ఈసారి (ఆగస్టు 8 నుంచి 10 వరకు) బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం భాషలకు సంబంధించిన సాహిత్య పండుగ. ఇతర భాష సాహిత్యాల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళను కలుసుకోవడానికి ఇదొక మంచి సందర్భం. ముఖ్యంగా ఇతర భాషల్లో ఎలాంటి సాహిత్యం వస్తుందో తెలుసుకోవడానికి ఇలాంటి కలయికలు అవసరం అని అనిపించింది.
పూనాచ్చి నవలను రాసిన పెరుమళ్ మురుగన్, ఏనుగు డాక్టర్ లాంటి గొప్ప కథను రాసిన జయ మోహన్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన టి.ఎం. కృష్ణ లాంటి గాయకులను వినడం ఎంతైనా ప్రేరణ. ‘మాములుగా ఒక మనిషిని కలవడమే గగనమైపోతున్న రోజుల్లో ఏ మలుపు తిరిగినా ఇది వరకు కలిసిన కవినే కలుసుకోవడం ఎంతో బాగుంది’. అని డా. రాధేయ సార్, నేను మాట్లాడుకున్నాం. బుక్ బ్రహ్మ ఫెస్టివల్ ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఒక మూడు రోజుల పాటు తెలుగు రచయితలతో గడుపుతూ వాళ్ళ సాహిత్యం గురించి తెలుసుకోవడం.
మిగతా భాషలతో అస్సలు పరిచయం లేకపోవడం వలన మిగతా భాషల సెషన్స్ వినలేదు గానీ తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన సెషన్స్ అన్నీ విన్నాను. చాలా అద్భుతంగా జరిగాయి. ప్రాంతీయ అస్తిత్వం, కవిత్వంలో, కథలో కొత్త స్వరాలు, స్త్రీవాద సాహిత్యం, సినిమా రంగం, తెలంగాణ సాహిత్యం ప్రత్యేకతలు-మొదలైన అంశాల పట్ల చర్చలు జరిగాయి.
పి. జ్యోతి గారు మోడరేటర్‌గా చేసిన ‘ఆకాశంలో సగం’ సెషన్ నాకు బాగా నచ్చింది. ఎండవల్లి భారతి, ఉమా నూతక్కి, షాజహాన గార్లు తమ కథల వెనుక ఉన్న మూలాలు చెబుతుంటే సభంతా చప్పట్లతో మారుమ్రోగింది. ‘‘ఎండు చేపలు వండుకున్న తర్వాత వాటి వాసన మిగిలే ఉంటుంది. వాటి వాసనను పట్టుకొని కథలు రాస్తున్నం. మా అమ్మమ్మ తన కథంతా నాకు చెప్పుకునేది. నా కథ చెప్పుకోవడానికి పిల్లలు నా దగ్గర లేరు. నా కథంతా ఎవరికి చెప్పుకోవాలి? అందుకే కథలు రాస్తున్నం’’ అని ఎండవల్లి భారతిగారు చెప్పిన మాటలు నన్ను ఎంతో కదిలించాయి.
మొదటి రోజు జరిగిన ‘ కవిత్వంలో కొత్త స్వరాలు’ సెషన్లో నేను పాల్గొన్నాను. నాతో పాటు నందకిశోర్, బాల సుధాకర మౌళి అన్నలు కూడా ఉన్నారు. మానస చామర్తి అక్క మా నేపథ్యాలను దృష్టిలో ఉంచుకొని మా సాహిత్యానికి సంబంధిన విలువైన ప్రశ్నలు అడిగారు. కవిత్వంలో వస్తు, రూప సంబంధ చర్చలతో పాటు మా కవిత్వంలోని ఒక్కో ప్రత్యేకమైన లక్షణం గురించి, పిల్లలతో కవిత్యం రాయిస్తున్న క్షణాల గురించి అడిగారు. ఈ సెషన్ విజయవంతం కావడం వెనుక మానస అక్క శ్రమ ఎంతో ఉంది. నా కవిత్వంలోని అపేక్షా స్వరం గురించి, వ్యక్తిగత ఉద్వేగాల గురించి అడిగింది. ‘‘ అమ్మ గురించి, నాయిన గురించి, చెల్లెలు గురించి ఇలా నా వ్యక్తిగత జీవితం గురించి రాసుకున్నట్టు అనిపించిన ప్రతి కవితలోను తెలంగాణ గ్రామీణ బహుజన జీవితం ఉందని’’ చెప్పిన.
