‘‘చాలా అద్భుతమైన మనిషి. స్వఛ్చమైన మనస్తత్వం’’ అంటూ మా అంకుల్ (చలసాని ప్రసాద్) పరిచయం చేసిన అపురూపమైన మనుషులలో రావు బాల సరస్వతీ దేవి గారొకరు. ఆమె 1996లో హైదరాబాద్‌కి వచ్చారు. 1997 నుంచి ఆమె జన్మదినం ఆగస్టు 28 అంటే మాకు పాటల పండగే! ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచేవారు. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఏడాదీ ఎదురు చూసేవాళ్ళం. ఇక ఆ సాయంత్రం ఫోటోలతో, నిష్ణాతులైన గాయకుల పాటలతో, సరస్వతి గారి అద్భుతమైన హాస్యంతో పొట్ట చెక్కలయ్యే నవ్వులతో అద్భుతంగా గడిచిపోయేది! ఇప్పుడా మధురస్మృతులు జ్ఞాపకాలుగా మురిపిస్తున్నాయి!
వారి పిల్లలు సూర్యారావులిద్దరూ మామతానురాగాలతో నన్ను ఒక తోబుట్టువు లాగే చూస్తారు. కోడళ్ళిద్దరూ కూడా నాకు బాగా తెలుసు. చాలా సంవత్సరాల నుంచి స్వంత కుటుంబ సభ్యులలాగా కలిసిపోయిన దగ్గర నుంచి అమ్మా అని పిలవడం అలవాటు చేసుకున్నాను.
నాతోనే కాదు, తనకు పరిచయమైన ఎవరితోనైనా అమ్మ అంతే ఆప్యాయంగా ఉండేవారు. మేము నిరంతరం ఆమెతో టచ్‌లో ఉండడానికి కారణం మా అంకుల్ వారి కుటుంబంతో టచ్‌లో ఉండమనీ, వారిని చూసుకోమని మాకు చెప్తూ, తాను వచ్చిన ప్రతిసారీ వరూధిని గారింటికీ, బాల సరస్వతి గారింటికీ తప్పకుండా నన్నూ తీసికెళ్ళేవారు. ఏ ఏ ప్రాంతాలకు వారి ఇళ్ళు మారినా, మేము అన్ని చోట్లకీ పోతుండేవాళ్ళం. మా ముగ్గురి పిల్లల పెళ్ళిళ్ళకీ వచ్చి, ముందు వరసలో కూర్చుని ఓపికగా చూశారు. నా స్నేహితులందరూ అమ్మని ‘‘అబ్బా! బాల సరస్వతీ దేవి గారు’’ అని ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకునేవారు!
సరస్వతీ దేవి బాల్యం ఆగస్టు 28న, 1928లో బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో పార్ధసారధి – విశాలాక్షి దంపతులకు సరస్వతి జన్మించారు. గుంటూరులో పెరిగారు. గుంటూరులో తండ్రిగారికి రత్నామహల్ అనే ఒక సినిమా థియేటర్ ఉండేది. తల్లి తండ్రులకి సంగీతం, సినిమాలు, నాటకాల మీద మంచి అభిరుచి ఉండేది. టాకీలు ఇంకా రాని ఆ రోజుల్లో మూకీ సినిమాలు ఆడుతుండడం వల్ల ఎక్కువగా నాటకాలు ప్రదర్శింస్తుండేవారు. వారు చిట్టి సరస్వతిని వెంటబెట్టుకుని తీసికెళ్తుండేవారు. ఆమె చిన్నప్పుడు ఇంట్లో ఒక గ్రామఫోన్ రికార్డు ఉండేది. అందులో వాళ్ళ తాతగారు కపిలవాయి రామనాధశాస్త్రి గారి పాటలు, స్థానం నరసింహారావు గారి పాటలు వింటుండేవారు. ఆయనతో పాటు సరస్వతికి కూడా గ్రామఫోన్ రికార్డులో పాటలు వినడమంటే మహా ఇష్టంగా ఉండేది. వేరే పాటలేవీ పసి వయసులో నచ్చలేదు గానీ అందులో స్థానం నరసింహారావు గారు పాడిన లాలి పాట ‘‘సుకుమారా సుశరీరా సుందర రాజధీరా జో జో’’ చిన్నారిని బాగా ఆకట్టుకుంది. ఆ రికార్డ్ అరిగిపోయేవరకూ విన్నది. బాల్యం నుంచే సరస్వతికి వినికిడి జ్ఞానం ఎక్కువ. అంత చిన్న వయసు నుంచే విని నేర్చుకోవడం అలవాటు కాబట్టి ఆ పాట పూర్తిగా వచ్చేసింది! అది మూడు, నాలుగేళ్ళ ప్రాయం నుంచే ఆడుకుంటూ, పాడే వాళ్ళను చూస్తే చాలు పాట నోటికి వచ్చేసేది! ఎంతసేపూ పాట లేకపోతే ఆటలే గాని చదువు అబ్బలేదు! పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు సరస్వతి గారిది లలితగీతాల పరిమళం!
