నేనొక నల్లమబ్బునవుతా అంటూ మబ్బుల్లో కలిసిపోయిన రజిత – కొండవీటి సత్యవతి

రజిత గురించి ఎన్నో జ్ఞాపకాలు ముక్కలు, ముక్కలుగా గుర్తొస్తున్నాయ్‌. ఒక సంవత్సరం పాటు నేను నా మితృలకు రాసిన ‘‘ప్రేమ లేఖల’’ పరంపరలో రజితకు రాసిన ఉత్తరమిది. తను నాకు రాసిన సమాధానం నా దగ్గర దొరకడం లేదు. ఈ
ఉత్తరం మాత్రం దొరికింది.

‘‘గులాబీలు జ్వలిస్తున్నాయ్‌’’ అంటూ మొదలుపెట్టిన రజిత సాహితీ యాత్ర నిరాటంకంగా కొనసాగించిన సీరియస్‌ ఉద్యమ కార్యకర్త, రచయిత.
రజితతో నా స్నేహం ఎప్పుడు ఎలా మొదలైందో నాకు స్పష్టంగా గుర్తుంది. సంవత్సరం గుర్తు లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఐసి ఎస్సెస్సార్‌ బిల్డింగ్‌లో మల్లాది సుబ్బమ్మ గారు ‘‘వివాహం నేడు-రేపు’’ అనే అంశంపై ఒక సెమినార్‌ పెట్టారు. బహుశా అది 1984 అయ్యుండొచ్చు. ఆ మీటింగ్‌కి నేను నా సహచరుడు హాజరయ్యాం. చాలా మంది పేపర్‌ ప్రజంటేషన్‌లు చేసారు. చర్చలు వాడిగా వేడిగా సాగుతున్నాయ్‌. రజిత కూడా ఒక పేపర్‌ సమర్పించాల్సి ఉంది. తనకి సమయం ఇవ్వడం లేదు. చివరలో కొంచమే సమయం ఇచ్చారు. అప్పుడు రజిత నిప్పురవ్వలాగా మహాసూటిగా, వాడిగా మాట్లాడుతూ ‘‘మీరు చర్చిస్తున్నది వివాహ వ్యవస్థ మీద. పెద్దవాళ్ళే మాట్లాడుతున్నారు. ముందు మాలాంటి యువతకి అవకాశం ఇవ్వాలి కదా… అంటూ దులిపేసింది. ఆమె వాగ్దాటికి హాలంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అబ్బా… ఏమి మాట్లాడిరది అనుకున్నాం మేము. మీటింగ్‌ అయ్యాకా మేము తనని అభినందించాం.
రజితతో స్నేహం అలా మొదలైంది. ఆ తర్వాత చాలా పుంతలు తొక్కింది. నేనెంతో అభిమానించే రేడియో ఆర్టిస్ట్‌ శారదా శ్రీనివాసన్‌ గారి పరిచయం తన ద్వారానే. ఓ రోజు నా దగ్గరకొచ్చి శారదా శ్రీనివాసన్‌ గారింటికి వెళ్దాం వస్తావా అని అడిగింది. ఎందుకు రాను తప్పకుండా వస్తాను. ఆవిడ గొంతంటే నాకు చాలా ఇష్టం అన్నాను. శారదగారు అప్పుడు హిమాయత్‌నగర్‌లో ఉండేవారు. అలా ఇద్దరం వెళ్ళాం. శారదగారి అమ్మాయి రజితక్కా అంటూ పరుగెత్తి వచ్చింది. శారద గారింట్లో పుస్తకాలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అన్ని పుస్తకాలు నేను ఎవరింట్లోను చూడలేదు. అప్పట్లో నా దగ్గర చాలా తక్కువ పుస్తకాలుండేవి. ఆ రోజు ‘ఉచల్యా’ పుస్తకాన్ని శారదగారు నాకిచ్చి చదవమన్నారు. అలా రజిత ద్వారా శారద గారితో పరిచయమై ఆ స్నేహం ఇంకా కొనసాగుతోంది.
రంగనాయకమ్మ గారితో స్నేహం కలవడానికి కూడా రజితే కారణం. ఎలా సంపాదించామో గుర్తులేదు కానీ రంగనాయకమ్మగారి స్నేహం సంపాదించాం. అప్పుడావిడ కూకట్‌పల్లిలో అనుకుంటాను ఉండేవారు. చాలా తరచుగా ఆవిడ దగ్గరికి వెళ్ళే వాళ్ళం. అప్పట్లో రంగనాయకమ్మగారు మాతో చాలా స్నేహంగా ఉండేవారు. రోజంతా ఇంట్లో ఉండిపోయి బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. బయట విషయాల గురించి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకునే వారు. అలా సాగిన స్నేహం ఒకసారి జయప్రభ నేను కలిసి వెళ్ళినప్పుడు రంగనాయకమ్మగారు మాతో మాట్లడ్డానికి ఇష్టపడలేదు. కారణం ఇప్పటికీ నాకు తెలియదు. ఆ తర్వాత రజితను నన్ను కూడా ఇంటికి రానీయలేదు. వింతైన విషయమే.
