సమూహ యువజన సాహిత్యోత్సవంలో ప్రముఖ తమిళ దళిత స్త్రీవాద రచయిత్రి సుకీర్త రాణి కీలకోపన్యాసం.
సాహిత్యం విశ్వవ్యాప్తం.
మనసులోని అంతర్లీన ఆలోచనలను నిరంతరం సజీవంగా ఉంచేది సాహిత్యమే.
అదే సమయంలో బాహ్య ప్రపంచంపు జ్ఞాన లోకాల వైపు మనలను తీసుకువెళ్లేదీ కూడా సాహిత్యమే. సాహిత్యానికి తనకంటూ స్వంత సిద్ధాంతాలు, స్వీయ ధోరణులు ఉంటాయి. అవి కేవలం ఊహలు, కల్పనల నుంచి వచ్చినవి కావుÑ అవన్నీ జీవించి, అనుభవించి, పోరాడి రూపొందిన సిద్ధాంతాలే. వాటిల్లో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి ప్రసిద్ధ తాత్వికుడు దెరిడా సూచించిన ‘‘జాడ్యస్థానాల నుంచి కేంద్రానికి ప్రయాణం’’ అనే భావన. ఇక్కడ ‘‘కేంద్రం’’ అంటే ఆధిపత్యం, అధికారము, భాషపై, భూమిపై, సంస్కృతిపై నియంత్రణ కలిగిన ప్రదేశం.‘‘జాడ్యం’’ అంటే మాటలేని, భూమిలేని, అధికారంలేని వారి స్థానము.
అందువల్ల, ఆధిపత్య కేంద్రాన్ని కూలదోసి చేసి, అట్టడుగున ఉన్నవారిని ఆ కేంద్రానికి చేర్చడం సాహిత్యం చేపట్టవలసిన ప్రధాన లక్ష్యాలలో ఒకటి. అందుకే సాహిత్యం ప్రజల మధ్య సంచరిస్తూ మాటలేని వారి మాటగా, బానిసత్వానికి ఎదురు నిలిచే శక్తిగా, మానవ విముక్తిని అందించగల మార్గంగా అవతరించింది. ఇప్పటివరకు రాసిన మొత్తం సాహిత్యానికి ఒకే లక్ష్యం ఉంది ఆది మానవత్వాన్ని కాపాడటం, మనిషి గౌరవం, ప్రతి జీవిపై కరుణ, ప్రకృతి పట్ల ప్రేమ, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, విమోచన. ఇవన్నీ సాహిత్యం చెప్పే అసలు సందేశాలు.
‘‘కళ ఎవరికోసం? కళ కోసం కళనా? లేక ప్రజల కోసం కళనా?’’
శతాబ్దాలుగా ఈ ప్రశ్న పదేపదే వస్తూనే వుంది. నా దృష్టిలో కళ ప్రజల కోసమే. జాన్ కీట్స్ అన్నట్లు ‘‘సత్యమే అందం’’. సత్యం చెప్పే కళ, సత్యం పలికే సాహిత్యం ప్రజల కోసమే రూపొందాలి. ప్రజల కోసమే రాసిన సాహిత్యమే ఏదైనా మహత్తరమైనది. ఈ కళను, ఈ సాహిత్యాన్ని సమాజంలో ఎందుకు స్థాపించాలి అని ప్రశ్నించుకుంటే.. సాహిత్యం, కళ సమాజంలో ఏ స్థానం కలిగి ఉంటాయో పరిశీలిస్తే…
ప్రపంచంలోని సమాజాలన్నీ ఒకే రకంగా ఉండవు. అవి భూమి, భాష, సంస్కృతి, సంప్రదాయం, వాతావరణం వంటి అంశాల మీద ఆధారపడివుంటాయి. వాటి ఆధారంగా సమాజం ఆరోగ్యకరమైన సమాజమా, లేక అణిచివేతలో మగ్గే సమాజమా అని నిర్ధారించబడుతుంది.
