శాంతాసిన్హాగారి పేరు జగద్వితం. పద్మశ్రీ, రామన్ మెగసెసే లాంటి పలు అవార్డుల గ్రహీత. ఆమె చేసిన పని, సాధించిన విజయాలు చరిత్రలో శాశ్వతంగా చోటు చేసుకున్నాయి. దాదాపు రెండు వేల గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ పునాది స్థాయి నుంచి తుడిచి పెట్టుకుపోయింది.
సుమారు 15 లక్షల మంది బాలకార్మికులు ఆమె కృషివల్ల ఈనాడు గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో మామిడిపూడి వెంకటరంగయ్య సంస్థ సాధించిన విజయం అది. ఇప్పటికీ పిల్లల కొరకు పనిచేస్తున్నారు. “చేస్తూ పోయాను. ఫలితాలు వచ్చాయి. నాకు తల్లిదండ్రుల, అత్తమామల నుంచి సపోర్టు చాలా ఉండింది. ఎందుకు చేస్తున్నావని ఎవరూ నన్ను అడగలేదు. వద్దని చెప్పలేదు. పైగా చాలా ప్రోత్సహించారు. ఇలాంటి అవకాశం మన దేశంలో ఎంతమంది స్త్రీలకు ఉంటుంది? ఈ విషయంలో నేను చాలా లక్కీ.” అంటూ చెప్పుకొచ్చిన ఆమె ఈనాడు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆమె విలువైన జీవితానుభవనాలను ఆమె మాటల్లోనే భూమిక పాఠకులకోసం తెలియజేసారు.
ప్ర. నమస్తే మేడం. బాగున్నారా? నేను భూమిక పత్రికకు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
జ. నమస్తే గిరిజా! బాగున్నాను. రండి కూర్చోండి. ఒంటి చేత్తో సత్యవతి గారు చేస్తున్న పనులను చూస్తున్నాను. చాలా గ్రేట్. అందుకే ఆమె నడిపే భూమిక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించాను. చెప్పండి. ఏం కావాలి? మీకు?
ప్ర. మీ అమ్మ, నాన్నల గురించి చెప్పండి.
జ. నాన్న మామిడిపూడి ఆనందం. చార్టెడ్ అకౌంటెంట్. రాజ్యసభ మెంబర్, ఎంపి, ఎం.ఎల్.సి, డిప్యూటి స్పీకర్‌గా కూడా చేసారు. సంగీతం, ఆర్ట్ అంటే యిష్టం. అమ్మ పేరు సీత. ఆ రోజుల్లోనే బీఏ చదివారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలతో తలమునకలై ఉండేవారు. మా కుటుంబంలో 30 మంది దాకా ఉండేవారు. నాన్న రాజకీయనాయకుడు కావడం వల్ల వచ్చే అతిథుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది.
ప్ర. మీ బాల్యం, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. 07/01/1950 తేదీన నేను నెల్లూరులో జన్మించాను. నాకు ఒక అన్నయ్య, నలుగురు తమ్ముళ్ళు. నేను ఒకదానినే అమ్మాయిననే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. చెప్పాను కదా. మాది ఉమ్మడి కుటుంబమని. కజిన్స్ ఉండే వాళ్ళు. అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. సైకిల్ తొక్కే వాళ్ళం. సినిమాలకు వెళ్ళే వాళ్ళం కాదు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చూస్తే ఎక్కువ. సంగీత కచేరీలకు, నాటకాలకు తరచుగా వెళ్ళేవాళ్ళం. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరు నెల్లూరుకు వెళ్ళేదాన్ని. మా అమ్మమ్మ పేరు అల్లాడి అన్నపూర్ణమ్మ. ఆ రోజుల్లోనే ఆమె దళితుల కొరకు హాస్టల్ నడిపేది. సెలవుల్లో ఆ హాస్టల్ పిల్లలతో నాకు చాలా కాలక్షేపం అయ్యేది.
నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు నెల రోజులు తిరుపతిలో ఉన్నాను. రోజూ మేమందరం పిల్లలం (హాస్టల్) దేవస్థానానికి వెళ్ళే వాళ్ళం. దళిత పిల్లలు కూడా గర్భగు& ిదాకా వచ్చేవారు. అక్కడి పూజారులు లైనులో వాళ్ళను చూసి, మీరు వెళ్ళి మిగతా వాళ్ళను కూడా పంపించండి అని చెప్పేవారు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే. ఆ రోజుల్లో దళిత పిల్లలు నిత్యం గర్భగుడిదాకా వెళ్ళడం చాలా విప్లవాత్మకం.
ప్ర. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను ఎనిమిదో తరగతి దాకా సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ తెలుగు సబ్జెక్ట్ లేని కారణంగా మా వాళ్ళు నన్ను ఆ తర్వాత సికింద్రాబాద్ కీస్ హైస్కూల్లో చేర్పించారు. అక్కడ 9 నుంచి 12 తరగతులు చదివాను. అప్పుడు తెలుగులో సంధులు, ఛందస్సు, పద్యాలు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. అయినా ఇష్టంగా చదివాను. అపుడు తెలుగు చదవడం వల్లనే నేను తర్వాతి కాలంలో చేసిన పనిని సులభంగా చేయగలిగాను. నేను చేసిన, చేస్తున్న పని గ్రామీణులతోనే కదా.. డిగ్రీ ఉస్మానియా యÖనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ఆ రోజుల్లో అక్కడ పిజీతోపాటు డిగ్రీ కూడా ఉండేది. ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీతో డిగ్రీ పూర్తి చేసాను. ఎం.ఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేసాను. నాకు హాస్టల్‌లో ఉండి చదువుకోవాలన్న కోరిక
ఉండేది. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ నుంచి పి.హెచ్.డి పూర్తి చేసాను.
ప్ర. మీ వివాహం, సంతానం గురించి చెప్పండి.
జ. మాది ప్రేమ వివాహం. నేను ఎం. ఏ చదువుతున్నప్పుడు నా క్లాస్‌మేట్ అజయ్ కుమార్ సిన్హాతో స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి 03/12/1972న స్టేజి మ్యారేజ్ చేసుకున్నాం. మొదట్లో మా పుట్టింటి వాళ్ళు అంగీకరించలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు 03/ 09/1973న సుధ పుట్టింది. ఆ సమయంలో క్రమంగా అమ్మ వాళ్ళింటికి రాకపోకలు మొదలయ్యాయి. సుధ డాక్టర్. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటోంది. యశోద హాస్పిటల్‌లో ఆంకాలజీస్టుగా పని చేస్తోంది. రెండో అమ్మాయి పేరు దీప. ఆమె ఎకనామిక్స్‌లో ఎం.ఏ, పి.హెచ్.డి చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. అజీం ప్రేమ్‌జీ యÖనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. పిల్లలిద్దరూ ప్రేమ వివాహాలు చేసుకున్నారు. బాగున్నారు.
ప్ర. మీ పుట్టింటి వాళ్ళు మీ వివాహాన్ని మొదట్లో అంగీకరించక పోవడానికి కారణం?
జ. అజయ్ జార్జిరెడ్డితో కలిసి పనిచేసేవాడు. జార్జిరెడ్డి హత్య జరిగి మా పెళ్ళి నాటికి సుమారు ఏడెనిమిది నెలలే అయింది. అందువల్ల భద్రతా సమస్య మా పెళ్ళిని వాళ్ళు అంగీకరించక పోవడానికి కారణమనుకుంటాను.
ప్ర. మీ అత్తవారింటి గురించి చెప్పండి.
