అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

అట్టడుగు కులాలవారు మన మీద ఎందుకంత ఆగ్రహంతో వుంటారని మనలోని ఆధిపత్య కులాలవాళ్లు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. మనం కుల దోపిడీని ఆమోదించం, కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాలవారిపట్ల ఎలా ప్రవర్తించేవారో,

అతి తక్కువ వేతనాలిస్తూ వారిచేత ఎంత దారుణంగా పనిచేయించుకునేవారో, ఎలా వెట్టి చాకిరీ చేయించుకునేవారో, వాళ్ల పొలాలను ఎలా ఆక్రమించుకునేవారో, వారి పంటలను ఎలా దోచుకునేవారో, వారి స్త్రీలపై ఎలా అత్యాచారాలకు పాల్పడేవారో, వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురిచేసేవారో, వారి పిల్లల్ని పశువులకాపర్లుగా ఎలా మార్చేసేవాళ్లో, వాళ్లు ఐక్యం కాకుండా ఎలాంటి రాజకీయాలు ప్రయోగించేవారో అట్టడుగు కులాలవారు ఎలా మరచిపోగలుగుతారు? దొరల పిల్లలు అమెరికా, ఐరోపా నగరాలకు తరలివెళ్ళిన విషయం అట్టడుగు కులాల జనానికి తెలుసు. భూస్వాముల, సంపన్నుల పిల్లలు తమకు కులంతో ఎలాంటి సంబంధమూ లేదనీ, తమ చుట్టూ అసలు కులమనేదే లేదనీ అక్కడ చెప్పుకుంటారనీ వారికి తెలుసు. నిజానికి తమ పూర్వీకుల అదనపు శ్రమను దోచుకోవడం ద్వారానే భూస్వాములు పచ్చగా ఎదిగారన్న సంగతిని కూడా అట్టడుగు కులాలవారు గ్రహించారు. అయినా ఈ గతాన్ని మరచిపోవాలనడం సరైనదేనా? ఇబ్రహీంపట్నంలో నేను పనిచేస్తున్నప్పుడు కుందారం, పులిమామిడి, ఎలిమినేడు గ్రామాలలోని రెడ్ల వారసులు అమెరికాలో చదువుకుంటున్నారనీ, అక్కడ తమ పిల్లల్ని ఆ దేశ ఉదారవాద విలువలతో పెంచుతున్నారనీ తెలిసింది. కానీ ఆ పిల్లలు తమ తండ్రులూ, తాతలూ గ్రామాల్లో చేసిన అకృత్యాలను మరచిపోగలరా? తెలంగాణా భూస్వాములది తిరుగులేని రక్తచరిత్ర. దీనర్థం వాళ్లలో మంచివాళ్లైన రెడ్లు లేరని కాదు. మా వ్యవసాయ కూలీల సంఘానికి మద్దతిచ్చిన రెడ్లు కూడా వున్నారు. నేను ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటివీసీఎస్‌)లో భాగస్వామిని. అయితే అలాంటి రెడ్లలో చాలామంది బయటి ప్రాంతాలనుంచి వచ్చినవారే ఎక్కువ. వాళ్లు తమ సొంత ఊళ్లలో కూడా అక్కడి వ్యవసాయ కూలీల సంఘానికి మద్దతిస్తారా అనేది నా అనుమానం.
ఆనాటి దొరల నిరంకుశ పెత్తనం, కుల బానిసత్వం గురించిన జ్ఞాపకాలు చాలాకాలంగా జనంలో, ప్రత్యేకించి దొరల వారసులలో మరుగున పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వారి వారసుల నుంచి మనకు రెండు రకాల వాదనలు, సమర్థింపులు కనిపిస్తుంటాయి. ఒకటి: తమ పూర్వీకులు చాలా
ఉత్తములుÑ వాళ్లు తమ జీతగాళ్లని, వెట్టిచాకిరీ చేసేవాళ్లని ఎన్నడూ తిట్టడం, కొట్టడం వంటివి చేసేవారు కాదు. రెండు: తమ కుటుంబాల్లోని పురుషులు ఎవరూ జీతగాళ్ల భార్యలతో, కూతుళ్లతో వ్యభిచరించేవారు కాదు. అలాంటివి ఇతరులు ఎవరైనా చేసివుండవచ్చు కానీ తమ పూర్వీకులు మాత్రం చేయలేదని చెప్పుకుంటారు.
