చనిపోకముందు తన భర్త ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్న భారీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే, సంజీవని బేడగే ఒక మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే పింఛను పొందేందుకు గత ఐదేళ్ళుగా కష్టాలు పడుతున్నారు.
‘‘ప్రభుత్వ పథకాల గురించి మాకెలా తెలుస్తుంది? మాకు ఉద్దేశించిన కార్యక్రమాల గురించి సమాచారం ఇచ్చేవారెవరూ లేరు,’’ మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ళ సంజీవని బేడగే అన్నారు. ఆమె తుళజాపూర్ తాలూకా, జళకోట్ గ్రామానికి చెందిన ఒక రైతు. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయానికి తోడుగా ఆమె ఇతరుల పొలాల్లో కూడా పనిచేస్తారు. 2020 నుంచి ఆమె వివిధ ప్రభుత్వ పథకాలలో భాగం అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. ‘‘నా భర్త శంకర్, లాక్‌డౌన్ మొదలవ్వటానికి కొద్ది రోజుల ముందు, 2020 జనవరి 24న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు,’’ సంజీవని చెప్పారు. ‘‘ఒక మనిషి చనిపోవచ్చు, కానీ అతను చేసిన అప్పు మాత్రం తీరిపోదు. రుణభారంతో నా భర్త తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఇప్పుడు నేను దిన దినం అదే భారంతో జీవిస్తున్నాను.’’
చనిపోయిన ఆమె భర్త తండ్రికి జళకోట్‌లో ఒక ఐదెకరాల పొలం ఉంది. అందులో శంకర్, ఆయన ముగ్గురు సోదరులు కలిసి ఉమ్మడి వ్యవసాయం చేసేవారు. ‘‘మాది నీటి సరఫరా లేని వర్షాధార భూమి, కానీ మేం మంచి ధరలు వచ్చే అవకాశమున్న వర్షాధార పంటలను వేసేవాళ్ళం,’’ సంజీవని చెప్పారు. ‘‘మేం వర్షాకాలంలో సోయాచిక్కుళ్ళు, తూర్ (కంది) పంటలను వేసేవాళ్ళం, దీపావళి తర్వాత జోవర్ (జొన్న), గోధుమ, నల్ల శనగ పంటలను వేసేవాళ్ళం.’’
2011 నుంచి 2014 వరకూ ఒక క్వింటాల్ జోవర్, గోధుమ, నల్ల శనగల ధర రూ. 2, 2000 వరకూ ఉండేదిÑ క్వింటాల్ సోయా చిక్కుళ్ళు, తూర్ ధర రూ. 5,000 వరకూ ఉండేది. ఇంటి వాడకం కోసం కొంత పంటను పక్కకు తీసిపెట్టగా, వారికి సుమారు రూ. 26,400 విలువైన చలికాలపు పంట ఒక్కోటీ 4 క్వింటాళ్ళు, దానికి జతగా మరో రూ. 50,000 విలువైన ఒక్కోటీ 5 క్వింటాళ్ళ సోయా చిక్కుళ్ళు, తూర్ పంటలు మిగిలేవి. అంటే ఏడాదికి దగ్గర దగ్గర రూ. 76,400. ఈ డబ్బును నాలుగురు అన్నదమ్ముల కుటుంబాలు సమానంగా పంచుకునేవారని సంజీవని జళకోట్‌లో నాతో చెప్పారు.
‘‘మేమంతా నివాసముండే కచ్చాఘర్ (గడ్డి పైకప్పుతో ఉన్న మట్టి ఇల్లు)కు అనేక సమస్యలుండేవి,’’ ఆమె వివరించారు. ‘‘మరీ ముఖ్యంగా వానాకాలంలో పైకప్పు కారుతుండటంతో మా పిల్లలు తరచుగా జబ్బుపడేవాళ్ళు. ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ఖరీదైనది.’’
15 మంది సభ్యులుండే బేడగేల కుటుంబం ఒక మూడు పడకగదుల ఇంటిలో ఇరుకుగా నివసించేవారు. కొంత సులభంగా ఉండటానికి, అన్నదమ్ములంతా అరెకరానికి తక్కువగా ఉండే తమ సొంత భూమిలో వేరువేరుగా ఇళ్ళు కట్టుకొని ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇల్లు కట్టుకోవటం కోసం శంకర్ ప్రైవేటుగా అప్పు తీసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉండటంతో, వాళ్ళ నలుగురి కోసం ఒక రెండు పడక గదులు, ఒక వంట గది ఉన్న ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
శంకర్ 2015లో గ్రామంలోని ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి వద్ద నెలకు 10 శాతం వడ్డీ రేటుపై రూ.13.5 లక్షల అప్పు తీసుకున్నారు. ‘‘ఇక అప్పటి నుంచే మా సమస్యలు పెరిగిపోవటం మొదలయ్యింది,’’ చీర పల్లూ (కొంగు)తో తలను కప్పుకుంటూ చెప్పారు సంజీవని. ఇక్కడ భర్తను కోల్పోయిన మహిళలందరిలాగే సంజీవని కూడా బిందీ (బొట్టు) పెట్టుకోరు.
