అనేక నేనుల వైపు నుండి నాకు నేనుగా ఆలోచనలోకి నెట్టుకోబడే సినిమా.. – ఇరవైమూడు – రఘు మందాటి

మారే మనిషి, క్షమించలేని సమాజం
To forgive is to set a prisoner free and discover that the prisoner was you. Lewis B. Smedes
చిలకలూరిపేట బస్సు దహనం. మన లోపల ఏదో ఒక అసహనం చీలకలికిలా లేచిపోతుంది. ఎందుకంటే ఈ ఘటనలో 23 మంది అమాయకులు బలైపోతారు. ఆ శవాల వైపు నుండి నిలబడి మనం నేరం చేసిన వాళ్ల ముఖాల్ని కోపంతో చూస్తాం. వారికి తిరిగి బతకే హక్కు ఉందా? అని ఊగిపోతాం.

అయితే ఇదే నేపథ్యంగా తెరకెక్కిన ‘‘23’’ అనే చిత్రం… మన అభిప్రాయాలను పొక్కిలి చేస్తుంది. ఇది ఒక నేరస్తుని మార్పు గురించిన కథ కాదు. ఇది మనలోని దోషాలను చూస్తూ… క్షమించలేని మన మనసును అద్దంలో చూపించే ప్రయత్నం.
మనిషి మారగలడా? ఇద్దరు యువకులు సాగర్‌, దాస్‌. వాళ్ళు పొరపాట్లు చేస్తారు. అణచివేతలు, అసమానతలు, ఆగ్రహం, క్రూరత… ఇవన్నీ కలసి ఒక నేరానికి కారణమవుతాయి. 23 మంది చనిపోతారు. వాళ్ళు జైలుకెళ్తారు. ఆ తర్వాత?
అక్కడే మొదలవుతుంది అసలు కథ. జైలు గదుల మధ్య, ఒంటరితనపు మూలలలో… వాళ్లళ్ళో మార్పు మొదలవుతుంది. స్వామి వివేకానంద అన్నట్టు – Each soul is potentially divine. The goal is to manifest this divinity within.
ఈ ఇద్దరి లోపల ఉన్న మానవత్వం తిరిగి మొలకెత్తుతుంది. ఒకరు చదవడం మొదలుపెడతారు. ఇంకొకరు చదివిన వాడిని చూస్తూ లోతైన తత్వాన్ని తెలుసుకుంటాడు. ఆ ఇద్దరు అన్యాయాన్ని అర్థం చేసుకుంటారు. తమ నేరాన్ని, బాధితుల విషాదాన్ని గ్రహిస్తారు. వాళ్ళ మార్పు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనం కూడా అంతర్లీనంగా ఒప్పుకుంటాం, వాళ్లు మారారు అని.
అప్పుడే అక్కడే ఒక ప్రశ్న…
విక్టిమ్స్‌ వాయిస్‌
ఇన్ని కుటుంబాలను నాశనం చేసిన నీ పరివర్తనను నేను అంగీకరించి, నీకు విముక్తి ఎందుకు కలిగించాలి?
ఒక్క వాక్యం ఒకే ఒక్క లైన్‌. కానీ మనలో గుళికల్ని పేల్చుతుంది.
క్షమించగలమా?
సహించగలమా?
మనం ప్రేమిస్తామంటాం, మార్పు విశ్వసిస్తామంటాం కానీ అది మనపై కాదు, మన కన్నవాళ్లపై కాదు, మన బాధలపై కాదు.
అక్కడే ఈ సినిమా మన మెదడును కాకుండా మన మనసును మెలిపెడుతుంది.
ప్రేమ అనేది ఒక మృదు మాధుర్యం కాదని, అది చాలా సార్లు బలమైన కష్టాలతో నిండి ఉంటుందని. మరొకవైపు సమాజం, కులం, ఆధిపత్యం వలయాల్లో చిక్కుకుని ఎలా మానవులు పీడితులవుతారో ఈ చిత్రం చూపిస్తుంది. ఇది మన సమాజపు ఆడపిల్లలకి, యువతలకు వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందో చాటిచెప్పే అద్దం.
చివర్లో ఎక్కడో బుద్ధుడు కనిపిస్తాడు. అక్కడ ఆ సన్నివేశంలో ఎలాంటి గొప్ప మాటలు లేకున్నా బుద్ధుడు చెప్పిన ఒక గొప్ప మాట గుర్తుకు వస్తుంది. ‘‘మన ఆలోచనలు మారితే, మన జీవితం మారుతుంది.’’
ఈ సినిమా కూడా మన హృదయాలను, మన ఆలోచనలను మార్చాలని ప్రయత్నిస్తుంది. నేరస్థుడి మార్పును అంగీకరించడం, బాధితుల న్యాయం కోసం సత్యాన్ని కోరడం మధ్య ఒక సన్నని సరిహద్దు ఉంది.
‘‘క్షమించగలగడం గొప్ప మాట కాదు, అది స్వతహాగా బలమైన మనసు లక్షణం.’’ – మహాత్మా గాంధీ. కానీ, క్షమించే ముందు బాధితుల గుండెల్లో నెత్తురులెత్తే న్యాయం అవసరం. ఆ న్యాయం లేకపోతే క్షమించడమూ కష్టమే. ఒక గొప్ప దర్శకుడికి అనేక మార్గాలుంటాయి. కథను ఒక కోణం నుంచి చెప్పొచ్చు. మనకు పర్స్పెక్టివ్‌ ఇస్తూ మనల్ని ఓ వైపు నడిపించొచ్చు. కానీ ఈ దర్శకుడు అలా చేయలేదు. The test of a first rate intelligence is the ability to hold two opposing ideas in mind at the same time”. F. Scott Fitzgerald.

