మగస్వామ్యంలో కొత్త ఆకర్షణీయ ధోరణులు: ట్రాడ్‌ వైవ్స్‌ – ఎ. సునీత

కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీవాద మిత్రురాలు ట్రాడ్‌ వైవ్స్‌ గురించి ఫేస్బుక్‌లో ఆందోళన చెందే పరిణామమని పోస్టు రాస్తే వీళ్ళెవరూ అని ఈ తరం స్త్రీవాది మా అమ్మాయిని అడిగాను. ‘ఇదంతా ఇంస్టాగ్రామ్‌లో ఒక లేటెస్ట్‌ ట్రెండ్‌ అమ్మా, అంతకంటే ఏమీ లేదు’, అని తేల్చేసింది. గూగుల్‌ సహాయంతో దొరికిందంతా చదివాను. ట్రాడ్‌ వైవ్స్‌ అన్నది ట్రెడిషనల్‌ వైవ్స్‌కి పొట్టి పదం.

వీళ్ళు ఇంట్లో భర్త నీడలో వుండటాన్ని, భర్త, పిల్లల కోసం ఇష్టమైనవి వండి పెడుతూ, వారి సంతోషం కోసం కృషి చేసే గృహిణి జీవితాన్ని కావాలని ఎంచుకున్న బాగా చదువుకున్న ఆధునిక స్త్రీలు. స్త్రీవాదం బయటికెళ్లి పనిచెయ్యటాన్ని అందరు స్త్రీలకి ఆదర్శవంతం చేసి, ఆధునిక స్త్రీలని అసాధ్యమైన జీవితం వైపు నెడుతోందని, దానివల్ల వాళ్లకి ఇంటా, బయటా రెండు చోట్లా సంతోషం, సుఖం లేకుండా పోయాయని ట్రాడ్‌ వైవ్స్‌ నమ్ముతారు. మగవాళ్లు, ఆడవాళ్ళూ వేరు వేరు పనులు చెయ్యాలని, మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే అధికులని కూడా వీరి అభిప్రాయం. మతాల్లో కూడా దీనికి అనుమతి ఉంటుందని, తమ జీవితాలకి వాటి మద్దతు ఉందని భావిస్తారు.
అలీనా కేట్‌ పెట్టిట్‌ అనే బ్రిటిష్‌ మహిళని ఈ కొత్త ధోరణికి ఆద్యురాలిగా చెప్పుకుంటారు. వుద్యోగం చేసే తల్లి, తండ్రి విడాకులు తీసుకోవటం వల్ల తన బాల్యం సంతోషం లేకుండా గడిచిందని, తన వ్యక్తిగత జీవితంలో భర్త అంగీకారంతో గృహిణి జీవితాన్ని ఎంచుకున్న ఈమె 2016లో లేడీస్‌ లైక్‌ అజ్‌ అనే పుస్తకాన్ని రాసి తన అనుభవాలని, ఆలోచనని ఇతరులతో పంచుకుంది. కోవిడ్‌ సమయంలో 2020లో బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చి సోషల్‌ మీడియా ద్వారా ప్రాచుర్యం పొంది చాలా మందికి ‘మార్గదర్శకురాలిగా’ మారింది. ఆడవాళ్లు ఆధునిక ఉద్యోగాలు చేసే ఆవేశం, వత్తిడిలో పడి తమ ఆడతనాన్ని, గృహిణిగా ఉండటంలోని సాధారణ ఆనందాన్ని కోల్పోతున్నారని, అలా బ్రతికే అవకాశం ఆడవాళ్ళకి వుండాలని ఆమె వాదన. మత విశ్వాసాలు బలంగా వుండే క్రిస్టియన్‌ స్త్రీల బృందాల్లో కూడా ఈమె ఆలోచనలు ప్రాచుర్యం పొందాయి. దీని తర్వాత, ఇంస్టాగ్రామ్‌లో ఆమెకి లక్షల మంది ఫాలోయర్స్‌ చేరారు. నెమ్మదిగా ఆవిడని తలదన్నే ట్రాడ్‌ వైవ్స్‌ హన్నా నీలమన్‌, ఎస్టీ విలియమ్స్‌, జాస్మిన్‌ దినిస్‌, అబీరాత్‌ వంటి అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ ఆడవాళ్లు కూడా చేరారు.
