ప్రేమతో ఉన్నప్పుడే ఆ బంధం నమ్మకంతో నిలబడుతుందని ఈ రెబెకా నవలలో పాత్ర మనకి తెలియజేస్తుంది. అది భారతీయ సంస్కృతి అయినా, పాశ్చాత్య సంస్కృతి అయినా ఆడది తిరిగితే మగాడు భరించలేడు. ఎందుకంటే తన భార్య వేరొకరి సొంతం ఎప్పటికీ కాకూడదని వారి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ఏ దేశంలోనైనా అది అంతే, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతుంది. స్త్రీకి లేదా పురుషుడికి ఎక్కువమందితో సంబంధాలు ఉంటే వారికి అనేక అనారోగ్యాలు వస్తాయని మన పూర్వీకులు ముందే గుర్తించి ఒకరికి, ఒకరే ఉండాలని నిర్ణయించారు. ఈ కట్టుబాట్లు, సంఘం, నాగరికత మొదట్లో ఏర్పడేటప్పుడు ఏవీలేవు. ఈ పరిస్థితులన్నిటినీ మనవారు ఆలోచించే మోనోగమీని ఏర్పాటు చేశారు.
కె.ఎన్‌.కేసరి గారి భార్య: ‘చిన్ననాటి ముచ్చట్లు’ రాసిన కేసరి గారు అందరికీ సుపరిచితమే. ‘‘మనవాళ్ళు`కాల్పనిక సాహిత్యం… అంటే ఫిక్షన్‌ మీద చూపించే ఆసక్తి జీవిత కథల మీద చూపరు. ఆత్మ కథలు అంటే స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలూనూ. కాల్పనిక సాహిత్యం కంటే ఉత్తేజకరంగా ఉండటమే కాదు, పాఠకులకు చారిత్రక, సామాజిక అవగాహన కల్పిస్తూనే వారిలో ఉన్నత ప్రమాణాలను, ఆదర్శాలను రేకెత్తిస్తాయి’’ అంటారు మాలతీ చందూర్‌.
ఈ చిన్ననాటి ముచ్చట్లు పూర్తిగా కాదు. 19, 20 శతాబ్దాల జీవిత అనుభవాలు, జ్ఞాపకాల పరిమళాలు వ్యాపించి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ చెబుతాయి మనకి. కేసరి గారు అత్యంత బీద కుటుంబంలో జన్మించారు. తండ్రి జంధ్యాలు వడుక్కునే బీద బ్రాహ్మణుడు. ఆయన చనిపోవడంతో బీదరాలైన తల్లి పసివాడైన కేసరికి భోజనం పెట్టలేని పరిస్థితి. కొంచెం వయసు రాగానే చెన్నైకి వెళ్ళి ఆయావారాలు చేసుకుంటూ చదువుకునేవాడు. తన జీవితంలో ఇంత స్థాయి రావడానికి కారణమైన ఆడవారికి ఏదైనా చేయాలని మనసులో సంకల్పించుకునే వారట. ‘‘ఒకసారి పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చి, ‘‘ఒక వైశ్యుని ఇంటికి వెళ్ళి మీరు నెలనెలా ఇచ్చే పావలా చందా నాలుగు నెలలది కలిపి ఒకే రూపాయిగా ఇవ్వండి’’ అని అతి వినయంగా అడగ్గా ఆ గృహస్థు మండిపడి, ఈడ్చి లెంపకాయ కొట్టగా, గూబ గుయ్‌మని ఆ పదమూడేళ్ళ పిల్లవాడు నేలమీద పడి స్పృహ కోల్పోయాడట’’ (నవలా మంజరి 4, పుట`21). పై వాక్యాలు చూసినప్పుడు ఎందరో మహానుభావులు, ఎన్నో కష్టాలకు ఓర్చి మనకి మార్గదర్శకులు అయ్యారు తప్పితే ఊరికే ఎవరూ మార్గదర్శకులు కారని మనకు తెలుస్తుంది. తర్వాత కేసరి ఉచిత ఆయుర్వేదశాలలో పనికి కుదిరి అక్కడ ఆయుర్వేదం నేర్చుకుంటాడు. తర్వాత కాలంలో సొంత బిజినెస్‌ కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అతడు బాగా ఉన్నతంగా అభివృద్ధి చెందడంతో తన మేనమామ కూతురునిచ్చి పెళ్ళి చేస్తాడు. ‘‘గుళ్ళో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి తర్వాత ఊరేగింపులో ఆ రోజుల్లో పెట్రోమాక్స్‌ లైట్లు లేవుగా… నూనె కాగడాకి బదులు, కిరసనాయిల్లో ముంచిన పిడకలు కర్రలకే కట్టి, ఆ దీపకాంతిలో పల్లకిలో ఊరేగిస్తారు. ఆ కిరసనాయిలు పొగ వాసనకి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఒడిలో భళ్ళున వాంతి చేసుకుంటుంది. అట్లా నా భార్యతో తొలి పరిచయం జరిగింది అంటూ తమాషాగా చెబుతారు కేసరిగారు’’. కె.ఎన్‌.కేసరి గారి జీవిత చరిత్ర చదివితే ఆనాటి సామాజిక పరిస్థితులు తెలుస్తాయి.
