క్వియర్ సముదాయంలో హిజ్రా సంస్కృతి: ఒక పురాతన వ్యవస్థ – అర్చన రావు మానుకొండ

మనం చిన్నప్పటి నుంచి మన కాలనీల్లో, మన ఇంటి పరిసరాల్లో, బయట బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లలో, బస్ స్టాండ్లలో హిజ్రాలను చూస్తూనే ఉన్నాము. అసలు ఈ హిజ్రాలు ఎక్కడి నుంచి వస్తారు? వీరు ఎవరు? “హిజ్రాలు” అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, వారి జీవితం, చరిత్ర, సంస్కృతి కలిపి చూడాలి.

మనకు వారి గురించి తెలిసింది చాలా తక్కువ. అందుకే పూర్తి అవగాహన లేకుండా వారిని చిన్నచూపు చూడటం, వివక్షత చూపించడం జరుగుతుంది. దీనివల్ల వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారిగా, తరచూ వేధింపులకు గురవుతున్నారు.
సాధారణంగా హిజ్రాలను థర్డ్ జెండర్గా గుర్తిస్తాము. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే-హిజ్రాలు వేరు, ట్రాన్స్‌జెండర్లు వేరు. హిజ్రాలందరూ ట్రాన్స్‌జెండర్లు కావచ్చు, కానీ ట్రాన్స్‌జెండర్లందరూ హిజ్రాలు కారు. “హిజ్రా” అనే పదం “హిజర” నుంచి వచ్చింది. అంటే ప్రధాన సమాజం నుంచి బయటికి వచ్చిన వారు. ఉర్దూలో వీరిని “ఖ్వాజా సీరా”, హిందీలో “కిన్నర”, తెలుగులో పురాతనంగా “నపుంసకుడు”, తమిళంలో “అరవాణి” అని అంటారు. కానీ మన సమాజంలో వారిని “వన్ బై టూ”, “చెక్కా”, “కొజ్జవాడు” వంటి అవమానకర పదాలతో పిలుస్తారు. హిజ్రాల వేషభాషలు, సైగలు, నడవడికలు అమ్మాయిలలాగా ఉంటాయి. మేకప్, జుట్టు పెంచుకోవడం, నగలు ధరించడం, మహిళలలాగే ఉంటాయి. కొంతమంది వారిని “తప్పు శరీరంలో చిక్కుకుపోయిన వారు”గా కూడా చెబుతారు. ప్రధాన సమాజం ఆడ–మగ అనే బైనరీ సిస్టమ్ మాత్రమే గుర్తించడంతో, హిజ్రాలకు స్థానం ఉండదు. అందుకే వారు వేరుగా జీవించడం ప్రారంభిస్తారు.
ఈ ఒంటరితనం నుంచి బయటపడటానికి, తమకు తాము ఒక గుర్తింపు ఏర్పరచుకోవడానికి కొందరు హిజ్రాలు బయాలాజికల్‌గా ఉన్న పురుషాంగాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంటారు. దీనిని “నిర్వాణం” అంటారు. తరువాత హార్మోన్ థెరపీ ద్వారా శరీరంలో మార్పులు తీసుకువస్తారు. వారి గుర్తింపు మతం, జెండర్, వర్గం, వారసత్వం కలిపి ఉంటుంది. అందువల్ల హిజ్రాలలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. హిజ్రాలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు.
హిజ్రాల ఉనికి పౌరాణిక కాలం నుంచే ఉందని కొన్ని కథలు సూచిస్తాయి. రామాయణంలో థర్డ్ జెండర్ వ్యక్తుల ప్రస్తావన ఉందని, శ్రీరాముడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడని చెబుతారు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో వారు “బదాయి” చెబుతూ ఆశీర్వదించే సంప్రదాయం ఉంది. అలాగే శివుడి అర్ధనారీశ్వర రూపం, అర్జునుడు బృహన్నలగా మారిన సందర్భం, విష్ణువు మోహిని అవతారం ఇవి కూడా లింగ వైవిధ్యాన్ని సూచిస్తాయి. బ్రాహ్మణ, బౌద్ధ, జైన గ్రంథాల్లో కూడా “నపుంసక”, “తృతీయ ప్రకృతి”, “పండక” వంటి పదాలు కనిపిస్తాయి. గతంలో ముస్లిం రాజసభల్లో హిజ్రాలకు గౌరవం ఉండేదని చెబుతారు. కానీ కాలక్రమేణా వారి స్థితి తగ్గిపోయిందని భావిస్తున్నారు. హిజ్రాల సమాజం యొక్క ఆధారాలు మధ్యయుగంలో నవాబులు పాలించిన ప్రముఖ నగరాలైన హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, ముంబై, అజ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
మధ్యయుగ కాలంలో, ముఖ్యంగా సుల్తానేట్ మరియు మొఘల్ పాలనలో, హిజ్రాలకు రాజసభల్లో ప్రత్యేక స్థానం మరియు గౌరవం ఉండేది. ఈ వ్యవస్థ రాజ్యాల అంతఃపురాల నిర్వహణతో అనుబంధంగా అభివృద్ధి చెందింది. నవాబులు మరియు రాజులు హిజ్రాలపై విశ్వాసం ఉంచి, వారిని రాణులు మరియు ఉపపత్నుల సంరక్షణ, భద్రత మరియు అంతఃపుర వ్యవహారాల పర్యవేక్షణ కోసం నియమించేవారు. మహిళల గోప్యతను కాపాడడంలో, రాజ కుటుంబానికి నమ్మకమైన సేవకులుగా ఉండడంలో హిజ్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేవారు. అంతేకాకుండా, కొందరు హిజ్రాలు రాజసభలో పరిపాలనా బాధ్యతలు కూడా చేపట్టి, దౌత్య సంబంధాలు మరియు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేవారు. ఈ విధంగా, మధ్యయుగ కాలంలో హిజ్రాలు కేవలం ఒక సమాజంగా కాకుండా, రాజ్య వ్యవస్థలో విశ్వాసపాత్రమైన, ప్రభావశీలమైన వర్గంగా గుర్తింపు పొందారు. ఈ కాలంలో రాజులు వారికి నివాసంగా హవేలీలు (కూడా ఇచ్చి, గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించేవారు. ఈ గౌరవం మరియు స్థానం తరువాతి కాలాల్లో కూడా కొంతవరకు కొనసాగింది, అయితే సామాజిక, రాజకీయ మార్పుల వల్ల క్రమంగా వారి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఈ హవేలీలు కొన్ని ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి
హిజ్రాల జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆచారం “నిర్వాణం”. ఇది పురుషాంగాన్ని తొలగించుకోవడం. దీనిని “రీబర్త” లేదా పునర్జన్మగా భావిస్తారు. ఈ ప్రక్రియ ఒక్కసారిగా జరుగుతుంది. తరువాత సుమారు నలభై రోజులు రికవరీ ఉంటుంది. ఆ సమయంలో ప్రవహించే రక్తాన్ని కోరికలతో కూడిన రక్తంగా భావిస్తారు. నలభై రోజుల తర్వాత పసుపుతో స్నానం చేయించి, గొరింటాకు పెట్టి, పచ్చటి చీర, పచ్చటి గాజులు తొడగించి పండుగలా జరుపుకుంటారు. దీనిని “జల్సా” అంటారు. పాలు సముద్రంలో పోయడం వంటి ఆచారాలు కూడా చేస్తారు. ఈ ప్రక్రియ అనంతరం వారిని సంపూర్ణ హిజ్రాలుగా గుర్తిస్తారు. అంగం తొలగించుకున్న వారికి ఎక్కువ గౌరవం ఇస్తారు.