ఒకరోజు వారు గుంటూరు టాకీస్‌లో ఒక నాటకం వేశారు. అప్పుడు కపిలవాయి రామనాధ శాస్త్రి గారిని ‘‘నమస్తే నా ప్రాణనాధా’’ అనే ఒక పాట పాడమని ప్రేక్షకుల నుంచి అడిగారు. ఆ సమయంలో తల్లి ఒడిలో ఉన్న సరస్వతి ఆ పాటను విని ఉండడం వల్ల నేను పాడతానని బాగా పేచీ పెట్టి మారాం చేసింది. విధి లేక నాలుగేళ్ళ చిన్నారి సరస్వతిని ఎత్తుకుని రామనాధ శాస్త్రి మైక్ దగ్గరికి తీసికెళ్ళారు. ఒక్క తప్పు కూడా లేకుండా, శృతి పక్వంగా, పదాలను అసలు తడుముకోకుండా ఆయన పాటను ఆయనకే వినిపిస్తూ పాడి సభికులందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ పరవశింపజేసింది. ఆ రకంగా కపిలవాయి రామనాధ శాస్త్రిగారు మొదటగా ఆమె స్వర మాధుర్యాన్ని గుర్తించారు! హెచ్ ఎం వి కంపెనీకి రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కొప్పరపు సుబ్బారావుగారు వాళ్ళ నాన్నగారికి మంచి స్నేహితులు. అది విన్న పాప ఇంత బాగా పాడుతుందని మెచ్చుకుని ఆమె ఆరవయేటనే హెచ్ ఎం వి కంపెనీ ద్వారా ‘‘నమస్తే నా ప్రాణనాధా’’, ‘‘ఆకలి సహింపగజాల’’, ‘‘పరమ పురుష పరంధామా’’ మొదలైన పాటలతో గ్రామఫోన్‌లో సోలో రికార్డు చేశారు! ఆ రకంగా ఆరేళ్ళ వయసులో హెచ్ ఎం వి లో పాడి ఒక రికార్డ్ సృష్టించింది! ఇదంతా 1934లో జరిగింది.
స్కూలుకి తీసికెళ్ళేటప్పుడు వాళ్ళ బండి అతను ‘పోలేరమ్మా మెరకల మీదకి పుల్లలకెల్తానే అమ్మే పోలేరమ్మా’’ అని పాడేవాడట. అది ‘‘ఏరువాకా సాగారో రన్నా చిన్నన్నా’’ ట్యూన్‌తో ఉండడంతో వెంటనే గుర్తు పట్టిందట. బాగా నచ్చేసిందట! అది అప్రయత్నంగానే కంఠతా వచ్చేసిందట! అతను పాడే పాటలన్నీ నాకు వచ్చని చెప్పేవారు. వాళ్ళ నాన్నగారి వల్ల పాడడం, నటనల మీద మంచి అభిరుచి ఏర్పడిరది. మనసుకి నచ్చిందంటే ఆ పాట నోటికి వచ్చినట్లే నంటారు!
తల్లి, తండ్రి గారు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. అందువల్ల కుటుంబం మద్రాసుకి మారిపోయాక 1936లో ఎనిమిదేళ్ళ వయసులో ‘సతీ అనసూయ’, ‘భక్త ధృవ’ చిత్రాల్లో నటించింది. తమిళంలో గొప్ప గొప్ప నటీ నటులతో 1936లోనే ‘భక్త కుచేల’, 1937లో ‘బాల యోగిని’గా నటించి తన తెలుగు, తమిళ పాటలన్నీ తానే పాడుకున్నారు. కె. సుబ్రహ్మణ్యం అనే ఒక ప్రముఖ వ్యక్తి బాలయోగినిగా నటించి, హిట్ కొట్టినందుకు సరస్వతిని కాస్తా ‘బాల సరస్వతి’ ని చేశారు. అప్పటినుండి ఆమె పేరు బాల సరస్వతిగా స్థిరపడిపోయింది. అలాగే 1938లో సి ఎస్ ఆర్ ఆంజనేయులు గారి దర్శకత్వంలో వచ్చిన ‘భక్త తుకారాం’ తెలుగు, తమిళ చిత్రాల్లో తుకారాం కూతురుగా నటించి పాడారు. 1939 లో రాజా శాండో నిర్మించిన ‘తిరునీలకాంతార్’ తమిళ చిత్రంలో నటించింది.
సంగీతానికి ప్రాధాన్యమిచ్చి పాడుతూనే 1947 లో ‘రాధిక’, 1948 లో ‘బిల్హణ’, 1960 లో ‘ శాంతి’, 1961 లో ‘’శభాష్ రాజా’ మొదలైన తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. మద్రాసులో నివసించడం, ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తూ అన్ని భాషలలో నటిస్తూ పాడుతుండడం వల్ల ఆమెను అందరూ అరవ అమ్మాయి అనుకున్నారట. తెలుగు, తమిళం మొత్తం 13, సినిమాల్లో 17 ఏళ్ల వయసుకే నటించింది. పాట కన్నా ముందే నటన మొదలైంది! బాల సరస్వతి సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన, కవి బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు రచించిన, ఆకుల నరసింహారావు గారి సంగీత దర్శకత్వంలో ‘‘ఏది దారి నాకిచ్చట ఈ కాలుష్య భూతముల పాలైతిని’’ అనే పాటతో ‘‘సతీ అనసూయ’’ చిత్రంలో ఏడేళ్ళ వయసులో గంగ పాత్రను, ‘‘ధృవ విజయం’’ అనే చిన్న పిల్లల సినిమాలోనూ నటించింది.
