‘‘ద కలర్‌ పర్పుల్‌’’ నవల ‘‘పత్తర్‌’’ కథ మీద ఒక తులనాత్మక అధ్యయనం – కె.సుభాషిణి

మనుషులు బహిరంగ ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్ల మీద వాహనాల నుండి తప్పించుకుంటూ జాగ్రత్తగా తిరుగుతుంటారు. జన సంచారం లేని లేదా అటవి ప్రాంతాలల్లో జంతువులు, పాముల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ ప్రజలు జీవిస్తూంటారు. లింగభేదం లేకుండా ప్రజలు అందరూ ఈ సూత్రాలను పాటిస్తారు.

అయితే స్త్రీలకు జంతువులు, విషపురుగుల నుండి తమను తాము కాపాడుకుంటూనే అదనంగా తోటి ప్రాణులైన మగవారి నుండి కూడా కాపాడుకోవలసిన పరిస్థితులు ఈ సమాజంలో నెలకొని వుండటం విషాదాలల్లోనే అత్యంత విషాదం.
బయట ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తుల వలన ఏర్పడే సమస్యల గురించి ఆడపిల్లలకు చెప్పే కుటుంబ సభ్యులు, ఇంట్లోనూ, ఇంటి చుట్టుపక్కల కూడా ప్రమాదకరమైన వ్యక్తులు వుంటారని చెప్పలేకపోతున్నారు. సొంత కుటుంబ సభ్యుల చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యే బాలికలకు, తమకు ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. సొంత కుటుంబ సభ్యులు అంటే వారు తండ్రి, సవతి తండ్రి, సోదరులు, కజిన్‌ బ్రదర్స్‌, అంకుల్స్‌ ఎవరైనా కావచ్చు. ఇలాంటి వారి నుండి లైంగిక హింసకు గురయ్యే బాలికలు భయం, సిగ్గుతో అసలు నోరు మెదపలేకపోతున్నారు.
తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితమైన రక్షణ కవచం తమ చుట్టూ వుంది అన్న భరోసాతో పిల్లలు వుంటారు. తండ్రులకు ఆడపిల్లల మీద ప్రేమ, అనురాగం ఎక్కువ వుంటుంది అని లోకోక్తి. ఆ ప్రేమ లైంగిక కోరికగా మారితే ఏ పరిణామాలకు దారితీస్తుంది? ఆదిమ సమాజాలలో అలాంటి సంబంధాలు వుండేటివి. వావివరసలకు తావు వుండేది కాదు. కాని నాగరిక సమాజంలో కొన్ని విలువలు, కట్టుబాట్లు స్థిరీకరించబడ్డాయి. తండ్రి కూతుర్ల మధ్య లైంగిక సంబంధం అత్యంత హేయమైనది, నిషిద్ధం కూడా. అన్ని తెలిసి కూడా దొంగచాటుగా, నలుగురి కళ్ళ పడకుండా కూతుర్ల మీద లైంగిక దాడికి పాల్పడే చీడపురుగులులాంటి తండ్రులు సమాజంలో ఎక్కడో అక్కడ కనిపిస్తూనే వుంటారు. అలాంటి తండ్రులను ఎదిరించలేక నిస్సహాయంగా వారి కామ కాంక్షలకు బలి అయిన ఆడపిల్లల జీవితాలలోని చీకట్లను రచయిత్రులు తమ సాహిత్యం ద్వారా పాఠకులకు అందిస్తూనే వున్నారు.
అమెరికా రాష్ట్రలలో ఒకటైన జార్జియ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆఫ్రికన్‌ నల్లజాతి స్త్రీ, సీలి (Celie) జీవితంలోని వేదనను, ఘర్షణను ‘ది కలర్‌ పర్పుల్‌’ (The color Purple) అనే నవలలో అలైస్‌ వాకర్‌ (Alice Walker) చిత్రించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఒక పేద ముస్లిం బాలిక ఆస్రాబాను అనుభవించిన దుర్భరమైన చేదు బాల్యాన్ని గీతాంజలి తన ‘‘పత్తర్‌’’ కథలో పాఠకుల కళ్ల ముందుకు తీసుకొస్తారు. సవతి తండ్రి ఆల్ఫోన్స్‌ (Alphonso) చేతిలో, బాల్యంలో నిరంతర లైంగిక అత్యాచారానికి గురయ్యి పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే ఇద్దరు బిడ్దలకు తల్లి అయిన బాలిక సీలి. ఏడు సంవత్సరాల వయస్సు నుండే సొంత కన్న తండ్రి ఖాద్రీ చేతిలోనే లైంగిక అత్యాచారానికి గురి అయ్యి బాల్యంలోనే రెండుసార్లు బలవంతపు అబార్షన్లతో నలిగిపోయిన బాలిక అస్రాబాను.