గత రెండేళ్లలో భారతదేశంలో జీaజూఅఱ్‌ సేథీ, ఒమాన్‌ గుప్త, మౌని రాజపుట్‌ వంటి వాళ్ళు ఈ కోవలోకి చేరారు. తమ రోజు వారీ జీవితం, తమ పిల్లలు, భర్తల కోసం, వారి అంతరంగంలో వుండే కోరికలని, వ్యక్తం చేసినా, చెయ్యకపోయినా, తెలుసుకుని, వారికి కావాల్సినవి, ముఖ్యంగా స్వచ్ఛమైన వంటకాలు తమ స్వంత చేతుల్తో చేసి పెట్టటం, మతపరమైన పండగలు జరుపుకుకోవటం-వీటన్నింటి గురించి మడత నలగని బట్టలలో, చెదరని మేకప్‌తో – అందమైన ఫోటోలు, వీడియోలు తమ ఫాలోయర్స్‌తో పంచుకుంటారు. తమకి భర్తలపై ఆర్ధికంగా ఆధారపడటం ఇష్టమేనని కూడా చెప్పుకుంటారు. చాలా మంది కొత్తగా వచ్చే బట్టల బ్రాండ్లు, కిచెన్‌ గాడ్జెట్స్‌, ఇతర వస్తువులు అమ్మే మార్కెటింగ్‌ సైట్లకు తమ వీడియోలలో ప్రచారం కల్పిస్తారు.
తెల్ల జాతి ట్రాడ్‌ వైవ్స్‌ నలభై, యాభై ఏళ్ళ క్రితం వచ్చిన వాణిజ్య ప్రకటనల్లో ఆడవాళ్లు వేసుకున్న బట్టల డిజైన్లు, అప్పటి సెట్టింగ్స్‌ని అనుకరిస్తారు. తెల్లటి పల్చటి ఎగిరే గౌన్లు, టైట్‌ గౌన్ల మీద ఏప్రాన్లు, చెక్కు చెదరని ఇల్లు, నీట్‌గా బట్టలేసుకుని జుట్టు చెదరని పిల్లల మధ్య వీళ్ళు చెరగని చిరునవ్వుతో పొద్దున్న బ్రెడ్‌, తర్వాత అనేక రకాల వంటకాలతో లంచ్‌, డిన్నర్‌ తయారు చేస్తూ కనిపిస్తారు. భారతదేశంలో ట్రాడ్‌ వైవ్స్‌ సరికొత్త ఫ్యాషన్లలో బట్టలు వేసుకుని షాపింగ్‌ చేస్తూ, పండుగలు జరుపుకుంటూ, భోజనాలు ఏర్పాటు చేస్తూ వుంటారు. పెళ్ళయిన తర్వాత జీవితం రోజూ జీవితం ఎంత సంబరంగా ఉంటుందో చూసే వాళ్ళకి చెబుతుంటారు. వీళ్ళే కాకుండా కొంత మంది ముస్లిం మహిళలు ఇస్లామిక్‌ పద్ధతుల్లో పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఇంటిని తీర్చి దిద్దుకోవాలి, ఎలా భర్తతో కలిసి మెలిసి ఉండాలి అనే విషయాలపై కూడా టిక్‌ టాక్‌ లో తమ పోస్టులు పంచుకుంటూ వుంటారు.
