అసుంత టొప్పో, ఛత్తీస్‌గఢ్‌లోని ధరమ్‌జైగఢ్ బ్లాక్ ప్రజారోగ్య వ్యవస్థకు ఒక విశ్వసనీయ పార్శ్వం
అతను ఆమెను ‘అమ్మా’ అని పిలుస్తాడు, కానీ సంజీవని అసుంత కొడుకు కాదు.
ధరమ్జైగఢ్ బ్లాక్‌లోని మిరిగుడాలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంలో అసుంత టొప్పో, సుమారు రెండు దశాబ్దాలుగా గ్రామీణ ఆరోగ్యాధికారి (ఆర్‌ఎచ్‌ఒ)గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం ఆమె ఒక అత్యంత ప్రమాదకరమైన పురుడు పోసే బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. తల్లి అధిక రక్తపోటుతోనూ రక్తహీనతతోనూ బాధపడుతోంది. ఆమె హెమోగ్లోబిన్ ఏడు గ్రాముల కంటే తక్కువగా ఉంది. ‘‘మా ఆరోగ్య ఉపకేంద్రానికి వచ్చే సమయానికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేమింకా ఆమెను బల్ల మీదకు తీసుకు రాకముందే బిడ్డ పుట్టాడు,’’ అసుంత గుర్తు చేసుకున్నారు.
స్థానికంగా ఉపస్వాస్థ్య కేంద్రంగా పిలిచే ఆరోగ్య ఉప కేంద్రంలో పుట్టిన బిడ్డ పరిస్థితి అంత మంచిగా లేదు. ‘‘మాకిక్కడ ఆక్సిజన్ సౌకర్యం లేదు, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది’’ అంటూ గుర్తు చేసుకున్నారు అసుంత. తల్లికి తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో, ఆ ఆర్‌ఎచ్‌ఒకు బిడ్డ విషయం పట్టించుకోవాలో, తల్లి సంగతి చూడాలో అర్థం కాలేదు.
‘‘మొదట మేం వాళ్ళని ధరమ్‌జైగడ్‌కు తీసుకువెళ్ళాం. అక్కడ ఒక డాక్టర్ ఉంది, ఆమె పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు. ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న తల్లీ బిడ్డలను ఇక్కడికెందుకు తీసుకువచ్చారని మమ్మల్ని అడిగింది,’’ ఆమె గుర్తు చేసుకున్నారు. కానీ అసుంత ఆ డాక్టర్తో దెబ్బలాడారు. ‘‘మీకు చేతకాకపోతే వదిలెయ్యమని నేనామెకు చెప్పాను. కొద్దిగా సహాయం చేయమని అడిగాను. ఆమెకు కోపం వచ్చింది.’’
అసుంత బిడ్డను పైకెత్తి పట్టుకొని ఆంబులెన్స్ కోసం అడిగారు. ఇంతలో ఆ డాక్టర్ దయతలచి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. తనతో పాటు వచ్చిన మితానిన్ (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త – ఆశా) తన నోటి నుండి బిడ్డ నోటిలోకి ఊపిరిని ఊదటం ద్వారా బిడ్డను బతికించడానికి ప్రయత్నం చేస్తూ ఎంతో సహాయపడిరదని అసుంత చెప్పారు.
