ఆ ఇల్లొక సంస్థానం

వేల సంవత్సరాలుగా ఈ సమాజం యింత అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా, అశాంతిగా వుండడానికి కారణం రాజముద్రిక పురుషుడి చేతికే అంటిపెట్టుకుని వుండడం కావొచ్చు…ఇదంతా యిలా కాకుండా సమున్నత రీతిలో సముద్ధరించబడాలంటే స్త్రీల చేతికి రాజ్యాధికారం వచ్చినపుడు మాత్రమే సాధ్యమవుతుందన్పిస్తుంది. అందునా మన రాష్ట్రంలో, మనదేశంలో కుటుంబాలన్నీ స్త్రీలు కేంద్రకంగా పని చేస్తూంటాయి…కూతురుగా, కోడలుగా, భార్యగా, వదినగా, అత్తగా, అమ్మగా అనేక రకాలుగా అత్యంత ఓర్పుతో ఆర్థికపరమైన ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ కీలకమైన పాత్ర పోషించేటువంటి స్త్రీల చేతికి రాజ్యాధికారమొస్తే ఈ సమాజం తప్పనిసరిగా బాగుపడుతుంది…అభివృద్ధి చెందుతుంది.
సమాజంలో సగభాగం కంటే ఎక్కువున్న స్త్రీలు రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి పదేళ్ళపైగా పోరాటం చేస్తూనే వున్నారు. ఎట్టకేలకు ప్రాంతీయ సంస్థల్లో ముప్పయిమూడు శాతం రిజర్వేషన్‌ని సాధించుకోగలిగినా స్త్రీల సమస్యలను అధ్యయనం చేయడానికి, పరిష్కరించుకోవడానికి అన్ని రంగాలలోనూ స్త్రీలకు యాభయి శాతం రిజర్వేషన్లు అవసరం.
ఈ నేపథ్యంలోంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట సర్పంచ్‌ గూడూరు ప్రభావతిని కలిసినపుడు ఆమె అనేక ఆసక్తికర విషయాలను భూమికతో పంచుకున్నారు.
ప్ర:    మీ పూర్తి పేరు? మీవారు? వారిది కూడ ఈ వూరేనా?
జ:    ”గూడూరు ప్రభావతి” మావారు గూడూరు రఘునాథరెడ్డి గారు సి.డి.సి. ఛైర్మన్‌గా పనిచేశారు. యింకా యితర వ్యాపారాలవీ చూసుకుంటూ వుంటారు.  వారిది తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా. మా నాన్నగారికి సొంత అక్క కొడుకు కావడంతో చిన్నప్పట్నుంచీ మా యింట్లోనే వుండి చదువుకోవడం…ఆ తర్వాత ఈ యింటి అల్లుడై బాధ్యతలు పంచుకుంటూ యిక్కడే వుండడం జరిగిపోయింది.
ప్ర:    పిల్లలెంతమంది?
జ:    ఇద్దరబ్బాయిలు…పెద్దబ్బాయి యం.ఎస్సీ మైక్రోబయాలజీ చేసి మావారి వ్యాపార వ్యవహారాలను అందిపుచ్చుకోవడం కోసం యిక్కడే వుండిపోయాడు. చిన్నబ్బాయి బెంగుళూరు ‘హనీవెల్‌’లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.
ప్ర:    రాజకీయాల్లోకి రాకముందు మీరేమయినా ఉద్యోగం చేస్తూండేవారా?
జ:    లేదులేదు…మా కుటుంబాల్లో స్త్రీల తాలూకూ డిగ్రీలన్నీ మురిగిపోతూ వుంటాయి. (చిన్ననవ్వు)… యిప్పుడిప్పుడు మా తర్వాతి తరం ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అదీ తక్కువే.
ప్ర:    మీ బాల్యం గురించి చెప్పండి?