గడిచిపోయిన కాలం గురించిన నోస్టాల్జియా, స్త్రీ పురుష అసమానతని, వేరు వేరు పరిధిల్లో ఉండటాన్ని ఆహ్వానించి, పైగా మత నియమాల ప్రకారం నడుచుకుంటే, ఆధునిక మహిళగా అన్ని రకాల ఆనందం స్వంతం చేసుకోవచ్చనే బలమైన నమ్మకం వీరందరిలో మనకి కనిపిస్తుంది. వీళ్లల్లో చాలా మంది మాకు ఏ రాజకీయాల్లేవని అని అంటారు గానీ ఇంస్టాగ్రామ్‌ / టిక్‌ టాక్‌ వంటి పబ్లిక్‌ వేదికల్లో లక్షల్లో ఫాలోయర్స్‌ ఉండటం సమాజంలో ప్రభావితం చేసే స్థానంలో వున్నవాళ్లు, కొన్ని రకాల ఎంపికలని సరయినవని చెప్పేవాళ్ళు, తమకి తెలిసినా, తెలియకపోయినా రాజకీయ రంగంలో వున్నట్లే.
గత వందేళ్లల్లో స్త్రీ పురుష సమానత్వ భావన, ఇతర సమానత్వ భావనల్లాగే అన్ని దేశాల్లో ఎంతో కొంత వ్యాపించింది. 21వ శతాబ్దంలో గృహిణి పాత్రని స్వచ్చందంగా ఎంచుకుని దాన్ని గొప్పగా భావించే ఆడవాళ్లు తక్కువ అయిపోయారు కాబట్టి, ఇదొక వింత పోకడగా చాలా మందికి అనిపించొచ్చు.
ఇంట్లో మగవాళ్లకి వండి పెట్టటం మా జీవితోద్దేశం కాదంటూ అనేక మంది చదువుకున్న అమ్మాయిలు ఒక పక్క, అమ్మాయిలు చదువుకుని ముందుకెళ్లాలంటూ ప్రభుత్వాలు మరో పక్క ఊదర కొడుతుంటే, సమానత్వ భావన మార్కెట్‌ ప్రచారంలో కూడా భాగమయిపోయిన తర్వాత, పెళ్లితో తమ అస్తిత్వం నిలబడుతుందని ఇప్పటి వరకూ భావించిన అబ్బాయిలకి సోషల్‌ మీడియాలోనూ, బయటా ఇదంతా కష్టతరంగా మారింది. తమ తండ్రులకి, తమకి చేసి పెట్టిన తల్లుల్లాంటి ఆడవాళ్లు తమకి దొరకరని అర్ధమయిపోయిన వీళ్ళకి ఇటువంటి ట్రాడ్‌ వైవ్స్‌ అకౌంట్లు కొంత స్వాంతన కల్పిస్తున్నాయి. ట్రాడ్‌ వైవ్స్‌ ఫాలోయర్స్‌లో ఈ తరం మగవాళ్ళు ఎక్కువుండటం యాధృచ్చికమేమీ కాదు.
అయితే పాపం వీళ్ళు ఎంత కోరుకున్నా వ్యవస్థీకృతంగా జరిగిన మార్పులు వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ట్రాడ్‌ వైవ్స్‌ ధోరణి కొత్త ఆర్థికంలో భాగం. కెమెరా ముందు సనాతన పాత్రలు పోషించే తెలుగు సినిమా హీరోయిన్లు జీవితంలో అత్యంత ఆధునిక కెరీర్‌ స్త్రీలు అయినట్లే, ఇంస్టాగ్రామ్‌లో ట్రాడ్‌ వైవ్స్‌ కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సెర్‌లు. ఈ రకమైన ఫోటోలు, వీడియోలు యధావిధి జీవిత చిత్రణ కాదు. వీటిని ఉత్పత్తి చెయ్యాలంటే, ఈ ఆడవాళ్ళకి ఒక పెద్ద టీం వెనక ఉండాలి, దానికి కావాల్సిన ఆర్ధిక సౌలభ్యం ఉండాలి, సాంఘిక పెట్టుబడి కూడా ఉండాలి. ఇంట్లో శుభ్రం చేసే ఇంటి కార్మికులు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు, వీడియోలు తయారు చేసేవాళ్ళు, ఆ అకౌంటు నిర్వహించే వాళ్ళు, మార్కెటింగ్‌లో అనుభవం వున్న నిపుణుల సహాయం లేకుండా ఇవన్నీ చెయ్యటం కుదరదు. తెలుగు సాంఘిక సినిమాల్లో పొద్దున్నే తలంటు పోసుకుని, దేవుడికి పూజ చేసి భర్తని లేపే భార్య పాత్రల నుండి, తెలుగు సీరియళ్లలో ఖరీదయిన తళుకులీనే చీరలు కట్టుకుని పూజలు చేసే మహిళా పాత్రలు పోషించిన వాళ్ళు ఎంత సాంప్రదాయ వాదులో ఈ ఇంస్టాగ్రామ్‌ ట్రాడ్‌ వైవ్స్‌ కూడా అంతే సంప్రదాయ వాదులు.
