మూడు సంవత్సరాల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ సభలో వేదమ్మ గారు పాడిన పాటలు, ఆమె ఉత్సాహం నన్ను ఉత్తేజపరిచాయి. ఈ వయసులో స్మార్ట్ ఫోన్‌్‌తో ఫోటోలు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సంఘం పనుల కోసం అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చురుకుదనానికి ముగ్ధురాలినయ్యాను.
జీవితాన్ని ప్రేమించడం వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. జీవితంలో విభిన్నమైన ఎత్తు పల్లాలను చూసిన అలాంటి వాళ్ళు సజీవ పుస్తక భాండాగార. వాళ్ళతో మాట్లాడిన కొద్దీ జీవిత మర్మాలు తెలుస్తాయి. ఆమె జీవితాన్ని లోతుగా పరిశీలించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అది ఇప్పటికి సాధ్యపడిరది.
బస్సు సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ లేని పల్లెటూరిలో జన్మించిన పూర్ణమ్మగారు భూస్వామి కూతురు. కట్టుబాట్ల మధ్య పెరిగిన ఆమె జీవితం ఉద్యమాల వైపుగా ఎన్నో మలుపులు తిరిగింది. సహచరుడు జైలుకు పోయినప్పుడు, పెద్ద కూతురు ఉద్యమంలోకి వెళ్ళి ఎన్‌కౌంటర్ అయినప్పుడు మనోధైర్యంతో స్థిరంగా నిలబడడమే కాకుండా తరువాత సంతానం కూడా సామాజిక కార్యకర్తలుగా ఉండడం ఆమె దృఢత్వానికి సాక్ష్యం. ఆమె జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొన్న తీరు నేటి యువతులకు మార్గదర్శకం అవుతుంది. మరి ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే అమ్మ! బాగున్నారా?
జ. నమస్తే! బాగున్నం.
ప్ర. మీ పూర్తి పేరు?
జ. నా పేరు అన్నపూర్ణమ్మ. పెళ్ళి సమయంలో వేదమ్మగా మార్చారు.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి?
జ. అమ్మ పేరు శేషమ్మ, తండ్రిపేరు పెద్ద తిమ్మారెడ్డి. ఆయన 700 ఎకరాలకు భూస్వామి. మూడు ఊర్లు ఆయన ఏలుబడిలో ఉండేవి. నాకు ఐదుగురు అన్నలు. నలుగురు అక్కలు. నేను పదవ దాన్ని, ఆఖరు సంతానాన్ని. మేం రెడ్డి కులస్తులం కావడం వల్ల మా అమ్మ మమ్ములను చాలా కట్టుబాట్లతో పెంచింది. ఎవరి ఇండ్లకు వెళ్ళనిచ్చేది కాదు. ఇంట్లోనే ఉండాలి. నేను ఇలాంటి కట్టుబాట్లలో పెరగడం వలన నా కూతుళ్లను కూడా అలాగే పెంచాలని అనుకునేదాన్ని. అప్పుడు నాకు ఇంతకన్నా అవగాహన లేదు.
ప్ర. మీరు ఎప్పుడు జన్మించారు? ఏం చదువుకున్నారు?
జ. నాకిప్పుడు 86 ఏళ్ళు. 1939లో పుట్టాను. నేను అప్పట్లో ఐదో తరగతి చదువుకున్నాను. అప్పటి చదువులు ఇప్పటి చదువులలాగా బట్టీ పెట్టడం కాదు కదా… అందుకే నేను చదివింది ఐదే అయినా రాయగలను. పుస్తకాలు కూడా చదువుతాను.
ప్ర. మీ పెళ్లి ఎప్పుడు జరిగింది?
జ. నాకు 17 ఏళ్లకు ఒక పెళ్లి కుదిరింది. తాళి కట్టే సమయంలో వరకట్నం విషయంలో గొడవ అయ్యి ఆ పెళ్ళి ఆగిపోయింది. నాకు కూడా ఆ పెళ్ళి ఇష్టం లేకుండే… ఆయన వ్యవసాయదారుడు. చదువుకోలేదు. నేను వ్యవసాయ కుటుంబంలో పెరిగిన కనుక నాకు చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఆ పెళ్లి తప్పిపోవడం నాకు మంచిదయింది. అప్పుడు నేను మా పెద్దక్క ఇంట్లోనే ఉన్నాను. తరువాత ఏడాది రెండేళ్ళకనుకుంటాను నేను కోరుకున్నట్లుగానే నాకు చదువుకున్న అబ్బాయితో పెళ్లి జరిగింది.
ప్ర. మీ అత్తగారి కుటుంబం గురించి చెప్పండి?
జ. మా అత్తగారి ఊరు మిడుతూరు. మా మామ చనిపోయాక మూడు నెలలకు పెళ్ళయింది. నేను పెద్ద కోడలిని. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మరిది. పెళ్ళి అయినాక ఎనిమిదేళ్ళు పూజలు చేసాను. తరువాత అవగాహన పెరిగి క్రమంగా మానేసాను.
