76 సంవత్సరాల వయసులో నమ్మిన విలువలు, ఆదర్శాలు, ఉద్యమాల కోసం నిశ్శబ్దంగా జీవిత సహచరుడితో కలిసి ఆమె ఇంకా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ జీవన పయనంలో పదిహేనేళ్లకు (జైలు, ప్రవాసము) పైగా జైలు నిర్బంధంలోనే గడిచిపోయినా ఏనాడూ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. 78 ఏళ్ళ వయసులో జీవిత సహచరుడుని జైలులో నిర్బంధిస్తే … బలహీనమైన వృక్షం లాగా ఒరిగి పోలేదు సరికదా పై పెచ్చు ప్రభుత్వంతో హైకోర్టులో, సుప్రీం కోర్టులో పోరాడారు.
వృద్ధాప్యపు ఒంటరితనాన్ని సైతం ఏకాంతంగా మలచుకున్న జీవన చేతనా సౌందర్యం ఆమెది. ఆమే హేమలత. విప్లవకవి పెండ్యాల వరవరరావు జీవన సహచరి. సృజన పత్రిక, విరసం ఆవిర్భావం, నిషేధాలు, విప్లవ రాజకీయ విశ్వాసాలు, నిర్బంధాలు, ప్రాణభయాలు, ప్రవాసాలు… ఇదీ వాళ్ళ జీవన సాహచర్యం. 85 సంవత్సరాల వయసులో జీవిత సహచరుడిని ముంబై నగరంలో స్వచ్ఛంద గృహనిర్బంధంలో ఉంచడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భాష కాని భాషా రాష్ట్రంలో ఈ వయసులో తాము ఉండడం ఒంటరి తనం కంటే నిర్బంధంగా ఉందని, ఆ మహానగర జీవితం ఒంటరి ద్వీపం లాగుందని తన అంతరంగలోని ఆవేదన, అసంతృప్తితో పాటు, భవిష్యత్తు మీద ఆశను ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే హేమక్క! బాగున్నారా?
జ. నమస్తే గిరిజా! రా! కూర్చో! బాగున్నాను.
ప్ర. మీ జన్మ రహస్యం ఏదో విన్నాను. దాని గురించి వివరంగా చెప్పండి.
జ. రహస్యం ఏముంది? అన్నీ బహిరంగమే… మా అమ్మ, బాపులకు వయసులో 15 యేళ్ళు తేడా ఉంది. చాలా రోజులు పిల్లలు పుట్టలేదని రంధి పడ్డారు. అమ్మ పూజలు చేసేది, మొక్కులు మొక్కేది. సంతానం కొరకు చిలుపూరు వెంకటేశ్వరునికి గండ దీపం చేసిందంట. ఆ క్రమంలో మా దగ్గర పనిచేసే ఈదులా నాయక్ అనే లంబాడీ నాయకుడు లంబాడీ దేవుడికి మొక్కండి పిల్లలు పుడతారని చెపితే మా బాపు నమ్మలేదట. అతనే ‘‘నువ్వేం మొక్కొద్దు, పంచె పరుస్తా, నువ్వు ఏదైనా పెట్టు, నేను మొక్కుతా, నీ పేరు మీద నేనే మొక్కుతా, వచ్చే ఈ రోజుల్లో నీ ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు’’ అని చెప్పి బలవంతంగా మొక్కు తీసుకుపోయిండు. వాళ్ళ దేవుడి పేరు హేమ్లా దేవుడు. ఆ మాట కలిసి వచ్చేటట్లుగా నాకు హేమలత అని పేరు పెట్టారట. ఆ తరువాత మా బాపు అతను అడిగినంత ధాన్యం నాచేత ఇప్పించేవాడు.
