శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
”అయితే మీరు కూడా గాంధీగారి పక్షం చేరిపోయారా?” అన్నాను.
”అరె, పక్షం అంటావేమిటి? నేను ఆయన శిష్యుడినైపోతేనూ? అసలు ఆయన గోరఖ్‌పూర్‌కి వచ్చినప్పుడే ఆయన శిష్యుడినయాను,” అన్నారు.
”ఊఁ… కానీ ఆయన దర్శనం లభించింది మాత్రం ఇప్పుడే!” అన్నాను.
”శిష్యుడవటమంటే ఆ వ్యక్తిని పూజించటం కాదు, ఆయనలోని మంచిగుణాలని సొంతం చేసుకోవటం.”
”అయితే మీరు సొంతం చేసుకున్నట్టేనా?”
”ఆఁ! ఆ తరవాతే కదా నేను ‘ప్రేమాశ్రమ్’ నవల రాసింది? అది 1922లో అచ్చయిందిగా?”
”కానీ దాన్ని మీరు అంతకుముందే రాయటం మొదలుపెట్టారుగా?”
”అయితే మహాత్ముడిని చూడకుండానే నేనాయన శిష్యుణ్ణయిపోయానన్నమాట!”
”అయితే అందులో మహాత్ముడి గొప్ప ఏముంది?”
”ఆ గొప్ప ఏమిటంటే ఆయన నాచేత చేయించుకోవాలని అనుకునే పనిని నేను ముందే చేసేస్తాను. అంటే నేను ఆయనకి ప్రకృతి తయారుచేసిన రెడీమేడ్ శిష్యుడినన్నమాట!”
”మీరు చెప్పేది అర్థం లేని మాట. తర్కానికి నిలబడదు,” అన్నాను.
”ఇది తర్కానికి సంబంధించిన విషయం కాదు. దీని అర్థం ఈ లోకంలో గాంధీగారు నా దృష్టిలో అందరికన్నా గొప్పవాడని. ఆయన ఉద్దేశం కూడా శ్రమచేసేవాళ్లూ, రైతులూ సుఖంగా ఉండాలనేదే. వీళ్ల జీవితాలని మెరుగు పరిచేందుకు ఆయన ఉద్యమం కొనసాగి స్తున్నాడు. నేను రచనల ద్వారా వాళ్లని ప్రోత్సహిస్తున్నాను. గాంధీగారు హిందూ- ముస్లిముల ఐకమత్యాన్ని కోరుకుంటున్నారు. నేను కూడా హిందీ, ఉర్దూలని కలిపి హిందుస్తానీ భాషగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాను.”
”మీరెలా తయారుచేస్తారు హిందుస్తానీ భాషని?”
”నేను రాసేదంతా హిందూస్తానీలోనే రాస్తున్నాను.”
”అయితే మీరు రాసినంత మాత్రాన అది హిందుస్తానీ అయిపోతుందా?”
”హిందూ, ముస్లిములిద్దరూ ఒప్పు కునేదీ, సామాన్య మానవుడికి అర్థమయేదీ హిందుస్తానీ. అంతేకాక ఏనాటికైనా జాతీయభాష అనేది ఏర్పడితే అది హిందీ, ఉర్దూల కలయికతో తయారైన భాషే అవుతుంది.”
”మీరు హిందుస్తానీ అంటున్నారు కానీ, అందరూ మాట్లాడే భాష హిందీయే అవాలి కదా?”
”అసలు మనదేశానికి హిందుస్తాన్ అనే పేరెలా వచ్చిందో నీకు తెలుసా? మొదట్లో ముసల్మానులు మనదేశంలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు, ఈ దేశాన్ని అధీనం చేసుకున్నప్పుడు, అప్పుడు వచ్చింది దీనికా పేరు. దేశం పేరు హిందుస్తాన్‌గా స్థిరపడింది కానీ భాష గురించి ఇంకా పోరాటం ముగియలేదు. ఇది ముగియా లంటే, హిందువులూ, ముస్లిములూ శాంతంగా ఆలోచించి, మనం మనం కలిసే ఉండాలనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఆ ఇద్దరి భాషా కలిపి హిందుస్తానీ అవాలి. హిందువులూ, ముస్లిములూ తమ తమ భాషలని పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నంత కాలం ఈ సమస్య తీరే మార్గం దొరకటం అసంభవం.”
