రజిత మేడం రచయిత్రిగా సామాజిక చైతన్య స్ఫూర్తిగా దేశమంతా పరిచయమే, ఆ అగ్నిపాలి వెనుక మృదువైన సున్నితమైన హృదయం ఉంది. సాటి మనుషులు, వృద్ధులు, శ్రామికుల పట్ల రజిత మేడమ్ ఆలోచన అంతు పట్టనిది. అమ్మ అని ముసలి వాళ్లు చెయ్యి చాచితే హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఎంత చేతికి వస్తే అంతా సహాయం చేసేస్తారు. హనుమకొండ మిషన్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఇద్దరు ముసలి దంపతులకు అన్ని విధాలా సహాయ సహకారాలను అందించేవారు.
మంచం, దుప్పట్లు బట్టలు, నిత్యవసర సామాన్లు వాళ్ళు అడిగినవి కొని ఇచ్చేవారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆటో డ్రైవర్లకు గృహ నిర్మాణ కార్మికులకు తన వంతు సహాయం అందించారు.
రజిత మేడంతో నా పరిచయం 30 సంవత్సరాల క్రితం మా మామయ్య ప్రగళ్ల పాటి ప్రకాశం గారు అశోక దగ్గర టీ బంక్‌లో నాకు పరిచయం చేశారు. ఆ రోజు నుండి చాలాసార్లు మా ఇంటి దగ్గర, బయట కలిసాము. మా మామయ్య, అత్తయ్య చనిపోయినప్పుడు వారి శరీర దానం కాకతీయ మెడికల్ కాలేజీలో అప్పగించినప్పుడు వచ్చారు. 2015లో ఉద్యోగ రీత్యా నేను సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్‌లో మహిళల కోసం హింస రహిత సమాజ ఏర్పాటు కార్యక్రమంలో పనిచేసినప్పుడు సంస్థ బోర్డు డైరెక్టర్‌గా, శ్రేయోభిలాషిగా కలవడం జరిగింది. గ్రామస్థాయి అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో రామలక్ష్మి మేడం, రజిత మేడం, విజయలక్ష్మి మేడం కలిసి నిర్వహించే వాళ్ళం. ఇష్టం లేని పెళ్లి చేస్తున్న ఒక అమ్మాయిని దత్తత తీసుకొని డిగ్రీ వరకు చదివించి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశారు. మేడంతో కలిసి యాదగిరిగుట్ట జరిగిన సంఘటనలు ఎదిరిస్తూ, 9 నెల పసిపాపపై జరిగిన అత్యాచార సంఘటన వ్యతిరేకిస్తూ, బిల్కీస్ బానోస్కు సంఫీుభావం తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు కలిసి చేశాం. రజిత మేడంకు మొక్కలన్నా, కుక్కలన్న విపరీతమైన ప్రేమ ఆదరణ. ఒక చిన్న కుక్క పిల్ల వీధి కుక్కల దాడిలో గాయపడితే చికిత్స చేయించి ఒక ఆటో డ్రైవర్ దగ్గర సురక్షితంగా ఉంచి సంరక్షణ నిమిత్తం ప్రతి నెల రూ 5,000/- పంపిస్తారు. రజిత మేడం నిరాశ, నిస్రుహలో ఉన్నవారికి ఒక స్ఫూర్తి. తన రచనలు మాటలు ప్రవృత్తి మానవ జీవనాన్ని ప్రశ్నించే నిలువుటద్దం. ఆశలు లేవు, కోరికలు లేవు, హంగులు ఆర్భాటాలు అక్కర్లేదు, ఆశయాలు, రచనలు సమాజంలో సమస్యలు ఇవి నిరంతర శోధన…. నాకోసం ఏమీ అక్కర్లేదు సమాజంలో సహాయం కోసం ఎదురు చూస్తూ కనీస అవసరాలకు సైతం ఆధారపడే శ్రామికుల కోసం మన వంతు సహాయం చేయాలని నేనేమీ ఇవ్వగలను ఏమి చేయాలని ఆరాటమే తప్ప తన ఆహారం గురించి గానీ ఆరోగ్యం గురించి గానీ అసలు పట్టించుకునే వారు కాదు. గత ఐదు సంవత్సరాల నుండి రజిత మేడంతో చాలాసార్లు తన ఆరోగ్యం గురించి ఆయుర్వేదం అలోపతి స్కానింగ్‌లకు వెళ్లడం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాము. షుగర్ పరీక్షలు చేయించుకుందామంటే చిన్నపిల్లలు తీరుగా ఇప్పుడు కాదు నాకు పని ఉంది అబ్బా అంటూ తప్పించుకునే వాళ్లు.