ప్ర. మీ పుట్టుక, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను తేది 16/9/1949 న పుట్టాను. నా అక్షరాభ్యాసం జరిగే నాటికి మా వూర్లో బడి లేదు. మా పక్క వూరు పెండ్యాలలో మా దామన్న మామయ్య టీచర్ కావడం వల్ల ఆయనతో వెళ్ళి చదువుకునేదాన్ని. ఐదో తరగతి నుంచి హన్మకొండలో ఉంచి చదివించడానికి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి ఏర్పాట్లు చేసారు. అలా తొమ్మిదో తరగతిదాకా నా చదువు కొనసాగింది. పెళ్ళై పిల్లలు పుట్టినాక మళ్ళీ చదువు కొనసాగించాను. ఆంధ్రా మెట్రిక్, పీయూసీ, బిఏ పూర్తి చేసిన. ఐటిఐ కూడా చేసిన. టైపు, షార్ట్ హాండ్ నేర్చుకున్న. అప్పుడే మాస్ కాపీయింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం కూడా చేసిన.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. మా నాన్న పేరు వరవరరావు. పట్వారీ పనిచేసేవాడు. ఆధ్యాత్మిక వాది. పక్కా వైష్ణవుడు. ఆధ్యాత్మిక దృక్పథం వల్ల కాబోలు, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. ఇతరుల నమ్మకాలను గౌరవించేవాడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కుటుంబం అమ్మా వాళ్ళది. మా పెద్ద మామయ్యలిద్దరూ కాంగ్రెస్ పార్టీలో పూర్తి కాలం పనిచేసారు. మా అమ్మ పెద్దనాన్న కొడుకు పెండ్యాల పెద్ద రాఘవరావు కమ్యూనిష్టు పార్టీ నాయకుడు. ఆయన 1940లలో అజ్ఞాతంలో ఉండేవాడు. అప్పుడు తన సహచరులతో మాయింటికి వస్తే అమ్మ వండి వడ్డించేది. నాన్న అర్థరాత్రి దాటాక రహస్యంగా వాళ్ళు కోరిన చోట వదిలి వచ్చేవాడట. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే… మా బాపు సంప్రదాయవాది అయినప్పటికీ ఎదుటి వారి విశ్వాసాలను ఎంతగా గౌరవించేవాడో తెలపటానికి చెప్పాను. అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మా బాపు బడి కొరకు స్థలమిచ్చాడు. అలా రాజరంలో వచ్చిన బడి ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది. మా అమ్మా బాపులు అరికాలికి ముల్లు గుచ్చుకోకుండా పెంచారు . అంతేకాదు గుచ్చుకున్నప్పుడు ధైర్యంగా ఉండి ఆ ముల్లును ఎలా తీసిపారేయాలో కూడా నేర్పించారు.
ప్ర. మీ పెళ్ళి ఎప్పుడు? ఎలా జరిగింది?
జ. 1964 డిసెంబర్ 25న మా పెళ్లి జరిగింది. మా నాన్న నాచేత రుక్మిణీ కళ్యాణం కూడా చదివించేవాడు. వివితో వివాహం నా జీవితాన్ని మలుపు తిప్పింది. నేనైతే అది ఒక సంచలనమనే చెపుతాను. ఎందుకంటే వివి నాకు మేనమామ. ఆంధ్రాలో మేనమామను పెళ్ళాడుతారు కానీ మేనమామను పెళ్ళి చేసుకునే సంప్రదాయం తెలంగాణలో లేదు. ఇక్కడ మేనరికం అంటే మేనబావను పెళ్ళిచేసుకోవడమే. వరవరరావు నాతో పెళ్లి ప్రతిపాదన పెట్టినప్పుడు మా అమ్మమ్మ అంగీకరించలేదు. అల్లుడు బుద్ధిమంతుడు, విద్యావంతుడు కావాలని మా బాపు అనుకున్నాడు. ఇది శాస్త్ర సమ్మతమా? కాదా? అనే సందేహం. సందేహ నివృత్తి కోసం ఎంతోమంది పండితులను సంప్రదించి తర్వాత ఒక ఏడాదికి మా పెళ్ళి చేయడానికి నిర్ణయించారు. అప్పుడు నేను చిన్న దానిని కాబట్టి పెళ్లి విషయంలో నాకు నిర్ధిష్టమైన అభిప్రాయమంటూ ఏమీ లేదు. మామయ్య చిన్నప్పటి నుంచీ తెలుసు. మంచివాడు అందుకే కాదనలేదు. అలా మా పెళ్ళి సంప్రదాయ పద్ధతిలో బాపు చేతుల మీదుగా జరిగిపోయింది.
ప్ర. వివి జైల్లో ఉన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లలతో మీరు ఎదుర్కొన్న కష్టాలు చెప్పండి.
జ. 1966లో స్పజన సాహిత్య త్రిమానసిక పత్రికగా మొదలైంది. 1970లో విరసం ఏర్పడ్డది. సి కె ఎం కాలేజీ లెక్చరర్‌గా, ప్రిన్స్‌పాల్‌గా ఆయన భావాల ప్రభావం వరంగల్‌లో విద్యార్థుల మీద చాలా ఉండేది. ఆ క్రమంలో 1973 అక్టోబర్‌లో వి వి మొదటిసారి అరెస్టయ్యారు. అప్పుడు నేను ఆందోళనకు గురయ్యాను. కానీ అమ్మా బాపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సపోర్టు వల్ల కొంత స్థిమిత పడ్డాను. ఆయన జైలులో ఉన్న 36 రోజులు ములాఖత్‌కు వెళ్ళి వచ్చినప్పుడు నేను పొందిన గౌరవం వల్ల నేను ఆ నిర్బంధాన్ని సహజంగానే తీసుకున్నాను. అప్పుడు ఆయన విడుదల అయినప్పుడు విద్యార్థులంతా నినాదాలు ఇస్తూ ఊరేగింపుగా ఇంటికి తీసుకురావడం గర్వంగా ఫీలయ్యాను.
సికింద్రాబాదు కుట్ర కేసులో 18/5/1974 లో వి వి రెండోసారి అరెస్టయ్యారు. అప్పుడు నేను మా చిన్న పాపతో డెలివరీ అయి 16 రోజులు తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ఎక్కడికి తీసుకపోతున్నారు? అని ఆలోచించే స్థితిలో కూడా లేను. వార్తా పత్రికల్లో చదివాక కానీ నాకు విషయం అర్థం కాలేదు. అప్పుడు మా యింటి ఓనర్ మా చేత ఇల్లు ఖాళీ చేయించాడు. ఏడిళ్ళ పిల్లికూనల తల్లిగా మారిన పరిస్థితిలో చంటి పిల్లలను వేసుకొని డా.చంద్ర ఇంట్లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత, కుమార్‌పల్లిలో ఇల్లు కిరాయికి దొరికింది. 20 రోజుల పాపను అమ్మ దగ్గర వదిలిపెట్టి పెద్ద పిల్లలిద్దరినీ తీసుకొని సికింద్రాబాదు జైలుకు ములాఖత్‌కు పోయేదాన్ని. అప్పుడు వాళ్ళ వయసు 8,5 సంవత్సరాలు. వరంగల్ నుంచి పొద్దున పోయి ఏ రాత్రికో తిరిగి వచ్చేదాన్ని. అదే సమయంలో అదే జైల్లో చాలామంది రాజకీయ ప్రముఖులున్నందువల్ల అందరూ బయటకు వస్తారనే ఆశ ఉండేది. ఎమర్జెన్సీ ఎత్తివేశాక అందరూ విడుదలైనా వివిని వెంటనే మళ్ళీ మీసా కింద అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిలు వచ్చి కండీషన్ల వల్ల హైదరబాదులో ఉండి, 1975 మే ఒకటిన ఇంటికి వచ్చాడు. ఒక నెల దాటగానే ఎమర్జెన్సీలో1975, 26 జూన్ నాడు మళ్ళీ అరెస్టు చేశారు. అప్పుడు విడుదలైన విరసం కార్యదర్శి కెవి రమణారెడ్డి తను కావలి వెళుతూ నన్ను కాజీపేట స్టేషన్లో కలుసుకొమ్మని చెప్పి పంపారు. నన్ను అదే రైలులో వరంగల్ వరకు ప్రయాణం చేయమన్నారు. నేను ఆయనను చూడగానే భోరుమని ఏడుస్తనని, నన్ను ఎట్లా ఫేస్ చేయాలా అని భయంతో ఊహించుకున్నాడట. ఆయనే నన్ను చూసి భోరుమన్నాడు. అప్పటికే నేను వి వి నిర్బంధాలకు, దాని వల్ల వచ్చే కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకు అలవాటు పడ్డాను. ఆ క్రమంలో బాపు, విద్యార్థులు, బస్ కండక్టర్లు, డ్రైవర్లు, స్నేహితులు అందించిన తోడ్పాటు మరువలేనిది.
1985 నాటికి వరంగల్లో డా.రామనాథం గారి హత్య వల్ల పోలీసుల ఒత్తిడి పెరిగి పరిస్థితి విషమించి ప్రాణాపాయ స్థితి ఏర్పడిరది. వివి రాసిన భవిష్యత్ చిత్రపటం నిషేధించబడినప్పుడు బాల్ గోపాల్ వరంగల్ స్థితిని లాటిన్ అమెరికా నియంతృత్వ పాలనతో పోలుస్తూ ఇపీడబ్ల్యులో రాశాడు. అది నేను, నా మైనర్ ఆడపిల్లలు అనుభవించాం. మా యింటికి ఎవ్వరి రాకపోకలు లేని ఆ రోజుల్లో అర్థరాత్రి ఎవరో వచ్చి మా యింటి తలుపులు గొడ్డుళ్ళతో కొట్టారు. అప్పుడు వచ్చింది పోలీసులని తర్వాత తెలిసింది. ఆ తలుపుల మీద ఇప్పటికీ గొడ్దళ్ళ దెబ్బల గుర్తులున్నాయట.
ప్ర. ఎలాంటి పరిస్థితులలో సృజన పత్రిక బాధ్యతలు చేపట్టారు? అప్పుడు ఏం జరిగిందో వివరించండి.
జ. నేను సృజన బాధ్యత తీసుకోవడం అప్పటి చారిత్రక అవసరం. మొదటిసారి వి వి అరెస్టయి జైల్లో ఉన్నప్పుడు సృజన ఆగిపోకూడదని కుటుంబ మిత్రులు డా. రామనాథం గారు, అట్లూరి రంగారావు గారు, అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ కాకి మాధవరావుగారు నన్ను సృజన బాధ్యతలు చేపట్టమని సూచించారు. దానిని ఒక నైతిక బాధ్యతగానే తీసుకున్నాను తప్ప అప్పటికి నాకేం రాజకీయాలు లేవు. వివి సహచరిగా అది నా బాధ్యత అనుకున్నాను. ఆ సందర్భంగా నా యింటి పేరు పెండ్యాలగా మారినందువల్ల అది తర్వాతి కాలంలో వి వితో ములాఖత్‌ను సుగమం చేసింది. అలా సృజనతో ఏర్పడిన నా అనుబంధం వల్ల ఎమర్జెన్సీ కాలంలో సృజన పబ్లిషర్‌గా నన్ను కూడా (వివి అప్పటికే జైల్లో ఉన్నారు) అరెస్టు చేయాలని మీసా వారెంట్ మీద సంతకం చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ బాలరాజును ఎస్పీ కోరాడట. పత్రికల పట్ల ప్రభుత్వ పాలసీ వల్ల సృజన ఎలాగూ రాదని ఆయన సంతకం చేయనని చెప్పాడట. 50, 60 పేజీలలో రావలసిన సృజన పత్రికను ఎడిట్ చేసి రెండు పేజీలకు కుదించారు. రైల్వే సమ్మెను బలపరుస్తూ వచ్చిన మే 74 సంచిక రాజద్రోహం నేరం కింద నిషేధానికి గురైంది. సృజన నిషేధాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించడం వల్ల నన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. బెయిలు వచ్చింది. కానీ సృజన నిషేధం కేసు ఎమర్జెన్సీ తరువాత విచారణకు వచ్చింది. అప్పుడు రెండేళ్ళు శిక్ష వేస్తే నేను 8 రోజులు జైలులో ఉన్నాను. నాతో పాటు మా చిన్నపాపను కూడా జైల్లో ఉంచుకొని అప్పుడప్పుడు బయటకు పంపేదాన్ని. కేంద్ర మంత్రిగా ఉన్న జార్జిఫెర్నాండెజ్ హైదరాబాదు వచ్చినప్పుడు ‘‘రైల్వే సమ్మె జరిపిన మీరు కేంద్రంలో మంత్రి అయ్యారు. తమ పత్రికలో బలపర్చిన సంపాదకురాలు శిక్షపడి జైల్లో ఉన్నదని అడిగితే, ఆయన దానికే ‘‘డ్రామా ఆఫ్ అబ్సర్డ్’’ అన్నాడట. పత్రిక మే సంచిక రావలసిన ఏప్రిల్ 26 నాడు వరంగల్ ప్రభుత్వాసుపత్రిలో మూడో పాప పుట్టింది కనుక ఆ సంచిక నిర్వహణ నేను చూసి ఉండననే కన్నాభిరన్ గారి వాదనతో జడ్జి ఏకీభవించి నాకు బెయిల్ ఇచ్చాడు. జస్టిస్ జయచంద్రారెడ్డి ఆ తర్వాత కేసు కొట్టి వేశారు. నిర్బంధ రాజ్యహింసపై వచ్చిన సృజన సంచికను 84లో ప్రభుత్వం నిషేధించింది. ఆ విషయం మాకు తెలియకముందే పత్రిక ప్రింటింగ్ ప్రెస్ మీద పోలీసులు దాడి చేసి హన్మకొండలో నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. అప్పుడు వివి ఇంట్లో లేడు. ఆడబిడ్డను రాత్రి లాకప్‌లో పెడతారా? అని మా బాపు వాళ్ళతో వాదించి నాతో పాటు వచ్చి రాత్రంతా లాకప్ ముందు పడుకున్నాడు. మర్నాడు కోర్టు బెయిలిచ్చి విడుదల చేసింది. అలా ఎన్ని కష్టాలు వచ్చినా 92 మే నెలలో 200 సంచిక వచ్చి సృజన ఆగిపోయేదాకా నేను పత్రికకు ఎడిటర్, పబ్లిషర్, ప్రింటర్‌గా ఉన్నాను.
ప్ర. మీరు ఆర్థికంగా ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి?
జ. వివి జైలుకు పోయిన ప్రతిసారి ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం, సస్పెన్షన్ అలవెన్స్ కూడా రాకపోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డాం. దానికితోడు ప్రయాణ ఖర్చులు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మిత్రులు సహాయం చేస్తానన్నా నా ఆత్మాభిమానం వల్ల ఎవరి దగ్గరా తీసుకోలేదు. నా పెద్ద బిడ్డ సహజ డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాదులో డిప్లొమా చేస్తూ ఒక స్నేహితురాలి ఇంట్లో ఉండేది. ఆ సందర్భంలో ‘‘అమ్మ! ఇన్‌లాండ్ లెటర్ రాయడానికి కూడా డబ్బులు లేవమ్మా’’ అని లెటర్ ఒకరి చేతికిచ్చి పంపింది. మేము పడ్డ ఆర్థిక ఇబ్బందులకు ఇదొక ఉదాహరణ. ఇలాంటివెన్నో ఉన్నాయి.
