ఉద్యమం-జీవితం-నాస్వగతం

కె. లలిత
నా చిన్నతనం నుంచి ఆలోచనల పరంగా నన్ను ప్రభావితం చేసింది ఎక్కువగా మా నాన్న. పేరు కనుపర్తి సత్యనారాయణ. ఆయనను పొగాకు సత్యనారాయణ అని పిలిచేవారు. ఖమ్మంలో ‘పొగాకు’ వ్యాపారం చేసేది. వ్యాపారం బాగా దెబ్బతిని ఆస్తులన్ని  అమ్మేసి ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు 1961లో వచ్చాడు. అప్పటికి ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయి నాకు. ఖమ్మంలో వున్నపుడు వరంగల్‌ వెళ్ళి వ్యాపారం చేసేవాడు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. ఇక్కడే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  ఇంజనీరింగు చదువుతూ మధ్యలో మానేసి స్వాతంత్య్ర ఉద్యమంలో చేరాడు.  ఆయన చిన్నపుడే తల్లి చనిపోతే దత్తత వెళ్ళి చీరాలలో కొన్ని సంవత్సరాలున్నా మళ్ళీ ఖమ్మం, వరంగల్‌లోనే ఉండేవాడు. ఆయన పక్షపాతం అంతా తెలంగాణా మీద ఉండేది. తెలంగాణా ప్రభావం చాలా వుండింది మా నాన్న మీద. వాళ్ళ తండ్రి ఫలక్‌నుమా స్టేషన్‌మాస్టర్‌గా పనిచేశారు. అమ్మ ప్రకాశం జిల్లాలో పుట్టినా బాపట్ల, వేటపాలెంలో పెరిగింది. వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి, ప్రవర్తన ఎట్లా వుండాలి, ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలి వంటివి మాత్రమే కాదు, కార్యదక్షత, క్రమశిక్షణ, సమర్ధత అమ్మ దగ్గర నేర్చుకున్నాను.
సహేతుకంగా ఆలోచించడం, శాస్త్రీయ ఆలోచనలు అనేవి నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా నాన్న ఆలోచనలు అదే విధంగా వుండేవి. చాలా దైవభక్తి ఉన్నా ప్రతిదానినీ శాస్త్రీయ దృష్టితో చూడాలని చెప్పేవాడు.. అట్లా చిన్నప్పటి నుంచీ అలవాటు. పాలిటిక్స్‌ మీద ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అందరితోటి డిస్కషన్‌ పెట్టేవారు. అందరం కలిసి కూర్చుని లిటరేచర్‌ చదివేవాళ్ళం.  చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం, సంగీతం వినడం, పాడటం అలవాటయిపోయాయి. తెలుగు భాష మీద ఆపేక్ష,  భాష నేర్చుకోవాలనే తపన అన్నీ నాన్నగారి దగ్గరనుంచే వచ్చాయి.
గ్రాడ్యుయేషన్‌ ఇంగ్లీషు లిటరేచర్‌లోనైనా తెలుగు సెకండ్‌ లాంగ్వేజ్‌గా చేశాను. రెడ్డి కళాశాలలో ఫస్ట్‌ వచ్చాను. షీల్డ్‌ వచ్చింది. తెలుగులో షీల్డ్‌ వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అయ్యాను. ఇప్పటికీ నా అనువాదాలకు, వ్యాసాలకి ఆ నపథ్యం చాలా దోహదపడింది. ఆంథాలజీ మీద పనిచేసినపుడు చాలామంది ‘ఆమెకు సాహిత్యం గురించి ఏం తెలుసు’ లాంటి విమర్శని సూటిగా అనకపోయినా పరోక్షంగా అనేవారు. అది నేను ఎదుర్కొన్నాను. కాని ఎప్పుడు ఇబ్బంది పడలేదు. నాకు ఇప్పటి సాహిత్యం చదివినా అన్ని రకాల సాహిత్యంతో అంతగా పరిచయం లేదు. అప్పటి సాహిత్యం చాలా చదివాను. ఒకరు చదువుతుంటే అందరు వినడం, పానుగంటి సాక్షి గ్రంథాలలాంటివి కలిసి చదివేవాళ్ళం. అపుడు టీ.వి.లు లేవు కదా! అందుకే పుస్తకాలు బాగా చదివేవాళ్ళం. నేను  ఉద్యమాలలో పాల్గొనడానికి కారణం మా నాన్నగారే. మా బంధువులు కొందరు ఆయన్ననేవాళ్ళు, నీ రాజకీయ వాసనే నీ కూతురికి అబ్బింది అని. కాకపోతే ఆయన గాంధీయన్‌ థింకింగు ఉన్న మనిషి. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తయారయిన పద్ధతి ఆయనకు నచ్చేది కాదు.నేను స్త్రీల సమస్యల మీద పనిచేయడాన్ని ఆయన ప్రోత్సాహించారు.
నేను ఐ.ఎ.ఎస్‌. కావాలని మా నాన్నకి కోరికగా వుండేది. నేను మాత్రం ప్రభుత్వంతో పనిచేసే ప్రసక్తి లేదు అనుకొని ఐ.ఎ.ఎస్‌.కి వెళ్ళలేదు.  నాకు మెడిసిన్‌లో జాయిన్‌ కావాలని కోరిక వుండేది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కాని మా ఇంట్లో నన్ను మెడిసిన్‌ చదివించే పరిస్థితి లేదు. చదవడమే స్కాలర్‌షిప్‌తో చదివాను.
