ఏడ్చేంతటి ఓపిక లేక
హాయిగా నవ్వుతూనే ఉన్నా!
తిట్టేంతటి తీరిక లేక
అనవరతం ఆనందంగా కనిపిస్తున్నా!
వాదించేంతటి వెసులుబాటు లేక
ఒప్పుకుని సౌమ్యంగా ఉండిపోతున్నా!
అసూయా ద్వేషాలు
కుతంత్రపు అక్రమాలు, ఆక్రమణలు
కంచంలోని అన్నం ముద్దను అప్రమేయంగా లాక్కున్నాక..
అన్యాయంగా కలలన్నీ చెరిపి వేసాక..
హృదయ కుహురంలోని సున్నితత్వాన్ని చిదిమేసాక..
ఎడతెగని పోరు తప్పనిసరి అని..
నిటారుగా నిలుచున్నా!
నిర్జన నిశీధిలో
కన్నూ మిన్నూ కానరాక
ఒంటరిగా తిరుగుతూ ఉండలేక..
చీకటి వాకిలి ముంగిట
ఆలంబన బావుటా చేతబట్టి,
వెలుతురు దివిటీగా వాలిపోతున్నా!
ఇక ఇప్పటినుండి..
మరెన్నో వెలగలేని
దీపాలను కూడా
అనుక్షణం వెలిగిస్తూనే ఉంటా!
హోరు గాలి ఎంత బలంగా వీచినా,
భోరున వర్షం ఎంత జోరుగా కురిసినా..!
