ఇంద్రగంటి జానకీబాల – ఒక పరిశీలన – గిరిజ పైడిమర్రి

వాళ్ళ కుటుంబం సంగీత సాహిత్యాలకు నిలయం. సుప్రసిద్ధ రచయిత ఇంద్రగంటి హనుమచ్భాస్త్రి కోడలు, రచయిత ఇంద్రగంటి శ్రీకొంత శర్మ సహచరి, తనదైన ప్రత్యేక ముద్రవేసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తల్లి ఇంద్రగంటి జానకీబాల గారు. రచన, సంగీతం, సంపాదకత్వం. ఇలా పలు రంగాలలో రాణించారు.

ఆర్‌.టి సీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబం, పిల్లల పెంపకంలో తలమునకలవుతూ తన చిన్నప్పటి రచనా వ్యాసంగాన్ని, సంగీతాభిలాషను కొనసాగించి, సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే! జానకీబాలగారు. బాగున్నారా?
జ. నమస్తే! బాగున్నాను.
ప్ర. మీ గురించి మా భూమిక పాఠకులకు తెలియజేయాలని వచ్చాను.
జ. సంతోషం అమ్మా!
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో 4/12/1945లో పుట్టాను. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. పుట్టడం రాజమండ్రిలో అయినా నా బాల్యం, చదువు అన్నీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గడిచాయి.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. మా అమ్మ పేరు ఎస్‌. లక్ష్మీ నరసమాంబ, తండ్రి సూరి రామచంద్ర శర్మ. మా నాన్నగారు కాకర పర్రు జమీందారు దగ్గర వీణ విద్వాంసుడుగా పని చేసారు. వాళ్ళ పిల్లలకు వీణ నేర్పించారు. ఆ వూరు తణుకు నుంచి 6,7 మైళ్ళ దూరం. అమ్మ లక్ష్మీనరసమాంబ తణుకులోని జాస్తి సీతా మహా లక్ష్మి బాలికోన్నత పాఠశాలలో సంగీతం టీచర్‌గా పని చేసారు. సీతా మహాలక్ష్మి గారు అభ్యుదయ భావాలు ఉన్న మహిళ.
అందువల్ల ఆ రోజుల్లో ఎందరో మహిళలకు, ఆడపిల్లల చదువుకు ఆ పాఠశాల చాలా దోహదం చేసింది. ఆ రోజుల్లోనే బీ ఏ, బిఇడి చేసిన రాజమండ్రి శకుంతలమ్మ గారు ప్రధానోపాధ్యాయినిగా ఉన్నారు. ఆమె సహృదయరాలు. పాఠశాలలో అకడమిక్‌ చదువుతో పాటుగా కళలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. అందువల్ల మా అమ్మ పెద్దగా చదువుకోక పోయినా తనకు వున్న సంగీత జ్ఞానంతో ఆ పాఠశాలలో సంగీతం టీచర్‌గా ఉద్యోగాన్ని పొందగలిగారు. నేను ఆమె దగ్గరే సంగీతం నేర్చుకున్నాను. ఈ విషయంలో నాకు అమ్మనే స్ఫూర్తి. ఆమెకున్న నైపుణ్యంతో పాఠశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తనదైన ముద్ర వేసారు. నేనూ మా చెల్లి ఆ పాఠశాల నుంచే ఎస్‌.ఎస్‌.ఎల్‌.సీ పాస్‌ అయ్యాము. తర్వాత మా చెల్లి విజయవాడలో నా దగ్గరే వుండి వీణలో డిప్లొమా చేసింది. మా అన్నదమ్ములు తణుకులోని మున్సిపల్‌ పాఠశాలలో చదువుకున్నారు.