కుటుంబంలో ఎవరు ఎంత సపోర్టివ్‌గా ఉన్నా టెన్షన్స్‌ వుంటాయి. నా వ్యక్తిత్వం నాకు ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకు బాధ కలుగుతుంది. నన్ను పెంచిన ఇంటి వాతావరణం చాలా ఉన్నతమైనది. అందరితో కూర్చుని ఫ్రీగా మాట్లాడేదాన్ని. మా నాన్నగారికి సంబంధించిన పనులన్నీ నేనే చేసేదాన్ని. ఆయన ఎపుడు దాని దగ్గర నేర్చుకోండి అనేవారు. ఇది కూడా ఒక రకంగా నాలో కాన్ఫిడెన్స్‌ పెరగడానికి కారణమయ్యిందనుకొంటాను. ఆయనకు కాన్సర్‌ వస్తే డాక్టర్ల దగ్గరికి, మందులకి అన్ని నేనే తిరిగేదాన్ని. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. అమ్మకు సహాయం చేసేదాన్ని. నన్ను ఏమీ అనలేక అందరికి సమాధానాలు చెప్పలేక చాలా బాధపడేవాళ్లు. నా గురించి బయటవాళ్లు వచ్చి ఏమేమో అంటూంటే బాధపడేవాళ్లు. నాన్న మాత్రం నేను కాంగ్రెస్‌ మనిషిని. ఎక్కడైనా తిరుగు కాని ఖమ్మం మాత్రం వెళ్ళకు అనేవారు. ఇంట్లో ఇన్ని టెన్షన్స్‌ వున్నా కూడా మా తమ్ముడ్ని ఉద్యమంలోకి రావడానికి తయారుచేశాను. మా తమ్ముడు అరుణోదయలో పనిచేసేవాడు. నావల్ల మా చెల్లెలు ఎక్కువ బాధపడింది. నాకు, ఆమెకు ఏడు సంవత్సరాలు తేడా వుంది. నేనువెళ్ళిపోయాక నా బాధ్యతలు అన్ని తనమీదే పడ్డాయి. ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. నాన్నకి ఆరోగ్యం బాగలేదు. అమ్మ అవి ఇవి చూసుకోవడం చాలా కష్టమయ్యేది. మా అన్నయ్య కూడా అదే సమయంలో పెళ్ళి చేసుకొని వేరే వెళ్ళిపోయాడు.
నేను ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఎం.ఏ చేయాలని మా నాన్న కోరిక. నాకది ఇష్టం లేదు. మార్క్సిజమ్‌ గురించి థియరిటికల్‌గా నేర్చుకున్నది అంతా కాలేజీలోనే. అపుడు రమామేల్కోటే, వసంత్‌ కన్నబిరాన్‌  లెక్చరర్లుగా వుండేవాళ్లు. రమ మాకెంతో ప్రోత్సాహమిచ్చింది, 72, 73లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్‌ పాలిటిక్స్‌ ప్రారంభమయింది.. జార్జిరెడ్డి హత్యతో, కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 73లో ఎమ్‌.ఏ. పొలిటికల్‌ సైన్స్‌లో ఉస్మానియాలో జాయిన్‌ అయ్యాను. రమ వాళ్ళ బ్రదర్‌ ప్రదీప్‌, గీతా రామస్వామి నాకు మంచి స్నేహితులయ్యారు. లలిత రామచంద్రన్‌ (నందూ అని పిలిచేవాళ్ళం) రుక్మిణీ మీనన్‌, గీత, సుమిత్‌ సిద్ధూ అందరం కలిసి రెగ్యులర్‌గా కలవడం, ఎన్నో అంశాల మీద చర్చలు పెట్టడం చేసేవాళ్ళం. స్టూడెంట్స్‌ కార్యకలాపాలు, జార్జిరెడ్డి హత్య వంటి అంశాలన్నీ కలిసి  ఉద్యమం బలంగా తయారయింది. అందులో మేమంతా వున్నాం. ఆ రోజుల్లో పి.డి.ఎస్‌.యు. డి.ఎస్‌.ఓ తర్వాత, ఆర్‌ఎస్‌యు ఏర్పడింది. అప్పట్లో ధరల పెరుగుదల మీద (బిదీశిరిచీజీరిబీలి జీరిరీలి) ఉద్యమం తీసుకువచ్చి సమావేశాలు జరిపేవాళ్ళం. అన్ని విమెన్స్‌ కాలేజీలు తిరిగి స్టూడెంట్స్‌ను పోగుచేయడం మీటింగ్సుకు రమ్మని చెప్పడం చేసేవాళ్ళం. చదువు, ఇల్లే కాదు అన్నింట్లోను పాల్గొనాలని చెప్పేవాళ్ళం.
స్త్రీవాద సాహిత్యం, మార్క్సిస్టు సాహిత్యం చదివేదాన్ని. అప్పుడు చదివిన రచయితల పుస్తకాలలో బెట్టీ ఫ్రెడన్‌, జర్మేన్‌ గ్రియర్‌, కేట్‌మిలెట్‌ వంటి ఫెమినిస్టులే కాకుండా, మార్క్స్‌, ఎంగెల్స్‌,  లెనిన్‌, మావో, షేగువేరాలు కూడా వున్నారు. పుస్తకాలను అధ్యయనం చేసి వాటి గురించి చర్చించేవాళ్ళం. రమా 60లలో ఫ్రాన్స్‌లో చదువుకుని విద్యార్థి ఉద్యమాలను దగ్గరగా చూడడం వల్ల వాటి గురించి వివరించేది. లింగ్విస్టిక్స్‌లో లక్ష్మితో కూడా ఈ చర్చలు జరిగేవి. 73లో రిసర్చ్‌ పని మీద వచ్చిన జర్మన్‌ ఫెమినిస్ట్‌ మారియా మీస్‌ని కలవడం జరిగింది. కొన్ని కామన్‌ ఇంటరెస్ట్‌ల కారణంగా మా గ్రూప్‌ అంతా కొన్ని అంశాల మీద పనిచేయడం ప్రారంభించింది. దానితోపాటుగా స్త్రీవాద, మార్క్స్‌వాద ఆలోచనల ప్రభావం మా మీద పనిచేయడం మొదలుపెట్టింది.