ప్ర. వి వి సుదీర్ఘమైన ఉద్యమ జీవితంలో మీరిద్దరూ ప్రశాంతంగా ఎంత కాలం కలిసున్నారు?
జ. నిర్బంధాలు, నిషేధాలు, ప్రాణభయాలు, ప్రవాసాలు.. వీటితోనే మా జీవితమంతా గడిచింది. 1990లో వరంగల్ నుంచి హైదరాబాదుకు నివాసం మార్చినం. పదవీ విరమణ తరువాత 98 నుంచి స్థిరమైన పెన్షన్ వల్ల స్థిరమైన జీవితం ఏర్పడిరది. నాకు పెద్ద కోరికలు లేవు. ఒక చిన్న సొంత యిల్లు సమకూర్చుకోవాలని ఉండేది. వరంగల్‌లో ప్రయత్నించి నిర్బంధం వల్ల కోల్పోయి, హైదరాబాదులో సొంతింటి కల నెరవేర్చుకొని, ఈ వయసులో ప్రశాంతంగా ఉందామనుకునే సమయంలో భీమాకోరేగావ్ కేసు పిడుగుపాటులాగా వచ్చింది. తెల్లవారుతుండగానే పోలీసులు మా ఇంటికి వచ్చి సోదా చేసి ఆగమాగం చేసిన్రు. వివిని అరెస్టు చేశారు. గృహ నిర్బంధమనే వార్త తెల్లారి తెలిసింది. ఆగష్టు 28/2018 నుంచి నవంబర్ 17/2018 వరకు రెండు నెలలు గృహ నిర్బంధంలో ఉన్నారు. నిజంగా నేను, నా పిల్లల పరంగా చెప్పాలంటే ఆ రెండున్నర నెలలే ఇంటి పట్టున వుండి మాతో గడిపిన అనుభవం. అది నా జీవితంలో అరుదైన కాలం. ఆయన సుదీర్ఘమైన ఉద్యమ జీవితంలో మాతో గడిపిన కాలం అదే…
ప్ర. పోలీసుల వల్ల మీ పిల్లలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ. ఎదుర్కోకుండా ఉండడం సాధ్యం కాదు కదా.. ఎదుర్కొన్నారు. తెల్లవారు చూడగానే పోలీసులు హైదరాబాదులో మా యింటికి వచ్చి గొడవ చేయడానికి ముందే మా రెండో అమ్మాయి అనల, చిన్నమ్మాయి పవన ఇంట్లో సోదాలు జరిపారట. బొట్టు, తాళి లాంటి విశ్వాసాలకు సంబంధించి ప్రశ్నలతో మానసికంగా వేధించారు. అంతేకాదు.. పిల్లల ఆట వస్తువులు, వాళ్ళ పుస్తకాలు కూడా పట్టుకుపోయారు. మా యింటికి వచ్చే ఒక యువ రచయిత ఇంటి మీద కూడా దాడి చేసారట. ఆయన తల్లిని మానసికంగా బాధపెట్టారు. అతణ్ణి తిట్టి, కొట్టి హింసించారు.
ప్ర. బీమాకోరేగావ్ కేసు గురించి చెప్పండి?
జ. బీమాకోరేగావ్ ఘటన గురించి మేమిద్దరం పేపర్లో చదివాం. కక్ష పూరితంగా, అబద్దపు ఆరోపణలతో ప్రధాని హత్య కుట్ర కేసును వివి పై పెట్టారు. రెండు నెలలు గృహ నిర్బంధంలో ఉన్నతర్వాత 17 ఫిబ్రవరి 2018 పూణే పోలీసులు అరెస్టు బేసి, ఇంటరాగేషన్ నెపంతో వారం రోజులు యస్‌పి ఆఫీసులో ఉంచారు. ఆ తరువాత పూణేలో ఎరవాడ నిర్బంధించారు. అప్పుడు ఆయనకు 78, నాకు 69 ఏళ్ళు. అప్పటి నుంచి ములాఖత్ కోసం పూణేకు వెళ్ళే వాళ్ళం. సాయంత్రం హైదరాబాదులో బయలుదేరి తెల్లవారి పూణేలో దిగి, ముందుగా జైలుకు వెళ్ళి ఆయనను కలిసి, మధ్యాహ్నం కోర్టులో కలిసి, సాయంత్రం అక్కడ రైలెక్కి తెల్లవారి హైదరాబాదు చేరే పద్ధతికి అలవాటు పడుతుండగానే ఆ కేసును ఎన్ ఐ ఏ తీసుకొని ముంబైకి మార్చారు. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన ఒక్కసారి ఆయనను ఎన్ ఐ ఏ కోర్టులో కలిసాను. తరువాత ఆర్తర్ రోడ్ జైల్లో కలవడానికి నాకు అనుమతివ్వలేదు. కరోనా రావడంతో ములాఖత్‌లు ఆగిపోయి ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. ఫోన్ ఏ టైంలో వస్తుందో తెలియదు. ముందు వారం రోజులన్నారు. తర్వాత 15 రోజులకు వచ్చేది. వచ్చినా రెండు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాల మాట్లాడే సమయం ఇచ్చారు.
