అమ్మే స్ఫూర్తి – గిరిజ పైడిమర్రి

సందర్భం:‘‘హలో! నా పేరు విజయలక్ష్మి. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో యోధ పుస్తకం మీద మీరు రాసిన ఆర్టికల్‌ చదివాను. సి ఆర్‌ ఫౌండేషన్‌ గ్రంథాలయం కొరకు యోధ పుస్తకాలు కావాలి.’’ అంటూ విజయలక్ష్మి గారు ఫోన్‌ చేశారు. సిఆర్‌ ఫౌండేషన్‌లో నీలం రాజశేఖర్‌ రెడ్డి రీసర్చ్‌ సెంటర్‌ సహకారంతో కొనసాగించిన గ్రంథాలయం ఇంకా మనుగడలో ఉండడం నన్ను చాలా ఆనందానికి గురిచేసింది.

ఎప్పుడో ఛాయాదేవిగారు అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాను. అదే విషయం విజయలక్ష్మి గారితో ప్రస్తావించి, భండారు విజయ, నేను పుస్తకాలు తీసుకొని తప్పకుండా వస్తామని చెప్పాను.
కొన్నాళ్ళ తరువాత నేను భండారు విజయ కలిసి పుస్తకాలు తీసుకొని విజయలక్ష్మి గారింటికి వెళ్ళాము. అప్పుడు ఎదురుగుండా కనిపించిన వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా ఆవిడ సురవరం సుధాకరరెడ్డిగారి సహచరి అని నాకు తెలియదు. అదే విషయం ఆమెను అడిగినప్పుడు..’’ మనం మనంగా గుర్తించబడాలి కదా..’’ అని ఆమె యిచ్చిన సమాధానంలోని అంతరార్థం నాకు స్ఫురించింది. అవును, నేటికీ సమాజం మహిళలను ద్వితీయ పౌరులుగానే చూస్తోంది.
తెలంగాణా ప్రాంతంలో రాజకీయ, సాంఘిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం సురవరం ప్రతాపరెడ్డి గారు. 354 మంది తెలంగాణా కవులతో ఆయన వెలువరించిన ‘‘గోలకొండ కవుల సంచిక’’ తెలంగాణాలో కవులు లేరనే అపఖ్యాతిని నిలువరించింది. పరిశోధకుడుగా, పండితునిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, క్రియాశీల ఉద్యమ కారుడిగా సురవరం ప్రతాపరెడ్డి జగద్విదితం. ఆయన సోదరుని కుమారుడే సురవరం సుధాకర రెడ్డి ప్రముఖ రాజకీయవేత్త. చిన్నప్పటి నుంచీ క్రియాశీల ఉద్యమాలలో పాల్గొన్న అనుభవజ్ఞులు. సిపిఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా) అగ్రనేత. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎన్నుకోబడ్డారు. ఆయన సహచరి బి.వి.విజయలక్ష్మి గారు. ఆమె ఆయన జీవితంలోకి ప్రవేశించే నాటికే ఉద్యమ, రాజకీయ చైతన్యం ఉన్న ఇద్దరు ఉద్దండ పురుషుల మధ్య స్థిరంగా నిలదొక్కుకొని, తనను తాను వ్యక్తీకరించుకున్న తీరును విజయలక్ష్మిగారి మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే! విజయలక్ష్మి గారు.
జ. నమస్తే! కూర్చోండి గిరిజా!
ప్ర. మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. నాన్న బాగలూరు వెంకట నాయుడు. మిల్ట్రీలో ఉద్యోగం చేసేవారు. అమ్మ పేరు పద్మాలయ నాయుడమ్మ. మేము నలుగురం తోబుట్టువులం. నాకు ఇద్దరు అక్కయ్యలు. ఒక అన్నయ్య.
ప్ర. మీ పుట్టింటి నేపథ్యం చెప్పండి.