బాల సరస్వతికి 12, సాలూరి రాజేశ్వర రావు గారికి 17 సంవత్సరాల వయసులో ఒకరికొకరు తెలియడం జరిగింది. సాలూరి రాజేశ్వరరావు గారితో పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే అయినప్పటికీ ‘‘పొదరింటిలోనుండి పొంచి చూసెదవేలా చంద్రుడా, నా ఎదురుగా రావేల చంద్రుడా’’ అనే రాగమాలికలో పాడిన ఈ పాట అంటే చాలా ఇష్టమని చెప్పారు. డ్యూయెట్లే గాని, అప్పటికి సినిమాలలో పాడడం లేదు. రేడియోలో మేమిద్దరం పాడుతున్నామంటే మమ్మల్ని చూడడానికి చాలామంది వచ్చేవాళ్లని చెప్పారు! ఈ జంట స్వరాలు చాలా సహజంగా కలిసిపోయి వినేవారికి మనోహరంగా, వీనుల విందుగా ఉండేవని ఆ కాలంలో సదాశివ గారి లాంటివాళ్లు రాశారు. ఇక తెలుగులో గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో 1940 లో వచ్చిన ‘ఇల్లాలు’ చిత్రంలో బాల సరస్వతి-సాలూరి రాజేశ్వరరావు గారు జంటగా నటించి, సాలూరి సారధ్యంలో ఎవరి పాటలు వారే పాడుకున్నారు. ఆ రోజుల్లో ఈ సినిమా అమోఘమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి బసవరాజు అప్పారావు గారు పాటలు రాశారు.
ఆ రోజుల్లో భావస్ఫోరకంగా, సూటిమెత్తగా వినిపించే ఆమె స్వరం కోసం ఒక్కొక్క సంగీత దర్శకుడు ఒక్కటంటే ఒక్క పాట పాడమని బాల సరస్వతి గారిని బతిమలాడేవారట! ‘‘రాజేశ్వరరావు గారితో పాడిన డ్యూయెట్స్ చాలా పాప్యులర్ అవడం వల్ల సి ఆర్ సుబ్బరామన్ గారు ఒక్క పాట పాడిరచుకోవాలని అడిగితే బసవరాజు అప్పారావు గారు రాసిన, ‘‘తత్తరమది యేలనోయి, తలుపు తీతు వీలు చూసి తాళుము కృష్ణా, కొంతసేపు తాళుము కృష్ణా’ అనే పాట బాగా ప్రసిద్ధి పొంది, నాకూ, ఆయనకీ గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. పెండ్యాల నాగేశ్వరరావు గారు అడిగిన ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ-వ్యష్టి జీవితము చేదు పానీయమూ’ ఇది కూడా చాలా పేరు పొందింది. కె వి మహదేవన్ ‘ఆలయమున వినపడునదిగో ఆకాశమున కనపడునదిగో’ వారికీ నాకూ మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఎమ్ ఎస్ విశ్వనాధం గారి కోసం ‘ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, నీ చక్కని మోము చూడ తనివి తీరదు’- ఇలా పాడిన పాటలన్నీ సంగీత ప్రపంచంలో గొప్ప హిట్సే! ఆ మహనీయులు నాచేత పాడిరచుకోవడం, ఆ సమయం, అదృష్టం నాకూ కలిసొచ్చాయి. ఒక్కొక్క పాటా ఒక్కొక్కరి వల్ల ఘనకీర్తి పొందాయి’’ అని అన్నారు బాల సరస్వతి!
1944 లో కోలంక జమీందారు రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు ఆమెను వివాహమాడారు. ఆ సమయానికి ఆమెకు 15 సంవత్సరాలైతే ఆయనకు 35 సంవత్సారాలు. ఆయనకి సంగీత సాహిత్యాల పట్ల ఎలాంటి అభిరుచీ లేకపోవడం, ఆ రోజుల్లో సమాజంలో మూర్తీభవించిన పితృస్వామ్య భావజాలం, పైగా రాచరికం వల్ల ఆమెను బయటికి అనుమతించలేదు. పాడుతున్నప్పుడు ఆమెతో పాటు వచ్చిన గన్ మేన్ అమ్మగారి పక్కనే ‘ఎవరో నల్లగా, మొద్దుగా ఉన్నాయన (ఘంటసాల) కూర్చుని’ పాడుతున్నాడని చెప్పడంతో అప్పటి నుంచి ఆమె ప్రాణానికి ప్రాణమైన సంగీత వ్యాపకం మొత్తం ఆగిపోయింది. చాలా తక్కువగా నేపధ్యగానానికే పరిమితమై 1958 నుంచి మానేశారు. ఆయన అభ్యంతర పెట్టకుండా ఉండి ఉంటే తెలుగువారికి ఎన్నో ఆహ్లాదకరమైన పాటలు వచ్చి ఉండేవి. కానీ బాల సరస్వతి గారి మనస్తత్వం ఎంత గొప్పది అంటే సినిమా పరిశ్రమ నష్టపోకూడదని, తెలుగువారిని సంతోషపెట్టడమే తన విధిగా భావించి, పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఆయనకి తెలియకుండా పాడేవారు. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘అక్కా, ఒక్క పాట పాడమ’ ని ఆమె బతిమలాడగా రమేష్ నాయుడి గారి స్వర రచనలో పాడిన చివరి పాట, ‘‘పోయి రావమ్మ, అత్తవారింటికి అపరంజి బొమ్మ.’’ అప్పటికి ఆమె భర్త గారు 1974లో మరణించారు. ఆ తర్వాత పాడడానికి ఆమె మనసొప్పలేదనీ, అప్పటికి మెలొడీ పాటలు అంతరించి, రెండర్ధాల మాటలతో దంపుడు పాటలు మొదలయ్యాయన్నారు నవ్వుతూ! తనకి అవి సరిపడవని అన్నారు.