ఈనాటి తెలంగాణా ప్రాంత రెడ్ల, వెలమల సిరిసంపదలకూ ` ఆనాటి వారి పూర్వీకులు చేసిన దోపిడీకీ మధ్య చాలావరకు అవినాభావ సంబంధం వుంది. అయితే తాత ముత్తాతలు ఎప్పుడో చేసిన పాపాలకు ఈనాడు వారి పిల్లలను నిందించడం సబబేనా? ఆనాటి కుల వ్యవస్థలో భాగమైనందుకు మీరు మీ జనాన్ని తప్పుపట్టగలరా? మంచిరెడ్డి పిల్లల్ని వారి తాతలు చేసిన హత్యాకాండకు మూల్యం చెల్లించమని అడగగలమా? భూస్వామ్య నిరంకుశత్వం, కుల బానిసత్వం మానవత్వానికే వ్యతిరేకమని, నేరమని ఇవాళ మనందరిలో ఒక ఏకాభిప్రాయం వుంది. కానీ, ఆనాటి దొరలు చేసిన దారుణాలకు ఈనాటి వారి కుటుంబాలను నేరం చేసినవారిగా బాధ్యులను చేయలేం. ఆనాటి మన పూర్వీకులను ఇప్పుడు మనం ప్రభావితం చేయలేం. అయితే ఆ దొరల వారసులు వారి పేరిట కొనసాగించే దోపిడీ చర్యలకు తప్పని సరిగా జవాబుదారీ అవుతారు. ఎందుకంటే ఈ దోపిడీ వ్యవస్థ వల్లనే వారు అపారమైన లబ్ధిపొందారు కాబట్టి. మన పూర్వీకులు చేసిన తప్పులను దాచిపెట్టడం లేదా వక్రీకరించడం కంటే వాటిని వెల్లడిరచడం, తప్పు ఒప్పుకోవడం మంచిది. ఆనాటి కథలను తిరిగి ప్రస్తావించి, వాటిని సముచితంగా అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నించాలి.
రెడ్ల ఆధిపత్యానికి గుర్తుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు ప్రముఖ భూస్వామ్య రెడ్ల పేర్లున్నాయి. ఇబ్రహీంపట్నం రాజకీయ కేంద్రంగా వున్న జిల్లా ఒక స్వాతంత్య్ర సమర యోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరిట రంగారెడ్డి జిల్లాగా వ్యవహరించబడుతోంది. అదేవిధంగా రాయల సీమలోని కడప జిల్లా పేరును మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి స్మృతికి గుర్తుగా 2009లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మార్చారు. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మొత్తం జనాభాలో రెడ్ల జనాభా కేవలం 6.5 శాతం మాత్రమే. అయినప్పటికీ ఉభయ రాష్ట్రాలలోని అత్యధిక ప్రాంతాలలో రాజకీయంగా, సామాజికంగా రెడ్ల ఆధిపత్యమే నడుస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం శాసన సభ్యుల సంఖ్య 119 కాగా 2018లో రెడ్డి ఎంఎల్‌ఎల సంఖ్య 40గా వుంది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటివరకూ మొత్తం 16 మంది ముఖ్య మంత్రులు పరిపాలిస్తే వారిలో 12 మంది రెడ్డి కులస్తులే. అందులో ఇద్దరు రెడ్లు రెండేసి సార్లు ఆ పదవిని నిర్వహించారు. అంటే 14 పర్యాయాలు రెడ్లే ముఖ్య మంత్రులుగా వున్నారన్నమాట. ఆ తర్వాత 1984లో కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు ఎన్‌.టి. రామారావు ఆధ్వర్యంలో కమ్మకులం ఉమ్మడి రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలను కైవసం చేసుకుంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ బలంగా తెరమీదకు రావడానికి ` రాష్ట్రంలో కోస్తా ఆంధ్ర ప్రాంత కమ్మ కులస్తుల ప్రాబల్యం పెరగడంవల్ల తమ ప్రాభవాన్ని కోల్పోయిన శక్తిమంతులైన రెడ్లలో, వెలమల్లో ఏర్పడిన అసంతృప్తి కూడా కొంతవరకు కారణం అని చెప్పవచ్చు.
ఇబ్రహీంపట్నం అంటే ఇబ్రహీంకు చెందిన పట్టణం అని అర్థం. 1550 నుంచి 1580 వరకు ముప్ఫై సంవత్సరాల పాటు నైజాం రాజ్యాన్ని పరిపాలించిన సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌షా చివరి దశలో ఇక్కడ నిర్మించిన చెరువును బట్టి ఈ ప్రాంతానికి ఇబ్రహీంపట్నం అనే పేరు వచ్చింది. హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌ చెరువును నిర్మించిన అనంతరం ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు ఆయన ఇక్కడ ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించాడు. ఆ చెరువు 1,300 ఎకరాలకు విస్తరించి వుంది. ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దిండి చెరువుకు అనుబంధంగా నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో ఇది ఒకటి. దిండి చెరువు మత్తడి పారినప్పుడు ఆ నీళ్లు తూము గేట్ల ద్వారా మిగతా చెరువుల లోకి ప్రవహిస్తాయి. అయితే ఆ గొలుసుకట్టు చెరువులు విధ్వంసానికి గురికావడంతో ఇవాళ ఇబ్రహీంపట్నం చెరువులో అసలు నీళ్లే వుండటం లేదు. ఇబ్రహీంపట్నం తాలూకాలోని గ్రామాల పేర్లు మధురమైన దక్కనీ, తెలుగు భాషల కలయికతో అందంగా వుంటాయి. తెలంగాణాలోని హైదరాబాద్‌ ప్రాంతాన్ని, మరఠ్వాడా ప్రాంతాన్ని, ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని నిజాం రాజులు కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించారు. అందువల్ల ఇక్కడి పేర్లమీద వారి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
