అటు సామాజిక కార్యకర్తలకు (సోషల్ యాక్టివిస్ట్‌లకు) ఇటు చలనచిత్ర నిర్మాణ దర్శకులకు (ఫిల్మ్ మేకర్స్‌కు) ఏకకాలంలో గొప్ప పాఠం అందించేలా వచ్చిన డాక్యుమెంటరీ దృశ్య కావ్యం ‘టు కిల్ ఎ టైగర్’.
ఆస్కార్ అవార్డుల అంచుల వరకు వెళ్ళిన ఈ డాక్యుమెంటరీ ఓ క్లాసిక్ అనడంలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కథ సాధారణం ` సామూహిక అత్యాచారానికి గురైన ఓ అమాయకపు ఆదివాసీ బాలిక తన తండ్రితో కలిసి చేసిన న్యాయ పోరాటమే చిత్ర ఇతివృత్తం. మన దేశంలో సగటున ప్రతి ఇరవై నిముషాలకు ఓ బలాత్కారం (రేప్) కేసు నమోదవుతున్నది. నమోదు కానివి ఇంకెన్నెన్నో…
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మామూలు ఆదివాసీ కుటుంబం. తల్లిదండ్రులు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఆ కుటుంబ సభ్యులు. 13ఏళ్ళ పెద్ద కూతురు బంధువులతో కలిసి గూడెంలో జరిగే ఓ పెళ్ళికి వెళ్తుంది. పెళ్ళైన తర్వాత ఆ బాలికకు తెలిసిన ముగ్గురు యువకులు మాయమాటలతో ఆ బాలికను వశపరచుకొని, పథకం ప్రకారం ఊరి బయటకు బలవంతాన ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారం చేస్తారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి, బాలికను అక్కడే వదిలేసి పోతారు. గాయపడిన బాలిక రక్తమోడుతూ ఇంటికి ఒంటరిగానే చేరుకుంటుంది. తల్లిదండ్రులకు విషయమంతా పూసగుచ్చినట్టు వివరిస్తుంది. ఖిన్నుడైన తండ్రి ఆ బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కేసు పెడతాడు. ‘పోక్సో’ చట్టం క్రింద కేసు నమోదు చేసుకుని పాపను పరీక్షల కోసం ఆస్పత్రికి పంపుతారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంటారు. ఇదంతా కథా నేపథ్యం. ప్రారంభంలో తండ్రి మాటల ద్వారా తెలుస్తుంది.
చిత్రం ఇక్కడినుండి మొదలవుతుంది. విచితమ్రేమిటంటే కేసు నమోదు చేసిన తరువాత ఆ ఊరు ఊరంతా ఈ కుటుంబాన్ని వెలివేసినట్టు చూస్తుంది. ఎవ్వరూ వీరితో మాట్లాడరు. ఆ బాలిక కూడా అపరాధ భావంలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో శ్రీజన్ ఫౌండేషన్ (ఎన్జీఓ) కార్యకర్తలు ప్రవేశించి బాలికకు ధైర్యం నూరిపోస్తారు. ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, నేరస్థులకు శిక్ష పడాలని, చదువు ఆపకూడదని, ఇంకా బాగా చదువుకోవాలనే నిర్ధారణకు వస్తుంది. తండ్రి కూడా బాలిక ధైర్యానికి అబ్బురపడి తన నిరాశను, ఊగిసలాట ధోరణిని విడనాడతాడు. ఎందుకంటే, ఆ గ్రామస్థులకు తెలిసింది ఒకటే న్యాయం. ఆ ముగ్గురిలో ఒకడు మాత్రమే ప్రధాన నిందితుడు. ఆ యువకుడితో పెళ్ళి చేస్తే సరిపోతుంది. ఇలా కేసు పెట్టడం, ఆ యువకులకు శిక్షలు పడటం వారికి నచ్చదు. పైగా బాలికలు అర్థరాత్రులు, అపరాత్రులు ఇష్టం వచ్చినట్లు తిరగడం, డ్రెస్ కోడ్, మేకప్‌లు వేసుకోవడం ఇలాంటి చేష్టలవల్లే యువకులు రెచ్చిపోతున్నారు, బలాత్కారాలు పెరిగిపోతున్నాయని వాదిస్తారు.
నిందితులలో ఒక వ్యక్తి ఆ బాలికకు అన్న వరస కూడా అవుతాడు. అయితే ఆ యువకులెవ్వరికీ తప్పు చేశామనే భావన ఉండదు. కుర్రోళ్ళకు ఇది సహజమే అన్నట్టు ఊరు కూడా భావిస్తుంది. అప్పుడు ఫౌండేషన్ కార్యకర్తలు చిన్న చిన్న మీటింగులు పెట్టి వారికి ఓపిగ్గా వివరిస్తారు. ఆ బాలిక కోణం నుండి మీరు ఈ ఘటనను చూడలేరా? ఆ బాలికకు మీరు ఎలా న్యాయం చేస్తారు? మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏమిటి? మొదలైన ప్రశ్నలకు వారివద్ద సమాధానం ఉండదు.
