కొండేపూడి నిర్మల
దాదాపు పదేళ్ళ తర్వాత, అనుకోకుండా బాగా దూరపు బంధువుల పెళ్ళి పందిట్లో సీతామహాలక్ష్మి కనిపించింది. అల్లో అల్లో చెన్నై డార్లింగు అరిచాను..
అంత బేజారెత్తే బాజాల మోతలోనూ బాగానే వినిపించినట్టుంది కూల్డ్రింకు ట్రేతో బాటు గిరుక్కున వెనక్కి తిరిగి సంతోషంగా నవ్వింది.
”వామ్మో, గుర్తు పట్టేశావా… అస్సలు నన్ను మర్చిపోలేదా.. కొంచెం కూడా….” అడిగాను,
”భలే దానివే, ఎందుకు పట్టను, ఆపేరుతో నువ్వు తప్ప ఇంకెవ్వరూ పిలవరు కదా.” అంది.
గతం గుర్తొచ్చి ఇద్దరికీ నవ్వొచ్చింది చెన్నై డార్లింగు అంటే – తమిళనాడు పిల్ల అని కాదు, చద్ది, నైవేద్యం అని అర్థం. విన్న వాళ్ళకు అర్థం కాకూడదని అలా ఓ పదం కనిపెట్టాను (నాక్కూడా తను వాల్ క్లాక్ అని పేరు పెట్టింది. గడియారంలో పెండ్యులంలా తల ఊపుతూ మాట్లాడుతానట)
సీతకి దాదాపు నా వయసే వుంటుంది.. నందిగామలో మా ఎదురింటిలో వుండేది. గుండమ్మ కథలో సావిత్రిలా ఇంటి పని అత్తమామలకు సేవలు చేసేది. అన్నిటికీ వంకలు పెట్టే మొగుడి పెత్తనం భరించేది.
”పిచ్చి మాలోకంలా అలా కనిపిస్తుంది గాని బ్యాంకులో ఎంత మంచి వర్కరో తెలుసా..?” అంటాడు నాభర్త.
ఇంక వంకపెట్టడానికి నాలాంటి చుప్పనాతికి ఏం దొరుకుతుంది అనుకోకండి. దొరికింది, మరి! సీత ప్రతి వేసంగిలోనూ కొన్ని ఆదివారాల బాటు పొద్దున్నే ఒక కుక్కను వెతికి పట్టుకునేది. దానికి చద్ది అన్నంలో పెరుగు వేసి నైవేద్యం పెట్టేది. నైవేద్యానికి ముందు పసుపు కుంకాలు దాని మొహంకేసి రుద్ది, భారీ ఎత్తు పూజలు అవీ నిర్వహించేది. పాపం ఆ కుక్కకి నైవేద్యం ఆసక్తిగా వుండేది గాని మంత్రాలకు గుర్రుగా చూసేది.. ఒకసారి అలా గింజుకుని అరిచీ, అడ్డం వచ్చిన ఆమె భర్త శాస్త్రిని కరిచి పారిపోయింది. అప్పుడు కుక్కను వదిలి భర్తను బ్రతిమిలాడుకుని బొడ్డు చుట్టూ సూదులు వేయించింది మా సీత. అక్కడితో అయిందా.. వారం తిరిగేసరికల్లా ఇంకోకుక్కను తెచ్చి కూచుంది. మొగుడు ప్రాణభయంతో దూరంగా వుండిపోయాడు.
ఎందుకిలా చేస్తున్నావని అడిగితే చెప్పింది చద్ది నైవేద్యం కనక కుక్కకు పెడితే పిల్లలకు అమ్మవారు (చికెన్ పాక్స్) రాదట. పిల్లలని అమ్మవారు ఆవహించినా ఆవహించకపోయినా, కుక్క కాటువల్ల ఇంటిల్లి పాదికీ సూదుల వైద్యం తప్పదు కదా. పైగా అది వీధి కుక్క, దానికి వాక్సిను ఎవరేస్తారు పాపం, దూరంగా నిలబడే చెప్పి చూశాను. విన్లేదు చాల్లే తెలివి అన్నట్టుగా చూసి ”నీకేం తెలుసు, అమ్మవారు పట్టుకుంటే ఎంత కష్టమో… లాస్ట్ మార్చిలో అలా వదిలేసినందుకు బ్యాంకు సెలవంతా వేస్టయి పోయింది తెలుసా…? ఆ డాక్టర్లే దీనికి మందు లేదన్నారు ఏమనుకున్నావో… ఏమిటో” అంది.
నేనింక నోర్మూసుకున్నాను. అది మొదలు నన్ను మార్చడానికి తను, తనకు నచ్చజెప్పడానికి నేనూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళం ప్రయత్నాఆలు చేస్తూ వుండేవాళ్ళూ.