2015లో మరఠ్వాడా ప్రాంతంలో, ప్రత్యేకించి ధారాశివ్‌లో (అధికారికంగా పేరు మార్చకముందు దీనిని ఉస్మానాబాద్ అని పిలిచేవారు) రుతుపవనాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో ఈ ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించింది. ‘‘పొలానికి నీరు పారించే సంగతి అలా ఉంచి, మేం తాగే నీటి కోసమే చాలా కష్టాలు పడవలసివచ్చింది,’’ అన్నారు సంజీవని. 2016 కరవుకాలంలో దగ్గరలో ఉన్న ఒక నుయ్యి నుంచి నీళ్ళు తీసుకురావటానికి సంజీవని రోజు విడచి రోజు ఒక కిలోమీటరు దూరం నడిచి ఒక పొడవైన క్యూలో నిలబడాల్సివచ్చేది. ‘‘నేను మూడు ఘాగ్రీ (నీటి కుండలు) నీటిని ఇంటికి మోసుకొచ్చేదాన్ని. ‘‘పొద్దున్నే ఆరింటికి లేచి ఇంటి పనులన్నీ పూర్తిచేసుకున్నాక, ఉదయం 10 గంటలకు నీటి కోసం ఇంటి నుంచి బయలుదేరేదాన్ని.’’ విడవకుండా పీడిరచిన కరవు తన జీవితంలోని అతి దారుణమైన దశ అని ఆమె చెప్తారు. ‘‘తాగటానికి నీరు ఉండేది కాదు. గ్రామంలోని ధనిక రైతులు ఒక నీళ్ళ ట్యాంకు నిండా నీళ్ళు తెప్పించుకోగలిగేవారు, కానీ మాకంత స్తోమత లేదు. దానికితోడు నీళ్ళు తీసుకువచ్చే బాధ్యత కూడా మీదపడటంతో, నేనింక వేరేవాళ్ళ పొలాల్లో పనికి వెళ్ళగలిగేదాన్ని కాదు,’’ అన్నారు సంజీవని. అంటే, ఆ రోజుకు ఆమె తన సంపాదనను పోగొట్టుకున్నట్టే.
‘‘2016-17 ఒక కరవు సంవత్సరం, అలాగే 2018-19 కూడా. ఆ సంవత్సరాల్లో వరుసగా మాకు పంట నష్టం జరిగింది. మా సంవత్సర ఆదాయం సుమారు 13,000 రూపాయలకు పడిపోయింది. ఈ కాలంలో నా భర్త తీసుకున్న అప్పును చెల్లించలేకపోయాడు,’’ అన్నారు సంజీవని. ‘‘అప్పు పెరిగిపోతుండటంతో, అతను తన జీవితాన్ని చాలించాలనుకున్నాడు.’’ జనవరి 24, 2020న శంకర్ తమ పొరుగువారి పొలంలో ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (చీజRదీ) డేటా ప్రకారం, ఒక్క ఆ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 10,600 మందికి పైగా రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో శంకర్ కూడా ఒకరు.
చీజRదీ వార్షిక నివేదికల నుండి సేకరించిన రాష్ట్రాల వారీ డేటా ప్రకారం, 1995 నుండి 2018 మధ్య భారతదేశంలో దాదాపు 400,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా మహారాష్ట్ర అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రంగా ఉంది. ఈ 2025 సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే, రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల సంఖ్య 767. వీటిలో, మరాఠ్వాడా ప్రాంతంలోనే 269 ఉన్నాయి. 2024లో ఇదే సమయంలో నమోదైన 204 మంది రైతు ఆత్మహత్యలతో పోలిస్తే ఇటువంటి మరణాలలో 32 శాతం పెరుగుదల ఉన్నట్టుగా పిటిఐ నివేదించింది.
శంకర్ కుటుంబానికి లక్ష రూపాయల – రూ. 30,000 చెక్కు రూపంలోనూ, మరో రూ. 70,000ను పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కింద 5 సంవత్సరాల కాలపరిమితి (2026 నాటికి) గల ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలోనూ – పరిహారం లభించింది. సంజీవని ఆ రూ. 30,000ను శంకర్ తీసుకున్న అప్పు కింద వడ్డీ వ్యాపారికి చెల్లించారు.
