టి.వి.ఎస్. రామానుజరావు
యాకూబ్ పుస్తకం ”ఎడతెగని ప్రయాణం” చదివినప్పుడు ఈ విమర్శకుడి మాటలు గుర్తుకొస్తాయి.
అసలు చదువరి కవి నుండి ఏమి ఆశిస్తాడని మనం ప్రశ్నించుకుంటే ఒక సంఘటన లేదా, ఆలోచనను చక్కగా కవిత్వీకరించడం, అందమయిన పోలికలు, మనసుకు హత్తుకుపోయే రూపకల్పన కవితావస్తువుకు అనుగుణమైన పదాల పొందిక – వీటితో పాటు కవిత్వీకరించడంలో చదివే ఆసక్తి కలిగించేలా వుండడం – యివన్నీ ముఖ్యమే అనిపిస్తాయి.
యాకూబ్ పుస్తకంలో 77 కవిత లున్నాయి. వాటిలో మిళితమై మనసులోకి చొచ్చుకుపోయి ప్రశ్నించే జీవితసత్యాలు – వాటికి మానవతావాదానికి దారి చూపించే సమాధానాలూ వున్నాయి.
మొదటగా అతని ”ఎజెండా” అన్న కవితలో మనిషి ”అదను చూసి దుక్కులు దున్నుతున్నట్లు ఆత్మను దున్నుతుండాలి” అంటూ వివిధ సందర్భాలలో మనిషి ఎలా వుండాలని తాను కోరుతున్నాడో చెబుతూ, ”ఏకమొత్తంగా నిఖార్సయిన నిజమైన మనిషితనం మిసమిసలాడే మనిషి లాగుండాలి” అంటాడు.
మనిషి జీవితం అంతా వెతుకులాటే! కొన్ని వెతులాటల్లో దారులే తెలియవు అయినా మార్పు వస్తుందనే ఆశిస్తాం. గొడ్లు కాయడం తెలుసుకొని తన్ను తాను ఎలా కాసుకోవాలో తెలియదు. దారులే తెలియనప్పుడు, మార్పు వస్తుందని ఎలా అనుకుంటామో తెలియదు. తెలియనిది ఏమిటో, తెలిసినది ఏమిటో విడమరిచి చూసుకుని వెతుక్కోవడంలోనే జీవితం గడిచిపోతుంది. ఎవరో పాడి ఆపేసిన పాట మరెవరో అందుకుంటారు. కాని రాగాలు కలవవు. పాట భావుకతకు కన్నీళ్లు జారవు. అందుకే ”కన్నీళ్లను కలిపే విద్య ఇంకా ఎవరూ నేర్చుకోలేదేమో” అంటూనే.
”వెక్కివెక్కి పడిన ఒంటరితనాల వనాల్లో/నన్నో ప్రాణవంతపు పత్రహరితంగా మార్చిన/కన్నీటి చుక్కలు ప్రణామం” అంటాడు.
కవి తనంతట తాను అనుభూతి చెందినప్పుడే మంచి కవిత్వం రాయగలడు. ఎవరో అడిగారనో, మరెవరో జాలిపడ్డారనో కవిత్వం రాయలేరు. యాకూబ్ కూడా సన్మానాలకో, మొక్కుబడి కవి సమ్మేళనాలకో కవిత్వం రాయలేడు.
మార్కెట్ ఎకానమి మాయనీ అందులో పడి కొట్టుకుపోతున్న ప్రజలనూ అనేక కోణాల్లో పరిశీలించి విమర్శిస్తాడు యాకూబ్ ”అతడు-ఆమె-మార్కెట్” అన్న కవితలో. ”దేశం విస్తరించదు/కోర్కెలు మాత్రం విస్తరిస్తాయి” – అంటూ అసలు కారణం చెబుతాడు.
అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడే మనిషి గొంతుకను తొక్కేయకండీ అంటూ అణచివేయబడ్డ మనిషి ఆత్మగౌరవం కోసం గొంతెత్తి అసలు సిసలు పాట ఆలపిస్తాడు.
అంతేకాదు, ఈ మాయలోంచి బయటపడేందుకు, ”కొంచెంసేపు సేద తీరుదాం, ”గుండెలను చీల్చుకుందాం మతములయ్యే మనుషుల్ని మార్చి/మార్కట్టయ్యే దారుల్ని మూసి/మనమంతా ఒకటవుదాం/మళ్ళీ, మళ్ళీ మనుషులమని చాటిచెబుదాం” అంటాడు.