”అయితే ఏం చెయ్యాలి? హిందీలోకి పర్షియన్ మాటల్ని చొప్పించి, ఉర్దూలో సంస్కృతం మాటలని బలవంతంగా కలిపెయ్యాలా?”
”అలా బలవంతంగా చొప్పించక్కర్లేదు. జనం మాట్లాడే భాష అయితే చాలు. ఇక ఆ తరవాత భాషల్లోని పదాలు కలగలిసిపోయినా పరవాలేదు. వాటిని ఉపయోగించేందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఇక దేశంలోకి ఎన్నో విదేశీ వంశాలు వచ్చి చేరిపోయాక, ఇక దేశమే సంకరమైపోయింది, మరి భాష మాత్రం సంకరం కాకుండా ఎలా ఉండగలదు?”
”మరి ఆహారం, పెళ్లిళ్లు విషయంలో హిందువులు దీన్ని ఎలా భరించ గలుగుతారు?”
”అది కూడా అయిందిగా! పాదుషాల కాలంలో మనదేశంలోని పెద్దపెద్ద మహారాజులు తమ చెల్లెళ్లనీ, కూతుళ్లనీ ముస్లిములకిచ్చి చెయ్యలేదా? ఎంతో ఆనందంగా, గర్వంగా మరీ ఆ పనిచేశారు వాళ్లు. కానీ ముస్లిముల ఇంటి ఆడపడుచులు హిందూ కుటుంబాలలోకి మాత్రం రాలేదు. ఇప్పటికీ మన ఇళ్లల్లోంచి బైటికెళ్లిపోయిన అమ్మాయిలు ముసల్మానుల ఇళ్లల్లోనే తేల్తారు, లేదా వేశ్యాగృహాలలో కనిపిస్తారు. ఈ పెరిగిపోయిన ముస్లిము వంశం వాళ్లందరూ పర్షియానించి వచ్చినవాళ్లు కారు. మరి అప్పుడు నీ హిందూ వంశంలోని మగాళ్లు తమని తాము విచిత్రంగా, కల్తీ లేకుండా ఉంచుకోవాలని ఎందుకనుకోలేదు?”
”అయితే మీరు ముసల్మానుల పక్షమా?”
”లేదు, నేనెవరి పక్షమూ కాదు, అలాగని ఎవరికీ శత్రువనీ కాను.”
”ఇంతకీ మీరు రాముణ్ణి నమ్ముతారా రహీమ్‌నా?”
”నా దృష్టిలో రాముడు, రహీమ్, బుద్ధుడు, ఏసుక్రీస్తు, అందరూ భక్తి చూపించేందుకు తగినవారే. వీళ్లందరినీ నేను మహాపురుషుల కింద జమకడతాను.”
”అయితే ఇంతకీ మీరెవరు?”
”నేనొక మనిషిని. మానవత్వంతో, మనిషి చెయ్యవలసిన పనులు చేసేవాడు ఏం చేస్తాడో, అదే నేనూ చేస్తాను. అలాంట ివాళ్లంటేనే నాకిష్టం. నాకు హిందూ స్నేహితులున్నారు, కానీ ముస్లిమ్ స్నేహితుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నా మాటకు నాకు, వీళ్లిద్దరిలోనూ ఎటువంటి భేదమూ లేదు. ఇద్దరూ సమానమే.”
”ఇద్దరూ సమానం ఎలా అవుతారు? ముస్లిములు ఆవుని బలిస్తారు. ఆ కారణంగా కొట్లాటలు జరుగుతాయి, ఎంతోమంది హిందువులూ, ముస్లిములూ ప్రాణాలు కోల్పోతారు.”
