‘ఈల్లకేమొచ్చిందమ్మ మా అన్న బిడ్డ గోస గోసగాదు. మొగనితోటి ఇడుపు కాయితాల యినయి. మారు మనువు చేసుకోకుంటానే బిడ్డను కన్నది. ఇప్పుడు మొదటోడచ్చి అల్లం కల్లం చేయవట్టిండు. ఇంకెవడితోటో తిరిగి బిడ్డను కన్నదని తీరొక్క పంచాయితీలు జేయవట్టె.
ఇదేం తరీఖ? ఆడుకాదనుకొని బొయ్యిండు. ఇగ ఆనికేందమ్మ.. అదెట్ల బొయ్యిందో.. ఎవడితో కన్నదో… పాపం బిడ్డ కంటికి మింటికి ఏడ్వబట్టే. థూ.. ఆడు ఎట్ల ఎవ్వరితోటీ తిరిగిండో ఎన్ని కతలు వడ్డడో ఎవ్వల్లన్న అర్సుకున్నారా .. లే .. అంత ఆడిపిల్లను నడిబజాట్ల నిలవెట్టి తందానా జూసెటోడే .. ఆల్లమన్నువడ. దేడ్ దిమాక్… ‘వాకిట్లో ముగ్గేసి లోనికొస్తూ యాదమ్మ అంటున్నది. మా అత్తగారు ఏదో కామెంట్ చేస్తున్నారు. యాదమ్మ మేనకోడలు గురించి చెప్పింది వింటుంటే గిరిజన మహిళా అధికారి జీవితాన్ని నగ్నంగా నడి వీధిలో నిలబెట్టిన సంఘటన గుర్తొచ్చింది. ఆమె తన పనిలో అసమర్ధురాలు లేదా అవినీతిపరురాలు అయితే ఆ విషయాలపై చర్చ చేయొచ్చు. విచారణ జరిపించవచ్చు. కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చింది మీడియా. రాష్ట్రంలో తెల్లారిలేస్తే పసికూనల నుంచి పండు ముసలి వరకు అత్యాచారానికి గురవుతున్నారు. మహిళలు అనేక అవమానాలు, అఘాయిత్యాలు ఎదుర్కొం టున్నారు. తమ హక్కుల్ని, జీవితాల్ని కోల్పోతున్నారు. మరెన్నో దారుణమైన ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ మహిళా అధికారి హక్కుల్ని బజారున పెట్టడానికి వీళ్లెవరు? ఎందుకంత అత్యు త్సాహం? ఆమెతో పాటు ఈ లోకం పోకడ తెలియని పసివాడి పుట్టుకను ప్రశ్నిస్తూ, హక్కులను కాలరాస్తూ అవాకులు చెవాకులు పేలడం ఎంత అన్యాయం?
సమాజ సంస్కృతిలో, విలువల్లో, అవస రాల్లో మార్పులు కాలం కన్నా వేగంగా ఉంటు న్నాయి. మన వేషభాషల్లో, ఆహార వ్యవహారాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అదే విధంగా ప్రేమ, పెళ్లి, శృంగారం, పిల్లలు, విడాకుల్లోనూ మార్పు లొచ్చాయి. తప్పొప్పుల స్థితి మారిపోతున్నది. ఇదంతా ఆ ఒక్క మహిళా అధికారి విషయంలోనే కాదు. అనేకమంది స్త్రీ పురుషుల జీవితాల్లో, వారి విలువల్లో ఆ మార్పులు వచ్చాయి. స్త్రీ పురుషులు పెళ్లితో ఒక బంధంలోకి అడుగుపెట్టాక అందులో ఇమడ లేకపోతే విడాకులు తీసుకోవడం నేడు సహజం. పెళ్లి, విడాకులు మళ్ళీ పెళ్లి లేదా సహజీవనం అంతా వారికే పరిమితం. అది వారి స్వవి షయం. ఇప్పుడిప్పుడే విద్య ఉద్యోగాల్లో అడుగుపెడుతున్న జాతికి చెందిన మహిళ కావడం వల్లేనా ఈ రచ్చ. ఉన్నత వర్గాలకు చెందిన మహిళ అయితే ఇంత రచ్చ జరిగేదా? ఆ స్త్రీతో సంబంధం ఉందని చెబుతున్న అతన్ని వీధిలో నిలబెట్టి కడగడం లేదెందుకని?