‘‘ద కలర్‌ పర్పుల్‌’’ నవల ఇతివృత్తం:
‘‘ద కలర్‌ పర్పుల్‌’’ నవలలో ప్రధాన పాత్ర సీలి. సీలి దేవుడికి రాసే ఉత్తరాల ద్యారా కథ మొత్తం నడుస్తుంది. పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే సవతి తండ్రి ఆల్ఫోన్స్‌ చేతిలో అత్యాచారానికి గురి అయ్యి, యిద్దరు పిల్లలకు జన్మ యిస్తుంది. సీలికి తెలియకుండా ఆ యిద్దరు పిల్లల్ని అడవిలో వదిలి పెడతాడు ఆల్ఫోన్స్‌. పిల్లలు చనిపోయింటారు అని సీలి అనుకుంటుంది. తర్వాత భార్య చనిపోయి నలుగురు పిల్లలు వున్న అల్బర్ట్‌ (Albert)తో సీలికి వివాహం చేస్తాడు. అల్బర్ట్‌కు సీలి చెల్లెలు నెట్టిని (Netti) పెండ్లి చేసుకోవాలనే కోరిక వుంటుంది. అయితే ఆల్ఫోన్స్‌, అల్బర్ట్‌కు నచ్చచెప్పి సీలితో వివాహం జరిపిస్తాడు. ఈ యిద్దరి మనసులల్లో వుండే కోరికను నెట్టి పసిగట్టి వారికి దూరంగా పారిపోతుంది. సీలికి నా అనేవాళ్లు ఎవ్వరు లేని స్త్రీగా వుండిపోతుంది. సీలికి నిరంతరం వుండే తిట్లు, దెబ్బలు, అవమానాలతో భర్త యింట్లో దినదినగండంగా కాలం గడుపుతూ వుంటుంది. అల్బర్ట్‌కు షెగ్‌ ఐవరీ (Sheg Ivary) అనే ప్రియురాలు వుంటుంది. ఈమె పేరున్న గాయకురాలు. ఈమెను మొదటిసారి చూసిన సీలికి తన తల్లి రూపం మదిలో మెదులుతుంది. మొదట్లో షెగ్‌ ఐవరీకి సీలి అంటే అయిష్టంగా వుండేది. ఆమె జబ్బు పడినప్పుడు, రాత్రి పగలు సీలి సేవలు చేస్తుంది. అప్పుడే దయనీయమైన సీలి జీవితం గురించి షెగ్‌ ఐవరీకి తెలుస్తుంది. ప్రతిరోజు అల్బర్ట్‌ చేతిలో సీలి దెబ్బలు తింటున్నట్టుగా కూడా ఆమెకు అర్థమవుతుంది. అప్పటి నుండి వాళ్ల యిద్దరి మధ్య కొత్త బంధం ఏర్పడుతుంది. సీలి తన చెల్లెలు నెట్టీ గురించి చెబుతూ, ఆమె చనిపోయి వుంటుంది అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే అల్బర్ట్‌ పెట్టెలో నెట్టీ తన అక్కకు రాసిన వుత్తరాలను చూసిన విషయాన్ని సీలికి తెలియజేస్తుంది. నిజం తెలిసిన సీలి కోపంతో ఊగిపోతుంది. తర్వాత షెగ్‌ ఐవరీ యిచ్చిన ప్రోత్సాహం, సహకారంతో ఒక చిన్న టైలరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించి, స్వతంత్రంగా బ్రతకటం మొదలు పెడుతుంది. తన పిల్లలు బ్రతికే వున్నారు, యింతవరకు వాళ్లకు నెట్టి గార్డియన్‌గా వుంటోంది అన్న విషయం కూడా సీలికి తెలుస్తుంది. అక్క చెళ్లెళ్లు, తల్లీ పిల్లలు కలయికతో నవల ముగుస్తుంది.