”ఇది ఒక వర్గం చేసే తప్పు కాదు. ఒక వట్టిపోయిన ముసలి ఆవుని ముస్లిములు బలి ఇచ్చినప్పుడు రెండు పక్షాల వాళ్లూ కొట్టుకు చస్తారు, కానీ అదే ఇంగ్లీషువాళ్లు వందలకొద్దీ ఆవులనీ, దూడలనీ చంపినప్పుడు మాత్రం హిందువుల రక్తం కోపంతో మరిగిపోదేం? ఆవుని బలిచ్చారని కాదు కొట్టుకోవటం, ఇద్దరికీ లోపల్లోపల ఏదో తొలుస్తూ ఉంటుంది, అందువల్లే ఈ కొట్లాటలు. నువ్వే చెప్పు, మేకలని బలివ్వని దేవత గుడి ఉందా మనదేశంలో? ఏం మేక మాత్రం ప్రాణి కాదా? మరైతే మేకనెందుకు బలిస్తారు? మేక మాంసం నువ్వు కూడా చాలా ఇష్టంగా తింటావే? అందరికన్నా దయగలవాళ్లు హిందువులేనని ఎలా అనగలవు? స్త్రీలని అందరికన్నా ఎక్కువగా హింసించేది హిందువులే. ఏ చిన్న పొరపాటు చేసినా ఇంట్లోంచి వెళ్లగొడతారు. తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటాడు హిందువు. అయినా ఒక హిందువు ముసల్మానుగా మారితే పెద్ద గొడవ జరుగుతుంది. అదే ఒక ఆడదాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టేప్పుడు, ఆమె ఎక్కడికి వెళ్తుంది, అనే ఆలోచన రాదు. ఆమె ముసల్మాను మతం పుచ్చుకుంటుందని తెలిసి కూడా ఇంట్లో ఎందుకుండనివ్వరు? పైగా ఆడది చేసే తప్పుకి ఆమె ఒక్కతే బాధ్యురాలు కాదు, పురుషుడు కూడా బాధ్యుడే. నన్నడిగితే ఆమెకన్నా అతనే రెండింతలు నేరస్థుడు. మరలాటప్పుడు స్త్రీనే ఇంట్లోంచి వెళ్లగొడ తారు తప్ప, మగవాడిని వెళ్లగొట్టరేం? అతన్నెందుకు వెలివెయ్యరు? అసలు మగాళ్లు మొదట్నించీ ఆడదారిమీద అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. నీతి-నియమాలు కూడా మగవాళ్లే తమకిష్టం వచ్చినట్టు, తమకి అనుకూలంగా తయారుచేసుకున్నారు. ఇద్దరు, ముగ్గురు భార్యలని పెళ్లి చేసుకోవడం, అన్నీ మొగాళ్లే చేస్తారు. సమాజం అన్ని నియమాలు స్త్రీని కట్టిపడేసేందుకూ, నిర్బంధించేందుకూ తయారుచేసి, బాధ్యతని మొత్తం ఆమె తలమీదే పెట్టారు. కానీ మగాడికి ఎటువంటి నిర్బంధనలూ లేవు, బాధ్యతలు లేవు. తాము మాత్రం వాటి పంజాలో చిక్కుకోకుండా దూరంగా ఉన్నారు. ఆడది ఇంట్లోంచి వెళ్లగొట్టబడాలి, ముసల్మాను మతం పుచ్చుకోకూడదు, నువ్వే ఆలోచించు, మరి ఆమె ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్లిపోవాలా? వీళ్లు ఏమనుకుంటున్నారో, ఆ దేవుడికే తెలియాలి!
”మరి విధవలని ఊళ్లోంచి వెళ్లగొడు తున్నారే, దాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి?”