జ:    నేను మల్లెమాల వారి ఆడపడుచును… ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. ఎటువంటి చదువుసంధ్యలూ లేకపోయినప్పటికీ మమ్మల్ని నలుగుర్నీ మానవత్వం మూర్తీభవించేలా పెంచిన మా అమ్మ అందరికీ ‘ఐడియల్‌ షి’. ఇక మా నాన్న మల్లెమాల రాఘవరెడ్డి గారు నెల్లూరు జిల్లాపరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ, కొన్నాళ్ళు ఛైర్మన్‌గానూ పనిచేశారు. అంతకుముందు నాయుడుపేట సమితి ప్రెసిడెంట్‌గా వున్నారు. మా నాన్నగారి గురించి మాట్లాడుతూ, ‘మనిషన్నవాడు ఎలా వుండాలో, ఎలా వుండొచ్చు ఆయన నడుచుకుని చూపించేవారు’ అంటారు చాలామంది. ఇలా అంటూండగా ఆమె గొంతు బొంగురుపోయింది.
ప్ర:    అయితే యివ్వాళ మీరు సర్పంచయిన తర్వాతనే కాదు…ముందే మీది రాజకీయ కుటుంబమన్నమాట.
జ:    అవును. రాజకీయమన్నది తెలీకుండానే చిన్నప్పట్నుంచీ మా జీవితాల్లో కలగలిసి పోయింది. మా యింటికి వచ్చిపోయే అనేకమంది రాజకీయ నాయకులూ, వారితో పనిబడి వచ్చే అశేష ప్రజానీకం…ఎంతమందికయినా ఆయా సమయానుకూలంగా అన్నీ అమర్చిపెట్టే మా అమ్మా…నాకెప్పుడూ అన్పిస్తూ వుండేది…నేనూ పెద్దయ్యాక పదిమందికి భోజనాలు పెడుతూ వుండాలి అని.
ప్ర:    చాలా అన్యాయమండీ స్త్రీలంటే కేవలం వండి వార్చి వడ్డించడమేనా?
జ:    ఎవరు చేశామని కాదుగానీ పదిమందికి అన్నం పెట్టడమంటే మావారికీ, నాకూ కూడ చాలా యిష్టమైన పని.
ప్ర:    మీరు బాల్యం నుండీ నాయుడుపేటలోనే వున్నట్లుగా చెప్తున్నారు. మరి పెళ్ళయ్యాక కూడ యిక్కడే వుండిపోయారా?
జ:    చెప్పాను కదా! మావారు నాకు మేనమామ, అటు బావ కూడ కావడంతో పెళ్ళయ్యాక కూడ మేమిద్దరం యిక్కడే వుండిపోయాం. మేము, మా అన్నయ్య, తమ్ముడు అంతా కలిసే వుంటాం.
ప్ర:    అయితే చాలా పెద్ద ఉమ్మడి కుటుంబమన్నమాట మీది? మరి యింత పెద్ద కుటుంబంలో నుండి మీకీ రాజకీయం ప్రతిబంధకంగా తోచలేదా? రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మీకు ముందే వుండేదా?
జ:    మంచి ప్రశ్న వేశారు. రాజకీయాల్లోకి రావాలనీ, పదవులలంకరించాలనీ నిజానికి ఎప్పుడూ లేదు. కుటుంబ బాధ్యతలు అధికంగా వుండడంతో ఆ ఆలోచన వుండేది కాదు. అయితే మావారు ఒక పెద్ద పదవిలో వుంటే చూచి ఆనందించాలనీ… పదిమందీ మాయింటికి వచ్చిపోతూ వారి పనులు చేసిపెడుతూ మా నాన్నగారి కీర్తిప్రతిష్టలని అలాగే నిలుపుతూ రావాలన్నదే నా ఆలోచన. 2006లో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో మావూరి పంచాయితీ లేడీ రిజర్వ్‌డ్‌ కావడంతో నన్ను నిలబెట్టాలని ప్రజలు పట్టుబట్టినపుడు ముందు చాలా తటపటాయించాను.