ఆ నేపథ్యంగా చూస్తే మన భారతీయ సమాజం కుల ఆధారిత సమాజం, పితృస్వామ్య సమాజం, వర్గ ఆధారిత సమాజం, స్త్రీలను అణగదొక్కే సమాజం కూడా. అందుకే మన కళ్లముందే కులమతాల ఆధిపత్యం, అపవిత్రత-మాలిన్యత అనే భావాలు, కుల నిర్దేశిత వివాహ విధానం, పితృస్వామ్య శక్తులు, వర్గబేధాలు, స్త్రీల దాస్య స్థితి, లింగ అసమానతలు వంటివి మహా గోడల్లాగా నిలబడిన విషయం మనముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గోడలను కూల్చాల్సిన అత్యవసర సమయంలో మనం జీవిస్తున్నాము. వాటిని కూల్చడానికి మన రచనను ఆయుధంగా మార్చాలి. అక్షరాన్ని ఆయుధ స్థాయికి తీసుకెళ్లాలి. భారతీయ సమాజంలో కులం ఒక అత్యంత క్రూరమైన వ్యాధి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ‘‘కులం కేవలం ఒక కనబడే గోడైతే అది కూల్చివేయొచ్చు. కానీ కులం ఒక మానసిక స్థితిబీ అది మనుషుల మస్తిష్కంలో బలంగా నాటుకుని ఉంది.’’
అంబేడ్కర్ స్పష్టంగా నిరూపించిన వాస్తవం ఏమిటంటే అంతర్గత కుల వివాహ వ్యవస్థే కులానికి మూలం. ఇది పుట్టుకతోనే మనిషికి ఏ కులం కలగాలి, ఏ కులంలో ఉండాలి అన్నది నిర్ణయిస్తుంది. మనిషి మతాన్ని మార్చుకోవచ్చు కానీ, కులాన్ని మార్చుకోలేడు. ఈ కులవ్యవస్థ కారణంగానే దళితులపై ఇంతటి హింసాహితమైన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కుల నిర్దేశిత వివాహాలు, లైంగిక హింస, హత్యలు, గౌరవ హత్యలు. మన సమాజంలో కులాన్ని తరచూ రాజకీయ సమస్యగా మాత్రమే చూడబడిరది. కులం గురించీ, కుల హింస గురించీ మాట్లాడితే అది పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే భావించబడిరది. కులాన్ని సామాజిక సమస్యగా చూసిన వారు కేవలం ఇద్దరే. ఆది తంధై పెరియార్ మరియు బాబాసాహెబ్ అంబేడ్కర్ మాత్రమే. కులం రాజకీయ సమస్యగా చూడబడే స్థితి నుంచి, సామాజిక సమస్యగా చూడబడే స్థితికి మారినప్పుడే కుల నిర్మూలన సాధ్యమవుతుంది. ఈ మార్పు తీసుకురావడం మన రచనల ప్రధాన కర్తవ్యంగా మారాలి.
‘‘సామాజిక న్యాయం దళితులకు నేటికీ నిరాకరించబడుతోంది.’’
బతికే హక్కు, దేవాలయాల్లో పూజించే హక్కు, రాజకీయ హక్కు ఇవన్నీ దళితులకు అనాది నుంచి నేటి వరకు నిరాకరించబడుతున్నాయి. అది సామాన్యుడైన నుంచి దేశ ప్రథమ పౌరుడు వరకు ఇదే తంతే. దళితులకు అద్దె నివాసాలు నిరాకరించడం, ద్వంద్వ శ్మశానాలు, రెండు గ్లాసుల పద్ధతి ఇవన్నీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళితుల మధ్య ఐక్యతను పెంచి, విముక్తి భావాన్ని కలిగించడానికి అయోథిదాస్ పండితర్, అంబేడ్కర్, పెరియార్, సామాజిక యోధుడు అయ్యంకాలి రచనలు, పోరాటాలు, అలాగే దళిత సాహిత్యం అత్యంత అవసరం. కులం తరువాత, మతం కూడా ఒక సామాజిక వ్యాధి. ప్రస్తుతం రాజకీయాలు మరియు మతం ఘననీయంగా కలిసిపోయాయి. అంబేడ్కర్ స్పష్టంగా చెప్పినట్లు కులం అనేది మతానికి బాహ్య రూపమే. చాతుర్ వర్ణాలు, కులం, స్త్రీల అణచివేత, పితృస్వామ్య వ్యవస్థ ఇవన్నీ తమ మూలాల్లో మతానికే వెళ్లి చేరుతాయి. అందువల్ల, స్త్రీల దాస్యాన్ని, పితృస్వామ్యాన్ని, కులవ్యవస్థను నిర్మూలించాలని అనుకుంటే వాటికి మూలమైన మతాన్ని ప్రశ్నించాల్సిందే. కానీ, అదే మతంలో నిలబడి మతాన్ని ఎలా ప్రశ్నించగలం?. మన సొంత మతాన్ని ఎలా వ్యతిరేకించగలం?. అందుకే పెరియార్ నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తారుబీ అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తారు.
‘‘విద్య ఒక శక్తివంతమైన ఆయుధం దానిని మందగింపజేసే, దెబ్బతీసే ఏ రూపాన్నైనా ప్రతిఘటించాలి.’’
ఈ ప్రతిఘటనకు ధైర్యంగా పునాది వేసి నిలబడేది సాహిత్యం. అందుకే మనం సాహిత్యాన్ని వేడుక చేసుకోవాలి. సాహిత్యాన్ని కళాత్మక చర్యగా, మేధో చర్యగా, తిరుగుబాటు చర్యగా, రూపాంతర చర్యగా, విముక్తి చర్యగా ఎదగనివ్వాలి. నాకు రాయడానికి ఒక్క కారణమే చాలనిపిస్తుంది ఏమిటంటే నేను ఒక స్త్రీ అని. అయితే నేను ఒక దళిత స్త్రీగా ఉండటం రాయడానికి మరింత పటిష్టమైన న్యాయాన్ని ఇస్తుంది. ఈ సమాజం సమానత్వంతో నిండిన సమాజమైతే నేను పుష్టమైన సాహిత్యం, ఆనంద సాహిత్యం రాస్తూ ఉండేదాన్ని. కానీ మనం నివసిస్తున్న ఈ సమాజం కుల అసమానతలు, ఆర్థిక అసమానతలు, లింగ అసమానతలతో నిండిపోయి ఉందికదా? నేనెలా ఆనంద సాహిత్యాన్ని సృజింగలను?. నా తరతరాల కన్నిళ్లను, కడగండ్లను, దుఃఖాన్ని, వెతలను, వ్యధలను, వేదనను ఆనందంగా ఎలా చెప్పగలను?. అందుకే నిజమైన జీవితాన్ని, అసలైన సత్యాన్ని సృజించే దళిత స్త్రీవాద సాహిత్యం రాస్తున్నాను. ఇందులో సత్యం ఉంటుంది కనుక
సౌందర్యం కూడా ఉంటుంది.
ఇక నా నేపథ్యం గురించి చెప్పాలంటే …
నేను ఒక చిన్న గ్రామంలో పుట్టాను. మన భారతదేశంలోని ప్రతి గ్రామం లాగే మా గ్రామం కూడా ఊరు (ఆధిపత్య కులాల నివాసాలు) మరియు చేరి (దళితవాడ)గా విడిపోయి ఉండేది. అక్కడ ఐదు వందల అధిపత్య కుల కుటుంబాల మధ్య కేవలం పది దళిత కుటుంబాల్లో ఒకటిలో నేను పుట్టాను.నాకు చెప్పుకోదగిన గొప్ప వంశమూ లేదు, గొప్ప చరిత్రా లేదు. నా తాత పరై (డప్పు) వాయించేవారు. నా తండ్రి కూడా అదే వృత్తి చేసేవారు. తరువాత ఫ్యాక్టరీలో పని చేశారు. నా చిన్ననాట కులాన్ని మూడు సార్లు ఎదుర్కొన్నాను. ఎలా అంటే..
మొదటిసారి – నేను రెండో లేదా మూడో తరగతిలో ఉన్నప్పుడు నాతో చదువుతున్న ఒక అమ్మాయి ఉండేది తన పేరు తేన్మోలి. ఒక రోజు ఆమె నాకు తేనే మిఠాయిలు ఇచ్చింది. మరుసటి రోజు ఆమె మంచితనానికి ప్రతిస్పందించాలనుకుని మా అమ్మ వద్ద మూడు పైసలు తీసుకుని తేనే మిఠాయిలు కొని ఆమెకు ఇచ్చాను. ఆమె దాన్ని స్వీకరించకుండా నేలకేసి కొట్టింది. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. పెరిగేకొద్దీ అర్థమైంది ఆమె తల్లిదండ్రులు ఆమెకు చెబుతుండేవారట: ‘‘దళిత పిల్లలతో కూర్చోకు, మాట్లాడకు, వాళ్లు ఇచ్చింది తీసుకోకు’’అని. ఆ తర్వాత ఎవ్వరూ నాతో మాట్లాడరు. ఎవ్వరూ నాతో ఆడుకోరు. ఎవ్వరూ నా చేతులో నుంచి ఏదీ తీసుకోరు. నేను ఒంటరిగా ఉండిపోయేదాన్ని.
