‘‘చిట్టి చిలకమ్మా! / చిన్నీ చిలకమ్మా!
అమ్మ కొట్టిందా?/ తోట్లోకెళ్లావా?
పండు తెచ్చావా?/ పాపాయికిచ్చావా?
గూట్లో పెట్టావా?/ గుటుక్కు మింగావా? ‘‘.. చిన్నప్పుడు మనందరం ఈ బాలగేయాన్ని పాడుతూ పెరిగిన వాళ్ళమే.. ఈనాటికీ ఈ గేయాన్ని మన పిల్లలకు నేర్పిస్తున్నాం. ఖండాంతరరాలలో వున్న తెలుగు పిల్లలు ఈనాటికీ ఈ గేయాన్ని నేర్చుకుంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ గేయం పుట్టుక నేపథ్యం తెలుసుకుంటే.. విద్యా వ్యవస్థలో, విద్యా బోధనలో అరవై యేళ్ళ నుంచి ప్రస్తుతం వరకు వచ్చిన మార్పులు పాఠకులకు అవగతమవుతాయి. ఆ రచయిత్రి బల్ల సరస్వతి గారు. తన ఎనభై నాలుగేళ్ళ వయసులో కూడా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ‘కలెనేత’ పేరుతో తన జీవితకథను రాసారు. ఇది ఏడు తరాల చరిత్ర అని చెప్పవచ్చు. మరి ఆ విశేషాలు ఆమె మాటల లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే మేడం! బాగున్నారా?
జ. నమస్తే అమ్మ! బాగున్నాను. రండి .. కూర్చోండి.
ప్ర. మీ చిట్టి చిలకమ్మ గేయాన్ని నేను, మా పిల్లలు, తర్వాత తరాల పిల్లలు కూడా ఉత్సాహంగా పాడుకుంటారు. ఆ ఆసక్తితోనే మిమ్మల్ని మా భూమిక పాఠకులకు పరిచయం చేయాలని వచ్చాను. మీ గురించి తెలియజేయండి.
జ. సంతోషం, నేను లద్నూరు అనే గ్రామంలో 4/4/1941లో జన్మించాను.
ప్ర. స్వాతంత్య్రం రాకముందే అన్నమాట. అయితే చాలా విశేషాలు మా పాఠకులకు తెలుస్తాయన్నమాట.. చెప్పండి.
జ. అవును, మా వూరు అప్పట్లో నల్గొండ జిల్లాలో వుండేది. తరువాత వరంగల్ జిల్లా, ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో వుంది.
ప్ర. మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. తండ్రి పేరు పాశికంటి రాందాసు. అమ్మ పేరు లక్ష్మమ్మ గృహిణి. అమ్మ తల్లిగారు నల్గొండ జిల్లాలోని సీతారామపురం. నాన్న మొదట్లో తాపీమేస్త్రీ పని చేసేవాడు. 1925లో చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజి భవన నిర్మాణంలో పాల్గొన్నాడు. ఆయన పని నైపుణ్యాన్ని చూసి అప్పుడు వాళ్ళిచ్చిన సర్టిఫికేట్ వల్ల తర్వాత కాంట్రాక్టు పనులు చేసాడు. నాకు నలుగురు చెల్లెళ్ళు. ఐదుగురు తమ్ముళ్ళు. నేనే పెద్దదాన్ని.
ప్ర. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను మా ఊరిలోని ప్రభుత్వ బడిలో పాత ఏడో తరగతి పాసయ్యాను. అప్పట్లో ఏడో తరగతికి బోర్డు పరీక్షలుండేవి. తరువాత చాలా యేళ్ళకు జిల్లా ఫస్టు వచ్చానని తెలిసింది.
ప్ర. తరువాత పై చదువులు కొనసాగించారా?
జ. హైస్కూల్‌కు పోవాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి మరో వూరికి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఆడపిల్లను అలా పంపించి చదివించే పరిస్థితులు లేవు. అందుకే అక్కడితో నా చదువుకు ఫుల్ స్టాప్ పడిరది. ఇంటి వద్దనే వుండి ఇంటి పని, వంట పని నేర్చుకున్నాను. ఒక యేడాదికి అంటే 1958లో నా పెళ్ళి చేసారు.
ప్ర. మీ పెళ్ళి విషయాలు చెప్పండి.
