ఎగిసిపడే ఉద్యమ కెరటం- తెలంగాణ సాహిత్య వనం – అనిశెట్టి రజిత బాల్యం – విద్యాభ్యాసం – భండారు విజయ

కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమదేవి పరిపాలించిన ప్రాంతం, అనేక విప్లవాల పోరుగడ్డ, సాహిత్య సాంస్కృతికల వేదిక ఓరుగల్లు మహానగరంలో పుట్టిన మరో రుద్రమ వంశ అనిశెట్టి రజిత. ఏప్రియల్‌ 14వతేదీ 1958లో జయలక్ష్మీ, బాలరాజు దంపతులకు హన్మకొండ కుమారపల్లిలో ఆమె జన్మించారు. ఆమెకు ఒక సోదరి ఉన్నారు.

ఆమె ప్రాధమిక, మాధ్యమిక విద్య అంతా కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌ వాతావరణంలో, ఆంగ్ల మాధ్యమంలో నడిచింది. ఇంటర్మీడియట్‌ ఒకప్పటి మహిళా కళాశాల, వడ్డేపల్లిలో జరుగగా, అదాలత్‌ వద్ద వున్న వరంగల్‌’ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ కళాశాలలో డిగ్రీ చదివారు. ఉన్నతవిద్య (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) ప్రజా పరిపాలన శాస్త్రాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివి పట్టబద్రురాలైనారు.
ప్రజా పరిపాలనలో (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎం.ఫిల్‌, పిహెచ్‌డిలు చేసి వారి గురువులు, వాసిరెడ్డి భాస్కరరావు మరియు అంపశయ్య నవీన్‌, డా.శ్యామల, డా.శోభ గారిలా తానూ ఉన్నతవిద్యను బోధించే బోధకురాలిగా స్థిరపడాలన్న ఆమె కోరిక కొన్ని, అనివార్య కారణాల వలన ఫలించలేదు. ఆమె అంతకుముందే బి.ఫార్మసీ చేసి ఉండడం వలన చివరికి కాకతీయ విశ్వవిద్యాలయంలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌గా లాబ్‌ అసిస్టెంట్‌గా తన వృత్తిని మొదలుపెట్టారు. 2015లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ మీద విశ్వవిద్యాలయ పరీక్షల విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.
కుటుంబ జీవితం: ఆమె విద్యార్ది దశ నుండి చురుకైన విద్యార్ధిగా1969లో జరిగిన తెలంగాణా అస్తిత్వ పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఒకవైపు కళాశాల చదువులో రాణిస్తూ, మరోవైపు విద్యార్ధి విప్లవోద్యమాలకు ప్రభావితం అయి అనేక అంశాలపై గళమెత్తి మాట్లాడారు. ఆమె స్వభావరీత్యా ప్రకృతి ప్రేమికురాలు. అడవులన్నా, మనుషులన్న, మూగజీవులన్న మక్కువ ఎక్కువ. విప్లవోద్యమ బాటలో నడవాలన్న ఆమె కోరిక తండ్రి గారి ఆకస్మిక మరణంతో నెరవేరలేదు.
చిన్నప్పటి నుంచి తన చుట్టూ వున్న స్త్రీలు వివాహ వ్యవస్థలో కూరుకుపోయి, పడుతున్న బాధలును అధిగమించి బయటకు రాలేక, గత్యతంతరం లేని పరిస్థితుల్లో, ఆ వ్యవస్థ నుండి బయటకు రాలేని అనేకమంది స్త్రీల వ్యధలను చూసి, చూసి తను జీవితంలో వివాహం చేసుకోకూడదని కృతనిశ్చయానికి వచ్చారు. జీవితాంతం మొక్కువోని దీక్షతో అదే దైర్యంతో, ఆరోగ్యం సహకరించకపోయినా, ఒంటరి మహిళగానే జీవించారు.
