ఒంటరితనం మనుషులను చంపెయ్యగలదని యిప్పటికే అనుభవంలోకి వచ్చింది సుమిత్రకు. అది బ్రతకడానికి కావలసిన ఆశల చమురును హరిస్తుందని, నెల్లాళ్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పద్దెనిమిదేళ్ల సుమిత్రకు తెలిసి వస్తుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని దినపత్రికలలో చదివినప్పుడు, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చెయ్యగలిగిన వాళ్ళు బ్రతకడానికెందుకు ధైర్యం చెయ్యలేక పోతారు? ఏది చెయ్యాలన్నా ముందు ప్రాణాలతో వుండాలి కదా! అని అనుకునేది.
ఇప్పుడు తెలుస్తుంది ఆత్మహత్యలెందుకు చేసుకుంటారో! అలాగని ఆత్మహత్యతో సమస్యలు పరిష్కారమవుతాయా? సమస్య వచ్చిన ప్రతివారూ ఆత్మహత్య చేసుకుంటే ఎంతమంది మిగిలుంటారు? ఆలోచనలలో కూరుకు పోయింది సుమిత్ర.
ఇంకొక్క రెండేళ్లలో ఆశయాల మెట్లెక్కి అనుకున్నది సాధించగలనని, నెల క్రిందటి వరకు భవిష్యత్తులోకి ఆశగా ఎదురుచూసిన సుమిత్రకు నేడది ఎండమావిగా మిగిలి పోయింది. నాన్నమ్మ బతికున్నప్పటికీ, యిప్పటికి ఎంత తేడా? ఒక్క నెలలో యెన్ని మార్పులు? రేపన్నది గుర్తుకొస్తేనే మనసు భయంతో వణికిపోతుంది. కాని, పడిపోయినా లేచి నిలబడాలనే, నాన్నమ్మ మాటలు, అమ్మానాన్నలు చనిపోయాక తనకోసం నాన్నమ్మ ఎన్ని కష్టాలు పడిరదో గుర్తుతెచ్చుకుంటుంటే… ధైర్యం చిక్కబడుతుంది. ఎలాగైనా ఇక్కడి నుండి బయట పడాలనే ఆలోచన తీవ్రమవుతుంది. అది ఏ రకంగా అనేదే, అంతు పట్టడం లేదు. నెల రోజులుగా జరిగిన సంఘటనలు ఒకటొకటిగా కనుల ముందు కనిపిస్తున్నాయి.
డిగ్రీ మొదటి సంవత్సరం ఆఖరి పరీక్ష రాసి ఆనందంగా బయటికొస్తుంటే తన వూరివాడు, వరుసకు బావైన రాజు మనూరెళ్దాం బండెక్కంటే, ఇప్పుడంత అర్జెంటేమిటి? ఏమైవుంటుందబ్బా! ఎవరికైనా బాలేదా! చిన్నప్పుడే తల్లితండ్రి పోతే నాన్నమ్మే పెంచింది తనను. అరవయ్యేళ్ళు దగ్గరపడినా, నలబయ్యేళ్ల దానిలా చలాకీగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నాన్నమ్మతో మాట్లాడిరది కూడా. మరింకెవరికి బాలేదు?