జ. మా అత్తగారి ఊరు కట్కూరు. వరంగల్ జిల్లా. మామ నేతపని చేసేది. సొంతంగా రెండు మగ్గాలుండేవి. నా భర్త పేరు బల్ల సోమయ్య. ఆయన పదోతరగతి పాసయ్యాడు. ఇంటిల్లిపాది నేతపని చేస్తే కానీ యిల్లు గడిచేది కాదు. నేను కూడా కండెలు చుట్టడం, ఆసుపోయడం లాంటి నేత పనులు నేర్చుకొని చేసేదానిని.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు నలుగురు పిల్లలు. ఇద్దరమ్మాయిలు. ఇద్దరబ్బాయిలు. అందరూ స్థిరపడ్డారు. నేను ప్రస్తుతం మా పెద్దమ్మాయి పద్మజ ఇంట్లోనే ఉంటున్నాను. ఆమె ఏం. ఏ సోషియాలజీ చేసింది. తెలంగాణా వుమెన్స్ కమిషన్‌లో సెక్రటరీగా ఉద్యోగం చేస్తోంది. పెద్దబాబు శ్రీనివాసరావు ఇంజనీర్. ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్నాడు. రెండో అమ్మాయి పి.జి చేసి, కంప్యూటర్ కోర్సులు చేసి ప్రస్తుతం సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. చిన్న అబ్బాయి రవీంద్రనాథ్ అడ్వకేట్. రాజకీయ ఖైదీల హక్కుల సంఘంలో పని చేస్తున్నాడు.
ప్ర. మీరు ఉపాధ్యాయిని ఎలా అయ్యారు?
జ. నేను పదోతరగతి పాసై వుంటే ఏదైనా ఉద్యోగం వచ్చేదని, నన్ను చదివించనందుకు మా తల్లిదండ్రులు బాధపడేవారు. ఆ క్రమంలో ఏడో తరగతి పాసైన వాళ్ళకు కూడా సిద్ధిపేటలో టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిసి మా నాన్న మావారి చేత, నాచేత అప్లికేషన్ పెట్టించారు. ‘‘బతకలేక బడిపంతులు’’ అనేవారు ఆ రోజుల్లో.. అందుకని మా వారికి అది చేయడం ఇష్టం లేకుండే.. మా నాన్న ఆయనను ఒప్పించాడు.
ప్ర. ఓప్‌ా, అయితే మీరిద్దరూ కలిసి చదువుకున్నారన్న మాట. ఆ వివరాలు చెప్పండి.
జ. మేము ఎలిమెంటరీ బేసిక్ టీచర్ ట్రైనింగ్‌కు దరఖాస్తు పెట్టాము. మా యిద్దరికీ ఇంటర్య్వూకు రమ్మని లెటర్స్ వచ్చాయి. ఒకరోజు ముందే వెళ్ళి సిద్ధిపేటలో మా బంధువుల యింట్లో దిగాము. తెల్లవారి ఉదయమే ఇంటర్య్వూ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాము.
ప్ర. ఇంటర్య్వూలో ఏం అడిగారో చెప్పండి.
జ. ఇంటర్య్వు గవర్నమెంట్ బాలుర మల్టీపర్పస్ ఉన్నత పాఠశాలలో జరిగింది. నూలు చీర, కాళ్ళకు కడియాలు, మెడలో గుండ్లు, నల్లపూసలు, చెవులకు కమ్మలు, మాచేతికి కడెం పెట్టుకొని అమాయకంగా పల్లెటూరి పిల్లలాగా ఇంటర్వ్యూకు పోయాను. నీ పేరు పిలిచినప్పుడు లోపలికి పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని నన్ను అక్కడ విడిచిపెట్టి మా ఆయన ఎటో వెళ్ళిపోయిండు. అప్పటికే అక్కడ చాలా మంది అభ్యర్థులున్నారు. నేను బిక్కు, బిక్కుమని కూచున్న. మధ్యాహ్నాం పి. సరస్వతి అంటూ నా పేరు పిలిచారు. లోపలికి పోయి నమస్కారం చేసి వాళ్ళు అడిగిన పేరు, వూరు, చదువు వివరాలు చెప్పిన. పెళ్లైందా? అన్న ప్రశ్నకు అవును, మా ఆయన కూడా ఈ ఇంటర్య్వూకు వచ్చినాడు. మా యిద్దరిని సెలెక్ట్ చేసుకుంటేనే నేను ఇక్కడ చేరుతాను. లేకుంటే లేదు అని తెలియని మొండి ధైర్యంతో మాట్లాడిన. దానికి వై.వి.ఎన్ ఆచార్యుల సారు సరే! కానీ మీరిద్దరూ రెండు సంవత్సరాలు విడివిడిగా ఉండాలని చెప్పారు. దానికి నేను అలాగే ఉంటాం అని చెప్పిన. అయితే మీ ఆయన్ను తీసుకురా అన్నాడు. నేను బయటకు వచ్చి గంట తర్వాత ఆయనను లోపలికి పంపిన. నాకు ఆయన వెంటనే బయట కనిపించలేదు. అందుకే ఆలస్యమైంది.