”వాళ్లు కూడా ఊళ్లోంచి వెళ్లిపోవా లనీ, ఒంటరిగా బతకాలనీ ఈ సంఘం అనుకుంటోందేమో! దయానంద్‌కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్యసమాజం స్థాపించి స్త్రీలనీ, సంఘాన్నీ గొప్పగా ఉద్ధరించాడు. స్త్రీలకోసం శారదా బిల్ పాస్ చేయించిన వాళ్లకి కూడా ఆడవాళ్లందరూ ధన్యవాదాలు తెలుపకోవాలి.”
”అంటే అందరు ఆడవాళ్లూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలా?”
”చెప్పకపోతే మిమ్మల్ని కృతఘ్నులని అనాల్సి వస్తుంది. ఆడవాళ్లని ఉద్ధరించేం దుకు గాంధీగారు కూడా దయానంద సరస్వతిని సమర్ధించారు. అసలు నా ఉద్దేశంలో ఇప్పుడే మన సమాజం నిద్రలేచి, స్త్రీలకి న్యాయం చేకూర్చకపోతే, హిందువుల ఇళ్లల్లోని ఆడపిల్లలు, ఈ అత్యాచారాలకి భయపడి, తమకిష్టమైన వాళ్లని పెళ్లి చేసుకునే రోజు బహుశా త్వరలోనే వస్తుంది.”
అమ్మాయి పెళ్లి
1928లో మా అమ్మాయి పెళ్లి చెయ్యా లని అనుకున్నాం. లక్నోలో ఎంతోమంది అబ్బాయిల్ని చూశాం. కానీ ఎవరూ నచ్చలేదు. కుటుంబం బావుంటే అబ్బాయి అనాకారి అవటం, అబ్బాయి బావుంటే కుటుంబం పనికి మాలిన దిగానూ ఉంటూ వచ్చింది. నేనొకసారి మా ఆయనతో, ”అబ్బాయిని చూసొచ్చారుగా, ఎలా ఉన్నాడు, నచ్చాడా?” అని అడిగాను.
”అబ్బాయి మంచివాడే కానీ నలుపు,” అన్నారాయన.
”అయితే ఏమైంది? అందం కొరుక్కుతింటామా?” అన్నాను.
”అరే, కను ముక్కు తీరు బావుండద్దా?” అన్నారు.
”మీకా అబ్బాయి గురించి చెప్పినవాళ్లు అతను బావుంటాడనే అన్నారుగా?”
”బాగాలేవని నేనెక్కడన్నాను? నాకు అస్సలు నచ్చలేదంతే.”
”అయితే మీకెవరు నచ్చుతారు?”
”నువ్వే చెప్పు, నీకు అనాకారితో పెళ్లై ఉంటే నీకు బావుండేదా? అతను నీకు నచ్చేవాడా?”
”నాకు నచ్చినవాడితోనే నా పెళ్లైందిలెండి, అదీ పెళ్లయ్యాక తెలిసింది. అవకముందు ఎలా ఉండేదో ఆ దేవుడికే తెలియాలి.”
మరోసారి ఫతేపూర్‌కెళ్లి ఇంకో అబ్బాయిని చూసొచ్చారు. వెనక్కి రాగానే, ”చూశారా?” అని అడిగాను.
”ఆఁ, చూశాను. కానీ నాకేం నచ్చలేదు,” అన్నారు.
ఉన్నావ్‌లో మరో సంబంధం చూశారు. కుటుంబం ఈయనకి నచ్చింది. అబ్బాయి కూడా బుద్ధిమంతుడే. చదువు సంధ్యలూ బాగానే ఉన్నాయి. తరవాత ఆ అబ్బాయికి తల్లిలేదని తెలిసింది.
”నేనా ఇంట్లో మన అమ్మాయిని ఇవ్వను,” అన్నారు.
”అసలు ఈ సంగతి ముందు చెప్పండి. పెళ్లి జరిగేది అబ్బాయితోనా అతని తల్లిదండ్రులతోనా?” అన్నాను.
