ఒక కాలంలో చర్చనీయ అంశాలుగా ఉన్నవి మరో కాలంలో వచ్చిన సామాజిక మార్పుల నేపథ్యంలో అవి మనకు కనపడక పోవచ్చు. అంటే కనపడక పోవడానికి సామాజిక మార్పులే కారణం.
కుం. వీరభద్రప్ప (పూర్తి పేరు: వీరభద్రప్ప కుంబార్) ప్రముఖ కన్నడ సాహిత్యవేత్త. ఆయన కుం.వీ (ఖuఎVవవ) అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉండే కొట్టూరులో ఉంటారు. సుమారు 30 నవలలు, 15 కథా సంపుటులు ప్రచురించారు. అరమనే (Aతీaఎaఅవ) నవలకు 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే గౌరీలంకేశ్, కల్బురిగి హత్యలకు నిరసనగా పారితోషికంతో పాటు వెనక్కు ఇచ్చారు. ఆయన హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గత కొన్ని సంవత్సరాల్లో అనేక బెదిరింపు లేఖలు (17కి పైగా) అందుకున్నప్పటికీ, తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్న సాహసి రచయితగా ప్రసిద్ధి చెందారు. కన్నడ సాహిత్యంలో ఆధునిక, ప్రగతిశీల రచయితల్లో ఆయన ఒక ముఖ్య వ్యక్తి.
తెలుగు సమాజంతో మీకు అవినాభావ సంబంధం ఉంది. ఆ అనుబంధాన్ని కొంత వివరిస్తారా?
జవాబు: తెలుగు సమాజం నాకు అన్నం ఇచ్చిన నేల. ఎమర్జన్సీ కాలంలో మేము ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేయడం వలన, కొట్టుర్‌లో మా ఇల్లు పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉండడం వలన, అప్పటి సబఇన్స్పెక్టర్ మా నాన్నకు పరిచయం ఉండడం వలన, మీ కుమారుడిని ఊరు వదలి వెళ్ళమని లేదంటే అరెస్ట్ చేయవలసి వస్తుందని మా నాన్నతో చెప్పారు. అప్పుడు మా నాన్న నన్ను మా అక్కగారి ఊరైన కర్నూలు జిల్లాలోని గూళ్యంకు పంపారు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నేను కర్నూలు జిల్లాపరిషత్‌కు వెళ్లి ఏవైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని అడుగగా కన్నడ టీచర్‌గా నాకు వందవాగిలి అనే ఊర్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా నియామక పత్రం ఇచ్చారు. అలా నేను తెలుగు నేలపై దాదాపు ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసాను. ఇప్పటికీ నాకు జీవిక అయిన పెన్షన్‌ను ఇస్తున్నది తెలుగు నేలనే. మిక్కిలి వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నేను పనిచేయడం వలననే అక్కడి జీవితాలు నా సాహిత్యంలో భాగం కావడం వలననే నాకు కన్నడ నేలపై సాహితీ వేత్తగా మంచి పేరు వచ్చింది. అందువలననే నాకు తెలుగు ప్రజలన్నా, తెలుగు బాష అన్నా ప్రాణం.
గత మÖడేళ్లలో మీకు 17కి పైగా మరణ బెదిరింపు పత్రాలు వచ్చినప్పటికీ, హిందుత్వ భావజాలం, మతీయ ధ్రువీకరణ, సామాజిక విభజనలపై మీ విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ బెదిరింపులు మీ లోపలి ప్రగతిశీల గొంతును ఎలా మరింత బలపరిచాయి? ఇవి మీ రచనల్లోని భావోద్వేగ తీవ్రతను, సామాజిక నిబద్ధతను ఎలా ప్రభావితం చేశాయి — లేదా మీరు భయాన్ని అధిగమించి రాస్తున్నారా?
జవాబు: నేను ప్రజా ఉద్యమాల నుండి తయారైన సాహితీవేత్తను. నేను యÖనివర్సిటీలలో ఏమీ చదువుకోలేదు. ప్రజా ఉద్యమాలలో పనిచేసే వారికి సత్యం మాట్లాడేందుకు భయం ఉండదు. నన్ను చంపుతామని వచ్చిన బెదిరింపులు నాకు మరింత బలాన్ని ఇచ్చాయేగాని నన్ను వెనక్కు మరలేటట్లు చేయలేదు. ఆ బెదిరింపులు ఒక సాహితీ వేత్తగా నేను సరియిన దారిలోనే వెళుతున్నాననే ఎరుకను నాకు కలిగించాయి. కల్బుర్గిని, గౌరీ లంకేష్‌ను వారు భౌతికంగా నిర్మూలించినా వారి భావజాలం ఇప్పటికి సమాజంలో సజీవంగా ఉందికదా! మనలను భౌతికంగా నిర్మూలించగలరే కాని, మన భావజాలాన్ని కాదు కదా?