ప్ర. మీరు ఆర్‌.టి.సీలో చేరక ముందు గాయని పి. సుశీల గారి దగ్గర పని చేసినట్లు విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. అవును, రాయసం నాగకృష్ణశర్మగారి భార్య రాయసం రాజ్యలక్ష్మి గారు మా అమ్మ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆవిడకు పి.సుశీలగారు మరదలు – అంటే తమ్ముడి భార్య. ఆవిడ అప్పుడప్పుడే సినీ నేపథ్య గాయనిగా పైకి వస్తున్నారు. ఆమెకు పి.ఏగా ఒక అమ్మాయి అవసరమని తెలిసి, రాయసం రాజ్యలక్ష్మి గారు నన్ను ఆవిడ దగ్గరికి పంపించారు. నేను అలా పి.సుశీల గారి దగ్గర మద్రాసులో రెండు సంవత్సరాలు పని చేసాను. వాళ్ళింట్లోనే ఉండేదాన్ని. తమ కుటుంబంలో ఒకరిగా నన్ను బాగా చూసుకున్నారు. మంచి జీతం కూడా వుండేది.
ప్ర. మీకు సంగీతం పట్ల ఆసక్తి వుంది. సంగీతం నేర్చుకున్నారు. అలాంటప్పుడు పి.సుశీల గారి దగ్గరే ఉద్యోగం కొనసాగించకుండా మరో ఉద్యోగంలోకి ఎందుకు మారవలసి వచ్చింది?
జ. పెద్ద చెట్టు నీడలో చిన్న మొక్క నిలదొక్కుకోవడం కష్టం కదా. పైగా ఆమె నన్ను పరిచయం చేసే పరిస్థితి లేదని వచ్చేసాను. పైగా మన రాష్ట్రం కాదు. మా వూరికి వెళ్ళిపోతే మా కుటుంబానికి, ముఖ్యంగా మా తమ్ముళ్ళు, చెల్లెలు చదువులకు భరోసాగా ఉండొచ్చు. అని ఆలోచించి ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆర్‌టిసిలో ఖాళీలు వచ్చాయి. ఇంటర్వ్యూకు వెళ్ళాను.1965 సెప్టెంబర్‌లో ఆర్‌టిసిలో చేరాను. 1966 మార్చిలో ఆ ఉద్యోగం పర్మినెంట్‌ అయింది. మొదటి అపాయింట్‌మెంట్‌ ఏలూరు. తర్వాత తాడేపల్లిగూడెం మారాను. ఆ వూరు తణుకుకు 12 మైళ్ళ దూరం. రోజూ తణుకు నుంచి వెళ్ళి వచ్చేదాన్ని. తర్వాత డిపో సెటప్‌ వచ్చింది. ఆ సందర్భంలో ఆడిట్‌ ఆఫీసు విజయవాడకు బదిలీ చేసారు. అలా విజయవాడ ప్రాంతీయ పరిపాలన ఆఫీసుకు (జోనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసు) వచ్చాను. అక్కడే అకౌంటెంట్‌గా 2006లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందాను.
ప్ర. మీది ప్రేమ వివాహం అని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. అవును, తేది 18/12/1966లో మా వివాహం జరిగింది. మా ఆయన సుప్రసిద్ధ ఇంద్రగంటి హనుమచ్భాస్త్రిగారి చిన్నబ్బాయి శ్రీకాంత శర్మ గారు. వాళ్ళ చిన్న అన్నయ్య సుబ్బరాయ శాస్త్రిగారు తణుకులో ఒక కంపెనీలో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగం చేసేవారు. గది అద్దెకు తీసుకొని భోజనం మా యింట్లో చేసేవారు. కొవ్వూరులో ఆంధ్ర గీర్వాణ పీఠం కళాశాలలో భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు శ్రీకాంత శర్మగారు వాళ్ళ అన్నయ్యను కలవడానికి తరచుగా తణుకు వచ్చేవారు. అలా మా పరిచయం పెరిగింది. మా కబుర్లలో ఎక్కువగా సంగీత సాహిత్యాలు చర్చకు వచ్చేవి. తణుకులోనే ప్రఖ్యాత కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఉండేవారు. వాళ్ళింట్లో తరచుగా సాహిత్య చర్చలు జరిగేవి. ఎందరో సాహితీ మిత్రులు కలిసేవారు. వారు నా పాటతోనే సమావేశాన్ని మొదలు పెట్టేవారు. నేను గొప్ప రచయిత్రిని అవుతానని ఆయనే ఆనాడు జోస్యం చెప్పారు. ఆయన దీవెన వల్లనే నేను రచయిత్రినయ్యాను.