అలాంటలాంటి చెన్నై అమ్మాళ్ అప్పట్లోనే నన్ను ఆశ్చర్యపెట్టే పనికూడా ఒకటి చేసింది ఆరోజు ఆదివారం, జోరున వాన, ఎదురింటిలో ఏదో గొడవ, సీతామహాలక్ష్మి ఏడుస్తూ గేటు తీసుకుని సూట్కేసుతో సహా తడుసుకుంటూ అందరి ప్రశ్నార్ధకాల్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కుతూహులం ఆగక నెత్తిన కొంగు కప్పుకుని పక్కింటి శారదగారు వాళ్ళని పలకరించి మరీ వచ్చి, సమాచారం అందించింది..
”ఏమీ లేదమ్మా వడ్ల గింజలో బియ్యపుగింజ. ఇంటి పేరు గోల ఒకటి వుంది కదా ఇద్దరికీ. ఆఫీసు రిజిస్టరులో ఇంటి పేరు మార్చుకుంటావా లేదా అంటాడు శాస్త్రి ససేమిరా అంటుంది ఆ పిల్ల. అదే గొడవ, ఆ పళాన చెయ్యి చేసుకున్నాడులా వుంది అంతే సీత కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని కూడా పట్టించుకోలేదు” అంది.
”అంతా కలికాలం..! కాకపోతే, ఏం పోయింది ఇంటిపేరు మార్చుకుంటే,” అక్కడే కూచున్న మా మామగారు వత్తాసు పలికాడు..
”పోనీ ఏం పోయింది ఇంటిపేరు మార్చకపోతే…?” నేను అందుకున్నాను.
శాస్త్రి కేమైనా పిచ్చా? పెళ్ళికి ముందునుంచీ అందరికీ అలవాటయిన పేరులో ఇప్పుడు పేరు మార్పు ఎందుకు..? దానివల్ల అతనికేం లాభం? అతనికోసం మసాలా మానేసినంత తేలిగ్గా, చుడీదార్లు వదిలేసుకున్నంత తేలిగ్గా ఇంటిపేరు ఎలా మార్చుకుంటుంది.
నా మనసంతా రకరకాల ప్రశ్నలతో నిండిపోయింది. ఆ వారమే మేం బదిలీ అయి వచ్చేశాం.. సీతకోసం చూశాను. తను వూర్నించి రాలేదు. ఆగే వీలులేక వచ్చేశాను.
ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే చూడ్డం. సీతతో మాట్లాడు తున్నంత సేపూ, కలిసి భోజనం చేస్తున్నంతసేపూ అదే గుర్తొచ్చింది.
”ఇంతకీ…. ఇంటిపేరు సంగతి ఏమయింది…? మార్చేసుకున్నావా మరి…” ఆగలేక అడిగాను.
”చచ్చినట్టు.. మార్చాను. ఆఫీసులోనే కాదు, స్కూలుతో సహా అన్ని సర్టిఫికెట్స్ లోనూ… చాలా ప్రయాసపడి మార్పించాడులే శాస్త్రి” అంది. తన మొహంలో ఇందాకటి వెలుగు లేదు.
”అవును గాని ఎందుకిష్టం లేదు నీకు, ఇంటిపేరు మార్చడం చెప్పు”, అన్నాను ఆసక్తిగా.
”వాళ్ళింటి పేరు ఏమిటో తెలుసా నీకు”, అడిగింది.
లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాను.
”చెప్పనా..” అని కాస్సేపు సందేహించి, ”పుల్ల పెంట..” అంది.
”ఓస్ అందుకని ఇష్టంలేదా.. నేను ఇంకేమిటో అనుకున్నాను. పోనీ మల్లెల వేళ అయితే నచ్చేదా, అప్పుడు మార్చుకునేదానివా?” అడిగాను, హాస్యంగా.
”అలా ఏం కాదులే, పాతికేళ్ళ పాటు అలవాటయింది ఒక్కసారి మార్చడం అంటే ఎలా వుంటుంది…? మా ఆఫీసులో అంతా ఏమనుకుంటారు. అనుకున్నాను అప్పటిలో … ఇప్పుడింక అలవాటయిందిలే.. తప్పదు కదా” అంది.
అంటే శ్రీకంఠం సీతామహాలక్ష్మిని, పుల్లపెంట సీతామహా లక్ష్మిగా మార్చడానికి చాలా ఖర్చు పెట్టాడు శాస్త్రి. జీవితంలో ఇంక ఏ పనికీ అంత శ్రద్ధ వుండి వుండదు.
ఈ సందర్భంగా చాలా రోజుల క్రితం ఒక ఆంగ్ల దిన పత్రికలో బాంబే హైకోర్టు చేసిన ప్రకటన గుర్తొస్తోంది.విడాకులు తీసుకున్న మహిళ తప్పనిసరిగా భర్త ఇంటి పేరు వదిలి, తండ్రి ఇంటిపేరుతో చెలామణి కావాలట. ఇది ఒక ప్రత్యేకమైన కేసుకు సంబంధించి, అతని కోట్లాది రూపాయల ఆస్తి పాస్తులు లావాదేవీలు దుర్వినియోగం కాకూడదనే ముందు జాగ్రత్త చర్యగా ఫిర్యాది దారుడి తరపున ఏర్పాటయిన ఆదేశం అని కూడా వుందిట. కల్పనా శర్మ వ్యాసంలో దీన్ని చదివాను… దీని ప్రకారం పెళ్ళి అవగానే, భర్త పేరు, అతడు వదిలెయ్యగానే తండ్రి పేరు వర్తిస్తుందన్న మాట బావుంది. స్త్రీలకొక స్థిరమైన వారసత్వమే లేదన్నమాట.