హిజాబ్ వివాదం సమయంలో 61 మంది ప్రగతిశీల రచయితలతో కలిసి మీరు బహిరంగ లేఖ రాసిన తర్వాత వచ్చిన బెదిరింపులు, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న అణచివేతపై మీ మద్దతు – ఇవి కన్నడ సాహిత్యంలో మైనారిటీ గొంతులను, సెక్యులర్ దృష్టిని ఎలా బలహీనపరుస్తున్నాయి? సమకాలీన కన్నడ రచయితలు ఈ రాజకీయ ఒత్తిడి మధ్య స్వేచ్ఛగా రాయగలుగుతున్నారా, లేక భయం, స్వయం సెన్సార్‌షిప్ పెరిగిందా?
జవాబు: హిజాబ్ వివాదం సమయంలో అరవైఒక్క మంది ప్రగతిశీల రచయితలతో కలిసి బహిరంగ లేఖ రాయడం నా బాధ్యతగా భావించాను. భారతదేశ జనాభా నూట నలభై కోట్లు అయితే అందులో ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్శీలు మైనారిటీలుగా ఉన్నారు. ఈ దేశం అభివృద్దిలో వాళ్ళ పాత్ర కూడా ఉందికదా. మీరు ఎప్పుడైనా డిల్లీలో ఇండియన్ గేట్ దగ్గరకు వెళ్లి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి పేర్లు పరిశీలించండి. అందులో ముస్లిమ్స్ పేర్లే ఎక్కువగా ఉంటాయి. వీరందరూ భారతీయులే కదా? ఈ పది సంవత్సరాలలోనే ఈ ద్వేషం పెంచి పోషింపబడుతోంది. ఈ వివక్షతను ప్రశ్నించే కనీస బాధ్యత రచయితలది. కొంతమంది రచయితలు ఈ బాద్యతను విస్మరించడం వలన రాజ్యం దృష్టిలో వారు మంచివారిగా చలామణి అవుతున్నారు. వివక్షతకు గురి అవుతున్న మైనారిటీల వైపున మనం నిలబడడం ఒక కనీస మానవవిలువ కదా! రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులనే కదా వారు అడుగుతోంది.
మీరు ఇటీవల మహిళల సహకారాన్ని “కన్నడ సాహిత్యంలోని ఊయల”గా, మానవాభివృద్ధికి మÖలంగా పేర్కొన్నారు. మీ స్వంత రచనల్లో “స్త్రీత్వాన్ని పెంచుకోవడం” ద్వారా విజయం సాధించానని చెప్పారు. సమకాలీన కన్నడ సాహిత్యంలో స్త్రీవాద రచయిత్రులు ఎదుర్కొంటున్న బహుముఖ అణచివేతలు (పితృస్వామ్యం, మార్కెట్ ఒత్తిడి, సామాజిక బెదిరింపులు) ఏమిటి? వారి రచనలు సమాజంలో స్త్రీల స్థానాన్ని నిజంగా మార్చగలవా, లేక ఇంకా అంచునే ఉన్నాయా?
జవాబు: మహిళలపై అణచివేత, వారిపట్ల వివక్షత అనేది కన్నడ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుగా ఉంది. కన్నడ సాహిత్యంలో భానుముస్తాక్ గారికి బుకర్ ప్రైజ్ వచ్చిన సందర్భంలో భారత ప్రధాని, హోమ్ మినిస్టర్లు కనీసం అభినందనలు కూడా చెప్పలేదు. కారణం ఆమె ముస్లిం మైనారిటీ కావడం. అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఉన్న వారికే ఈ రకమైన సంకుచిత దృష్టి ఉన్నపుడు మామÖలు వారి పరిస్థితి ఏమిటి? ఒక రచయిత తన రచనలలో స్రీత్వాన్ని పెంచుకున్నపుడే ఆ రచన గొప్ప రచన అవుతుంది. ఈనాడు కన్నడ సమాజంలో అనేక మంది మహిళలు అత్యంత ప్రతిభావంతంగా రాస్తున్నారు.
డిజిటల్ యుగంలో కన్నడ సాహిత్యం యువతకు వేగంగా చేరుతోంది కానీ, లోతైన సామాజిక విమర్శ, ఫ్యూడల్-జాతి వ్యవస్థలపై తీవ్రమైన చర్చలు తగ్గుతున్నాయనే ఆందోళన ఉంది. మీ అనుభవంలో, సోషల్ మీడియా-ఆన్‌లైన్ పబ్లిషింగ్ ఈ లోతును తగ్గిస్తున్నాయా? ప్రగతిశీల సాహిత్యం ఈ డిజిటల్ పరివర్తనలో ఎలా బతికి ఉండాలి, యువ రచయితలను ఎలా ప్రేరేపించాలి?