రెండోసారి ఆలయ ఉత్సవాల సమయంలో.
నాన్న పరై (డప్పు) వాయించి ఇంటికి వచ్చినప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేసేవారు:
‘‘నీ నాన్న పరై (డప్పు) వాయిస్తాడు. నువ్వూ పరైచ్చేనా?’’ అని. నాకు ఏడుపొచ్చేది. అవమానంగా అనిపించేది. ముఖం చేతులతో కప్పుకుని, నాన్న వైపు చూడకుండా నడుస్తూ వెళ్లేదాన్ని. పాఠశాలలో దళిత పిల్లలకు నోట్‌బుక్స్ ఇచ్చే సమయంలో మమ్మల్ని నిలబెట్టేవారు. మిగతా విద్యార్థులు మమ్మల్ని ఎగతాళిగా నవ్వి పరిహసించేవారు. అది నా మనసుకు ఎప్పటికీ మానని గాయంగా ఉంది.
కొన్నేళ్ల తర్వాత నేను ‘‘పరయచ్చి’’ అనే కవిత రాశాను. నన్ను అవమానించడానికి వాడిన అదే పదాన్ని నేను నా సాహిత్యంలోకి తీసుకుని ఆత్మగౌరవంగా మార్చి సమాజంపై తిరిగి విసిరాను. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నాను ‘‘అవును, నేను పరయచ్చినే (దళితురాలనే)’’.
మూడోసారి – ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాకు నోట్‌బుక్కు లేదు, పుస్తకాలు లేదు. కాని క్లాసులో టీచర్ చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విని చదువుకునేదాన్ని. తరగతిలో అగ్రస్థానంలోనే ఉండేదాన్ని. కానీ నేను దళితురాలని మా టీచర్ నన్ను చివరి బెంచిలో కూర్చోబెట్టేది. ఇతరులందరికీ వారి బాల్యంలో చెప్పుకోదగిన ఎన్నో సంతోషకరమైన కథలు ఉంటాయి. కానీ నాకు అవి ఏవీ లేవు. ఇలా పదిహేనేళ్ల పాటు… ఎవ్వరూ నాతో మాట్లాడకుండా, ఎవ్వరూ నాతో ఆడుకోకుండా, ఎవ్వరూ నాతో కలిసి కూర్చొని భోజనం చేయకుండా గడచిన నిశ్శబ్ద యుగాలు… చీకటి సంవత్సరాల్లా గడిచిపోయాయి.
ఇప్పుడు నేనీ ‘‘సమాజం ముందు ఉంచే ప్రశ్న ఒక్కటే-నేను కోల్పోయిన పదిహేను సంవత్సరాల బాల్యాన్ని ఎవరు తిరిగి ఇస్తారు?’’
నన్ను పక్కన పెట్టినా నేటికీ భారతదేశంలోని దళితులు అనేక మంది, ఎప్పటికీ తిరిగి పొందలేని నష్టాలతో కూడిన జీవితం గడుపుతున్నారు. దీనిపై సమాజం ఏమంటుంది? మా జీవితాలకు న్యాయం ఎక్కడుంది? అంబేడ్కర్ గారు అన్నట్లుగా ‘‘విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం’’. అందుకే నేను విద్యను, రచనను నా ఆయుధాలుగా పట్టుకున్నాను.
నా రచనా ప్రయాణం 1990లలో ప్రారంభమైంది. అది తమిళ భాషలో స్త్రీవాద రచనకు ఒక కీలక దశ. అప్పటి దాకా మహిళా రచనలు ప్రధానంగా మహిళల జీవితం, పోరాటాలు, కుటుంబ సమస్యల చుట్టూ తిరిగేవి. కానీ ఆ కాలంలో స్త్రీ విముక్తి, శరీర రాజకీయాలు, శరీర భాష వంటి తీవ్రమైన విషయాలను ఘోరమైన మాటలుగా మార్చడం ప్రారంభించాయి. నేను దళిత ఆలోచన, స్త్రీవాదం, దళిత స్త్రీవాదం వైపు సాగాను. స్త్రీ విముక్తి స్త్రీ శరీరం విముక్తితోనే ప్రారంభమవుతుంది. ఆ శరీరంపై లింగ వివక్ష, కుల ఆధారిత లైంగిక హింస, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, పురుషాధిపత్యం ఇవన్నీ పనిచేస్తాయి. ఈ శరీరాన్ని విముక్తం చేయడం దానిపై రుద్దిన అధికారాన్ని ప్రశ్నించడం, ప్రతిఘటించడం.