నాలుగు భాషల్లోను ప్రసిద్దులైన రచయితలతో ముఖాముఖి సెషన్ నిర్వహించారు. అతిచిన్న వయస్సులోనే చరిత్రను రికార్డు చేస్తున్న మనుపిళ్ళైకు ఉన్న క్రేజ్ చూసి చాలా ఆశ్చర్య పోయాను. మధురాంతకం నరేంద్ర, బండి నారాయణస్వామి, కొలుకులూరి ఇనాక్ గార్లతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. మధురాంతకంగారు చారిత్రక నేపధ్యం నుంచి తన రచనల గురించి వివరించారు. ఛాయా, అజూ, బాలా బుక్స్, రaాన్సీ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన పుస్తకాలు, సాహిత్య అకాడమీ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి వచ్చిన తెలుగు పుస్తకాలు ఆ ప్రదర్శనలో ఉన్నాయి. అన్ని సెషన్స్ తిరిగి ఈ పుస్తకాల దగ్గరే కొంచెం సేపు కూర్చొని సేద తీరినం.
మూడు రోజులు పెద్దింటి అశోక్ కుమార్ అన్న, నేను ఒకే రూంలో ఉన్నాము. అన్నతో గడిపిన సమయంలో ఒక కథ పుట్టుక, దాని ఎడిటింగ్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నాను. జిగిరి నవల పుట్టడం వెనుక నేపధ్యం తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్య పోయాను. ఎలుగుబంటిని ఎలా ఆటాడిస్తారు, ఎలా ఆహారం అందిస్తారు అనే విషయాలను రాయడానికి ఒక పదిహేను రోజులు వాళ్ళతో గడిపిన రోజులు చెబుతుంటే ఒక కథ రాయడం వెనుక ఎంత శ్రమించాలో అర్ధం అయ్యింది. అంత దూరం పోయి ఏం చూసొచ్చినావని ఎవరైనా అడిగితే లాల్‌బాగ్ అని చెబుత. దాన్ని చూడకపోతే ఏదో కోల్పోయే వాళ్ళం అనే భావన కలిగింది. బెంగుళూరు ప్రయాణంలో సంఫీుర్ అన్న, షాజహాన అక్కలతో కలిసి ‘లాల్ బాగ్’ చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. పూల సరస్సులో తేలుతున్న అనుభూతి నిచ్చింది. అడుగడుగునా పూల మొక్కలు. ఎన్నో వందల యేండ్ల నాటి చెట్లు పలుకరిస్త్తూ అక్కడ కనబడ్డాయి. ఎక్కడ చూసిన పచ్చదనంగా కనబడుతున్న బెంగుళూరు రోడ్లను చూసిన తర్వాత ఎక్కడికక్కడ చెట్లను నరుకుతున్న హైద్రాబాద్ నగరం గుర్తొచ్చింది.
బుక్ బ్రహ్మ లాంటి సాహిత్య పండుగలు మన దగ్గర జరుగుతలేవని తినేను అనుకోవడం లేదు. ఇదివరకు ఇతర భాషా సాహితీవేత్తలను పిలిచి కవి సంగమం ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించింది. ‘రైటర్స్ మీట్’ లాంటి కలయికలు కొత్త కథకులను పరిచయం చేసింది. బహుజన కూడలి లాంటి కలయికలు తెలంగాణ కథ బలంగా రావడానికి ఎంతో తోడ్పడిరది. ఖమ్మం ఈస్తటిక్స్, హోరు కూడా అలాంటి వైపు వినూత్నంగా నడుస్తుంది. అయితే నాలుగు భాషల రచయితలను కలపడం బుక్ బ్రహ్మ ప్రత్యేకతగా నాకనిపించింది.
బుక్ బ్రహ్మ ఫెస్టివల్ జరగడం ఇది రెండో సారి. అక్కడికి పోయిన వాళ్ళే ప్రసిద్ధ రచయితలా? మిగతా వారు లేరా అనే మాటలు సహజంగా వినిపిస్తుంటాయి. మిగతా రచయితలకు కూడా తర్వాత తర్వాత అవకాశం వస్తుందని అక్కడి నిర్వహణ చూశాక అర్ధమయ్యింది.