ప్ర. మీ కాపురం గురించి చెప్పండి?
జ. మా ఆయన పేరు బి. రామిరెడ్డి. పెళ్ళినాటికి ఆయన వయసు 27 సంవత్సరాలు. అలీఘడ్ యూనివర్శిటీలో ఎం.ఏ, ఎల్.ఎల్.బి చేసారు. చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో పనిచేసేవారు.
ప్ర. మీకు ఎందరు పిల్లలు?
జ. నాకు నలుగురు పిల్లలు. ముగ్గురు కూతుళ్ళు. ఒక కొడుకు, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. మా పెద్ద పాప కడుపులోకి వచ్చాక ముందు వద్దనుకున్నాము. కానీ డాక్టరు మళ్ళీ పిల్లలు పుట్టడం కష్టమైతదని, బలానికి మందులు ఇచ్చింది. పాప పుట్టినాక నాలుగేళ్ళకు మా ఆయనకు ఎల్‌ఐసిలో డెవలప్‌మెంట్ ఆఫీసరుగా ఉద్యోగం వచ్చింది. ఒక నెల శిక్షణ తర్వాత గద్వాలలో పోస్టింగ్ ఇచ్చారు.
ప్ర. పిల్లల చదువుల గురించి చెప్పండి?
జ. సుగుణ, జ్యోతి, విజయ గద్వాలలోనే డిగ్రీ చదువుకున్నారు. కొడుకు కొండారెడ్డి యంయస్‌డబ్ల్యూ, ఎల్‌ఎల్‌బి నాందేడ్, ఔరంగాబాద్ లో చదివి, కన్నాభిరాన్ దగ్గర జూనియర్‌గా ప్రాక్టీసు చేసాడు. కోడలు కూడా లాయరే…
ప్ర. రామిరెడ్డి గారు ఎప్పుడు? ఎందుకు జైలుకు వెళ్లారు?
జ. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు మా యింటిని సోదా చేశారు. విప్లవ సాహిత్యం దొరికింది. అంతే పట్టుకు పోయారు. 18 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన జైలులో ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఒకసారి, నేను నా కొడుకు ఒకసారి వెళ్ళి చూసి వచ్చాము. ఆరు నెలల తరువాత నా ఆరోగ్య రీత్యా పెరోల్ వస్తే వచ్చి నన్ను కర్నూలు దవాఖానలో చేర్పించి, మళ్ళీ జైలుకు వెళ్ళారు.
ప్ర. రెడ్డిగారు జైలులో ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి?
జ. ఆ సమయంలో నా పిల్లలు చిన్నవాళ్ళు. నలుగురు పిల్లలతో నేను చాలా కష్టాలు పడ్డాను. నాకు ఆరోగ్యం బాగో లేక రెండు నెలలు దవాఖానలో ఉన్నాను. మా సుగుణ సోదరులను చూసుకోవడంతోపాటు దవాఖానాలో నన్ను కూడా చూసుకునేది. ఆర్థికంగా మొదటి నుంచీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా పుట్టింటి వాళ్ళది ఉన్నత మధ్యతరగతి (upper middle class) కుటుంబం. నా చిన్నపుడు ఆర్థిక ఇబ్బందులు లేవనే చెప్పాలి. మా అత్తగారిది మధ్యతరగతి కుటుంబం. మా పెళ్లయ్యాక నాలుగేళ్ళ వరకు ఆయనకు ఉద్యోగం లేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు సగం జీతమే వచ్చేది.(500/-) ఇంటికి పెద్దవాళ్ళుగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం, తమ్ముడి బాగోగులు చూడడం లాంటి బాధ్యతలు మా మీద ఉండేవి. కొన్నాళ్ళు మా అక్కయ్యల సహాయం ఉండేది. ఎవరైనా ఎంతకాలం చేస్తారు? ఉన్న దాంట్లోనే సర్దుకుని అతి కష్టంగా రోజులు వెళ్ళదీసాను. దానికి తోడు నాకు, మా పెద్ద పాపకు ఆరోగ్య సమస్యలు. ఒంట్లో నీరసంతో, ఒకలాంటి డిప్రెషన్‌తో పిల్లలను దండిరచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తలచుకుంటే చాలా బాధగా ఉంటది.
ప్ర. జైలు నుంచి తిరిగి వచ్చాక మీరు ఎక్కడున్నారు?
జ. ఆయన జైలు నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. అయితే అప్పుడు హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉన్నా తీసుకోలేదు. మళ్ళీ గద్వాలలోనే పోస్టింగ్ తీసుకున్నారు.
ప్ర. మీ పెద్దమ్మాయి ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్స్ చెప్పండి?