ఆ రోజుల్లో  మేం మహిళా కళాశాలల కెళ్ళి అన్ని అంశాల మీద మీటింగులు పెట్టేవాళ్ళం. అన్ని చర్చలు ఓపెన్‌గా జరిగేవి. ఆడవాళ్ళం అని వెనక వుండకూడదు. అందరితో కలిసి పనిచేయాలి. అన్నింట్లో సమానంగా వుండాలి అని చర్చించేవాళ్ళం. రాజకీయ నమ్మకాలు,  కార్యక్రమాల మూలంగా జార్జిరెడ్డి మీద జరిగిన దౌర్జన్యాన్ని ఆయన హత్యని వ్యతిరేకించాలి అని మాట్లాడేవాళ్ళం. పాల్గొనలేకపోయేవారు. ఐతే అధిక ధరలకు వ్యతిరేకంగా మేం చేసిన ఉద్యమానికి మంచి స్పందన వచ్చింది. ఇది కూడా మా ఆలోచనలకు పదును పెట్టింది. వాళ్ళు ఎందుకు బయటకు రావడం లేదు. ఆడపిల్లలపైన ఎటువంటి నిబంధనలుంటాయి? అని ఆలోచించి విడిగా స్త్రీల అంశాలను తీసుకొని పనిచేస్తే వాళ్ళు కొంత ఫ్రీగా ఆలోచించగలరని అన్పించింది. ఆ విధంగా స్త్రీల అంశాల మీద పనిచెయ్యడం మొదలుపెట్టాం. దీనికి మార్క్సిజమ్‌ కూడా దోహదం చేసింది. పి.ఓ.డబ్ల్యును 74లో రిజిష్టర్‌ చేశాం. కాని 73లోనే ఒక గ్రూప్‌గా తయారై పనిచేసేవాళ్ళం. అన్ని పుస్తకాలను చదివేవాళ్ళం. ఒక చిన్న పత్రికను ‘ఫోకస్‌’ పేరుతో తెచ్చేవాళ్ళం. దీన్ని కాపీలుగా చేత్తోనే రాసేవాళ్ళం. ఈ పత్రికని కాలేజీల గోడల మీద అంటించేవాళ్ళం. ఇప్పటికీ ఎంతోమంది పాతవాళ్ళ గుర్తుపట్టి మీరు ఆ రోజుల్లో మా కాలేజీకి వచ్చేవాళ్ళు కదా అంటారు. చాలా పనులు చేసేవాళ్ళం. విపరీతంగా తిరిగేవాళ్ళం. ఇప్పటి తరం పిల్లలకు ఆ ఎనర్జీ ఎందుకు లేదా అన్పిస్తుంది. మనం కూడా జనం అర్థం చేసుకునే పద్ధతిలో మాట్లాడలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఇపుడు కూడా జనం దేన్నైనా రిసీవ్‌ చేసుకుంటారు. అయితే 30 ఏళ్ళ నాటి పద్ధతులు ఇపుడు వాడితే వాళ్ళకు ఇంట్రస్టు వుండదు. పద్ధతులు మార్చాలి. జనానికి, యువతరానికి ఈ రోజు చాలా సమస్యలు, వత్తిళ్ళు ఉన్నాయి. అప్పుడు మేము చేసిన పద్ధతుల్లో ఆక్టివిజమ్‌ ఇప్పుడు లేదు, అనుకోవటం మన తప్పు. మన ఆలోచనల లోపం. ఎంతో మార్పు వచ్చింది. మీటింగ్సు పెడితే జనం రావడం లేదు. ఎందుకు రావాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి? అని ఆలోచిస్తున్నారు. కానీ ఇపుడు తెలంగాణా ఏర్పాటుకు జరుగుతున్న ప్రజాఉద్యమం చూడండి. ఇంత పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ప్రజాఉద్యమం వస్తుందని మనం ఎవ్వరం ఊహించివుండం. దీనిని సరిఅయిన పద్ధతిలో అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది.
స్త్రీల సమానహక్కుల కోసం పోరాడాలి అనే ఆలోచన ఎప్పుడూ వుండేది. ఏ అంశం తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేదాని మీద చాలా డిబేట్‌ నడిచింది. ఫెమినిజాన్ని రాడికల్‌, సోషలిస్ట్‌, లిబరల్‌ అంటూ కొన్ని క్యాటగిరిలుగా విడగొట్టి మాట్లాడటం మాకు నచ్చేది కాదు. ఈ అన్ని ధోరణుల్లో కూడా కొన్ని నచ్చేవి వుంటాయి, కొన్ని నచ్చనివి వుంటాయి. ఈ విషయంలో మన వాళ్ళు చాలా గందరగోళం కూడా సృష్టించారు. ఒక యాంత్రికమైన విభజన ఎపుడు సరిఅయినది కాదు. తర్వాత వేరేగా స్త్రీల కోసం ఒక సంస్థ పెట్టాలి అనే ఆలోచన బలంగా వుండేది.
నేను తరువాత చండ్ర పుల్లారెడ్డి గ్రూప్‌లో పనిచేసేదాన్ని. పార్టీకి అంకితమై పనిచేసేదాన్ని. మొదటిసారి స్త్రీల సంఘం గురించి చర్చ వచ్చినపుడు పార్టీ మీటింగులో పెద్ద దుమారం రేగింది. అదే సమయంలో కొందరు కులం గురించి కూడా  ప్రశ్నలు లేవనెత్తారు.    కొందరు దళిత కులాలను కుల ప్రాతిపదిక మీద సమీకరింటానికి  పార్టీ సుముఖత చూపించలేదు. చురుకు దనం, కార్యదక్షత వున్న మధ్యతరగతి స్త్రీలు పార్టీకి అవసరం అయి వుండొచ్చు. కాబట్టి స్త్రీల సంఘాన్ని ఒప్పుకున్న పార్టీ దళిత సంఘాలను అంగీకరించలేదు. అయితే మిగతా గ్రూపుల్లో కన్నా ఉమెన్‌ ఇష్యూస్‌ ఈ గ్రూప్‌ ద్వారానే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ రోజు ఎన్నో గ్రూప్‌లున్నాయి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు స్త్రీల సమస్యల మీద పోరాడుతున్నారు. అప్పట్లో గ్రూపులు తక్కువ. నేను పనిచేసిన గ్రూప్‌ ఓపెన్‌గా వుండేది. 73 నుండి 76 వరకు  ఆ గ్రూప్‌తో పనిచేశాను.