తొలి తరం లలిత, తెలుగు సినీ నేపధ్య గాయని 1939లో ‘మహానంద’ సినిమాలో తొలి నేపధ్య గానం చేశారు! 1940-41 మధ్యలో చిత్తూరు నాగయ్య గారు నిర్మించిన ‘భాగ్యలక్ష్మి’ చిత్రం కోసం సీనియర్ రాఘవాచారి రాసిన ‘‘తిన్నె మీద చిన్నోడా ఓ చిన్నవాడా, తేనె తుట్టెలోకి పోబాక’’ అనే పాటని భీమవరపు నరసింహా రావు గారు స్వరపరిచి, పాడమంటే అలవోకగా పాటను ఊదేసి వచ్చానని చెప్పారు. ఈ పాట పాడుతూ తెర మీద కమలా కొట్నీస్ కనిపిస్తారు. ఆ రోజుల్లో భీమవరపు నరసింహారావు గారి సంగీత దర్శకత్వంలో హిందీలో, తెలుగులో పాటలన్నీ నాచేతే పాడిరచారని బాల సరస్వతి చెప్పారు.
‘షావుకారు’ చిత్రంలో ‘‘పలుకవేలనే చిలుకా’’, ‘స్వప్నసుందరి’లో ‘కానగనైతినిరా నిన్నూ’ మొదలైన పాటలతో ఘంటసాల వేంకటేశ్వరరావు గారితో ఆ చిత్రాలలోని డ్యూయెట్లు అన్నీ పాడారు. ఏ ఎమ్ రాజా, సౌందర రాజన్, పిఠాపురం నాగేశ్వరరావు పిల్లవోలు గజపతి కృష్ణవేణి, ఏ పి కోమల, ఏం ఎస్ రాజేశ్వరి, కె. రాణి, పి.సుశీల-మొదలైన చాలామందితో పాడారు. తెలుగు, తమిళం కాక మళయాళం, కన్నడ, సింహళ, హిందీ భాషలలో కూడా 2000 పైగా అనేక పాటలు పాడారు!
సి ఆర్ సుబ్బరామన్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘చెంచులక్ష్మి’ లో డ్యూయెట్లు అన్నీ పాడారు. ఎమ్ ఎస్ విశ్వనాధం గారి స్వర రచనలో తెనాలి రామకృష్ణ సినిమాలో ‘కోరికలీడేర కూడెదరా’ పాట పాడారు. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాలో పాడిన ‘‘తానే మారేనా’’ పాట గురించి అందరికీ తెలిసిందే!
అననుసరణీయమైన లలిత గాన సరస్వతి!
అలత్తూరు సుబ్బయ్య గారి వద్ద మూడు సంవత్సరాలు శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. ఖేల్కర్, వసంత దేశాయ్‌ల వద్ద హిందూస్తానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. కె. పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో మంచి తర్ఫీదు పొందారు. వీరంతా ఆ రోజుల్లో సంగీత సామ్రాజ్యాన్ని ఏలినవారు. ప్రసార మాధ్యమాల నిష్ణాతుడు ఆచంట జానకీరామ్, జనమంచి రామకృష్ణ, ఎస్ ఎన్ మూర్తి, బాలాంత్రపు రాజనీకాంత రావు మొదలైన నిష్ణాతులైన వారికి ఆకాశవాణి ద్వారా దొరికిన ఆణిముత్యం బాల సరస్వతీ దేవి. 1936 లో ఆరు ఆకాశవాణి కేంద్రాలను స్థాపించారు. 1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రం, 1948లో విజయవాడ రేడియో కేంద్రం రెండూ కూడా బాల సరస్వతి గారి లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. అందుకు ఆమె చాలా సంతోషించారు. కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు మొదలైన పండితులు రాసిన గేయాలను రేడియోలో ఆలపించారు. బాల సరస్వతి ‘రాధా మాధవం’ సీ డీ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. లలితగీతం నుడికారానికి పక్క వాద్యాలుండవు. అలతి అలతి పదాలతో వినసొంపుగా చెవులలో అమృతం బొట్లు బొట్లుగా ఇంకుతున్నట్లుగా మనోహరంగా ఉంటాయి. ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసిన ముకుందశర్మ గారు ‘నా మనసులో మీరా అంటే బాల సరస్వతి దేవి గారే’ నని అన్నారు. ఆయన ఇటీవలే ప్రసాద్ లేబ్స్‌లో మళ్ళీ అమ్మ పాడిన మీరా భజన పాటలకు ఎక్స్‌టెన్షన్ రికార్డ్స్ చేయించానని చెప్పారు! ఆమె పాటకు వారసులేవరూ లేకపోవడం మన దురదృష్టం.
ఒక పాట పాడినా, ఎన్ని పాటలు పాడినా నెలకి సినిమా వాళ్ళు 400 రూపాయలు ఇచ్చేవారట. ఆ రోజుల్లోనే బాల సరస్వతి లక్ష రూపాయలు టాక్స్ కట్టే వారట. అంటే ఎన్ని పాటలు పాడేవారో కదా! ఆకాశవాణిలో వారానికి 100 మాత్రమే ఇచ్చేవారట. సంపన్న కుటుంబం కావడంతో 100 రూపాయలంటే లెక్కే ఉండేది కాదని చెప్పారు!