ప్ర. వివాహ ప్రతిపాదన ఎవరు చేసారు?
జ. ఏడాది తర్వాత శ్రీకాంత శర్మగారే చేసారు. మా యింట్లో అంగీకరించారు. కానీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. మా పెళ్ళికి కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళ పెద్దన్నయ్య, వదిన, వాళ్ళ రెండో అన్నయ్య సుబ్బురాయశాస్త్రిగారు మా పెళ్ళికి వచ్చారు. మా అత్తగారు కూడా మామగారు ఉన్నంత కాలం మా యింటికి రాలేదు. నా ఉద్యోగం తాడేపల్లిగూడెంలో కాబట్టి మేం అక్కడే కాపురం పెట్టాం. శ్రీకాంత శర్మగారు నిడదవోలులో తెలుగు పండిట్‌గా ఉద్యోగం చేసేవారు.
ప్ర. శ్రీకాంత శర్మగారు పత్రికారంగంలో పనిచేశారు కదా ..
జ. అవును, నేను విజయవాడ బదిలీ అయ్యాక, ఆయనకు పత్రికారంగం పట్ల ఆసక్తితో టీచర్‌ ఉద్యోగం మానేసి ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా జాయినయ్యారు. అప్పుడు పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకులుగా వున్నారు. నండూరి రామ్మోహనరావు గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా ఉన్నారు. ఆ తరువాత కొంత కాలానికి పోటీ పరీక్ష రాసి, ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌లో స్క్రిప్టు రైటర్‌గా చేరారు. అప్పుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్టేషన్‌ డైరెక్టరుగా వున్నారు.
ప్ర. ఉద్యోగం, రచనావ్యాసంగం, కుటుంబం, పిల్లలు అన్నింటినీ ఎలా సమన్వయం చేసుకున్నారు?
జ. మా అమ్మాయి కిరణ్మయి 14/1/1968లో, అబ్బాయి మోహనకృష్ణ 17/4/1972లో పుట్టారు. ఈ రోజుల్లో మాదిరిగా అప్పట్లో ‘‘ఎవరికి వారే యమునా తీరే’’ అన్నట్లుగా మనుషులు వుండేవారు కాదు. పైగా ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఉద్యోగం చేసే వారు కాదు. ఇళ్ళల్లోనే ఎక్కువ మంది వుండేవారు. అందువల్ల ఇరుగు పొరుగు వారి సహకారం చాలా వుండేది. అలా గడిచిపోయింది. ఇకపోతే… రచనా వ్యాసంగం అంటారా… నేను రాత్రి పూటనే రాసే దాన్ని. ఉదయం, సాయంత్రం ఇంటి పని, వంటి పని, పిల్లల పని. పగలంతా ఉద్యోగం. అందరు స్త్రీలకు మల్లేనే నాకంటూ మిగిలేది రాత్రిళ్ళు మాత్రమే.
ప్ర. మీ రచనా వ్యాసంగం గురించి చెప్పండి.
జ. జగతి 1965 లో జగతి మాసపత్రికలో నా మొదటి కథ ‘ప్రయాణంలో మనోగతం’ అచ్చయింది. ఆ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఎన్‌.ఆర్‌ చందూర్‌ గారు. రెండో కథ కూడా అందులోనే అచ్చయింది. కానీ ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు. ఆ తరువాత ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలలో కొన్ని కథలు అచ్చయ్యాయి. ‘మనిషికి మరో మలుపు’ ఆంధ్ర పత్రికలో 1971లో అచ్చయిన మొదటి కథ. అంతరంగ తరంగాలు నవల సీరియల్‌గా వచ్చింది. సువర్ణ రేఖ, ప్రేమలేఖ, ప్రయోజనం, అందరం ప్రేక్షకులమే మొదలైన కథలు అచ్చయ్యాయి. 2006లో అన్నీ కలిపి ‘జానకీ బాల కథలు’ గా కథా సంకలనం వచ్చింది. 2006 లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాతనే ఎక్కువగా నవలలు రాసాను.
