అనువాదం: సుధామయి సత్తెనపల్లి
ఇళ్ళల్లో పనులుచేసే వలసదారైన అనితా రాథోడ్ హైదరాబాద్ నగరంలోని వివిధ ఇళ్ళల్లో శుభ్రం చేయటం, కడగటం, తుడవటం వంటి పనులు చేస్తారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేసే ఆమె రోజు ఉదయాన్నే ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తుంది.
‘‘మా నాన్న నన్ను చదువుకోనిచ్చి వుంటే నేనొక పోలీస్ అధికారిని అయ్యుండేదాన్ని,’’ గుట్టగా పడివున్న అంట్ల గిన్నెలు, సబ్బు నురగ తేలుతోన్న సింకు వైపు తిరగబోతూ నిరాశగా చెప్పారామె. అప్పుడు సమయం ఉదయం 9 గంటలవుతోంది. ఇప్పుడామె త్వరత్వరగా ఆ గేటెడ్ కమ్యూనిటీలోని మరో అపార్ట్‌మెంటుకు పరుగెత్తాలి. తాను ఇంటి పనిమనిషిగా పనిచేసే ఆ కాలనీలో అందరూ అనితా దీదీ అని పిలిచే ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ముందు ఇంకా ఐదు ఇళ్ళల్లో పనిచేయాల్సి వుంది. వాయవ్య హైదరాబాద్‌్‌లో ఆమె పనిచేసే ఉన్నతస్థాయి శివారు ప్రాంతమైన నల్లగండ్ల నుండి పొరుగునే ఉన్న సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో ఉండే తన ఇంటికి వెళ్ళాలంటే ఆమె 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇప్పటికే నలుగురు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ళ అనితా రాథోడ్ తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న లంబాడీ సముదాయానికి చెందినవారు. దేశంలో వలస కార్మికులను ఆకర్షించే ఐదు అగ్ర నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ నగరంలోని గేటేడ్ కమ్యూనిటీలలో పనిచేసే అనేకమంది వలస కార్మికులలో అనిత కూడా ఒకరు. ఎక్కవ గంటలపాటు పనిచేసే ఆమె చల్లగిద్ద తాండాలో తన ఉమ్మడి కుటుంబాన్నీ, సొంత ఊరైన మైనేలీలోని తల్లిదండ్రుల వద్ద తన పిల్లలనూ, చివరకు తన కలలను కూడా వదిలిపెట్టి ఇక్కడకు రావలసివచ్చింది.
పొద్దున్నే 4 గంటలకు లేచి వంటచేసి, బట్టలుతికి, ఇంటిని శుభ్రం చేయటంతో ఆమె రోజు మొదలవుతుంది. ఉదయం ఐదున్నరకల్లా దగ్గరలోని రంగారెడ్డి జిల్లా లింగంపల్లి వెళ్ళటానికి ఆమె బస్ ఎక్కుతారు. అక్కడి నుంచి నల్లగుండ్లలోని గేటెడ్ కమ్యూనిటీకి 6.30కల్లా చేరటానికి రూ.20 ఇచ్చి ఆటో ఎక్కుతారు. తెలంగాణా ప్రభుత్వం 2023లో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించటంతో, ఆమెకు తన పని ప్రదేశానికి చేరటానికి అయ్యే ప్రయాణ ఖర్చులో కొంత భారం తగ్గింది.
నల్లగండ్లలోని అపర్ణ సరోవర్ అనే గేటెడ్ కమ్యూనిటిలో ఆమె ఆరు అపార్ట్‌మెంట్లలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారు. పనులు ప్రారంభించిన తొమ్మిది గంటల తర్వాత, మధ్యాహ్నం మూడు గంటలు అవుతుండగా కాలనీలో అనేక ఇళ్ళను శుభ్రం చేసిన ఆమె, తన కుటుంబానికి రాత్రి భోజనం తయారుచేయటానికీ, ఇతర ఇంటి పనులను పూర్తిచేయటానికీ తిరుగు ప్రయాణాన్ని మొదలుపెడతారు. ఆమెకు గుర్తున్నంత వరకూ అమె భర్తకు ఒక స్థిరమైన ఉద్యోగం లేదు. ‘‘ఇంటి అద్దె చెల్లించటంలో గానీ, పిల్లలు ఇంటికి వచ్చినపుడు వారి బాగోగులు చూసుకోవటంలో గానీ, ఇంటిని నిర్వహించటంలో గానీ అతను ఏ సహాయం చేయడు,’’ అన్నారామె.