జ. మా పుట్టిల్లు హైదరాబాదు. మా అమ్మ సికింద్రాబాదు కీస్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. మా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయన పోయినప్పుడు పెద్దక్క నాలుగేళ్ళు, చిన్నక్క రెండేళ్ళు, అన్నయ్య ఏడాది వయసు వారు. నేను కడుపులో ఉన్నానని అమ్మ చెప్పేది. మా మేనమామ హైదరాబాదులోనే ఉండేవారు. ఆయన ట్రేడ్‌ యూనియన్‌లో ఉండేవారు.
ప్ర. ఓప్‌ా అవునా! అయితే మీ అమ్మగారు చాలా ధైర్యంగా మిమ్మల్ని పెంచి ఉంటారు. దయచేసి ఆమె గురించి చెప్పండి.
జ. అవును, మాకందరికీ మా అమ్మే స్ఫూర్తి. ఆమె విద్యార్థి దశ నుండే చాలా ఆక్టివ్‌. పాఠశాలలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. అక్కడినుంచే తనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని ఆమె చెప్పేవారు. నాన్న పోయాక అమ్మకు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అలా అమ్మ ఏపియస్‌ఆర్‌టిసిలో ఉద్యోగం చేసేది. మా మేనమామ ట్రేడ్‌ యూనియన్లో పనిచేసేవారని చెప్పాను కదా.. అమ్మ కూడా మహిళా వర్కర్లను ఆర్గనైజ్‌ చేసేవారు. ఆమె ప్రాగ్‌ చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక మహిళా సదస్సులో కూడా పాల్గొన్నారు. అమ్మకు ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొనేది. ఆ ధైర్యమే నాకూ వచ్చింది. అలా నాకు చిన్నప్పటి నుంచే మహిళా సమస్యల పట్ల ప్రత్యేకించి శ్రామిక మహిళా సమస్యల పట్ల అవగాహన ఏర్పడిరది.
ప్ర. 1966 లో ఏ పి య స్‌ ఆర్టీసీలో జరిగిన సమ్మె గురించి వివరించండి.
జ. అవును, ఎంప్లాయిస్‌ ఆధ్వర్యంలో ఏపీయస్‌ఆర్‌టిసిలో 1966-68 కాలంలో జరిగిన సమ్మె చారిత్రాత్మకమైంది. ఎందుకంటే ఆ సమ్మెలో ఉద్యోగులు కుటుంబాలతో పాటు పాల్గొన్నారు. మేము అప్పుడు ఆర్‌టిసి కాలనీలో ఉండేవాళ్ళం. కాలనీలో ఉండే మహిళలు, పిల్లలు అందరినీ అమ్మనే ఆర్గనైజ్‌ చేశారు. ఆ సందర్భంలో అమ్మ మీద తీవ్ర లాఠీ చార్జ్‌ చేసి, 15 రోజుల పాటు చంచల్‌గూడా జైలులో ఉంచారు.
ప్ర. మీ జనన విశేషాలు, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. 10/10/1951లో నేను పుట్టాను. నేను నాన్నను చూడలేదు. నాన్న ప్రేమ, అమ్మ ప్రేమను రెండిరటిని మా అమ్మే నాకు పంచింది. అప్పుడు మేము వి ఎస్‌ టి వెనక ఆర్‌ టి సి కాలనీలో ఉండేవాళ్ళం. ఆర్‌ టి సి వర్కర్స్‌ పిల్లల చదువు కొరకు అమ్మ ఇంట్లోనే పాఠశాల మొదలు పెట్టి, క్రమంగా దానిని అభివృద్ధి చేసింది. మేమంతా ఆ పాఠశాలలోనే చదువుకున్నాము. ప్రఖ్యాత రచయిత్రి శీలాసుభద్ర గారు ఆ పాఠశాలకు ప్రిన్స్‌పాల్‌గా పనిచేసారు. ఆ తరువాత నేను రాంనగర్‌ సెయింట్‌ పాయిస్‌ స్కూల్‌, మహబూబియా హైస్కూల్‌ నుంచి 1968లో హెచ్‌ఎస్‌ఎమ్‌ పి (హయ్యర్‌ సెకండరీ మల్టీ పర్పస్‌ ) 12వ తరగతి పూర్తిచేసి,రాం కోటి నవజీవన్‌ కళాశాల నుంచి బియసి పూర్తి చేసాను. పెళ్ళి అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో ఎంఏ, ఎంఫిల్‌, పిహెచ్‌డి పూర్తి చేసాను.