జ. మా మామగారు విజయ్ కుమార్ సిన్హా. భగత్ సింగ్ అనుయాయి. బ్రిటిష్ వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవితకాల జైలుశిక్ష అనుభవించాడు. ఆరేళ్ళు రాజమండ్రి జైలులో, తర్వాత అండమాన్ జైలులో ఉన్నారు. అత్తగారి పేరు రాజ్యం సిన్హా. 1952 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. రష్యా వెళ్ళి వచ్చి ‘సోవియట్ మహిళ’ అనే పుస్తకాన్ని రాసారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకురాలు. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖాధికారిగా పనిచేసారు.
ప్ర. మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి.
జ. నా పి.హెచ్.డి పూర్తవగానే 1976లో హైదరాబాదుకు వచ్చాను. ఉస్మానియా యÖనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చేరాను. కోఠి మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థులకు తెలుగులో, ఆర్స్ కాలేజ్ ఎం.ఏ విద్యార్థులకు ఇంగ్లీషులో పాఠాలు చెప్పేదాన్ని. అజయ్ కూడా అదే టైంలో నిజాం కాలేజీలో లెక్చరర్ చేరాడు. నేను 1979లో హైదరాబాద్ సెంట్రల్ యÖనివర్శిటీకి మారాను. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సడన్‌గా 1979 సెప్టెంబర్ ఏడో తేదీన అజయ్ నాకు దూరమయ్యాడు (మరణించాడు). దీప అప్పుడు ఏడాది పాప.
ప్ర. తర్వాత ఏం జరిగింది?
జ. నాకు మా అత్తగారి ఇంట్లోనే ఉండాలని ఉండింది. కానీ పిల్లలు ఉమ్మడి కుటుంబంలో అమ్మ దగ్గర పెరిగితే మంచిదనే
ఉద్దేశంతో నన్ను మా అమ్మ దగ్గరికి వెళ్ళమన్న మా అత్తగారి సూచన మేరకు అక్కడికి వెళ్లిపోయాను. నేను చేసిన పనులకు వాళ్ళ సపోర్టు, అత్తగారి సపోర్టు చాలా ఉండేది. పిల్లల బెంగ కూడా అంతగా ఉండేది కాదు. పిల్లలు ఉమ్మడి కుటుంబంలో అందరి మధ్యలో ఆనందంగా పెరిగి పెద్దయ్యారు.
ప్ర. శ్రామిక విద్యాపీఠం ఏర్పాటు నేపథ్యం ఏమిటి?
జ. పాఠాలు చెప్పడంతోపాటు సామాన్యుల స్థితిగతులు తెలుసుకోవాలన్న తపన ఉండేది. విశ్వవిద్యాలయం స్థాయి ప్రొఫెసర్‌గా ఇంకా ఏదైనా చేయాలని ఉండేది. ఆ సందర్భంలో కాలేజ్ నుంచి వచ్చాక సాయంత్రాలు నా విద్యార్థులతో కలిసి అడ్డగుట్ట, పాన్ బజార్, జేమ్స్ స్ట్రీట్, రాణిగంజ్ లాంటి 15 బస్తీల్లో సర్వే చేసాను. అక్కడ పని చేయవలసిన అవసరాన్ని గుర్తించి “శ్రామిక విద్యా పీఠ” కొరకు ప్రపోజల్ రాసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్‌కు పంపాను. అనుమతితో పాటు గ్రాంటు కూడా వచ్చింది. అలా శ్రామిక విద్యాపీఠ్ 1984-85లో మొదలైంది. అపుడు హైదరాబాదు నుంచి కీసర మండలం పనులు జరిగాయి. ఆ పనిలో సుమారు ఆరువందల మంది వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళకు (దీశీఅdవd Labశీuతీ) విముక్తి కలిగింది. అందులో నలభై శాతం పిల్లలే ఉన్నారు. వాళ్ళకు చదువు నేర్పించడం మొదలైంది. అపుడే పూర్తి స్థాయిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా పనిచేయాలనే ఆలోచన వచ్చింది. శ్రామిక విద్యాపీఠ్ మొదటి డైరక్టరుగా నేనే ఉన్నాను. ఆ పదవీకాలం మÖడు సంవత్సరాలు. నా తర్వాత ఉషారాణి డైరెక్టరుగా వచ్చింది. అది నేను యిష్టంగా తీసుకున్న అదనపు బాధ్యత. విశ్వవిద్యాలయంలో కూడా తరగతులు తీసుకునేదాన్ని.