చివరకు రాష్ట్ర ఆరోగ్య హెల్ప్లైన్ నంబర్ 108 స్పందించింది, అంబులెన్స్ వచ్చింది, ఒక డాక్టర్ తల్లిని చూసుకున్నారు. వారు ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నగరంలో ఉండే పెద్ద, మెరుగైన సౌకర్యాలు కూడా కలిగిన రాయగఢ్ వైద్య కళాశాల ఆసుపత్రికి బయలుదేరారు. ‘‘నేను బిడ్డను నా ఒడిలోకి తీసుకున్నాను’’ అన్నారు ఆర్‌ఎచ్‌ఒ. ఆమె తన నోటి ద్వారా బిడ్డ నోటిలోకి ఊపిరి ఇవ్వడాన్ని కొనసాగించారు. అసుంత నవజాత శిశువును అక్కడి వైద్యులకు అప్పగించినప్పుడు, అతను బ్రతకడని వాళ్ళు ఆమెకు చెప్పారు. ‘‘ఏమాత్రం ఆశ లేదని అక్కడి పిల్లల వైద్యుడు చెప్పారు,’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
కానీ అసుంత ఆ బిడ్డను తీసుకొని ఉత్తినే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రాలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళను చేయమని అక్కడి డాక్టర్లను ఆమె ఒత్తిడి చేశారు. ‘‘తల్లీ బిడ్డ ఇద్దరినీ కాపాడగలిగాం. అది నాకు చాలా గొప్ప సంతృప్తిని ఇచ్చింది,’’ ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో తన కథను ముగించిన అసుంత ఇంకా ఇలా అన్నారు, ‘‘ఇప్పటికి ఇది జరిగి ఐదేళ్ళయింది. ఆ బిడ్డ ఆరోగ్యంగా చక్కగా ఉన్నాడు.’’ ఆ బాలుడు రైతులైన తన తల్లిదండ్రులతో కలిసి మిరిగూడా గ్రామంలో నివాసముంటున్నాడు. ‘‘నేను మొదటిసారి సంజీవని సేవ (ఆంబులెన్స్) పొందినది అప్పుడే! అందుకే అతనికి ‘సంజీవని’ అని పేరు పెట్టాను!’’ స్థానికులు తరచుగా ‘సిస్టర్’ (నర్సు) అని పిలిచే అసుంత అన్నారు. ఒరాఁవ్ సముదాయానికి చెందిన గ్రామీణ ఆరోగ్యాధికారి అసుంత టొప్పో ఛత్తీస్‌గఢ్‌లోని ధరమ్‌జైగఢ్ బ్లాక్ (ఇంతకు ముందు ఉదయ్‌పూర్ అని పిలిచేవారు) లోని రాఠియా, బైగా, బిర్‌హోర్ ఆదివాసీ సముదాయాలకు చెందిన 4,000 మంది ప్రజల సంరక్షణను చూసుకుంటారు. వీరంతా ఎక్కువగా చిన్న చిన్న భూఖండాలలో వ్యవసాయం చేయటం పైనా, దగ్గరలోనే ఉన్న అడవి నుండి కలపేతర అటవీ సంపద అయిన వంట చెరకు, మహువా, చార్, తెందు (తునికి) ఆకులను సేకరించటం పైనా ఆధారపడతారు.
మిరిగుడా, నకానా, భావర్‌ఖోల్, సేమిపాలీ ఖుర్ద్ గ్రామాలలో నివసించే వారంతా అసుంత పనిచేస్తోన్న మిరిగూడాలోని ఆరోగ్య కేంద్రంపై ఆధారపడతారు.
‘‘నేనిక్కడ 2005 నుంచి ఉంటున్నాను,’’ ఆ ప్రాంతాన్నే తన నివాసంగా మార్చుకున్న అసుంత అన్నారు. ‘‘నేను ఎన్నో మార్పులకు సాక్ష్యంగా నిలిచాను. ఇంతకుముందు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది. వివిధ గ్రామాలను చేరటానికి నేను ఒక్క రోజులో 15-20 కిలోమీటర్ల దూరం కాలి నడకన ప్రయాణం చేయవలసివచ్చేది.’’
2015లో, వాహనాలు రోడ్ల మీదకు రాలేని పరిస్థితులలో, పథరీడాండ్గాఁవ్ గ్రామానికి చెందిన ఒక గర్భవతి గుర్రపువాతం జబ్బుతో కిందికి వచ్చింది. ‘‘మేం ఆమెను ఒక మంచానికి కట్టేసి అతి కష్టం మీద ఇక్కడకు తీసుకువచ్చాం. బిడ్డ ఇక్కడే పుట్టింది,’’ అని అసుంత మాతో చెప్పారు. అడవుల గుండా నడిచే సమయాలలో అడవి జంతువుల వలన నిరంతర ప్రమాదాలు ఎలా వుండేవో ఆమె గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు విరోచనాలు, కాలాన్ని బట్టి వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడవి తగ్గిపోయాయి. అదేవిధంగా క్రమం తప్పని చెకప్‌లు, మందులు వాడటం వలన రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయి,’’ అన్నారామె.
భారతదేశంలో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మలేరియా కేసుల విషయంలో ఛత్తీస్‌ఘఢ్ మూడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం (2024) జూలై వరకు 17,765 నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్-బోర్న్ డిసీజ్ కంట్రోల్ జారీ చేసిన ఈ డేటా చెబుతోంది. ఇది 2023లో ఉన్న 31,706 కేసుల కంటే తక్కువ. అవగాహన ప్రచారాలు, క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహించటం, ఔషధ దోమ తెరల సరఫరా వంటివన్నీ దీనిని తగ్గించడానికి సహాయపడ్డాయని అసుంత చెబుతున్నారు.