యాకూబ్ మనసున్న మనిషి. హృదయాన్ని వినడం, అర్థం చేసుకోవడం, విడమర్చుకోవడం అనే కళను నేర్చిన నిపుణుడు. అంతే కాదు, మసెరిగిన మరో మనిషిలో తన్ను తాను భద్రంగా దాచుకున్నవాడు. మనసున మనసైన తోడు దొరికిన అదృష్టవంతుడు.
ఈ కవి చూపు ”పక్షి చూపు సారించినట్లు అన్ని దిక్కుల్ని పరికిస్తుంది ప్రసరించిన చూపులోకి ప్రతీకగా ఇమిడిపోతుంది. మరుక్షణాన కవిత్వమై శ్వాసిస్తుంది. అతడు తన కవిత్వంతో స్పృశించని అంశమే లేదు.
”నిట్టనిలువునా చీలిన వెలుతురు చార/కొంచెం కంట్లోకి మరికొంచెం ఆత్మ లోకి” ప్రసరించి/ ఏ శిల్పీ చెక్కలేని అపు రూప శిల్పంలాంటి దృశ్యాల్ని వర్ణిస్తాడు చంద్రవంకల్ని భూమ్మీదకి రప్పించే ప్రయత్నం చేస్తాడు.
”ఒక స్వప్న కాంత/విప్పిన రైకల్లోంచి పాలు తాపిద్దా మని/ముడి విప్పి అతడిని పిలిచింది./ఆ అమృతబిందువులు తాగి అమరత్వం సాధించిన తృప్తిలో/సేద తీరుతుంది అతని మేను.-అంటాడు.
అసలు ”ఆదమరచి అలవోకగా నిద్రిస్తున్న వాడినే అన్ని కలలూ దరిచేర తాయి” అని కూడా చెబుతాడు.
”జీవితంలోకి ప్రేమగా ప్రయాణించిన వాడే తన్ను తాను సంపూర్ణ మానవుడిగా నిర్మించుకుంటాడు” అని సంపూర్ణ మానవుడిగా ఎలా రూపొందాలో వివరిస్తాడు.
యాకూబ్ కవి మాత్రమే కాదు. మంచి గాయకుడు కూడా. తన పాటలోంచి, మనుషుల్ని తోడి పోస్తుంటాడు అతనికి సంగీతం ఒక నిఖార్సయిన అద్భుతం. పురా జ్ఞాపకాలను కొంగ్రొత్తగా తనలో ఒంపుకొని కూనిరాగంలా మారిన శరీరంతో ప్రకాశిస్తాడు. అతని కవిత్వం ప్రేమమయం. అతడి జ్ఞాపకాలు ప్రేమమయం. అతడి స్నేహం ప్రేమమయం. ఆ ప్రేమ దీవనల పెట్టె – తన తల్లిపై కావొచ్చు. తన సహచరిపై కావొచ్చు. చెట్టు కవి ఇస్మాయిల్‌పై కావచ్చు. గోరటి వెంకన్నపై కావొచ్చు. పోలవరంపై కావొచ్చు, తానుండే హైద్రాబాద్ నగరంపై కావొచ్చు.
”ఏమైనా మనిషి నిజం, మనిషి మాత్రమే నిజం, మనిషిని ప్రేమించడం వినా అంతా అబద్ధం” అనిపించేలా చేస్తాడు అతను ”కవిత్వ పాదమై కరిగిపోయినప్పుడు” అంతరాలలో దాచుకున్న అద్భుత మూలిక – తల్లి గురించి, పాత ఉత్తరాన్ని గురించి, మిధ్య గురించి, మరణాల గురించి, చెల్లం గురించి, సబ్కా కామ్నా గురించి – ఇలా బహుముఖీనమై కవిత్వాన్ని పంచిపెడతాడు.
– ఏలే లక్ష్మణ్ బొమ్మతో అందంగా ముద్రించిన ఈ కవితాసంపుటి ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ లాంటి అన్ని పుస్తక కేంద్రాల్లోనూ దొరుకుతుంది. దీని వెల అరవై రూపాయలు. కొని దాచుకోవాల్సిన పుస్తకం.
రామానుజ గారు,
పుస్తకం శీర్షిక చాలా బాగుంది…. ( ఎడతెగని ప్రయాణం )….
“ఆదమరచి నిదురపోయే వాడికే – అన్ని కలలు దరి చేరుతాయి ” ..
అనే కవితా పంక్తి చాలా బాగుంది..
మీకు, యాకూబ్ గారికి అభినందనలు..
ఒక గొప్ప రచ యి త యాకూబు గారు–ఈ యుగము లొ