తండ్రి మరణానంతరం కుటుంబానికి పెద్దగా, తల్లి, మేనత్త, ఇద్దరు ముదసలి నానమ్మ, అమ్మమ్మలను చూడవల్సిన బాధ్యత ఆమెపైనే వుండడంతో, ఆమె పూర్తిగా కుటుంబానికి అంకితమై నిశ్వార్ధంగా తన సేవలు అందించారు. ఆ సందర్భంలో ఆమె అడవులకు వెళ్లి పోరాటం చేయాలనుకున్న కోరికను చంపుకుని, ప్రయత్నపూర్వకంగా సాహిత్యం వైపుగా తన మన్సును మళ్లించారు. చిరకాల కోరిక నేరవేర్చుకోలేకపోయినా, కనీసం మైదాన ప్రాంతంలోని ప్రజల కోసం ఏమైనా చేయాలన్న తలంపుతో నిరంతరం తాపత్రయ పడ్డారు. ఆచరణాత్మకంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా బీద, బిక్కి, బడుగు వర్గాల వారితో పాటు, అనేకమంది విద్యార్ధులను తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి చదివించారు. ఎందరో ఉద్యమకారులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఆమె చివరిదాకా ప్రజలకోసం, ప్రజల కొరకు, ప్రజల మధ్యనే జీవించారని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
తును వెళ్తున్న ప్రదేశాలలో రోడ్డుమీద కనబడ్డ ప్రతి బిచ్చగాడికి, ఎంత పనుల ఒత్తిడిలో వున్నా, రోడ్డు మీద వాహనం ఆపుకుని వెళ్ళి, మరీ వారికి తృణమో, ఫలమో అందివ్వకుండా వుండలేని కారుణ్యమూర్తి ఆమె. తన ఇంటికి వచ్చిన వారికి ఆతిధ్యం ఇవ్వడంలోనూ, వారితో స్నేహించడంలోనూ ఆమె అమితమైన ఆనందాన్ని పొందేది.
తల్లి జయలక్ష్మి గారికి క్యాన్సర్‌ వ్యాధి సోకినప్పుడు దీర్ఘకాలం ఆమె తల్లికి చేసిన సేవలు ఎనలేనివి. తల్లి మరణానంతరం, కుటుంబ పరంగా చాలా ఒత్తిడికి లోనైంది. మానసికంగా, శారీరకంగా ఒంటరిగా మిగిలిపోయింది. ఆసమయంలో ఆమెకు పుస్తకాలే నేస్తాలు ఆయ్యాయి. మొక్కువోని దైర్యంతో వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో సమస్యలకు ఎదురోడ్డి దైర్యంగా నిలిచింది. తండ్రి నిర్మించిన ఇంటిపై ఆమెకు చాలా మక్కువ ఉండేది. పూర్తి శిధిలావస్థలో ఆ ఇంటిని అమ్మవల్సి వచ్చినప్పుడు ఆమె హృదాయానికి అది మరో పెద్ద గాయంగా భావించింది.
ఉద్యమ జీవితం: తండ్రి బాలరాజుగారు జీవించి వున్నంత కాలం, సగర వృత్తి కొనసాగిస్తూనే, కుమారుపల్లి, ఆ చుట్టుపక్క ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆ ప్రాంత పెద్దమనిషిగా ఆయన నిస్వార్ధంగా సేవలను అందిందించేవారు. తన చిన్ననాటి నుంచి తండ్రి చాటున పెరిగిన అనిశెట్టి రజిత, పెరిగి పెద్దవుతున్న క్రమంలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందనే చెప్పాలి. తన తండ్రి నమ్మిన సిద్ధాంతం ఆచరిస్తూ తను జీవించి వున్నంతకాలం విద్యార్ధులకు, బాధితులకు తన వంతు సాయం చేస్తూ.. వారి ఎదుగుదల కోసం జీవించిన ధన్యజీవి. తండ్రి స్పూర్తికి కొనసాగింపుగా ఆమె విద్యార్ధి దశ నుండే అటు విద్యార్ధి ఉద్యమాలలో మమేకం అవుతూ ఇటు మహిళల అభ్యున్నతి కోసం మల్లాది సుబ్బమ్మగారి లాంటి వారి స్పూర్తితో మహిళలకోసం, వారి హక్కుల కోసం పనిచేసేవారు.