నేను తరచుగా వరంగల్‌ వెళుతుండేదాన్ని. వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. తను మా ఇంటికొచ్చేది. రజిత మా అమ్మకి చాలా క్లోజ్‌. నేను ఇంట్లో లేకపోయినా అమ్మతో మాట్లాడుతూ ఉండిపోయేది. ‘నేనొక నల్లమబ్బునవుతా పుస్తకాన్ని వరంగల్‌లో నేనే ఆవిష్కరించాను. వరంగల్‌ మీడియాలో అప్పుడూ ఇప్పుడూ తను చాలా వైబ్రెంట్‌గా కనబడుతుంది.
భూమిక ‘‘ప్రత్యేక తెలంగాణ సంచిక’’ వేసినప్పుడు తను చేసిన కృషి వెలకట్టలేనిది. వరంగల్‌ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయింది చాలా రోజులు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అదో ప్రామాణిక సంచికగా మిగిలిపోయింది.
భూమిక నిర్వహించిన అన్ని సాహితీ యాత్రల్లోను తను, తన ఫ్రెండ్స్‌ తప్పకుండా ఉండాల్సిందే. రజిత ఎందరినో, ఎంతో ప్రేమించింది. పాకాల యశోదా రెడ్డి, సదాలక్ష్మి, అమృతలత, శారదా శ్రీనివాసన్‌, కాళోజీ వీళ్ళంతా తనకి ఎంతో ప్రియమైన వాళ్ళు. కాత్యాయని విద్మహేతో సహా వరంగల్‌లో ఓ పెద్ద సమూహమే తనతో ఉంది.
రజిత గురించి రాస్తున్నప్పుడు ఒక సంఘటన గురించి తప్పకుండా రాయాలి. దీని గురించి నేను ఎప్పుడూ ఎక్కడా రాయలేదు. 1986లో ఒక మహిళా సదస్సు కోసం నేను, రజిత, గూడూరు సీతామహా లక్ష్మి, సునీత అనే అమ్మాయి కలిసి కలకత్తా వెళ్ళాము. ఎవరు పిలిస్తే వెళ్ళామో నాకు గుర్తులేదు. అప్పుడు జరిగిన ఒక దుస్సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది.
1985లోనే నాకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆ తర్వాతి సంవత్సరమే కలకత్తా ఎలా వెళ్ళిపోయానో… నా సహచరుడిని అడగాలి. కలకత్తా మీటింగ్‌కి చాలా మంది మహిళలు హాజరయ్యారు. మాకు అప్పటికి ఒక్క ముక్క హిందీ రాదు. ఏమి విన్నామో, ఏమి అర్ధమైందో మరి. మూడోరోజున ఒకబ్బాయి సహాయంతో కలకత్తా తిరిగి ఉన్న డబ్బులన్నీ దులిపేసుకుని మధ్యాహ్నం రైలెక్కడానికి హౌరా స్టేషన్‌కి వచ్చాం. రైలొచ్చింది. అప్పుడు టికెట్లు బయటకి తీసి బోగీ దగ్గరకెళ్ళి చూస్తే అక్కడ మా పేర్లు లేవు. కంగారుపడుతూ బ్యాగుల్లోంచి టికెట్లు తీసి చూస్తే అవి అంతకు ముందురోజు టికెట్లు. మా గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. కళ్ళ ముందు నుండే మేము ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది. మా టికెట్లను బుక్‌ చేసింది మొక్కపాటి సుమతి. ఆర్గనైజర్‌గా తనే ఉంది. తనకీ తెలియకపోవచ్చు. ఫోన్లు లేవు. ఆమె ఎక్కడుందో తెలియదు, ఎందుకలా చేసిందో తెలియదు. ఒకసారి టికెట్లు చెక్‌ చేసుకోకపోవడం మా తప్పు. ఏమి చెయ్యాలి? సునీత చిన్న పిల్ల ఏడుపు లంకించుకుంది. మాకూ ఏడుపొస్తోంది. మేము మర్నాడు రైలు దిగకపోతే మా వాళ్ళెంత హైరానా పడతారో. మొబైల్‌ ఫోన్లు లేవు. మధ్యాహ్నం నుంచీ ఏమీ తినలేదు. ఆకలి, ఎక్కువ డబ్బుల్లేవు. అటూఇటూ తిరుగుతుంటే స్టేషన్‌ మాస్టర్‌ రూం కనబడిరది. నలుగురం లోపలికెళ్ళాం. ఆయన పేరు భట్టాచార్య. మా చేతులకున్న వాచీలు తీసి ఆయన టేబుల్‌ మీద పెట్టి ఇంగ్లీషులో జరిగింది చెప్పాం. మా దగ్గర వాచీలు మాత్రమే ఉన్నాయని అవి తీసుకుని మమ్మల్ని హైదరాబాద్‌ పంపించే ఏర్పాటు చెయ్యమని అడిగాం. సునీత ఏడుస్తూనే ఉంది. మా బాధని ఆయన అర్ధం చేసుకున్నాడు. మా వాచీలు వెనక్కు తీసుకోమన్నాడు. సాయంత్రం వెళ్ళే కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పంపే ఏర్పాటు చేస్తానని మాతో చెప్పి ఒకాయనని పిలిచి మమ్మల్ని కేంటీన్‌కి తీసుకెళ్ళి భోజనం పెట్టించమన్నాడు. హాయిగా భోజనం చేసాం. కోరమాండల్‌ రాగానే ఆయన రైలు వరకు వచ్చి ఎక్కించి ఒక టిసీకి మమ్మల్ని అప్పగించాడు. మేము వెళ్ళగానే డబ్బు పంపిస్తామని ఆయనకి చాలా చాలా థాంక్స్‌ చెప్పి రైలెక్కేసాం.
అప్పట్లో లేడీస్‌ కేబిన్‌ ఉండేది. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు టిసి. మేము నలుగురమే ఆ కేబిన్‌ ఉన్నాం. హాయిగా నిద్రపోదామనుకున్నాం. అప్పుడొచ్చాడు టిసి. ఒక డ్ర్రిరక్‌ బాటిల్‌ తెచ్చుకుని తాగుతూ మాతో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. భయపడి చచ్చాం. కొంత సేపైనాక ఇంకో టిసి వస్తే వీడు బయటకెళ్ళాడు. అంతే కేబిన్‌ తలుపేసేసి వాడు ఎంత కొట్టినా తీయలేదు. ఒకవేళ తలుపు తీయాల్సి వస్తే బాగా గొడవ చేద్దామని నిర్ణయించుకున్నాం. వాడు వచ్చి తలుపు కొట్టాడు కానీ మేము తీయలేదు. కొట్టి కొట్టి వాడు వెళ్ళిపోయాడు. మేము నిద్రపోయాం. తెల్లారాకా గానీ తలుపు తీయలేదు. ఇలాంటి ఒక భయంకరమైన అనుభవాన్ని మాకు కలిగించిన మొక్కపాటి సుమతిని ఆ తర్వాత బాగా తిట్టాం. నాకేమీ తెలియదని చెప్పింది. ఈ అనుభవాన్ని ఎవ్వరితోను పంచుకోలేదు. అంత భయపడ్డామన్న మాట. మేము తిరిగొచ్చాకా భట్టాచార్య గారికి డబ్బు పంపించేసాం. ఆయనకి ఉత్తరం కూడా రాసాం. గొప్ప మనిషి. చాలా కాలం మా జ్ఞాపకాల్లో ఉన్నాడాయన. రజితని తలుచుకుంటే ఈ సంఘటన గుర్తొస్తుంది.
నేను ఆకాశాన్ని అంటూ ప్రకటించిన స్వేచ్ఛ చనిపోయి నెల రోజులైనా కాలేదు. ఆమెని మరిచిపోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. రజిత ఆరోగ్యం బాలేదని తెలుసు ఇబ్బంది పడుతోంది అని గమనించాను. కానీ అది తనని హఠాత్తుగా మరణం వైపు నడిపిస్తుందనుకోలేదు. సామాజిక ప్రేమతో నిండి ఉండే ఆ గుండె హఠాత్తుగా ఆగిపోతుందని ఊహలో కూడా అనుకోలేదు. ఏం రాయను రజిత గురించి. 40 సంవత్సరాల స్నేహం. చాలా తరచుగా కలుసుకుంటామా అంటే లేదు. ఫోన్‌లోనే ఎక్కువ మాటలు. వరంగల్‌లో కాకతీయుల కోట ఎంత ప్రాచుర్యమో, భద్రకాళి గుడి ఎంత పాప్యులరో వరంగల్‌లో రజిత అంత పాపులర్‌. ఉద్యమాలకు పుట్టినిల్లుగా తన ఇల్లు అప్పుడు కుమార్‌పల్లిలో ఉండేది. ఎన్నోసార్లు హన్మకొండకు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భద్రకాళి గుడికి వెళ్ళేవాళ్ళం. వరంగల్‌లో రజిత ఎంత ఆత్మీయురాలో భద్రకాళి గుడి పరిసరాలు కూడా నాకంతే ఇష్టం. వరంగల్‌ వెళ్లిన ప్రతిసారి అక్కడికి వెళ్లకుండా తిరిగిరాను.
రజిత ‘నేనొక నల్ల మబ్బు నవుతా’ అంటూ ప్రకటించి నిజంగానే మబ్బుల్లో కలిసిపోయింది. ఆమె ఎన్నో పనులు చేయాలని ప్రణాళికలు వేసుకుంటూ ఉండేది. ఒక్కో ప్రణాళికని చాలా క్రమ పద్ధతిలో పూర్తి చేసేది. ఎన్నో సంకలనాలు తెచ్చింది. ఇంకెన్నో ప్రణాళికలున్నాయి. మనమొకటి తలిస్తే కాచుకుని ఉండే మరణం మరొకటి తలుస్తుంది. తలవంచాల్సిందే… తప్పదు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.