ప్ర. చిన్నప్పటి నుంచే ఉద్యమ వాతావరణంలో పెరిగిన మీకు విద్యార్థి దశ నుంచే ఉద్యమ అనుభవాలు ఉండి ఉంటాయి. ఆ వివరాలు తెలియచేస్తారా?
జ. మీరు అనుకున్నది నిజమే. నేను పాఠశాల, కళాశాల స్థాయి నుంచే ఏఐఎస్‌ఎఫ్‌(ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌)లో పని చేసాను. జై విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాను. కాలేజీలో ఉన్నప్పుడే అఖిల భారత యువజన సమాఖ్య అనుబంధంగా యువ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసాము. దానికి మొదట రాష్ట్ర కన్వీనర్‌గా తరువాత ఆలిండియా కన్వీనర్‌గా ఉన్నాను.
ప్ర. సురవరం సుధాకర్‌ రెడ్డి గారితో మీ పరిచయం ఎలా జరిగింది?
జ. ఆయన ఏఐవైఎఫ్‌ (ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌) జనరల్‌ సెక్రటరీ, తరువాత ప్రసిడెంట్‌గా ఉన్నప్పుడు ఢల్లీిలో ఉండేవారు. నేనూ యువ మహిళా విభాగం పనుల మీద తరచూ ఢల్లీి వెళ్ళేదాన్ని. అలా పరిచయం పెరిగి స్నేహంగా మారింది.
ప్ర. మీ వివాహం ఎప్పుడు? ఎలా జరిగింది?
జ. 1974 ఫిబ్రవరి 19న మా వివాహం జరిగింది. నిరాడంబరంగా వేదిక మీద దండలు మార్చుకున్నాము. మాది కులాంతర వివాహమే అయినా పార్టీ పెద్దలు ప్రతిపాదించారు.
ప్ర. మీ అత్తింటి వివరాలు
జ. వాళ్ళింట్లో ఆయనే పెద్దవారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. మా పెళ్లి జరిగే నాటికే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయి పిల్లలున్నారు. అత్తమామలు.. వెంకటరామారెడ్డి, ఈశ్వరమ్మ. మా అత్తగారిది కొల్లాపురం దగ్గర కొండ్రాపుపల్లె. మామగారిది మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రస్తుత గద్వాల్‌ జిల్లా ఆలంపురం గుడికి దగ్గరలోని కంచుపాడు గ్రామం. అది కర్నూల్‌ బార్డర్‌. ఆయన విద్యాభ్యాసం అంతా కర్నూల్‌ లోనే జరిగింది. ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు, రచయిత, ఉద్యమశీలి సురవరం ప్రతాపరెడ్డిగారు స్వయాన ఆయనకు పెద్దనాన్న.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి?
జ. మాకు ఇద్దరు కుమారులు. 1975లో మొదటి బాబు, 1980లో రెండోఅబాబు పుట్టారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఆయనకు ఒక పాప, ఒక బాబు. చిన్న బాబు ఇదే అపార్ట్మెంటులో ఉంటాడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరివీ కులాంతర వివాహాలే అయినా చిన్నోడిది ప్రేమ వివాహం కూడా…
ప్ర. మీరేమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ. పేరుకు భూస్వామ్య కుటుంబాలే అయినా మహబూబ్‌నగర్‌ జిల్లా కరవు ప్రాంతం కావడం వల్ల వ్యవసాయం పెద్దగా ఉండేది కాదు. మా పెళ్ళి నాటికే ఉమ్మడి కుటుంబం. ఇంటికి పెద్ద కోడలిని కావడం వలన చాలా బాధ్యతలు ఉండేవి. మా మరిది పిల్లల బాధ్యత కూడా మాదే అయింది. అందుకే బోధనా రంగంలో పనిచేయాలనే కోరిక ఉన్నా అనుకోకుండా వచ్చిన బ్యాంకు ఉద్యోగంలో వెంటనే చేరి పోయాను.
