మార్చి ఎనిమిది వస్తుంంటే మహా ఉత్సాహంగా వుంటుంది. ఈ సంవత్సరానికయితే గొప్ప ప్రత్యేకత వుంది. మహిళా హక్కుల దినానికి వందేళ్ళు నిండిన సందర్భం. ఏం చెయ్యాలి? భూమిక ప్రత్యేక సంచిక వేద్దామా? ఎలా వేద్దాం? ప్రత్యేక వ్యాసాలు రాయిద్దామా? ఇలా ఆలోచిస్తున్న వేళ, ఓ ఉదయాన అబ్బూరి ఛాయాదేవి గారు ఫోన్ చేసారు. ”నిన్న అపోలోలో పనిచేస్తున్న ముగ్గురు లేడీ డాక్టర్లు కలిసారు. భూమిక వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యరా? మాకు చెప్పాల్సినవి చాలా వున్నాయి” అని అడిగారు. మీరు వాళ్ళతో మాట్లాడతారా? ఉద్యోగ బాధ్యతలు ఇంటి నిర్వహణతో ఆధునిక మహిళ ఎలా సతమతమౌతుందో మాట్లాడతారట” అన్నారు. ఛాయాదేవిగారితో మాట్లాడుతున్నపుడే మార్చి ఎనిమిది ప్రత్యేక సంచిక రూపకల్పన జరిగిపోయింది నా మనసులో. చాలామంచి సలహా ఇచ్చారని ఆవిడకి థాంక్స్ చెప్పి నా పనిలో పడిపోయాను.
నేను, గీత అపొలో హాస్పిటల్‌కి వెళ్ళి ఆ ముగ్గురు డాక్టర్లను ఇంటర్వ్యూ చేసాక చాలా నిరుత్సాహపడిపోయాం. ఒకలాంటి డిప్రెషన్‌కి గురయ్యామనే చెప్పాలి. ఆ ముగ్గురు వైద్యులుగా ఎంతో గొప్ప వాళ్ళు, ప్రతిభావంతులు. అయితే వారి వ్యక్తిగత, కుటుంబ జీవితంలోని బోలుతనం, దాన్ని తట్టుకోలేక ఇంత చదువు ఎందుకు చదివామా అని బాధపడుతున్న వైనం, గృహిణిగా వుండి వుంటే ఎంతో హాయిగా వుండేవాళ్ళమేమో అనే నైరాశ్యపూరిత ధోరణి చాలా బాధపెట్టింది. ఎంత పెద్ద డాక్లరైనా, ఇంట్లో అంట్లు తోమాల్సిందేగా, వంట చెయ్యాల్సిందేగా, పిల్లల్ని పెంచాల్సిందేగా అంటూ, ఇంటా, బయటా చెయ్యాల్సిన చాకిరీని ఎకరువు పెడుతుంటే..చెప్పొద్దూ… ఇక్కడే నాకు స్త్రీల ఉద్యమ వైఫల్యం కనబడింది. మనం ఇంటి పని గురించి మాట్లాడాం. కుటుంబంలోని పనిని పంచుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడాం. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రజాస్వామిక సంబంధాలుండాలని ఎలుగెత్తి చాటాం. స్త్రీలు చదువుకోవాలని, బయటకు వచ్చి వృత్తుల్లో, ఉద్యోగాల్లో చేరాలని ఆర్ధిక స్వావలంబన సాధించాలని ఉద్భోదించాం. వందల్లో, వేలల్లో స్త్రీలు బయటకొచ్చారు. డాక్లర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఒకటేమిటి అన్ని రంగాల్లో దూసుకెళ్ళారు. అంతరిక్షంలోకి రివ్వుమని ఎగిరివెళ్ళారు. ఈ వందేళ్ళలో ఎంతో మార్పు జరిగింది, కాదనలేం ఐతే…
మార్చి ఎనిమిదికి వందేళ్ళ నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని స్త్రీలతో మాట్లాడాలనుకున్నాం. రచయిత్రులందరికీి ఉత్తరాలు రాసి, ఒక ప్రశ్నావళిని పంపించాం. మార్చి ఎనిమిది గురించి మీరేమనుకుంటున్నారు. మహిళా సాధికారత సిద్ధించిందని భావిస్తున్నారా? అని అడిగినపుడు వచ్చిన సమాధానాలు ఈ సంచికలో వున్నాయి. మేం ఎంచుకున్న స్త్రీలు కూడా రకరకాల స్థాయిల్లో వున్న వాళ్ళు డాక్టర్లు, లెక్చరర్లు, ఇంట్లో పనులు చేసే వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు అందరూ వున్నారు. అందులో కొందరికి మార్చి ఎనిమిది అంటే కూడా తెలియదు. ‘ఆడోళ్ళ కోసం అని గా పండగ కూడా వుంటదా’ అని ఆశ్చర్యపోయింది యాదమ్మ. ”తృప్తి లేని జీవితమని, ఈ గానుగెద్దు జీవితం విసుగ్గా వుందని” చెప్పిన వాళ్ళు వున్నారు. ఇంటి నిర్వహణ అందరూ పంచుకుంటే మనకంటూ స్పేస్ మిగులుతుందని, ఇంటిపనిని విభజించాల్సిందేనని కొందరు చెప్పారు.
భిన్న అభిప్రాయాల సమాహారమే ఈ ప్రత్యేక సంచిక. అన్నింటిని ఒకేసారి చదివిన తర్వాత నాకు కలిగిన భావం ఒక్కటే. చాలావరకు అందరూ తమ పరిధుల్లోంచే మాట్లాడారని, చుట్టూ సమాజంలో జరుగుతున్న వాటి గురించి పట్టించుకుంటున్నారా అనే అనుమానం వచ్చింది. స్త్రీల ఉద్యమం లేవనెత్తిన అంశాలు, చర్చించిన విషయాలు దానికి సంబంధించిన సాహిత్య పరిచయం వున్నట్టు అనిపించలేదు. కనీసం పేపర్ కూడా చదవమని చాలామంది చెప్పారు. టైమ్ వుండదని, ఇంటికి ఆఫీీసుకే మొత్తం ఖర్చయిపోతుందని చెప్పారు. తమ పరిస్థితులను మెరుగుపరుచుకునే దారుల గురించి వెతకలేదేమో అని కూడా అనిపించింది.
వందేళ్ళ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మనం ఎక్కడున్నాం? అని సమీక్షించుకుంటూ మొదలుపెట్టిన ఈ ప్రత్యేక సంచికను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ….
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags