దేవదాసి వ్యవస్థను రద్దు చేయించిన దేవదాసీ బిడ్డ – డాక్టర్‌ దేవరాజు మహారాజు

అనువాదం : రవికృష్ణ్ల
సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి, వాళ్ళని వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకుని, తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు, ఇతరత్రా వాడుకునేవారు.

ఇలాంటి నీచ నికృష్ట వ్యవస్థను సనాతన ధర్మం పేరుతో మనువాదులు ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగించారు. రాజరాజచోళుని కాలంలో, ఒక్క తంజావూర్‌ దేవాలయంలోనే నాలుగు వందలకు పైగా దేవదాసీలు ఉండేవారని చరిత్ర చెపుతోంది.
8 అక్టోబర్‌ 1947న మద్రాస్‌ అసెంబ్లీ సభ్యులు ఓ.పి.రామస్వామి రెడ్డి పెరియార్‌, ముత్తులక్ష్మి రెడ్డి దేవదాసీ నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంతే… సభలో గందరగోళం ప్రారంభమైంది. సత్యమూర్తి అయ్యర్‌, శ్రీనివాస్‌ అయ్యర్‌, గోవింద రాఘవ అయ్యర్‌, శేషగిరి అయ్యర్‌ల బృందం దాన్ని వ్యతిరేకించింది. అలా చేయడం సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకమని, మత శాస్త్రాలకు వ్యతిరేకమని ఆందోళన ప్రారంభించారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే స్థాయి ఈ చట్టసభకు ఉందా? అని కూడా ప్రశ్నించారు. ఇరు పక్షాల ఆందోళనలను ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తూ, సభను నిర్వహిస్తున్న రాజాజీ మౌనం వహించారు. గందరగోళాల మధ్య ఆనాటి సభ ముగిసింది. ఆ సాయంత్రం ముత్తులక్ష్మి రెడ్డి పెరియార్‌, ఇ.వి. రామస్వామి దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు. ఆయన ఆలోచించి కొన్ని సూచనలు చేశారు. మరునాడు 9 అక్టోబర్‌ 1947న సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్‌ చర్చ మొదలుపెట్టారు. ‘‘దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాలలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. వారు నేరుగా దైవసేవకులన్న మాట! వారు చేసే పవిత్ర కార్యాలను బట్టి వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. వారికి భోగభాగ్యాలు లభిస్తాయి’’, అంటూ శాస్త్ర నియమాలన్నిటినీ ఉటంకిస్తూ సత్యమూర్తి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మిగతా వారు కొందరు ఆయన బాణీలోనే మాట్లాడారు. అంతా అయ్యాక ముత్తులక్ష్మి రెడ్డి లేచి ఇలా అన్నారు, ‘‘అయ్యర్‌ గారు చెప్పిన శాస్త్ర విషయాలన్నిటితోనూ నేను ఏకీభవిస్తున్నాను. ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేస్తూ వచ్చిన సేవలకు అందిన దైవకృప మాకు చాలు. అందుకున్న భోగభాగ్యాలు కూడా మాకు సరిపొయ్యాయి. ఇటువంటి పనులు… అంటే దేవదాసీల వృత్తి చేయడం వల్ల దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మేవారూ, సనాతన ధర్మాన్ని గౌరవించాలని అనుకునేవారూ నిరభ్యంతరంగా వారి ఇంటి ఆడవారిని స్వచ్ఛందంగా దేవదాసీలుగా మార్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. అయితే మా నిమ్న వర్గాల మహిళలంతా ఈ వృత్తిని తిరస్కరిస్తున్నాం!’’ అని ముగించారు.
సనాతన ధర్మం గురించి మహోపన్యాసాలిచ్చిన వారి నోళ్ళు మూతపడ్డాయి. దొంగకు తేలు కుట్టినట్టు కిక్కురుమనకుండా కూర్చున్నారు. అప్పుడు అసెంబ్లీ ‘దేవదాసీ నిర్మూలన చట్టాన్ని’ ఆమోదించింది. ఆ తర్వాత వివిధ రూపాల్లో ఉన్న ‘దేవదాసీ వ్యవస్థ’ రద్దయింది. అప్పటి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు కలిసి ఉండేవి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ‘మాతమ్మ`జోగినీ’ వ్యవస్థలు, మలబార్‌ ప్రాంతంలో ఉన్న ‘నంగా’ వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని ‘బసివి’ వ్యవస్థలు రద్దయ్యాయి. దేవదాసీ వ్యవస్థ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడేది. అవన్నీ దేవదాసీ నిర్మూలన చట్టంతో రద్దయ్యాయి. ఆ ఘనత పూర్తిగా ముత్తులక్ష్మి రెడ్డికి దక్కుతుంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం కోసం అధికారికంగా అసెంబ్లీలో పోరాడిన డాక్టర్‌ ముత్తులక్ష్మి, స్వయంగా ఒక దేవదాసి కూతురు! ఒక దేవదాసి బిడ్డ దేవదాసీ వ్యవస్థను రద్దు చేయించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఆ జీవితంలోని సాధక బాధకాలు ఆమె పిన్న వయసులోనే తెలుసుకున్నారు కాబట్టి, ఆ పరిధిలోంచి బయటపడాలని కష్టపడి చదువుకుని డాక్టర్‌ అయ్యారు. పెరియార్‌ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి పోరాడి అసెంబ్లీకి వెళ్ళారు.