కొంపదీసి మామయ్య… వయసు చిన్నదే కాని, తాగుబోతు… మామయ్యకేమైనా అయిందా! మామయ్య యింటిని దాటి తనింటి వైపు బండి దూసుకుపోతుంటే అప్పుడు భయమేసింది నాన్నమ్మకేమైనా అయిందానని! నాన్నమ్మే తన జీవితం, తన ధైర్యం. ఎవరూ లేకపోయినా, తనకే కష్టం రాకుండా పెంచింది. నాన్న వైద్యానికి ఆస్తంతా కరిగిపోయినా, మిగిలిన పాతిక సెంట్ల భూమిలో కాయగూరలు పండిస్తూ ఆమెకొస్తున్న వృద్ధాప్య పెన్షనుతో తనను చదివిస్తూ, ఇంకెన్నాళ్ళు… రెండేళ్లు కళ్ళు మూసుకుంటే మన కష్టాలు గట్టెక్కిపోతాయని తనకు ధైర్యాన్ని నూరిపోస్తున్న నాన్నమ్మకేమైనా అయిందనుకుంటేనే మనసంగీకరించడం లేదు. కానీ తన మనసుతో సంబంధం లేకుండా తమ యింటి ముందు, చలనం లేని నాన్నమ్మ దేహం… రాత్రి అత్తతో కూడా మాట్లాడిరదట. ఉదయాన్నే అత్త పొలంకెల్తూ, నాన్నమ్మ కనిపించలేదని యింట్లోకి తొంగిచూస్తే… మంచం మీద నాన్నమ్మ అచేతనంగా.
తన రాకకోసం ఎదురుచూస్తూ వూరంతా… ప్రాణం లేని కట్టెను తొందరగా పంచభూతాలకు అర్పించడానికి… అందరూ తన వంక జాలిగా చూస్తే నాన్నమ్మ లేక ఒంటరినైపోయానని జాలి పడుతున్నారనుకుంది. కాని ప్రెసిడెంట్ భూమికి ఆనుకొని ఉన్న తమ పాతిక సెంట్ల స్థలం కలిపి అక్కడ ఒక పెద్ద రిసార్ట్ కట్టించడానికి, ఆ స్థలమమ్మమని నాన్నమ్మనడిగితే, ఒప్పుకోని నాన్నమ్మ నాలుగు రోజుల్లో ఈ భూమ్మీదే లేకుండాపోతే, వయసులో వున్న తన పరిస్థితి రేపెలా వుంటుందోనని భయపడుతున్నారని తనకప్పుడు తెలియదు.
మరెప్పుడు తెలిసింది?
‘‘ఒంటరి ఆడపిల్ల యేటి సెయ్యగలదు? సినకర్మ, పెదకర్మ రెండూ కలిపి మూడు రోజులకే ముగిద్దామని, వున్న నలుగురు చుట్టాలూ కూడబలుక్కొని ఆ కార్యక్రమం ముగించినప్పుడు, అప్పుడొచ్చాడు పంచాయతీ ప్రెసిడెంటు.
‘‘నలుగురూ వున్నప్పుడే ఓ మాటనుకుంటే సరిపోతుంది. మగసాయం లేకపోయినా రాములమ్మ యెలాగో నెగ్గుకొచ్చింది. ఆవిడే లేక పోయాక, ఒంటరి ఆడపిల్ల… ఎవరి తోడూ లేకుండా పొలాల మధ్యనున్న యీ యింట్లో యెలా ఉండగలదు? రేపేదైనా ఐతే ఒకదానికొకటి. నేను చెప్పొచ్చేదేటంటే, ఈ మడిసెక్క నాకమ్మేస్తే, ఉద్యోగమొచ్చిన వరకు ఆ పిల్ల బాగోగులు, ఆ తర్వాత పెళ్లికూడా నే జూసుకుంటాను. యేటంటారు?’’ అందరివంకా చూసి అన్నాడు. ఎవ్వరూ మాట్లాడకపోయేసరికి ‘‘ఆలోసించుకొని సెప్పండి’’ అని లేచెల్లిపోబోతుంటే ఈ ‘‘మడిసెక్క అమ్మడం రాములమ్మత్తకి సుతరామూ యిట్టం నేదు. ఆ విషయం అందరికీ తెలుసు. దాని బాగోగులేవో మేం సూసుకుంటాంలే బావూ! దాన్నిడిసి పెట్టండి’’ అని అత్తంటే, ‘‘నాదేముంది. మంచిదనిపించింది సెప్పాను. ఆపై మీ యిట్టమని’’ భుజాన తువ్వాలు దులిపేసి లేచెల్లిపోయాడు.