”నీకు తెలీదు. పెళ్లై వెళ్తూనే పాపం ఇంటి బాధ్యతంతా దీని నెత్తిమీదే పడుతుంది. ఎప్పుడైనా అమ్మాయిని మనింటికి పంపించమంటే, మరి మా ఇంటి వ్యవహారాలు ఎవరు చూస్తారని అంటారు వాళ్లు. మనకి ఉన్నదా ఒక్కత్తే ఆడపిల్ల. నాకీ పెళ్లి ఇష్టం లేదు,” అన్నారు.
ఇంకో కుర్రాడు బెనారస్‌లో ఉన్నాడని తెలిసి ఇంటికి పిలిపించారు. అతను డీ.ఏ.వీ.లో టీచరు. చూడటానికి అందంగా ఉన్నాడు. రెండు రోజులు మా ఇంట్లో ఉన్నాడు. అతని ప్రవర్తనలో ఈయనకి కొంచెం చపలత్వం కనిపించింది. ”అంతా బాగానే ఉంది గాని నిలకడైన మనిషిలా లేడు,” అన్నారు.
ఆ తరవాత ఆ అబ్బాయికి తన తలిదండ్రులతో కూడా పడదని తెలిసింది. ”తల్లీ తండ్రీ మూర్ఖులై ఉంటారు, అందుకే ఇతనికి వాళ్లతో పడటం లేదు. అబ్బాయి మంచివాడే,” అన్నాను.
”నువ్వు కూడా ముర్ఖురాలివే. తలిదండ్రులతోనే పడనివాడికి, పెళ్లాంతో మాత్రం పడుతుందని ఏమిటి? అది కూడా కాస్త ఆలోచించు. తన తలిదండ్రులనే ప్రేమించలేనివాడు మిగతా వాళ్లని ఎలా ప్రేమించగలుగుతాడు?”
”పడటం వేరు, ప్రేమించడం వేరు. ఇద్దరి ఆలోచనలూ కలవవేమో!”
”ప్రేమ ఉన్న చోట ద్వేషానికి తావుండదు. నేను ఇతనికిచ్చి అమ్మాయి పెళ్లి చెయ్యను,” అన్నారు.
”సరే అయితే అలాగే రెండు మూడేళ్లు వెతుకుతూనే ఉండండి.”
”అమ్మాయికి పెద్దగా వయసేం అయిందని? ఇంకా ఐదారేళ్లవరకూ తొందరేం లేదు,” అన్నారు.
మేం ఉన్న ఇంట్లో మరో పోర్షన్‌లో ఒక డాక్టరుగారుండేవారు. ఒకే కుటుంబంలా ఇద్దరం కలిసి మెలిసి ఉండేవాళ్లం. బైటివాళ్లకి మేం ఒకే కుటుంబంలోని సభ్యుల్లా కనబడేవాళ్లం. ఆయన మెడికల్ కాలేజిలో పనిచేసేవాడు. నేనొక రోజు డాక్టర్ గారితో, ”మీ కాలేజిలో ఎవరైనా కుర్రాడుంటే చూడండి,” అన్నాను.
నేను చెప్పిన పది పదిహేను రోజులకల్లా ఆయన ఒక కుర్రాడి ఫోటో, చిరునామా తెచ్చి నాకిచ్చి, ”చూడండమ్మా! ఇతను నచ్చితే మిగతా వివరాల గురించి విచారిద్దాం. ఇతను బీ.ఏ. రెండో సంవత్సరం చదువుతున్నాడు,” అన్నాడు.
నేను మా ఆయనకి ఫోటో ఇచ్చి, ”వెళ్లి డాక్టర్ గారిని అన్ని వివరాలూ అడగండి,” అన్నాను.
”ముందు ఫోటో చూడండి, నచ్చితే అన్ని వివరాలూ చెపుతాను,” అన్నాడు డాక్టర్.
”ఊఁ, కుర్రాడు బావున్నాడు!” అని నాతో, ”నీకెలా ఉన్నాడు?” అన్నారు.