‘‘నా భర్త మరణంతో మొత్తం అంతమైపోయినట్టుగా నేను భావించాను. అతను లేకుండా నేనూ నా కొడుకులూ ఎలా జీవించగలం? ఒక నెల రోజుల వరకూ, కోవిడ్ లాక్‌డౌన్‌ను ప్రకటించేవరకూ, నేనేమీ ఆలోచించలేకపోయాను. ఒకదాని తర్వాత మరొకటిగా మేం వరుస సంక్షోభాలను ఎదుర్కోవలసివచ్చింది!’’ అన్నారు సంజీవని.
ఆమె తమ సొంత పొలంలోనే కాక, ఇతరుల పొలాల్లో కూడా కూలిపనికి వెళ్ళటం మొదలుపెట్టారు. ‘‘పొలం యజమానుల అవసరాన్ని బట్టి బహుశా వారంలో రెండు రోజులు నాకు పని దొరికేది. ఫిబ్రవరి నుంచి మే నెల వరకూ పంట కోతలూ, కలుపు తీసే పనులూ ఉంటాయి. 2020 నుంచి 2022 వరకూ నేను రోజుకు 150 రూపాయలు సంపాదించాను. ఇప్పుడు రోజు కూలీ 200 రూపాయలు,’’ అన్నారు సంజీవని. నెలకు ఆమె సంపాదన సుమారు రూ. 1200 ఉండేది. ముగ్గురున్న కుటుంబానికి అది చాలా చిన్న మొత్తం. ‘‘కోవిడ్-19 మా పిల్లల చదువు పై కూడా ప్రభావాన్ని వేసింది. అప్పుడు నా చిన్న కొడుకు అభిషేక్ (ప్రస్తుతం 20 ఏళ్ళ వయసు) 12వ తరగతిలో ఉండేవాడు. మా కుటుంబంలో ఒక మరణం సంభవించిన ఆ సమయంలో నేను అతని కోసం ఒక స్మార్ట్ ఫోన్ (అప్పటి ఆన్‌లైన్ విద్య కోసం) కొనలేకపోయాను. దాంతో వాడు బడి మానేయాల్సివచ్చింది. అప్పటి నుంచి నా చిన్నపిల్లాడు కూడా దినసరి కూలీగా పనిచేశాడు. నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా పిల్లల భవిష్యత్తు నాశనమవటం చూసి, నాకెంతో బాధగా ఉంటుంది,’’ అన్నారామె. సంజీవని పెద్ద కొడుకైన ఋషికేశ్ (21), 2020 నాటికి 12వ తరగతి పూర్తి చేసి, బ్యాచిలర్ డిగ్రీ చదవటం కోసం కళాశాలలో చేరడానికి ఎదురుచూస్తున్నాడు. కానీ తన కుటుంబ ఆర్థిక దుస్థితిని చూసి, తన తల్లిపై కళాశాల ఫీజుల భారం వేయకూడదని నిర్ణయించుకున్న అతను 2025 వరకు కొన్ని సంవత్సరాల విరామం తీసుకున్నాడు. అయితే, ఈ సంవత్సరం, అతను నళ్‌దుర్గ్ (ధారాశివ్ జిల్లా)లోని బాలాఘాట్ కళాశాలలో ప్రవేశం పొందాడు. అతనిప్పుడు మొదటి సంవత్సరం బి.కామ్. విద్యార్థి. ఏడాదికి అతని కళాశాల ఫీజు రూ. 1,050.
‘‘మా గ్రామంలో భర్తలను కోల్పోయిన ఇతర మహిళలు విధవా పగర్ (సంజయ్ గాంధి నిరాధార్ అనుదాన్ పథకం) గురించి నాకు చెప్పారు. లేకపోతే, ఈ కార్యక్రమం గురించి నాకు ఎప్పటికీ తెలియకపోయేది,’’ అని సంజీవని చెప్పారు. ఈ పథకం వితంతువులతో సహా నిరుపేద మహిళలకు ప్రతి నెలా రూ. 1,000 ప్రత్యక్ష నగదు బదిలీని అందిస్తుంది. ఆశ్చర్యకరంగా, ఈ పథకాన్ని వ్యవహారంలో విధవా పగర్ – అంటే ‘వితంతువుల పెన్షన్’ అని పిలుస్తున్నప్పటికీ, దాని లబ్ధిదారులుగా ఉన్న అనేక వర్గాలలో వితంతువులు కూడా ఒకరు. తుళజాపూర్ తహసీల్ కార్యాలయంలో ఈ కార్యక్రమ నమోదు జరుగుతుంది.