నిజాం రాజు తన సామంతుల ద్వారా అంటే పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల ద్వారా పరిపాలన సాగించాడు. పైగాలు అంటే సీనియర్‌ కులీనులు, వారికి తమ సొంత న్యాయస్థానాలు, రాజభవనాలు, స్టాండిరగ్‌ సైన్యం వుండేవి. సంస్థానాలు అంటే చిన్న చిన్న రాచరికపు రాజ్యాలు. జాగీర్దార్లు అంటే నిజాం రాజుకు చేసిన సేవలకు గాను ఆయన నుంచి సువిశాలమైన భూభాగాలను బహుమతిగా పొందినవాళ్లు. ఇక దేశ్‌ముఖ్‌లు అంటే ప్రజల నుంచి శిస్తు వసూలు చేసేవాళ్లు. జాగీర్దార్లలో అత్యధికులు ముస్లింలైతే, దేశ్‌ముఖ్‌లలో రెడ్డి, వెలమ, బ్రాహ్మణ కులాలకు చెందినవాళ్లు ఎక్కువ. ఒక్క నిజామాబాద్‌ సమీపంలోని డిచ్‌పల్లిలో మాత్రం ఒకప్పుడు ఒక బిసి కులస్తుడు దేశ్‌ముఖ్‌గా వున్నాడు. ఈ సామంతులకు తోడు నిజాంకు మొత్తం తన రాజ్యంలోని 30శాతం భూములు సొంతంగా వుండేవి. వాటిని సర్ఫ్‌`ఇ`ఖాస్‌ అనేవారు. సర్ఫ్‌`ఇ`ఖాస్‌ భూములపై వచ్చే శిస్తు రాబడి మొత్తం నిజాం రాజు ప్రైవేటు ఖజానాలో జమ అవుతూ వుండేది. ఈ పరిపాలనా విధానం పటిష్టంగా కొనసాగడంలో జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌లు కీలక పాత్రను పోషించేవారు. బలవంతపు శిస్తు వసూళ్లు, రైతుల భూముల్ని స్వాధీనం చేసుకోవడం, వెట్టిచాకిరీ, జనం నుంచి ఉచితంగా ధాన్యం, పశువులు మొదలైనవాటిని తీసుకోవడం వంటివి దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే నిజాం రాజ్యంలోనే చాలా ఎక్కువ. ఇక్కడ ప్రజలకు ఎలాంటి పౌర హక్కులూ, రాజకీయ హక్కులూ ఉండేవికావు.
1930ల నాటికి ఈ భూస్వామ్య పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత చాలా పెరిగింది. 1929లో ఏర్పడ్డ ఆంధ్ర మహాసభ నుంచి ఈ వ్యతిరేకత రూపుదిద్దుకోవడం మొదలయింది. కాగా, 1940`42 ప్రాంతంలో ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వెళ్లిపోయింది. వెట్టి చాకిరీని నిర్మూలించాలనీ, రైతులకు కౌలు హక్కులు కల్పించాలనీ, దున్నేవాడికే భూమి ఇవ్వాలనీ డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. ఈ ఉద్యమం ఉత్తర, పశ్చిమ తెలంగాణా ప్రాంతాల్లో బలంగా వుండేది. క్రమంగా 1940ల మధ్య అది సాయుధ పోరాటంగా మారింది. స్థానిక దేశ్‌ముఖ్‌ల సైన్యాన్నీ, రజాకార్లనూ ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు సాయుధ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. 1947లో నిజాం రాజు తన రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి నిరాకరించాడు. దాంతో 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యాలు రంగప్రవేశం చేశాయి. నైజాం రాజ్యాన్ని భారతదేశంలో కలుపుకునేందుకు జరిగిన ఆ పోలీస్‌ యాక్షన్‌కు ‘ఆపరేషన్‌ పోలో’ అనే సంకేత నామం వుండేది. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక నిజాం సైన్యం చేతులెత్తేసింది. ముస్లిం జాగీర్దార్లు తమ భూములను వదిలేసి ప్రాణాలు అరచేతపట్టుకుని పారిపోయారు. పశ్చిమ తెలంగాణాలో ముస్లింలపై పెద్ద ఎత్తున హత్యాకాండ జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఆర్య సమాజ్‌, కాంగ్రెస్‌లకు చెందిన తొలిదశ హిందూ సమూహాలు ముస్లింలను ఊచకోతకోశాయి. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి హైదరాబాద్‌లో ముస్లింలు వేల సంఖ్యలో తమ ఉద్యోగాలను, బతుకుదెరువును కోల్పోయారు. ఒక సాంప్రదాయిక అంచనా ప్రకారం పోలీస్‌ యాక్షన్‌ సమయంలోనూ ఆతరువాతి కాలంలోనూ ఇరవైఏడు వేల నుంచి నలభైవేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 2013 వరకు ప్రజలకు వెల్లడిరచకుండా తొక్కిపెట్టిన 1948 నాటి పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక ఈ సంఖ్యను నిర్ధారించింది. అయితే ఆనాటి జాతిహత్యాకాండలో రెండు లక్షల మంది లేదా ఇంకా అంతకంటే ఎక్కువ మందే చనిపోయివుంటారనేది ఇతర మేధావుల అభిప్రాయం.
కేంద్ర ప్రభుత్వం నిజాం రాజుతో చేతులు కలిపి ఆయనను హైదరాబాద్‌ రాష్ట్రానికి రాజ్‌ ప్రముఖ్‌ (తొలి గవర్నర్‌)గా నియమించింది. అయితే అసలు పరిపాలన అంతా ఆపరేషన్‌ పోలోకు సారథ్యం వహించిన మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి ద్వారా భారత సైన్యం గుప్పిట్లో వుండేది. ఆయన 1949 వరకు రాష్ట్ర మిలిటరీ గవర్నర్‌గా కొనసాగారు. 1950 జనవరిలో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌కు చెందిన ఎం.కె. వెల్లోడీని హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నియమించారు.
