నేను లోపలికి వెళ్ళగానే… నన్ను చూసి కూర్చోండమ్మా. డాక్టరమ్మా వస్తారు అంది. నేను ఫలానా అని, అక్కడికి ఎందుకు వచ్చానో చెప్పి ఆమెకు నన్ను పరిచయం చేసుకున్నాను.
మీ పేరేంటి అడిగాను సమాధానంగా ఏదో చెప్పింది
అర్ధం కాలేదు అన్నాను మళ్లీ చెప్పింది
ఊ హుఁ! అర్ధం కాలేదు అని అన్నాను ఈసారి ఆమె నాకు దగ్గరగా వచ్చి ‘‘పెద్దింట్లమ్మ’’ అందింది.
అవునా? ఆశ్చర్య పోతూ అన్నాను అవునమ్మా! నా పేరు అదే అంది ఆత్మస్థైర్యం నిండిన స్వరంతో..
ఇక్కడ ఏం చేస్తావు అడిగాను. హాస్పటల్ చూసుకుంటానమ్మ అంది.
నా మనసంతా ఆమె పేరు చుట్టే తిరుగుతోంది.. ఇలాంటి పేరు నేను ఇప్పటివరకు ఎక్కడా విన్నది లేదూ.
అదే గ్రహించినట్లుగా ఆమె తిరిగి ఇలా అంది.
మా అమ్మకు నాకన్న ముందు పుట్టిన పిల్లలు ముగ్గురు చనిపోయారమ్మా…పెద్దింట్లమ్మకు మొక్కుతే నేను పుట్టి బతికినానని ఆ అమ్మా పేరు నాకు పెట్టింది. నా ఆలోచనలను గ్రహించినట్లుగా చెప్పింది. ఎక్కడా? ఆ అమ్మా అని అడిగాను. ఎందుకంటే, మా అమ్మ కోటప్పకొండ స్వామికి మొక్కితే నేను పుట్టాను అని ఎన్నోసార్లు నాకు చెప్పగా విన్నాను. మా అమ్ముమ్మ తల్లి పానకాల స్వామికి మొక్కితే అమ్ముమ్మకు తమ్ముడు పుట్టాడని అందరూ అనుకుంటే నా చిన్నప్పుడు విన్నాను. అంతేకాదు ఆ మధ్య కాలంలో మా అక్కయ్య తోడి కోడలుకు పిల్లలు లేకపోతే పెద్ద కాకాని దగ్గర వున్న ఏదో తిరుపతమ్మ అనే అమ్మవారికి మొక్కితే ఆమెకు బిడ్డ పుట్టుందన్న సంగతి గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకున్నాను.
పుట్టల్ని, గుట్టల్ని, రాళ్ళను, రప్పలను మొక్కితే పిల్లలు పుడతారని చెబుతున్న ఆమె నమ్మకాన్ని, నేనాక్షణం మార్చలేనని నాకు తెల్సు. ఎవరి విశ్వాసాలు వారివి. ఇతరులకు ఇబ్బంది కానంత వరకు ఎవ్వరం, ఏమీ చెప్పినా వినడం మన ధర్మం. ఆమె పేరు వెనుక కథ కావాలి. నాకామే వ్యక్తిగత విషయాలతో పనిలేదు ఆలోచనల్లో వున్న నన్ను తానే పలుకరించింది మళ్ళీ.
ఏంటమ్మా నవ్వుతున్నారు? నా పేరు మీకు విచిత్రంగా వుంది అందుకనేనా? ఆమె అడిగింది.
లేదు లేదు.. అలా అని కాదు కానీ.. ఏవో సంగతులు గుర్తుకు వచ్చాయి అందుకని, అన్నాను.
మీది ఏ ఊరు అడిగాను
కొల్లేరు దగ్గర పల్లె అంది.
మళ్ళీ తనే మొదలుపెట్టింది. మా అమ్మకు ముగ్గురు తమ్ముళ్లు. వాళ్ళందరూ మా అమ్మను దేవతలా చూసుకుంటారు. అలాంటిది మా అమ్మకు పిల్లలు పుట్టి చనిపోవడంతో, మా నాన్న, మా అమ్మను ఎక్కడ వదిలేసి వేరొకరిని పెండ్లి చేసుకుని ఇంటికి తెచ్చేస్తాడేమో అని ఎప్పుడు అభద్రతా భావంలో మా అమ్ముమ్మ ఇంటోళ్ళు ఉండేవాళ్ళు.
ఇక మా అమ్ముమ్మ, తాతయ్యలైతే అమ్మకు పిల్లలు పుట్టి, చనిపోకుండా జీవించాలని ఎక్కని గుడి మెట్లు, మొక్కని దేవుళ్ళు లేరు. అప్పుడు భీమవరం దగ్గర ‘పెద్దింట్లమ్మ’ గుడికి కూడా పోయినారంట. ఈసారి బిడ్డ బతికితే నీ పేరే పెట్టుకుంటాం తల్లీ! మా బిడ్డ కాపురాన్ని కాపాడు అంటూ ఆ యమ్మను మొక్కుకుని వచ్చినాకనే, మా అమ్మ కడుపున నేను పడ్డానని, నేను బతికి బట్టకట్టినందుకు, నాకు ఆ మాతల్లి ‘పెద్దింట్లమ్మ’ పేరునే పెట్టినారమ్మా అంది.
ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? అసలెలా ఇక్కడికి వచ్చావ్?
మాఅమ్మ, నాయన నాకు పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా మా మేనబావకు ఇచ్చి పెండ్లి చేసినారు. మా ఊర్లో పనులు లేకపోతే, ఈ బెజవాడ బతకడానికి వచ్చాం.
