నిన్నటి దాకా నన్ను సమాధానపరిచి, ముందుకు నడిపిన…
నా అక్షరాలే నన్ను ప్రశ్నిస్తున్నాయి…
ఇప్పటి వరకు ముందుకు ఉరకమని, ఉరమమని ఉడికించిన నా పదాలే..
ఇప్పుడు నన్ను కాస్త ఊపిరి తీసుకోమంటున్నాయి.
ఇప్పటి దాకా వెక్కివెక్కి ఏడ్చినప్పుడు ఊరడించిన నా వాక్యాలే నన్ను వెక్కిరిస్తున్నాయి.
ఇన్నేళ్లు జలపాతంలా దుమికి వచ్చిన నా పాటలే…
ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు తరిచి చూసుకోమంటున్నాయి.
ఇంత కాలం పాదాలను లయబద్దంగా నడిపించిన నా పద్యాలే..
ఈ సారి పెదాల నుండి రాబోయే పదాల కూర్పును మరింత ఓర్పుతో నేర్పుతో… సృజియించమంటున్నాయి.
ఇకనుంచి..
వాక్యాల నడుమ కనబడని అర్థాలతోబాటు…
పదాల మధ్య ఖాళీలను;
అక్షరాల మధ్య పడి కాన్పించని అంతరంగాలను కూడా అర్థం చేసుకోమంటున్నాయి.
తిరిగి తిరిగి మళ్ళీ పుట్టిన నేల లోపలికి దూరి,
జన్మస్థలపు విత్తన కేంద్రాన్ని తడిమి…
ఈ సారి మరింత పైపైకి విజృంభించమంటున్నాయి.
