తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ మహిళల కథలు – వికాసం, విస్తృతి, వైవిధ్యం’’ అనే అంశంపై 15 నవంబర్ 2025 నాడు సింపోసియం నిర్వహించారు. ఈ సదస్సుకు సాహిత్య అకాడమీ బెంగుళూరు శాఖ కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర టి.ఎస్.రాజు స్వాగతోపన్యాసం ఇస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తున్న ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల ప్రాముఖ్యత, చేస్తున్న కార్యక్రమాల వార్షిక ప్రణాళికలను వివరించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల డీన్, సదస్సు నిర్వాహకులు ఆచార్య కరిమిండ్ల లావణ్యగారు ప్రారంభోపన్యాసం ఇస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరిని ఉత్సాహపరుస్తూ ఉపన్యాసించారు. వారి ఉపన్యాసంలో మొత్తం ప్రపంచంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎంతో ప్రభావం చూపించిందని, రైతాంగ పోరాటమే తెలంగాణ మహిళలు కథలు రచించడానికి ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆచార్య కరిమిండ్ల లావణ్య గారు రచించిన సాహితీ కిరణాలు అనే విమర్శన వ్యాసాల సంపుటిని ఎస్వీ సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సాహితీ కిరణాలు అనే పుస్తకాన్ని అందించారు.
సాహిత్య అకాదెమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణగారు ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ మూలాలు తెలంగి, తెలుగు నుండి వచ్చాయని కట్ట శేఖర్ రెడ్డి గారు పేర్కొన్నట్లు తెలిపారు. తెలంగాణ తొలితరం కథకులుగా వట్టికోట ఆళ్వారుస్వామి నిలుస్తారని తెలిపారు.
మనిషికి ఊహ తెలిసినప్పటి నుండి కథలు చెప్పే సంప్రదాయం ఉంది. లిపి లేక ముందు బొమ్మల ద్వారా, చిత్రాల ద్వారా, సైగల ద్వారా తమ అభివ్యక్తిని తెలిపారు. ఆశు సంప్రదాయం ద్వారా కథలు చెప్పారు. రామాయణ, భారత, భాగవత కథలూ అలాంటివే. సింహాసన ద్వాత్రింశికలో సాలభంజికలు చెప్పిన కథలున్నాయి. ఆధునిక కాలంలో ఆంగ్లంలోని షార్ట్ స్టోరికి సమానార్థకంగా కథానిక అంటున్నాం. ఈ కథానిక రచన తెలంగాణలో బండారు అచ్చమాంబ నుండి ప్రారంభమైంది. క్రమంగా నందగిరి ఇందిరాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, పాకాల యశోదారెడ్డి, మాదిరెడ్డి సులోచన, పొల్కంపల్లి శాంతాదేవి, తెన్నేటి సుధాదేవి, అమృతలత, ముదిగంటి సుజాతారెడ్డి, రేగులపాటి విజయలక్ష్మి, గీతాంజలి, సమ్మెట ఉమాదేవి, జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, జాజుల గౌరి, గోగు శ్యామల, నెల్లుట్ల రమాదేవి, సూర్యాధనంజయ్, ఎం.దేవేంద్ర, బద్దం అనసూయ, భండారు విజయ, తాయమ్మ కరుణ, స్వర్ణ కిలారి, తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి, షాజహానా, రుబీన్ పర్వీన్ తదితరులు తెలంగాణలో ప్రముఖ కథా రచయిత్రులు వీరి కథలను చదువవలసిన అవసరం నేటి సమాజానికి ఎంతో ఉందని ఆచార్య ఎస్వీ సత్యనారాయణగారు తెలిపారు.