ప్ర. ముంబై జైలులో వి వి మానసిక స్థితి గురించి చెప్పండి.
జ. జూన్ 2న కోర్టు వాయిదా ఉందని తెలిసి అక్కడ కలవవచ్చని వెళ్ళాను. వి వికి ఆరోగ్యం బాగాలేక జెజె హాస్పిటల్‌లో చేర్చారని ఆయనను కలిసొచ్చిన ఒక లాయర్ చెప్పాడు. ఉరుకుల పరుగుల మీద ఆసుపత్రికి వెళ్ళాము. డిశ్చార్జి చేసినట్టు తెలిసి కలువలేక పోయామని నిరాశ చెందాము. తర్వాత ఫోన్ కాల్స్‌లో ఆయన మాట్లాడే ధోరణి పొంతన లేకుండా ఉన్నది. నాతో హిందీలో మాట్లాడేవాడు. నాతోనే ఎందుకట్ల మాట్లాడుతున్నవంటే ‘‘మా అమ్మ, బాపు చనిపోయారు. నువ్వు ఫ్యూనరల్‌కు పోయినవా?’’ అని అడిగిండు. వాళ్ళ తండ్రి ఆయనకు 8 ఏళ్ళప్పుడే చనిపోయిండు. వాళ్ళ అమ్మ చనిపోయి 40 ఏళ్ళయింది. ఆందోళనతో ఉన్న నా చేతిలో నుంచి నా బిడ్డ ఫోన్ తీసుకొని ఆయనతోపాటు ఉన్నాయన సహాయకుడిగా జైలు ఆసుపత్రిలో ఉన్న వర్నన్ ఫోన్లో ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదని, నేల మీద, గోడల మీద, గాలిలో రాస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే పైపు వేసి, మూడు నెలలైనా దానిని తీయలేదని, తొందరగా హాస్పటల్‌లో చేర్పించక పోతే ప్రమాదం కూడా జరుగువచ్చని చెప్పాడు.
ప్ర. తరువాత ఏం జరిగింది? వివరంగా చెప్పండి.
జ. నేను, నా బిడ్డలు, తమ్ముడు వేణుగోపాల్ కలిసి ఆన్లైన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. దానికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చింది. అప్పుడు మహారాష్ట్రా ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం ద్వారా ‘‘హాస్పిటల్‌లో చేర్పించాము రమ్మని’’ కబురు పంపారు. అది మళ్ళీ జెజె హాస్పిటలే.. అంటే ప్రభుత్వ ఆసుపత్రి. కరోనా సమయం కాబట్టి ప్రయాణం చేయడం కూడా కష్టమే.. మేము ముంబై జె జె ఆసుపత్రికి పోతే తలోజా జైలు నుంచి అనుమతి తెచ్చుకోమన్నారు. అది చాలా పెద్ద ప్రాసెస్. భోరున వర్షం.. ఉండడానికి ఏమీ లేదు.. ఇదంతా జరిగిపోయి వెతికి చూసేసరికి ఆసుపత్రి వార్డులో ఒక మూలకు గుర్తుపట్టని విధంగా ఆ మనిషి మంచంలో ఒక మూలకు పిల్లి పిల్లలాగా ముడుచుకొని పడుకొని వున్నాడు. గుండు చేసి వుంది. నేను ఒక క్షణం నోట మాట రాక నిశ్చేష్టితనయ్యాను. పిల్లలు తండ్రిని పట్టుకొని భోరున ఏడ్చారు. నన్ను చూసి నువ్వున్నావా? అని అడిగాడు. అలా మానసిక స్థితి అదుపు తప్పిందని అర్థమైంది. నేను లేనని, చనిపోయానని అనుకుంటున్నాడు. ఆయన మనసుకని వర్నన్ చెపితే అర్థమైంది. గమనిస్తే.. ఉచ్చ మడుగులో ఉన్నాడు. మేము ఆ బట్టలు మార్చి, అన్నీ సరిచేసి గంట అయిందో లేదో ఒక పోలీసు వచ్చి వెళ్ళి పొమ్మన్నాడు. తెల్లవారి మళ్ళీ చూడడానికి పోతే కరోనా వచ్చిందని, చూడడానికి వీల్లేదని వెళ్ళగొట్టారు. ఏడుస్తూనే హైదరాబాదుకు తిరిగి వచ్చాము.