1975లో ఇందిరాగాంధి ఎమర్జెన్సీ పెట్టింది. నేను అపుడు గుంటూరులో పొగాకు కార్మికులతో పనిచేయడానికి వెళ్ళాను. పార్టీనుండి వేరే స్నేహితులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళారు. నవంబర్‌ నెలలో దీపావళి సమయంలో పార్టీ వ్యక్తులు గుంటూరుకు నన్ను కలవడానికి వచ్చారు. వాళ్లు నాదగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయేటపుడు పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు. మర్నాడే వాళ్ళని కాల్చేసారు పోలీసులు. నాకు షాక్‌ అనిపించింది. ఊహించని పరిణామం. నన్ను గుంటూరులో అరెస్ట్‌ చేశారు. ‘నువ్వు ఎవరు’ అని అడిగి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళారు. ప్రభాకర్‌రావు, (అప్పటి డిజిపి) ప్రొద్దున్నే పోలీస్‌ స్టేషన్‌కి వచ్చాడు. ఇరవై ఏడు రోజులు స్టేషన్‌లోనే వుంచారు. ఇన్‌ఫర్మేషన్‌ చెప్పమని బాగా కొట్టేవాళ్ళు. పార్టీ వాళ్ళని చంపేశారని చాలా కోపంగా వుండేది నాకు. ఏం చేస్తార్లే మహా అయితే చంపేస్తారు అంతే కదా అనిపించేది. నేను ఏదీ చెప్పను అంటూ మొండికేసాను. పోలీసులు కూడా అనుకున్నారు ఆ అమ్మాయి చాలా మొండిది అని. ఒక చోట నుంచి మరొక చోటికి పంపారు. అంటే పార్టీలో నేను చాలా ముఖ్య వ్యక్తినేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ దృష్టిలో నేను సీనియర్‌ లీడర్‌ని. కాని నిజానికి అది కరెక్ట్‌ కాదు. హింసకి గురయినా నేను  నోరువిప్పలేదు. నేలమీద కూర్చోబెట్టి కాళ్ళమీద కొట్టేవాళ్ళు. అక్కడ అయితే దెబ్బలు కనిపించవని వాళ్ళ నమ్మకం. చాలా రోజులు నడవలేకపోయాను. ఇరవైఏడు రోజులు తరువాత కోర్టుకు తీసుకెళ్ళారు. నేను నడవలేదు. పట్టుకుని తీసుకెళ్ళారు. కోర్టులో కొట్టినట్లు చెప్పొద్దు నిన్ననే అరెస్ట్‌ చేశారని చెప్పమని బెదిరించారు. పోలీసులు మెజిస్ట్రేట్‌ దగ్గరికి తీసుకెళ్ళినపుడు నేను నిజం చెప్పేసాను. నేను నడవలేను నన్ను బాగా కొట్టారు పోలీస్‌ స్టేషన్‌లో ఇరవై ఏడు రోజులు వుంచారు అని చెప్పాను. కాకపోతే అపుడు కొంతమంది మగపిల్లలను చాలా ఘోరంగా హింసించి కొట్టారు. అలా కొట్టి వుంటే నేను అంతా చెప్పేసేదాన్నేమో!
గుంటూరు సబ్‌జైలులో కొంతకాలం వుంచారు. రాజమండ్రి తీసుకెళ్తామని చెప్పి మా నాన్న కోరిక మీద హైదరాబాద్‌కు తెచ్చారు. చంచల్‌గూడ జైలులో వుంచారు. అక్కడ కొద్దిరోజుల ముందే భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీశారు. నేను వెళ్ళేటప్పటికి అప్పటికేజైలులో ఉన్న వీణని చూసి తోడుందన్న సంతోషమేసింది. ఎమర్జెన్సీ తీసేస్తారని గాని జైలు బయట ప్రపంచాన్ని చూస్తానని కాని అనుకోలేదు. అక్కడ కూడా మేము ఖైదీల సమస్యల మీద పనిచేయడం, పలకలు తెప్పించి చదువు చెప్పడం చేసేవాళ్ళం. సైన్సు, ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళం. వార్డన్లు చేసే అన్యాయాల మీద పోట్లాడేవాళ్ళం. మా ఇద్దరినీ ఒక్కొక్క రూంలో వుంచేవాళ్ళు విడి విడిగా అన్నమాట ఒక గది, వరండా వుంటాయి. అది కూడా తాళం వేసేవాళ్ళు.
నాన్న వచ్చి మా మేనత్త చనిపోయిందని పెరోల్‌ మీద వారం రోజుల కోసం నన్ను రమ్మంటే నేను రానన్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే బాధ అవుతుంది కదా! పొడిగించుకుందాంలే అని నాన్న ఒప్పించాడు. వారం తరువాత తిరిగి జైలుకి వెళ్ళిపోయాను. రెండోసారి పెరోల్‌ మీద వచ్చినపుడు స్పెషల్‌ బ్రాంచ్‌ వాళ్ళు చాలా వేధించేవాళ్ళు. పోలీసులు వదలరు. పార్టీ నేను వదలరు. ఇంట్లో వాళ్ళు నమ్మరు. స్నేహితులకు ఉత్తరం కూడా రాయలేకపోయేదాన్ని. మరుగుదొడ్లో కూర్చుని రాసేదాన్ని. అమ్మ వాళ్ళు భయంతో నన్ను కనిపెట్టుకొని వుండేవాళ్ళు. బతుకు దుర్భరమైపోయింది. నాకు ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. నా మిత్రులు నన్ను తప్పించే ప్లాను వేసారు. ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కెళ్ళి సంతకం పెట్టి లైబ్రరీకి వెళ్ళేదాన్ని. పోలీసులు కొన్ని రోజులు వెంబడించి మానేసారు. ఒకరోజు పోలీస్‌ స్టేషన్‌కెళ్ళి సంతకం పెట్టి అటునుంచే స్టేషన్‌ కెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాను. అక్కడ నేను వున్న ఇంట్లో వాళ్ళు నన్ను బాగా చూసారు. ఏదైనా పనిచేయాలని ప్రయత్నించినా ఏ ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఢిల్లీలో పదకొండు నెలలున్నాను. ఎలక్షన్స్‌ ప్రకటించక ముందే హైదరాబాదు తిరిగొచ్చాను. లాయర్‌ను కాంటాక్ట్‌ చేసి కస్తూర్బా కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన విద్యారాణి ఇంటికెళ్ళాను. అమ్మ అక్కడికి వచ్చింది. మా వాళ్ళకి నేను పదకొండు నెలలు ఎక్కడ వున్నానో అసలు ఉన్నానో లేదో కూడా తెలియదు. అమ్మ బాగా మారిపోయింది. జుట్టు అంతా తెల్లబడిపోయింది. తను వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. అపుడు బాగా ఏడ్చేశాను. ఆ కాలంలోనే నాన్నగారు పోయారు. మా నాన్నగారు పోవడం చాలా బాధ అన్పించింది. ఆయన్ని ఆఖరిసారి చూడలేకపోయాను. ఇప్పటికీ ఆ బాధ నాలోపల్లోపల కలుక్కుమంటూనే వుంటుంది.
నాకు జీవితంలో ఏదైనా సాధించాలని వుండేది. పెళ్ళి సంబంధాల విషయాలలో అడ్జ్‌స్ట్‌ కావద్దు అనుకునేదాన్ని. కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోవాలని నేను ఏ రోజూ అనుకోలేదు. మా నాన్న కూడా కట్నం ఇవ్వను అనేవాడు. నేను కరెక్ట్‌ అనుకున్నదే ఇప్పటివరకు చేశాను. నా పర్సనల్‌ ప్రిన్సిపుల్స్‌ విషయంలో నేను కాంప్రమైజ్‌ కాను. అయితే వేరేవాళ్ళకు బాధని కలిగించే విషయమైతే ఆలోచిస్తాను. అప్పుడు ఇప్పుడూ అమ్మకు నేనే సపోర్ట్‌. ఉద్యోగంఅవసరం అన్పించి మొదట ఐ.సీి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.లో చిన్న ప్రాజెక్ట్‌లో చేశాను. తరువాత అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు అక్కడ చేశాను. ఉమెన్‌ ఇష్యూస్‌ మీద నేను, రమా, వీణ పనిచేయడం మళ్ళీ మొదలుపెట్టాం. 78లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో దీపా ధన్‌రాజ్‌, సూసీతారూలను కలిసాను. అంబి, స్వర్ణ, వసంత్‌ అందరూ ఉన్నారు. ఎమర్జెన్సీ తీసేసినపుడు కన్నబిరాన్‌ గారింట్లో నేను రాత్రి 12 గంటల వరకు కూర్చొని టేపులు విని రాసేదాన్ని. ఎమర్జెన్సీ కేసుల గురించి కన్నబిరాన్‌ రిపోర్ట్‌ తయారుచేసేవారు. తార్కుండే కమిటీ రికార్డు చేసిన మొదటి సాక్షిని నేను.  దాస్‌గుప్తా, బలవంత్‌రెడ్డి, రామమూర్తి వీళ్ళందరూ కమిటీలో సభ్యులుగా వుండేవారు.వసంత్‌తో స్నేహం ఏర్పడింది.
స్త్రీ శక్తి సంఘటన ఆవిర్భావానికి ముందే మేమంతా ఒక గ్రూప్‌లాగా తయారయ్యాం. వసంత్‌, రమా వాళ్ళ ఇండ్లల్లో మీటింగ్సు పెట్టేవాళ్ళం. అప్పటికి పేరు పెట్టలేదు. కూరగాయల ఎగుమతి మీద ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. మల్లాది సుబ్బమ్మ ఇతరులు అందరూ కలిసారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూరగాయల్ని మిడిలీస్ట్‌కు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి చోట ప్రతివాళ్లు దీని గురించే మాట్లాడేవాళ్ళు. మేము దీనిని ‘స్త్రీల సమస్య’గా చూశాం. ధరలు పెరిగితే ఆడవాళ్లకే కదా కష్టం. వాళ్లే అన్ని తెచ్చి అమర్చి పెట్టాలి. దీని మీద పనిచేయడం మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఆడవాళ్లను సమీకరించాలి. జాయింట్‌ కమిటీగా ఏర్పడి అందరితో కలిసి పనిచేసాం. కూరగాయల ఎగుమతి ఆగిపోయింది. ఇది విజయవంతంగా జరిగిన ఇష్యూ. ఇందులో మా అమ్మగారు, వసంత్‌ వాళ్ళమ్మ చూడామణి రాఘవన్‌  కూడా పాల్గొన్నారు. కుటుంబాలను కూడా మా పనిలో కలుపుకోవాలని అనుకునేవాళ్ళం. స్త్రీ శక్తి సమావేశాలకు కూడా మా అమ్మ, వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు. 1978లో రమీజాబీ ఇష్యూ మీద కూడా కలిసి పనిచేశాం. మా అమ్మలాంటి వాళ్ళు మా కంటే ఎక్కువగా ఆవేశపడేవాళ్లు. రేఖ అనే అమ్మాయిని భర్త హత్య చేశాడు. మలక్‌పేట్‌లో ఆమె ఇంటి వద్ద ఒక ఊరేగింపు తీశాం. ఈ అమ్మలందరూ రాళ్ళు వేయడానికి కూడా సిద్ధమయ్యారు. 78 నుంచి 84 వరకు నిద్రాహారాలు లేకుండా రాత్రింపగళ్ళూ ‘స్త్రీశక్తి సంఘటన’ కోసం పనిచేశాం. పిల్లల్ని కూడా మీటింగులకి తీసుకొని పోయేవాళ్ళం.