అనిశెట్టి రజిత తను పీజీ చదువుతున్న కాలంలో తన మిత్రులు. భండారు విజయ, జూపాక సుభద్ర, కొమర్రాజు రామలక్ష్మిలు వ్యవస్థాగత సభ్యులుగా ఏర్పడి, 1984 సంవత్సరంలో ‘‘నారీ చైతన్య వేదిక’’ అనే ఒక మహిళా సంస్థను మొట్ట మొదట వరంగల్లులో ప్రారంభించారు. ఆ సంస్థ నుండి అప్పటి సమాజంలో వేళ్లూనుకుని పోయిన మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలు, బృణహత్యలు, ముఖ్యంగా వరకట్న హత్యలపై అనేక ప్రాంతాలలో క్షేత్ర పర్యటన చేస్తూ నిజనిర్దారణ కార్యక్రమాలను నిర్వహించారు. పాటలు రాస్తూ, పాడుతూ ప్రజలలో చేతన్యం కలిగించే విధంగా ప్రజలతో మమేకం అయ్యారు. సారా ఉద్యమంలో మల్లాది సుబ్బమ్మ, రోశమ్మల స్పూర్తితో, కా.బేబక్క, కా.రమాదేవి మొదలగు స్థానిక మిత్రులతో కలిసి వరంగల్లు జిల్లాలో సారా ఉద్యమానికి ముందు వరసలో నిలబడ్డారు.
స్వతహాగా అనిశెట్టి రజిత నాస్తికవాది, స్త్రీవాది కావడం వలన ఇటు విద్యార్ధి, మహిళా ఉద్యమాలతో మమేకం అవుతూనే, అటు హేతువాద మహాసభలలో తన గొంతును వినిపించారు. డా. కత్తి పద్మారావు, పెనుగొండ లక్శ్మినారాయణ, లీలావతి, గూడూరు సీతామహాలక్ష్మి వంటి మిత్రులతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరు ఉద్యమాలలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఆ సమయంలోనే అనిశెట్టి రజిత అంబేడ్కర్‌ రచనలకు, ఉపన్యాసాలకు ప్రభావితురాలై అంబేడ్కరిష్టుగా మారి బౌద్దం తీసుకున్నారు. మహాత్మా జ్యోతీరావు ఫూలే, సావిత్రీభాయి ఫూలే సిద్దాంతాలను అనుసరిస్తూ వరంగల్లులో మిత్రబృందాన్ని కూడగట్టుకుని అనేక కార్యక్రమాలను నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు వైజాగ్‌లో ‘సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ మరియు ‘ఆంద్రప్రదేశ్‌ మానవ శరీర అవయవదాన సంస్థ’ గూడూరు సీతామహాలక్ష్మి గారు వ్యవస్థాగత సభ్యులుగా వున్న ఈ సంస్థలలో కార్యవర్గ సభ్యులుగా వుంటూ, అటు సావిత్రీభాయి ఆశయాల పునరుద్దరణకు పాటుపడుతూనే, మరోవైపు శరీర,అవయవ దాన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహించారు.
తెలంగాణ విభజన తర్వాత భండారు విజయ, ఈశ్వర లింగం, గుత్తా జ్యోస్న మొదలగు వారితో కల్సి ‘తెలంగాణ మానవ శరీర, అవయవ దాన సంస్థ’ వ్యవస్థాక సభ్యులుగా వుంటూ, అనేక మంది మిత్రులలో శరీర, అవయవ దాన అవగాహన సభలను నిర్వహించారు. జీవితాంతం తాను నమ్మిన సిద్దాంతాన్నే అనుసరిస్తూ, ఆచరిస్తూ, నిజాయితీగా జీవించారు. చివరికి తన మరణానంతరం తను ముందుగా నిర్ణయం తీసుకున్న విధంగా తన కళ్ళను దానం చేశారు. అలాగే తన పార్ధీవదేహాన్ని ‘కాళోజీ వైద్య విశ్వవిద్యాలయ’ వరంగల్లు వైద్య విద్యార్ధుల పరిశీలనార్ధం దానం చేసిన మహామనిషి అనిశెట్టి రజిత.
తెలుగు సాహిత్యంలో ఒక కవయిత్రిగా, రచయితగా, వ్యాస కర్తగా ఒకవైపు రాణిస్తూ. అనేక సాహితీ సంస్థలలో క్రియాశీలక సభ్యులుగా పనిచేసారు. మరోవైపు ఒక సామాజిక కార్యకర్తగా బీద, బడుగు జనుల అభివృద్ధి కోసం బహుజనవాది మహాత్మా కాన్షీరామ్‌ను ఆదర్శంగా తీసుకుని బహుజనవాదిగా రూపాంతరం చెందారు. అనేక బహుజన సభల్లో మాట్లాడారు. ఆ సమయంలోనే ఆమెకు అత్యంత ఇష్టమైన పొడవాటి తన తల వెంట్రుకలను క్యాన్సర్‌ వ్యాధి పీడితుల కోసం సమర్పించి బహుజన పార్టీ నాయకురాలు మాయావతిలా తల కట్టును మొదటిసారిగా క్రాపును చేయించుకుని ఆదర్శవాదిగా నిలిచారు.
మలిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఎగిసిపడుతున్న సందర్భంలో ఆమె కాకతీయ విశ్వవిద్యాలయ సిబ్బందితో పాటు 42రోజుల సకల జనుల సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. ఐఖ్యావేదిక పిలుపు మేరకు ఊరు-వాడా, వంటా-వార్పు, రోడ్డుమీద సహపంక్తి బోజనాల కార్యక్రమాలను నిర్వహించారు. అనేక ధర్నాలు, నిరసనలు, భహిరంగ సమావేశాలు నిర్వహించి, తెలగాణ మలిదశ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు.
మిలియన్‌ మార్చ్‌, సాగర హారం, ఛలో! ట్యాంక్‌ బండ్‌ వంటి కార్యక్రమాలలో పాల్గొనటేమే కాకుండా, అనేకమంది రచయితలను కూడగట్టుకుని తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని తన నిజాయితీని చాటుకున్నారు. అమరులైన అనేకమంది విద్యార్ధుల అంతిమ యాత్రల్లో పాల్గొని స్వతంత్య్ర తెలగాణ కోసం ఆత్మతర్పణ చేసిన వారికి అనేక వేదికల మీద జోహార్లు అర్పించారు. ఉద్యమానంతర స్వతంత్ర తెలగాణ రాష్ట్రంలో అప్పటి టి.ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఆమెను ఉద్యమకారిణిగా, తెలంగాణ భాష ఉత్తమ రచయితగా గుర్తిస్తూ ఆమెను భహిరంగ వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారు. బంగారు తెలంగాణ స్వపరిపాలనలో మన నీరు, మన నిధులు, మన కొలువులు అన్న నినాదం ఒక భ్రమగానే మిగిలిపోయినప్పుడు, తిరిగి తన గొంతును సవరించి ప్రభుత్వ పాలకులకులకు వారి నిర్మాణాలకు వ్యతిరేకంగా తన నిరసన గళాన్ని వినిపించిన ధీరశాలి అనిశెట్టి రజిత.
సాహిత్యం – సాహిత్య సేవ: అనిశెట్టి రజిత తన విద్యార్ధి దశ నుండి కవిత్వం రాయడం మొదలు పెట్టారు. వివిధ సాహిత్య ప్రక్రియలైన వచన కవిత, పాట, నానీలు, హైకులు, మినీ కవితలు, దీర్ఘ కవితలు, వ్యాసాలు, కథలు దాదాపు పదమూడుకు పైగా రచనలు చేశారు. వరగల్లు ఉధ్యమాల పోరుగడ్డ మాత్రమే కాదూ.. సాహిత్య, సాంస్కృతిక వేదికల సమాహారం.. కీ.శే. కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణరావుల సోదరులతో పాటు అంపశయ్య నవీన్‌, ప్రొ. కిషన్‌ రావు వంటి తెలుగు సాహిత్య కారుల శిష్యరికంలో తన రచనలకు పదునుపెడుతూ హన్మకొండలో ‘మిత్రమండలి’ లో క్రియాశీలక సభ్యులుగా పనిచేశారు. శ్రీయుత. టి.శ్రీరంగస్వామి, ప్రసారిక ఎడిటర్‌ నెమలికొండ బాలకిషన్‌ రావు, కృష్ణారెడ్డి, ప్రస్వాజీ మొదలగు వారు కలిసి పెట్టిన ‘సాంస్కృతిక సాహిత్య వేధిక’లో కార్యవర్గ సభ్యులుగా తమ సాహిత్యానికి మరికాస్త మెరుగులు దిద్దుకున్నారు. అప్పటి తన మిత్ర బృందం నిధి (నేరేడుకొండ బ్రహ్మచారీ), భండారు విజయ, పొట్లపల్లి శ్రీనివాసరావు, కొమర్రాజు రామలక్ష్మి, శీలం రాజేశం, పబ్బా శ్రీశైలం, వింజమూరి రమాదేవి వంటి సాహితీ మిత్రులతో కలిసి సాహిత్య కార్యక్రమాలను చురుకుగా నిర్వహించేవారు.