‘‘పత్తర్‌’’ కథా సారాంశం
ఆరేండ్ల వయసు వున్న కూతురు అస్రాబానును లైంగిక కోరికతో, పసిపిల్ల శరీరాన్ని తడుముతుంటాడు తండ్రి ఖాద్రీ. ఆ పసి మనసుకు యిబ్బందిగా అనిపించి తండ్రిని తప్పించుకొని తిరగడానికి ప్రయత్నాలు చేస్తూ వుంటుంది. తల్లి అయిన ఖుర్షీద్‌ బేగం భర్త చేసే అకృత్యాల నుండి కూతుర్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాని ఆ ప్రయత్నంలోనే ఖాద్రీ కొట్టిన దెబ్బలకు విపరీతంగా గాయపడి ఆస్పత్రి పాలవుతుంది. ఆ సమయంలోనే అస్రాబానును కొట్టి, హింసించి, భయపెట్టి పూర్తిగా లొంగదీసుకుంటాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మను చంపేస్తా అని బెదిరిస్తాడు. ఆస్పత్రి నుండి యింటికి వచ్చిన ఖుర్షీద్‌ బేగంకు విషయం అర్థమవుతుంది. తర్వాత భర్తకు తెలియకుండా కూతుర్ని, వసతి సదుపాయం వున్న బాలికల మదరసాలో చేర్పిస్తుంది. అస్రాబాను ఉనికి తెలుసుకొని ఖాద్రీ మదరసాకు వెళ్తాడు. భార్యకు అనారోగ్యం అని టీచరుకు అబద్దం చెప్పి, అస్రాబాను బలవంతంగా లాక్కుపోతాడు. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని వుంటాడు. ఏడుస్తూ, బ్రతిమిలాడుతూ వున్న అస్రాబానుతో ‘‘పదేండ్లసంది నడుస్తున్నది ప్రతిసారి కొత్తగా చేస్తవేమే…? నువ్వు ఇప్పుడు నా బీవివైపోయినావ్‌.. మేరీ బీవి హో తుమ్‌.’’ అంటూ వారం రోజులపాటు అత్యాచారం చేస్తాడు. తండ్రి రావటం, అస్రాబాను అతని వెంట బలవంతంగా వెళ్ళటం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే వుంటుంది. ఎవరికి చెప్పుకోలేక, చెబితే తల్లిని, చెల్లెళ్లను తండ్రి చంపుతాడేమో అనే భయంతో ఆ నరకాన్ని భరిస్తూ రోజురోజుకు కృంగి కృశించి పోతుంది. అస్రాబాను మానసిక, శారీరక పరిస్థితిని ఆమె టీచర్‌ సమీనా బేగం గమనిస్తుంది. తన యింటికి తీసికెళ్లి బుజ్జగించి అసలు విషయం తెలుసుకొని వణికిపోతుంది. చివరకు మహిళా సంఘాల ఉద్యమంతో ఖాద్రీ అరెస్టు అవుతాడు. బెయిల్‌ పైన విడుదలయ్యి వస్తాడు ఖాద్రీ. కొన్ని రోజులు ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా వుండటంతో ఖాద్రీ మారిపోయాడనే అనుకుంటారు అందరు. ఒక రాత్రి తన రెండో భార్య పెద్ద కూతురూ, తన సొంత కూతురైన షబానాను ఖాద్రీ అత్యాచారం చేయబోతాడు. ఇది చూసి సహించలేని అస్రాబాను చెల్లెలు రుక్సానా, తల్లి సహకరిస్తుంటే రాయితో తండ్రి తల పగులగొట్టి చంపేయ్యటంతో కథ ముగుస్తుంది.
సీలి అస్రాబానుల మధ్య సారూప్యం
సీలి, అస్రాబాను ఇద్దరి జీవితాల్లోని అంతులేని శారీరక, మానసిక హింసకు గురి చేసిన వారు వారి కుటుంబాలలోని మగవారే. సీలికి సవతి తండ్రి, భర్త అయితే అస్రాబానుకు కన్న తండ్రి, రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడు అమీద్‌ లే కారణం. ఇద్దరికి వారి జీవితాల్లో నిండి వున్న హింస నుండి బయట పడటానికి, జీవితంపట్ల ఆశనూ, నమ్మకాన్ని కలిగించింది స్త్రీలే. సీలి ఇద్దరు పిల్లలకు జన్మ యిస్తుంది. కానీ ఆల్ఫోన్స్‌ ఇద్దరిని ఆమె నుండి దూరం చేస్తాడు. అస్రాబానుకు రెండుసార్లు అబార్షన్‌ చేయిస్తాడు ఖాద్రీ. ఆఫ్రో, అమెరికన్‌ కుటుంబాలల్లో అవివాహితులు తల్లి కావాటాన్ని తప్పు పట్టదు. కాని ఇండియన్‌ సమాజాల్లో దీనికి అమోదం లేదు. అవివాహిత తల్లి అయితే ఆమెను సమాజం కాకుల్లా పొడుచుకుతింటుంది. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసేస్తారు కూడా లేదా ఆ కుటుంబాన్ని కొన్నిసార్లు సన్నిహిత బంధువులే బహిష్కరిస్తారు.
