మహా యోధ అనిశెట్టి రజిత – బి ఎస్‌ రాములు

ఒక మహా వృక్షం నేల కొరిగింది.
అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, ఆర్గనైజర్‌, మహిళా వాది, బహుజనవాది, సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎపుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ పిలుపు ఇప్పటికీ అలా మారు మోగుతూనే ఉంది. వామ పక్ష భావ జాలంలో వికసించిన మహిళా వాది, బహుజనవాది. కార్యకర్త. నాయకురాలు, మేధావి. కవయిత్రి రచయిత్రి. సంకలనకర్త. సహృదయ సౌజన్యశీలి. సాహితీవేత్తలకు ఒక ఆదర్శ నమూనా!

తెలుగు సాహిత్యం గొప్ప సాహితీ వేత్తను కోల్పోయింది
అనిశెట్టి రజిత మృతితో తెలుగు సాహిత్యం గొప్ప యోధను, సాహితీ వేత్తను కోల్పోయింది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపంతో జోహార్లు అర్పిస్తూ వారి కృషి గురించి నాలుగు మాటలు. అనిశెట్టి రజిత తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. స్త్రీ విముక్తికి సామాజిక సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం జీవితమంతా కృషి చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందజేసింది. అంతకు ముందు 2016 ఏప్రిల్‌ 16న దుర్ముఖి ఉగాది వేడుకల సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కవి సమ్మేళనంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సన్మానం.. 2001 లో డా. మలయశ్రీ పురస్కారం. 2001లో డిల్లీలో అందరం కలిసి వెళ్లినపుడు దళిత సాహిత్య అకాడమీ వారిచే వీరాంగన సావిత్రి బాయి ఫూలే ఫెలోషిప్‌… 2005లో సుశీలా సి నారాయణ రెడ్డి కవిత్వ గ్రంథ రచన పురస్కారం అందుకున్నారు. 2014లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే ప్రతిభా పురస్కారం. 2003లో జైమిని అకాడమీ పాణిపట్‌, ఉత్తరప్రదేశ్‌లో సుభద్రా కుమారి చౌహాన్‌ పురస్కారం, 2016లో తెలంగాణ రచయితల వేదికచే అలిశెట్టి ప్రభాకర్‌ పురస్కారం మొదలైనవి అందుకున్నారు.
బీసీ సగర సామాజిక వర్గం నుండి ఎదిగిన వజ్రం
బీసీల్లోని ఉప్పరి / సగర సామాజిక వర్గం నుండి రాతి నేలను చీల్చుకొని మహావృక్షంలా ఎదిగారు అనిశెట్టి రజిత. 14 ఏప్రిల్‌ 1958లో వరంగల్‌ జన్మించిన రజిత కిపుడు 67 ఏండ్లు. అనిశెట్టి రజిత చరిత్ర నిర్మాత. చరిత్ర నిర్మాతగా తనదైన చరిత్ర సృష్టించుకుంది. కవితాధారలో ప్రసంగాల్లో నవ యువత ఆవేశం , ధర్మాగ్రహం, నిత్య చైతన్యశీలి ప్రత్యేకత.
గొప్ప యోధ
అనిశెట్టి రజిత గొప్ప యోధ. పౌరహక్కుల ఉద్యమం, మహిళలపై అత్యాచార వ్యతిరేక ఉద్యమం, విప్లవ ఉద్యమాలు… ఒక్కటేమిటి… ఉద్యమం ఎక్కడ ఉంటే అనిశెట్టి రజిత అక్కడ ఉంటుంది. ఉద్యమంలో భాగమవుతుంది. ఉద్యమాల వెంట నడుస్తుంది. ఉద్యమాలను నిర్మిస్తుంది. ఉద్యమాలు, కవిత్వం, సాహిత్యం, రకరకాల సంకలనాలు, ఒంటరి మహిళా గాధల సంకలనాలు ప్రచురణ, సభలు సమావేశాలు, మహిళా సాధికారికత, బీసీ ఉద్యమ నిర్మాణం తప్ప అనిశెట్టి రజితకు వ్యక్తిగత జీవితం అంటూ వేరే లేదు. పెళ్లి చేసుకోలేదు. తన జీతాన్ని జీవితాన్ని సామాజిక సాహిత్య ఉద్యమాలకు అంకితం చేసింది. ఏ మీటింగ్‌కు వెళ్లినా వెంట కెమెరా తెచ్చుకొని ఆ వార్తలను అందరికి స్పూర్తి దాయకంగా అందించేది. అనిశెట్టి రజిత విప్లవోద్యమాలకు పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌గా సీనియర్‌ అసిస్టెంట్‌గా 1992లో చేరారు. 2019లో రిటైరయ్యారు. కాళోజీ, కాత్యాయనీ విద్మహే, జ్యోతి, వంటి సాహితీవేత్తలతో సహవాసం ఆమె చైతన్యాన్ని నిత్యం ప్రజ్వరిల్లజేసింది. క్రమంగా తానే స్పూర్తినిచ్చి కదిలించేదిగా ఎదిగింది. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక కార్యదర్శిగా సేవలందించారు.