కేసరి గారి భార్య అమాయకత్వం ఏమిటో కింద వాక్యాలలో మనకు అర్థమవుతుంది. ‘‘ఎగ్మోర్‌లో భార్యతో కొత్త కాపురం పెడతారు. ఆమె పరమ చాదస్తురాలు. భూతప్రేతాల మీద అపార నమ్మకం గల మూఢురాలు. మెడనిండా నల్ల
తాళ్ళు, చేతులకు తాయెత్తులు, ఎప్పుడూ శాంతులు, పూజలు, వ్రతాలు. వాటన్నిటితో పాటు కాస్త అమాయకత, వెర్రిబాగులతనం. ఆవిడ జడలో పెట్టుకునే బంగారు చామంతి పువ్వుకు వెనుక గల చుట్టు విరిగిపోతే దాన్ని చింతపండుతో అతికించి, అతుక్కోవడానికి వీథి అరుగుమీద ఎండబెట్టి లోపల గడియ పెట్టకుని, ఇంట్లో పని చూసుకుంటూ ఉంటుంది. సూర్యకాంతిలో ధగధగా మెరుస్తున్న బంగారు పువ్వును దారిన పోయే దానయ్య అతి సునాయాసంగా తస్కరిస్తాడు. బంగారం అతకడానికి కంసాలి వాని వద్దకు వెళ్ళాలనే లోకజ్ఞానం లేని వెర్రిబాగుల్ది ఆ ఇల్లాలు’’ అని వాపోతారు రచయిత్రి. కేసరిగారి వైద్యశాల క్రమంగా పెరిగి మహావృక్షం అవుతుంది. వారి వైద్యశాలలో తయారయ్యే ‘లోద్ర’ యావత్‌ భారతదేశంలో స్త్రీల పాలిట సంతాన కల్పవల్లి అయింది. స్త్రీల వ్యాధులకు, ముఖ్యంగా నెలసరివల్ల వచ్చే కడుపునొప్పికి, సంతాన ప్రాప్తికి లోద్ర అమోఘమైన మందు అనే నమ్మకం స్త్రీలలో గట్టిగా పాతుకుపోయింది. స్త్రీల వల్ల తనకు సంపద చేకూరింది కాబట్టి వారికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే తపన వారిలో కలిగింది. అలా నెలకొల్పినదే ‘గృహలక్ష్మి’ పత్రిక. ఈ పత్రిక ద్వారా కాంచనపల్లి కనకమ్మ, కనుపపర్తి వరలక్ష్మమ్మ వంటి స్త్రీలు గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని పొందారు.