తను అందంగా లేను, తనంటే ఎవ్వరికి యిష్టం లేదు అనే ఆత్మనూన్యత భావనతో సీలి వుంటుంది. ఈ మనస్థత్వంతో తనపై జరిగే లైంగిక దోపిడిని, హింసను ప్రతిఘటించకుండా మౌనంగా భరిస్తూ వస్తుంది. తన బాధను చెప్పుకోటానికి అయిన వాళ్ళు ఎవ్వరూ లేని సీలి దేవుడికి ఉత్తరాల ద్వారా చెప్పుకుంటూ వుంటుంది. దేవుడు ఏదో చేస్తాడు అని కాదు కేవలం బాధ నుండి ఉపసమనం పొందటానికి మాత్రమే దేవుడితో సంభాషణ చేస్తూ వుంటుంది. దాదాపు నలభై ఏండ్ల వయస్సులో షెగ్‌ ఐవరీ ప్రవేశంతో, ఆమె యిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం సీలికి స్వేచ్చతో కూడుకున్న జీవితం మొదలవుతుంది. ఎప్పుడో దూరమైన చెల్లెలు నెట్టిని కూడా కలుసుకుంటుంది.
అస్రాబాను మొదట తండ్రిని తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తుంది. అది కుదరకపోవటంతో ‘‘నక్కో అబ్బా… అల్లా మాఫ్‌ నయి కరెగా’’ అని దేవుడి పేరు చెప్పి ఖాద్రీని ఆపాలని చూస్తుంది. తల్లిని, చెల్లెళ్ళను చంపేస్తాను అని తండ్రి బెదిరించటంతో దుఃఖంతోనే బలవంతంగా లొంగిపోతుంది. దుఃఖంతో కుమిలిపోతున్న అస్రాబాను టీచర్‌ సాన్నిహిత్యంలో మనసు విప్పి తన దుఃఖాన్ని పంచుకుంటుంది. తల్లి, టీచర్‌, డాక్టర్‌, మహిళా సంఘాల సహకారంతో బయటపడుతుంది. పెద్దయ్యాక తనకు డాక్టర్‌ కావాలనే కోరికను వెలుబుచ్చుతుంది.
ఆల్ఫోన్స్‌ కొడుకు హార్పో, ఖాద్రీ కొడుకు అమీద్ల ప్రవర్తన, మాటతీరును గమనిస్తే, కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద పడటమే కాదు వారిని అనుకరిస్తుంటారు అన్న విషయం ఋజువు అవుతుంది. వెనుకబడిన సమాజాల్లో, కుటుంబాల్లో యిది ఎక్కువుగా కనిపిస్తుంది.
అల్బర్ట్‌ సీలిని కొడుతుంటాడు. అదే విషయం అల్బర్ట్ని అడుగుతాడు అతని కొడుకు.
‘‘ఆమెను ఎందుకు కొడతావు?’’. దానికి తండ్రి యిచ్చిన సమాధానం
‘‘ఎందుకంటే ఆవిడ నా భార్య కాబట్టి, పైగా మొండిది కూడా’’
సమాజంలో బాగా పాతుకొని పోయిన పితృస్వామ్య భావజాలాన్ని, సమాజం ఎంత సాదారణంగా తీసుకుంటుందో ఈ చిన్న సంభాషణ ద్వారా చెప్తారు అలైస్‌ వాకర్‌. భార్యను అదుపులో వుంచుకోవాలి అంటే ఆమెను కొట్టాలి అనే అభిప్రాయాన్ని స్థిరపరుచుకుంటాడు హర్పో. అందుకే సోఫీయాను కొడ్తాడు. అయితే ఆమె ప్రతిఘటిస్తుంది. అతనితో సమానంగా పొట్లాడుతుంది, అంతే బలంతో తిరిగి అతనిని కొడుతుంది. నోరు ఎత్తకుండా భర్త కొట్టే దెబ్బలను మౌనంగా భరించే సీలికి, సోఫియాను చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, అబ్బురంగానూ వుంటుంది.