నిజాం పరిపాలనా కాలంలో 1932-1934 మధ్య రాష్ట్రంలో తొలి సమగ్ర భూసర్వే జరిగింది. 1954లో కొత్త పాలకులు మరో సమగ్ర భూసర్వేను నిర్వహించారు. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ వారు 1954`55 మధ్య కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో భూముల యాజమాన్యంపై ఒక సమగ్ర డాక్యుమెంటును రూపొందించారు. అందులో ఏ భూమి ఎవరి పేరుమీద వుందో అన్ని వివరాలను పొందుపరిచారు. ఆ దస్తావేజును ‘ఖాస్రా పహాని’ అంటారు. అదొక కీలకమైన ఘట్టం. అంతకుముందు భూయాజమాన్యానికి సంబంధించిన రికార్డులనన్నింటినీ జాగీర్దార్ల, జమీందార్ల పర్యవేక్షణ కింద నిర్వహించేవారు. 1954 తర్వాత ఆ రికార్డులను భూస్వాముల కనుసన్నలలో దిగువ స్థాయి ప్రభుత్వ అధికార్ల కింది వుంచారు. అయితే అదే సంవత్సరం డాక్యుమెంట్ల నన్నింటినీ కొంతమేరకు నిష్పక్షపాత సంస్థతో సాధికారికంగా రూపొందించారు.
నిజాం పతనమైన వెంటనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు మొదలయ్యాయి. ఊళ్లల్లోంచి ముస్లిం భూస్వాములను తరిమికొట్టి వారి భూములను రెడ్డి, వెలమ భూస్వాములు స్వాధీనం చేసుకున్నారు. భూ రికార్డులను నిర్వహించే పట్వారీలు, పటేళ్లు కూడా వాళ్లే కాబట్టి భూపట్టాలమీద ముస్లింల పేర్లను తొలగించి తమ పేర్లను రాసుకుని చట్టబద్ధంగా వాటికి సొంతదార్లయ్యారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగిన ఉత్తర తెలంగాణా, తూర్పు తెలంగాణా ప్రాంతాల్లో ముఖ్యంగా నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో, నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సంపన్న, మధ్యతరగతి రైతులు` జాగీర్దార్ల, ముస్లింల భూముల్ని ఆక్రమించుకున్నారు. చిన్నపాటి ముస్లిం భూస్వాములు కూడా తమ ఆస్తిపాస్తుల్ని వదిలేసి ఆ ఊళ్లలోంచి పారిపోయారు.
భారత సైన్యం తెలంగాణా ప్రాంత పరిపాలనా పగ్గాలను చేపట్టిన తరువాత 1950లో రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ రక్షిత కౌలుదారీ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం పొలాలు సాగుచేస్తున్న కౌలుదార్లకు కొన్ని హామీలను ఇచ్చింది. వాటి ప్రకారం కౌలుదార్లను బలవంతంగా వెళ్లగొట్టకూడదు. ఆ భూముల అమ్మకాలలో కౌలుదార్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి కొంత తక్కువ రేటుకు వాటిని అమ్మాలి. కౌలు అద్దెరేటును కూడా సమంజసంగా నిర్ణయించింది. తెలంగాణాలో భూసర్వే నిర్వహించేందుకు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి అధికార్లను రప్పించారు. అనేక ప్రాంతాల్లో బడుగు వర్గాలవారిని రక్షించేందుకు 1955 నాటి ఖాస్రా పహానీలలో వారి పేర్లను రక్షిత కౌలుదార్లుగా నమోదు చేశారు. ఇది తెలంగాణా రెవెన్యూ వ్యవస్థలో అంతర్భాగం. ఆ చట్టం ఉద్దేశాన్ని భూస్వాములు గ్రహించారు, కౌలుదార్లు సాగు చేసుకుంటున్న భూముల మీద తమ యాజమాన్య హక్కును దాదాపు తిరిగి పొందలేమని తెలుసుకున్నారు. అందుకే వాళ్లు తమ మొరటు బలంతో కౌలుదార్లను ఆ భూముల్లోంచి బలవంతంగా వెళ్లగొట్టారు. వారివద్ద వున్న అనేక ధృవ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో కొంత భాగాన్ని తిరిగి మీకే బహుమతిగా ఇస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసి, ప్రలోభపెట్టి వారినుంచి ఆ పత్రాలను లోపాయికారీగా లాగేసుకున్నారు. అయితే కౌలుదార్లు బలంగా వున్న సూర్యాపేట వంటి ప్రాంతాల్లో, అలాగే అగ్రకులాలవారు కౌలుదార్లుగా వున్నచోట్లలో మాత్రం కౌలుదార్లే ఆ కౌలు భూముల్ని సొంతం చేసుకోగలిగారు. వాళ్లు భూయజమానులకు ఎలాంటి కౌలు చెల్లించలేదు. చాలా కేసుల్లో వాటికి కనీసం అమ్మకం ధరను కూడా చెల్లించలేదు. రెవెన్యూ అధికార్లకు లంచాలిచ్చి ఆ భూముల పట్టాలను తమ పేర్లపై రాయించుకున్నారు లేదా అసలు ఫైళ్లనే కనబడకుండా చేయించారు. కోదాడలో జరిగిన ఒక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వేలో ఇతర్లతో పాటు నేను కూడా అప్పుడు భాగస్వామిగా పాల్గొన్నాను. అక్కడ ప్రొటెక్టెడ్‌ టెనెంట్‌ రిజిస్టర్‌ (పి.టి. రిజిస్టర్‌)లో కౌలుదార్ల (అందరూ రెడ్లే) పేర్లు నమోదైవుండటం చూసి మేమంతా నిర్ఘాంతపోయాం. వికారాబాద్‌లో దళితులు రక్షిత కౌలుదార్లుగా వున్న చోట పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా వుంది. అంటే భూమి యాజమాన్య హక్కును నిర్ణయించడంలో కులం కీలక పాత్ర పోషించిందన్నమాట.