‘‘రాజీ నాప్రాణం’’ సినిమాలో ‘‘మల్లెపూలు మల్లెపూలు, కలవ పూలు కావాలా, ఎన్నెన్నో వన్నె పూలు, చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా?’’ అనే పాటని కృష్ణశాస్త్రి రాయగా, సాలూరి హనుమంతరావుగారు స్వరపరిచారు. బ్రహ్మాండంగా హిట్టయింది. ఇదే సినిమా తమిళంలో ‘రాజీ ఎన్ కణ మణి’ గా వచ్చింది. రంజన్, వెస్ట్రన్ ట్యూన్ ఒకటి కావాలని మద్రాస్ మొత్తం తిరిగి తిరిగి చార్లీ చాప్లిన్ సినిమాలోని ట్యూన్ ఒకటి వెతికి పట్టుకొచ్చారు. జెమినీలో వైద్యనాధన్ అనే ఆయన ఈ పాటనే వేరే ట్యూన్‌తో చేశారు. అప్పట్లో మాకు తెలుగులో ఒకటి రెండు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఉండేవి. కానీ వైద్యనాధన్ గారు 70, 80 ఇన్స్ట్రుమెంట్స్‌తో మూడు రోజులు రికార్డ్ చేశారు. ఒక్కసారే 6 నిమిషాలలో పాట రికార్డ్ అయింది. ఇప్పటిలాగా బిట్స్ బిట్స్ చేయడం ఆ రోజుల్లో కుదిరేది కాదు. తమిళంలో ‘మల్లిగై పూజాది రోజా’ అనే పాటని బాల సరస్వతిగారే పాశ్చాత్య బాణీలో అద్భుతంగా పాడి మెప్పించారు. ఈ పాటను చార్లీ చాప్లిన్ మహాద్భుతంగా నటించిన ‘సిటీ లైట్స్’ లోని ఒక స్పానిష్ ట్యూన్ ‘La Vielotera’’ ఆధారంగా రూపొందించారు.
బాల సరస్వతి గారితో నా నోస్టాల్జియా టెలిఫోన్స్‌లో రాకరకాల స్వరాలు వినడం వల్ల నాకు గొంతుల పిచ్చి ఉంది. ఆమె సుస్వరం లాంటి కంఠస్వరాన్ని మళ్ళీ నేనెక్కడా వినలేదు! విషాదంగా ఉన్నప్పుడు అమ్మను చూస్తే చాలు ఆ హాస్యానికి మైమరచి పోవలసిందే! ఆమె సమక్షంలో మనసు దూదిపింజలా హాయిలోకాల్లో తేలిపోతుంది! గాలికి కదలాడే నేల మీద కాలు మోపినా, సున్నితమైన మహమల్ తివాచీ మీద నడిచినా ఒక చల్లని హాయి సోకి ఆపాదమస్తకం ఒళ్ళంతా పులకరిస్తుంది. అలాంటి అనుభూతిని కలిగించగల అమృతతుల్యమైన గీతాలు ఆమె లలితగీతాలు! ఆమె స్వరం విన్నాకే ఆ పాటలకు లలితగీతాలు అనే పేరొచ్చిందేమో! మనసులోని భావాలను పెదవి విప్పి పాడేదే లలితగీతం! మంజులం, మార్ధవం, కుసుమ కోమలం, మృదు మధురం – మొదలైన పదాల అర్ధాలు ఈ తరానికి తెలియాలంటే అమ్మ పాట వినాల్సిందే!
పాట సరే అందరూ గుర్తించారు కానీ మాటలో ఎంత హాస్యప్రియత్వం ఉంటుందో కొంతమందికే తెలుసు. కోవిడ్ సమయంలో మేము ఎక్కువగా యాప్రాల్లో ఉన్నాం. అప్పుడు వాళ్ళ పెదబాబు సూర్యారావు కుటుంబం కూడా అమ్మతో యాప్రాల్లో ఉండేవారు. ఆయన భార్య విజయని, అమ్మని తీసుకుని మా ఇంటికి వచ్చేవారు. మేము కూడా చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఒకసారి వెళ్ళినప్పుడు ‘దా, దా మనం బజ్జుకుని కబుర్లు చెప్పుకుందాం’ అని జమీందారు గారు తన మొదటి, రెండవ భార్య గురించిన కబుర్లు ఆయన ఎలా చెప్పేవారో అవన్నీ ఇమిటేట్ చేసి చెప్పి తెగ నవ్వించారు! ఆయన రెండో భార్య ‘సినిమాలలో పాటలు పాడే ఆవిడని తెచ్చి చేసుకున్నావు, నీతో నేనుండను ఫో’, అని పుట్టింటికి వెళ్ళి పోయిందట! ఆయన అమ్మ మీద ప్రేమతో ‘‘పోతే ఫో’’ అని అన్నారట! మొదట్లో బాల మురళీ కృష్ణ స్టేజి మీది ప్రవర్తన వేరుగా ఉండేదనీ, కూర్చున్న చోటనే ఆయన నడుము పైభాగాన్ని కదిలిస్తూ, పక్క వాయిద్యాలు వాయించే వాళ్ళ వేపుకు పలకరింపుగా వంగుతూ, ఆగకుండా రుబ్బుడు పొత్రం లాగా తిరుగుతూనే ఉండేవాడని చెప్తూ చేసి చూపించారు. ఒక్కరు కాదు, ఎంతోమంది గురించి చెప్తూ తాను నవ్వకుండా మనల్ని నవ్వులతో ఊపేస్తారు. ఇక నేను తట్టుకోలేక తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకోలేక లేచి కూచున్నా!