ప్ర. ఎం.వి ఫౌండేషన్ ఎప్పుడు? ఎలా మొదలైంది?
జ. మామిడిపూడి వెంకటరంగయ్య మా పితామహుడి పేరు. ఆయన 1981లో కీర్తిశేషులైనపుడు ఆయన పేరుతో వీVఖీ మొదలైంది. మొదట్లో ఉన్నత చదువులు కొనసాగించలేని అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఆ సంస్థ నుంచి ఇచ్చేవాళ్ళు. ఇంగ్లీషులో పుస్తకాలను కూడా సంస్థ ప్రచురించేది.
ప్ర. మీ తాతగారి గురించి చెప్పండి.
జ. నా పితామహుడు మామిడి పూడివెంకట రంగయ్య గొప్ప సంస్కర్త. హిస్టరీ ప్రొఫెసర్. మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యావిధానానికి కృషి చేసిన విద్యావేత్త. ఆయనను నేను ఫెమినిస్టు అని కూడా చెపుతాను. తన సహోదరిలు పడిన కష్టాలు చూసిన అనుభవంలో నుంచి అలాంటి కష్టాలు మరే మహిళలకు ఉండకూడదని గట్టిగా అనుకున్నారు. నా చిన్నప్పుడు మా నానమ్మ వంటి చేసిన గుర్తు లేదు. ఆయనే కుంపటి ముందు కూర్చుని, పొగ గొట్టంతో ఊదుతూ వంట చేసేవారు. అందుకే నేను ఆయనను స్త్రీవాదిగా చెప్పాను. మా నానమ్మ పేరు వెంకమ్మ. ఆ రోజుల్లో ఐదో తరగతి చదివింది. ఇంగ్లీషు సాహిత్యం, తెలుగు సాహిత్యం బాగా చదువుకుంది. జాతీయోద్యమంలో పనిచేస్తున్న విద్యార్థులకు అవసరమైనప్పుడు ఆ దంపతులు తమ యింట్లో ఆశ్రయం ఇచ్చేవారు.
ప్ర. యంవిఎఫ్ బాలకార్మికుల గురించి పనిచేయడం ఎప్పుడు మొదలైంది? ఎలా పని చేసింది?
జ. నేను శ్రామిక విద్యాపీఠ్ డైరక్టరుగా ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనాదిశగా పనిచేయాలనే ఆలోచన వచ్చింది. 1991 నుంచి యంవిఎఫ్ ఆ దిశగా పనిచేయడం మొదలు పెట్టింది. అప్పటికే ఆ రంగంలో నేను కొంత పనిచేసి ఉన్నాను. కాబట్టి మా కుటుంబ సభ్యులు, యంవిఎఫ్ బోర్డు సభ్యులు నన్ను దాని ద్వారానే ఆ పనులను చేయమని ప్రోత్సహించారు. అపుడు రాజీలేని సూత్రాలను రూపొందించుకొని, పని మొదలుపెట్టాం.
1. బడిబయట ఉన్న పిల్లలందరూ బాలకార్మికులే.
2 ఏ కారణం చేతనైనా బాలకార్మిక వ్యవస్థను సమర్థించడం నేరం.
3. పిల్లలందరూ బడిలో ఉండడం వాళ్ళ హక్కు. అనేవి అందులో ప్రధానమైనవి. ఈ దిశగా రంగారెడ్డి, వికారాబాద్, శంకర్‌పల్లి మొదలైన చోట్ల పనిచేసాం.