ప్ర. మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి?
జ. 1977లో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగంలో చేరాను. బ్యాంకు ఉద్యోగులకు ఊపిరులిచ్చిన ఏఐబిఇఎనా ప్రధాన ట్రేడ్‌ యూనియన్‌ రంగం. సర్టిఫైడ్‌ అసోసియేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ బ్యాంకింగ్‌ పరీక్షలు రాసి, బ్యాంక్‌ మేనేజర్‌ స్థాయి దాకా ఎదిగాను. ఏఐబిఓఏ (ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌) ఆర్గనైజ్డ్‌ సెక్రటరీగా పని చేసాను. ఏ పీ ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాను.
ప్ర. స్వచ్ఛంద పదవీ విరమణ పొందడానికి గల కారణం?
జ. 2001 ఫిబ్రవరిలో నేను స్వచ్ఛంద పదవీ విరమణ పొందాను. అప్పటికి నాకు పన్నెండేళ్ల సర్వీసు మిగిలి ఉంది. కానీ అప్పటికే మా పిల్లలు ఇద్దరూ మాస్టర్స్‌ పూర్తి చేసారు. విఆర్‌ఎస్‌ అవకాశం వచ్చింది. వాళ్ళ ప్రోత్సాహంతో పార్టీలో పూర్తి సమయం పని చేయవచ్చుననే ఉద్దేశంతో విఆర్‌ఎస్‌ తీసుకొన్నాను.
ప్ర. మీరు చేసిన పనుల గురించి చెప్పండి.
జ. భారత జాతీయ మహిళా సమాఖ్యలో (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), ఏఐటియుసి (ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) రాష్ట్రస్థాయిలో మొదలు పెట్టి జాతీయ స్థాయి వరకు వెళ్ళాను. ఏఐటియుసిలో ఉన్న శ్రామిక మహిళా ఫోరంలో రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేస్తూ .. బీడీ కార్మికులు, అంగన్‌ వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులతో పని చేసాను. ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూలో, ఎఐటియుసిలో జాతీయ కార్యదర్శిగా సేవలందించగలిగాను.
ప్ర. బీడీ కార్మికుల మౌలిక సమస్యలు మీ దృష్టికి ఏం వచ్చాయి?
జ. ప్రధానంగా బీడీ పరిశ్రమ గృహ పరిశ్రమ. కుటుంబం మొత్తం కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు. కానీ వాళ్ళ శ్రమకు తగిన ఫలితం అందదు. పొగాకుతో పని కాబట్టి శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారిన కూడా పడతారు. ఉత్తర తెలంగాణాలో బీడీ పరిశ్రమ రెండు మూడు నియోజక వర్గాలలో ఉంది. అంటే నా ఉద్దేశం రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నా, వాళ్ళ జీవితాలలో మార్పేమీ ఉండదు.
ప్ర. ఆషా వర్కర్ల సమస్యలు ఏమిటి?
జ. ఆషా వర్కర్లకు ప్రత్యేకమైన పనివేళలు ఉండవు. అవసరమైతే 24గంటలూ అందుబాటులో ఉండాలి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు లేకుండా వాళ్లే గర్భిణీ స్త్రీలను, పిల్లలను, వృద్ధులను దవాఖానాకు తీసుక వెళ్ళవలసి వస్తుంది. ప్రభుత్వం వాళ్ళకు ప్రాముఖ్యతను బాధ్యతను ఇచ్చింది. కానీ వాళ్ళకే ప్రాముఖ్యత లేదు. ఇవన్నీ సంస్థాగతమైన సమస్యలు.
ప్ర. అంగన్‌వాడీ సమస్యల గురించి చెప్పండి.