అదే శరీర రాజకీయాలు, శరీర భాష పై రాయడం వల్ల మేము అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాము. పత్రికల్లో మమ్మల్ని తీవ్రమైన మాటలతో దూషించారు. ‘‘సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినవాళ్లు’’ అని ముద్ర వేశారు. చెన్నై మౌంట్ రోడ్డుపై మహిళా కవయిత్రులను పెట్రోల్ పోసి కాల్చేయాలని లైవ్ టెలివిజన్ చర్చల్లో బెదిరించారు. ఇప్పుడు కూడా నేను అలాంటివి ఎదుర్కొంటున్నాను. ఏదో నన్ను వెంటాడుతూనే ఉంది. బహుశా అది కులమే కావచ్చు.
నా లక్ష్యం మహిళా విముక్తి , సామాజిక విముక్తి.
వీటిని గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వ అధికారాన్ని, హిందుత్వ భావజాలాన్ని ప్రశ్నించడం తప్పనిసరిగా మారుతుంది. ఈ విధమైన ప్రశ్నల ముందు నిలబడేవారు రచయితలే. ఎందుకంటే తమ రచనల ద్వారా ఈ శక్తుల నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపుతారు. అందుకే నాకూ విచారణలు, నిరంతర నిఘా విధించబడిరది. ఇప్పుడు కూడా నేను నిఘా నీడలో ఉన్నట్టుంది. ఇది ఏ సృజనశీలులకైనా ఒక బెదిరింపు చిహ్నమే కదా!. కానీ, ప్రజల కోసం రాస్తున్న సృజనశీలులు ఈ బెదిరింపులను దాటి ముందుకు సాగుతారు. నేనూ ప్రజల కోసం రాసే కవయిత్రినే. సమాజం కోసం రాసిన అనేక మంది నేడు జైలులో ఉన్నారు. కల్బుర్గి, గౌరి లంకేష్, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పంసారే వంటి వారు హతమార్చబడ్డారు. వారితో పోలిస్తే మనమంతా అతి సాధారణమైనవాళ్లమే!
కొన్ని సంవత్సరాల క్రితం ఢల్లీి విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సిలబస్ నుంచి నా కవితలతో పాటు రచయిత్రి బామా మరియు మహాశ్వేతా దేవి రచనలను కూడా తొలగించారు. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ముఖా. స్టాలిన్ ఖండిరచారు. భారతదేశం నలుమూలల నుండి వెయ్యిన్నర మంది రచయితలు మరియు సామాజిక కార్యకర్తలు ఒకే ప్రకటనను జారీ చేసి ఢల్లీి విశ్వవిద్యాలయానికి పంపారు. ఇది స్వతహాగా జరిగింది. అదే నా రచన యొక్క విజయము. ఇది ఆ సమయంలో ఒక సామాజిక సమస్యగా పరిగణించబడిరది, సామాన్య ప్రజలు సైతం స్పందించారు. ఇది నాకు ధైర్యమిస్తుంది. నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ఇంకా, కొన్నేళ్లకు ముందు కేంద్ర పార్లమెంటరీ కమిటీ ఒక సిఫార్సు చేసింది:
‘‘సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయితలు ఆ అవార్డులను తిరిగి ఇవ్వకుండా ఉండాలి’’ అని. ప్రొఫెసర్ కల్బుర్గి కాల్చి చంపబడినప్పుడు ప్రభుత్వ మౌనానికి వ్యతిరేకంగా దాదాపు ఇరవై మంది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చారు. అది ప్రతిఘటనలో పర్వత శిఖరం.
అవార్డును తిరిగి ఇవ్వడం అనేది ఒక నిరసన స్వరం, తిరుగుబాటు చర్య, అధికారానికి వ్యతిరేక విధానం.