”నాకు నచ్చాడు,” అన్నాను.
అప్పుడు మా ఆయన నవ్వుతూ, ”బహుశా ఇతని ముక్కుకి కూడా ఆపరేషన్ అయినట్టుంది. మా అమ్మాయి ముక్కు కూడా ఇలాగే ఉంటుంది. బావుంది!” అన్నారు. తరవాత డాక్టర్‌కేసి తిరిగి, ”మరి మిగతా వివరాలన్నీ చెప్పండి” అన్నారు.
”ఏటా మూడు వేల రూపాయలు తెచ్చి పెట్టే ఆస్తి పాస్తులున్నాయి అబ్బాయికి,” అన్నాడు డాక్టర్.
”ముందు ఇది చెప్పండి, కుర్రాడి తల్లి బతికే ఉందా?” అని అడిగారు.
”తల్లికిచ్చి పెళ్ళి చేస్తారా?” అన్నాను.
”తల్లి లేదన్న వంకతో ఒక కుర్రాణ్ణి ఒద్దనుకున్నప్పుడు ఇతని విషయంలో కూడా ఆ సంగతి తేల్చుకోవాలిగా?”
”తల్లీ ఉంది, ఇద్దరు అక్కలు…, ఒక తమ్ముడూ ఉన్నారు. అతను కూడా చదువుకుంటున్నాడు. చెల్లెళ్లిద్దరికీ పెళ్లయిపోయింది. ఒకమ్మాయి ప్రయాగ లోనూ, రెండోది జబల్‌పూర్‌లోనూ ఉంటు న్నారు. ఇతని తండ్రి పోయినప్పుడు ఇతనికి తొమ్మిదేళ్లు. ప్రస్తుతం ఇరవైమూడేళ్లు. తండ్రి లేనందున కుర్రాడి అక్క భర్త జమిందారీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. అన్నదమ్ములిద్దరూ జబల్‌పూర్‌లో చదువుకుంటున్నారు. మీరు అడగకుండా మొత్తం సమాచారం సేకరించాను,” అన్నాడు డాక్టర్.
”ఈ అబ్బాయి స్వభావం ఎలాటిది? తల్లి ఎలాటిది?” అని అడిగారు మా ఆయన.
”కుర్రాడు బుద్ధిమంతుడు. చదువులో కూడా రాణిస్తాడు. తల్లి స్వభావం కూడా మంచిదే. మీ అమ్మాయిని నేను చెల్లెల్లా చూసుకుంటానని కూడా వాళ్లకి చెప్పాను. తరవాత ఏదైనా సరిగ్గా ఉండకపోతే నేను మీకు మొహం కూడా చూపించలేనని చెప్పేశాను,” అన్నాడు డాక్టర్.
”అవును, వాళ్లు చాలా దూరాన ఉన్నారు. అన్నీ సరిగ్గా విచారించాలి. తరవాత ఏమైనా తేడా వచ్చిందంటే పాపం జీవితాంతం ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. ఏడవడమేనా, జీవితమే మట్టిలో కలిసిపోదూ! మేం కూడా బతికున్నన్నాళ్ళూ ఏడవాలి. ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి,” అన్నారు.
”నేను అన్నీ వాకబు చేశాను. మీరు కూడా వాళ్లకి ఉత్తరం రాయండి. అప్పుడే పెళ్ళేమీ అయిపోవటం లేదుకదా?” అన్నాడు డాక్టర్.
”పెళ్ళి మాటెత్తితేనే నాకీమధ్య భయం వేస్తోంది. అసలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళూ చాలా పెద్ద సమస్యగా తయారయ్యాయి. కాలేజీ కుర్రాళ్ళకి తల్లిదండ్రులంటే బొత్తిగా భయం భక్తీ ఉండటం లేదు. ఇక మిగతా వాళ్ల పట్ల వాళ్ల ప్రవర్తన గురించి చెప్పేదేముంది?” అన్నాడు డాక్టర్.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags