నేనో జలప్రవాహాన్ని
ఎచ్చోట ఆవిర్భవించితినో
మరెచ్చోట ఐక్యమైతనో ఎరుగకనే
సాగిపోతున్న ఆర్ద్ర గీతాన్ని
అలుపెరుగక
కదిలిపోతున్న జీవనదిని ..
వంకలు టింకలుగా సాగిపోయే
నా అడుగుల సవ్వడి
పుడమి తల్లికి పులకరింతల పరవశాలు
నా నడకల కింద
తన అరచేతులను పరచి లాలిస్తుంది.
నేను పల్లవించిన చోటల్లా
పట్టంచు పచ్చచీర పురి విప్పుతూంటుంది
జీవి ఆవిర్భావం
జీవజాలం మనుగడ
నాలోంచేనని తెలిసీ,
కాలుష్యకాసారాన్ని నాలోకి ఒంపి
చేతులు దులుపుకుంటారు
ఎక్కిన కొమ్మ నరుక్కునే మూర్ఖులు
విసిగి వేసారి వికటించి
ఘనీభవించాలను కుంటాను కానీ,
అది నా తత్వం కాకే,
ఒక్కోసారి ప్రళయాగ్నినై
పొంగి ఉప్పొంగి ప్రక్షాలింపచేసుకుంటా.!
తిరిగి ఓ మారు జలపాతమై
అఖాతమై
అలల తరంగిణినై
శిఖరాల శిరస్సులోంచి తేలిపోతో
సాగిపోతూనే ఉంటా..!
మిత్రులారా..
ఓసారి ఆలోచించండి
తల్లి ఒడిలా అందరికీ ఆప్యాయత పంచాను.
ఒకప్పుడు నా తీరాల్లో నాగరికథలు
వెల్లి విరిసేవి,
మానవ హృదయాలు విశ్రాంతి పొందేవి…
కానీ,
ఈ రోజుల్లో
నా గాథ మారిపోయింది మిత్రమా
నా అలలలో ఇప్పుడు
పిల్లల నవ్వులు కాదు
ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి,
నా నీలి నీళ్ళు
నిశ్శబ్దంగా నలుపెక్కుతున్నాయి
మీ ప్రగతి
మీ అభివృద్ధి
నా ఊపిరిని బిగిస్తున్నారు
నా ప్రాణాలను తరిగేస్తోన్నారు
నేను కేవలం ఒక నదిని కాదు,
మీ జీవన రేఖను గీసే గీతను
నేను ఎండిపోతే
మీ పంటలు కన్నీళ్లు కారుస్తాయి,
నేను కలుషితం అయితే
మీ భవిష్యత్తే చీకటవుతుంది.
ఒక చినుకును కాపాడితే
ఒక ప్రవాహం బ్రతుకుతుంది,
ఒక చెట్టును నాటితే
ఒక జీవనదికి ఊపిరి వస్తుంది
మిత్రమా
ఇంకా ఆలస్యం చేయకండి,
నన్ను నా లాగే స్వచంగా ప్రవహింప నీయండి
అప్పుడు మాత్రమే
మీ జీవితాలు పచ్చగా నవ్వుతాయి.