1956లో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించారు. వాటిలో ఒకటైన మరఠ్వాడా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపేశారు. కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలిపేశారు. ఇప్పుడు తెలంగాణాగా పరిగణిస్తున్న ప్రాంతాన్ని అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. తెలంగాణాలో మొదటినుంచీ భూములన్నీ రెడ్లు, వెలమలు, కొంతవరకు బ్రాహ్మణుల యాజమాన్యంలో వున్నాయి. గౌడ్లు, తెలగలు, మున్నూరు కాపులు వంటి మధ్యస్థ కులాల పేరిట ఏదో కొద్ది పాటి భూములుండేవి. దళితులు భూమిలేని పేదలుగా బతుకుతుండేవారు. ప్రతి గ్రామంలో బహుమతిగా ఇవ్వబడ్డ కొన్ని ఇనాం భూములు వుండేవి. దాదాపు ప్రతి కులానికి అందులో కొద్దో గొప్పో వాటా వుండేది. మంగలి వాళ్లకు మంగలి ఇనాం భూమి, చాకలివాళ్లకి చాకలి ఇనాం భూమి ఇలా వుండేవి. మాల మాదిగ కులాల వారికి అతి స్వల్పంగా ఇనాం భూములు దక్కేవి. ప్రతి మాదిగ, మాల కుటుంబం అర ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమిపై కొన్ని సంవత్సరాలకు ఒకసారి చొప్పున రొటేషన్‌ పద్ధతిలో హక్కును కలిగివుండేవి.
తెలంగాణా రైతాంగ పోరాటం భూ యాజమాన్య హక్కును రెడ్లు, వెలమలతోపాటు అనేక కులాల వారికి అందుబాటులోకి తెచ్చింది. రెడ్లు, వెలమలు అప్పటికే రైతులుగా వున్నారు. మంచి పొలాలను వాళ్లు సొంతం చేసుకున్నారు. మధ్యస్థ కులాల వాళ్లు అంతకు ముందు జాగీర్దార్లకు, దేశ్‌ముఖ్‌లకు కోల్పోయిన తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సాధారణ పచ్చికబయళ్లు, బంజరు భూములు మాత్రమే మాల మాదిగలకు మిగిలాయి. కాలక్రమంలో వాటిని కూడా భూస్వాములే ఆక్రమించేసుకున్నారు. ఆ భూములు వివాదాల పుట్టలుగా మారిపోయాయి. ఖాస్రా పహానీలలో సైతం అనేకమంది దళితుల పేర్లు కౌలుదార్లుగా నమోదై వున్నాయి. వాటిమీద దళితులకెక్కడ హక్కులు లభిస్తాయో అన్న భయంతో 1954 తర్వాత భూస్వాములు దళితులందరినీ ఆ భూముల నుంచి వెళ్లగొట్టారు.
1940ల నాటి కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం ఇబ్రహీంపట్నంపై నామమాత్రంగా వుంది. ఆ ఉద్యమ సమయంలోనే ముస్లిం జాగీర్దార్ల భూములను రెడ్లు ఆక్రమించేసుకున్నారు. జబ్బార్‌గూడెం గ్రామానికి చెందిన మాదిగల నాయకుడు యాచారం బుడ్డ జంగయ్య ఇలా చెప్పాడు: ‘‘రెడ్లు మా మాదిగోళ్లను ముందుపెట్టి జాగీర్దార్ల ఇండ్ల మీద దాడి చేయించిండ్లు. బంగారు నగలనూ, భూముల పట్టాలనూ రెడ్లు తీసుకున్నరు. బియ్యం, వడ్లు, కల్లు అసొంటివి మా మాదిగోళ్లకు ఇడిచిపెట్టిండ్లు’’.
మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన 1985 జూన్‌కు ముందు ఆంధ్ర ప్రదేశ్‌లో తాలూకా లేదా తహశీల్‌లే ప్రాథమిక రెవెన్యూ పరిపాలనా కేంద్రాలుగా వుండేవి. తహశీల్దార్‌ అనబడే గెజిటెడ్‌ అధికారి భూమి శిస్తు వసూళ్లకు బాధ్యుడు. గ్రామ పట్వారీలనూ (అకౌంటెంట్లు), గిర్ధావర్లనూ (రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు) ఆయనే పర్యవేక్షించేవాడు. హైదరాబాద్‌ నగరం దక్షిణంవైపున చుట్టుముట్టివుండే రంగారెడ్డి జిల్లాలో మొత్తం పదకొండు తాలూకా లుండేవి. ఇబ్రహీంపట్నం తాలూకాలో అరవై మూడు రెవెన్యూ గ్రామాలు, ఇంకా అనేక చిన్న చిన్న పల్లెలుండేవి. 1985 జూన్‌లో ఇబ్రహీంపట్నం తాలూకాను మూడు మండలాలుగా విభజించారు. అవి యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల్‌. ఆనాటినుంచీ మండలమే ప్రాథమిక రెవెన్యూ కేంద్రం అయింది. నేను ఇబ్రహీంపట్నం మండలంగా ఏర్పడకముందు దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచీ అక్కడే పనిచేశాను. అది వెనుకబడిన ప్రాంతంగా పరిగణించబడేది. వర్షాకాలంలో నిండే చెరువులూ, కాలువలూ, బావుల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేసేవారు. ఇక్కడ జొన్నలు, ఆముదాలు సర్వ సాధారణ ప్రధాన పంటలు. మొత్తం భూమిలో పది శాతం భూమి మాత్రమే సాగయ్యేది. ధాన్యంతోపాటు టమాట, వంకాయ వంటి కూరగాయలు పండిరచేవారు.
భూమిలేని పేదలలో అత్యధికులు మాదిగలే. అయితే తెలగ, చాకలి, మంగలి, గొల్ల, కురుమ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందినవాళ్లలో కూడా భూమిలేని పేదలుండేవారు. ఈ ప్రాంతంలోని మాదిగలతో పోలిస్తే మాలల సంఖ్య తక్కువ. మాలల్లో చదువుకున్న వారు ఎక్కువ. చాలా మాల కుటుంబాల్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేసేవారు. మధ్యస్థ, సంపన్న వ్యవసాయదారుల్లో కాపులు (వీళ్లు తమకుతాము రెడ్లుగా, కాపురెడ్లుగా చెప్పుకునేవారు), కొద్దిమంది బ్రాహ్మణులు, కురమలు కూడా వుండేవారు. రెడ్డి కులానికి చెందిన రైతులు భారీ వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. వాళ్ల వద్ద ట్రాక్టర్లు,
నాగళ్లు, మిల్లులు, ఇతర పారిశ్రామిక, వ్యవసాయిక ఉపకరణాలు వుండేవి. గ్రామాల్లో విద్యుత్తు, రోడ్డు పనులు, భవన నిర్మాణ పనులు, చెరువుల కాంట్రాక్టులు అన్నీ వీళ్లే నిర్వహించేవారు.
ఇక్కడ ఎక్కువగా రెడ్లే సర్పంచ్‌లుగా, తమకు తాము నియమించుకున్న స్థానిక సంస్థల సభ్యులుగా వుండేవారు. ప్రత్యక్ష పెత్తనానికి రిజర్వేషన్లు అడ్డంకిగా వున్న చోట్లలో వాళ్లు తమ చెప్పుచేతలలో వుండే ఇతర కులాల వ్యక్తుల్ని సర్పంచ్‌లుగా నిలబెట్టేవారు. చాలామంది పెద్ద రైతులు వ్యవసాయ పనులను తమ అనుయాయులకు అప్పగించి పట్నంలో నివసించేవారు. వ్యవసాయం వారికి ద్వితీయ వృత్తి. వారిలో ఎక్కువమంది ఉద్యోగాలు లేదా హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు. అయినప్పటికీ ఊళ్లో పెత్తనం చేసేందుకు, రాజకీయాలపై పట్టును నిలుపుకునేందుకు, ఓటు బ్యాంకునూ కాంట్రాక్టులనూ కాపాడుకునేందుకు, తమకు అనువైన విధానాలను ప్రభావితం చేసేందుకు ఊళ్లోని ఆ వ్యవసాయమే వారికి ఉపయోగపడేది.