ప్రెసిడెంటు వెళ్లిపోయాక చెవులు కోరుక్కోవడాలు… తాను దగ్గరకెళ్లగానే పనున్నట్టు ఏదో చేస్తూ… మనసులో అనుమానం… ‘‘నా కంఠంలో ప్రాణముండగా ఈ భూమినమ్మను. నీకుద్యోగమయ్యాక ఇక్కడే సిన్న యిల్లు కట్టుకుందాం’’ తనతో నాన్నమ్మన్న ఆఖరి మాటలు. నాన్నమ్మ చావుకి అవేవైనా కారణమా? ఆ రాత్రి అత్తనడిగింది ఏమైందో చెప్పమని? ఏమీ లేదు. ఒంటరిగా మాత్రముండకు. నీకు నేనున్నానని మాత్రమే చెప్పింది. ఆ మాటతో అర్థమయింది, అత్త తన గురించి భయపడుతుందని. అత్తున్న రెండు వారాలూ బాగానే గడిచాయి.
అత్తా వాళ్ళమ్మకి ప్రాణాల మీదికొచ్చిందని కబురొస్తే అత్త వూరెళ్ళాక మొదలైంది… పొలమమ్మమని, తాగుబోతు మామయ్యతో తనకి చెప్పించడం… ‘‘మీ అత్తలాగే అంటాదిగాని, ఆళ్ళతో మనం సాలగలమా! ఆ మడిసెక్కమ్మేస్తే పెసిడెంటే సదివిస్తానంటన్నాడు కదా! సుబ్రంగా సదూకో! ఏటంటావమ్మి? వొప్పేసుకో!’’ అని, తాగొచ్చి మామయ్య రోజూ సతాయించడం. తానొప్పుకోకపోయేసరికి మొదలైంది అసలు కథ… అత్తలేని వారం రోజుల్లో ఊహించని సంఘటనలెన్నో కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. ‘‘నాన్నమ్మ చేసిన అప్పు తీర్చమంటే, తీర్చకపోగా చేతబడి చేసి, వాళ్ల దూడని చంపేశానని, న్యాయం చేసి బాకీ తిరిగి ఇప్పించాలని ‘‘ప్రెసిడెంటు పాలేరు పంచాయితీలో కంప్లైంటిచ్చాడు. ‘‘సాల్లే వూరుకోరా! అవేం మాటలు. అసలే ఆళ్ళ నాన్నమ్మ సచ్చిపోయి, బాధల్లో వుంది. అప్పు నెమ్మదిగా తీరుస్తాదిలే’’ వూరందరి ముందు ప్రెసిడెంటు పాలేరు మాటలను కొట్టిపడేసాడు. ఆ అప్పేమిటో తనకింత వరకు తెలియనే తెలియదు.