నలభయ్యేళ్ళపాటు ఈ నాలుగ్గోడల మధ్యా వుండి వుండీ ఒక విధంగా చెప్పాలంటే కలుగులో ఎలుకలా… ఒక్కసారిగా బయటికొచ్చి ఆ మీటింగులూ, నలుగురిలోనూ మాట్లాడడాలూ, పంచాయితీ పనులూ యివన్నీ నావల్ల సాధ్యమవుతాయా అని కొంత ఆలోచించాను కానీ నిజానికి ప్రచారపు సదస్సుల్లోనే నాకు మాట్లాడ్డం బాగా అలవాటయిపోయింది. నా చుట్టూ వున్నవాళ్ళంతా తెగ ఆశ్చర్యపోయేవాళ్ళు… ఎప్పుడూ యింట్లోనే వుండే నీలోపల యిన్ని శక్తులు దాగివున్నాయా? యింత బాగా మాట్లాడ్డం ఎలా సాధ్యమయింది?… యిన్ని సంగతులు నీకెలా తెలుసు? అంటూ అభినందించేవాళ్ళు. వాళ్ళంతా అడిగేదాకా నేను అంత బాగా మాట్లాడుతున్నట్లు నాకు అర్థమయ్యేది కాదు… నవ్వుతూ ఊపిరి తీసుకోవడానికన్నట్లుగా ఆగారామె.
ప్ర:    గుడ్‌! మరి పంచాయితీ పనులవీ ఎలా నడుస్తున్నాయి?  మీ చేతుల్లోకి వచ్చాక మీ పంచాయతీ అభివృద్ధి కోసం మీరెటువంటి కార్యక్రమాలు చేపట్టారు?
జ:    మొదట్లో కొత్తకొత్తగా వుండేది అంతా… అయితే ఎన్నికలు జరిగిన తొలినాళ్ళలో మూడు, నాలుగుసార్లు పంచాయితీ సర్పంచ్‌లని చైతన్యపరచడం కోసం అవగాహనా సదస్సులు నిర్వహించేవాళ్ళు జిల్లా స్థాయిలో. ఆ సదస్సులకు హాజరు కావడం నాక్కొంతవరకూ ఉపయోగపడింది. మా నాన్నగారూ, మావారూ కూడ ఎప్పుడూ డబ్బుకోసం రాజకీయం చేసినవాళ్ళు కాదు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వున్నారు. ఎటువంటి పదవులూ లేనపుడు కూడ స్వంతడబ్బుతో ప్రజాసేవ చేసిన వ్యక్తులు వాళ్ళు. అదే నిజాయితీ నాలోనూ వుండడంతో కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్టుగానే అలవోగ్గా పంచాయితీని కూడ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాను. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడానికి, యింకా అనేక యితర విషయాల్లోనూ మావారి సహకారం ఎలాగూ వుంటుంది. ఈ వూళ్ళో ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపదొచ్చినా మా యింటి తలుపులు అర్ధరాత్రయినా తెరిచే వుంటాయి. ఆఁ మర్చేపోయాను… పంచాయితీ ఎన్నికల్లో నా ఎన్నికల గుర్తు ‘తలుపు’ అవి మూసివున్న తలుపులు కావు తెరిచివున్న తలుపులుగా మావాళ్ళు అభివర్ణించేవాళ్ళు. (నవ్వు) మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత పంచాయితీ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మౌలిక వసతులయిన మంచినీరు, విద్యుద్దీపాలు, రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగింది. ఇదివరలో మూడువేల అయిదువందలు వున్న కుళాయి కనెక్షన్లు వెయ్యి రూపాయలు తగ్గించి అందించడం వల్ల మా పంచాయితీలోని పేద ప్రజలను సంతృప్తిపరచగలిగినాము. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
ప్ర:    ఈ వూరి ప్రజలు మీ పనిపట్ల సంతృప్తి చెందారా? అంటే మళ్ళీ ఎన్నికలొస్తే మీరే సర్పంచవుతానన్న నమ్మకం మీకుందా?
జ:    (నవ్వుతూ) ఇది నిజానికి ప్రజలనడగాల్సిన ప్రశ్న. ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల సమయంలో యిచ్చిన వాగ్దానాలను నూటికి నూరుపాళ్ళు నెరవేర్చగలగడమనేది సాధ్యం కాకపోవచ్చు. మేము ప్రజలకు చేసిన వాగ్ధానాలలో చాలాభాగం నెరవేర్చామనే అనుకుంటున్నాను. ప్రజలు సంతృప్తి చెందారనే నా వుద్దేశం. అయితే కలుషితమైపోయిన రాజకీయ సందర్భంలో కేవలం డబ్బు, మందు మాత్రమే ఓట్లుగా మార్పిడి జరిగే క్రమంలో ఏ పీఠం ఎలా కదులుతుందో చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. అయినా మా ప్రజలు అలాటివారు కాదు. మళ్ళీ ఎన్నికలొస్తే నేనే సర్పంచ్‌నవుతానన్న నమ్మకం నాకుంది. (ఆమె కళ్ళల్లో ఒకింత గర్వం)
ప్ర:    ఇంటి బాధ్యతలు అటు రాజకీయమూ, మీటింగులూ మీరు కోరుకున్నట్లుగా ఈ వచ్చిపోయే జనాలు ఈ భరించలేని ఒత్తిడిలో నుండి ఈ రాజకీయం చేయడం కన్నా యిల్లాలిగా వుండిపోవడం మేలని మీకెప్పుడయినా అన్పించిందా? అదే దీనికి పరిష్కారమని మీరు నమ్ముతున్నారా?