ఈ సినిమా రెండు కాదు… ఎన్నో భిన్న కోణాల నుంచి మనం చూడాల్సిన దృశ్యాల్నే కాదు, భావాల్ని కూడా చూపిస్తుంది. ప్రతి పాత్ర ఒక సందేహం. ప్రతి మార్పు ఒక ప్రశ్న. ప్రతి భావోద్వేగం ఒక బాధను మోయడం. ఈ సినిమా మనం కేవలం ఒక వైపు మాత్రమే చూసి అర్ధం చేసుకోకూడదని, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితిలో లోతైన సత్యం ఉంటుంది అని. మనల్ని ఆలోచనలో పడేసి ఎవరికి వారు నన్ను నేను పరీక్షించుకోగలనా, నేను నిజంగా నిష్పక్షపాతుడనా? అని ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్తుంది. ‘‘ప్రేమ అంటే కేవలం అందరికి మంచి చేయడం కాదు, సమాజంలోని కష్టాలు, అన్యాయాలు కూడా అర్థం చేసుకోవడం.’’ ఇక్కడ మోక్షాన్ని వెతికే స్నేహాన్ని చూస్తాం.
సాగర్‌, దాస్‌ మధ్య ఉన్న బంధం సినిమా హృదయం. మొదట ఇద్దరూ చిన్నపిల్లల్లా ఉన్నా, కాలక్రమంలో వాళ్ల చర్చలు, సత్యాన్వేషణ, సంఘర్షణ అన్నీ ఒక ఆధ్యాత్మిక బంధంగా మారతాయి. బ్రహ్మాండమైన బాంధవ్యాన్ని మనం చూసేదాకా గుర్తించం కూడా. జైలు గోడల మధ్య చిగురించిన ఆశ ప్రిజన్‌ రిఫార్మ్స్‌ సన్నివేశాలు ఈ చిత్రానికి గుండె. ఓ చిన్న కిటికీ తెరుచుకొని, అక్కడి నుంచి వెలుతురు లోపలికి రావడం అనిపిస్తుంది. మహాత్మా గాంధీ అన్నట్టు “The weak can ever forgive. Forgiveness is the attribute of the strong”. ఈ సినిమా శక్తివంతమైన మనుషుల గురించి కాదు… శక్తివంతమైన మానవత్వం గురించి. చివరికి మనిషి క్షమించగలడా? మనసు అంగీకరించగలదా?
అల్బర్ట్‌ ఐన్‌స్టైన్‌ అన్నట్టు “Problems cannot be solved at the same level of thinking that created them” ఈ చిత్రం ఒకవైపు మృదు భావాలతో మానవత్వాన్ని కాపాడుతుంది, మరోవైపు సమాజంలోని అసమానతలు, కులపరమైన ప్రేరణలు, అధికారం వాడుకలను అలాగే అందులో ప్రేమ, బాధ, న్యాయం అన్నీ ఒకే తెరపై కలిసి మన మనసుకు ప్రశ్నలు వేస్తాయి. ఈ సినిమా మనకి సమాధానాలు ఇవ్వదు. కానీ మనలో ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ఇది ఒక వాదన కాదు – ఒక సాధన. మన లోపల న్యాయం అనే భావన ఎంత బలంగా ఉందో పరీక్షించే క్షణం. ఈ సినిమా మన నరాల్లోకి ప్రవేశించి, మెల్లగా గుండెను తడిపేస్తుంది. కథ ముగిసినా… అందులోని అనుమానాలు, ఆ క్షమించలేని బాధలు, అర్థం చేసుకోవాల్సిన మార్పు ఇవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన మధ్యలో ఒక ప్రశాంతమైన
ఉదయాన్ని మొదలుపెడుతుంది. ఒక జ్ఞాపకం కాదు – ఒక పునర్జన్మలా అనిపించే ఆలోచన.
‘‘ఇరవై మూడు’’ నేరం నుండి మార్పుకు, ద్వేషం నుండి దయకు, శిక్ష నుండి శాంతికి ప్రయాణం. ఇది నేరస్థుని గురించి కాదు, మన మనసుల మార్పు గురించి. ఇది ఒక సినిమాగా మొదలై… మన విలువల్ని ప్రశ్నించే దార్శనిక యాత్రగా మారుతుంది. చివరికి మనం ఎప్పటికీ మర్చిపోలేని భావన ఇదే. క్షమించడమంటే తప్పు మర్చిపోవడం కాదు, మన హృదయానికి శాంతిని అనుమతించడమే. ఈ సినిమా మనకు ఎదుటి వ్యక్తిని కాకుండా… మనల్ని మనమే క్షమించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. మానవత్వం ఓ రహదారి అయితే, ఈ సినిమా ఆ దారిలో మొదటి అడుగులా ఉంటుంది. ఎందుకంటే… నిజమైన న్యాయం అంటే శిక్ష కాదు మార్పు. నిజమైన ప్రేమ అంటే దయ కాదు అర్థం చేసుకోవడం. నిజమైన సినిమా అంటే కథ కాదు మనసుకు కలవరం కలిగించే అనుభవం.
అందుకే ‘‘ఇరవైమూడు’’ మన లోపల మెలిక వేసే ఓ మౌన ఘోష. మన హృదయ స్పందనాల నిజం.

Share
This entry was posted in Uncategorized, సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.