ప్ర. బాలకార్మిక వ్యవస్థలో లింగదృక్పథం ఉందా?
జ. మగపిల్లలు చేసే పనినే చట్టం గుర్తించింది. ఎక్కువగా బాలకార్మికులుగా మగపిల్లలే ఉన్నారు. ఆడపిల్లలు చేసే పనిని కూడా బాలకార్మిక వ్యవస్థకు చెందినదిగా యంవిఎఫ్ గుర్తించింది. పితృస్వామ్య వ్యవస్థ ఆడపిల్ల చేసే పనిని మన భారతీయ సంస్కృతిలో భాగంగా చూస్తుంది. ఇంట్లోని పెద్ద వాళ్ళందరూ పనులకు పోయినప్పుడు తనకంటే చిన్నవాళ్ళయిన తమ్ముడినో, చెల్లెలినో చూసుకునే నెపంతో ఆడపిల్లలు బడి మానేస్తూ ఉంటారు. మంచినీళ్ళు వచ్చినప్పుడు పట్టుకోవడానికి బడి మానేస్తారు. ఇండ్లల్లో పనులు చేసే ఆడపిల్లలు కూడా ఉన్నారు. అలాగే పాఠశాలల్లో సరైన వసతులు లేని కారణంగా (ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో) బడి మానివేయాల్సి వస్తుంది. అందుకే మేం బడిబయట ఉన్న పిల్లలందరూ బాలకార్మికులే అన్న నినాదాన్ని బలంగా ఇచ్చాం.
ప్ర. పనిచేస్తున్న క్రమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి?
జ. పిల్లలు పనిచేయడానికి పేదరికం కారణమని చెప్పడం మమ్మల్ని కలచి వేసింది. చిన్నప్పటి నుంచే పిల్లలకు పనిచేయడం నేర్పించాలనే సంస్కృతి కూడా మనది. ఈ రెండూ కేవలం వంకలు మాత్రమే. యజమానుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఈ విషయంలో మేం చాలా బలంగా మా వాదనలు వినిపించాం. వాళ్ళను కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాం. కొన్ని సార్లు యజమానుల నుంచి భౌతిక దాడుల బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాం. ఎలాగోలాగా యజమానులను ఒప్పించి తీసుకువచ్చిన పిల్లలను బడిలో చేర్పించే సందర్భంలో ఎం.ఇ.ఓలు, హెచ్.ఎం,లు, టీచర్స్ నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బేసిక్స్ కూడా తెలియని వాళ్ళను రెగ్యులర్ బడిలో వాళ్ళ వయసుకు తగిన తరగతిలో వేయాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచించాం. బ్రిడ్జ్ కోర్సులు రూపకల్పన చేసి అందుకోసం క్యాంపులు నిర్వహించాం. యజమానులను ప్రేరేపించడానికి ప్రతి ఏడాది 14 నవంబర్ నాడు ‘విద్యాదానం’ పేరుతో వేడుకలు జరిపించే వాళ్ళం. అందులో భాగంగా పిల్లలు తమ తమ యజమానులను పూలదండలతో సత్కరించేవాళ్ళు.
ప్ర. బ్రిడ్జ్ కోర్సు విధానం గురించి చెప్పండి.