హిజ్రాల సమాజంలో గురు–శిష్య వ్యవస్థ ఉంటుంది. ప్రతి హిజ్రాకు ఒక గురువు ఉంటాడు. శిష్యులు సంపాదించిన డబ్బును గురువుకు ఇస్తారు. కొంత భాగం మాత్రమే తమకు ఉంచుకుంటారు. హిజ్రా సమాజం “ఘరానాలు”గా విభజించబడుతుంది. ఒక ఘరానాలో గురువు, అనేక మంది శిష్యులు ఉంటారు. వారు ఒక కుటుంబంలా కలిసి జీవిస్తారు. ఈ సమూహాన్ని “జమాత” అంటారు. జమాత్‌లో పెద్దలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారి జీవనోపాధిలో భిక్షాటన, బదాయి ఇవ్వడం, ఇతర పనులు ఉంటాయి.
మత పరంగా కూడా హిజ్రాల గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. చాలా హిజ్రాలు ముస్లిం పేర్లు పెట్టుకుంటారు, ముస్లిం పండుగలు జరుపుకుంటారు, మరణం తర్వాత సమాధి చేస్తారు. కానీ అదే సమయంలో హిందూ దేవతలను పూజిస్తారు. అంటే వారు రెండు మతాల ఆచారాలను కలిపి అనుసరిస్తారు. అయినప్పటికీ, వారు తాము ఏ కులం లేదా మతానికి చెందినవారు కాదని చెబుతారు. కులం, మతం వంటి పరిమితులను దాటి ఉన్నవారమని భావిస్తారు.
ఎమాస్క్యులేషన్ హిజ్రాల గుర్తింపులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం శరీర మార్పు మాత్రమే కాదు, వారి సమాజంలో గుర్తింపు పొందడానికి ఒక ముఖ్యమైన ఆచారం. దీనివల్ల “నిజమైన హిజ్రాలు” అని గుర్తిస్తారు. అంగం తొలగించుకున్న వారికి ఎక్కువ గౌరవం ఇస్తారు. తొలగించుకోని వారిని తక్కువగా చూస్తారు. శస్త్రచికిత్స ద్వారా అంగం తొలగించుకున్న వారిని ‘నిర్వాణ’ అని, తొలగించుకోని వారిని ‘అఖ్వా’ అని పిలుస్తారు.
సమాజంలో హిజ్రాలను చాలా సార్లు తక్కువగా చూస్తారు. అవమానకర పదాలతో పిలుస్తారు. కానీ మరో వైపు కొందరు వారిని ఆధ్యాత్మికంగా ఉన్నతమైనవారిగా కూడా భావిస్తారు. గతంలో ఉన్న గౌరవంతో పోలిస్తే ఇప్పుడు వారి స్థితి దిగజారిందని వారు భావిస్తున్నారు. కాలం మారిన కొద్దీ వారు తమ జీవన విధానాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు.
మొత్తానికి, హిజ్రాల గుర్తింపు స్థిరంగా ఉండదు. అది మారుతూ ఉండే, పలు అంశాల కలయికతో ఏర్పడుతుంది. హిజ్రా అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు; ఒక సముదాయం మాత్రమే కూడా కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక సాంస్కృతిక వ్యవస్థ. ప్రధానంగా హిందూ మరియు ఇస్లామిక్ ఆచారాల ప్రభావంతో ఏర్పడిన ప్రత్యేకమైన సమాజంగా హిజ్రాలను అర్థం చేసుకోవాలి.
గమనిక: ఈ విషయం పరిశోధనల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో నీథర్ మ్యాన్ నార్ వుమన్: ది హిజ్రాస్ ఆఫ్ ఇండియా మరియు విత్ రెస్పెక్ట్ టు సెక్స్: నెగోషియేటింగ్ హిజ్రా ఐడెంటిటీ ఇన్ సౌత్ ఇండియా వంటి పుస్తకాలు, అలాగే ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ కాలాల్లో హిజ్రాల సమాజం ఎలా అభివృద్ధి చెందిందో తెలిపే చారిత్రక అధ్యయనాలు ఆధారంగా ఉన్నాయి.

Share
This entry was posted in ప్రతిబింబం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.