పిల్లలు పుట్టేశాక బిడ్డసంచి దండుగేనా – పి. ప్రశాంతి

నొప్పితో మెలికలు తిరిగిపోతోంది భారతి. కాసేపు కూర్చుంటోంది, కాసేపు ముడుచుకు పడుకుంటోంది, ఇంకాసేపు విరుచుకుని కూలబడుతోంది… నొప్పి భరించలేక ఆయసంతో పాటు గొంతులోంచి బాధతో కూడిన మూలుగు తన్నుకు వస్తోంది. కళ్ళల్లోంచి సన్నగా నీళ్ళు కారుతున్నాయి. తను కూర్చున్న చాప మీద పక్క చిందరవందరగా ఉంది. ఒకపక్క అన్నం తింటూ వదిలేసిన కంచం, సగం నీళ్ళతో ఉన్న మంచినీళ్ళ చెంబు…

మరోపక్క భారతి పడుతున్న బాధని తీర్చడమెలాగో అర్ధంకాక చూస్తూ కూర్చున్నట్టున్న పెంపుడు కుక్క లడ్డు…
నిన్నటి నుండి పొత్తికడుపులో సన్నగా మొదలైన నొప్పి ఇవ్వాళ తెల్లారకముందే మొదలైన ఋతుస్రావంతో ఎక్కువైంది. నొప్పిని పట్టించుకోకుండా రోజువారీ పనుల్ని చేసుకుంటూ పోతున్నా వంట పూర్తిచేసి పిల్లల్ని బడికి పంపేసరికి నొప్పి ఉధృతమైపోయింది. దానితోపాటే రక్తస్రావం కూడా ఎక్కువై అప్పటి వరకు బిగబట్టుకుని ఉన్నా ఇక ఓర్చుకోలేకపోయింది. కడుపు ఖాళీగా ఉంటే నొప్పి ఎక్కువనిపిస్తుందని మేడమ్‌ చెప్పినది గుర్తొచ్చి కంచంలో అన్నం, పప్పుచారు వేసుకుని తిందామని కూర్చున్నా నాలుగు ముద్దలు తినే సరికే పొత్తికడుపులో నొప్పి ఎక్కువై భరించలేకపోయింది.
రెండు ప్రసవాల తర్వాత రెండేళ్లకి ప్రారంభమైన పొత్తికడుపులో నొప్పి రానురాను తీవ్రంగా మారుతోంది. ఇద్దరు పిల్లలతో పాటు ఇంటిపని, పొలంపని… పైగా కోళ్ళు, కుక్కలు, బర్రెలు… సెంట్రింగ్‌ పని చేసే భర్త పొద్దున్నే వెళ్ళి రాత్రికెప్పుడో వస్తాడు. అలిసిపోయొచ్చి తొందరగా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు. వీటన్నిటితో భారతికి తీరిగ్గా కూర్చుని శ్రద్ధగా తినే సమయం దొరకదు, నాలుగు మెతుకులు కొరికి ఏదో తిన్నాననిపించి లేసిపోతుంది. వీటన్నిటితోపాటు ఈ మధ్య కొంతకాలంగా ఎక్కువైన పొత్తికడుపులో నొప్పితో కూడిన ఋతుస్రావం. నాలుగైదు రోజులు తేరుకోలేనంతగా ఉండడంతో తర్వాత కూడా రెండుమూడు రోజులు నీరసంగా ఉంటుంది. అయినా పని చేసుకోక తప్పట్లేదు. పెద్దాసుపత్రికెళ్ళి చూపించుకుందామన్నా తోడు ఎవరూ లేరు. పిల్లలింకా బాగా చిన్నవాళ్ళు, భర్తకి పనే లోకం, పుట్టిల్లు, అత్తిల్లు అదే వూర్లో ఉన్నా గొర్రెల మందలని చూసుకోడంలో వాళ్ళంతా ఎప్పుడూ బిజీగా ఉంటారు, ఇక తనని పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. భారతికి మానసికంగా ఇదో వెలితి… మామూలు రోజుల్లో అనిపించకపోయినా బైటయినప్పుడు మాత్రం భరించలేని నొప్పివల్ల తీవ్రంగా అనిపిస్తుంది.
అలాంటి ఒక సందర్భంలో తనని తాను తమాయించుకోలేక దగ్గర్లో ఉన్న బత్తాయి తోటలో బాగా పెరిగిన ఒక చెట్టుకి చీర కొంగుతో ఉరిపెట్టుకుంది. ముడుచుకుని పడుకున్న అమ్మ ఒక్కసారిగా లేచి తోటవైపు పరిగెత్తుకెళ్ళడం చూసిన ఏడేళ్ళ కొడుకు కాయల కోసమే అనుకుని చదువుకుంటున్న పుస్తకాల్ని పక్కన పడేసి తనూ వెళ్ళాడు. అప్పడే చెట్టుకు వెళ్లాడబడిన తల్లిని చూసి అమ్మా అమ్మా అని అరుచుకుంటూ పరిగెత్తాడు. వాడి అరుపులు విని దగ్గర్లోనే గొర్రెల్ని మేపుతున్న భారతి అమ్మానాన్నలు ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చి సమయానికి ఆమెని కిందకి దించడంతో బతికిపోయింది.