స్త్రీశక్తి సంఘటనలో ఒకరికొకరు చాలా సపోర్ట్‌గా ఉండేవాళ్లు. ఆడవాళ్ళతో కలిసి పనిచేయడం చాలా అవసరమనే ఉద్దేశ్యంతోనే స్త్రీ శక్తి సంఘటన మొదలుపెట్టాం. కొంతమంది మాస్‌ ఆర్గనైజేషన్‌ వుండాలని, కొంతమంది వుండకూడదని అనేవారు ఆ సమస్య ఇప్పటికీ కూడా చర్చకు వస్తూనే వుంటుంది.. చిన్న గ్రూప్‌లతో ఇంకా ఎక్కువ  ఎఫెక్టివ్‌గా పనిచేయవచ్చని నిరూపించాం. ముఫ్పై సంవత్సరాల కృషి ఫలితంగా ఉమెన్స్‌ ఇష్యూస్‌ మీద డిబేట్‌లు,డిస్కషన్‌లు జరుగుతున్నాయి. అందరూ వీటి గురించి మాట్లాడుతున్నారు. వేరు వేరు పర్‌స్పెక్టివ్‌లు వుండొచ్చు కాని వుమెన్‌ ఇష్యూస్‌ని అడ్రస్‌ చేయకుండా ఈ రోజు ఏదీ మాట్లాడలేం. ఈ మార్పు చిన్న గ్రూపుల వల్లే వచ్చిందని నా అభిప్రాయం. దళిత్‌ ఇష్యూస్‌ అయినా ఏ మూవ్‌మెంట్‌ అయినా కూడా చిన్న గ్రూప్‌లనే ఫీలింగు వుండాల్సిన అవసరం లేదు. మొత్తం చర్చని సందర్భాన్ని  (ఖిరిరీబీళితిజీరీలి)ని ఎట్లా మార్చాలి అనే దాని మీద శ్రద్ధ వహించాలి. అందులో మంచి, చెడు రెండూ వుంటాయి. చిన్న గ్రూప్‌లో ఫెమినిస్ట్‌గానే పనిచేయాలనే ఆలోచన 73 నుంచే నాకు కలిగింది. దేశంలోనే పి.ఓ.డబ్ల్యు. మొదటి ఫెమినిస్ట్‌ గ్రూప్‌గా గుర్తింపు పొందింది. స్త్రీ శక్తి సంఘటన దగ్గరికి వచ్చేసరికి ఇందులో ఒక విద్యార్థులే కాదు పెళ్ళి అయి, పిల్లలు వున్నవాళ్ళు, వివిధ అనుభవాల నుంచి వచ్చినవాళ్ళు కూడా  ఉండేవాళ్ళు.  మా దగ్గరకొచ్చేవాళ్ళు కుటుంబాల్లో ఘర్షణలు, పిల్లల కిడ్నాప్‌లు, అత్తింట్లో నగలను తెచ్చివ్వమనే లాంటి డిమాండ్స్‌ పెట్టేవాళ్ళు. మేం వెంటనే రియాక్టయి వెళ్ళిపోకుండా ఇన్వెష్టిగేట్‌ చేసేవాళ్ళం. వాళ్ళకు విడమరిచి చెప్పేవాళ్ళం. కొన్ని సార్లు మేం ఏమీ చెయ్యలేకపోతే వాళ్ళు మమ్మల్ని చాలా విమర్శించేవారు. ఇలాంటి విమర్శలని కూడా ఎదుర్కొన్నాం.
ఒక అమ్మాయి కేసు విషయంలో కొంత దెబ్బ తిన్నాం. ఆ అమ్మాయి అందరికీ చెప్పింది. ‘వుమెన్స్‌ ఆర్గనైజేషన్స్‌ మేం చేస్తామని చెప్తారు. కాని చెయ్యరు’ అని. విమెన్స్‌ ఇష్యూస్‌ మీద పని చేస్తున్నపుడు ఆడవాళ్ళు చెప్పారు కదా అని  పూర్తిగా అదే ఫాలో అవకూడదు. అట్లా అని భావాలు ఆవేశం తప్పని కాదు. లేకుండా కాదు. ఎమోషనల్‌ రెస్పాన్స్‌ లేకుంటే  మూవ్‌మెంట్‌ లేదు. అట్లాగే విమెన్స్‌ గ్రూప్‌లో పనిచేస్తున్నపుడు కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. గ్రూప్‌ అంటే అందరూ ఒకేరకంగా  పనిచేయాలని కోరుకోకూడదు. ఎందుకంటే ఎవరి సమస్యలు వారికుంటాయి. ఎవరికి వీలయినది, చేయగలిగింది వాళ్ళు చేస్తారు. ఈ మాట మరిచిపోలేదు నేనెప్పుడూ.
రమీజాబీ ఇష్యూ మీద జాయింట్‌ కమిటీ వుండేది. అందులో భాగంగా సి.పి.ఐ, సి.పి.ఎమ్‌. వాళ్ళని కలిశాం. మొదట్లో పి.ఓ.డబ్లూలో ఆ పార్టీల వాళ్ళు ఏం చేశారనే తేలిక అభిప్రాయం ఉండేది. వ్యక్తిగతంగా వాళ్ళని కలిసినపుడు చాలా ఆసక్తికరమైన మనుషులు కలిసారు. వీళ్ళతో ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. రత్నమాలకు కూడా అందరూ తెలుసు. వాళ్ళతో కలిసి లెఫ్ట్‌ పార్టీలో వారి అనుభవాలను తీసుకోవచ్చు కదా అనుకున్నాం. అలా ప్రారంభమయింది ఆ ఆలోచన. అదే సమయంలో నేను ”సాండినోస్‌ డాటర్స్‌” పుస్తకం చదివాను. అది కూడా ఒక లైఫ్‌ హిస్టరీ. దొమితిలా రాసిన ”లెట్‌మీ స్పీక్‌” చదివాను. ఈ ప్రాజెక్ట్‌కు నేను కో-ఆర్డినేటర్‌. వసంత్‌, నేను, రత్నమాల, రమ, సూసీ, ఉమ, వీణ అందరం కలిసి చేశాం. ఇన్‌ఫర్మేషన్‌ సరిగాదొరలేదు. నేను ఆర్‌డిఎస్‌లో పనిచేసేదాన్ని. ఆఫీసులో కొంత సమయం వీటికే పెట్టేెదాన్ని. తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించిన అన్ని పుస్తకాలు చదివాం. దానిలో పాల్గొన్న స్త్రీల గురించి తెలుసుకోవాలని ప్రతి లైన్‌ చదివేవాళ్ళం. ఒకళ్లు దొరికితే వాళ్లను పట్టుకొని మరో నల్గురిని పట్టుకున్నాం. చాలా సమయం పట్టింది. అలా నలభై మందిని గుర్తించాం. వాళ్ళందరిని హైదరాబాదుకు తీసుకొచ్చి మీటింగు పెట్టాం. వాళ్ళని సన్మానించాం. ఇంటర్వ్యూలు అయ్యాక వాళ్ళ ఫోటోలు నేనే తీసేదాన్ని. కొంతమంది పాత ఫోటోలు తెచ్చి ఇచ్చారు. వాళ్ళ దగ్గరున్న అన్నీ ఫోటోలు తెచ్చి ఇచ్చారు. మనమైతే ఇస్తామో లేదో అనుమానమే. ఆ పనంతా జీవితంలో భాగంగా చేశాం. ఇపుడు ప్రతిదీ ఒక ప్రాజెక్ట్‌ అయింది.