పొలం పనులు లేని కాలంలో చాలామంది వ్యవసాయ కూలీలూ, సన్నకారు రైతులూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కొందరు వ్యవసాయ పనులకోసం నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహించే నల్గొండ జిల్లాలోని ప్రాంతాలకు వెళ్తే, మిగతావాళ్లు హైదరాబాద్‌కు వెళ్లేవారు. అక్కడ భవన నిర్మాణ కూలీలుగా, రిక్షావాళ్లుగా, రోడ్లు వేసే కార్మికులుగా పనులు చేసేవారు. వేసవికాలం సుదీర్ఘమైన నిరుద్యోగకాలం. స్త్రీలు ఈ కాలాన్ని చాలా నిరాశాపూరితమైనదిగా భావిస్తారు. అందరూ బతుకుతెరువుకోసం ఎదురుచూస్తుంటారు. చేయడానికి ఏ పనీపాటాలేక తమ గుడిసెల మట్టి గోడలను గెలుకుతూ కూచోవలసిందే. ఇద్దరు ముగ్గురు కొడుకులున్న కుటుంబాల వారు ఒక్క కొడుకునైనా ఏ బేకరీలోనో, హోటల్‌లోనో, ఫాక్టరీలోనో పనిచేసి ఎంతో కొంత సంపాదించేందుకు పట్నం పంపించేవారు. 1980లో అక్కడ నెలకి 150 రూపాయల జీతం దొరికేది. ఆరోజుల్లో హంస రకం బియ్యం కిలో రెండో మూడో రూపాయలుండేది. సన్న బియ్యం అయితే కిలో ఏడెనిమిది రూపాయల వరకూ వుండేది. ఆ ధరలతో పోలిస్తే ఈ జీతం చాలా తక్కువ. పని మాత్రం ఎంతో కఠినంగా వుండేది, పైగా ఎక్కువ గంటల పాటు చేయాలి. వ్యవసాయ కూలీల్లో రెండు రకాల వాళ్లుండేవారు. ఒకరకం రోజువారీ స్త్రీ, పురుష కూలీలు. రెండోరకం పొలంలో పనిచేసే వెట్టిచాకిరీ కూలీలు లేదా జీతగాళ్లు. ఆ జీతగాళ్లలో మగవాళ్లే తప్ప స్త్రీలుండరు. పేరుకి రోజువారీ కూలీలే కానీ వారికి రోజూ కాకుండా వారాంతంలో కూలిడబ్బులు లెక్కగట్టి ఇచ్చేవారు. పొలాల్లో పనిచేసే జీతగాళ్లు ఏడాదికి తమకు వచ్చే జీతానికి సమానమైన మొత్తాన్ని ముందస్తు అప్పుగా తీసుకునేవారు. ఒకోసారి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వాళ్లు అప్పుగా తీసుకోవాల్సి వచ్చేది. సాధారణంగా ఉగాది సమయంలో పొలంపనులు మొదలయ్యే సీజన్‌లో వేరే గత్యంతరం లేక ఈ అప్పులు చేసేవారు. వాళ్ల నెలజీతంను భూస్వాములు తమ అప్పు కింద జమకట్టుకునేవారు. కొందరు భూస్వాములు వడ్డీ తీసుకుంటే, కొందరు తీసుకునేవారు కాదు. పొలం పనులు చేసే జీతగాళ్ల పనివేళలు రోజు కూలీల పనివేళల్లా కాకుండా చాలా దారుణంగా వుండేవి. వాళ్లు తెల్లవారు జామున నాలుగున్నర నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ గొడ్డు చాకిరీ చేయాలి.
1984లో వాళ్ల ఏడాది సంపాదన ఆరేడు వందలుండేది. ఆరోజుల్లో దినసరి కూలీలకు మగవాళ్లకైతే రోజుకు మూడు నాలుగు రూపాయల చొప్పున, ఆడవాళ్లకైతే రోజు కూలీ ఎనిమిది అణాల నుంచి రెండు రూపాయల చొప్పున వుండేది. అదైనా సీజన్‌ను బట్టి, పని ఒత్తిడిని బట్టి ఇచ్చే వారు. ఆనాడు ఈ ఉత్పాదకత, ఆర్థిక స్థాయి ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు జోన్లుగా విభజించారు. కనీస వేతనాన్ని నిర్ణయించే ప్రభుత్వ అధికార్లు 1984లో ఇబ్రహీంపట్నం వున్న జోన్‌లో కనీస వేతనాన్ని నెలకు 135 రూపాయలుగా నిర్ణయించారు. 1986నాటికి అది 150 రూపాయలకు పెరిగింది. నెల జీతం ఇంత తక్కువగా వుండటానికి కారణం అక్కడ సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా పని లభించడం, అలాగే వారికి రుణం తీసుకునే వెసులుబాటు వుండటం. అయితే చట్టం నిర్ణయించిన వేతనానికీ, వాస్తవంగా ఇస్తున్న వేతనానికీ మధ్య చాలా తేడా వుండేది. తీసుకుంటున్న జీతాన్ని బట్టి జీతగాళ్లని రకరకాలుగా పిలిచేవారు. వయసులో అందరికంటే చిన్నవారైన పిల్ల జీతగాళ్లకి నెల జీతం కింద కుంచెడు (కుండెడు) వడ్లు ఇచ్చేవారు. అందువల్ల వారిని ‘కుండెడు జీతగాళ్లు’ అనేవారు. కుంచెడు (కుండెడు) అంటే 933 గ్రాములు. అంటే నెలకి దాదాపు ఇరవై శేర్ల వడ్లు. ఆరోజుల్లో దాని విలువ ఇరవై రూపాయలు కూడా వుండేది కాదు. ఇక వయోజన జీతగాళ్లకి మూడు కుంచాల వడ్లు అంటే అరవై శేర్ల వడ్లు నెలజీతం కింది ఇచ్చేవారు. అందువల్ల వారిని ‘మూడు కుండల జీతగాళ్లు’ అనేవారు.
మాదిగ ఆడవాళ్లు దొరల ఆవరణనంతా ఊడ్చి, పెండతో అలుకు చల్లాలి. పశువుల దొడ్లని కూడా వాళ్లే శుభ్రం చేయాలి. నడుములు విరిగేంత పని. ఎందుకంటే కొందరు భూస్వాముల దొడ్లూ, ఇంటి ఆవరణా ఒక ఎకరమంత విశాలంగా వుండేవి. ఇంత శ్రమ చేస్తే ఆ ఆడవాళ్లకి జీతం కింద ఇచ్చేది ఏడాదికి ఒక ముతక చీర, ఒక రవిక బట్ట. అంటే దాని విలువ రోజుకి పదిహేను పైసలు కూడా వుండేది కాదు. కొంచెం దయాదాక్షిణ్యాలున్న భూస్వాములు పంట కోతలు అయిపోయిన తరువాత తమ పొలాల్లో పరిగ ఏరుకునేందుకు వారికి అనుమతిచ్చేవారు. అయితే తన ఇంట్లో పనిచేసే ఆడవాళ్లే ఆ పరిగ ఏరుకోవాలి తప్ప ఇతర్లు రాకూడదనే ఆంక్షను పెట్టేవారు.