జ. బడిలో ఒకటో తరగతిలో చేర్చుకునే వయసు ఐదు సంవత్సరాలు ఉంటుంది. యజమానులను ఒప్పించి తీసుకువచ్చిన పిల్లల వయసు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వయసున్న పిల్లలను ఒకటో తరగతిలో చేర్చడం వల్ల చిన్న పిల్లలు, కొత్తగా మేం చేర్పించిన పిల్లలు ఇబ్బంది పడతారు. తరగతి క్రమశిక్షణ దెబ్బతింటుంది. కాబట్టి అలా చేర్పించడానికి ఆ పిల్లలకు ఆయా సబ్జెక్టులలో బేసిక్స్ నేర్పించిడానికి బ్రిడ్జ్ కోర్సులను రూపకల్పన చేశాం. క్యాంపులు ఏర్పాటు చేసాం. అలాంటి పిల్లలు రాత్రింబవళ్ళు క్యాంపులో ఉండి అవి నేర్చుకున్నారు. నేర్పించడానికి ప్రత్యేకమైన ఉపాధ్యాయులను నియమించాం. ఆ టీచర్లకు అనుభవజ్ఞులైన విద్యావేత్తలతో శిక్షణ ఇప్పించే వాళ్ళం. బేసిక్స్ వచ్చిన పిల్లలలను వారి వయసుకు తగిన తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవాళ్ళం.
ప్ర. యంవిఎఫ్ సాధించిన ఫలితాల గురించి చెప్పండి.
జ. మేం పనిచేసిన ఏరియాలో సుమారు రెండు వేల గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నేటికీ అక్కడ పిల్లలు పని చేయడం లేదు. దాదాపు 15 లక్షల బాలకార్మికులను పని నుంచి దూరం చేసి బడిలో చేర్పించాం. ఈనాడు వాళ్ళలో చాలా మంది వివిధ స్థాయిలలో ఉద్యోగాలలో ఉన్నారు. గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. “మార్కెట్‌లో చైల్డ్ లేబర్ లేకపోతేనే ఆ వ్యవస్థను తుడిచిపెట్టగలం.” అనే లక్ష్యంతో పనిచేసాం. అయితే ఇది నా ఒక్కదాని వల్ల సాధించింది కాదు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మాకు నమ్మకమైన టీం దొరికింది. పని చేసే క్రమంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటారనే నమ్మకం బల పడింది. అందరూ నమ్మకంతో పనిచేసారు. గొప్ప ఫలితాలను సాధించారు.
ప్ర. నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు కదా.. ఆ వివరాలు చెప్పండి.
జ. నేషనల్ కమిషన్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఆరేళ్లు ఉన్నాను. 2007 నుంచి 2013 వరకు ఆ పదవిలో ఉన్నాను. అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. ఇంకా చాలా కేంద్ర ప్రభుత్వ కమిటీలలో ఉన్నాను. రైట్ టు ఎడ్యుకేషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, అడల్ట్ ఎడ్యుకేషన్ కమిటీ, యÖనివర్శిటీ గ్రాంటు కమిషన్ వాటిలో కొన్ని.
ప్ర. విద్యాహక్కు చట్టం వచ్చాక విద్యారంగంలో ఏమైనా మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారా?
జ. ఏదైనా ఒక చట్టం రావాలంటే అంత సులభంగా రాదు. దాని వెనక ఎంతో పోరాటం ఉంటుంది. అందుకే ఏ చట్టం అయినా పనిచేయడం లేదని తీర్పులివ్వకూడదు. అందువల్ల దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళను మనమే దాని నుంచి తప్పించినట్లు అవుతుంది. ఆ చట్టం వచ్చిన మొదటి రెండేళ్ళు నిధులు బాగానే విడుదల చేసారు.
ప్ర. మీ రచనలు, అవార్డుల గురించి చెప్పండి.
జ. నా పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం తప్ప నేను పుస్తకాలను ప్రచురించలేదు. విద్యా విషయంలో ఇంగ్లీషు పత్రికలలో వ్యాసాలు రాస్తుంటాను. నా పరిశోధనాంశం “మావోయిస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ” 1998లో పద్మశ్రీ, ఆల్బర్ట్ శంకర్ ఇంటర్ నేషనల్ అవార్డు, 2003లో రామన్ మెగసెసే అవార్డు, రోటరీ ఇంటర్ నేషనల్ అవార్డు నాకు వచ్చిన అవార్డులలో కొన్ని.
