అందరికీ తెలిసిందే

ఇంద్రగంటి జానకీబాల
1955లో ‘సహనం’ అనే కథలో కొడవటిగంటి కుటుంబరావుగారు ఒక చక్కని విషయం చెప్పారు. అది ఏభైఅయిదు సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరని సత్యంగా వుండటమే గొప్ప. అందుకే ఆ రచయితని నేటికీ తలుచుకుంటున్నాం మనం, అదేమంటే – ‘అవతలివాడు మన దగ్గరలేని డబ్బు వుందని గానీ, రాని విద్య వచ్చుననిగాని అపోహపడితే కలగని ఆనందం మనకి సినిమాలను గురించి తెలుసుననుకుంటే కలుగుతుంది’ అని ఎంత చిత్రం! ఈనాడీ సమాజంలో ప్రతీ ఒక్కరూ తమకి సినిమా గురించి తెలుసుననే భ్రమపడుతూ వుంటారు. తెలియడమంటే చూడటం అని కాదు. దాన్ని విశ్లేషించటం సాంకేతికపరమైన మాటల్ని వుటంకిస్తూ మాట్లాడుతూ, వాళ్ళు తమకి సినిమా గురించి చాలా తెలుసుననే భ్రమలో వుంటూ ఎదుటివారికలాంటి భ్రమ కలిగిస్తూ వుంటారు. ఇందులో భాగంగానే సినిమా సంగీతాన్ని కూడా మనం భావించవచ్చు.
మొన్న ఒకామె నాకు అనుకోకుండా తటస్థపడింది. ఆమె ఒక గవర్నమెంటు ఆఫీసులో చిన్న స్థాయి వుద్యోగంలో వుంది. నేనక్కడ పదినిముషాలుండవలసి రావడంతో నాతో మాటలు కలిపింది-, ‘ఫలానా సినిమా చూశారా’ అనడిగింది. ”చూశాను” అన్నాను. ఆ సినిమా బాగుంది అంటే నాకామెతో తగాదా లేదు కానీ ఆమె ”స్క్రీన్‌ప్లే చాలా బాగుందండి. ఒక్కొక్క షాట్‌ చెప్పుకునేలా వున్నాయి” అంది. నేను ఆశ్చర్యంలో ములిగిపోయాను. గవర్నమెంటు ఆఫీసులో చిన్న వుద్యోగంలో వున్నంత మాత్రాన ఇవన్నీ తెలిసే అవకాశం లేదా’ అని ప్రశ్న వేసుకుని గందరగోళపడకండి. ప్రతీదానికీ ఒక శాస్త్రం ఉంటుంది. దాన్ని అధ్యయనం చేయాల్సి వుంటుంది. మాటలు వేరు. విషయం వేరు. ఆమె డైలాగుల గురించి, గ్రాఫిక్స్‌ గురించి, సౌండ్‌ మిక్సింగు గురించి చాలా మాట్లాడింది -, ”మీకు చాలా సినిమా పరిజ్ఞానం వుందే” అన్నాను-, ”ఆ… అదేం లేదండీ-, అందరూ మాట్లాడుతూ వుంటారు కదా! సినిమా అంటే ఏం గొప్ప విషయం కాదు గదా! అందరికీ తెలిసిందే” – అని చప్పరించింది.
”మరి సంగీతం గురించేం చెప్పలేదే” అన్నాను.
”సినిమాల్లో కొట్టే మూజిక్కు కొంచెం తెలుసుగానీ, పాటలూ అవీ పెద్దగా తెలీదు.” అంది నిజాయితీగా.
”మూజిక్కు కొట్టడమేంటి?”
”మరలాగే అంటారు కదండీ-, పాటలు వింటూనే వుంటాను” అంది.
”ఎలా వింటారు.”
”చిన్నప్పుడంతా మా యింటిపక్కన గుడి వుండేది. అక్కడ పొద్దున్నా, సాయంత్రం మైకేసేవాళ్లు.”
”మైకేయడమేంటి?”
”అదేనండి బాబు – మైక్‌లో రికార్డులేస్తారుగా – అదీ.”
”ఓహో – అయితే…మీకు –
”నాకు పాటంటే అన్నమయ్య పాటేనండి. అదే నాకెంతో యిష్టం. అన్నమయ్య కీర్తన – అదే కృతి అలాగనేదో అంటారు కదండీ – ఆయనగారి పాటలే నాకిష్టం.”
”అయితే అన్నమయ్య కృతుల క్యాసెట్లు మీదగ్గర దొరుకుతాయన్నమాట-” అన్నాను.
”అన్నీ కాదండి. సినిమాల్లో పెట్టారు కదండీ అవి.
అవే ఎందుకిష్టం మీకు?
”అదేవిటండీ అలాగడుగుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయం అంటే అన్నమయ్యే కదండీ.”
నేను నవ్వుతూ కూర్చున్నాను. సినిమా అంటే కెమెరా, లైటింగు, మేకప్‌ అంటూ ఎన్నో సంగతులు చెప్పిన ఆమె పాటల గురించి ఎక్కువ చెప్పలేకపోవడం నాకు బాధ కలిగించింది.
సినిమాల్లో వచ్చిన అన్నమయ్య కీర్తనేదైనా చెప్పండి. నాకు గుర్తురావడం లేదు అన్నాను.
”భలేవారండీ – ‘అన్నమయ్య’ సినిమా నిండా అయ్యే కదండి,” తేలిగ్గా చెప్పిందామె.
”అవును సుమా!”
”అదీకాక ఒక సినిమాలో కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అంటూ వుందండి, సినిమా పేరు గుర్తు లేదు” అంటూ ఆలోచనలో పడింది.
”అవునండోయ్‌ – హీరోగారు ఎడంచేత్తో తొడమీద తాళం మహాజోరుగా బాదేస్తూ పాడతారు” అన్నాను.
”అవునవును. ఏ సినిమానండీ అది? గుర్తురావడం లేదు. మీకు గుర్తుందా?” అందామె అమాయకంగా.
”ఇంకా నయం అలాంటి తెలుగు సినిమాను గుర్తుపెట్టుకోకపోవడం వల్లనే నేనీ మాత్రం ఆరోగ్యంగా వున్నాను” అన్నాను వేళాకోళంగా నవ్వుతూ. ఆమె కూడా మరేం చెప్పకుండా ఒక వెర్రినవ్వు నవ్వి ఊరుకుంది.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

One Response to అందరికీ తెలిసిందే

  1. ఎడిటర్ గారూ,
    ఈ వ్యాసంలో స్త్రీవాదానికి సంబంధించిన విషయం ఏమిటో మాత్రం అర్థం కాలేదు. స్త్రీ వాద పత్రికలో స్త్రీ వాదానికి సంబంధించిన వ్యాసాలూ, కధలూ మాత్రమే రావాలా, వేరే విషయాల మీద రాకూడదా అంటే, రావొచ్చు, ఎందుకు రాకూడదూ అనే అంటాము. అయితే అందులో విషయం కాస్త విలక్షణంగా వుండాలి? ఎచ్చులు పోయే వారి గురించి అందరికీ ఎప్పట్నించో తెలుసు. అది స్త్రీలే కాకుండా, పురుషులు కూడా అవొచ్చు. నిజానికి సినిమాల గురించి విపరీతంగా మాట్టాడేది పురుషులే స్త్రీల కన్నా. అయితే ఏమిటీ? ఒక వ్యక్త్రి తెలివితక్కువగా, ఎచ్చులుగా మాట్టాడితే అందులో వెక్కిరింత తప్ప ఏమన్నా వుంటుందా? అక్కడి అదేదో గొప్ప శాస్త్ర విజ్నానమైనట్టు. ఇంట్రస్టు వుంటే, కొంచెం తెలుసుకుని సినిమాల గురించి చాలా మాట్టాడొచ్చు. ఏది ఏమైనా ఇది పెద్ద పాయింటు లేని వ్యాసం. క్షమించాలి అలా అన్నందుకు.

    సావిత్రి

Leave a Reply to సావిత్రి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.