2012లో నలుగురు మిత్రులతో కలిసి ‘రుద్రమ ప్రచురణ సంస్థ’ అనే ఒక పుస్తక ప్రచురణల సంస్థను స్వీయ, మరియు సహసంపాదకులతో కలిసి ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా వివిధ అంశాలతో కూడిన వ్యాస, కవిత్వ, కథా సంకలనాలను దాదాపుగా 15 పుస్తకాలను ప్రచురించారు. తెలంగాణ రచయితల వేదిక కార్యవర్గ సభ్యులుగా, ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’వ్యవస్థాగత సభ్యురాలిగా అమరులయ్యే వరకు ఆ సంస్థ నేషనల్‌ కార్యదర్శిగా పదవిలోనే వున్నారు. స్త్రీవాద పత్రిక భూమిక, కొలిమి, బహుళ వంటి వెబ్‌ పత్రికల సంపాదక వర్గ సభ్యులుగా కొనసాగుతూనే 11.8.2025న తుది శ్వాసను విడిచారు.
స్వీయ రచనలు: 1. గులాబీలు జ్వలిస్తున్నాయి – కవితా సంపుటి – 1984, 96, 2. నేనొక నల్లమబ్బునవుతా-కవితా సంపుటి-1997, 3. చెమట చెట్టు – కవితా సంపుటి – 1999, 4. ఉసురు – కవితా సంపుటి – 2002, 5. ఓ లచ్చవ్వ – దీర్ఘ కవిత – 2005, 6. గోరంత దీపాలు – నానీల సంపుటి – 2005, 7. దస్తకత్‌ – హైకూల సంపుటి – 2005, 8. అనగనగా కాలం – కవితా సంపుటి – 2005, 9. నన్హే ఓ నన్హే – నానీల సంపుటి – 2007,10. మట్టిబంధం – కతా సంపుటి – 2006, 11. మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి – దీర్ఘ కవిత – 2010, 12. నిర్భయాకాశం కింద – కవితా సంపుటి – 2016, 13. కాలం కాన్వాస్‌ మీద – కవితా సంపుటి – 2023
రుద్రమ ప్రచురణలు: 1. జిగర్‌ – కవితా సంకలనం (తెలంగాణ విశిష్ట కవిత్వం) – 2013, 2. ఉద్విగ్న – కవితా సంకలనం (అత్యాచారాలపై నిరసన కవితా) -2013, 3. ఆకాశపుష్పం – (కవిత్వ, వ్యాస సంకలనం) -2014, 4. పోలవరం ప్రాణాంతక ప్రయోగం (కవిత్వ, వ్యాస సంకలనం) – 2014, 5.ముజఫర్‌ నగర్‌ మారణకాండ ( నిషిద్ద మేఘాల్లోకి మా ప్రాయనం)-2014, 6. అక్షర శరధి దాశరధి – (వ్యాస సంకలనం) – 2016, 7. ఆదివాసుల మారంమయి మహామానవి – మహాశ్వేతాదేవి (వాస సంకలనం)-2018, 8. మాతృవందనం – (కథా సంపుటి) – 2018, 9. ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు రచనలు (వ్యాస సంకలనం) – 2020, 10. కరోనా కాలం కథలు ( శాతాధిక కథా సనకాలం) – 2020, 11. చీమమండా న్జోజీ అడిచె – ఫెమినిస్ట్‌ మానిఫాస్టో, ప్రసంగాలు అనువాదం – 2023, 12. హవేలి దొర్సాని – కథా సంపుటి -2023, 13. కాలం జాడలు తీస్తూ – కవితా సంపుటి – 2023, 14. సెలయేటి గలగలలు – వ్యాస సంపుటి – 2023, 15. భారతదేశంలో వితంతు వ్యవస్థ – వ్యాస సంకలనం – 2023
