రోడ్డు మీదకు వెళ్ళు. మనుషులే మనుషులు. రైల్వే స్టేషన్, సిటీ బస్సులు, టూరిస్ట్ ప్రదేశాలు, హైకింగ్లు, సెలవలు, సరదాలు. అంతటా పరుచుకున్నదెవరు? ఎవరెవరు? ఎవరబ్బా?
… … …
రైళ్లు, కార్లు, టూ వీలర్లు, విమానాలు, మెట్రోలు, నావలు, నౌకలు. నదులు, సముద్రాలు, కొండలు, ఎడారులు, తీరాలు, లోయలు, సరస్సులు, చెరువులు, జలపాతాలు, చారిత్రాత్మక కట్టడాలు, వైపరీత్యాలు, మ్యూజియంలు, ప్రకృతి నిర్మాణాలు.
… … …
ఎవరక్కడ? ఎవరు, ఎవరు? ఎలా చేరగలిగారు? మిమ్మల్నెవరూ అనరా? ఆపరా? భయం వేయదా, పర్లేదా, ధైర్యం ఎక్కువే. మీ వారు మంచివారే, తిరగనిస్తున్నారు. మీకు స్వేచ్ఛ ఇస్తున్నారు.
సోలో ట్రిప్పులు- మహిళలకు ప్రత్యేక సమూహాలు, ప్రత్యేక వెసులుబాట్లు. మహిళలకు సంపూర్ణ భద్రతను ఇస్తామని హామీలు. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి?
… … …
తెగించి ఒంటరి యాత్రలు చేసేవారు. హోటల్ రూమ్‌లోకి చెక్‌ఇన్ అయి హిడెన్ కెమెరాలను వెతుక్కునే వారు, ఫోనులో లొకేషన్ ఆక్టివ్ షేర్ చేసుకునే వాళ్ళూ. ట్రాకింగ్ డివైస్‌లు, పెప్పర్ స్ప్రేలు. యాప్లు. ఇవి వాడేవారు. ఎవరు?
లేతరంగు డ్రెస్సులు నిండుగా కప్పి ఉన్నా జలపాతాన్ని వైపు కళ్ళ నిండా దాహం నింపుకుని చూసే వాళ్ళు. మార్చుకునే సౌకర్యం లేని బట్టలు, సిగ్గుపడే శరీరాలు. చుట్టూ అలముకొన్న బుద్ధులు, చూపులు, చేతివాటాలు. అప్పుడప్పుడు వచ్చే హోటల్ గదిలో అత్యాచారం, హత్య. క్యాబ్‌లలో అత్యాచారం, హత్య. హోటల్ రూములలో, హైవే పక్కన, నదులలో, డ్రైనేజీలలో కాల్చిపడేసిన శరీరాలు.
అయ్యో ఇంట్లో దాక్కుంటే ఇళ్లలోనూ ఇంటి వారి వలననూ.
… … …
వంటగదులు, తిండి అలమరాలు, టిఫిన్ బాక్సులు, టాబ్లెట్లు, పూజలు, పెద్దలు, జబ్బులు, చుట్టాలు – తెగించి బయటపడే ముందు అపరాధ పరిశోధనలు, గంటగంటకు స్టేటస్ చేకింగ్లు, అప్డేట్లు, వాషురూమ్లు, వరుసగదులు. ఫోన్ల ద్వారా టీ పొడి చిరునామా వెతుక్కునే పతిదేవుళ్లు, వారి చేతగానితనానికి విసిగెత్తిపోయే పతీవ్రతలు.
… … …
గుమ్మం దాటని, చీకటి పడేలోపు ఇంటికి చేరిన, వేగంగా నడవని, బయట తిరగని స్త్రీలు. తిరిగి చెడని స్త్రీలు, పరిగెత్తని స్త్రీలు, పద్ధతైన స్త్రీలు. వీరి అనుభూతులకు అనుమతులు. అనుమతులని ఇచ్చే బంధాలు, సంస్కృతులు. ఆజ్ఞ అందేవరకు రెక్కలు ముడుచుకున్న స్త్రీలు.
ఫీడిరగ్ బాటిళ్లు, టాంపూన్లు, పాడ్లు, యూటీఐలు, వాష్రూములు, భద్రతలు భరోసాని ఇచ్చే ఇతర మహిళలు ఏడ్చే పిల్లలకు తిండి తిప్పలు, అల్లరి చేసే పిల్లలకు ప్రవర్తన శిక్షణలు అమ్మలు చేసే యాత్రలు. ఇక్కడ దాకా చేరడానికి పడిన యాతనలు. విరిగిన రెక్కలతో విహార యాత్రలు భరించే స్త్రీలు.
… … …
పూజలు, నోములు, పుణ్యక్షేత్రాలు, పురుళ్ళు కలిసి వచ్చే మధ్యలో యాత్రలు. వారికై వారు పొందే చిన్నచిన్న ఆనందాలు. కొద్ది కొద్ది ప్రదేశాలు, కొసరి కొసరి అందే సమయాలు. చిన్నపిల్లలై కేరింతలు కొట్టేందుకు అనుమతులు, కర్ఫ్యూ లిమిట్లు. చిన్నచిన్న రెక్కల క్రింద పెద్ద పెద్ద ఆనందాల ఊపిరులను దాచుకున్న స్త్రీలు.
యాదృచ్చికాలు, ఆవశ్యకతలు, అవకాశాలు, ఆవేశాలు. వెరసి యాత్రలు. మనసుని గాలిపటంలా ఎగురవేసే అందాల సమయాలు.
… … …
ఎగిరిపోయేందుకు రెక్కలు కావాలి, రెక్కలు పరచడానికి ఆకాశం కావాలి. తమకోసమే మనసారా రెక్కలు సాచిన మహిళలు, ఏదోక పేరుతో కుటుంబాలను వదలి ఎప్పుడు అంటే అప్పుడే అన్నీ వదిలి చటుక్కున మాయమవగలిగే మంత్రవిద్యను అలవరచుకున్న ఆకాశ వనితలు. మనో ఆకాశాన్ని ఎగురవేసే భూవిహంగాలు.