‘మనకు తెలియని మన చరిత్ర ‘ వచ్చాక విమర్శించిన వాళ్ళు ఎక్కువే వున్నారు. మేం మొదట్లో చాలా బాధపడ్డాం. బాలగోపాల్‌ విమర్శ అరుణతారలో వచ్చింది. విఠల్‌ అనే వ్యక్తి ‘ప్రజాశక్తి’లో రాశాడు. జైలు నుంచి చాలామంది అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. ఇప్పటివరకు ఇలాంటి పుస్తకం చూడలేదు అని రాసారు. పార్టీల వాళ్ళయితే మీరు ఎడిటింగు సరిగా చెయ్యలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లు రాసారని విమర్శించారు. దాని గురించి ముందుమాటలో తెలిపాం. ఆ టైంలో పుస్తకాన్ని రిసీవ్‌ చేసుకున్న పద్ధతి వేరు. కొన్ని సంవత్సరాల తరువాత రిసీవ్‌ చేసుకున్న పద్ధతి వేరు. తర్వాత అభిప్రాయాలను మార్చుకున్నాడు బాలగోపాల్‌.ఆ పుస్తకం అప్పటి సమయానికి చాలా ముందున్నది. స్త్రీల మీద ఉన్న ఒక కవిత నుంచి ఒక లైన్‌ తీసుకుని ‘గీలి గీలిజీలి ళీబిదిరిదీవీ నీరిరీశిళిజీగి’ అని జూదీవీజిరిరీనీ పుస్తకానికి పేరు పెట్టాం.
”సవాలక్ష సందేహాలు” కూడా అదే సమయంలో మొదలుపెట్టాం” దానిక్కూడా చాలా టైమ్‌ పట్టింది. తెలుగు పుస్తకం మీద వీణ, గీత, షమ, ఉమ, సుమతీ, రామరాజ్యం పనిచేసాం. సవాలక్ష సందేహాలు 85లోనే మొదలుపెట్టినప్పటికి 90లో అది పూర్తయింది. ఆంథాలజీ 90లో వచ్చింది. 91లో సవాలక్ష సందేహాలు వచ్చింది. సూసీ, వసంత్‌, నేను స్త్రీల సమస్యల మీద గత శతాబ్దంగా వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు సేకరించి విశ్లేషణ రాయాలని పని ప్రారంభించాం.  దాని గురించి వివిధ పుస్తకాలను పరిశీలిస్తుంటే ఆంథాలజీ ఆలోచన వచ్చింది. మొదట్లో ఐదు భాషల్లో స్త్రీల సాహిత్యాన్ని సేకరించాలని అనుకున్నాం. 19వ శతాబ్దం నుండి స్వాతంత్య్రానంతరం వరకు వేయాలని వుండేది. పాలిటిక్స్‌, సాహిత్యం, చట్టం, వైద్యం వంటి వ్యవస్థలో స్త్రీ ప్రశ్న గురించి పరిశోధించి గ్రంథం వేయాలనే ప్రయత్నం అది. గ్రంథాలయాలు తిరిగి ఎంతో మెటీరియల్‌ సేకరించాం. సాహిత్యం చాలా దొరికింది. నేను లిటరేచర్‌కు చెందినదాన్ని కాను అంటే సూసీ ఫరవాలేదులే అంది. మొదట ఆరేడు భాషల్లో అనుకున్నాం. కాని తరువాత వేరే భాషల్ని కూడా చేర్చాం. ఒక పక్క పుస్తకం పనిచేస్తూ ఇంకో పక్క ఖర్చుల కోసం నిధులకు ప్రయత్నించేవాళ్ళం. డబ్బులు వచ్చే లోపలే ప్రాజెక్టు పూర్తయింది.( ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ వాళ్ళు ఒకటిన్నర సంవత్సరం గ్రాంట్‌ ఇచ్చారు). ఆ సమయంలోనే ‘అన్వేషి’ కూడా మొదలయ్యింది. రెగ్యులర్‌ పరిశోధనలని నిర్వహించి పుస్తకాల్ని తీసుకురావాలనే  ఉద్దేశంతో ‘అన్వేషి’ మొదలయింది.  అర్థం ఆడ కావచ్చు. మగ కావచ్చు. 85లో అన్వేషి రిజిస్టర్‌ అయింది.
ఆంథాలజీ పుస్తకం తయారైన తరువాత ఫెమినిస్ట్‌్‌ ప్రెస్‌కి పంపాం. కాపీరైట్ల కోసం చాలా కృషి చేయాల్సి వచ్చింది. 19వ శతాబ్దం రచయితల ప్రతుల కోసం చాలా కష్టపడ్డాం. పదమూడు భాషల్లో విషయసేకరణ కి దేశం మొత్తంలో వ్యక్తులతో బీళిజీజీలిరీచీళిదీఖిలిదీబీలి చేశాం. 85-88 వరకూ చేసాం. ఆ తరువాత దాదాపు రెండు సంవత్సరాలు ఎడిటింగు జరిగింది. ఒక  ప్రత్యేక ఉద్దేశంతోనే వాళ్ళ రచనల గురించి తక్కువ, వాళ్ళ లైఫ్‌ గురించి ఎక్కువ రాశాం. అది ‘ఐళిబీరిబిజి నీరిరీశిళిజీగి’ గా తయారైంది. అప్పట్లో అన్వేషి స్ధిరపడ లేదు. లెటర్స్‌ చేత్తోనే కార్బన్‌ పేపర్‌ పెట్టి రాసేవాళ్ళం. సుసీ గొప్పతనం ఏంటంటే దేని గురించైనా చెప్పడమే కాదు. దాని విలువను గుర్తించి దానిపై మంచి చర్చకు ఆస్కారం కల్పించడం. ఆంథాలజీలో వలసరాజ్య చరిత్రకు ప్రతీకగా ముద్దు పళనిని చూడడం జరిగింది. ఆంథాలజీ మీద పనిచేసిన అనుభవం చాలా గొప్పది.  ఉమ కూడా చాలా సహాయం చేసింది. మేం వేటపాలం వెళ్ళినపుడు లైబ్రరీలోనే చాలా రాత్రుళ్లు నిద్రపోయేవాళ్ళం. రాత్రింబగళ్ళు పనిచేసాం. కొన్ని వదిలేసారని అనువాదాలు సరిగ్గా లేవని లాంటి విమర్శలు వచ్చాయి. ముద్దుపళని గురించి స్టోరిగా రాస్తే ‘ఈమే కొత్తగా కనుక్కున్నదా? మనకు ఎప్పుడో తెలుసు’ అన్నారు. నేను సాహితీవేత్తను కాను. అలాంటి విమర్శను పట్టించుకోలేదు.  అయితే వీటన్నింటి గురించి చాలా వివరంగా ముందు మాటలో రాసాం. అదే ఊపులో బండారు అచ్చమాంబ రాసిన కథే తొలి తెలుగు కథ అని రాసాం. ఎవరూ దాన్ని గుర్తించలేదు భూమిక తప్ప. ఇపుడు  ప్రతి వాళ్ళు బండారు అచ్చమాంబ గురించి మాట్లాడతారు. వాళ్ళతో తలపడే ఓపిక తీరిక ఇపుడు నాకు లేవు. ప్రస్తుతం ఈ పుస్తకం తెలుగులో రాబోతోంది. సవాలక్ష సందేహాలు పుస్తకం కూడా  ఇంగ్లీషులో కొత్తగా వచ్చింది. టేకింగు ఛార్జ్‌ ఆఫ్‌ అవర్‌ బాడీస్‌ అనే పెంగ్విన్‌ ప్రచురణ దీనికి వీణ, గీతా, విద్య ప్రధాన బాధ్యత వహించారు.