కనీస సౌకర్యాలు లేని యిరుకు యింట్లో యిద్దరు భార్యలతో కాపురం చేస్తుంటాడు ఖాద్రీ. అన్నీ బహిరంగమే. రాత్రి సమయాల్లో ఖాద్రీ యిద్దరు భార్యలతో చేసే సెక్స్‌, అస్రాబాను పైన చేెసే బలవంతపు లైంగిక అత్యాచారం యివన్నీ కూడా పిల్లలు చూస్తూనే వుంటారు. ఆ ప్రభావం ఖాద్రీ కొడుకు అమీద్‌ మీద కూడా పడుతుంది. అక్క అయిన అస్రాబాను పైన అత్యాచారం చేయబోతాడు. తల్లి ఖుర్షీదా అడ్డుకొని కొడుకును చావబాదుతుంది. అది సహించలేని అమీద్‌ ‘‘అబ్బా చేస్తాలేడా? నేను చేస్తే ఎట్ల తప్పయితాది’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. కుళ్లి కుళ్లి ఏడ్వటం తప్ప ఏ సమాధానం యివ్వకలేక పోతుంది ఖుర్షీదా బేగం.
సీలి, అస్రాబానులాగా లొంగిపోయిన స్త్రీలే కాకుండా ప్రతిఘటించిన స్త్రీలు కూడా ఈ నవల, కథలో కనిపిస్తారు. సవతి తండ్రి, భర్త చేతులల్లో సీలి లొంగిపోయినట్టుగా నెట్టి లొంగదు. వారి నుండి తప్పించుకొని పారిపోయి స్వతంత్రంగా జీవనం సాగిస్తూ వుంటుంది. ఒక డాక్టర్‌ దత్తత తీసుకొని పెంచుకుంటున్న తన అక్క పిల్లల్ని చేరుకుంటుంది. చివరకు సీలి దగ్గరకు ఆమె సొంత పిల్లల్ని చేరుస్తుంది. అస్రాబానుకు పట్టిన గతే తనకు కూడా ఎప్పుడో ఒకసారి దాపురిస్తుందేమో అనే భయంతో, తెగించి ఖాద్రీని చంపేస్తుంది అస్రాబాను చెల్లెలు రుక్సానా. అక్కలను ఆదుకున్న చెల్లెల్లుగా పాఠకులకు కనిపిస్తారు.
బాల్యంలో సవతి తండ్రి వలన కలిగిన లోతైన గాయాలు ఒకవైపు, వివాహం తర్వాత భర్త చేసిన హింస, నిరాదరణ, అవమానాలు యివన్నీ సీలిని నిరంతరం వెంటాడుతూనే వుంటాయి. అందుకే మగవారి పట్ల ఒకలాంటి భయం, జుగుప్స సీలి మనసులో పేరుకొని వుంటాయి అన్న విషయం ఈ వాక్యం గుర్తు చేస్తుంది. ‘‘I don’t even look at mens. That’s the truth. I look at woemn, tho cause I’m sacred of them”. కొంతమంది స్త్రీల ముందు, సీలి మనసు శరీరం రెండూ కూడా భిన్నంగా స్పందిస్తాయి. సీలి తల్లిని గుర్తు చేసుకోవటం, చెల్లెలునెట్టి కోసం ఆరాటం, తనను నిటారుగా నిలబడేట్టుగా చేసిన షెగ్‌ ఐవరీ మీద ఆరాధన, వ్యామోహం యివన్నీ కూడా సీలికి స్త్రీలతో వున్న సన్నిహిత సంబంధాన్ని సూచిస్తాయి. షెగ్‌ ఐవరీ వలననే సీలికి తన శరీరం మీద శ్రద్ద, యిష్టం కలుగుతాయి. ఆల్ఫోన్స్‌, అల్బర్ట్లతో ఏ రకమైన శారీరక సుఖాన్ని, సంతృప్తిని పొందని ఆమె షెగ్‌ ఐవరీతో శారీరక సుఖాన్నీ, సంతృప్తిని పొందుతుంది.
