తిరగేసి మరగేసి ఎన్ని మాట్లాడిన చుట్టూ చేరేది ఒకే మాట.
మగవారు భావాత్మకులు కారు, ఆడవారు భావాత్మకులు
ఆడవారు ఎమోషనల్గా ఉంటారు, మగారు అంతగా ఎమోషనల్గా ఉండరు.
ఆడవాళ్లు మానసికంగా బలంగా ఉంటారు, మగవాళ్ళు శారీరకంగా బలంగా ఉంటారు.
ఇంత శుద్ధతప్పయిన మాట ఇంకోటి లేదు.
మగవాళ్ళను చిన్నతనంలోనే మానసికంగా విరిచేస్తారు. వారు నొప్పి, బాధ, భయం గురించి అసలు మాట్లాడ కూడదు. ప్రేమ అనే ఆలోచనకు దూరం దూరం జరిపేయడమే కాక, ప్రేమంటే యాజమాన్యం, అధికారం అనే విష యాన్ని ఘాటుఘాటుగా మెదడులోకి, మనసులోకి ఫీడ్ చేస్తుంటారు. అందుకని పాపం మగవాళ్ళు మానసికంగా విరిచేయబడతారు. Emotionally stunted గా తయారుచేయబడతారు. ఇది సమాజం చేసిన willful manufacturing fault. అందువలన మగవారు, వారి వలన ఇతర జెండర్లు జీవితాంతం ఇబ్బంది, బాధ పడతారు. నానా హింసలకు గురవుతారు, ఒకరినొకరు హింసించుకుంటూ ఉంటారు.
చైనీయులలో ఆడపిల్లల కాళ్ళు విరగొట్టి వారి చలనాన్ని అందం పేరుతో అదుపు చేసినట్లు, ప్రపంచంలో చాలా భాగాలలో ఆయా సమాజాలు మగవారిని భావాత్మకంగా వికలాంగులను చేసి, వారిని ఒంటరి వారిగా వదిలేస్తారు. అందుకే మగవారికి ఒక వయసు తరవాత ఒక ఆత్మీయ స్పర్శ కావాలన్నా అది సెక్స్ మాత్రం ద్వారానే సాధ్యపడుతుంది. పాపం, అధికారం కూడా సెక్స్ ద్వారానే సాధ్యపడుతుంది అని వారికి బోధించారు. ఈ తికమకల తిరణాలలో ఏది ప్రేమో, ఏది అవసరమో, ఏది అధికారమో వారికి తెలీకుండా అయిపోయి అన్ని కలగాపులగం అయిపోతాయి.
పుట్టిన బిడ్డ ఏడుపులో ప్రత్యేకంగా జెండర్ తేడాలేమి ఉండవు. పాలు కావాలన్నా, స్పర్శ కావాలన్నా, నాపీ మార్చాలన్నా ఒకే ఏడుపు. అమ్మ గుర్తించాలి, నాన్న ఎత్తుకోవాలి, ఇవన్నీ ఒకేలాగా జరిగాక, ఎప్పుడెప్పుడు మగపిల్లలు తమ భావాత్మక వ్యక్తీకరణ నుండి వెలివేతకు గురవుతారు?
ఆడపిల్లలాగా ఏడవకు, అంత బాధపడతావెందుకు, మాన్ అప్, తట్టు కోవాలి, బలం ఉండాలి, మగవాడివి కాదా, ఈ మాత్రం చేయలేవా, ఆ మాత్రం సంపాదించలేవా? ఎంతసేపు అమ్మని పట్టుకు తిరుగుతావెందుకు? కొంగుచాటు భర్త, కంట్రోల్లో పెట్టుకోలేని మగాడు, పిరికి వెధవ!
ఎక్కడ మొదలైందిది? మగవారికి ఎమోషన్స్ ఉండవు అనే అడ్డమైన వాదన ఎవరు మొదలు పెట్టారు? వారికి సెక్స్ మాత్రమే కావాలన్నా దౌర్భాగ్యులు ఎవరు?
పిచ్చి మోహాల్లారా?
మగవాడు ఎమోషనల్ కాకపొతే అతనికి కుటుంబమెందుకు, దాని కోసం ఇంత పాకులాట ఎందుకు? పిల్లలు వాళ్ళ బాగోగులు ఎందుకు? అమ్మ, కూతురు అంటే అంత పిచ్చి ఎందుకు? సెక్స్ వర్కర్‌కి డబ్బులు ఇచ్చి కూడా వారి శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు కదా, ఎమోషనల్ కాకుంటే ప్రియురాలు ఎందుకు?
ట్రైన్లలో భార్య బిడ్డల కోసం సీట్లు అట్టిపెట్టి, వారు కూర్చున్నాక రాత్రంతా నిల్చుని ప్రయాణం చేసే మగవారున్నారు. రోడ్డు మీద ఆక్సిడెంట్ అయితే మొదట పరిగెట్టి గాయపడిన ఆ అపరిచితుడిని ఒళ్ళోకి తీసుకుని ధైర్యం చెప్పి నీళ్లు తాగించే ఆర్ద్రత మగవాడిదే. స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి దింపి వచ్చేది ఆ మగ బస్సు డ్రైవరే.
ఇవన్నీ మర్చిపోయి మగవాళ్ళు భావాత్మకులు కారు అంటారేమిటి? నిజమే ఆడవారికి, మగవారికి వేరే వేరే విలువలు నేర్పి వారిని బతుకు బరిలోకి దింపుతారు. అప్పుడు మగవారి జీవిత మంతా అధికారం కోసం పోరాటమ నిపిస్తుంది కానీ చివరాఖరికి పోరాటం ఎప్పుడూ మానసికమే. ప్రపంచానికి తనో ఆల్ఫా మేల్‌ని అని నిరూపించుకో వాలనుకునే మగవారు గుప్పెడు మాత్రమే. వారి అంశను ఆరాధిస్తూ, మగవారు ఎమోషనల్ కారని అందరూ సెలవిస్తూ ఉంటారు.
కానీ ఒంటరితనం, స్పర్శ కోసం తపన, వాలిడేషన్ కోసం ఎదురుచూపు, దుఃఖాన్ని అణిచిపెట్టుకుని, పై పై అధికార పటోటోపాలు, బయటి అవమానాలు, లోపలి భయాలు మోసుకు తిరిగే మగ వారు ఎమోషనల్ మనుషులు కారంట!
ఛీ, ఏమి ఘోరంరా!