సామాజిక మార్పు కోరుకునే రచయితలు చేయగల మార్గం ఇదే. రెండు సంవత్సరాల క్రితం నేను కూడా ఒక అవార్డును తిరస్కరించాను. అది ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్’ అందించే దేవి అవార్డు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి పన్నెండు ఉత్తమ రచనలు చేసిన మహిళలకు ఇస్తారు. ఆ అవార్డు యొక్క ప్రధాన స్పాన్సర్ అదానీ అని తెలిసిన క్షణం నేను ఆ అవార్డును తిరస్కరించాను. ఎందుకంటే అదానీ అనే వ్యక్తి రాజ్యానికి (ఫాసిస్టు, హిందూత్వ) యొక్క మరో ముఖం. ప్రజా రంగ సంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు ఎంతో కొంత అతని చేతుల్లోనే ఉన్నాయనీ హిండెన్‌బర్గ్ నివేదికలోని విషయం. నేను ఆ దేవి అవార్డు స్వీకరించి ఉంటే, నా ముప్పై ఏళ్ల రచనా ప్రయాణం, నా ఆలోచనలు, నా సిద్ధాంతాలు, నా భావజాలం, నా సూత్రాలు, నా చర్యలు, నేను నమ్మే నేను ఆచరించే అంబేద్కరిజం-పెరియారిజం-మార్క్సిజం అన్నీ అర్థహీనమైపోయేవి. ఒక అవార్డు కోసం నేను నా రచనను ఎప్పటికీ అమ్ముకోను.
తమిళనాడులో ప్రజా కవి ఇంకులాబ్ సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించారు. నేను ప్రభుత్వానికి సంబంధం లేని అవార్డును న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు అదానీ గ్రూప్ కలిపి ఇచ్చే దేవి అవార్డును తిరస్కరించనాని, కేంద్ర ప్రభుత్వం నాపై దర్యాప్తుకు ఆదేశించింది. ఇది విచిత్రమే కాదు.ఇది హాస్యాస్పదం కూడా. నా రచనలు నిజాయితీతో కూడినవి. అవి నా స్పష్టమైన నమ్మకాల నుంచి పుట్టినవి. అవి ఆత్మగౌరవంతో కూడినవి. అవి దృఢమైనవి. ఎవరి జాలి, ఎవరి కరుణ కోరవు. అవి పాఠకున్ని వెలుగులో ఉంచుతాయి. అవి సమానత్వాన్ని డిమాండ్ చేస్తాయి. అవి సామాజిక న్యాయాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా, అవి తాత్వికతను మరియు స్వాభిమానాన్ని నిలబెడతాయి. మన ముందున్న గోడలు ఏంటి: కులం, మతం, వర్గం, పితృస్వామ్యం, స్త్రీ బంధనం, లింగ అసమానత, మహిళలు మరియు పిల్లలపై హింస. న్యాయ సమాజం ఎదుగుదలకు అడ్డుగా నిలిచే ఈ గోడలను కూల్చిపారేయాలి. సాహిత్యం ద్వారా అది సాధ్యమే. నవలలు, కథలు, కవితలు, రాజకీయ వ్యాసాలు, ఆత్మకథలు, చిత్రాలు సృజించడం ద్వారా, ప్రణాళిక బద్దమైన కార్యచరణ ద్వారా మన ముందున్న అడ్డుగోడలను కూల్చవచ్చు.
ఇలాంటి యువ సాహిత్య ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి. మీరే రేపటి నక్షత్రాలు. రాయండి. చదవండి. రాజకీయ అవగాహనతో రాయండి. రాజకీయ అవగాహనలేని రచనతో సమాజానికి ఉపయోగం లేదు, మనకూ ఉపయోగం లేదు. కాబట్టి మన రచనను అన్యాయ గోడల ఎదుట నిలబెట్టాలి. విద్య ఒక శక్తివంతమైన ఆయుధం. కానీ రచన రెండువైపులా పదునైన కత్తి. ఆ ఆయుధంతో ఈ గోడలను కూల్చుదాం. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛలను నిర్మిద్దాం. అన్యాయానికి ఎదురు నిలిచేలా మన రచనను ఉపయోగిద్దాం. తిరుగుబాటు చేద్దాం. గోడలను కూల్చుదాం.
(సారంగ వెబ్ మ్యాగజైన్ నుండి…)