ఆ తర్వాత తనింటి చుట్టూ పూజలు చేసిన ఆనవాళ్లున్నాయని ఒకరు, అర్ధరాత్రి తాను పూజ చేస్తుండగా చూశానని యింకొకరు… అర్ధరాత్రి కోడిని బలిస్తుండగా చూశానని ఒకరు… వాళ్ల గడ్డికుప్ప కాలి పోయిందని మరొకరు… గొడ్లసాల కాలిపోయిందని ఒకరు… ఒకరి తర్వాత ఒకరు… వాటన్నింటికీ కారణం తానేనని… తాను చేతబడి చేస్తుందని… ఊర్లో యింకెన్ని అనర్ధాలు జరుగుతాయో తననుండని… ఇవన్నీ ప్రెసిడెంటే చేయిస్తున్నాడని అందరికీ తెలిసినా, బయటకు చెప్పే ధైర్యం లేదెవరికీ. ధైర్యం ఉన్న అత్త ఊర్లో లేదు. వాళ్ళనుకున్నది జరగకపోయేసరికి మనుషులెంత దూరం వెళ్తారో యిప్పుడర్థమౌతుంది. ‘‘నువ్వు వూ అంటే, వెళ్లి మీ అత్తమామలతో మాట్లాడతాను. ఈ వేసవిలో పెళ్లి చేసుకుందామని ప్రెసిడెంట్ దగ్గర అన్ని పనులు చేసే సోమేష్ అంటే తాను కాదందని ఏ తాగుబోతో విసిరేసిన సిగరెట్టు పీకతో తగలబడిపోతున్న అతని గొడ్లసాలను చేతబడి చేసి నేనే తగలబెట్టానని చెప్పాడు వూరందరితో. దాదాపుగా కుదిరిపోతుందనుకున్న కూతురి పెళ్ళి, పెళ్ళికొడుకు తనను చూసాక, ఆ సంబంధం కాదన్నాడని, చిన్నప్పటినుండీ ‘‘అమ్మీ! బాగా సదువుకుంటావే!’’ అన్న మాలక్ష్మి ‘‘నాకప్పటి నుండీ అనుమానంగా ఉంది. యిదొచ్చాక ఊరికేదో అరిష్టం పట్టిందనేసింది’’.
‘‘యివన్నీ వద్దమ్మీ అని సెప్పినా యిన్లేదు’’ ప్రెసిడెంట్ పోసిన మందుతో తాగున్న మామయ్య మాటలు… ‘‘పాలేరంటే అప్పు తీర్చలేదని కోపంతో సెప్పాడనుకున్నాను. మరిప్పుడు సొంత మేనమామే సెప్తే నమ్మకతప్పడం లేదు’’ అని ప్రెసిడెంటు నోటమ్మట మాట వచ్చిందో లేదో, ప్రెసిడెంట్ ప్లాన్ ప్రకారం జనం తనమీద దాడికి దిగారు… అడ్డుకోబోయిన వాళ్లమీద కూడా…
‘‘ఇంకెప్పుడూ యిలా సెయ్యకుండా వుండాలంటే పళ్ళు పీకెయ్యండి రా’’ అన్నాడెవడో… రాయితో తన దవడ మీద కొట్టాడొకడు… స్పృహ కోల్పోయిన విషయం కూడా తనకి తెలియదు. తెలిసేసరికి ఆసుపత్రిలో, ముందు రెండుపళ్ళు రాలిపోయి, ముఖమంతా వాచిపోయి, మాట్లాడడానికే నోరు కదపలేక… ఎవరు కంప్లైంట్ యిచ్చారో, పోలీసులు వాలిపోయారూర్లో. వూర్లో ఉంటే తనకి రక్షణ లేదని ముందు ఆసుపత్రికి, ఆ తర్వాత పోలీస్ స్టేషను తరలించారట. తర్వాత తెలిసాయి ఈ విషయాలు. అత్త వాళ్లూరి నుండి వచ్చేటప్పటికే జరిగిపోయిందంతా. తన మీద దాడి చేసిన యెవరికీ నిజానికి తనమీద కోపం లేదు. కాని యెవరో ఒకరు యెప్పుడో జరిగిన సంఘటనకు చిలవలు పలవలు చేర్చి చెప్తుంటే, మిగిలినవాళ్ళు, ‘‘అవునవును. నిజమే! నేనూ అలాగే అనుకుంటున్నానంటూ’’ మిగిలిన వాళ్లతో కలిపి మంటను ఎగదోసారు. అదొక మాబ్ సైకాలజీ. విషయం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషనుకు మరో నలుగురిని వెంటేసుకొని వచ్చిన అత్తను పోలీస్ విధి నిర్వహణకు అడ్డు