ఇంకోసారి నేను వెళ్ళినప్పుడు ఎంచక్కా కూచుని టీవి చూస్తున్నారు. ‘‘అమ్మా, టీవి చూస్తున్నారా’’ అని అడిగాను. ‘‘అవునమ్మా, మన వాళ్ళెవరైనా కనిపిస్తారేమోనని చూస్తున్నా. కొంతమంది కనిపించారు కూడా’’ అని అన్నారు. అప్పుడు చూద్దును కదా, అమ్మ చూసేదీ జంగల్ బుక్ ఛానల్! ఎవరో సంగీతంలో ఏదో రాగం పేరడిగితే ‘‘ప్రస్తుతం నాకు రాగాల పేర్లు గుర్తులేవు, రోగాల పేర్లయితే చెప్తాను’’-అన్నారు.
ఒకసారి ఆమె సాలూరి రాజేశ్వర రావు గారు ఆమెను పాడనివ్వడం లేదని తెలిసి, ‘‘నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకున్నాను, అని నెమ్మదిగా చెప్పారట, ఈమె వెంటనే ‘‘ఇప్పుడేడ్చి ఏమి లాభం’’ అన్నారట! అనేక సంవత్సరాలు తనకి జన్మదినం రోజున పార్టీలు స్పాన్సర్ చేసిన మధుమతి గారు ఒకసారి ఏదో పాడబోతే ‘‘ఏమిటా పీకుడు, లాగుడు, రబ్బరు పాటలు, ఆపేయ్ అన్నారు. పీకుడు, లాగుడు, దంపుడు పాటలని ఆమె అనే తీరుకి మనకి భలే నవ్వొస్తుంది! పసితనాన్ని చివరి వరకూ నిలుపుకున్న భాగ్యశాలి, సరస్వతికి చిన్ననాటి చిలిపితనం, పసితనం పోలేదన్నారు పెద్దలు. కొన్ని విషయాల్లో పసితనపు అమాయకత్వం తొణికిసలాడేది. ప్రసాద్ అంకుల్ నక్సలైట్స్‌తో చర్చల సందర్భంలో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అమ్మను కలిశాం! ఆ మాట, ఈమాటా మద్రాసులోని జయలలిత, మురారి, జగ్గయ్య మొదలైన వారి కబుర్లు అయిపోయాక తాను వచ్చిన పని చెప్పారు. అప్పడు అమ్మ, ‘‘కొంచెం నా గురించి కూడా చర్చల్లో ప్రస్తావించండి’’ అని అడిగారు! ఎంత మూర్తీభవించిన అమాయకత్వం!
ఒకసారి అజో విభో ఫౌండేషన్ వారు అమ్మకి తెనాలిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి నువ్వూ, నేనూ, ఇద్దరు అబ్బాయిలతో వెళదామన్నారు. ఇక దారి పొడవునా రైల్లో అదీ, ఇదీ కావాలని మా ముగ్గురి దగ్గరా బాగా గారాలు పోయారు! మేము ముగ్గురం ఆంధ్రా టిఫిన్స్, భోజనాలూ ఎంజాయ్ చేస్తుంటే అమ్మ మాత్రం చిన్న పాపాయిలాగా చాక్లెట్లూ, ఐస్క్రీములూ, పళ్ళరసాలూ కావాలని మారాం చేశారు! ఎప్పుడూ చాక్లెట్ల కోసం అడుగుతుండేవారు!
ఒకసారి మా బాబు ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో పైలట్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు దిండిగల్ లోని వాడి స్నేహితుడు వివేక్ అహ్లూవాలియా అనే ఒకతని ఇంటికి వెళ్ళాం. ఆ సమయంలో అమ్మ మాతో ఉంటే ఆమెను కూడా తీసికెళ్ళాం. వివేక్ భార్య మోనీషా మంచి అందమైన తెల్లని చుడీదార్ వేసుకుంది. అమ్మకి తెలుపు క్రీమ్ కలర్లంటే చాలా ఇష్టం. నాకూ అలాంటి చుడీదార్ కుట్టించవా అని అడిగారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలలోని స్త్రీలు వాళ్ళ ఇళ్ళను చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. మోనీషా అలంకరణ అమ్మకి బాగా నచ్చింది. తను చాలా సంతోషంగా అన్నిటిమీదా జోకులేస్తుంటే మేము కూడా ఎంతో ఆనందంగా గడిపాం!