సుందర రెడ్డిని వివాహం చేసుకుని సాధారణ జీవితం గడుపుతూనే, అసాధారణ ప్రతిభా పాటవాలతో వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించారు. ప్రపంచ ప్రఖ్యాత అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఈమే వ్యవస్థాపకురాలు. ఈ సంస్థకు, భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రును ఆహ్వానించి పునాదిరాయి వేయించారు. 18 జూన్‌ 1954న అది ప్రారంభమైనప్పుడు దేశంలోనే అది రెండవ క్యాన్సర్‌ ఆసుపత్రి అయింది. ఇప్పుడది సంవత్సరానికి ఎనభై వేల మంది క్యాన్సర్‌ రోగులకు చికిత్సనందిస్తోంది. డాక్టర్‌ ముత్తులక్ష్మి ‘స్త్రీ ధర్మ’ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ తమిళ భాషా సాహిత్యాలకు కూడా గణనీయమైన సేవలందించారు. మరోవైపు ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసూ,్త ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ పత్రిక ‘రోషిని’కి సంపాదకత్వం వహించారు. 30 జులై 1866 ` 22 జులై 1968 మధ్యకాలంలో 82 ఏండ్లు జీవించిన ముత్తులక్ష్మి బ్రిటిష్‌ ఇండియా మద్రాస్‌ రాష్ట్రంలోని పుదుక్కొటై జిల్లా తిరుకోకర్నం గ్రామంలో జన్మించారు. ఆడపిల్లల చదువుకు తీవ్రమైన ఆంక్షలున్న ఆ కాలంలో మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుండి 1912లో వైద్యశాస్త్ర పట్టా సాధించారు. ఉన్నత విద్య కోసం ఆమె ఇంగ్లాండ్‌ వెళ్ళారు. కానీ, ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ వారి ఒత్తిడి మేరకు తన బంగారు భవిష్యత్తు ద్వారాలు మూసేసుకుని వచ్చి, మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో చేరారు. అక్కడ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు నిర్వహించారు. దాంతో మహిళా హక్కుల కోసం పోరాడే ఒక ఉద్యమకారిణి అసెంబ్లీ వ్యవస్థలో ప్రవేశించినట్లయింది. ఆ ర కంగా ఆమె పేరు అనేక విషయాలలో ప్రథమ స్థానంలో నమోదయ్యింది. అవన్నీ ఇప్పటికీ రికార్డులుగానే ఉండిపోయాయి.
ముత్తులక్ష్మీ రెడ్డి దేశంలోనే పురుషుల కళాశాలలో ప్రవేశం సాధించిన తొలి మహిళ. మామూలు ఎకడమిక్‌ డిగ్రీ కళాశాలలో కాకుండా వృత్తికి సంబంధించిన మెడికల్‌ కళాశాలలో ప్రవేశం సాధించడం ఆ రోజుల్లో (1907) చాలా గొప్ప విషయం. అందుకే ఆమె దేశంలో తొలి మహిళా హౌస్‌ సర్జన్‌, తొలి మహిళా డాక్టర్‌ కాగలిగారు. అలాగే నాటి బ్రిటిష్‌ ఇండియాలో తొలి మహిళా లెజిస్లేటర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అడ్వయిజరీ బోర్డుకు తొలి మహిళా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు తొలి డిప్యూటీ ప్రెసిడెంట్‌, మద్రాస్‌ కార్పొరేషన్‌లో తొలి మహిళ కాగలిగారు. వీటన్నిటితో పాటు 1953లో ‘అవ్యరు హోమ్‌ (అవ్యరు ఇల్లమ్‌)’కు రూపకల్పన చేసి ఆ విషయంలో కూడా తొలి మహిళగా నిలిచారు. ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతాలకు తరలించి వేశ్యావృత్తిలోకి దింపడాన్ని ఆపడంలో ఆమె నెలకొల్పిన హోమ్‌ ప్రముఖపాత్ర పోషించింది. అలాంటి బాలికలకు, యువతులకు ఆశ్రయం కల్పించి, విద్యనందించి, స్వతంత్రంగా జీవనం గడిపే విధంగా తీర్చిదిద్దేవారు. ముఖ్యంగా ముస్లిం, హరిజన బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించి మరింతగా ప్రోత్సహించేవారు. ముత్తులక్ష్మి తల్లి చంద్రమ్మాళ్‌ నిమ్న వర్గానికి చెందిన తమిళ స్త్రీ. తండ్రి యస్‌.నారాయణ సామి ఉన్నత వర్గానికిచెందిన అయ్యర్‌. అభ్యుదయ భావాలు గల నారాయణసామి తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని ఎదిరించి దేవదాసి అయిన చంద్రమ్మాళ్‌ను పెండ్లి చేసుకున్నారు. ఒక మహోన్నతమైన, మానవీయ విలువను నిలిపినందుకు ఆయన బంధువర్గం ఆయనను దూరం పెట్టింది. అందుకు ఆయన బాధపడలేదు. వీరిద్దరికీ కలిగిన కూతురే ముత్తులక్ష్మి. తండ్రి నుండి అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకుని పెరిగింది. కూతురి ఆలోచనలు పసిగట్టిన తండ్రి నారాయణసామి కూతురిని విద్యావంతురాలిగా, మానవతామూర్తిగా చూడాలనుకున్నారు. అందుకే ఆమెను స్కూలుకు పంపడం ప్రారంభించారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఆమె ఒక ఉపాధ్యాయురాలై బాలికలకు విద్యనందించాలని తండ్రి నారాయణసామి ఆశించారు. కానీ, ఆమె అంతకన్నా ఉన్నతంగా ఎదిగి, అనేక సంస్కరణలకు కారణమైంది.
