ఈ లోకంలో రావు బాలసరస్వతీ దేవి అనే పేరుతో సంచరించిన మధుర స్వరం నేడు మూగబోయింది. చూడచక్కని రూపం, సౌకుమార్యం, మాధుర్యం సమపాళ్లలో మేళవించి చెవికి సుఖంగా తోచే మంద్ర శ్రుతి గాత్రం ఆమె సొంతం.
చిన్ననాటి నుండీ రేడియోలో ‘‘నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్ పిల్లన గ్రోవూదుమోయ్ నా యుల్లము రంజిల్లగా’’ అనీ, ‘‘గోపాలకృష్ణుడూ నల్లనా, గోకులములో పాలు తెల్లనా’’ అనీ, ఒకే ఒక్కసారి యెగాదిగా చూసి లెక్కలేని ఊహలలో చిక్కుకుంది ప్రేయసీ’’ అనీ, నన్ను వెంటాడిన గొంతు ఆమెది.
మా ముందు తరం వారికి ఆమె సోలోగా పాడినవీ, ఆమే, రాజేశ్వరరావూ కలిసి పాడిన యుగళ గీతాలూ, పాత సినిమాలలో ఆమె పాడిన పాటలూ బాగా తెలిసే అవకాశం వుంది. అప్పట్లో గ్రాంఫోన్ రికార్డులు బాగా ప్రాచుర్యంలో వుండేవి కదా. అసలు కొంతమంది పాతతరం వారు బాలసరస్వతీ, రాజేశ్వరరావు పాటల పిచ్చి వాళ్లుండేవారు . వీళ్లిద్దరి పేర్లూ వినంగానే పారవశ్యంలో పడిపోయే వారు. అలాంటి కొంతమందిని నేను ప్రత్యక్షంగా చూశాను. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో పని చేసిన ఆరెగపూడి ప్రేమ్‌చంద్‌గారు ఒకసారి మాటల సందర్భంలో బాలసరస్వతీ-రాజేశ్వరరావూ పాడిన యుగళగీతాలు కావాలమ్మా అంటే,నేను ఆ పాటలు రికార్డు చేసి కాసెట్ పంపాను. ఆయన ఎంత సంతోషించారో మీ రుణం తీర్చుకోలేనమ్మా అన్నారు అంత పెద్దాయనా. నండూరి రామ్మోహన్రావుగారూ, కె.వాసుదేవరావు గారూ కూడా ఆమెని తీవ్రంగా అభిమానించే వారని విన్నాను.
మాకు ఊహ తెలిసే సరికి ఆవిడ సినిమాల్లోనూ, బయటా పాడటం అరుదయిపోయింది. ఆమె సినిమాలలో పాడిన పాటలూ, వాటి మాధుర్యమూ మా తరం వారు తెలుసుకోవడానికి వి.ఎ.కె. రంగారావు గారు సంకలనం చేసిన ‘‘అలనాటి అందాలు’’ ఆడియో కేసెట్ ఎంతగానో తోడ్పడిరది. అవి ఎంతగా మనసుకు పట్టుకు పోయాయంటే ఒక దాని తర్వాత ఒకటి ఏ ఆర్డర్‌లో వస్తాయో టేప్ రికార్డర్ ఇంకా పాడకముందే నోటికి వచ్చేసేవి. ఆవిడ పాటలలోని ప్రత్యేకతా, అందమూ ఆయన చెప్పబట్టే అంత బాగా తెలిసింది అనుకుంటాను నేను. ఎటువంటి పాటలు అవి ‘‘తానేమి తలంచేనో నా మేనే పులకరించేనో’’ అని ఆమె పలుకుతుంటేనే ఆ పులకింత మనకి కూడా కలుగుతుంది. ‘‘రావే ప్రేమలతా’’ అనే పాట ఎంత మృదుమధురంగా వుంటుంది. వి.ఎ.కె. చేసిన ఆ కాసెట్ విని ఆ రోజుల్లో మేము వెర్రెత్తి పోయాము. మా పాలిట ఆమె పాటలు స్లో పాయిజన్ గుళికల్లా వుండేవి. మొదట విన్నప్పుడు మామూలు పాటల్లాగే అనిపించేవి అయితే వినగా వినగా పట్టుకుని వదిలేవి కావు. నేనీ మాటలే వి.ఎ.కె. గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పాను. అప్పుడు చూడాలి ఆయన మొహం. ఆమెను గురించి ఎంత పరవశంగా మాట్లాడారో, ఆయన కంఠస్వరం ఎంత మృదువుగా మారిపోయిందో ‘‘ఆవిడది ఇంపాసిబ్లీ బ్యూటిఫుల్ వాయిస్’’ అని చెప్పేటప్పుడు ఆయన మొహం ఎంత వెలిగిపోయిందో ఈ నాటికీ నా కళ్లకు కట్టినట్టుంటుంది.