ప్ర. తోటి ఖైదీల తోడ్పాటు ఎలా ఉండేది ?
జ. తర్వాత ఎన్ హెచ్ ఆర్ సి, హైకోర్టు జోక్యంతో ఆయనను నానావతి హాస్పిటల్‌కు మార్చారని తెలిసింది. జూలై 18 నుంచి ఆగస్టు 28 వరకు ఆయనకు రెండుసార్లు కరోనా వచ్చిందని, ఇతర న్యూరో, యూరిన్ సమస్యలు వచ్చాయని రిపోర్టులను బట్టి తెలిసింది. అటువంటి ఆరోగ్య పరిస్థితులలో కూడా తిరిగి ఆయనను జైలుకు పంపారు. జైలు ఆసుపత్రిలో డైపర్లు మార్చడం, ముఖం కడగడం లాంటి అవసరాలన్నీ ఒక పసిబిడ్డను తల్లి చూసుకున్నట్లు వర్నన్, అరుణ్ దగ్గరుండి చూసుకున్నారు. అక్టోబర్లో జైలుకు వచ్చిన స్టాన్ స్వామి అదే జైలు ఆసుపత్రిలో తన ఆరోగ్యం కన్నా వివి ఆరోగ్యం బాగా లేదని బయట వాళ్ళకు తెలుపుతూ ఎంతో సాంత్వన చేకూర్చాడు. తోటి ఖైదీల ఇలాంటి తోడ్పాటు లేకుంటే వి వి బతికేవాడు కాదు. ప్రపంచ వ్యాప్త ఆందోళన కూడా ఇందుకు సహకరించింది. హైకోర్టు ఉత్తర్వులతో మళ్ళీ ఆయనను నానావతి ఆసుపత్రిలో చేర్చారు.
ప్ర. బెయిల్ ఎలా వచ్చిందో చెప్పండి.
జ. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న మనిషిని మళ్ళీ జైలుకు పంపిస్తే మళ్ళీ అదే స్థితికి వస్తాడు కనుక బెయిల్ ఇవ్వమని సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకున్నాను. హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్ త్వరగా విచారించమని సుప్రింకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరాజైసింగ్, ఆనంద్ గ్రోవర్ వాదించి మెడికల్ బెయిల్ తెచ్చారు. అట్లా 2021 మార్చి ఐదో తేదీన విడుదలయ్యాడు. కానీ అనేక షరతులతో పాటు ముంబైలోనే ఉండాలనే షరతు విధించింది కోర్టు. అట్లా ముంబై ప్రవాస జీవితం మొదలైంది.
ప్ర. మీ ప్రవాస జీవితాల గురించి చెప్పండి.
జ. మేము వరంగల్ నుంచి హైదరాబాదుకు మారినప్పుడే ప్రవాస జీవితం అనుకున్నాము. మా ప్రాణాలకు ముప్పు వుందని తెలిసినప్పుడు 2002-04 మధ్య ఢల్లీిలో ఉండవలసి వచ్చింది. కానీ అప్పుడు జి టి బి ఎంక్లేవ్‌లో విద్యార్థి యువకుల మధ్య మేము మళ్ళీ వరంగల్ జీవితాన్ని ఫీలయ్యాము. ఇప్పుడు ఈ ముంబై ప్రవాస జీవితం మాత్రం నిర్బంధం లాగా అనిపిస్తోంది. భాష రానిచోట మనుషులతో కలవలేని ఈ మహానగర జీవితం ఒంటరి ద్వీపం లాగున్నది. ఈ భయంకరమైన ట్రాఫిక్‌లో వారానికి ఒకసారి కోర్టుకు హాజరు కావడం కష్టంగా వుందని సుప్రీంకోర్టుకు అర్జీ పెట్టు కుంటే 2022 ఆగస్టులో వయసు రీత్యా షరతులతో కూడిన పర్మినెంట్ బెయిలు ఇచ్చింది సుప్రీంకోర్టు. హైదరాబాదుకు మారిస్తే బాగుండనే ఆశ అయితే వున్నది. ఏమో.. కాలమే నిర్ణయించాలి.
ప్ర. మాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవలలోని అమ్మ సజీవ పాత్ర లాగా మీరు అందరికీ అమ్మ, అక్క అయ్యారు కదా.. దీని మీద మీ ఫీలింగ్ ఏమిటి?
