ఆ తేయాకు తోట విశాలంగా ఉంది
ఆకులన్నీ సూర్యకిరణాలతో
పరవశిస్తూ నేలకు పచ్చదనాన్ని అద్దాయి.
ఆ తోటలో తలపాగా ధరించిన
ఆ పడతి గోళ్ళతో మృదువుగా
ఒక్కొక్క ఆకును మెత్తగా తురిమి
వీపుకు కట్టిన బుట్టల్లోకి వేస్తుంది
ఉత్పత్తి శక్తుల శ్రమ సౌందర్యం
దేశానికి ఊపిరి
ఆ కడలి త్రయం పైన లేస్తున్న
చేపలు నీలి తెలి నల్ల అలల్లో
ఏ భేదం లేకుండా అటూ ఇటూ
దుముకుతున్నాయి
సముధ్రాల సమ్మేళనంలో
ఉదయిస్తున్న బాల సూర్యకిరణాల
రంగులు మారుతున్నాయి
చూపరుల ఆలోచనల్లో
వర్ణాంతర జీవనసంధ్యల
దోబూచులు
వర్షం ధార చిక్కనయ్యేకొద్దీ
ఆ అడవిలో చెట్టు వేరులోకి ఇంకిపోతుంది
వేరు బలపడే కొద్దీ
చెట్టు నిగారింపు పెరిగింది.
చెట్టు కొమ్మల మధ్య పట్టిన
తేనె తుట్టే నుండి
తీయని వర్షం కురుస్తుంది.
ఆ కోయ భామ నోరుతడుపుకుంటూ
ఆకాశం వైపు చూస్తుంది
ఆ అడవి తల్లి గుండెచప్పుళ్ళు
ఆమెకు వినిపించాయి
ఆ కొండల మీద పరుచుకున్న
నల్ల మబ్బుల మెత్తని పరుపులపై
పక్షులు సేదదీరుతున్నాయి
మబ్బుల తుంపులు
చిన్న చిన్న ముక్కులతో అవి
స్వీకరిస్తున్నాయి
ఇటు చూడూ..!
ఈ నగరం మురికి కూపమయ్యింది
కూలికి వెళ్లినవారు
తగరపు గుడిసెల్లో
తలదాచుకుంటున్నారు
విష జ్వరాల బారినపడి
పిల్లలు వేడి టీ నీళ్ళకు ఆరాటపడుతున్నారు
మరణం అంచుల మీద
ముసలివారు వ్యధితులవుతున్నారు
ఆకలి దానంతట అదే పుట్టి
అదే ఉపశమిస్తుంది
అక్కడ రొట్టె ముక్క దొరక్క
ఆ నల్ల బాలుని కళ్ళు పీక్కుపోయాయి
ఆ పక్కనే పబ్బుల్లో పగిలిపోతున్న సీసాల శబ్దాలు
మందు కాల్వల్లా పారుతుంది
ఉదయాస్తమయాలకు అక్కడ
తేడా లేదు
నరాల్లో రక్తపు బొట్టు లేదు
అదొక జీవన హననం
నాలుగడుగుల తేడాతో
ఇంత వైరుధ్యమా?!
ఆ రైలు పట్టాల పక్కన
చిత్తుకాయితాలు ఏరుకుంటున్న
పిల్లవాని తల
ముళ్ళ కిరీటంలా ఉంది
ఎవరు కన్న పిల్లలో
పొట్టలు వెన్నుముకకు
అతుక్కున్నాయి!
కొవ్వు యంత్రాలక్కూడా
పని ఎక్కువైంది
వైరుధ్యాలు బద్దలు అవుతున్నాయి కదా!
పేరెంట్స్ మీటింగ్‌కు ఆ బాలికతో
తల్లి ఒక్కతే వచ్చింది
ఒక్కరే పెంచుతున్న పిల్లలు ఎక్కువవుతున్నారు
కలిసి ఉండలేని అసహనం
పిల్లల్ని ఒంటరిని చేస్తుంది
వివాహమా? సహచర్యమా?
ఒంటరిగా జీవించటమా?!
ఒకటి కాదన్నప్పుడు మరొక్కటి
అసంపూర్ణమౌతూనే ఉంటుంది.
పెత్తనాన్ని నిరాకరించినప్పుడంతా
ఒక వివాదం – ఒక ఎడబాటు
వస్తు వ్యామోహమూ
ఒక వ్యసనమే
పుట్టిన పిల్లలకు జీవన పునాదులు
తొలిగాక భవిష్యత్తుకు గమనమేది?
రెండు చేతులతో పెంచడానికి
ఒక చేత్తో పెంచడానికి తేడా లేదా?
నిజానికి ఏది సుఖం? ఏది దుఃఖం?
బాధ్యతల్లోనే సుఖం ఉంది కదా!
ఆ వృద్ధాశ్రమంలో తన తల్లిని
చూడ్డానికి వెళ్ళిన కొడుకు
పునరాలోచిస్తున్నాడా!?
నాకు అన్నీ ఇచ్చిన తల్లి
ఇక్కడ అభాగ్యంగా ఎందుకు ఉందని?.
ఏది కృతజ్ఞత? ఏది కృతఘ్నత ?
అందుకే ఆ ప్రవక్తల
కన్నీటి ప్రవాహాలకు
అక్షర ద్యుతితో అడ్డుకట్ట వేశారు
ఆ తత్వవేత్త చెప్పింది ఒక్కటే
మనిషి-సంఘం-ధర్మం
కలిసి నడిచి నప్పుడే
సామాజిక జీవన ప్రయాణం
ప్రకృతి ఓ జీవన దర్శనం
జీవితం ఓ అనంత ప్రయాణం
మానవుడు ఓ సమన్వయకర్త
మానవత్వం ఓ గుండె దీపం
మాతృత్వం తరగని జీవన సౌరభం
మమతాను రాగాలు
ఆత్మీయ సంద్రాలు –
ఆ అంబేద్కరుడు చెప్పింది ఒక్కటే.
‘‘కరుణ – ప్రేమ – ప్రజ్ఞ’’
జీవన సోపానాలు
ఆ మెట్లు అధిరోహిద్దాం.