‘‘మొదటినుంచీ ఆయనకీ, ఆయన భార్యకీ ఆలోచనలో కానీ, జీవన విధానంలో గానీ పొంతన లేదు. దీనికి తోడు ఆమెకు అనారోగ్యం.’’ వీళ్ళ కాపురం సజావుగా లేకపోవడం వల్ల వీరికి సంతానం కూడా కలగలేదు. కొంతకాలానికి కేసరి గారి భార్య మరణించింది. ఆయన తమ ఆయుర్వేద వైద్యశాలకు మూలికల కోసం అప్పుడప్పుడూ కేరళ వెళ్ళివస్తుండేవారు. ఆ సమయంలోనే ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంతో పరిచయమై అనంతరం ఒక వకీలు కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఆమె పేరు మాధవి. చదువుకున్నది. ఆయుర్వేదంలో కూడా పరిచయం ఉంది. ‘‘ద్వితీయ వివాహం చేసుకున్నాక కేసరి గారి దశ బాగా తిరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు’’. కేసరి గారి ఆటుపోట్లను తెలుసుకోవాలంటే వారి జీవిత చరిత్ర తప్పకుండా చదవాల్సిందే.
వివరణ: పై వాక్యాలలో కేసరి గారి భార్యకు చదువు లేకపోవడం వల్ల చాదస్తం, అమాయకత్వం, భూతప్రేతాల పట్ల నమ్మకం ఉందని ఒకపక్క అనిపించినా, నేటి సమాజంలో చదువుకున్న యువతీ, యువకులు కూడా వాటన్నింటినీ నమ్ముతున్నారనడంలో సందేహం లేదు. బంగారు చామంతి పువ్వుకు చింతపండు అతికించి ఎండలో పెట్టడమే కాక, ఆరు బయట వదిలేసి ఆవిడ వేరే పనిలో మునిగిపోవడం అమాయకత్వానికి ప్రతీకగానే రచయితతో పాటు మనం కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పుడు అన్యోన్యత లోపించి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు.
ది క్లిప్ట్‌ ఎడ్జ్‌ ` మేరీ హాకెట్‌: మేరీ: సాధారణంగా మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైతేనే అతలాకుతలం అయిపోతూ
ఉంటాం. ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. కొంతమందైతే ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది ఆ ప్రయత్నం వరకు వెళ్ళి తిరిగి వస్తారు. కొంతమంది మనో నిబ్బరంతో బ్రతికేస్తారు. ‘ది క్లిప్ట్‌ ఎడ్జ్‌’ అంటే శిఖరాగ్రపు అంచు అని అర్థం. శిఖరపు అంచు మీద జీవితం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అటువంటి కత్తి మీద సాములాంటి జీవితాన్ని మేరీ పాత్ర ద్వారా మేరీ రాకెట్‌ అనే రచయిత మన ముందు ఉంచారు. ఆ కథ ఏమిటంటే, ముందుగా మనం చర్చిద్దాం. ‘‘మనకి ప్రేమాస్పదులైన వారికి, అందులోనూ జీవిత భాగస్వామికి పిచ్చి ఎక్కింది. మానసిక రుగ్మత ఉంది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన తన భర్తని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’’ అన్నప్పుడు ఆ స్త్రీ ఏమైపోతుంది? ఆమె మనసు ఎంత అల్లకల్లోలపడుతుంది? ఒక్కసారి ఊహించండి. ఊహు, ఊహించలేము. ఆ బాధ, ఆవేదన అనుభవించిన వారికి మాత్రం గాని అర్థం కాదు’’ అని మేరీ జీవితం గురించి మనకి ఈ వాక్యాల్లో అర్థమవుతుంది. గాయమైన వారికి మాత్రమే దాని లోతెంతో తెలుస్తుంది. ఆ గాయం లోతు ఎంత దిగితే దాని నొప్పి అంతే ఉంటుంది. దానిని పైనుంచి చూసేవారికి ఎప్పటికీ అర్థం కాదు. నొప్పిని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి కథే ఈ మేరీ కథ.
ఆ కథ ఏమిటంటే బోస్టన్‌ నగరంలో ‘లా’ కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్న మేరీకి అదే కాలేజీలో తనకి సీనియర్‌గా
ఉన్న పాల్‌తో పరిచయమవుతుంది. అప్పటికే వైమానిక దళంలో పనిచేసి యాక్సిడెంట్‌లో తలకి దెబ్బ తగలగా వైమానిక దళం నుండి డిశ్చార్జి అయి లా కాలేజీలో చేరతాడు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న పాల్‌ స్వతహాగా తెలివైనవాడు, చురుకైనవాడు, తెలివితేటలు కలవాడు. వీటన్నిటితో పాటు అతనికి మధ్య మధ్యలో విపరీతమైన కోపం వస్తుంది. ఇద్దరి కుటుంబాలు మధ్య తరగతికి చెందినవి. పాల్‌, మేరీల తల్లిదండ్రులు అనుమతితో ఇద్దరు పెళ్ళి చేసుకుంటారు. ఈ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు పుడతారు. ఆరేళ్ళ వైవాహిక జీవితంలో పాల్‌ ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం ఉండడు. లా పరీక్షలు రాయడు. కొన్నాళ్ళు బిజినెస్‌ చేస్తాడు. అందులో నష్టం వస్తుంది. బాగా లేదని బంధువులు, స్నేహితులకు దూరంగా ఉండాలని ఉద్యోగాలు చేసి మారిపోతుంటారు. పాల్‌కి భార్య పట్ల, పిల్లల పట్ల అనురాగం ఉన్నాయి. కానీ స్థిరజీవితం లేక లోకమంతా అన్యాయం చేస్తోందని ఆక్రోశంతో భర్త తరచూ అనడం, అతను రాత్రులు నిద్రపోకుండా కూర్చునే ఉండడం, తలనొప్పి, కోపం, చికాకుతో బాధపడటం… ఇవన్నీ గమనించి మేరీ తను ఓర్పుగా ఉండాలి, అనుకూలత అయిన భార్యలాగా ప్రవర్తించాలని, కాపురాన్ని నిలబెట్టుకోవాలని సర్దిచెప్పుకొని అతని పట్ల సహనం పాటిస్తూ ఉంటుంది.
‘‘భర్తకి తలనెప్పులు తరచూ వస్తున్నాయని పాల్‌ని వెంటపెట్టుకుని వైద్యానికి ఆస్పత్రికి తీసుకువెళ్ళిన మేరీ పిడుగు వంటి వార్త వినాల్సి వస్తుంది. పాల్‌ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, అతను తక్షణం హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని లేకపోతే ఇది ప్రమాదకర పరిస్థితికి, అంటే పాల్‌ వల్ల కుటుంబానికి, చుట్టూ వారికి అపాయం ఏర్పడే స్థితి రావచ్చునని డాక్టర్లు చెబుతారు. అతని మానసిక రుగ్మత ముదిరి, అపాయ స్థితికి చేరుకుందట’’ (నవలా మంజరి, పుట`29) ఈ వార్త విన్న మేరీ ఈ విధంగా ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిరదని మనం ముందు ముందు తెలుసుకుంటాం. చేసేదేమీ లేక పది రోజుల్లో నయమైపోతుందని, ఇంటికి తిరిగి వచ్చేస్తాడన్న ఆశతో అతన్ని హాస్పిటల్‌లో చేర్పిస్తుంది మేరీ. పది రోజుల్లో చికిత్స పూర్తయి తిరిగి రావడం, భర్తని చూసే అవకాశం కూడా దొరుకుతుందనుకుంటుంది. చెక్క బోర్డులు వేసి బిగించిన కిటికీ తలుపులు, భయానకంగా ఉండే పరిసరాలు. ఒక శనివారం సాయంత్రం ఒకసారి హాస్పిటల్‌ నుంచి పాల్‌ని ఇంటికి తీసుకొస్తుంది. ఆ రోజు పిల్లల పట్ల, భార్య పట్ల ప్రేమగానే ఉంటాడు. ఆ రాత్రి పిల్లలు పడుకున్నాక భార్య పక్కన పడుకున్న పాల్‌ రాత్రివేళ లేచి వంటింట్లోకి వెళ్ళి కూరలు కోసే కత్తిని తెచ్చి మేడ మీదకి వచ్చి పిల్లల్ని, భార్యని ఒక పక్కగా ఉండమని తాను దుష్టశక్తులు ఎదుర్కొంటున్నానని తిట్టడం మొదలుపెడతారు. ఈ ఉద్రేకం ఉన్మాద పరిస్థితిని గమనించిన మేరీ మెల్లగా పిల్లలని పక్క గదిలోకి తీసుకెళ్ళి లోపల గడియ పెట్టుకుని తెల్లవార్లూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతుంది. తర్వాత ఈ విషయం డాక్టర్‌ అడ్వర్ట్‌కి చెప్తే అతన్ని మరలా సమాజంలోకి పంపించే అవకాశం ఉందో లేదో అని విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పడు. మేరీని కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు చుట్టుముడతాయి. పాల్‌కి వచ్చే పెన్షన్‌ కూడా ఆగిపోతుంది.
‘‘ఐదేళ్ళు, మూడేళ్ళు, ఏడాది వయసులో ఉన్న పిల్లల్ని వదిలి ఉద్యోగానికి బయటికి వెళ్ళే అవకాశం లేక మేరీ టెలిఫోన్‌ ద్వారా పసిపిల్లలకు ఉపయోగించే ‘నాపీసు’ అమ్ముతూ ఉండేది. గర్భవతి అయిన స్త్రీ తన భర్తతో సంప్రదించి రాబోయే శిశువు కోసం నాపీస్‌ కొంటున్నప్పుడు మేరీకి ఒంటరిగా భర్త సహాయం లేకుండా తను గడుపుతున్న జీవితం జ్ఞాపకం వచ్చి దుఃఖం వేసేది’’.
వాక్యాలు చదువుతున్నప్పుడు హృదయం బరువెక్కుతుంది. ఎందుకంటే, భర్తకు దూరమైన భార్య పరిస్థితి ఎలా
ఉంటుందంటే, చుట్టుపక్కల వారి జీవితంలా తన జీవితం ఎందుకు లేదని బాధపడడం మానవ సహజం. ఈ క్లిష్ట పరిస్థితులలో స్కూల్లో సాటి పిల్లలు మేరీ పిల్లల్ని ఏడిపించడం మొదలుపెడతారు. మీ నాన్న పిచ్చివాడు, పిచ్చాసుపత్రిలో ఉన్నాడని. మనిషికి చెయ్యి విరిగినా, కాలు విరిగినా సానుభూతి ప్రకటిస్తారు కానీ మెదడుకు దెబ్బ తగిలితే తోటివారికి ఆ సానుభూతి లోపిస్తుంది. ‘‘ఈలోగా పాల్‌ని డాక్టర్‌ ఎడ్వర్డ్‌ తన మనసులోని భయాలని కాగితం మీద అక్షర రూపంలో బయట పెట్టమని ప్రోత్సహిస్తాడు. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి మానసిక రోగి తన ఆలోచనలని కాగితం మీద పెట్టడం వైద్యంలో ఒక భాగం’’. (నవలా మంజరి, పుట 32). తరువాత డాక్టర్‌, మేరీకి ఆ కాగితాలను ఇచ్చి వాటిని టైప్‌ చేయమని చెప్తాడు. తన భర్త రాసిన ఆ భావాలను చూసిన మేరీ చాలా ఆశ్చర్యపోతుంది. మేరీ సహనంగా ఉండేది తప్ప గత ఆరేళ్ళనుంచి తన భర్త ఎటువంటి భయాలకు లోనవుతున్నాడో కనుక్కోలేకపోయింది. అతనిలో గల భయాలను పోగొట్టి ధైర్యం చెప్పలేకపోయింది. భార్యగా తను కర్తవ్యంలో ఓడిపోయింది. డాక్టర్‌ ఎడ్వర్డ్‌, పాల్‌ రాసిన కాగితాల్లో కొన్ని భాగాలను ఒక పత్రికకు పంపుతాడు ‘ఒక మానసిక రోగి అనుభవాలు’ అనే పేరుతో. అది ‘కేథలిక్‌ డైజెస్ట్‌’ అనే పత్రికలో అచ్చవుతుంది. దాన్ని భర్త చేతికి ఇచ్చినప్పుడు పాల్‌ ‘‘పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన మొదటి పిచ్చి రచయితను నేనేనేమో’’ (పుట.32) అంటాడు నవ్వుతూ! ఆ నవ్వులో కోపంగానీ, అసహనం గానీ లేదు. తొలిసారి మేరీకి ఆశాభావం కలుగుతుంది. ఆ సమయం రానే వస్తుంది. పాల్‌ ఇంటికి తిరిగి వస్తాడు, కానీ ఎక్కడా పని దొరకదు. ఎవరూ ఉద్యోగంలో చేర్చుకోరు. ‘‘ప్రతిచోట మెంటల్‌ హాస్పిటల్‌ నుంచి వచ్చిన వాడివి అని వేలెత్తి చూపుతున్నప్పుడు పాల్‌ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడేమో అని మేరీ భయపడిపోతుంది. ‘ఒకసారి జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తిని ఈ సమాజం మళ్ళీ జైలుకు పంపుతుంది. ఒకసారి పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన మనిషిని మళ్ళీ పిచ్చివాడిని చేసి అక్కడికే పంపుతుంది ఈ సొసైటీ! అందుకని నేరస్థులూ, మానసిక రోగులు జైళ్ళలోనూ, పిచ్చాసుపత్రులలోనూ అంతమైపోతుంటారు’ అనుకుంటుంది మేరీ’’. ఇక ఉన్న ఊర్లో లాభం లేదని వదిలిపెట్టి న్యూయార్క్‌కి వెళ్ళిపోతారు. కొత్త సంసారం ఆరంభిస్తారు. అతను రాసిన పుస్తకం పూర్తయి కార్యాలయాలకు తీసుకెళ్ళే బిజీలో ఉంటాడు. వీళ్ళుంటున్న పైభాగంలోనే ఒక వృద్ధురాలు గొంతు కోసుకుని చచ్చిపోతుంది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే ప్రయత్నంలో పోలీసుల దృష్టి పాల్‌ మీదకు మళ్ళుతుంది. అతను మాజీ పేషెంట్‌ కావడం వలన, గతంలో వైలెంట్‌గా ఉండేవాడు కాబట్టి అతనే ఆ హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు అతన్ని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళి ప్రశ్నించడం మొదలుపెడతారు. కానీ పాల్‌ హత్య చేయలేదని ఆ ముసలామె రాసిన ఉత్తరంలో బయటపడుతుంది.
వివరణ: ‘‘నేను ఒకప్పుడు పిచ్చివాడిని. పిచ్చివాళ్ళ ఆసుపత్రిలో ఉన్నాను’’ అని సూటిగా ఉపన్యాసం ప్రారంభించి సభికులలో ఎంతోమందికి భవిష్యత్తు పట్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మానసికమైన శక్తిని, విశ్వాసాన్ని కలిగించేవాడు’’. పాల్‌ తను రాసిన ‘ది కార్డ్‌ బోర్డ్‌ జాయింట్‌’ పుస్తకం గొప్ప సంచలనం కలిగిస్తుంది. ‘‘ప్రతి ఉపన్యాసంలో మానసిక వ్యాధికి వైద్యం కంటే అతి ముఖ్యమైనది ఇంట్లో వాళ్ళ సానుభూతి. ముఖ్యంగా భాగస్వామి సహకారం అని చెప్పినప్పుడు నిరాశావాదులకు అతని మాటలు కొత్త ఆశను చిగురింపచేసేవి’’ (పుట.34). మేరీలాంటి వ్యక్తులు నిజ జీవితంలో వాళ్ళ భర్తలతోనూ, బిడ్డలతోనూ, సహోదరులతోనూ పాట్లు పడుతూ ఉంటారు. ఒక భార్యకి కేవలం సహనం మాత్రమే ఉంటే సరిపోదు. దాంతోపాటు సమస్యను అర్థం చేసుకునే వ్యక్తిత్వం కావాలి. ఆ పరిస్థితులను అధిగమిస్తూ భాగస్వామిని ధైర్యంగా ముందుకు నడిపించాలి. అటువంటి వ్యక్తుల పట్ల సానుభూతిని చూపిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే ఈ మేరీ పాత్ర ద్వారా మనకి అర్థమవుతుంది.
స్త్రీ ` చలం: ఈ సంపుటిలో ఇంత మంచి నవలలో స్త్రీ పాత్రల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసినప్పుడు స్త్రీ పక్షపాతి అయిన చలం గురించి మాట్లాడకపోతే ఎలా అనుకున్నారో ఏమో మాలతీ చందూర్‌. స్త్రీల గురించి ఏ స్త్రీ రచయిత కూడా ఈయన రాసినట్లు రాయలేదంటే అతిశయోక్తి కాదు. ‘‘చలం ఆడదాన్ని లేచిపొమ్మన్నాడుÑ కుటుంబ విచ్ఛేదాన్ని ప్రోత్సహించాడుÑ అసలు చలం గారు నిజమైన స్త్రీ సమస్యల వైపునకు పోలేదుÑ ఆయన స్త్రీ జాతికి ఏం చేశాడు? అని ప్రశ్నిస్తుంటారు వేదికల మీద, ప్రచార సాధనాల్లో కూడా! చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఉన్న ఈనాటి ఆధునిక స్త్రీలు ఇటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని తేలిగ్గా అనేస్తున్నారు అన్నది స్పష్టమవుతూ ఉంటుంది’’ అంటారు మాలతీ చందూర్‌. ఈ వాక్యాలు అక్షరాలా నిజం. చలం గారు 1925 ప్రాంతంలో ‘స్త్రీ’ పుస్తకం రాశాడు. అది 1930లో తొలిసారి ప్రచురించబడిరది. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ తెలుగు ఆడపడుచులకు అంకితం ఇచ్చిన క్రింద వాక్యాలు చూస్తే చలం 90 సంవత్సరాల క్రితమే స్త్రీల దయనీయ పరిస్థితి గురించి ఎంత వేదనపడి రాశారో మనకి అర్థమవుతుంది.
‘‘నాకు
ఒక్క నిమిషం విశ్రాంతినివ్వక
మహా ప్రాణయ మారుత వేగం మీదనో
అగాధవియోగ భారం కిందనో
చీల్చి, నలిపి,
ఊపిరాడనీయక
నా జీవితాన్ని పాలించే
స్త్రీలోకానికి నివేదితము’’ (స్త్రీ, చలం, ముందుమాట)
చలం గారి నవలలు, కథలు, నాటికలు, మ్యూజింగ్స్‌… వీటన్నిటికంటే ‘స్త్రీ’ పుస్తకం ఎక్కువసార్లు ముద్రించబడిరది. స్త్రీ పుస్తకం స్త్రీ జాతి గురించి రాసినది. ఇది నవల కాదు. సమాజంలో నారీమణుల గాథ. మూఢనమ్మకాలతో, సాంఘిక కట్టుబాట్లతో, సంసార సాగరంలో కొట్టుకుపోతూ, ముగింపు లేని సమస్యల వలయాలలో, మానసిక విశ్రాంతి లేక, దైనందిన చాకిరీతో, తమది అన్న కోరిక లేని స్వాతంత్య్రం లేని జీవితం… వీటన్నిటికీ ప్రతీకగా ఉన్న గానుగెద్దు లాంటి జీవితాన్ని అనుభవిస్తున్న స్త్రీ గురించి రాసినది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో చాలా మాట్లాడని విషయం లేదు. తర్వాత దీనికి అనుబంధంగా బిడ్డల శిక్షణను కూడా చేర్చారు. ఈనాడు ప్రభుత్వాలు జనాభాను అరికట్టడానికి టీవీలో, రేడియోలో ప్రచారం చేస్తునాయి. కానీ ఆనాడే చలం చర్చించాడు. ఆనాడు అది అవినీతి అయింది, ఈనాడు ప్రభుత్వానికి, ప్రజలకి ముఖ్య అవసరమైందని అంటారు మాలతీ చందూర్‌.
చలం చెప్పిన వాక్యాల్లో ఇంకా మహోన్నతమైనవి ఉన్నాయి.
1. స్త్రీ పురుషుడు ఒకరికొకరు అలవాటు కాకూడదు.
2. ఒకరికొకరు తిండికి గాని, డబ్బుకు గాని, సౌకర్యానికి గాని, చివరికి ఆనందానికి గానీ ‘ఇన్‌స్ట్రుమెంట్‌’గా చూడకూడదు.