తండ్రి, తమ్ముడు వలన కలిగిన గాయాలతో అస్రాబాను మగవారిని చూస్తే చాలు ముడుచుకు పోతూవుంటుంది. అందరి తండ్రులు యిలా వుండరు తన తండ్రి మాత్రమే యిలా ఎందుకు అని కుమిలి పోతూ వుంటుంది. సమీనా టీచర్‌ భర్త మజహర్‌ అలీ తన కూతురుకు అన్నం తినిపిస్తూ వుండటం అస్రాబాను చూస్తూ వుంటుంది. అది గమనించిన అలీ ‘‘ఆవ్‌ బేటీ… ఆప్‌ బీ ఖావ్‌’’ అని అస్రాబానును దయగా పిలుస్తాడు. కాని అతని దగ్గరకు వెళ్లే ధైర్యం లేక దుఃఖంతో గదిలోకి పారిపోతుంది. మారని మనిషిగా పత్తర్‌ కథలో ఖాద్రీ అంతమవుతాడు. దీనికి కొంచెం భిన్నంగా ది కలర్‌ పర్పుల్‌ నవలలో అల్బర్ట్‌ పాత్రను మలుస్తుంది అలైస్‌ వాకర్‌. అల్బర్ట్‌ చేసిన మోసాన్ని సహించలేని సీలి భర్తను ధిక్కరించి షెగ్‌ ఐవరీతో వెళ్లిపోతుంది. భార్య, ప్రియురాలు యిద్దరు తిరస్కరించటంతో అల్బర్ట్‌ తప్పని పరిస్థితిలో రాజీపడిన మనిషిగా మిగిలిపోతాడు.
ముస్లిం కుటుంబాలల్లోని బహుభార్యత్వం పత్తర్‌ కథలో కనిపిస్తే, యితరులతో వివాహేతర సంబంధాలు ది కలర్‌ పర్పుల్‌ నవలలో కనిపిస్తాయి. ఆఫ్రికన్‌ దేశాలల్లో ప్రజలు పాటించే మూడనమ్మకాల వలన స్త్రీలు ఎంతటి శారీరక హింసకు గురి అవుతారో అర్థమవుతుంది. స్థానిక యాసలోనే ‘‘పత్తర్‌’’ కథ, ది కలర్‌ పర్పుల్‌ నవల వుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. స్త్రీలపై హింస, లైంగిక దోపిడి, పురుషాధిపత్యం, కుటుంబాలల్లోని వెనుకుబాటుతనాన్ని రచయిత్రులు యిద్దరు సమర్థవంతంగా తమ రచనల్లో చిత్రించారు.
జాత్యహంకారాన్ని తమ రచనల్లో చిత్రించని ఆఫ్రో అమెరికన్‌ రచయితలు వుండరు. జాత్యహంకారాన్ని అంతో యింతో తడిమిన నవల ది కలర్‌ పర్పుల్‌ . ఆఫ్రికన్‌ నల్ల జాతీయుడైన సీలి సొంత తండ్రి, వ్యాపారంలో స్థిరంగా నిలదొక్కుకోవాటాన్ని సహించలేని తెల్లజాతివారు అతన్ని చంపేస్తారు. అమెరికా రాష్ట్రాలలో వెళ్లునుకున్న జాత్యహంకారం ఎంత అమానుషంగా వుంటుందో ఈ హత్య ద్వారా అలైస్‌ వాకర్‌ తన నవలలో సూచిస్తారు. నవలలోని అన్ని ఘటనలకు ఈ హత్యనే ఒక పునాదిగా కనిపిస్తుంది. ఈ హత్యనే జరగకపోతే ఈ నవల వుండేది కాదేమో అనే సందేహం కూడా పాఠకులకు కలుగుతుంది.
సీలి, అస్రాబానులతో మమేకమై, వారి దుఃఖాన్ని పంచుకుంటూ తడిసి ముద్దవుతారు పాఠకులు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. సొంత కుటుంబ సభ్యులే వారికి సంబంధించిన ఆడపిల్లల మీద అత్యాచారాలకు పాల్పడితే ఆ ఆడపిల్లల పరిస్థితి ఏమిటో ది కలర్‌ పర్పుల్‌ నవల, పత్తర్‌ కథ తెలియజేస్తున్నాయి.
– ప్రొఫెసర్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజి, కర్నూల్‌

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.