ఆమె విశ్వాసం ముందు గుళకరాయి
పర్వతం చుట్టూ పరుగులు తీస్తుంది…
తలపై ‘‘చుట్ట కుదురు’’
కుదురుపై చిత్రాల గంప
చిన్ని చిన్ని వస్తువులు
గంప నిండా మురిపిస్తూ… ముద్దుగొల్పుతూ
గంప చుట్టూ వ్రేళ్ళాడుతూ కొన్ని
ఆమె చెమట బిందువుల్లాగే
వెలుగు కిరణాలలో మెరుస్తూ
ఆడవారిని ఆకర్శించే నిత్యావసరాల సామాన్లు
ఆమె గుండెలపై పాలు తాగుతున్న పసివాడు
పాత పంచెతో నడుముకు చుట్టబడి…
‘‘సూదులమ్మా… సూదులు, దారాలు
అద్దాలు … దువ్వెన్లూ… పిన్నీసులు…
సుస్వర సారంగి స్వరం
ఎలుగెత్తి సాగదీస్తూ…..
చిన్ని సామాన్లు కదులుతూ లయబద్దకంగా
తాళం వేస్తున్నాయి.
‘‘చుపీ.. చుప్’’ మంటూ చిన్నోడు
పాల కొరకు పారాడు సవ్వడి
బిలబిలమంటూ గంపచుట్టూ ఆడవారి సందడి
గలగల ముచ్చటిస్తూ బేరాల సంబరం…
కొసిరి కొసిరి కొసురుతూ
రూపాయిది పావలకు… పావలాది పదిపైసలకు
రెండన్న కాడ నాలుగివ్వమంటూ
గజిబిజిగా చేతులు గంపలో పెడుతూ
అల్లరి చిల్లరగా ఆగని బేరాలు
గిట్టుబాటు కాదంటున్నా… విసిగిస్తూ గంటలు గడుస్తున్నాయి
వన్నెల షాపుల్లో వేలు కుమ్మరించడానికి వెనుకాడని వనితలు
ఏది చూచినా వదలలేక… పైస కాడ వదులుతూ…
పాలు చాలక గుక్క పడుతున్న పసివాడు.
లాలిస్తుంది, బుజ్జగిస్తుంది చేతులు మార్చి ఎత్తుకుంటుంది ఏడుపు వారికి కలగని అంతరాయం
ఆగని బేరాల ఆగం…
నిరాశ…..
పైస పైస కొసరుతూ… బేరం కుదురని… నిరాశ… నిస్పృహ
ఏడుపు స్థాయి పెరిగింది
ఎవరైనా నాలుగు మెతుకులు పెట్టండి తల్లీ
పాలు చాలక బుల్లోడు ఏడుస్తున్నాడంటు చేతులెత్తి అర్థిస్తుంది
దయతలిచిన తల్లి.. చిన్నోడి కడుపు చల్లార్చాంది
గంపలోని ఒక చక్కని స్టీల్ ప్లేట్ ఆమె గేటు
లోపలికి జారవిడిచింది… కృతజ్ఞతగా…
అయిన వరకు అమ్మకం సరిపెట్టుకుని
గంపనెత్తుకుని రోడ్డు చేరింది…
కొలువైన పెద్ద సూపర్ షాపింగ్ మాల్స్!
చూస్తుంది సంభ్రమాశ్చర్యలతో…
విప్పారిన కళ్ళతో….
పాపం! ఆమెకు తెలియదు
అవి ఆమె
బ్రతుకులో నిప్పులు పోస్తాయని
పెదవులు విచ్చుకుంటున్న… అందమైన ఊహ
తన బుల్లోడు పెద్దయ్యాక
అంతటి – దుకాణం పెట్టుకుంటాడని
కలలు కంటూ… ఆ తల్లి
ఆకాశ శిఖరాలను
మురిపెంగా చూస్తూ ఆశగా సాగిపోతుంది
సారంగి స్వరంతో…..