శరణ్య భట్టాచార్య తన పుస్తకం డెస్పెరేట్ల్య్‌ సీకింగ్‌ షారుఖ్‌: ఇండియా’స్‌ లోన్లీ యంగ్‌ విమేన్‌ అండ్‌ ది సెర్చ్‌ ఫర్‌ ఇంటిమసీ అండ్‌ ఇండిపెండెన్స్‌ పుస్తకం, ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోవటానికి సహాయం చేస్తుంది.
మన దేశ పితృస్వామ్యంలో పెళ్లి అమ్మాయిలని లోపల, బయట శాసించే వ్యవస్థ. అమ్మాయిల్ని పెంచేది, చదివించేది పెళ్లి కోసమే. ఎంత చదువుకున్నా తమంతట తాము భర్తలని ఎంచుకునే స్వతంత్రం వాళ్లకి ఇవ్వరు. అందువల్ల రొమాన్స్‌ కావాలంటే పెళ్లి వరకూ ఆగాల్సిందే. వుద్యోగం చేసినా, పెళ్లి తర్వాత అత్తింటి వాళ్ళ దయా దాక్షిణ్యాల పైనే అది ఆధారపడుతుందని ముందే మానసికంగా సిద్ధం చేసి పెడతారు.
ఆర్ధిక వ్యవస్థ ఆడవాళ్ళకి సమాన అవకాశాలు, ఇప్పటికీ కల్పించట్లేదు, సమాన వేతనాలు ఇవ్వట్లేదు. మగవాళ్ళని ఎట్లా గొడ్డు చాకిరీ చేయిస్తుందో, ఆడవాళ్ళూ అట్లాగే చెయ్యాలని ఆశిస్తుంది. చెయ్యలేని వాళ్ళని తక్కువ అవకాశాలు, వేతనాలతో శిక్షిస్తుంది. ఆడవాళ్ళకి ఇంట్లో ఇంకో వుద్యోగం ఉందనే విషయం నాకు అక్కర్లేదు అంటుంది. పెరిగే ఆర్థికంలో – రవాణా వంటి రంగాలలో – రక్షణ తక్కువ కాబట్టి ఆడవాళ్లు పాల్గొనలేరు. తక్కువ వేతనాలున్న ప్రాధమిక విద్య వంటి రంగాలలో వాళ్ళు కూరుకుని వున్నారు. అట్లాగే పిల్లల కోసం వుద్యోగం నుండి బ్రేక్‌ తీసుకున్న ఆడవాళ్ళకి తిరిగి ఉద్యోగ రంగం లోకి రావాలంటే, కొన్ని చోట్ల తప్ప, అవకాశాలు తక్కువ.