రచనా వస్తువు- లక్షణాలు
అనిశెట్టి రజిత స్త్రీవాద కవయిత్రి, రచయిత్రి. సబ్బండ కులాల తరపున నిలబడిన బహుజనవాది. మహిళా హక్కుల సామాజిక కర్యకర్త. ఆమె రాసిన ప్రతి రచనలో వస్తు వైవిధ్యం వుంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు, దిగువ మధ్యతరగతి స్త్రీలు, దళితులు, పీడితులు, బాధితులు, బహుజనులు ఆమె రచనల్లో మనకు కనబడే ప్రధాన వస్తువులు. ముఖ్య పాత్రధారులు. కథా, కవిత్వ, వ్యాసాలు అనిశెట్టి రజిత ఏమి రాసినా, ఆమె బాధితుల పక్షాన నిలబడి సమాజం వైపు, పాలకులవైపు తన ప్రశ్నలను సంధించింది.
ఆ నాటి భూస్వామ్య వ్యవస్థాగత పద్దతుల నుండి నేటి సామ్రాజ్యవాద పెట్టుబడీదారి వ్యవస్థలో నలిగిపోతున్న సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి మహిళల, విద్యార్ధుల, దళిత, బహుజన వర్గాల వారిని చైతన్య పరచడం కోసం ఆమె తన రచనలు చేశారు. ఒకవైపు పోటీ ప్రపంచంలో ప్రజలు అనేక రకాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ, పోటీ ప్రపంచం చక్రాల కింద నలిగిపోతు, శిధిలామౌతున్న ప్రజల జీవనగతులను మెరుగుదిద్దే ప్రయత్నం చేసుకోవాలని, తన రచనల ద్వారా స్ఫూర్తిని నింపే దిశగా వారి రచనలు వుంటాయి. ఎవరి బతుకు కోసం వారే పోరాటం చేయాలని చెబుతూ సబ్బండ జాతుల తరపున ఆమె తమ రచనలను కొంసాగించారు.
బ్రిటీష్‌ పాలకుల నాటి నుండి, భూస్వామ్య వ్యవస్థలో దొరలు, దొరసానులు చేసిన దాష్టీకాల కింద నలిగిపోయిన మహిళల జీవితాలకు ఊరట కలిగిస్తూ బాధితుల తరపున తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. గ్లోబలైజేషన్‌ ద్వారా సంక్రమించిన, సామ్రాజ్యవాద, విదేశీ విష సంస్కృతిలో ఆహుతైపోతున్న అనేకమంది స్త్రీలను, విద్యార్ధులను, యువతను అప్రమత్తమై ఉండమని హెచ్చరిస్తూ, వస్తుమయ బురదలో కొట్టుకపోద్దని, అనిశెట్టి రజిత సామాన్య ప్రజల పక్షాన ఆచారణాత్మకంగా నిలబడి, వారి తెలివిడి కోసం పాటుబడుతూ, తన రచనలు కొనసాగించారు.
విదేశీ విష సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో, మత చాంధసవాదుల కుమ్ములాటలో సామాన్య ప్రజల శ్రమ దోపిడీని, వాటి విపరీత పోకడలను నిరసించడమే కాకుండా వారిని అనుకరించడం వలన తెలంగాణ ప్రాంత అస్తిత్వ, భాష, యాసలతో పాటు వచ్చిన వారసత్వ సాహిత్య, సాంస్కృతిక, చారిత్రిక నేపధ్యాన్ని చెరిపెసే నూతనపోకడల వలన కలుగుతున్న నష్టాలను తన అనేక వ్యాసాలలో విపులంగా చెప్పారు.