‘‘ఈ పథకాలకు ఏయే పత్రాలు అవసరమో తెలుసుకోవడానికి నేను తహసీల్ కార్యాలయానికి వెళ్ళాను. అక్కడికి రిక్షాలో వెళ్ళి, తిరిగి రావడానికి నాకు 200 రూపాయలు ఖర్చవుతుంది. మహామారి సమయంలో బస్సులు నడవటం లేదు. అంతేకాకుండా, దీని కోసం నేను ఒక రోజు పనిని కూడా వదులుకోవాలి – అంటే, మరో 150 రూపాయలు నష్టం,’’ అని సంజీవని చెప్పారు. జళకోట్ నుండి తుళజాపూర్ వరకు 32 కిలోమీటర్ల దూరం వెళ్ళి, తిరిగి రావడానికి ఆమెకు రూ. 350 నష్టం.
‘‘తహసీల్ కార్యాలయంలో, నా భర్త మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు కాపీ, నా ఓటరు ఐడి కాపీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టుగా ధృవీకరించే పత్రం, రహివాసి (నివాసి) ధృవీకరణ పత్రం, నా ఫోటో కాపీలు తీసుకురావాలని నాకు చెప్పారు. నేను ఇంటికి తిరిగి వచ్చాను. సమీపంలోని స్టూడియోకి వెళ్లి నా ఫోటో తీయించుకున్నాను. ఈ పత్రాలన్నింటినీ అమర్చుకోవడానికి నాకు ఒక నెల సమయం పట్టింది. నెలవారీ పింఛను రూ.1000ని అందుకోవచ్చనే ఆశతో సంజీవని అవసరమైన పత్రాలన్నిటినీ తీసుకొని తిరిగి తహసీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే వాళ్ళకు మరికొన్ని డిమాండ్లున్నాయి. ‘‘నేను రాష్ట్రీయ కుటుంబ లాభ్ యోజన (దేశీయ కుటుంబ ప్రయోజన) దరఖాస్తును ఎందుకు నింపలేదని వారు నన్ను అడిగారు. ఎవరైనా నాకు చెప్పకపోతే ఆ ఫారమ్ గురించి నాకు ఎలా తెలుస్తుంది? నేను సరిగ్గా దేనికి అర్హురాలనో ప్రతిరోజూ నిరూపించుకోవడంలో నేను చాలా అలసిపోయాను,’’ అని సంజీవని చెప్పారు. ఇది మూడు సంవత్సరాలకు పైగా నడుస్తోంది, కానీ ఆమెకు ఇంకా ఈ పథకంలో ప్రవేశం లభించలేదు. శంకర్ తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం ఆమెకు ఇంకా భారంగానే ఉంది. ‘‘గత రెండేళ్ళలో నా సంపాదనతో నేను ఏదో విధంగా పదే పదే అప్పు తీర్చమని అడుగుతోన్న ప్రైవేట్ వడ్డీ వ్యాపారికి యాభై వేల రూపాయలు తిరిగి చెల్లించగలిగాను.’’ అయితే, అసలు మొత్తం రూ. 13 లక్షలతో పాటు మొత్తం వడ్డీ కూడా ఇంకా తిరిగి చెల్లించలేదు.
‘‘ఉమ్మడి కుటుంబం నుంచి మేం వేరుపడినప్పటి నుంచి, పసుపు రంగు రేషన్ కార్డు సంపాదించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. లబ్ధిదారుల జాబితాలో నా పేరు ఉందని, కానీ నేనతనికి వెయ్యి రూపాయలు చెల్లిస్తే గానీ నాకు రేషన్ కార్డు ఇవ్వనని ఆ రేషన్ దుకాణం యజమాని నాతో చెప్పాడు. అంత డబ్బు నేను ఎక్కడినుంచి తేవాలి? దారిద్య్ర రేషే కాలీ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) ప్రజలకు ఉద్దేశించిన ఆ పసుపు రేషన్ కార్డును ఇచ్చేందుకు వాళ్ళు డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారు. మా కోసమే ఉద్దేశించిన ఈ పథకంలో చేరటానికి మేం చేసే పోరాటం ఎప్పటికీ అంతమయ్యేలా లేదు,’’ అన్నారు సంజీవని.
మీకు ఆత్మహత్య గురించిన ఆలోచనలు వస్తుంటే, లేదా అటువంటి ధోరణి ఉన్నవారి గురించి మీకు తెలిస్తే, దయచేసి నేషనల్ హెల్ప్ లైన్‌కు చెందిన కిరణ్‌కు 1800 599 0019 (24/7 టోల్ ఫ్రీ) ఫోన్ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనికైనా ఫోన్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల, లేక సేవల సమాచారం కోసం దయచేసి SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీని సందర్శించండి సందర్శించండి.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/te/article/in-marathwada-a-person-dies-but-debt-doesn-t-te) ఆగష్టు, 2025 లో మొదట ప్రచురితమైనది.)