ప్ర. ట్రైనింగ్ కాలేజీలో మీ యిద్దరికీ అడ్మిషన్ వచ్చిందా?
జ. నెలన్నర తర్వాత ఫలితాలు తెలిసాయి. నాకు అడ్మిషన్ వచ్చింది. మా ఆయనది వెయిటింగ్ లిస్ట్‌లో రెండో నెంబర్. తర్వాత ఆయనకు కూడా సీటు వచ్చింది.
ప్ర. కాలేజీలో చదివిన విశేషాలు చెప్పండి.
జ. అడ్మిషన్ అయితే వచ్చింది. కానీ 30 రూపాయలు డిపాజిట్ చేయమన్నారు. మా అమ్మ వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నవాళ్లే.. ఇద్దరికీ కలిపి 60 రూపాయలు. ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. నాకు 80 తులాల కాళ్ళ కడియాలుండేవి. అవి అమ్మితే 140 రూపాయలు వచ్చాయి. అప్పుడు వెండి ధర తులం 2 రూపాయలు. అందులో 60 రూపాయలు కాలేజీకి కట్టాము. మిగతా 80 రూపాయలలో 10 రూపాయలు ఖర్చులకు పోను, 70 రూపాయలలో మా అత్తగారు 40 రూపాయలు తీసుకొని 30 రూపాయలు మాకు ఇచ్చి పంపింది. సిద్ధిపేటలో ఒక రూం కిరాయికి తీసుకుని వున్నాం. మూడు నెలల తరువాత హాస్టల్ మొదలయ్యాక నేను హాస్టల్‌కు వెళ్లిపోయాను. మగపిల్లలకు మాత్రం మూడు నెలలే హాస్టల్ వసతి ఉండేది. నా సీనియర్ కొండ సుక్కుబాయి, బండసరోజన, నేను ఒక గదిలో ఉండేవాళ్ళం. రెండు సంవత్సరాల కోర్సు. ఆటలు, పాటలు, కథల ద్వారా బోధించడం నేర్పించారు. రెండో సంవత్సరంలో థియరీతో పాటు పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు బోధించే ప్రాక్టికల్ తరగతులు కూడా ఉండేవి. మొదటిసారి తరగతి గదిలో గుడ్ మార్నింగ్ టీచర్! అని పిల్లలు చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. అప్పుడే నిర్ణయించుకున్నాను పిల్లలు మెచ్చే టీచర్‌ను కావాలని. మొత్తానికి రెండేళ్ళ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాము.
ప్ర. మీ పరీక్షా ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? ఉద్యోగం ఎప్పుడు వచ్చింది?
జ. 1962 జూలైలో మా పరీక్షా ఫలితాలు వచ్చాయి. నిరక్షరాస్యతా నిర్మూలనలో భాగంగా అప్పట్లో ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముందుగా 1962 ఆగస్టులో మా ఆయనకు, సెప్టెంబర్ 17న నాకు ఉద్యోగం వచ్చింది.
ప్ర. మొదటి పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఆ వివరాలు చెప్పండి.
జ. వరంగల్ జిల్లాలోని నర్సంపేట తాలుకాలోని నెక్కొండ బ్లాక్‌లోని గురజాల గ్రామంలోని గుంటూరు పల్లిలో ఏకోపాధ్యాయినిగా నాకు పోస్టింగ్ యిచ్చారు. అప్పుడు నా వేతనం 65 రూపాయలు. ఇంక్రిమెంట్ రెండు రూపాయలు ఉండేది. ఇప్పటిలాగా డిఇఓ (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) ఆఫీసు కాకుండా బ్లాక్ డెవలప్‌మెంట్ పరిధిలోని పాఠశాలలు పనిచేసేవి.