నీకెంత మంది పిల్లలు? నాకిద్దరమ్మా! ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.
చదువుకుంటున్నారా? అవునమ్మా! అబ్బాయి బిటెక్ చేస్తున్నాడు.
అమ్మాయి డిగ్రీలో వుంది. మొత్తానికి పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యారన్నమాట.
అవునమ్మా! మరి మీ ఆయన ఏం చేస్తాడు?
ఆయన ఒక బట్టల షాప్‌లో చేస్తాడమ్మా నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నావ్?
హేమమ్మ వాళ్ళు హాస్పిటల్ పెట్టినారని తెల్సి పాతికేళ్ళ కింద వచ్చి సర్‌ను కలిసి అడిగాను. ఆ అమ్మ పెనిమిటి కూడా చాలా మంచోడు. ఆయనే నన్ను ఇక్కడ ఉద్యోగం చేయమని పని ఇచ్చాడు.
మరి మీ పిల్లలు కూడా వీళ్ళ స్కులులోనే చదివారా?
అవునమ్మా! పిల్లలిద్దరూ వీళ్ళ స్కులులోనే చదువుకున్నారు.
అట్లా పాతికేళ్లు డాక్టరమ్మ దగ్గరే పనిచేసిన. అమ్మ చనిపోయాక హాస్పిటల్‌ను కొన్ని రోజులు మూసి వేసారు. అప్పటి నుంచి అక్కడ ఇక్కడ పనిచేసుకున్నాను. మళ్ళీ హాస్పిటల్ తెరిచారని తెల్సి సార్ దగ్గరికి వచ్చి అడిగినాను. సార్ ఈ నెలలో చేరమని అంటే, ఇదిగో! వారం క్రితం నుంచే పనుల్లో చేరాను.
అవునా..!
మా అమ్మ వున్నప్పుడు ఈ హాస్పిటల్ ఎంతో కళకళలాడుతూ వుండేది. ఆమె కళ్ళల్లో నీటి పొరలు బాధ పడుతున్నావా?
మా డాక్టరమ్మ చానా మంచిది, దేవత అంత గొప్పదమ్మా! భూమ్మీద దేవతలు పుడతారని అంటారు కదమ్మా! అలా పుట్టిన అమ్మనే మా డాక్టరమ్మ అంది.
డాక్టరమ్మా గురించి ఇంకేం చెబుతావో చెప్పు?
ఆయమ్మ ఒక్కతే కాదమ్మా సారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఎంత గొప్పోళ్లమ్మ! అచ్చం తల్లి తండ్రుల ప్రేమలే వారివి.
ఈ హాస్పిటల్ గురించి చెప్పు?
అమ్మ ఉన్నప్పుడు కింద అంతా అవుట్ పేషంట్లతో ఎప్పుడు కిక్కిరిసి వుండేది. పైన అంతా ఇన్ పేషెంట్లు ఉండేవాళ్లు. హాస్పటల్‌లో చేరిన వాళ్ళకందరికి ఆ అమ్మే అన్నం పెట్టేది. అమ్మది దొడ్డచెయ్యి. ఎంతో ప్రేమతో పేషంట్లతో మాట్లాడేది. ఆమె చెయ్యి మనమీద పడితే చాలు, మనకున్న అన్నీ రోగాలు మాయమయ్యేయి అంది తృప్తిగా.
మరి, ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు హాస్పటల్? డాక్టర్లు ఎప్పుడు వస్తారు?
ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు వస్తున్నారమ్మ! పొద్దున పది గంటల నుంచి రెండు గంటల దాకా, సాయంత్రం నాలుగంటల నుంచి, తొమ్మిది దాకా వుండి పేషంట్లను చూసిపోతారు. కూర్చోండమ్మా! డాక్టరు మేడం వస్తారు. మీకు టోకెన్ ఇవ్వమంటారా? నేనూ పేషెంటని అనుకుని అదిగింది పెద్దింట్లమ్మ. వద్దులే! నేను చూపించుకోవడానికి రాలేదు. అమ్మ వాళ్ళ హాస్పటల్, వాళ్ళు నడుపుతున్న ‘వికాస విద్యా వనం’ చూడాలని చాలారోజుల నుంచి అనుకుని ఇప్పుడు వచ్చాను. వాళ్ళింట్లోనే భోజనం చేసి హాస్పటల్ చూద్దామని వచ్చానని చెప్పాను. అయ్యో! అవునా అమ్మ! అమ్మగారింటికి వచ్చారా? ఇంతసేపు మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడాను. ఏమి అనుకోకండమ్మా! తప్పైంది అంది నొచ్చుకున్నట్లుగా..
అదేం లేదులే.. పెద్దింట్లమ్మ! నీ పేరు వినగానే ఎందుకో నీ గురించి తెల్సుకోవాలని అనిపించి మాట్లాడాను. నువ్వే ఏమీ అనుకోకు అన్నాను. అమ్మ వాళ్ళింటికి వచ్చిన వాళ్లెవ్వరైనా ఆ అమ్మ అంత మంచోళ్లైతేనే వస్తారమ్మా! ఉంటా అమ్మా! అంటూ తన పనిలో మునిగిపోయింది.
(హేమాగారు వున్నప్పుడు, వికాస విద్యా వనం వెళ్ళి చూడాలని అనుకున్న నా ఈ ప్రయాణం ‘ఓల్గా’ గారితో వెళ్ళడం, పరిమి గారితో పాటు వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పరిచయం ఒక గొప్ప అనుభూతి. అక్కడి వాతావరణాన్ని, మనుషుల మనసులను పెద్దింట్లమ్మ కథలో కొంత చెప్పగలినా తృప్తితో)