ఆ తర్వాత మేం అసుంతతో కలిసి సంజీవని ఇంటికి వెళ్ళినప్పుడు అతను తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. సిస్టర్ అసుంతను చూడగానే వరి పొలంలో పనిచేసుకుంటోన్న సంజీవని తల్లి విమల చేస్తున్న పనిని ఆపేసి మాతో మాట్లాడటానికి వచ్చారు.
‘‘సిస్టర్ అసుంత నమ్మకం అనేకమంది జనాన్ని ఇక్కడకు తీసుకువస్తోంది,’’ ఆ ప్రాంతపు సాముదాయిక ఆరోగ్యాధికారి (సిఎచ్‌ఒ) నేహా ఖాల్కో అన్నారు. ‘‘ఆమె (అసుంత) ఇక్కడ ఉన్నప్పటి నుంచి, ధరమ్‌గఢ్ బ్లాక్‌లోని ఈ మిరిగుడా ఆరోగ్య ఉపకేంద్రంలో 3,000 ప్రసవాలు అయ్యాయి.’’ ‘‘ఇంతకు మునుపు బిర్‌హోర్ (ఆదివాసీ) ప్రజలు ఆసుపత్రికి వచ్చేవారు కారు. వారు ఊరు బయట పిల్లలను కనేవారు. వారి పిల్లల బొడ్డు తాడును ఒక రాతితో కోసేవారు,’’ అన్నారు అసుంత. ఒకసారి ఒక బిర్‌హోర్‌్ (ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహం) తల్లిని అసుంత గుర్తుచేసుకున్నారు. ఆమె తన ఏడవ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమె గర్భాశయం మొత్తం బయటకు వచ్చేసింది. దాన్ని వెంటనే లోపలికి నెట్టడానికి అసుంత చాలా త్వరత్వరగా పనిచేయాల్సి వచ్చింది.
అయితే, గ్రామంలో క్రమం తప్పకుండా నిర్వహించబడే ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహార దినోత్సవ కార్యక్రమాలు, ప్రసవానికి ముందు అవసరమైన పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్య రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థల (వీరే మితానిన్లకు శిక్షణ ఇస్తారు) నుండి మద్దతు లభించటం కారణంగా పరిస్థితి కొంత మెరుగుపడిరది.
మిరిగుడాలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్దకు ఈ రచయిత వెళ్ళినప్పుడు, మితానీల (ఆశాలు) సభ ఒకటి జరుగుతోంది. అది జూలై నెల. ఆ మధ్యనే కురిసిన వర్షాలకు ఆ ఆరోగ్య కేంద్రం చుట్టూ ఉన్న వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. అధిక ప్రమాదంతో కూడిన జననాలను ఎలా పరీక్షించాలో ఒక డాక్టర్ మితానిన్లకు శిక్షణ ఇస్తున్నారు. ‘‘ఇప్పుడు మేం సంక్లిష్టమైన, అధిక ప్రమాదకరమైన కేసులను ధరమ్ జైగఢ్‌లోని సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాం, ఈ గర్భాలను ట్రాక్ చేస్తున్నాం. మా ఉప కేంద్రంలో మాకు అన్ని సౌకర్యాలు లేనప్పటికీ, దానిని క్రమబద్ధీకరించడానికి మా వంతు ప్రయత్నాన్ని మేం చేస్తున్నాం,’’ అని మిరిగుడా సిఎచ్‌ఒ నేహా ఖాల్కో చెప్పారు. సాంకేతికత నిస్సందేహంగా సహాయపడుతుంది. కానీ అసుంత వంటి ఆర్‌ఎచ్‌ఒల పని స్థానిక ప్రజలలో నమ్మకాన్నీ విశ్వాసాన్నీ పెంపొందించాయి. వారే ఈ ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవారు.
ఈ కథనం ముందరి పాఠాంతరం అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారి వెబ్సైట్లో ఉంది.
(ఈ వ్యాసం (httpa://ruralindiaonline.org/te/article/the-rho-who-delivers-te) మే 17, 2025 లో మొదట ప్రచురితమైనది.)