ప్ర. అక్కడ ఎంతకాలం పనిచేసారు? ఆ వివరాలు చెప్పండి.
జ. అక్కడ మూడేళ్ళు పని చేసాను. అది చిన్న పల్లెటూరు. అక్కడి పిల్లలకు చదువులేదు. వాళ్ళ వూరికి టీచరమ్మ వచ్చిందని ఆ వూరి ప్రజలు చాలా సంతోషించారు. అది కొత్తగా ప్రారంభించిన పాఠశాల కాబట్టి అక్కడ ఎలాంటి వసతులూ లేవు. గ్రామ ప్రజలే వాళ్ళ స్వశక్తితో ఒక పాక లాంటిది వేసారు. రెండు గుంజలు పాతి దానిపైన ఈతాకులతో కప్పు వేసారు. చూట్టూ మూడు అడుగుల గోడ కట్టారు. ఒక పక్కగా నల్లబల్ల ఏర్పాటు చేసారు. పైకప్పు గోడ మధ్యలో నుంచి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేది. చుట్టూ వున్న పచ్చని చెట్లతో, రక రకాల పక్షులతో ప్రకృతి కనువిందు చేసేది. పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా వుండేవి.
మాకు కూడా ఉండడానికి ఒక చిన్న గుడిసె వేసి యిచ్చారు. వూరి ప్రజల సహకారం పాఠశాల నడపడంలో చాలా వుండేది. క్రమం తప్పకుండా వాళ్ళ పిల్లలను బడికి పంపేవారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 దాకా బడి వేళలు. కానీ ఐదారు గంటలదాకా నేను, పిల్లలూ బడిలోనే వుండే వాళ్ళం. సుమారు 40,50 మంది పిల్లలు వుండేవాళ్ళు. వాళ్లందరినీ గోడ వారగా కూర్చోబెట్టి కొంచెం సేపు అక్షరాలు, అంకెలు దిద్దించేదాన్ని. ఎంతసేపూ అదే పని చేయాలంటే పిల్లలకు బోరు కొడుతుంది కదా.. అందుకని వాళ్ళకు కథలు చెపుతూ ఆడటలాడిస్తూ వాళ్ళకు తెలియకుండానే చదువు చెప్పేదాన్ని. పిల్లలు ఇళ్ళలో కంటే బడిలోనే ఎక్కువ సమయం గడపడానికి యిష్ట పడేవారు.
ప్ర. మీరు రాసిన చిట్టిచిలకమ్మ! బాలగేయం చాలా ప్రసిద్ధి పొందింది కదా.. దాని నేపథ్యం చెప్పండి.
జ. అవునండీ! ఆ బాలగేయం అంత ప్రసిద్ధి పొందుతుందని నేను అసలు ఊహించలేదు. కొత్తగా పెట్టిన పాఠశాల కావడం వల్ల అప్పట్లో మాకు ప్రత్యేకమైన పాఠ్యపుస్తకాలు వుండేవి కాదు. పిల్లలకు బేసిక్స్ నేర్పించాలి. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, పరిసరాల పరిశీలన, 100 అంకెలు ఇవి బేసిక్స్ అన్నమాట. చిన్న పిల్లలు అక్షరాలు, అంకెలు దిద్దడానికి ఎక్కవసేపు యిష్టపడరు. అందుకని ఉత్సాహంగా ఉండే ఉదయం వేళలు ఆ పనికి కేటాయించి మిగతా సమయమంతా వినడం, మాట్లాడడం, పరిసరాల పరిశీలనకు కేటాయించేదాన్ని. అదివరకే నేను నేర్చుకున్న బాలగేయాలు చెపితే.. అవి కఠినంగా వుండడం వల్ల ఆ పిల్లలకు కంఠతా వచ్చేవి కాదు. నాకు చాలా బాధగా వుండేది. వాళ్ళకు ఎలాంటి పాటలు నేర్పించాలా? తెగ ఆలోచించేదాన్ని.