జ. మా పెద్దమ్మాయి గద్వాలలో చదువుకునేటప్పుడు ఆ కాలేజీలో Rూఖ ఏర్పడిరది. మా పిల్లలు నాకు చెప్పకుండా ఆ కార్యక్రమాలకు వెళ్ళి, కొన్నిసార్లు ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. నేనే మందలించేదాన్ని. వాళ్ళకు వాళ్ళ నాన్న సపోర్టు ఉండేది కాబోలు. ఒకరోజు మా పెద్ద అమ్మాయి సుగుణ తన స్నేహితుడు సుదర్శన్‌ను పెళ్ళి చేసుకుంటానని నేరుగా వాళ్ళ నాన్నను అడిగింది. అందుకు ఆయన అంగీకరించి, పార్టీ పెద్దల సమక్షంలో ఇంట్లోనే దండల పెళ్ళి చేశాడు. అంతే… ఆ సాయంత్రమే వాళ్ళు ఇంట్లో నుంచి అడవిలోకి వెళ్ళిపోయారు. కన్నకడుపు ఆవేదన చెందినా నా బిడ్డ ఎక్కడున్నా బాగుండాలని అనుకునే దాన్ని. మా అల్లుడు చనిపోయినప్పుడు మాత్రమే సుగుణ మాకు ఉత్తరం రాసింది. ‘‘అమ్మా! నీ ఒళ్ళో తల పెట్టుకుని ఏడవాలని ఉంది.‘‘ అని నా బిడ్డ రాసిన మాటలకు నా కన్న పేగు కదిలిపోయింది. ఉద్యమంలో ఏ క్షణమైనా మరణం తప్పదని తెలుసు. కానీ నా బిడ్డ పోలీసులకు మాత్రం దొరకకూడదని గట్టిగా అనుకునేదాన్ని. నేను ఎందుకిలా చెపుతున్నానో మీకు అర్ధమయ్యే ఉంటది.
ప్ర. మీ రెండో అమ్మాయి జ్యోతి పౌరహక్కుల నాయకుడు పురుషోత్తంను సహచరునిగా చేసుకున్నప్పుటి మీ స్పందన చెప్పండి?
జ. ఆమె యిష్టం అనుకున్నాను. కానీ పురుషోత్తం చాలా గొప్పవాడు. అప్పటికే రామిరెడ్డి మరణించడం వలన నేను వాళ్ళింట్లోనే ఉండేదాన్ని. మా ఆయన 22 మే1996లో పోయారు. అప్పట్లో నేను మళ్ళీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళకు ఒక అమ్మాయి. పేరు స్వేచ్ఛ. న్యాయవాది.
ప్ర. విప్లవోద్యమం గురించి మీకు అవగాహన ఉందా?
జ. ముందు నాకు ఏమీ తెలియదు. మా వారు కమ్యూనిస్టే కానీ నాకేమీ చెప్పేవారు కాదు. జీవితమే నేర్పించింది. నా జీవితంలో ప్రత్యేకించి నా కుటుంబంలో జరిగిన సంఘటనలు నాకు అవగాహన కల్పించాయి. సుగుణ ప్రజల కొరకు ఉద్యమంలోకి వెళ్ళడం, అల్లుడు సుదర్శన్ ప్రమాదవశాత్తు చనిపోవడం, పురుషోత్తంను నడిరోడ్డులో పోలీసులు పాశవికంగా నరికి చంపడం, 2003లో సుగుణ బూటకపు ఎన్‌కౌంటర్ ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు నా కుటుంబంలో జరిగాయి. అవే నా మార్పుకు కారణం. ఇప్పుడు శ్రీశ్రీ కవిత్వం అంటే ఇష్టం.
ప్ర. మీ మూడో అమ్మాయి విజయ గురించి చెప్పండి?
జ. విజయ సహచరుడు మహంతి జర్నలిస్టు. ఈనాడులో పనిచేసి పదవీ విరమణ పొందాడు. వాళ్ళకు ఒక అమ్మాయి. పేరు సమీర. MBBS పూర్తి చేసి PGకి ప్రిపేరు అవుతోంది. విజయ ఆర్టిస్టు మొదట్లో పౌరహక్కుల సంఘంలో పనిచేసింది. ప్రస్తుతం జ్యోతి, విజయ ఇద్దరూ చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు.
ప్ర. ముగ్గురు కూతుళ్లను ప్రజల కొరకు అంకితం చేసిన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
జ. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
ప్ర. చివరగా నేటితరం ఆడపిల్లలకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. రాను రాను రోజులు భయంకరంగా ఉంటున్నాయి? పేపర్లో ఎన్నో దారుణమైన వార్తలు కనిపిస్తున్నాయి. అందుకే ఆడపిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి వుందో పసిగట్టగలగాలి. ఆర్థికంగా నిలదొక్కుకొని, జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. శక్తి మేరకు సమాజానికి సేవ చేయాలి. అప్పుడే జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