నేను ఇబ్రహీంపట్నం వెళ్లిన ప్రతిసారీ మగవాళ్లు టీ షాపుల దగ్గర కూచుని టీ తాగుతూ, బీడీలు కాలుస్తూ తీరుబడిగా కనిపించేవారు. కానీ ఏరోజూ ఏ ఒక్క స్త్రీ కూడా అలా తీరుబడిగా కూర్చుని కనిపించేది కాదు. వాళ్లు పరుగుపరుగున పనులకు వెళ్తూనో పనినుంచి ఇళ్లకు తిరిగి వస్తూనో కనిపించేవారు. వ్యవసాయ పనులు లేని రోజుల్లో మగవాళ్లు వారం వారం జరిగే అంగడికి వెళ్లేవాళ్లు. లేదా ఏ సినిమాకో వెళ్లి కాలక్షేపం చేసేవారు. ప్రతి బుధవారంనాడు ఆ అంగడి జరిగేది. అక్కడ కూరగాయలు, పళ్లు, కిరాణా సామాన్లు, అన్ని రకాల మాంసాలు, చివరికి పశువులు మొదలైనవన్నీ అమ్మేవారు. ఆ రోజుల్లో ఇబ్రహీంపట్నంలో రీలు తర్వాత రీలు మార్చే సింగిల్‌ ప్రొజెక్టర్‌ సినిమా హాళ్లే వుండేవి. ఇబ్రహీంపట్నంలో ఆడవాళ్లు మాత్రం పొయిలోకి కట్టెపుల్లలు ఏరుకుని రావడమో, పాత చీరలు ముందేసుకుని బొంతలు కుట్టడమో చేస్తుండేవారు. వ్యవసాయ పనులు లేని రోజుల్లో కూడా స్త్రీలు ఎప్పుడూ తీరుబడిగా కనిపించేవారు కాదు. వాళ్ల పిల్లలు పెరిగి పెళ్లిళ్లయి ఎవరి సంసారాలు వాళ్లకి ఏర్పడినన తరువాతే ఆడవాళ్లకి కాస్తంత తీరిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. అయనప్పటికీ వాళ్లు ఎప్పుడూ కుల పంచాయితీల్లో భాగస్వాములు కాలేరు.
నిరుపేద కుటుంబాలలో పిల్లలకు చదువుకోడానికి అవకాశం వుండేది కాదు. 1975లో ప్రభుత్వం అంగన్‌వాడీలను నెలకొల్పిన తరువాత నిరుపేద పిల్లలు నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకునేందుకు వీలయింది. అయితే ఆ అంగన్‌వాడీ కేంద్రాలు పెద్ద గ్రామాల్లో మాత్రమే వుండేవి. పైగా దళితులను ఆ అంగన్‌వాడీలవైపు రాకుండా నిరుత్సాహపరిచేవారు. ఇతర కుటుంబాలలో ఆడపిల్లల్ని బడిలో చేర్పించినా ఏ తమ్ముడో చెల్లెలో పుట్టిన తరువాత వాళ్లను చూసుకునేందుకు మధ్యలోనే బడి మాన్పించేవారు. ఆ కుటుంబాలలో తండ్రితో పాటు తల్లి కూడా పని చేయకపోతే పూటగడవదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మగ పిల్లల్ని కూడా బడి మాన్పించి ఏ పశువుల్ని కాచే పనిలోనో పెట్టేవారు.
1940ల చివర్లో జరిగిన తెలంగాణా రైతాంగ పోరాటం ప్రభావం ఇబ్రహీంపట్నంపై లేదు. ఇక్కడి కొన్ని గ్రామాల నుంచి కొందరు యువకులు వెళ్లి ఆ ఉద్యమంలో కార్యకర్తలుగా పాల్గొన్నప్పటికీ ఆ పోరాటం ఇబ్రహీంపట్నంను తాకలేదనే చెప్పాలి. చాలా గ్రామాల్లో మాల, మాదిగలు ఆనాటి రైతాంగ పోరాటానికి దూరంగా వున్నారు. నేను ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నప్పుడు కొన్ని గ్రామాలపై సిపిఎం పార్టీ తన పట్టును ఇంకా కొనసాగిస్తూవుంది. అయితే వాళు కాంగ్రెస్‌, బీజేపీల కంటే దారుణమైన పద్ధతులలో దానిని సాధించారనీ, బయటి ప్రభావాన్ని వాళ్లు ఏమాత్రం సహించరనీ కొందరు నాతో చెప్పారు. వాళ్లు తమ క్యాడర్‌ని చర్చలలో పాల్గొననివ్వరనీ, అసమ్మతిని అణిచివేస్తారనీ అన్నారు. క్రమంగా ఆ మొరటుదనం నాకు కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.