విదేశీ పోకడల, అనుకరణ, మోజుల వలన సామాన్యులకు జరుగుతున్న నష్టాన్ని, దోపిడీని చెబుతూ, హెచ్చరిస్తారు. ప్రజల సొమ్మును, సాంస్కృతిక నేపధ్యాలను విధ్వంసం చేసే రాజకీయ నాయకులను ఎండగడుతూ, వారి ఆగడాలను తన రచనల ద్వారా తెలియపరిచారు. ద్వంసమై పోతున్న తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టు, సాహితీ, సంపద, చరిత్ర, సంస్కృతులను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజల పక్షాణ నిలబడి పోరాటాలు చేస్తూ జీవించి వున్నంత కాలం అనిశెట్టి రచనలు చేస్తూనే వున్నారు. పరిచయం లేనివారి పట్ల ఎల్లవేళలా ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరుకున్నారు.
ఆమె మొదటి కవితా సంపుటి ‘గులాభీలు జ్వలిస్తున్నాయి’! అంటూ స్త్రీల ఉనికి ప్రశ్నించారు. స్త్రీలలో వున్న బేలతనాన్ని/ నీలం తనంగా/ బనాబాలంగా కుభవృష్టించే/ నల్లమబ్బునౌతా!/ అంటూ ప్రజల కోసం నేనొక నల్లమబ్బునౌతా! అని, తన రెండవ కవితా సంపుటిలో పరితపించిన నిబద్దత కలిగిన రచయిత అనిశెట్టి రజిత.
ప్రాతివత్యం చెర/ శీలం వధ/ బలిపీఠంపై స్థీల వ్యధ/ అని ఒకచోట, మగ్గాలు పోయి/ మర మగ్గాలొచ్చాయి/ వాటి తాతలొచ్చి/ కడుపులు కొట్టాయి/ అంటూ మరోచోట చేనేత కార్మికుల వ్యధలను చెబుతారు.ఆచార్య ఎన్‌. గోపి గారి స్పూర్తితో ‘గోరంత దీపాలు’ దస్తకత్‌ అనే తన నానీల సంపుటిలలో నాలుగు లైనుల పదాలలో కొండంత వెలుగును అందించారు.
‘మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి’ అనే దీర్ఘ కవితలో / ఇప్పుడు జంటిల్మన్‌ /భర్తలందరికీ కావాలి/ తమ ఇంట్లోకి/ వంటింట్లోకి/ స్మార్ట్‌ శ్రీమతులు/ అంటూ పురుషుల కోరికల చిట్టాలలో దాగివున్న వారి ఆధిపత్యాన్ని ఒకవైపు ప్రశ్నిస్తూనే, మరోవైపు ముఖం మీద మొటిమలు/ పొడిబారిన కురులు/ నిముషాల్లోనే/ మటుమాయం విడ్డూరం/ అని ఒకచోట, పేదరికం దారిద్య్రం తప్ప/ మరే అంటరానితనమూ లేదు/ అది కేవలం ఉన్నవాళ్లకే చెందిన/ ప్రైవేట్‌ హక్కూ కాదు/ ప్రపంచ మార్కెట్‌/ విశాల ద్వారాలు/తెరిచి పెట్టింది / అంటూ స్త్రీలు మార్కెట్‌ మాయాజాలంలో పడిపోయి ఏమి నష్టపోతున్నారో తెలుసుకోమని చెబుతారు.