ఇంకొన్ని విశేషాలు : పెళ్ళి గురించి తెలిసి చేసుకున్నది కాదు, ప్రేమ పెళ్ళి కాదు. పెద్దలు చేసిందే! 20 ఏళ్ళు వయసు తేడా ఉన్నప్పటికీ అమ్మకి తన భర్త పట్ల ఏమీ రిగ్రెట్స్ ఉన్నట్లుగా అనిపించదు. కాకపోతే పెళ్ళి కాకపోతే బాగుండేదనీ, సంగీత సామ్రాజ్యంలో ఇంకా లోతులు చూచి బాగా పాడుకునేదాన్ననీ అనుకుంటారంతే! అంటే గానీ ఇంకొకరిని చేసుకోవాలని కాదు అని అంటారు. వేటకు అడవులకు తీసికెళ్ళడం, రాత్రుళ్ళు వెంట తిప్పడం లాంటివి అలవాటు చేశారని చెప్పారు. అమ్మ బెంగాలీ ట్యూన్స్‌ని చాలా ఇష్టపడతారు. వాళ్ళు మనవాళ్ళలాగా సంగతులకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. సింపుల్‌గా పాడతారంటారు. ఆమెకు ‘‘నా హృదయంలో నిదురించే చెలీ’’ పాట చాలా చాలా ఇష్టం. ప్రతిసారీ జన్మదినం సందర్భంగా వినోద్ గారితో చాలా సార్లు పాడిరచుకునేవారు. గొంతు గురించిన దిగులేమీ లేకుండా హాయిగా తనకిష్టమైనవన్నీ తినేస్తారు. అదే విషయం జయసుధ మొన్న మీటింగ్‌లో కూడా చెప్పారు. డాక్టర్లు యోగా, మెడిటేషన్, డైటింగ్ చేయ్యాలని చెప్తుంటే ఈవిడ ‘మా ఆంటీ అవేమీ చేయరు, కానీ ఆరోగ్యంగా ఉంటార’ని అమ్మ గురించి డాక్టర్‌కి చెప్పారట!
ఆమెకి సుబ్బరామన్ గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయనలాంటి సాహసవంతులు ఇప్పటికీ లేరంటారు. ‘‘అమ్మలక్కలు’’ సినిమాలో తను పాడిన పాట ‘‘కన్నె మావి తోటలోనా చిన్నారి ఇల్లు కట్టి ఎన్నెన్నో కలలనూ కన్నామే, చిన్నారీ ప్రేమ కన్నీరయ్యేనా బ్రతికేది యోగాలకేనా’’ ఆయనకి ఎంతో తృప్తి, సంతోషం కలిగించాయట. కానీ ఆ ప్రొడ్యూసర్‌కి ఒక సింగర్ ఫ్రెండ్ ఉందట, ఆమె నేనుండగా ఈ పిల్లని తెచ్చి ఎందుకు పాడిరచారు అని గొడవ చేసిందట. వెయ్యి రూపాయల చెక్ పంపిస్తూ మీ పాటని సినిమాలో తీసేశారు అని చెప్తే, అమ్మ ఆ చెక్‌ని అక్కడే చింపి అవతల పడేశారట. కానీ సుబ్బరామన్ గారు ఈ సంగీత దర్శకత్వం మానుకుంటానని వెళ్ళిపోయారట. అప్పుడందరూ కృష్ణా పిక్చర్స్ అంటే ఎంత పెద్ద కంపెనీ, పాట పోతే పోయింది, మానుకోవద్దని అమ్మ చెప్తే సరేనని వెళ్ళి, తెలివిగా మొదటి పల్లవిని అమ్మ పాడిరదే పెట్టి మిగతా పాటని ఆమెది పెట్టి రిలీజ్ చేశారట. సుబ్బరామన్ గారు ‘‘తానే మారెనా’’ పాట రికార్డ్ అయిన నాలుగైదు రోజులకే పోవడం చాలా షాక్ కలిగించిందని అన్నారు.
ఘంటసాల గారికి వినయం, గౌరవాలు ఎక్కువనీ, సుశీల గారి స్వరం బాగుంటుందనీ, ఏపాట పాడినా మెప్పిస్తారనీ కానీ ఆమె కామెడి పాటలు పాడి ఉండకుండా ఉంటే బాగుండేదని అన్నారు. ఏశృతిలోనైనా జానకి పాడగలదనీ, తనకి లత స్వరం కంటే ఆశా స్వరం ఇష్టమని అన్నారు.
ఆమె ఎవరి దగ్గరా నేర్చుకోకుండా, రిహార్సల్స్ అవసరం లేకుండా విని పాడడం, తన పాటలకి తానే ట్యూన్ కట్టుకోవడం వల్ల తమ సమకాలికులందరికీ ఆమె అంటే ఈర్ష్యగా ఉండేదని అంటారు. ఎవరైనా చెప్పిన పాటను నేను నాకనుకూలంగా ట్యూన్ చేసుకోనిస్తేనే పాడతాను, లేకపోతే పాడను. పాట ట్యూన్, సాహిత్యం ఏమాత్రం నచ్చకపోయినా అవి తన రేంజ్‌లో లేవని అనిపించినా వాళ్ళు ఎంత డబ్బు ఇస్తానన్నా సరే నిశ్శబ్దంగా లేచి, కాఫీ తాగి వస్తానని మర్యాదగా చెప్పి ఇంటికి వచ్చేసేదాన్ని అన్నారు.
నౌషాద్ చాలా మంచివాడు, గౌరవంగా ఉండేవారు, ఆయన నన్ను పిలిపించినప్పుడు పాడే వాళ్ళలో జీక్కీ, లీలా, నేనూ మాత్రమే ఉన్నాం. గులాం మహమ్మద్ మ్యూజిక్ డైరెక్షన్ లో రెండు పాటలు నేను తమిళంలో, లతా మంగేశ్వర్ హిందీ వెర్షన్ లోపాడాము. వాళ్ళకి నా స్వరం, పాడే విధానం చాలా నచ్చింది, ఇక్కడే ఉండండి, పాడండి అన్నారు. కానీ లతాకి నచ్చలేదు, ఆమె ఉంటే నేను పాడనన్నది. నౌషాద్ సారీ చెప్పి మీరుంటే ఆమె పాడనంటుంది అని అన్నారని చెప్పారు. పాడడం, కంపోజ్ చేసుకోవడం, పదిమందితో ఉండడం అన్నీ నాకు సరదా. అన్ని విధాలుగా అన్యాయమే జరిగిందని అన్నారు!