ఒకరోజు బయట జామ చెట్టు మీద రామచిలుక వచ్చి వాలింది. దాని రంగును, ముక్కును పిల్లలు పరిశీలిస్తున్నారు. అప్పుడు నోట్లో నుంచి అసంకల్పితంగా చిట్టిచిలకమ్మ! గేయం వచ్చింది. అది విని పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అంతేకాదు దానిని నేర్చుకొని వాళ్ళ యింట్లో వాళ్ళకు వినిపించారు. అప్పుడు వాళ్ళ పరిసరాలలోని పాటలైతే వాళ్ళు యిష్టంగా తేలికగా నేర్చుకుంటారని అర్థమైంది. అలా ఆ గేయం పిల్లల ద్వారా మౌఖికంగా ప్రచారమైంది. ఖండాంతరాలకు వెళ్ళింది. ఈనాటికీ దానిని తమ పిల్లలకు నేర్పిస్తున్నారు. తెలుగు భాష ఉన్నంత వరకూ నా చిట్టిచిలకమ్మ పిల్లల గుండెల్లో గూడు కట్టుకొని ప్రపంచమంతా ఎగురుతూనే వుంటుంది చిరంజీవిగా.. ఇతర పాటలు కూడా రాసాను.
ప్ర. మీ ఇతర పాటల గురించి కూడా చెప్పండి.
జ. ఒకటి ఒకటి ఒకటీ మానవులంతా ఒకటే అంటూ ఒకటి నుంచి పది వరకు అంకెలు నేర్పించే పాట, ఇది మన దేశం ఉత్తరాన హిమాలయాలు అంటూ భౌగోళికంగా కీలకమైన విషయాలు తెలిపే పాట, చిట్టి చిట్టి మిరియాలు లాంటి అది వరకే వున్న పాటలను మా పిల్లలకు వీలుగా పొడిగించి రాసాను. అమ్మ గొప్పతనం, కుటుంబ విలువలు, మానవ విలువలను చిన్నారి మొదళ్ళలోకి ఎక్కించడానికి ఎన్నో పాటలు రాశాను. కానీ అవి చిట్టిచిలకమ్మ అయినంత పాపులర్ కాలేదు.
ప్ర. ఇంకా మీరు ఎక్కడెక్కడ పని చేసారు?
జ. మూడేళ్ళ తరువాత చేర్యాల బ్లాక్ కేశిరెడ్డి పల్లెకు బదిలీ అయింది. అక్కడ తొమ్మిది నెలలు పని చేశాను. లద్నూర్ జి. పి.ఎస్ స్కూల్లో వున్నప్పుడు బడిలో 50 పిల్లలే వుండేది. అప్పుడే 1975 ప్రాంతంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు మొదలయ్యాయి. పాఠశాలలో పేరుంటేనే హాస్టల్లో అడ్మిషన్ యిచ్చేవాళ్ళు. అందువల్ల మా బడిలో 150 మంది విద్యార్థులయ్యారు. టీచర్లము ఇద్దరే ఉండే వాళ్ళం. విద్యా కమిటీ పెద్దల ద్వారా రెండు నెలల తర్వాత మరో ఇద్దరు టీచర్లను ఇచ్చారు. అప్పుడే పాఠ్యపుస్తకాలు, ఉప్మా, పాలు ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత కట్కూరుకు బదిలీ అయింది. అది మా అత్తగారి ఊరే .. అక్కడనే పాప, బాబు పుట్టారు.
ప్ర. మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ. ఇంతకు ముందే చెప్పాను కదా.. కాలేజీ ఫీజు కట్టడానికి నా కాళ్ళ కడియాలు అమ్మేసాను. మాది ఉమ్మడి చేనేత కుటుంబం, కావడం వల్ల మా జీతాల పైనే అన్నీ నడవాలి. అప్పట్లో టీచర్ల వేతనాలు కూడా చాలా తక్కువ. అందువల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
ప్ర. మీ ఉన్నత విద్యాభ్యాసం ఎలా జరిగిందో చెప్పండి.