సి.ఆర్. సుబ్బరామన్, రాజేశ్వరరావూ, రమేష్ నాయుడూ ఆమె కంఠస్వరానికి తగిన పాటలు చేశారని చెప్పారు. ఘంటసాల కూడా ఆమె చేత ఆణిముత్యాల్లాంటి పాటలు పాడిరచారనుకుంటాను నేను ‘‘ధరణికి గిరి భారమా’’ లాంటి సోలోలూ, ‘‘రావే ప్రేమలతా’’ లాంటి డ్యూయట్లతో పాటు ‘‘ముసురేసిందంటే పైన అసలే మతిపోతది మామా’’ అనే ప్రయివేట్ సాంగ్ కూడా పాడిరచారు కదా. నిజంగా ఆ పాటలో ఆమె గొంతు వింటుంటే మనకి మతిపోతుంది. ఎన్నో పాటలు ఎన్నెన్నో పాటలు చెప్పాలంటే కష్టం ఒక మాట మాత్రం నిజం ఆవిడ ఏ పాట పాడినా పూర్తి న్యాయం చేశారు. ఈ పాట బాగుంది, ఈ పాట బాగులేదు అని చెప్పేందుకు వీల్లేకుండా పాడారు.
అయితే వి.ఎ.కె, బాలసరస్వతి ఇద్దరూ ఒకచోట ఎదురు పడితే టామ్ అండ్ జెర్రీ షో చూసినట్టు వుంటుంది. ఆమె తొలి నేపథ్య గాయని కాదు తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అని రుజువులూ, సాక్ష్యాలూ చూపుతానంటారు వి.ఎ.కె. ఆవిడ యేం మాట్లాడినా అడ్డు తగులుతారు వెక్కిరిస్తూ మాట్లాడుతారు. ఈమె భయపడిపోతూ వుంటారు. కానీ ఆయన స్వభావం తెలిసిన నాకు తెలుసు ఆయన ఎంతో ఇష్టపడిన మనిషినే అలా ఆటపట్టిస్తారని. నిజానికి ఆవిడ లేరనే విషాద వార్త విని అందరి కంటే ఎక్కువ ఆయనే బాధపడి వుంటారు. అంతగా అభిమానించిన ఆమెను చూస్తాననీ, ఆవిడతో మాట్లాడతాననీ, ఆవిడ మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు గడుపుతారనీ కలలో కూడా అనుకోలేదు.
2004 ప్రాంతాలలో డా. హేమ పరిమి గారు వారింటికి బాలసరస్వతి గారు వస్తున్నారని ఆహ్వానించారు. ‘‘ఆహ ఏమీ నా భాగ్యము’’ అనుకుంటూ వెళ్లాను. అదే ఆమెను ప్రత్యక్షంగా చూడటం, ఆమె పాట వినడం. అప్పుడే అక్కడ ప్రసూనని చూసి ఆవిడ ‘‘రజనీ’’ గారి కోడలు అంటూ అభిమానం చూపిస్తూ ‘‘నీకిష్టమయిన పాట అడుగు పాడతాను’’ అన్నారు. నన్ను పెద్దగా పట్టించుకోలా. తర్వాత హేమ గారింట్లో రెండు మూడుసార్లూ, ప్రసూన వాళ్లింట్లో రెండు మూడు సార్లూ కలిశాక, బాగా దగ్గరయ్యారు. బాగా మాట్లాడే వారు. పామర్రు మా ఇంటికి వస్తానన్నారు. నేనూ చాలా ఉత్సాహపడ్డాను. జె.మధుసూదన శర్మ గారు దగ్గరుండి తాను తీసుకు వచ్చి మళ్లీ క్షేమంగా తీసుకువెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఆయనని ఆవిడ తమ్ముడూ అని ఆప్యాయంగా పిలుస్తూ వుండేవారు. ఆయన ఎంతో జాగ్రత్తగా తీసుకు వచ్చి ఆవిడతో కూడా వుండి ఎంత బాగా చూసుకున్నారో ఆయన రుణం తీర్చుకోలేనిది.
ఆవిడ వున్న నాలుగు రోజులూ పండగ లాగా గడిచి పోయింది. నా పక్కనే కూచుని కబుర్లు చెప్పేవారు. ఆవిడ వేసే జోక్స్‌కి నవ్వలేక చచ్చిపోయేదాన్ని. ఒకసారి మమ్మల్నిద్దరినీ ఇబ్బంది పెట్టిన ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఒకామె గురించి అడుగుతూ ‘‘ఆమె యేం చదువుకుందమ్మా?’’ అని అడిగారు. డాక్టర్ కోర్స్ చేసిందటండీ అని చెప్పాను. మరి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తోందా? అని అడిగితే లేదటండీ ఖాళీగానే ఇంట్లోనే వుంటుందట. అంటే ‘‘పోన్లే తెలియక ఎనిమా ట్యూబ్ తీసుకెళ్లి ముక్కులో పెట్టిందంటే ఎంత ప్రమాదం’’ అన్నారు నేనిప్పటికీ ఆ మాట తలుచుకుని ఒకటే నవ్వుకుంటాను.
ఇప్పుడు వచ్చే పాటలన్నా, ఇప్పుడు హై పిచ్‌లో పాడే గాయనీ గాయకులన్నా ఆవిడకి చిరాకు. బీట్‌కి ప్రాధాన్యతనిస్తూ నేడు వినపడే పాటలు వింటూ ‘‘ఏమిటమ్మా ఆ దంపుడు సంగీతం? వినలేక చస్తున్నాము’’ అనేవారు. ‘‘ఆపై శ్రుతిలో కీచు గొంతులతో ఆ పాటలేమిటమ్మా, పాటంటే తేలికగా, మెత్తగా,హాయిగా వుండాలి’’ అనేవారు. ఆవిడకి హిందుస్థానీ సంగీతమంటే చాలా మక్కువ. మొదట్లో హిందీ సినిమాల్లో పాడాలని బొంబాయి వెళితే అసూయతో లతా మంగేష్కర్ లాంటి కొంత మంది పాడనీకుండా చేశారని చెప్పేవారు. అందులో నిజమెంతో తెలియదు. వసంత్ దేశాయ్ వద్ద కొంతకాలం సంగీతంలో మెళుకువలు తెలుసుకున్నారట.
ఇక ఆవిడ అభిరుచుల విషయానికి వస్తే చాక్లెట్లూ, ఐస్‌క్రీమ్‌లూ బాగా ఇష్టపడేవారు. భోజనం చాలా తక్కువగా తీసుకునేవారు.చిన్న చిన్న చిరుతిళ్లు ఇష్ట పడేవారు. బాగా పరిచయం పెరిగినప్పటి నుండీ, ప్రతి పుట్టిన రోజుకీ (ఆగస్ట్ 28) ఆహ్వానించేవారు. చాలా సార్లు వెళ్లాను. అక్కడ అప్పుడప్పుడూ నటి జయసుధ, విజయనిర్మల కనపడుతూ వుండేవారు. వారిద్దరూ ఆమెకు బంధువులు. కొంతకాలం తర్వాత హాస్పిటల్ పనులతోనూ, ఇతరత్రా బిజీ అవ్వడంతో వెళ్లడం కుదరకపోతే కనపడినప్పుడు ‘‘నువ్వు పెద్ద దొంగవి కనపడడమే మానేశావు’’ అనేవారు. వీలయినప్పుడంతా వెళ్లి కలిసే దాన్ని. నా స్నేహితులని కూడా తీసికెళ్లేదాన్ని. వెళ్లినప్పుడు గొంతు బాగా లేదు అంటూనే బోలెడు పాటలు పాడేవారు. కబుర్లు చెప్పేవారు చెయ్యి పట్టుకుని వదిలేవారు కాదు. నాస్నేహితురాలు డా. శశికళ ఆమెను తరచుగా కలుసుకుంటూ, కావలసిన వైద్య సహాయం అందిస్తూ చూసుకుంటోంది. గత కొంత కాలంగా అనారోగ్యంగా వుంటున్నారని, వృధ్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారనీ కబుర్లు తెలుస్తూనే వున్నాయి. నిన్నటితో ఆమెకు విముక్తి లభించింది. 97 యేళ్ల పాటు నిండుగా జీవించి పండులాగా రాలిపోయారు.
పాటను ప్రేమించి, పాటే జీవితంగా గడిపి, గట్టిగా పలికితే పదాలు కందిపోతాయేమో అన్నట్టు మెత్తగా పలుకుతూ, పాటంటే యెలా వుండాలో తెలియజెప్పి, పాటకు పట్టాభిషేకం చేసిన ఆమె పాటలాగే వెళ్లిపోయింది. ఆమె అభిమానులకు ఆమె పాటల ఖజానా వుందిగా, అనుక్షణం ఆమె వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. నిండు మనసుతో నివాళి.