ఆమె నివాసముండే పటాన్‌చెరులోని శుభ్రమైన, ఇరుగ్గా ఉన్న సందు మలుపులగుండా మేం ఆమెను అనుసరిస్తుండగా, ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఒక విశాలమైన బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దాటి, వారపు కూరగాయల సంతను దాటి, బట్టలు, మిఠాయిలు, ఇంకా ఎన్నిటినో అమ్ముతోన్న చిన్న బండ్లను దాటి, ఒక మసీదు మినారును దాటి, ఒక నిశ్శబ్దంగా ఉన్న ఇళ్ళ సముదాయాన్ని దాటి వెళ్తుండగా ఆ వీధి విశాలంగానూ, రద్దీగానూ మారిపోతోంది.
పక్కా గోడలు, స్నానాల గది ఉన్న ఆమె ఒంటిగది ఇంటికి అనిత నెలకు రూ. 5,000 అద్దె చెల్లిస్తారు. నీటికీ, విద్యుత్తుకూ అదనంగా చెల్లించాల్సి వుంటుంది. ఆమె ఇంటి బయట ఉన్న ఒకే ఒక నీటి కొళాయి నుండి రెండు రోజులకోసారి తాగు నీరు వస్తుంటాయి. అప్పుడప్పుడూ ఆమె భర్త కొన్ని పాత్రలలో నీళ్ళు పట్టి నిలవ చేస్తాడు. ఇంటికి కొంచం దూరంలో ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఒక పెద్ద చెత్తకుప్ప ఉంది. ‘‘జనం చెత్తను ఇక్కడ విసిరి పారేస్తుంటారుÑ దీన్ని తీసుకువెళ్ళేందుకు నెలకోసారి ఒక మునిసిపాలిటీ ట్రక్కు వస్తుంది,’’ చెప్పారు అనిత. నెలకోసారి చెత్త తీసుకువెళ్ళినందుకు ఆమె రూ. 100 చెల్లిస్తారు. ఆమె ప్రతినెలా సంపాదించే సుమారు రూ. 25,000లో మూడిరట రెండు వంతులు ఇల్లు గడపటానికే సరిపోతుంది.
‘‘నా చిన్నతనం నుండి నేను చూసింది గొడ్డు చాకిరీ తప్ప మరోటి లేదు,’’ తాను 5వ తరగతిలో ఉండగా తండ్రి తనను ఏ విధంగా గొడ్లను కాయటానికి పంపించేవాడో గుర్తుచేసుకుంటూ అన్నారామె. ఆమె తమ్ముళ్ళు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకొంటున్నప్పటికీ, ఆమె మాత్రం బలవంతంగా బడి మానేయాల్సి వచ్చింది. ‘‘సబ్ చల్తే జాతేతో ఘర్ మేఁ కామ్ కౌన్ కర్తే బోల్‌కే మారే మేరేకు (అందరూ బడికి వెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు – అంటూ మా నాన్న నన్ను కొట్టేవాడు),’’ అరచేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని, ఇబ్బందిగా నవ్వుతూ చెప్పారామె. ‘‘నాకు తొమ్మిదేళ్ళ వయసప్పటి నుంచి బర్రెలను మేతకు తీసుకువెళ్ళేదాన్ని. వాటినెక్కి స్వారీ చేసేదాన్ని,’’ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెను చెరకు పొలాల్లో పనికి పంపించారు. ‘‘ఈ పొలాల్లో పనిచేసే పిల్లలు ఒకటి లేదా రెండు నెలలకు 10,000-12,000 రూపాయలు సంపాదించేవారంతే,’’ అనిత తమ్ముడు వీనా చెప్పారు. ‘‘చెరకు నరికే పని చాలా కష్టంతో కూడుకున్నది, దానిలో ఉండే ప్రమాదాలు దానికున్నాయి,’’ అన్నారతను. ‘‘మేం రోజుకు 15 గంటలు పనిచేసే వాళ్ళం. చీకటి పడిన తర్వాత కూడా కొడవలితో చెరకును నరికి వాటిని మోపులుగా కట్టేవాళ్ళం. తర్వాత ఆ బరువైన మోపులను ట్రుక్కులోకి ఎక్కించడానికి, పొలాల నుండి మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం,’’ అనిత చెప్పారు. నేను సాంతా (చెరకు దంట్లు)ను కోసేటప్పుడు నా కాళ్ళూ చేతులంతా గీసుకుపోయేవి,’’ తన కాళ్ళూచేతుల వైపు చూపిస్తూ చెప్పారామె. ‘‘అప్పట్లో ఫస్ట్-ఎయిడ్ కిట్లు