ప్ర. మీరు ఎప్పుడు పదవీవిరమణ పొందారు?
జ. 2015లో హైదరాబాదు విశ్వవిద్యాలయం నుంచి పదవీవిరమణ పొందాను. నేను నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఛైర్‌పర్సన్‌గా నియమించబడినప్పుడు 2007లో యంవిఎఫ్ నుంచి వైదొలిగాను. మా బోర్డు కూడా అందుకు అంగీకరించింది. పారదర్శకంగా పనిచేయడానికి అది నాకు దోహదం చేసింది.
ప్ర. ఈనాడు మన సమాజంలో పిల్లల బాల్యం భద్రంగా, ఆనందంగా ఉందని పిల్లల కోసం విస్తృతంగా పనిచేసిన మీరు భావిస్తున్నారా?
జ. మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా భావిస్తున్న నేటి సమాజంలో ఆ ధోరణి పోవాలి. 2006లో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2009లో విద్యాహక్కు, 2012లో పోక్సో చట్టం, 2015లో జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2016లో లేబర్ యాక్టు ఇలా పిల్లలకు సంబంధించిన చాలా చట్టాలు వచ్చాయి. వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత పిల్లల గురించి ఆలోచించే అందరిపైనా ఉంది. మన సమాజంలో కూడా పిల్లలకు పెద్దలకు మధ్య విపరీతమైన అంతరాలున్నాయి. అంతా తనుకే తెలుసునని, పిల్లలకు ఏమీ తెలియదని, మనం చెప్పాల్సిన వాళ్ళం – పిల్లలు వినాల్సిన వాళ్ళు అనే అభిప్రాయం పెద్దల్లో ఉండకూడదు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇష్టాయిష్టాలు, వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉంటాయని పెద్దవాళ్ళు విశ్వసించాలి. ఆ దిశగా పిల్లలను పెద్ద వాళ్ళు గౌరవించాలి.
ప్ర. నేటి మహిళకున్న స్వేచ్ఛ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ. మహిళలకు సంఘర్షణ లేనిచోటు లేదు. కుటుంబం, సమాజం, పనిచేసే చోటు చివరికి తన అంతరంగంలో కూడా సంఘర్షణ ఉంది. మహిళా సంఘర్షణకు వర్గం లేదు. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి మహిళ దాకా అందరూ ఏదో వొక సంఘర్షణకు లోనవుతున్నారు. దానితో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈనాటి మహిళలకు చాలా మందికి ప్రశ్నిస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే అవగాహన ఉంది. కానీ ఎంతో మంది ప్రశ్నించకుండా మౌనంగా భరిస్తున్నారు. వాళ్ళను ఆ దిశగా చైతన్య పరచడానికి విస్తృతంగా పని జరగాలి. భూమిక సంస్థ ఒక్కటే సరిపోదు. అలాంటి సంస్థలు మరిన్ని రావాలి.
ప్ర. మీరు అమ్మాయిల కొరకు చేస్తున్న పనుల గురించి చెప్పండి.
జ. “తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య” పేరుతో గత పదేళ్ళ నుంచి మేం పనిచేస్తున్నాం. రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, గద్వాల్ జిల్లాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కౌమార దశలో వున్న ఆడ పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడం, దేనినైనా ప్రశ్నించిగలిగే సామర్థ్యాన్ని కలిగించడం. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం మొదలైనవి ఈ కార్యక్రమాలలో భాగం. ఈనాడు సుమారు పదివేల మంది ఆడపిల్లలు ఈ రకంగా తయారయ్యారు. గిరిజా! మీరు ఫీల్డ్‌కు వెళ్ళే వాళ్ళతో కలిసి మాట్లాడి చక్కటి కథనాన్ని భూమికకు రాయవచ్చు.
నేను .. తప్పకుండా ప్రయత్నిస్తాను మేడం.