యుక్త వయసు రాగానే పెండ్లి చేసి పంపడం ఆనాటి ఆచారం. కానీ, ముత్తులక్ష్మి స్వంత నిర్ణయాలు తీసుకోగల స్థాయికి చేరుకుంది. అందుకే ఉన్నత విద్యకోసం ఆరాటపడిరది. మెట్రిక్యులేషన్‌ పూర్తి కాగానే అక్కడి మహారాజా కళాశాలలో ప్రవేశం కోసం అర్జీ పెట్టుకుంది. ఆడపిల్ల కళాశాలలో ప్రవేశిస్తే అబ్బాయిలంతా ఆమె ఆకర్షణలో పడిపోతారని, వారి చదువు చెడిపోతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆ ప్రాంతపు పొడుకొట్టై మహారాజుకు అది అనవసరమైన రాద్దాంతమని అనిపించింది. ఆయన వ్యతిరేకతల్ని పట్టించుకోకుండా ముత్తులక్ష్మికి ప్రవేశం కల్పించారు. పైగా ఆమె సాహసానికి మెచ్చి స్కాలర్‌షిప్‌ కూడా ప్రకటించాడు. ఆ రకంగా ఆమెకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఉన్నత విద్యకు ద్వారాలు తెరుచుకున్నాయి.
1914లో ముత్తులక్ష్మి తన ఇరవై ఎనిమిదవ యేట 1872 నేటివ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం సుందరరెడ్డిని వివాహం చేసుకున్నారు. తనను జీవిత భాగస్వామిగా సమాన స్థాయిలో గౌరవిస్తానని, తన నిర్ణయాలు తాను తీసుకునే స్వేచ్ఛ ఉండాలన్న హామీని కాబోయే భర్త నుండి తీసుకున్న తర్వాతనే ఆమె సుందరరెడ్డితో వివాహానికి ఒప్పుకున్నారు. అలా వివాహమైన తర్వాత ఆమె పేరుకు రెడ్డి అనే పదం జతకూడిరది. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు డాక్టర్‌ కృష్ణమూర్తి, మరొకరు రామ్మోహన్‌. తమిళ సినిమా నటుడు జెమిని గణేశన్‌, ముత్తులక్ష్మికి అల్లుడు. తోడబుట్టిన సోదరి క్యాన్సర్‌తో చనిపోవడంతో ఒక డాక్టర్‌గా ఆమె క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. అంతేకాదు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేకంగా ఆస్పత్రులుండాలన్నది ఆమె ఆలోచన. అందువల్ల మెటర్నిటీ, చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ అనే కాన్సెప్ట్‌ ఆమెదే అయ్యింది. 1926లో ఆమె ప్యారిస్‌లో జరిగిన ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. లెజిస్లేటర్‌గా తన అనుభవాలను, ఆలోచనలను ఆమె ‘‘మై ఎక్స్‌పీరియన్స్‌ యాజ్‌ ఎ లెజిస్లేటర్‌’’ పేరుతో 1930లో గ్రంథస్థం చేశారు. 1947లో ఎర్రకోట మీద ఆవిష్కరించిన తొలి భారతీయ పతాకంపై దేశంలోని ముఖ్యమైన వారి పేర్లు రాశారు. అందులో ముత్తులక్ష్మి పేరు కూడా ఉంది. గాంధీజీ, అనీబిసెంట్‌, సరోజినీనాయుడు లాంటి దేశనాయకులతో ఈమెకు సన్నిహిత సంబంధాలుండేవి. బహుముఖ ప్రతిభతో అనేక రంగాలలో కృషి చేస్తూ దేశసేవ చేసిన ముత్తులక్ష్మి కృషిని భారత ప్రభుత్వం గుర్తించి 1956లో పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.