జ. మాక్సిం గోర్కీ అమ్మతో నువ్వు నన్ను పోల్చడం సంతోషంగా వుంది. గిరిజా! 74లో వివి జైల్లో ఉన్నప్పుడు 11 నెలలు ఇద్దరు ట్రైనింగ్ టీచర్లు తరచూ వచ్చి పిల్లలను ఆడిరచి, చదువు చెప్పి, నా కష్టసుఖాల్లో పాలు పంచుకొని నాకు తమ్ముళ్ళలాగా ఉండేవారు. ఒకరు ముప్పాళ లక్ష్మణరావు, ఇంకొకరు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు రవీందర్ రెడ్డి. వాళ్ళ సహాయ సహకారాల గురించి నేనే జైల్లో వివికి చెప్పేదాన్ని. ఆ తర్వాత లక్ష్మణరావును నేనెప్పుడూ చూడలేదు. కొన్నాళ్ళకు ఉద్యమ నాయకుడు ‘‘గణపతి’’ అతడే అని తెలిసింది. కానీ నా మనసులో మాత్రం ఆ ఒక్క పల్చటి రూపమే ఉన్నది. సృజనను కరీంనగర్, గోదావరిఖని తీసుకువెళ్ళి (అప్పుడు సృజన ఖరీదు ఒక్కరూపాయి) అమ్మి పైసలు తెచ్చిచ్చే కోటి అని మేము పిలిచే కోటేశ్వరరావు ఉద్యమ నాయకుడు తరువాత కిషన్‌జీ అయ్యాడు. అట్లాగే వరంగల్‌లో జన్ను బిన్నాలు, లింగమూర్తి, భాగ్య (శోభ) హైదరాబాదులో వీరన్న, ఎమ్ ఎస్ ఆర్, వివేక్ మా యింట్లో మనుషులయ్యారు. తరువాత కాలంలో బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో వారు అసహజ మరణాలకు గురైనప్పుడు నా కడుపు తరుక్కు పోయింది. వీళ్ళంతా సామాన్యులు. కానీ అనన్య సామాన్యులు. ఇలాంటి ఎందరో నన్ను అక్కా, అమ్మ అని పిలిచేవారు. ఇప్పటికీ అందరూ అలాగే పిలుస్తారు. వాళ్ళ బంధు మిత్రులను కలిసినప్పుడు నా దుఃఖం ఏరులై పారుతుంది. అలాంటి అనన్య సామాన్యులకు నేను అమ్మను, అక్కను అయినందుకు తృప్తిగా, గర్వంగా ఉంటుంది.
ప్ర. వివి మీద మీ అభిప్రాయం చెప్పండి.
జ. వివి సౌమ్యుడు, ప్రేమికుడు, తొలినాళ్ళలో మల్లె పూలు, హేమంత స్వప్నాలు అనే పేరుతో ప్రేమ కవిత్వం రాశాడు. అవి ఇప్పటికీ ఎక్కడా ప్రింటు కాలేదు. అందులో హేమంత స్వప్నాలు అనే కవిత్వాన్ని వివి స్నేహితులు స్వదస్తూరితో అందంగా రాసి, బుక్ రూపంలో నా పెళ్ళి కానుకగా యిచ్చారు. కాబట్టి అది నా మీద రాసిన ప్రేమ కవిత్వమనే అనుకుంటాను. స్త్రీలపట్ల గౌరవం వుంది. ప్రకృతి అన్నా, మనుషులన్నా చాలా యిష్టం. ఎప్పుడూ ఏదీ చేయమని నన్నే కాదు, ఎవరినీ బలవంత పెట్టడం కూడా నేను చూడలేదు. ఆయన ఆచరణే అందరికీ పాఠం. సృజన సంపాదకత్వం నా నైతిక బాధ్యతగా స్వీకరించినప్పుడు… మా యింట్లో జరిగే సాహితీ చర్చలు, సాహితీ మిత్రులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువకుల వలన నాకీ రాజకీయ విశ్వాసాలు ఏర్పడ్డాయి కానీ వివి చెప్పడం వల్ల మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. తరువాతి కాలంలో జైలు నుంచి రాసిన కవిత… ‘‘నీ తోడు లేకుండా మనం నడిచిన తోవ లేదు, నీ ప్రేమ లేకుండా గడిచిన ప్రమాదాలు లేవు… నీ సహకారం లేకుండా రచించేది కాదు ఈ సాహస గాథ ‘‘అంటూ సాగిన కవిత నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంతకన్నా ఈ జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది.
ప్ర. ఈ తరం యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. ఈ తరం పిల్లల్లో ఏమైనా లోపాలున్నాయంటే దానికి కారణం తల్లిదండ్రుల పెంపకం లోపమే అంటాను. పిల్లల పెంపకమంటే భౌతికంగా వాళ్ళ అవసరాలు తీర్చడమే అనుకుంటున్నారు. ఉన్నంతలో వాళ్ళకు కష్టం, బాధ్యత తెలియకుండా పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకు కష్టం, సుఖం, బాధ్యత, విలువలు తెలియజేయాలి. వాళ్ళతో స్నేహితుల లాగా మెలగాలి. అప్పుడు మాత్రమే యువత సరైన మార్గంలో ఉంటుంది.