భార్య ఉండగానే రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న, భార్య కాకుండా అనేక మందితో లైంగిక సంబంధాలు నెరపుతున్న పురుషులు దర్జాగా తిరుగుతారు. అది తమ మగతనంగా మీసాలు మెలేస్తారు. వాళ్ళ గురించి మీడియాకి పట్టింపు లేదు. కానీ భర్తతో విడాకులు పొందిన మహిళ మరో బంధంలోకి వెళ్తే ఈ మీడియాకి ఎక్కడ లేని ఆసక్తి, మసాలాలు దట్టించి వండి వార్తలు వడ్డిస్తారు. జనానికి కావలసినంత వినోదం.
ఆమె/అతను మరో బంధంలోకి వెళ్ళడానికి కారణం ఏమైనా వారి జీవితం వారి ఇష్టం. వారి స్వవిషయంలో తలదూర్చి తీర్పులు చెప్పడానికి ఈ జనమంతా ఎవరు? రాజ్యాంగం కల్పించిన ఆమె హక్కులు హరింప చేయడానికి వీరంతా ఎవరు? మహిళలు కూడా తానా అంటే తందానా అన్నట్టు అతన్ని వదిలేసి ఆమె జీవితాన్ని అసహ్యించుకోవడం, చీదరించు కోవడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది.
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా వివాహి తులైన భార్య/ భర్త మరొకరితో ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు అది నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ అది నేరమైతే ఆ నేరం ఇద్దరిదీ. ఏ ఒక్కరిదీ కాదు. శిక్షిస్తే ఇద్దరినీ శిక్షించాలి. కానీ సమాజం ఆమెను మాత్రమే వేలెత్తి చూపుతుంది. తీర్పులు చెబుతుంది. పాత చట్టాల ప్రకారం అతను దోషి. ఇప్పుడు కాదు అందువల్ల చాలా సార్లు ఆమెకే అన్యాయం జరుగుతున్నది. పురుషులు రాసే చట్టాలు ఎవరికి చుట్టంగా ఉంటాయి? వారికేగా! ఆ అధికారి విషయంలోకొస్తే ఆమె డైవోర్సీ. విడాకులు తీసుకున్న అతనికి ప్రశ్నించే అధికారం ఎక్కడిది? ఒకవేళ ఆమె భర్త అయినా అతను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది నిరూపించుకోవలసింది కోర్టులో కానీ పబ్లిక్‌గా మీడియాలో కాదు కదా!
భార్యాభర్తల మధ్య వివాదాలకు మీడియా వేదిక కావడం శోచనీయం. ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీడియా చర్చా వేదికలు పెట్టి భూతద్దంలో చూపుతూ గగ్గోలు పెట్టడం సిగ్గుచేటు. ఒక వేళ ఆమె సున్నిత మనస్కురాలై సూసైడ్ చేసుకుంటే అందుకు బాధ్యత ఎవరిది? ఇది ఆమె ఒక్కదాని సమస్యేనా.. అందరు మహిళల సమస్య. గౌరవంగా బతికే ఆమె స్వేచ్ఛను హరించింది మీడియా. సందట్లో సడేమియా అన్నట్టు కొందరు ఉద్ధారకులు గొంతెత్తి ఇద్దరు ఆడపిల్లల తల్లిగా వారి భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత తల్లిదేనని, అది విడిచి మరొకరితో జీవితం పంచుకోవడం హిందూ సంప్రదాయం కాదని, మిగతా మహిళలకు జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేయడం అని సెలవిచ్చారు. పిల్లలను కనే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది కాబట్టి ఆమె కన్నది. కానీ పుట్టిన బిడ్డలని తీర్చి దిద్దే బాధ్యత, కుటంబ సంస్కృతీ సంప్రదాయాలు నిలబెట్టే బాధ్యత తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా ఉందని గమనించండి బాబులూ… ‘ఏమోనమ్మా.. ఆడిది మనిషిగాదా? ఆమెకు మనసుండదా, కోరిక లుండవా? ఉప్పూకారం తినే బతుకుతాంది గద !’ యాదమ్మ గొంతు నన్నీ లోకంలోకి తెచ్చింది.
మా యాదమ్మ కున్న జ్ఞానం మీడియా హౌస్‌లకు లేకపోయే. మీడియా అత్యుత్సాహం వల్ల ఎంత మంది మహిళలు నరకం అనుభవిస్తున్నారో., మరెంత మంది జీవితం కోల్పోతున్నారో.. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి రచ్చ రచ్చ చేసి టి ఆర్ పి రేటింగ్స్ పెంచుకోవాలని చూడటమే జర్నలిజమా? ఎంత దిగజారుడు తనం?