‘కడుపునొప్పికే ఉరిపెట్టుకుంటావా, పిల్లల ముఖాలు చూసైనా తెలివితెచ్చుకో’ అని కోప్పడి పక్క ఊర్లో ఉండే ఆర్‌యంపి కి చెప్తే వచ్చి చూసి మాత్రలిచ్చి, ‘తీవ్రమైన కడుపునొప్పి, ఎక్కువ రక్తం పోవడం, తెల్లబట్ట, నీరసం, ఒకటే అలసట… ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ఆలస్యం చేయకుండా ఆసుపత్రికెళ్ళు’ అని సలహా ఇచ్చాడు. దగ్గర్లోని పట్నంలో ఒక ఆసుపత్రిలో డాక్టర్‌ పేరు చెప్పి ‘పెద్ద పేరున్న డాక్టర్‌, నువ్వింక నీ నొప్పిని మర్చిపోవచ్చు, వెళ్ళి చూపించుకో… నా పేరు చెప్పు గుర్తుపడతారు, నీకేం భయం లేదు, కానీ ఆలస్యం చేయకు’ అంటూ వివరాలు రాసిచ్చి వెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చాక విషయం తెలుసుకున్న భర్త, బాధపడి, నాలుగు రోజుల్లో డబ్బు సర్దుబాటు చేసుకుని భారతిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆడోళ్ళ ఇబ్బందులు చూడ్డానికి ఆడ డాక్టర్లు ఉంటారు కదా, ఇక్కడ మగ డాక్టర్‌ చూస్తాడేంటి అని మనసులో అనిపించినా మంచి పేరున్న డాక్టరని ఆర్‌యంపి చెప్పాడుగా అని సర్దుకున్నాడు. భర్తని బయటే కూర్చోమని భారతిని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళింది నర్సు.
అరగంట తర్వాత బయటికొచ్చిన భారతి ‘రక్తం గడ్డలుగా పడుతోందంటే కడుపులో నీటి బుడగలు ఉండుంటాయి, అందుకే ముట్టయినప్పుడు అంత నొప్పి వస్తోంది అన్నాడు, టీవీలో చూపించిండు కానీ నాకేమీ తెలియలేదు… వెంటనే ఆపరేషన్‌ చేయాలంట, అయ్యి ఎప్పుడైనా పలగొచ్చంట, పలగకముందే బిడ్డసంచి తీసేయించుకోడం మంచిదన్నాడు, లేటైతే కేన్సర్‌ కూడా రావొచ్చంట…’ ఏడుపు ఆపుకుంటూ భయంగా చెప్పింది భారతి. అంతలో నర్సు వచ్చి భారతిని ఓదారుస్తూ ‘ఇప్పుడే నీ ప్రాణానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదులే, ఇలాంటివి ఎన్నో చూశానిక్కడ. ఇద్దరు పిల్లల య్యారు, ఇంక ఆ బిడ్డసంచితో పనైపోయిందిగా, ఇంకెందుకు దండగ… తీసేస్తే ముట్లు సమస్య కూడా ఉండదు, ఎంతోమంది చేయించుకున్నారు, ఆలోచించుకో… కానీ ఎక్కువ ఆలస్యం చెయ్యకు, ఇది నా సలహా, ఇక మీ ఇష్టం’ అంటూ ప్రిస్క్రిప్షన్‌ కాయితాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రిసెప్షన్‌ కౌంటర్‌ దగ్గరకెళ్ళి ఆ కాయితాలు చూపించి ఎంతవుతుందని అడిగితే మొత్తం అన్నీ కలిపి పదిహేను వేలలోపే అయిపోతుందని చెప్పారు. గుండెల మీద చెయ్యేసుకుని నోరు తెరిచేసింది భారతి, ‘పదిహేనువేలా’ గొణిగాడు భర్త.
ఇంటికెళ్లాక ఇంకో డాక్టర్ని చూద్దామా అన్న భర్తతో ‘మళ్ళింకో డాక్టర్‌ అంటే ఇంకో రెండు వేలదాకా ఖర్చు, ఏమొద్దులే, ఈయన టీవీలో చూపించి మరీ గట్టిగా చెప్పిండుగా, అది తీసేస్తే తగ్గిపోద్దని, పైసలు చూసుకుని తీసేయించుకుంటే నయం అనిపిస్తాంది’ అంది భారతి. నెల రోజుల్లోపే ఆపరేషన్‌ చేయించుకుంది. ఒంట్లో రక్తం లేదని రెండు సీసాల రక్తం కూడా ఎక్కించారు. మొత్తం మీద ఇరవై వేల వరకు ఖర్చయింది.
ఆపరేషన్‌ అయ్యి ఏడాది అయ్యింది. భారతికి ముట్ల బాధైతే తప్పిందికానీ కొన్నాళ్ళ నుండీ నడుం నొప్పి, కాళ్ళు గుంజడం, ఒకటే నీరసం, ఒంట్లో ఆవిర్లు పుట్టడం, కోపం ఎక్కువవ్వడంతోపాటు ఉన్నట్టుండి ఏడవాలని అనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది పిల్లల్ని కొడుతోంది. నిండా పాతికేళ్ళు కూడా లేని భారతి, భర్త దగ్గరికొచ్చినా విముఖంగా ఉండడంతో ఇద్దరిమధ్యా పొరపొచ్చాలు మొదలైనాయి.
ఇప్పుడనుకుంటోంది, చిన్న వయసులో గర్భసంచి తీయించుకోడం అస్సలు మంచిది కాదని ఒప్పించడానికి చూసిన మేడమ్‌ మాట వినాల్సింది అని. రానున్న రోజుల్లో భారతి జీవితంలో ఇంకెన్ని పెను మార్పులు చోటుచేసుకోనున్నాయో… ఇలా ఇంకా ఎంతమంది అమాయకంగా తమ జీవితాల్ని కరిగించేసుకోబోతున్నారో… దీనిపైన ఆరోగ్యశాఖ కూడా దృష్టి పెట్టకపోతే ఆడవాళ్ళ బతుకులు అర్ధాంతరంగా గాడితప్పుతాయని ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పాలి??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.