అనిశెట్టి రజితతో ఎన్నో జ్ఞాపకాలు
అనిశెట్టి రజితతో ఎన్నో జ్ఞాపకాలు. 1998 ఆగస్టులో జగిత్యాలలో వందలాది సాహితీ వేత్తలతో నా 50వ జన్మదినం జరిగినప్పటి నుండి ఏటా విశాల సాహితి సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు. విశాల సాహితీ సత్కారం అందుకున్నారు. తన చేతుల మీదుగా విశాల సాహితీ సత్కారాలు అందజేశారు. వరంగల్‌ నుండి హైదరాబాద్‌ వచ్చినపుడల్లా దీపక్‌ టాకీస్‌ ఎదుట గల ఆచార్య పి.యశోదారెడ్డి గారింట దిగేది. స్వంత ఇల్లుగా ఫీలయ్యేది. నేను కూడ అప్పుడప్పుడు అక్కడే కలుసుకునేది. అక్కడ అన్నీ తెలంగాణ ముచ్చట్లే. తెలంగాణ యాస భాష నుడికారం ఎంత గొప్పదో వంట అయ్యే దాకా, భోంచేసి పని మీద బయలుదేరే దాకా తెలంగాణ ముచ్చట్లు. అనిశెట్టి రజిత తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. వందలాది కవుల రచయితల తలలో నాలుకలా ఆత్మీయురాలైంది. విప్లవ సంఘాలతో, పౌరహక్కుల ఉద్యమాలతో అనిశెట్టి రజిత రిటేరయ్యాక కాకతీయ యూనివర్సిటీని కాజీపేటను కలిపే 100 ఫిట్ల రోడ్‌లో తనదంటూ ఇల్లు ఏర్పరుచుకున్నారు.
దరకమే ఐక్య వేదికలో అనిశెట్టి రజిత
దశాబ్దాల స్నేహంలో ఎన్ని రంగాల్లో కలిసి పని చేశామో ఎన్ని విషయాలు, భావాలు కలిసి పంచుకున్నామో లెక్కలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో కూడిన దరకమే ఐక్య వేదిక నిర్మాణంలో అనిశెట్టి రజిత చురుకుగా పాల్గొన్నారు. 1992లో ప్రారంభమైన దరకమే ఐక్య వేదిక నిర్మాణంలో వరంగల్‌ జిల్లాలో పి.రాములు, పి.ఎన్‌.ప్రసంగి, శమశ్రీ మల్లయ్య, స్వామి తదితరులతో కలిసి బహుజన సాహిత్య ఉద్యమ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. 1992 నుండి వ్యవస్థాపక కన్వీనర్‌గా, అధ్యక్షుడిగా రాష్ట్ర నిర్మాణంలో నాకు వరంగల్‌లో అంది వచ్చిన చేయి చేయూత అనిశెట్టి రజిత.