జవాబు: సమాజంలో వస్తున్న అన్ని రకాలైన మార్పులను సాహిత్యం తనలో భాగం చేసుకోగలిగినపుడే అది నిలబడుతుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న యువత కూడా ఇప్పుడు బాగా రాస్తున్నారు. లోతైన సామాజిక విమర్శ జరుగుతూనే ఉంది. ఒక కాలంలో చర్చనీయ అంశాలుగా ఉన్నవి మరో కాలంలో వచ్చిన సామాజిక మార్పుల నేపథ్యంలో అవి మనకు కనపడకపోవచ్చు. అంటే కనపడక పోవడానికి సామాజిక మార్పులే కారణం. మార్పు శాశ్వతం అంటారు కదా! ప్రగతిశీల సాహిత్యాన్ని మనం పనికట్టుకొని ప్రచారం చేయక్కరలేదు. దాని స్వభావ రీత్యానే అది సజీవంగా ఉండింది.
మీ రచనల్లో కల్యాణ కర్ణాటక గ్రామీణ-దళిత జీవనాలు, జమీందారీ-ఫ్యూడల్ వ్యవస్థల దారుణతలు, జాతి అత్యాచారాలు కేంద్రంగా ఉన్నాయి. సమకాలీన కన్నడ సాహిత్యంలో ఈ అంశాలు ఇంకా ప్రాధాన్యత పొందుతున్నాయా? లేక మధ్యతరగతి-పట్టణ జీవనాలు, మార్కెట్-ఓరియెంటెడ్ రచనల వైపు సాహిత్యం మళ్లుతోందా? ఈ మార్పు సామాజిక న్యాయానికి ఎలాంటి ప్రమాదం కలిగిస్తోంది?
జవాబు: నేను పుట్టింది కర్ణాటకలో అయినా సామాజిక జీవిత అనుభవాలు అన్ని పొందినది తెలుగు సమాజంలోనే. కల్యాణ కర్ణాటక గ్రామీణ-దళిత జీవనాలు, జమీందారీ-ఫ్యూడల్ వ్యవస్థల దారుణతలు, జాతి అత్యాచారాలు కేంద్రంగా ఉన్నాయి. సమకాలీన కన్నడ సాహిత్యంలో ఈ అంశాలు ఇంకా ప్రాధాన్యత పొందుతుంటాయి. కారణం ఇప్పటికి డెబ్భైశాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే నివశిస్తున్నారు. దళితులపైన, స్రీలపైనా అణచివేత దోపిడీ కొనసాగుతూనే ఉంది. అయితే అవి తమ రూపాన్ని మార్చుకున్నాయి. మీరు ఇప్పటి కన్నడ సాహిత్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం ద్రువపడుతుంది. అదే సమయంలో పట్టణ జీవనాలు, మార్కెట్-ఓరియెంటెడ్ రచనలు కూడా సాహిత్యంలో భాగం అవుతున్నాయి. నాకు తెలిసి సాహిత్యం సామాజిక న్యాయానికి ప్రమాదం కలిగించే కారకం కాదు. ఒకవేళ ఆ లక్షణం ఆ సాహిత్యానికి ఉంటె అది నిలబడదు.
కన్నడ సాహిత్య అకాడమీ, పురస్కార వ్యవస్థలు, సాహిత్య సంఘాలు – ఇవి నిజంగా అణగారిన వర్గాల (దళిత, మైనారిటీ, మహిళల) గొంతును ప్రతిబింబిస్తున్నాయా? మీరు ఎదుర్కొన్న బెదిరింపులు, సామాజిక ఒత్తిళ్ల నేపథ్యంలో – ఈ సంస్థలు ప్రగతిశీల రచయితలను రక్షించడం, ప్రోత్సహించడంలో విఫలమవుతున్నాయా? లేక ఇంకా శిష్ట-ప్రధాన, ఆధిపత్య ధోరణి ఆధిపత్యంలోనే
ఉన్నాయా? మీ అనుభవం ఆధారంగా ఏమి చెప్పగలరు?
జవాబు: ఇటీవల కాలంలో కన్నడ సాహిత్య అకాడమీ, పురస్కార వ్యవస్థలు, సాహిత్య సంఘాలు అణగారిన వర్గాల సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానికి కారణం ఆయా వర్గాల ఉద్యమాలే. నాకు వచ్చిన బెదిరింపుల విషయంలో ప్రగతిశీల శక్తులు అన్నీ నావైపు నిలబడ్డాయి. అయితే నేను ఒక మారుమÖల పల్లెలో నివశిస్తున్న కారణంగా పట్టణ ప్రాంతాల నుండి మద్దతు పొందలేకపోయాను అనిపిస్తుంది. ఒక యÖనివర్సిటీలో ఉన్న వారికి వచ్చే మద్దతు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి వచ్చే మద్దతులో తప్పకుండా తేడా
ఉంటుంది కదా! అయినప్పటికీ సంస్థలు ప్రగతిశీల రచయితలను రక్షించడం, ప్రోత్సహించడంలో తమ పాత్రను చక్కగా పోషిస్తునే
ఉన్నాయి. బెదిరింపులు ఏవీ నా ప్రయాణాన్ని ఆపలేవు.
(సారంగ వెబ్ మ్యాగజైన్ సౌజన్యంతో….)