ప్ర. మీ నవలల గురించి చెప్పండి.
జ. నేను మొత్తం 14 నవలలు రాశాను. అవి వరుసగా… 1. విశాల ప్రపంచం, 2. కరిగిన హరివిల్లు, 3. వెన్నెల మట్టి, 4. అంతరంగ తరంగాలు, 5. కనిపించే గతం, 6. తరంగిణి, 7. నీలి రాగం, 8. ఆవలి తీరం, 9. రాగ పల్లకి,10. మాతృ బంధం, 11. పంజరం కోరిన మనిషి, 12. దేవకీ వాళ్ళ అక్క, అన్నయ్య, 13. నిజానికి అబద్ధానికీ మధ్య, 14. క్షమ..
ప్ర. కథలు, నవలలే కాకుండా మీరు ఇతర పుస్తకాలు కూడా రాశారని విన్నాను. వాటి గురించి చెప్పండి.
జ. 1. శ్రీరంగం గోపాలరత్నం – జీవితం, సంగీతం, 2. దుర్గాబాయి దేశముఖ్‌ జీవితం, 3. యశస్విని (పి.భానుమతి బయోగ్రఫి), 4. రావు బాల సరస్వతి – గాయని (వ్యాసాలు), 5. అంజలీదేవి – మొదటి తరం నటి (వ్యాసాలు), 6. కొన్ని పిల్లల పుస్తకాలు రాశాను. ఈనాడు దినపత్రికలో సోషల్‌ టాపిక్స్‌ మీద ఫీచర్స్‌ రాశాను. ‘వెనుకటి వెండి తెర’ పేరుతో ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికలో ఆర్టికల్స్‌ రాసి ప్రచురించాను.
ప్ర. మహిళా రచయితలు స్వయంగా రాయరు. వాళ్ళ పేరుతో సహచరులు (భర్తలు) రాస్తారనే అపప్రథ ఉండేది. అలాంటిది మీరు ఎదుర్కొన్నారా?
జ. ఈ పితృస్వామ్య వ్యవస్థలో… అప్పట్లో ఆడవాళ్ళకు మెదడు వుంటుందని, దానికి ఆలోచనలు, పరిశీలనా శక్తి వుంటుందనే విషయాన్ని పురుషులు అంతా తొందరగా జీర్ణం చేసుకోలేక పోయేవారు. అందుకే అలాంటి అపప్రథలు పుట్టుకొస్తాయి. అది ఈనాటికీ కొంత వరకు కొనసాగుతుందనే చెప్పాలి. మాలతీచందూర్‌ రంగనాయకమ్మ లాంటి ఎందరో రచయిత్రులు ఈ అపప్రథను ఎదుర్కొన్నవారే.. నా విషయంలో కూడా మొదట్లో కొంత వుండేది. కానీ త్వరలోనే అది తొలగి పోయింది. కారణం శ్రీకాంత శర్మ గారి రచనాశైలి కంటే నాది పూర్తిగా భిన్నమైంది. నేను తీసుకున్న రచనా వస్తువులు కూడా అంతే భిన్నమైనవి.
ప్ర. మీరు నాటి – నేటి తరం కళాకారులను చూసారు కదా… గమనించిన తేడాలు చెప్పండి.
జ. కళ ప్రతి మనిషి జీవితానికి సానుకూల దృక్పథాన్ని యిస్తుంది. ఆ తరం వాళ్ళు చాలా వరకు కళా సేవకే తమ జీవితాలను అంకితం చేసారు. తాము నమ్మిన దానిపట్ల వాళ్ళకొక మొండి పట్టుదల వుండేది. దాని వల్ల కళాకారులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. సమాజానికి తాము అనుకున్నది చెపుతున్నారు – అది ముఖ్యం కదా…
ప్ర. సంగీత నేపథ్యంతో వున్న రచనల గురించి చెప్పండి.