తగులుతుందని అరెస్టు చేసి లోపలేస్తే, అత్తనేమీ చెయ్యొద్దని తానే బ్రతిమిలాడుకోవలసి వచ్చింది ఎస్సైని. ఆ రోజు రాత్రి వూరి ప్రెసిడెంటు, ఎస్సై, మరో యిద్దరు తనున్న సెల్లు ఎదురుగా మందు తాగుతూ పగలబడి నవ్వుకుంటూ… మధ్యలో ఎస్‌ఐ తన గదిలోకి వచ్చి ‘‘ఎందుకిదంతా! యిప్పటికైనా తెలిసింది కదా! పెద్దవాళ్ళనుకుంటే ఏమైనా చెయ్యగలరని. ఆ దస్తావేజుల మీద సంతకం పెట్టి బ్రతికి పో!’’ అని చెప్పి వెళ్తూ తనని దీర్ఘంగా చూసి, ‘‘సెల్లులో చున్నీలు ఉండకూడదని తెలియదా! రేపేదైనా అయితే ఒకదానికొకటి’’ కానిస్టేబుల్ మీద అరిచాడు. ‘‘చున్నీ తీస్తే నా గెస్టవుసులోనే తియ్యాలి, యిక్కడ కాదంటూ’’ లేచాడు ప్రెసిడెంటు. ‘‘ప్రెసిడెంటుగారూ! ఏదైనా చేసే ముందు నా ఉద్యోగం సంగతి గుర్తుపెట్టుకోండంటూ’’ అదేదో జోకులా పగలబడి నవ్వాడు ఎస్సై. ‘‘సె..సె.. అలాటి పని ఇక్కడెందుకు సేత్తాను? నా గెస్టవుసు వుంటుండగా’’ అనంటూ, తనున్న సెల్లులో వాడి కోసం వేసిన కుర్చీలో కూర్చుంటూ ‘‘తెలిసింది కదా! తలుసుకుంటే నేనేటి సెయ్యగలనో! నీ పొలంలోనే యింకో గెస్టవుసు కట్టిత్తాను. నీకోసం మాత్రమే. ఆ తర్వాత నీకు నచ్చిన వాడిని జూసి పెళ్లి సేసేత్తాను. నా కోరికా తీరుతాది. నీ బవిస్సెత్తూ బాగుంటాది. ఆలోసించుకో’’ బెదిరించి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా యిటువంటి విషయాలు విన్నప్పుడు, యిటువంటివెలా జరుగుతాయి? చట్టాలు, పోలీసులు, న్యాయవ్యవస్థలు ఏమీ చెయ్యవా అని యెంతో ఆశ్చర్యపోయేది. ఇప్పుడనుభవ పూర్వకంగా తెలిసి వస్తుంది. డబ్బు ముందు ఏ వ్యవస్థా పనికి రాదని, అన్ని వ్యవస్థలూ డబ్బున్న వాళ్లకే కాపలా కాస్తాయని, వాళ్లు చెప్పినట్టే వింటాయని. యిప్పుడెటు చూసినా అగమ్యగోచరమే. నెల రోజుల్లో జీవితానికి సరిపడా అనుభవాలు. స్థలమమ్మనని మొండికేసిందని నాన్నమ్మను నిద్రలోనే లేపేసారు. మామయ్యకు మందుపోసి వాళ్లకనుకూలంగా మాట్లాడిస్తున్నారు. ప్రొటెక్షన్ పేరుతో తనను జైల్లో పెట్టారు. రేపు అత్తనేమి చేస్తారో? వాడు చెప్పినట్టు చేసుంటే యివన్నీ జరిగేవి కావేమో! కానీ ఆ ఆలోచనే జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోలేదని, తనను నఖశిఖ పర్యంతం చూసి, ‘‘ముందుపళ్ళు రెండూ రాలిపోయినా, బానే వున్నావు. నువ్వు వూ అంటే మరునిమిషంలో దర్జాగా బయటకొచ్చేత్తావు. నువ్వు వూ అనకపోయినా గెస్టవుసుకే రాక తప్పదు. వేరే మార్గం లేదు. ఆలోసించుకో.’’ అదోలా చూస్తూ వాడి మాటలు. వాడినలా చూస్తుంటే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. మనసులో ఆ పని కొన్ని వందల, వేలసార్లు చేసింది. అసహాయతతో ‘‘థూ’’ అని ఉమ్మేసింది. నా పరిస్థితి వాడి విజయంలా గర్వంగా వాడు.
‘‘వాడిని గర్వపడనీయను. వాడిముందు నేనోడిపోను … నేనోడిపోను’’ బిగ్గరగా పగలబడి నవ్వుతూ అంతలోనే దుఃఖం ముంచుకురాగా వెక్కి వెక్కి ఏడ్చింది సుమిత్ర. సెల్లును కాపలా కాసే సెంట్రీలకిది మామూలే. అన్యాయంగా కేసులో యిరికించబడ్డ ఎవరైనా మతి చెలించి పగలబడి నవ్వడాలు, ఏడవడాలు చేస్తూనే ఉంటారు. అవన్నీ చూసీ, చూసీ వాళ్ల మనసూ రాతిలా మారిపోయింది. నిర్వేదంగా చూసి పక్కకెళ్ళిపోయాడు సెంట్రీ. ఆ రాత్రంతా ఆ గది నుండి నేనోడిపోను… నేనోడిపోనన్న మాటలు బిగ్గరగాను… మధ్య మధ్యలో గొణుక్కుంటున్నట్టు… అప్పుడప్పుడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు… అటూ యిటూ తిరుగుతున్నప్పుడు వింటూనే వున్నాడు సెంట్రీ. అర్ధరాత్రి దాటాక మాటలేవీ వినిపించకపోయేసరికి అలసిపోయి పడుకుందనుకుని, తానూ ఓ కునుకు తీశాడు.
… … …
‘‘ఏమి చేస్తుందిరా ఆ పిల్ల? దానికేదైనా ఐతే, ఇటు ఎస్సై, అటు ఆ ప్రెసిడెంట్… యిద్దరూ మన తోలు తీస్తారు. యిరవై నాలుగ్గంటలూ కాపలా కాయమంటే, పడుకొని నిద్రపోతున్నావా?… నా కొడకా!’’ అని హెడ్డు కాలితో తంతే తుళ్ళిపడి లేచి, గది దగ్గరికెళ్లి చూస్తే యింకేముంది? ఒంటిమీద వుండాల్సిన చున్ని, కిటికీకి వేలాడుతుంది. నేనోడిపోనంటే దానర్థమిదా!
ఆ పిల్లని అరెస్టు చేసినట్టు రికార్డుల్లో ఎక్కడా చూపించలేదు. స్పెషల్ కేసు కాబట్టి, ఖైదీలనుంచిన సెల్లులో కాకుండా, వాడుకలో లేని, కిటికీ ఊచలు కూడా సరిగ్గా లేనొక గదిలో… ఆడపిల్లే కదా, ఏమి చెయ్యదులేనన్న ధీమాతో… పెట్టారు. ప్రెసిడెంట్ ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపిస్తున్నాడని ఆ పిల్లని హాస్పిటల్ నుండి తెచ్చినప్పుడు పూర్తిగా తనిఖీ కూడా చెయ్యలేదు. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉండి ఉంటే, కొంపలంటుకుపోతాయి. అసలే రోజులు బాగా లేవు. ఇప్పుడందరూ తెలివి మీరిపోయారు. ఆ అమ్మాయి ప్రెస్ వాళ్ళ దగ్గరకెళ్ళితే… అసలే వాళ్లకి సెన్సేషనల్ న్యూస్ కావాలి. ఈ పిల్లకెన్ని రహస్యాలు తెలుసో… ఆ ఆలోచన రాగానే, జరగబోయేది తలచుకొని, పై ప్రాణాలు పైనే పోతున్నాయి సెంట్రీకి, జరగబోయేది తలచుకొని.