మరో కవితా సంపుటి ‘అనగనగా కాలం’ లో అమ్మా-అమ్మా, త్యాగ గీతం, అమ్మ సంస్మరణ దినం లాంటి అనేక వేదనా పూరిత అమ్మలకు సంబంధించిన కవితలున్నాయి. వారి అమ్మగారైనా శ్రీమతి జయలక్ష్మి గారిని స్మరించుకుంటూ అనిశెట్టి రజిత అనేక దుఃఖదాయక అమ్మల కన్నీటి గాథలను ఆ సంపుటిలో మనముందు పెట్టారు. మరో దీర్ఘ కవిత ‘ఓ లచ్చవ్వా’! కవితా సంపుటిలో దేశానికి స్వాతంత్య్రం/ అర్ధనారీ కేది భాగస్వామ్యం/ అంటూ ప్రశ్నిస్తూనే, గిదేవలి రాజ్యమే లచ్చావ్వా!/ అంటూ దళిత బహుజన మహిళలకు రాజ్యాధికారం ఎక్కడుందనే ప్రశ్నను సంధిస్తారు. ఎరుపెక్కిన తన కళ్ళు/ ప్రశ్నలెత్తిన కొడవళ్ళు/ అని హెచ్చరిస్తారు. ఇంకా అనేక కవితా సంపుటాలు ప్రచురించినప్పటికి స్థలాభావం వలన అన్నీ చెప్పడం కుదరనందుకు క్షమించ గలరు.
అనిశెట్టి రజిత తన మొదటి కథా సంపుటి ‘మట్టి బంధం’ ప్రజాహిత ప్రచురణ ద్వారా 2006 లో ప్రచురించబడిరది. కరువు, నిరుపాధి వల్ల ఊరి బంధనాలను తెంపుకొని వలస బాటలు పట్టి దారిద్య్రపు ఉచ్చులో ఉసురుసూరంటున్న లక్షలాది మంది మట్టి మనుషులకు ఆ కతా సంపుటినీ అంకితం ఇచ్చారు. ఇందులో మొత్తం 13 కథలున్నాయి. రచయిత తన మాటల్లో ఇలా చెబుతారు. ‘ఈ కథలు పెద్దపెద్ద వాళ్ళ జీవిత విశేషాలతో కూడినవి కాదు. అద్భుతాలేమీ లేవు. అద్భుతమైనవీ కావు. ఒక సామాజిక కార్యకర్తగా ఏవో కొందరు పిట్ట మనుషుల పొట్టి కతలంటూ రాయడం జరిగింది. నా స్వాభావిక నేపధ్యం ఈ కథల్లో మీకు తప్పక కనిపిస్తుంది’ అని చెప్పారు. అనిశెట్టి రజిత రచయితగా ఇంకా అనేక వ్యాసాలు రాశారు. వివిధ ప్రముఖ పత్రికలతో పాటు, రుద్రమ ప్రచురణలద్వారా వచ్చిన సంకలనాలలో, ప్రరవే వారు ప్రచురించిన అనేక వ్యాస, కథా సంకలనాలలో కూడా వారి రచనలు ప్రచురించబడి వున్నాయి.
ముగింపు:
అనిశెట్టి రజిత తన పేరుతోనే చాలా రచనలు చేసినప్పటికినీ, సృజన మరియు అగ్నిపాళి వంటి కలం పేర్లతో కూడా కొన్ని రచనలు చేసారు. ఆమె 11.8.2025 తేదిన అకాల మరణం చెందే వరకు స్త్రీవాద పత్రిక భూమిక, బహుళ మరియు విహంగ, కొలిమి. బహుళ వెబ్‌ పత్రికల సంపాదవర్గ సభ్యులుగా వున్నారు.
అనిశెట్టి రజితతో నాకు 1980 నుంచి ఉన్న స్నేహ పరిచయం వలన నేను తన వ్యక్తిగత, సామాజిక అంశాలతో పాటు, రచనా సాహిత్య వివరాలను సంపూర్ణంగా రాయగలిగానని చెప్పడానికి గర్విస్తున్నాను. ఒక మంచి మిత్రురాలిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, చాలా విచారకరమైన విషయం. అయినప్పటికినీ, తెలంగాణ వేదికపై ఆమె పోరాట పటిమ, తెలుగు మరియు తెలంగాణా సాహిత్యంలో ఆమె ఒక దృవతార. కలికితురాయిగా కలకాలం మిగిలి వుంటుందని కోరుకొంటున్నాను. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, తెలుగు సమాజం ఆమెను, ఆమె సేవలను ఎన్నటికీ మరువజాలదని ఆశిస్తూ….
– చిన్ననాటి మిత్రురాలు, రచయిత, మహిళా హక్కుల సామాజిక కార్యకర్త. హైదరాబాదు

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.