అన్వేషి మేం అనుకున్న పద్ధతిలోనే సాగుతోందను కొంటున్నాను. అనుకున్నది సాధించాం. మంచి పని జరిగింది. ఇంకా జరగాలి. ఇపుడు దళిత సమస్యలపై కేంద్రీకరించి పనిజరుగుతున్నది. వ్యక్తిగతంగా చాలా మందికి చాలా అండగా నిలిచింది అన్వేషి. గ్రూప్‌ వర్క్‌ చాలా జరుగుతోంది.  ప్రధానంగాదళిత సమస్యల మీద కొత్త అవగాహనలకు చోటు చేసుకోవడానికి  అన్వేషి కృషి చేస్తోంది. ‘నల్లపొద్దు’ -దళిత స్త్రీ రచనల సంకలనం’డిఫరెంట్‌ టేల్స్‌’ అని అట్టడుగు వర్గాల పిల్లల కథల పుస్తకాలు ఈ మధ్య వచ్చిన పుస్తకాలు.
గత కొద్ది సంవత్సరాలుగా కొంతమంది మిత్రులు, నేను, కలిసి ‘యుగాంతర్‌’ అనే సంస్థ నిర్మాణానికి పూనుకున్నాం. నగరంలో గత నాలుగు సంవత్సరాలలో ముస్లిం కమ్యూనిటీ పైన జరిగిన నిర్భంధాన్ని ప్రతిఘటించడానికి ఏర్పడ్డ ‘హైదరాబాద్‌ ఫోరం ఫర్‌ జస్టిస్‌’ లో  యుగాంతర్‌ భాగస్వామ్యం వుంది. అట్లాగే నేను , దీపా ధన్‌రాజ్‌, దియా రాజన్‌ కలిసి యుగాంతర్‌ తరఫున 5 ప్రధాన నగరాలలో ముస్లిం స్త్రీల అనుభవాలను సేకరించి  విశ్లేషణతో  పుస్తకంగా వెయ్యాలనే తలంపుతో పరిశోధన నిర్వహించాం. దీపా దీనిని ఆధారం చేసుకుని ఒక సినిమా తీయాలనుకుంటోంది. దాదాపు 70 మంది ముస్లిం యువతుల జీవితానుభవాలను ఈ పరిశోధనలో సేకరించడం జరిగింది.
యుగాంతర్‌ ప్రస్తుతం’ హైదరాబాద్‌ ఫోరం ఫర్‌ తెలంగాణా’ వేదికలో సిసిసి, అన్వేషి, సిఎల్‌సి వంటి ఇతర సంస్థలతో భాగస్వామిగా పనిచేస్తోంది.
ఆక్టివిజమ్‌ గానీ,  ఉద్యమం గానీ, పాతదృష్టితో మనంఇపుడు అర్థం చేసుకోకూడదు. భావాలలో మార్పు జరుగుతున్నట్లే, ఉద్యమం అంటే మనం ఊహిస్తున్న అర్థంలో కూడా మార్పు వచ్చింది. వర్క్‌ జరగడం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు కనిపించేంత  స్థాయిలో జరగకపోవచ్చు. కానీ ఎవరికి తోచిన రీతిలో, వాళ్ళ వాళ్ళ తరహాలలో ఉద్యమాన్ని, పనిని ముందుకు తీసుకెళ్తున్నారనే అనుకుంటున్నాను.
తెలంగాణా రాష్ట్రోద్యమం  చూస్తుంటే నాకు  ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. దీని గురించి ఇంకోసారి లోతుగా మాట్లాకోవాల్సిన అవసరం వుంది. ఇంత పెద్ద ఎత్తున అహింసా యుతంగా ప్రజాస్వామికంగా ఉద్యమం ఊపందుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. నిజానికి అంతర్జాతీయ మహిళా దినానికి నూరేళ్ళు నిండిన ఈ సందర్భంలో ఇంత గొప్ప  ప్రజాఉద్యమం గురించి చెప్పుకోవడం అందరికీ చాలా ప్రత్యేకత కలిగిన అంశం, గర్వకారణం కూడా.  అన్ని రకాల ఆలోచనలు, భావధారలు కలవాళ్ళు ఒక వేదిక మీదికి వచ్చి వారికి నచ్చిన రీతిలో కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. ఇది చాలా విశేషమైన పరిణామం. రెవల్యూషన్‌ అనే పదానికి అర్థం మారింది. ఈ మార్పు ఒక విధంగా రివల్యూషన్‌ కాదా.
ఇంటర్వ్యూ : కె. సత్యవతి, పి. శైలజ, ఘంటసాల నిర్మల

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.