జ:    వేగవంతమయిపోయిన ఈనాటి  జీవనవిధానంలో ఒత్తిడి లేకుండా ఎవరయినా వున్నారా? అందునా స్త్రీల మీద ఎంత భారం పెరిగిపోయిందో మీకు మాత్రం తెలియందేముంది. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి మూలంగా రాజకీయాన్ని వదిలిపెట్టాలని నేనెన్నడూ భావించలేదు.
నేనీ రెండు పనులూ కూడ యిష్టంగానే చేస్తూ వున్నాను. అప్పుడప్పుడూ పని ఎక్కువయినపుడు ఎవరయినా పంచుకుంటే బావుండునని అన్పిస్తుంది కానీ… పూర్తయ్యాక మళ్ళీ ఆ ఫీలింగేమీ వుండదు. మళ్ళీ మామూలే.
ప్ర:    ఇవ్వాళ మనదేశమంతటా దారిద్య్రం, అనారోగ్యం, అశాంతి తాండవిస్తూ వున్నాయి. ఈ అస్తవ్యస్త పరిస్థితులనెదుర్కొని అశాంతి నుండి ప్రజలను బయటపడేసే మార్గమంటూ వుందా?
జ:    మనదేశంలోని అస్తవ్యస్త పరిస్థితులను బాగుపరచాలంటేనండీ అదృశ్యశక్తులున్న ఏ దేవుడయినా దిగి రావల్సిందే (నవ్వుతూ). భగవంతుడు కల్పించేవి ప్రకృతివైపరీత్యాలు. అవి అనివార్యం. కానీ ఈ రోజున మన సమాజంలో ప్రజలే కొన్ని పరిస్థితులను చేజేతులారా కొనితెచ్చుకుని వాటినుండి బయటపడలేక సాలెగూడులోని సాలీడులా ఆ పరిస్థితుల ప్రభావం వల్ల తీవ్ర యిబ్బందులతో సతమతమవుతూన్నారు. ఏ దేవుడో, ఎవరో వచ్చి ప్రజలను బయటపడేసేది కాదు కానీండి… ప్రజల్లోనే కొంత మార్పు రావాలి… తమకు కావల్సిందేమిటి లభించేదేమిటి అందుకోసం మనమెలా ప్రయత్నం చేయాలి… ప్రతి మనిషీ కూడ సాటిమనిషి పట్ల దయ, సానుభూతి కలిగి వుండాలి… ఎవరికివారు సవ్యంగా వుండగలిగితే సమాజంలోని పరిస్థితులను ప్రజలే కొంతవరకూ మార్చుకోవచ్చునని నా అభిప్రాయమండీ.
ప్ర:    సరే! యిప్పుడు జరుగుతోన్న రాష్ట్రవిభజన తాలూకు ఉద్యమాల గురించి మీరేమనుకుంటున్నారు?