ఉండేవి కావు. ఎక్కడైనా తెగినప్పుడు వాళ్ళు చెరకురసాన్ని ఆ గాయం మీద పోయటమో, లేదా వాళ్ళు వేసుకున్న దుస్తుల నుండి త్వరత్వరగా ఒక ముక్కను చింపి కట్టు కట్టడమో చేసేవాళ్ళు. ఇంజెక్షన్స్ లాంటివేవీ ఉండేవి కాదు,’’ అనిత తమ్ముడు చెప్పారు.
‘‘నేనొక క్రికెటర్‌ని కావాలనుకున్నాను,’’ అన్నారు వీనా. ‘‘నేను బాగా ఆడేవాడిని. హైదరాబాద్‌లో లీగుల్లో కూడా ఆడాను. మా నాన్న నన్ను సపోర్ట్ చేసేవాడు, నేను సెలెక్ట్ కూడా అయ్యాను. కానీ వాళ్ళు నన్ను 10 లక్షల రూపాయలు అడగటంతో అదంతా ముగిసిపోయింది.’’ అయితే అతనితో పాటు అతని సోదరులంతా అనిత, ఆమె చెల్లెళ్ళలా కాకుండా చదువుకోగలిగారు. అనితకు పెళ్ళి కుదిరే నాటికి ఆమెకు మహా ఉంటే 12 ఏళ్ళుంటాయి. ‘‘మా పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళయిపోతాయి, ఆడపిల్లలకైతే 12 లేదా 13 ఏళ్ళకు, మొగపిల్లలకు 16 లేదా 17 ఏళ్ళకు,’’ చెప్పారామె. ‘‘నాకింకా చదవుకోవాలని ఉండేది, కానీ మా పెద్దవాళ్ళ మాట వినాల్సివచ్చింది. మనమెప్పుడూ పెద్దవాళ్ళ మాట వినాలి, కదా? నాకు పెళ్ళి అయినప్పుడు, ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయాను!’’ నవ్వుతూ చెప్పారామె. తన పెళ్ళిలో తండ్రి తన భర్తకు రూ.14,000, తనకు రూ.30,000 విలువైన బంగారం, ఇతర ఆభరణాలు ఇచ్చినట్లు అనితకు గుర్తుంది. ఆమె బంగారాన్నంతా ఆమె అత్తమామలు అమ్మేశారు. వివాహం తర్వాత కూడా ఆమె పొలం పనులు చేస్తూనే ఉంది. ‘‘ఆపరేషన్ ద్వారా నా మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 20 రోజులకే, నన్ను చెరకు కోత మొదలుపెట్టమని అడిగారు,’’ అని ఆమె చెప్పారు. ‘‘నేను చాలామంది పిల్లలను కనాల్సి వచ్చింది, ఎందుకంటే లంబాడీ స్త్రీకి కొడుకు పుట్టకపోతే, ఆమె భర్త ఆమెను వదిలేస్తాడు.’’ తన సముదాయంలో మహిళలపై హింస సర్వ సాధారణమని ఆమె అన్నారు. తన మొదటి భార్య పైనా, రెండవ భార్య అయిన తన తల్లి పైనా తన తండ్రి సాగించిన దాష్టీకం ఆమెకింకా గుర్తుంది. ‘‘మా నాన్న ఒక్కోసారి విపరీతంగా తాగేవాడు. ఆయన రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాడు. ఆయన తన మొదటి భార్యను ఎంతగా కొట్టేవాడంటే, ఆ బాధ భరించలేక ఆమె ఆయన దగ్గర నుంచి పారిపోయింది. ఆయన రెండవ భార్య అయిన మా అమ్మకు ఆయన ఎంత కొట్టినా ఆయన్ను విడిచి పెట్టడం ఆమెకు కష్టమయింది.’’