జ. మామా! చందమామా! పేరుతో చందమామ మీదున్న పాటలను వార్త పేపర్‌లో పరిచయం చేశాను. కొమ్మా! కొమ్మా! కోకిలమ్మ పేరుతో సినీ నేపథ్య గాయినుల గురించి రాశాను. అందులో కృష్ణవేణి మొదలు ఎస్‌.పి శైలజ వరకు 21 గాయనీమణుల వివరాలున్నాయి. అలాగే మన సినిమాలలో వచ్చిన వీణ పాటలను పరిచయం చేసాను. ‘ఈ పాట విన్నారా’ పేరుతో లలిత గీతాల పరిచయం చేశాను. నేను స్వయంగా రేడియోలో పాటలు పాడడమే కాకుండా సినీ కళాకారుల మీద వివిధ కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. ఆ రోజుల్లో ఒక కార్యక్రమానికి 75 రూపాయలు చెల్లించేవారు. ఈ పనులన్నీ కూడా ఆకాశవాణి విజయవాడ కేంద్రంగా జరిగేవి. అలా 1966 నుంచి 1975 వరకు అక్కడ అవకాశాన్ని బట్టి, వీలును బట్టి పనిచేశాను.
ప్ర. మీరు క్యాసెట్స్‌ కూడా తీసుకువచ్చారు కదా? వాటి గురించి చెప్పండి.
జ. మొత్తం మూడు క్యాసెట్లు వచ్చాయి. అందులో ఒకటి శివాక్షర మాల. తెలుగులోని 56 అక్షరాల వర్ణమాలతో శివస్తుతి దాని ప్రత్యేకత. మిగతా రెండు లలిత గీతాలు. ఒక్కొక్క దానిలో 6-8 పాటలున్నాయి.
ప్ర. ప్రఖ్యాత సినీ దర్శకుడి తల్లిగా మీ ఫీలింగ్స్‌ చెప్పండి.
జ. మాస్‌ సినిమాలు కాకుండా తనదైన ముద్రతో సినిమాలు తీయడం ఈ రోజుల్లో కష్టమే. మా అబ్బాయి అలా తీయడం నాకు చాలా గర్వంగా వుంటుంది. ఆయన సినిమాలలో గ్రహణం, అష్టా చెమ్మా నాకు చాలా ఇష్టమైన సినిమాలు. గ్రహణం సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా గురించి చలం కూతురు సౌరీస్‌ ‘‘మా నాన్నగారుంటే చాలా సంతోషించే వార’’ని గర్వంగా చెప్పింది. జయలలితకు కూడా ఆ సినిమా ప్రత్యేకమైన స్టార్‌డంను తెచ్చిపెట్టింది. ఆవిడ కూడా ఆ సినిమాలోని తన పాత్ర గురించి గర్వంగా చెప్పుకుంటుంది. మా అమ్మాయి కూడా సినిమాలు తీస్తున్నది. అయితే ఆమె తీసినవి డాక్యుమెంటరీ సినిమాలు. ఆమె తీసిన ‘రాళ్ళలో నీరు’ అనే సినిమాకు గుర్తింపు వచ్చింది.
ప్ర. మీరు పొందిన పురస్కారాల గురించి చెప్పండి.
జ. చాలానే వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి… ‘కనిపించే గతం’ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం. కథా రచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం. జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథా రచయిత్రిగా జ్యోత్స్నా పీఠం పురస్కారం వచ్చాయి.
ప్ర. చివరగా… ఈ కాలం రచయిత్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. చాలా విషయాలలో మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. కానీ మార్పు వచ్చినా సమాంతరంగా సంప్రదాయం వెన్నంటే వుంటుంది. ప్రతి దానిని నిశితంగా పరిశీలించి రాయాలి. క్షేత్ర పర్యటన చేసి, సమస్యలను లోతుగా అవగాహన చేసుకొని రాసినప్పుడే అది పాఠకుల మెప్పు పొందుతుంది. రాసిన దానిని ఒకటికి పలుమార్లు సరి చూసుకోవాలి. రచయితలు సమాజం పట్ల తమకున్న బాధ్యతను ఎప్పుడూ మరచిపోకూడదు.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.