మొదటి సమావేశానికి తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు పి. కనకయ్యగారు అధ్యక్షత వహిస్తూ తెలంగాణలో మాత్రమే కాదు తెలుగు సాహిత్యంలోనే ఎంతో మంది స్త్రీలు చరిత్రలో నిలిచిపోయారని, వారి జీవితాలను ఆధారంగా చేసుకుని వారిపై కథలు, నవలలు వెలువడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
మొదటి సమావేశంలో ఆచార్య వంగరి. త్రివేణిగారు తొలితరం కథలు (1956 వరకు) అనే అంశం పైన పత్ర సమర్పణ చేశారు. ఆచార్య త్రివేణి మాట్లాడుతూ తొలితరం తెలంగాణ కథల ప్రారంభం నుండి 1956 వరకు వెలువడిన కథలను గురించి పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలోనే తొలి కవయిత్రిగా మొల్ల కనిపిస్తుంది అని చెప్తారు కానీ ఆమె కంటే ముందే కుప్పాంబిక రచనలు చేసిందని పేర్కొన్నారు. కథా సాహిత్యానికి గురజాడను ఆద్యుడుగా పేర్కొంటారు కానీ ఆయనకంటే ముందే తెలంగాణ ప్రాంతం నుండి కథలు వెలువడ్డాయని పేర్కొన్నారు. తెలుగులోనే తొలి కథా రచయితగా బండారు అచ్చమాంబగారు నిలుస్తారని పేర్కొన్నారు. ఆంధ్రుల పరిపాలన మూలంగా తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రాలేకపోయిందని వివరించారు.
1956 నుండి 1970 మధ్య వచ్చిన కథలను సంధి యుగ కథలుగా చెప్పవచ్చని ఎన్.సంధ్యారాణి అన్నారు. యశోదారెడ్డిగారు అచ్చమైన తెలంగాణ భాషలో తెలంగాణ చరిత్రను సుస్థిరపరిచేలా కథలు రాశారని చెప్పారు. ఆనాటి కథల్లో స్త్రీ పురుష సంబంధాలపై కథలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. కుటుంబాలకు సంబంధించిన కథలు కూడా సంధి యుగంలో వెలువడ్డాయని పేర్కొన్నారు.
1971 నుండి 1995 మధ్యకాలంలో వెలువడిన కథలపై ఎన్.రజిని పత్ర సమర్పణ చేశారు. రచయితలు పుట్టిన కాలాన్నే కాదు వారు చైతన్యం పొంది రచనలు చేసిన కాలాన్ని ప్రామాణికంగా చూడాలన్నారు. వారి జీవితం కంటే వారి సాహిత్య జీవితం ఎలా ప్రారంభమైందనే విషయాలని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. వారి రచనకు ప్రోత్సాహం ఎక్కడ నుంచి లభించిందో దానినే మన సాహిత్యానికి పునాదిగా స్వీకరించాలని పేర్కొన్నారు. స్త్రీలు రచయితలుగా ప్రాచుర్యం పొందకపోవచ్చు కానీ వారి కథలలో వస్తువు మాత్రం ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉందని కథలు రాసిన కథా రచయితలు అందరూ కూడా అద్భుతమైన కథలను వెలువరించాని, అందులో విప్లవ కథలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను కేంద్రంగా చేసుకుని కథలు వెలువడ్డాయని వెల్దండి శ్రీధర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం భాష మరియు సాహిత్యం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందిందని, సామాజిక, సాంస్కృతికపరమైన మార్పును మనమంతా ఉద్యమం ద్వారా సాధించామని తెలిపారు. 2014 నుండి 2025 మధ్య కాలంలో సుమారు 56 మంది రచయిత్రులు ఆక్టివ్ గా కథలు రాస్తున్నారని ఈ సదస్సుకోసం వారి 108 కథలను పరిశీలించానని అందరూ అద్భుతమైన కథలు రాస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కథా రచయిత్రులు అటు ఆనాడు తెలంగాణలో ఉన్న ఆధిపత్యాన్ని, ఇటు కుటుంబంలో స్త్రీలపై ఉన్న ఆధిపత్యాన్ని ఏక కాలంలో చిత్రిస్తూ కథలు రచించిన ఉద్యమకారులున్నారు. ఆంధ్ర ప్రాంత కథా సంపుటాలను వెలువరించిన కాలంలో ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన కథలను ఎక్కువగా స్వీకరించకుండా తెలంగాణ ప్రాంతం నుండి అనుకున్నంత స్థాయిలో సాహిత్యం వెలువడడం లేదనే విమర్శలు చేశారని పేర్కొన్నారు. అందుకు సమాధానంగానే 2013 నుండి సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ గార్లు కలిసి తెలంగాణ ప్రాంతం నుండి వెలువడుతున్న కథలలో ఉత్తమ కథలను స్వీకరించి కథా సంపుటాలను ప్రతి సంవత్సరం వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం అమరులైన అమరవీరుల మీద, నోట్ల మార్పిడి మీద, ఆర్ టి సి కార్మికుల ఆత్మహత్యల మీద కథలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహాలక్ష్మి పథకం క్రింద స్త్రీల ఉచిత బస్సు ప్రయాణాల మీద కథలు రావడం లేదని, ఇలాంటి ఇతివృత్తాలను ఎన్నుకుని స్త్రీలే కథలు రాయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సమావేశానికి డాక్టర్ లక్ష్మణ చక్రవర్తిగారు అధ్యక్షత వహించారు. రెండవ సమావేశంలో ఎం.దేవేంద్రగారు 1995 నుండి 2014 వరకు రెండు దశాబ్ధాల కథానికల గురించి పత్ర సమర్పణ చేశారు. 1995 తర్వాత తెలంగాణ కథాసాహిత్యంలో ఒక ప్రత్యేక అస్తిత్వ ఉద్యమాల ఉనికి కనిపిస్తుందని ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, మన భాష, మన యాస, మన సంస్కృతి వంటి వాటిని తెలంగాణ కథా రచయిత్రులు వస్తువులుగా స్వీకరించి తమ కథా రచన చేశారని వివరించారు.
సమకాలీన రచయిత్రుల కథలు-వికాసం, విస్తృతి, వైవిధ్యం, తెలంగాణ తెలంగాణేతర రచయిత్రుల కథల్లో ఎలా ఉందో వివరిస్తూ, మైసూరు నుండి వచ్చిన బత్తుల వెంకటేశ్వర్లు ఇలా చెప్పారు. తెలంగాణ రచయిత్రుల కథల్లో ప్రాంతీయతా ప్రాధాన్యం, స్త్రీవాద చైతన్యం, వలసలు, కార్మిక సమస్యలు, పొరుగువారితో బంధాలు, కఠినమైన ప్రయోజనవాద జీవితం, తెలంగాణ యాస, సహజ అభివ్యక్తి, స్త్రీలకు అన్ని రంగాల్లో విముక్తి వల్ల కలిగే ప్రయోజనంలో స్పష్టత, సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకడం కనిపిస్తాయి. తెలంగాణేతర రచయిత్రుల కథల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో స్పష్టత, ప్రేమ, కుటుంబ బంధాలు, సంఘర్షణలు, సాంప్రదాయంతో కూడిన ఆధునిక భావజాలం, భావోద్వేగమైన వ్యక్తిత్వ వివరణ, ప్రాచుర్యంలో ఉన్న రైతు భాష, ఆత్మవిశ్వాసం, క్రమంగా పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుదల కనబడుతుంది. తెలంగాణ రచయిత్రుల కథల్లో స్త్రీ అనుభవం, అసామాన్యత, ప్రాంతీయ సమస్యలకు తీవ్ర ప్రాధాన్యత కనబడుతుంది. తెలంగాణేతర కథలలో స్త్రీ జీవితాల ప్రశ్నలు, ప్రస్తుత సవాళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే, భాషా వాడుక విషయంలో ఈ రెండు ప్రాంతాల్లో విశిష్టత స్పష్టంగా కనిపిస్తుందని వెంకటేశ్వర్లు చెప్పారు.
ముగింపు సమావేశంలో ప్రముఖ కథారచయిత్రి, నవలాకర్త, పరిశోధకురాలు, విమర్శకురాలు డా. ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కథ ప్రారంభ దశ నుండి వికాస దశకు చేరుకున్న సందర్భాలను ప్రస్తావించారు. స్త్రీల కథారచనకు బీజాలుగా నిలిచిన సమాజ స్థితిగతులను వివరించారు. మొదటి కథారచయిత్రి భండారు అచ్చమాంబ తెలంగాణ నుండే ఉన్నారని గుర్తుచేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి వచ్చిన తెలుగు భాషోపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