అనిత భర్త కూడా భార్య పట్ల వ్యవహరించటంలో భిన్నంగా ఏమీ ఉండడు. ‘‘అతను నాకు డబ్బు కానీ, ఇతరత్రా ఏమీ ఇవ్వడు. కనీసం పిల్లల కోసమైనా ఏమైనా తెమ్మని అడిగితే నన్ను కొట్టటం మొదలెడతాడు,’’ అన్నారామె. భర్త నుంచి సహాయమేమీ లేకుండా నలుగురు పిల్లల్ని పెంచటం ఆమెకు చాలా కష్టమని తేలిపోయింది. కొన్ని నెలల క్రితం అనితకు గుండెలో సమస్య
ఉన్న తన చిన్న కూతురి చికిత్స కోసం డబ్బు అవసరమైంది. డాక్టర్ ఆదేశించిన ప్రకారం స్కానింగ్ తీయించటం కోసం నారాయణఖేడ్ నుండి కర్ణాటకలోని బీదర్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి ఖర్చులను భరించడం కోసమే ఆమె ప్రతి నెలా రూ.5,000ను చిట్టీలు కట్టడం ప్రారంభించారు. రెండు సంవత్సరాల డిపాజిట్ కట్టే వ్యవధి ముగిసిన తర్వాత, ఆమెకు రూ.1,05,000, వడ్డీగా మరో రూ.15,000 వస్తుందని ఆమెను నమ్మించారు. ఇళ్ళల్లో పనులు చేయటం కంటే, చెరకు పొలాల్లో పనిచేయటమే సులువని ఆమె భావిస్తారు.
‘‘వాళ్ళు మాకు అడ్వాన్స్‌గా డబ్బులిచ్చేవాళ్ళు, ఒక లక్ష రూపాయలకు మించి కూడా. అది పిల్లలు జబ్బు పడటం వంటి అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం ఉపయోగపడేవి,’’ చెప్పారామె. తిరిగి ఆ పనికే పోవాలని అనిత ఒకోసారి అనుకుంటుంటారు. ‘‘సాంతా కాట్‌నే మేఁ కామ్ రహతా, మగర్ పైసా భీ రహ్తా (చెరకు నరకటం చాలా పెద్ద పనే, కానీ అందులో డబ్బు కూడా బాగా ఉంటుంది),’’ అన్నారామె. బహుశా ఏదో ఒక రోజున తన గ్రామానికి తిరిగి వెళ్ళే రోజు వచ్చే వరకూ, అనిత ఉదయాన్నే బస్సు, ఆటో ఎక్కి హైదరాబాద్‌లోని ఆ ఉన్నతస్థాయి పరిసరాలకు వెళుతూనే ఉంటారు-మరో దీర్ఘమైన పని దినాన బట్టలు ఉతకడం కోసం, ఇళ్ళు తుడవటం కోసం, శుభ్రం చేయడం కోసం.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/te/article/i-could-ve-become-a-police-officer-officer-te) జూన్ 13, 2025 లో మొదట ప్రచురితమైనది.)