ఇంకో పక్క భారత రాజకీయ వ్యవస్థ, ఆరోగ్య, విద్యా వ్యవస్థలు, చిన్న పిల్లల్ని చూసుకునే శిశు కేంద్రాలని ఇప్పటికీ సరిగ్గా ఏర్పాటు చెయ్యకుండా ఆ భారమంతా అమ్మాయిలు, ఆడవాళ్ళ పై పెడుతోంది. పైగా వీలుంటే అణగారిన వర్గాల స్త్రీలని అతి తక్కువ డబ్బులిచ్చి అతి ఎక్కువగా పనిచేసే విధానాలు తయారు చేసి వాడుకుంటుంది. వారికున్న కొద్ది శ్రామిక హక్కులు, కనీస వేతనాల చట్టాలు కూడా అమలు చెయ్యనని క్రిందటి దశాబ్దంలో చేతులెత్తేసింది.
వ్యవస్థీకృతంగా ఏర్పర్చిన ఈ చట్రంలో అత్యధిక శాతం అమ్మాయిలకి జీవితంలో పెళ్లే అతి పెద్ద సంఘటనగా, దాని సాఫల్యమే జీవితానికి పరమావధిగా మారింది. ఇక పెళ్లి తర్వాత జీవితాలు ఎట్లా నడుస్తున్నాయి? నీలాంజన భౌమిక్‌ లైస్‌ అవర్‌ మదర్స్‌ టోల్డ్‌ అజ్‌ పుస్తకం మధ్య తరగతి ఆడవాళ్ళ వైవాహిక జీవితాలని శరణ్య భట్టాచార్య పుస్తకం లాగే విస్తృత పరిధిలో చర్చిస్తుంది. 1980లలో మొదలయిన కొత్త మగస్వామ్య ప్రచారం ఇంట్లో, బయటా అన్నీ చేసేసి, సాధించగలరని ఆడవాళ్ళని ఊదర గొట్టి, దీని కారణంగా ఆడవాళ్ళ పైన పడే అపారమైన భారాన్ని ఎవరూ గుర్తించకుండా చేసిందని చెప్తుంది. ఈ విషయం పైన అనేక భారతీయ ప్రధాన స్రవంతి సామాజిక శాస్త్రవేత్తలు అప్పట్లో అధ్యయనాలు చేసి ఇలా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ జీవితాలని ఆధునికత-సంప్రదాయం చట్రంలో చూసి, వాళ్ళు ‘బయటి జీవితానికి’ ఎంత అలవాటు కాగలరో చూసారు. కుటుంబాల శ్రమ విభజలో రావాల్సిన మార్పుని, రానప్పుడు వారిపై పెరిగే కుటుంబ సంరక్షణా భారం, భావోద్వేగ పరమైన బరువు వంటివి విశ్లేషణా చట్రంలోకి తీసుకురాలేదు. ఇది ఉదార మగస్వామ్య దృక్పధం. 1980లలో ఉద్యోగాలు చేసిన ఆడవాళ్లు తమని తాము ఈ మగస్వామ్య దృక్పధంలోనే చూసుకున్నారు. 1990ల తర్వాతే కుటుంబ శ్రమ విభజన పట్ల స్త్రీవాద దృక్పధం సామాజిక శాస్త్రాల్లో ప్రబలింది. ముందుతరం స్త్రీలు తర్వాతి తరం కూతుళ్లతో ఈ విషయాల గురించి చెప్పకపోవటం వెనుక ఈ ఉదార వాద మగస్వామ్య భావజాలం సృష్టించిన భావనా లేమి కూడా వుంది. ఇక, ఆ తర్వాత, మధ్య తరగతి ఆడవాళ్లు ఈ భారాన్ని ఇంటి కార్మికుల మీద పడేసారు గానీ, బయట ఏ పని, కార్యక్రమం, వుద్యోగం చేసినా, ఇల్లు నిర్వహించే బాధ్యత ప్రధానంగా ఆడవారిదే నన్న భారతీయ ఉదార మగస్వామ్య భావన అన్ని వర్గాల్లోనూ బలంగా పాతుకు పోయింది.