జ:    ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని గురించి చెప్పగలిగేంత శక్తి లేదు గానండీ… ఆ రోజుల్లో మన దేశనాయకులు మనదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎన్నెన్నో ఉద్యమాలు నడిపారు. ప్రతీదీ కూడ శాంతియుతంగా, అహింసామార్గంలో నడిపి విజయవంతమైనారు. వాళ్ళు కోపాన్ని కూడ సత్యాగ్రహంగానో, ధర్మాగ్రహంగానో వ్యక్తపరిచేవారు తప్ప వాళ్ళ రాజకీయంలో హింస వుండేది కాదు. కానీ ఈ రోజున పరిస్థితి దానికి భిన్నంగా వుంది. ప్రతీ చిన్నదానికీ పోరాటం, స్ట్రైక్‌, ఉద్యమం… ఆ ఉద్యమాల పేరుతో రాస్తారోకోలు, బంద్‌లు, రైలురోకోలు… వీటిమూలంగా కార్యాలయాల్లో పనులు స్థంభించిపోవడం… సామాన్య ప్రజలు యిబ్బందులు పడడం… అన్నిటికంటే ముఖ్యంగా అమాయకమైన విద్యార్థులు ఈ ఉద్యమాల్లో, ఈ రాజకీయ కుట్రలో భాగమయి బలయిపోవడం… చాలా బాధాకరమైన విషయం. ఇటీవలి కాలంలో యిటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఎంతగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఏ ఉద్యమమైనా ఎవరికీ హాని కలిగించకుండా శాంతియుతంగా జరపాలే తప్ప యిలా అరాచకాలను సృష్టించడమనేది సరయినది కాదని నేననుకుంటున్నాను.
ప్ర:    ఒక చిన్న ప్రశ్న… నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించలేక, ప్రజల ఆరోగ్యాలను కాపాడలేక యిటీవల మన ప్రభుత్వం ఘోరవైఫల్యం చెందుతోందని మేధావులంటున్నారు… మీరేమనుకుంటున్నారు దీని గురించి?
జ:    ఇటీవల కాలంలో నీటి ఎద్దడి వల్ల వ్యవసాయం దెబ్బతినడంతో మొత్తం ఆహారవస్తువుల ధరలన్నీ కూడ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వైఫల్యానికి కారణాలు అనేకమున్నప్పటికీ, కనీసం మన దగ్గర ఉత్పత్తి తగ్గినపుడు పక్క రాష్ట్రాల నుండి లేదా దేశాల నుండి దిగుమతి చేసుకుని ప్రభుత్వం కొంత సబ్సిడీని భరించి తక్కువ ధరలకు ప్రజలకు అందేలా మార్కెట్లో విక్రయించాలి.
ప్ర:    చివరగా… మహిళా సాధికారత అంటే మీ దృష్టిలో ఏమిటి? ఇవ్వాళ మహిళలు సాధికారతను సాధించారా?
జ:    మహిళా సాధికారత సాధించామని అనుకుంటుండారు కానీ ఏం సాధించారు? ఈ సమాజంలో యిప్పటికీ మహిళల పట్ల వివక్షత అనేదాంట్లో ఏమాత్రం మార్పులేదు. రాజ్యాధికారమిస్తే పురుషులకన్నా స్త్రీలు సాధించగలరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. ఓపిగ్గా, సహనంగా కాపురాలు ఎంత సమర్థవంతంగా నిర్వహించగలరో, రాజ్యాధికారాన్ని కూడ వాళ్ళు అంతే సమర్థవంతంగా నిర్వహించగలరు. సాధికారత రావాలంటే వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో పరిస్థితులు అనుకూలించినపుడే సాధ్యమవుతుంది.
”థ్యాంక్సండీ… భూమిక కోసం చాలా విషయాలను చెప్పారు. మొత్తంమీద గాంధీ మార్గంలో పోరాడడం… క్రమశిక్షణలో ఉద్యమించాలనడం మీ ఆలోచనలు… బావుంది. మరి చట్టసభల్లో కూడ స్త్రీలకు సమున్నతమైన స్థానం ఏర్పడాలని కోరుకుందాం.”
గూ.ప్ర.”అవునండీ! ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర ఎంతో వుంది. అది నిజానికి మన లెక్కలకందదు. ఆమెకు ఆదివారం లేదు శనివారం లేదు సెలవురోజు లేదు… పనిగంటలు లేవు… ఇంటాబయటా ఆమె చాకిరీకి విలువకట్టే విధానం లేదు. ఇందాక మనమనుకున్నట్లుగా స్త్రీలకి రాజ్యాధికారమొస్తే తప్ప అన్నిరకాల అభివృద్ధులూ సాధ్యం కావు. ఏది ఏమయినా భూమిక పాఠకులతో నా అనుభవాలను పంచుకునే అవకాశమిచ్చినందుకు మీకు, సత్యవతి గారికి నా ధన్యవాదాలు.”

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.