అనిశెట్టి రజిత వంటి ఉత్సాహవంతులే సంస్థకు అవసరమని, వరంగల్‌ మొగిలయ్య హాల్‌లో 1995లో జరిగిన దరకమే ఐక్య వేదిక రెండు రోజుల రెండవ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఆచార్య ననుమాస స్వామి కూడా వరంగల్‌ వాడే కావడం విశేషం. దరకమే ఐక్య వేదిక తరఫున గబ్బిలం సాహిత్య పత్రిక తీసినపుడు, వెంట వెంట రాష్ట్ర కార్య వర్గ సమావేశాలు జరపడంలో చురుకుగా పని చేశారు. బుద్దుడు నుండి కబీర్‌ గురునానక్‌, మహాత్మా జోతిరావు ఫూలే, అంబేద్కర్‌, బియస్పీ కాన్సీరాం బాటలో సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత భాష ప్రాంత వివక్షతలను తొలగించే సాహిత్య సామాజిక సంస్కృతిక రంగాలను బలమైన శక్తిగా నిర్మించడంలో అంది వచ్చిన నాయకత్వం వరంగల్‌ నుండి అనిశెట్టి రజిత, ప్రభంజన్‌ కుమార్‌, వల్లంపట్ల, ఖమ్మం నుండి జూపల్లి సత్య నారాయణ, కె. సీతారాములు, జగిత్యాల నుండి కె. రామ లక్ష్మణ్‌, రాజధాని నుండి మాస్టార్జీ, విజిఆర్‌ నారగోని, ననుమాస స్వామి, ఉ.సాంబశివరావు, కె జి సత్యమూర్తి సాహిత్య తాత్విక సామాజిక ఉద్యమాలను బలోపేతం చేసింది. చరిత్రను మలుపు తిప్పింది. ఆ చరిత్ర నిర్మాణంలో పాల్లొని అనిశెట్టి రజిత, ప్రభంజన్‌, రామ లక్ష్మణ్‌ చరితార్థులయ్యారు.
మా పెద్ద కొడుకు పాణిగ్రాహి పెళ్లి హన్మకొండలో 2000 ఫిబ్రవరిలో స్టేజి మ్యారేజి చేసినపుడు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌, కాళోజీ మొదలైన వారి చేతుల మీదుగా పెళ్లి జరగడంలో అందరిని ఆర్గనైజ్‌ చేయడంలో అనిశెట్టి రజితదే ప్రధాన పాత్ర.
అనిశెట్టి రజిత రచనలు
1973లో ‘‘చైతన్యం పడగెత్తింది’’ అనే తొలి రచనతో అనిశెట్టి రజిత రచనా జీవితం మొదలైంది. 500 పైగా కవితలు, వందకు పైగా వ్యాసాలు, వందలాది ప్రసంగాలు. 30 పైగా పాటలు. 1. గులాబీలు జ్వలిస్తున్నాయి కవితా సంపుటి (1994), నేనొక నల్ల మబ్బు నవుతా (1997), చెమట చెట్టు (1999), ఓ లచ్చవ్వ (2005), ఉసురు (2002), గోరంత దీపాలు (2005), మొదలైన కవితా సంపుటాలతో పాటు మట్టి బంధం కథల సంపుటి వెలువరించారు.
సంకలనకర్తగా
అనిశెట్టి రజిత సంపాదకత్వంలో 1. వెతలే కథలై 2. ఊపిరి 3. జిగర్‌ 4. ఉద్విగ్న 5. ఆకాశ పుష్పం 6. ముజఫర్‌ నగర్‌ మారణకాండ 7. అగ్నిశిఖ 8. పోలవరం ప్రాంతక ప్రమాదం మొదలైనవి.
అనిశెట్టి రజిత రిటైరయ్యాక కూడా పూనుకొని ప్రతి ఒకరికి ఫోన్‌ చేసి రాయించి తెచ్చిన సంకలనాలు సాహిత్య ఉద్యమంలో మైలురాళ్లుగా నిలిచి పోయాయి. నూతన తరాలను ప్రోది చేసాయి. కొంతకాలం మహిళా రచయితల సంస్థను నిర్మించి ముందుకు నడిపారు. ఇలా నిరంతర సాహిత్య జీవిగా జీవించిన అనిశెట్టి రజిత ధన్య జీవి. యువ తరానికి ఆదర్శం. నా 75 వ జన్మదిన సందర్భంగా జీవన చారి మనవిహారి అనే కవితాత్మక శీర్శికతో తన ఆత్మీయతన పంచుకున్నారు. వారి రచనలు అనేకం. వాటి నుండి కొన్ని ఏర్చి కూర్చి ఒక సంపుటి పలువరి జ్ఞాపకాల సంచికను యువతరం పూనుకొని తేవడం అవసరం. బహుజన బీసీ, మహిళా ఉద్యమాలలో సావిత్రి బాయి ఫూలే వారసత్వాన్ని కొనసాగించిన అనిశెట్టి రజితకు జోహార్లు. నివాళి.

Share
This entry was posted in రజిత స్మరణలో. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.