జ. నాకు చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. నేను కట్కూరుకు బదిలీ అయ్యాక, పాప, బాబు పుట్టిన తర్వాత 1967లో హెచ్.ఎస్.సి పాసయ్యాను. ఉమ్మడి కుటుంబం ఇంటి పని, ఉద్యోగం, చిన్న పిల్లలు వీటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరూ నిద్రపోయాక అర్థరాత్రి లేచి చిన్న కిరసనాయిలు దీపం ముందు కూర్చొని చదువుకునేదాన్ని. ట్యూషన్ వెళ్ళడానికి కుటుంబ, ఆర్థికపరిస్థితులు ఆమోదించలేదు. ఆ తర్వాత వెంటనే 1968లో పి.యు.సి పాసయ్యాను. అదే ఆఖరు బ్యాచి. ఆలస్యం చేస్తే రెండేళ్ళు చదవాలి. అందుకని కష్టమైనా వెంటనే రాశాను. 1970లో బి. ఏ పాసయ్యాను. చాలా గ్యాప్ తర్వాత 1984 బి.ఎడ్ చేసాను.
ప్ర. మీ పదవీ విరమణ ఎప్పుడు జరిగింది?
జ. 1999 ఏప్రిల్ 30 తేదీన నేను సి.పి.ఎస్ ప్రధానోపాధ్యాయినిగా కట్కూరు పాఠశాల నుంచి పదవీ విరమణ పొందాను. అప్పటికి నా సర్వీసు 37 సంవత్సరాలు.
ప్ర. పదవీ విరమణ తర్వాత ఏం చేసారు?
జ. ఒకటి రెండేళ్ళు చదువురాని మహిళలకు చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత 2001లో మా ఆయన మరణం తర్వాత నేను హైదరాబాదుకు వచ్చేసాను. ఆ బాధలో నుంచి బయటపడడానికి రచనా వ్యాసంగం మొదలు పెట్టాను. గేయాలు, బాల గేయాలు రాసాను. సుమారు ఎనిమిదేళ్ళు నా ఆత్మకథ రాసి, ‘కలెనేత’ పేరుతో 2022లో ప్రచురించాను. అది ఏడు తరాల చరిత్ర. దానిని మనకు తెలియని మహిళల ఆత్మకథ అని అల్లం రాజయ్య పేర్కొన్నాడు.
ప్ర. మీరు పనిచేసిన కాలానికి ఇప్పటికీ పాఠశాల పర్యవేక్షణలో వున్న తేడా లేమిటి?
జ. అప్పట్లో పాఠశాల పర్యవేక్షణకు వచ్చే విద్యాధికారిని ‘నాజిర్ సాబ్’ అని పిలిచే వాళ్ళు. వచ్చిన వాళ్ళు విద్యార్థులను అనేక రకాల ప్రశ్నలు అడిగేవారు. విద్యార్థులు కూడా పర్యవేక్షకుడు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పే వాళ్లు. కానీ ఈ రోజుల్లో పాఠశాల పర్యవేక్షణ చాలా వరకు తగ్గిపోయింది. తప్పనిసరై చేయాల్సి వచ్చినప్పుడు టీచర్లలోని దోషాలు వెతికే విధంగా ఉంటున్నది. విద్యార్థుల బాధ్యత ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ రోజుల్లో స్నేహపూరిత వాతావరణంలో పర్యవేక్షణ చేస్తే ఈ రోజుల్లో అధికారిక హోదాలో దోషాలు వెతకడమే పనిగా వుంటున్నది.
ప్ర. విద్యావిధానంలో అప్పటికీ ఇప్పటికీ మీరు గమనించిన మార్పులేమిటి?
జ. పలకా బలపం పోయి పెన్సిల్, పెన్ను కాగితం వచ్చాయి. అవి పోయి డిజిటల్ యుగం అవుతోంది. అప్పట్లో టీచర్ చెప్పిందే జ్ఞానం. ఈనాడు ఏది కావాలన్నా గూగులమ్మను ఆశ్రయిస్తున్నారు. దీనికి సాంకేతికాభివృద్ధి ప్రధాన కారణం కావొచ్చు. టీచర్ పట్ల గౌరవం, ప్రేమ తగ్గి పోయింది. కానీ గురు ముఖతః నేర్చుకున్న విలువలు ఉన్నతంగా జీవించడానికి దోహదం చేస్తాయి.
ప్ర. చివరగా నేటి విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. నేటి విద్యార్థులకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవాంతరాలు కూడా వున్నాయి. వాటిని సక్రమంగా ఎదుర్కొని జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలి. పెద్దల పట్ల గౌరవం, ఉన్నతమైన విలువలతో ముందుకు సాగాలి.
