మహిళలపై హింస కేవలం శారీరకమే కాదు… ఆర్థిక నియంత్రణ, భావ వ్యక్తీకరణ పై ఆంక్షలు, స్వేచ్ఛను నిరాకరించడం, కుల–మత–వర్గ వివక్షలు… ఇవన్నీ హింస రూపాలే.
– ఈ సంవత్సరం ఒక బిలియన్ వ్యక్తులం లేచి వస్తున్నాం – భయం లేని జీవితం కోసం – గౌరవంతో కూడిన జీవన హక్కు కోసం
– సమాన అవకాశాల కోసం – శరీర స్వాతంత్రం కోసం – న్యాయం కోసం
ఈ సంవత్సరం శతకోటి ప్రజాగళం జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన కార్యక్రమాలను విభిన్నమైన రీతుల్లో జరుపుకుంటున్నాం. మహిళలు, పిల్లల మీద భయానక రీతిలో పెరిగిపోతున్న హింసకు తోడు భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి, భారత దేశానికి ప్రాణవాయువు లాంటి లౌకిక స్పూర్తిని ధ్వంసం చేయాలని చూస్తున్న మత శక్తుల ప్రాబల్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపద్యంలో మనం శతకోటి ప్రజాగళం జరుపుకోవాలని, ఈ కార్యక్రమం ద్వారా మనం కూడా మన గొంతుని స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాం.
వన్ బిలియన్ రైజింగ్ జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రపంచ మహిళల గ్లోబల్ ఉద్యమం.
ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు జీవితంలో ఎప్పుడో ఒకసారి శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తారని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మహిళలు హింసకు గురవుతున్నారు.
ఈ వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, మహిళలపై హింసను అంతమొందించాలనే సంకల్పంతో, అమెరికన్ రచయిత్రి, మహిళా హక్కుల ఉద్యమకారిణి ఈవ్ ఎన్స్‌లర్ 2012లో వన్ బిలియన్ రైజింగ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆమె రచించిన ప్రసిద్ధ నాటకం “ ది వజైనా మోనోలాగ్స” ద్వారా మహిళలపై హింస అనే సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చారు.
ఎందుకు ఫిబ్రవరి 14
ప్రేమ దినంగా భావించే ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, యువతులు, మద్దతుదారులు ఒకేసారి లేచి నిలబడి హింసకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తారు. ప్రేమ అంటే గౌరవం, సమానత్వం, భద్రత అని ప్రపంచానికి గుర్తు చేసే రోజు ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం 2013లో మొదటిసారి జరిగిన ఈ ఉద్యమంలో 200కు పైగా దేశాల్లో కార్యక్రమాలు జరిగాయి. నృత్యం, కళలు, సభలు, చర్చలు, ర్యాలీలు వివిధ రూపాల్లో మహిళలు హింసకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద గ్లోబల్ మహిళా నిరసనలలో ఒకటిగా గుర్తించబడింది.
భారతదేశంలో డిల్లీ నిర్భయ ఘటన తర్వాత మహిళా భద్రతపై దేశ వ్యాప్తంగా చైతన్యం పెరిగింది. భారతదేశంలో అనేక మహిళా సంఘాలు, యువజన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి.
ఉద్యమ లక్ష్యాలు
మహిళలపై హింస నిర్మూలన
శరీర స్వాతంత్య్రం
లైంగిక న్యాయం
ఆర్థిక, సామాజిక సమానత్వం
గౌరవంతో జీవించే హక్కు
మన పిలుపు
ఒక బిలియన్ మహిళలు సమస్యల్లో ఉన్నప్పుడు
మన మౌనం అన్యాయం.
హింసకు కాదు… గౌరవానికి అవును చెబుదాం
భయానికి కాదు… స్వేచ్ఛకు అవును చెబుదాం
మనం లేచి వస్తాం
మనం కలిసి వస్తాం
మనం మార్పు సృష్టిస్తాం.
వన్ బిలియన్ రైజింగ్ 2026
స్వేచ్ఛ కోసం… సంఘీభావం కోసం లేచి నిలబడదాం
ఒక బిలియన్ మహిళలు
అంటే ఒక బిలియన్ మహిళల గుండెల్లో వేదన
ఒక బిలియన్ మహిళల కథల్లో నిశ్శబ్ద కేక
ఆ నిశ్శబ్దాన్ని చెరిపివేయడమే… ఒన్ బిలియన్ రైజింగ్.