3. జీవితంలో అన్నిటికన్నా గొప్ప ఆదర్శం ప్రేమించగలగడం. (స్త్రీ, బిడ్డల శిక్షణ `పుట.45)
వివరణ: ఈ గ్రంథంలోని ప్రతి వాక్యము వెలకట్టలేనిది. ‘తరతరాల నుంచి పురుషుడు స్త్రీకి చేస్తున్నది అన్యాయమే. ఆమె ఆత్మగౌరవాన్ని చంపాడు. దాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి. స్త్రీ తన ఇష్టం వచ్చినట్లు, తనకు తోచిన మార్గాన తిరిగి తన గౌరవాన్ని పొందాలి.’ (స్త్రీ, బిడ్డల శిక్షణ ` పుట.52)
పైన పేర్కొన్న అమూల్యమైన మాటలు చలం కంటే బాగా ఇంకెవరు చెప్పగలరు! చలం కంటే ఇంకెవరు స్త్రీ గురించి మాట్లాడగలరు! చలం కంటే ఎవరు స్త్రీ పక్షాన నిలబడి పోరాడగలరు! చలం కంటే ఎవరు సమాజాన్ని ఎదిరించగలరు! ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మనసున్న చలంని అర్థం చేసుకున్న ప్రతి స్త్రీ అతని కంటే ఇంకెవరిని గుర్తు చేసుకోగలదు!
‘‘చలం ‘స్త్రీ’ని ఒకసారి కాదు నాలుగుసార్లు చదవండి. ఒక్కొక్క ఛాప్టర్‌ చదివి రచయిత అంత తీవ్రంగా ఎందుకు చెబుతున్నాడో ఆలోచించండి. ఈనాటి ఆధునిక పాఠకులకు అప్పుడు అర్థమవుతుంది 70 ఏళ్ళ క్రితం చలం పడిన ఆవేదన, ఆయనకి ఈ సమాజంపై కలిగిన కోపం. అంతటి కోపంలోనూ, అంతటి ఆవేదనలోనూ జీవితాన్ని వెలిగించే ప్రేమానుభూతిని పట్టం కట్టారాయన’’ అంటారు మాలతీ చందూర్‌. చలంని చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. అందులో మాలతీ చందూర్‌ గారు ఒకరు. ‘మైదానం’ నవల చదివిన తర్వాతే చలాన్ని ఇంకా బాగా అర్థం చేసుకున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏది ఏమైనా చలం లేని తెలుగు సాహిత్యం లేదు.
ముగింపు: ఈ సంపుటిలోని మిగతా స్త్రీ పాత్రల గురించి రాయాలని ఉన్నా వ్యాస పరిధి సరిపోదు. మాలతీ చందూర్‌ పరిచయం చేసిన ఒక్కొక్క నవల నుండి ఎంతో కొంత జ్ఞానాన్ని తెచ్చుకుంటాం. స్వాతి పత్రికలో వచ్చే మాలతీ చందూర్‌ ‘నన్ను అడగండి’ శీర్షిక, ఆ శీర్షిక పక్కనే నవ్వుతూ ఉన్న ఆమె ఫోటో నాకు ఇప్పటికీ గుర్తు. ఆ కాలమ్‌ వస్తున్న క్రమంలో మా ఇంటిల్లిపాదీ చదివేవాళ్ళం. ఆమె జ్ఞానానికి జోహార్లు. మా మెదళ్ళలోకి ఆ కాలమ్‌ ఎంతలా నిక్షిప్తమయిందంటే ఇప్పటికీ మా ఇంట్లో ఏ విషయం గురించైనా, అది మర్చిపోయిన విషయమైనా, లేకపోతే చర్చించే విషయమైనా సరే నా చెల్లెలు ఆ విషయాన్ని గుర్తుచేసి, లేదా కొత్త విషయాన్ని చెప్పి ‘నన్ను అడగండి’ మాలతీ చందూర్‌ని అంటుంది. మనం కూడా సమకాలంలో సాహితీవేత్తలను అనుసరిస్తే ప్రత్యేకంగా వాళ్ళు రాసిన గ్రంథాలను గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు. ఆ గ్రంథాలు బిట్స్‌ రూపంలో మన మెదడులోకి చొచ్చుకుపోతాయి. అది ఈనాటి ప్రతి ఒక్క కాంపిటీటివ్‌ విద్యార్థికి కూడా అవసరమైనదే.
(పరిశోధక విద్యార్థిని, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.