1974లో ఆయన పోయాక నా ఆర్ధిక పరిస్థితి తారుమారయింది. ఎన్ టి ఆర్ కి ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నారు, నన్ను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. వచ్చిన 3 నెల్లకే ఎన్ టి ఆర్ పోయారు. ఒకరి తర్వాత ఒకరు ముఖ్య మంత్రులు మారుతున్నారు. అందరికీ నాసంగతి చెప్తూ అప్పీల్ చేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారొచ్చాక కూడా నేరుగా వెళ్ళి చేతికి ఇచ్చి వచ్చాను. అన్నీ బుట్టదాఖలే! లాస్ట్ సినిమా ఎంజి ఆర్ తో నటించాను కాబట్టి జయలలితకు లెటర్ రాశాను. వెంటనే పిలిపించింది. ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకుని ఆపదల్లో ఆదుకున్నది. తెలుగు వాళ్ళ కంటే తమిళులు ఎంతో నయమన్నారు! సంగీతం రాకపోయినా చక్కగా వింటారు, గౌరవిస్తారు. మనవాళ్ళ లాగా మనసు లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడరు అన్నారమ్మ.
‘‘1940 నుంచి నేను పాడుతుంటే ఆకాశవాణి వాళ్ళు ‘‘ఏ’’ గ్రేడ్ కూడా ఇవ్వలేదు. అలాటప్పుడు అక్కడికి పోయి పాడడ మెందుకు అనుకున్నాను. ఈ కాలంలో అవార్డులకు కష్టపడనక్కరలేదనీ, ఎవరికి వారే అవార్డులు తెచ్చుకోవచ్చని అన్నారు. గుర్తించ వలసిన వాళ్ళు గుర్తించలేదని అమ్మ మనసుకి కొంచెం కష్టంగా కూడా ఉండేది!
తెలుగుజాతి కొంతమందికి ఏమిచ్చి, ఏమి చేసినా వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు! అందులో ఒకరు రావు బాల సరస్వతీ దేవి ఒకరు! అదే పురుషులైతే ఆమె చేసిన స్వరచాలనంలో మూడోవంతు చేసినా బోలెడన్ని అవార్డులతో సత్కరించేవారు. బాల మురళీకృష్ణ ను 10 సంవత్సరాలకు సంగీత లోకం గుర్తిస్తే, సరస్వతీ దేవిని నాలుగేళ్ళకే గుర్తించారు! వెస్ట్రన్, క్లాసికల్. లైట్ మూజిక్ అన్నీ ఎన్నో భాషలలో పాడారు. అదే పురుషుడై ఉండి ఉంటే ‘‘Father of Light Music’’ అని ఆకాశానికి ఎత్తేసేవారు! బాల సరస్వతీ దేవిని అదే విధంగా, ‘‘Mother of Light Music’’ అని అనడానికి ఎవరికీ ఎందుకో నోరు పెగలలేదు!
చలం మ్యూజింగ్స్‌లో, ‘‘పాడిరది బాల సరస్వతీ దేవి గారుట. తక్కిన పాటకంతా ఏం! ‘ఆ అందగాడెవరే!’ అని మూడుసార్లంటారు ఆమె. నా కళ్ళెదుట ఓ చిత్రపటం కన్పిస్తుంది. మధ్యాన్నం గొప్ప హర్మ్యంలో, పర్పుల్ మొఖమల్ తెరల మధ్య అందమైన దుప్పట్ల మీద, పరిమళాలలో నిద్రపోయి, తగ్గిపోయే ఎండ కాంతిలో కళ్ళు తెరిచి, అందంగా చేతులు పైకి చాచి, ఒళ్ళు విరుచుకుని చాలా బద్ధకంగా ‘ఆ అందగాడెవరే!’ అని అడుగుతున్నట్టు వినిపిస్తుంది. ఆమె అంటే ఆ బాల సరస్వతి గారెవరో ఆమె కాదు. నా మనసులోని కావ్యనాయకి, ఎప్పుడూ అతని దగ్గరకు వెళ్ళదు. అట్లా బద్ధకంగానే, సఖితో ‘ఆ అందగాడెవరే!’ అని ఏళ్ళకొద్దీ అడిగి కలలు కంటో ఉంటుంది. చివరికి ఎప్పుడో వాణ్ని ఓసారి ఇటు రమ్మను, అంటుంది, అంత బద్ధకంగానూ. వస్తాడో రాడో అతని అదృష్టం ఇంక …’’ అంటూ ఆమె స్వరం వినినంతనే ఇంత అద్భుతంగా ఊహిస్తాడు. ఆమె స్వరం అంత గొప్ప రచయితకి ఎంత గొప్ప స్ఫూర్తి నిచ్చిందో! బాల సరస్వతి పాట
ఉన్నంతకాలం మన మదిలో ఆమె తేనెలూరే స్వరాన్ని నిలుపుకుందాం!