జ. అంగన్‌వాడీలకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. 3 నుంచి 6 గ్రామాలలో ప్రీ స్కూళ్ళు, సర్వేలు చేయాలి. పౌర సమాచారం ఏదైనా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది. అధికారులు, రాజకీయ నాయకుల పెత్తనం ఉంటుంది. ఇవన్నీ కూడా సంస్థాగతమైన సమస్యలే కోవిడ్‌ సమయంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు ప్రాణాలకు తెగించి చేసిన కృషి చాలా గొప్పది.
ప్ర. అంగన్‌వాడీలతో పని చేసే క్రమంలో మీరు చేసిన ఒకటి, రెండు పోరాటాలు చెప్పండి.
జ. ఆదిలాబాద్‌ జిల్లాలోని బోధ్‌ మండలంలో అవినీతి జరిగి, రెండేళ్లపాటు జీతాలు రాకపోతే మరో రెండేళ్లు పోరాటం చేసి ఇప్పించాము. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 ఏళ్ళ క్రితం ఇన్సూరెన్స్‌ కట్‌ చేసి, జమ కట్టలేదని తెలిసి, పోరాటం చేసి అది వచ్చేలా చూసాం. హైదరాబాదులో సిడిపిఓ ఇంట్లో (చైల్డ్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌) చిన్న పిల్లను పనికి పెట్టినందుకు అంగన్‌వాడీ టీచర్ను సస్పెండ్‌ చేసిన సంఘటనలో పోరాటం చేసాం. అంగన్‌వాడి వర్కర్లకు 1500 రూపాయల జీతం నుంచి నేడు పొందుతున్న 13వేల జీతం వరకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో అనేక పోరాటాలు చేసి, చాలాసార్లు అరెస్టు కావడం జరిగింది.
ప్ర. మీరు నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలు ఏమిటి?
జ. ఏ ఐ టి యు సి అఫిలియేటెడ్‌ సంస్థ అయిన ఏ ఐ ఏ డబ్ల్యూ ఎఫ్‌ (ఆల్‌ ఇండియా అంగన్‌ వాడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌) కు జనరల్‌ సెక్రటరీగా, ఏఐఎండిఎంబిడబ్ల్యుఎఫ్‌ (ఆల్‌ ఇండియా మధ్యాహ్న భోజన వర్కర్స్‌ ఫెడరేషన్‌)కు ప్రసిడెంట్‌గా ఉన్నాను. జాతీయ ఆశా వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎడబ్ల్యు) ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సి ఆర్‌ ఫౌండేషన్‌ ఎన్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సి గ్రంథాలయానికి బాధ్యురాలిగా ఉన్నాను. పుస్తకాలను డిజిటలైజ్‌ చేస్తున్నాం. 50 వేలకు పైగా ఉన్న పుస్తకాలను జాగ్రత్తగా చూస్తున్నాం. నీలం రాజశేఖరరెడ్డి రీసర్చ్‌ సెంటర్‌తో కలిసి చుట్టుపక్కల పాఠశాలల పిల్లలకు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఉన్న మహిళా సంక్షేమ కేంద్రం నుంచి మహిళలకు కంప్యూటర్‌, బ్యూటీషియన్‌, టైలరింగ్‌ శిక్షణా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తుంటాం.
ప్ర. చివరగా.. ఈ తరం ఆడపిల్లలకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. నేటి తరానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉంది. సద్వినియోగం చేసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. సమాజంలో మనకు కూడా చాలా బాధ్యతలున్నాయి. కేవలం ఇంటికి పరిమితం కావడమే క్రమ శిక్షణ అనుకోవద్దు. అవకాశం అంది పుచ్చుకోలేని వారికి సహాయం చేయడానికి, వారిలో చైతన్యం పెంచడానికి కృషి చేద్దాం. మతం పేరుతో జరిగే దుర్మార్గాలను ప్రశ్నించండి. జనాభాలో సగ భాగమైన మనం అభివృద్ధిలో సగ భాగం కావాలి. మనను మనం నిరూపంచుకోవాలి. కృషి తప్పదు.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.