ఆ బాలిక తండ్రి స్థానిక కోర్టుకు హాజరైనప్పుడు, సాక్ష్యులను తీసుకు వచ్చేటప్పుడు ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. పెద్ద పెద్ద వ్యానుల్లో పోలీసులు తుపాకులు, బూటుకాళ్ళతో దిగడం, నేరస్థులకు బేడీలు వేసి తీసుకురావడం, న్యాయవాదులు కొందరు నిర్లక్ష్యంగా బాతాఖానీలు పెట్టుకోవడం, మధ్య మధ్యలో తండ్రి బెదురుచూపులు… అంతా వాస్తవమైనా గుండెల్ని కలచివేస్తాయి. నిరుపేద అసహాయకులకు న్యాయం ఎంత దూరంలో ఉందో చెప్పకనే చెప్తుంది. సాక్షులు అనుకూలంగా చెప్పారో ప్రతికూలంగా చెప్పారోనన్న భయాందోళన తండ్రిని వెంటాడుతుంది. ఇక్కడ గ్రామంలో ఆ యువకుల తల్లిదండ్రులు, ఇతర పెద్దలు కేసు వాపసు తీసుకోమని కుటుంబంపై భయంకర వత్తిడి పెడుతుంటారు. ఫౌండేషన్ కార్యకర్తలను కూడా బెదిరిస్తుంటారు. కార్యకర్తలు ఎప్పటికప్పుడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. ఏది ఏమైనా, బాలికకు న్యాయం దక్కాలని దృఢచిత్తులై ఉంటారు.
చిత్రం పతాక సన్నివేశానికి వస్తుంది. చివరగా బాలిక స్వయంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలి. భయపడకూడదు, గట్టిగా స్పష్టంగా చెప్పాలి. ఎఫ్.ఐ.ఆర్.లో ఏమి రాసి ఉందో అదే చెప్పాలి. పొరపడకూడదు. అందుకు ఆ రాత్రి తండ్రితో కలిసి గుడ్డిదీపం వెలుతురులో ఉబికి వస్తోన్న కన్నీటిని ఉగ్గబెట్టుకుని ఎఫ్.ఐ.ఆర్. నకలును ఆపి, ఆపి చదువుతుంది. తల్లి, పిల్లలు చుట్టూతా చేరి వింటుంటారు. పరీక్షకన్నా ఎక్కవగా ప్రిపేర్ అవుతున్నట్లు ఉంటుందా సన్నివేశం. మరుసటిరోజు చక్కగా ముస్తాబై కోర్టుకెళ్ళి ధైర్యంగా వాంగ్మూలం ఇస్తుంది. న్యాయమూర్తి ముగ్గురు ద్రోహులకు ఒక్కొక్కరికి 25 ఏళ్ళ కారాగార శిక్ష విధిస్తుంది. తండ్రీకూతుళ్ళ మోములో చిరునవ్వులు వెలుస్తాయి. అసలు డాక్యుమెంటరీ అంటేనే వాస్తవ చిత్రణ. ఆ కఠోర వాస్తవం నుండి నిర్మల ఆత్మను ఆవిష్కరింపచేయడమే కళాకారుల సృజన. దర్శకురాలు నిషాపహుజ ఈ విషయంలో అద్భుతంగా కృతకృత్యులయ్యారు. చిత్ర నిర్మాణానికి మూడున్నరేళ్ళు శ్రమపడ్డారు. చాలామంది శత్రువుల నుండి చంపుతామని ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె లెక్క చేయలేదు. పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, ఎదుర్కొంటూ మార్పు తీసుకురావాలి, అదే జీవిత లక్ష్యంగా ఉండాలని ఆమె పేర్కొంటారు. తదనుగుణమైన చిత్రీకరణ ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. ఆస్కార్ రాకపోయినా అంతర్జాతీయంగా అనేక పురస్కారాలు ఈ చిత్రం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో (తెలుగులో కూడా) మనం చూడవచ్చు.
చిత్రం చివరిలో ‘‘ఒంటరిగా నీవెప్పుడైనా పులిని వేటాడి చంపగలవా! అని నాతోటి వారు హేళనగా అడుగుతుండేవారు. నేను వేటాడి చంపి చూపాను’ అని అంటాడు. అదే స్ఫూర్తి దర్శకురాలికి వర్తిస్తుంది.