భారతదేశ ట్రాడ్‌ వైవ్స్‌ ‘సంప్రదాయ జీవితం’ పేరు మీద నడిపే ఈ ఇంస్టాగ్రామ్‌ అకౌంట్లు పాత సంప్రదాయ జీవనాన్ని పునరుద్ధరిస్తున్నవి కాదు. ఇవి కుటుంబం పట్ల ఆధునిక మగస్వామ్య దృక్పధాన్ని ప్రతిబింబించేవి. దీనిని భారత ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి దారీ వ్యవస్థ, కుటుంబ మగస్వామ్య సంస్కృతి అన్నీ కలిపి రూపొందించాయి. పెళ్లి ఆడవాళ్ళ జీవితానికి పరమావధిగా కొనసాగుతూ, మార్కెట్‌ ఆడవాళ్లపై వివిధ రకాల కట్టుబాట్లు విధిస్తూ, ప్రభుత్వం కుటుంబాల్లో వయోజనులందరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకటానికి కల్పించాల్సిన పబ్లిక్‌ వనరులు, వసతులు కల్పించకుండా చేస్తున్నప్పుడు, అత్తగారింట్లో ఎలాంటి సంప్రదాయాలుంటే అలా జీవితాన్ని మలుచుకోవాలనే భావజాలం బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవటం వ్యవస్థని బలపరిచే వారి పైన ట్రాడ్‌ వైవ్స్‌, తెలిసో, తెలియకో, వేసిన ఒక జోక్‌.
20 వ శతాబ్దపు చరిత్ర చూసుకుంటే, స్త్రీవాదం మన దేశంలో అయినా, ఇతర దేశాల్లో అయినా తిన్నగా పురోగతి సాధించలేదని, అనేక సంప్రదాయ కూటములు, సంఘాలతో ఘర్షణ పడుతూ, అనేక వైరుధ్యాల మధ్య సంప్రదాయ కుటుంబ విలువలని సవాలు చేసి ముందుకెళ్లిందని అర్ధమవుతుంది. ఈ కూటముల్లో ముఖ్యంగా బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబ జీవితాన్ని వనరుగా చేసుకుని 20వ శతాబ్దం మొదట్లో బ్రిటిష్‌ వారిపై జాతీయ వాద యుద్ధం ప్రకటించిన బాల గంగాధర్‌ తిలక్‌ వున్నాడు, స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ విలువల ఆధారంగానే హిందూ ఆడవాళ్ళ హక్కులని వ్యతిరేకించిన సనాతన వాదులు వున్నారు. ఇంకా ఎందుకు, చరిత్రకారుడు మహబూబ్‌ బాషా ఈ మధ్యనే తెచ్చిన స్క్రిఫ్టింగ్‌ ఎ న్యూ జెండర్‌ పొలిటిక్‌ పుస్తకంలో చెప్పినట్లు సనాతన స్త్రీల సంఘాలు కూడా వున్నాయి. సంప్రదాయ కుటుంబ విలువలని 1980ల వరకూ భారత జాతి రాజ్యం ఆడవాళ్ళని ఏ విధానాల్లో భాగం చెయ్యకుండా గాలికొదిలెయ్యటానికి వాడుకుంటే, 1990ల్లో వచ్చిన సరళీకరణ విధానాలతో వచ్చిన కొత్త ఉదారవాదం కేబుల్‌ టెలివిజన్‌ ద్వారా రామాయన్‌, క్యోన్కి సాస్‌ బి కహీ బహూ థీ వంటి సీరియళ్ల ద్వారా ప్రచారం కల్పించింది. మహిళా, స్త్రీవాద ఉద్యమాలు వీటన్నింటి మధ్యా అనేక రకాలుగా తమ సంఘర్షణ కొనసాగిస్తూనే వున్నాయి. ఒక పక్క ట్రాడ్‌ వైవ్స్‌ అకౌంట్లు ఉంటే, వాళ్ళని సవాలు చేసే అనేక స్త్రీవాద అకౌంట్లు కూడా అనేకం అదే ప్లాట్‌ఫారంలో వున్నాయి. పెళ్లి, కుటుంబ విలువలపై సంఘర్షణ నిజ ప్రపంచంలో ఇలాగే నడుస్తుంది.

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.