11 ఆగస్టు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు నాకు కాల్ చేసి ఇందిరా ఇంట్లో ఉన్నావా అని అడిగితే నేను ఆఫీస్‌కి వచ్చాను మేడం (వ్యక్తిగత కారణాల వలన 20 రోజుల నుంచి నేను సెలవులో ఉండడం వలన అదే రోజు జాయిన్ అయ్యాను ) అంటే అయ్యో నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదు ఉదయం నుండి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఏమీ తినలేదని అన్నారు. అదేంటి మేడం మీకు షుగర్ ఉంది అలా తినకుండా ఉంటే ఎలాగా అని సుమలత ఏమి వండలేదా అంటే నాకు తినబుద్ధి కావడం లేదు అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్దాం మేడం అన్నాను. ఇప్పుడు వద్దు ఏడు గంటలకు డాక్టర్ వస్తారు కదా అప్పుడు వెళ్దాము అంటే నేను మా ఇంటిలోని లలితకు కాల్ చేసి మేడమ్‌కి బాగోలేదు ఒకసారి వెళ్లి చూడు అంటే టీ పెట్టి, ఇంటి వద్ద ఉన్న బ్రూనో, బార్క్ కి అన్నం కలిపి తను మేడం కలిసి బయటికి వచ్చి అన్నం పెట్టి వెళ్లారు. నేను 6.40కి వచ్చి మేడంతో మాట్లాడాను సూప్ తాగుతారా అని అడిగితే నాకు గ్యాస్ ఫామ్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చాకే తీసుకుంటాను. ఏమైనా అంటే నేను పైకి వెళ్లి ఫ్రెష్ అయ్యి 20 నిమిషాల్లో వచ్చేసరికి మేడం సోఫా పక్కన కింద కూర్చొని ఉన్నారు. మేడం మేడం అని పిలిస్తే పలకలేదు వెంటనే డ్రైవర్నీ, రాయ్‌ని పిలిచాను. ఎదురుగుండా ఎంజీఎం సిస్టర్, పిలిచి చూపించాను, సిపిఆర్ కూడా చేశారు. దగ్గర వాళ్లకి తెలియజేసి హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాము…..
రజిత మేడం జూన్ 16న పేరిచర్ల లక్ష్మీకాంతమ్మగారి మరణం, దగ్గర వ్యక్తులకు జరిగిన అనుకొని సంఘటనలు చాలా కృంగదీశాయి. 20 రోజులుగా నేను రాయ్‌కి ఆరోగ్యం బాగులేకపోవడంతో హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. తను మా జిగ్గిని చూసుకుంటూ ఒంటరిగానే ఉంది, ఆరోగ్యం మంచిగా చూసుకోమని రాయికి నాకు ధైర్యం చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో మేడమ్‌కు తీవ్రమైన జ్వరం దగ్గుతో ఒక నెల రోజులు బాధపడ్డారు. ఆ సమయంలో నేను బయటికి వెళ్లి ఉండాలనుకుంటున్నానని దగ్గర వాళ్ళందరికీ తెలియజేశారు. చూడడానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు విద్యార్థి సారు, రామలక్ష్మి మేడంతో మాట్లాడారు. అదే సమయంలో మా కింద ఇల్లు ఖాళీ ఉండటంతో మేడంతో అంటే నేను గోపాల్పూర్ వచ్చేస్తానని అన్నారు. నెల రోజులు మెల్లిగా అన్ని సర్దుకుంటూ గోపాల్పూర్ వచ్చేశారు. మేడంకు అనుక్షణం తోడుగా ఉండి సహకరించే ఆటో అశోక్ అన్నా, సుమలత, లలిత…. చాలా బంధాలు కేవలం రక్తసంబంధము ఆర్థిక సంబంధాలు కానవసరం లేదు ఆత్మీయ సంబంధాలు…. రాజీ లేని మార్గంలో తనకు తానుగా ఆత్మబంధువులను సంపాదించుకున్నారు. ఎవరికి నచ్చకపోయినా, ఎవరు సహకరించక పోయినా ఒంటరిగానైనా నచ్చని వాటిని ధిక్కరించాలని ప్రశ్నించాలని, తమ తర్వాత తరం ఈ విధంగా తయారవ్వాలని ఆశపడ్డారు. నన్ను ఎవరికైనా పరిచయం చేసిన ఇందిరా నా ఆత్మీయురాలు స్నేహితురాలు అని పరిచయం చేసేవారు..
రజిత మేడం మనసు లోతుల్లో ఉన్న ప్రేమ అభిమానాన్ని నేను చూడగలిగాను, అనుకోని పరిస్థితులు మాటలతో కొన్ని నిర్ణయాలు బాధ కలిగించిన వ్యక్తిగతంగా మా మధ్య ఉన్న ఆత్మ సంబంధం మాకు తెలుసు.