అయితే రాజకీయ లబ్ది కోసం ఇది తారుమారు చేసే అధికారం కూడా మగవాడికే వుంది తెలుసా..! ఉదాహరణకి గత ఏడాది కాంగ్రెసు తరపున సాధారణ ఎన్నికలకి రాజ్యసభ సభ్యుడుగా నిలబడ్డ సునీల్‌దత్ కుమారుడు సంజయ్‌దత్. మరో పార్టీకి ప్రచారం చేస్తున్న తన సోదరి ప్రియాదత్‌కి తండ్రి రాజకీయ వారసత్వం వర్తింకూడదనే ఆలోచన కొద్ది వివాహితులైన స్త్రీలెవరికీ పుట్టింటి పేరు వర్తించాల్సిన అవసరం లేదని వ్యాఖ్య చేశాడు. నిజానికిది ఉత్తర భారత సంప్రదాయానికే విరుద్ధమైన విషయం. అంటే ఇక్కడు సంప్రదాయం కంటే రాజకీయ లబ్ది ముందుకొచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కూడా ఇంకా, అబ్బాయి జన్మ నక్షత్రం ప్రకారం అమ్మాయి పేరు, జన్మ వివరాలు మార్చిపారేసిన కుటుంబాలు నాకు తెల్సు. ఇది మహారాష్ట్రలో మరీ ఎక్కువ.
ఎటొచ్చీ వాస్తు ప్రకారం వున్న గోడలు కూల్చి మళ్ళీ కట్టి నట్టు, అమ్మాయి కళ్ళూ ముక్కూ, నోరూ తలక్రిందులు చెయ్యగల సర్జరీ ఒక్కటే అభివృద్ధి కావాల్సి వుంది.
సామాజిక రంగాల్లో స్థిరపడి ఒక దశకు చేరిన మహిళలు తన అస్తిత్వం కొనసాగించడం కోసం ఇంటి పేరు మార్చకపోవడం చూస్తూనే వుంటాం. వివాహానికి పూర్వం వున్న పాస్‌పోర్ట్, బ్యాంక్ అక్కౌంట్, డ్రైవింగు లైసెన్స్ లాంటివి మార్చాల్సి రావడంలో వున్న ప్రయాస పడలేక కూడా ఇలా చేస్తారు. ఇంత చిన్న సాంకేతిక సదుపాయం కోసం కూడా ఆ ఇల్లాళ్లు కుటుంబానికి ఎంతో జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. వారి ప్రేమాభిమానాలు, రాగ ద్వేషాలు తరచూ అనుమానించబడుతూ వుంటాయి. ఒకవేళ వారు పనిచేస్తున్న రంగాల వల్ల సమాజంలో కీర్తి, గుర్తింపు దక్కుతున్నట్టయితే దాని పట్ల అత్తింటి జనాభాకి ఒక రకమైన కినుక కూడా వుంటుంది. పుట్టింటి వాళ్ళకయితే ఇరకాటంగా వుంటుంది మరి ఇలాంటి పేరు మార్చుకోని ఇల్లాళ్ల వల్ల ఒకవేళ అపకీర్తి వస్తుందనుకోండి. అప్పుడు అత్తింటి పుట్టింటి వాళ్ళిద్దరూ ఆమెను తమ కుటుంబ వారసత్వానికి దూరంగా వుంచడానికే చూస్తారు. హెచ్.ఐ.వి. ఎయిడ్స్ బారిన పడ్డ స్త్రీలు ఇందుకు గట్టి రుజువు. సామాజిక, ప్రజా ఉద్యమాల్లో అయితే మనిషి పేర్లకు చివర వుండే మూర్తి, రెడ్డి, చౌదరి లాంటి తోకలు కులాన్ని సూచిస్తాయి. కనక ఆ ఇంటి కూతుళ్ళకూ, కోడళ్ళకూ రెండేసి, మూడేసి అక్షరాలున్న చిట్టి పొట్టి పేర్లే వుంటాయి. అదే ప్రజాస్వామికమనే బోధన వింటూ వాళ్ళూ పెరుగుతారు.
ఇంటిపేరు పూర్తిగా రాయడం అనేది అనవసరం. అనాగరికమనుకునే ఒక దశలో అది ఆంగ్లంలో అది పొడి అక్షరాలుగా మారింది. అవే పొడి అక్షరాలు ఇప్పటి ఆధునిక అస్తిత్వ ఉద్యమాల్లో పోరాట చిహ్నాలుగా తలెత్తాయి.
ఈ మొత్తం మార్పుల చేర్పుల పర్వంలో ఆడ వాసన గాని ప్రమేయంగాని ఎక్కడయినా వుందా? మనం ఆకాశంలోనే కాదు సొంత ఇంటిలో కూడా లేమని తెలీడం లేదూ..!
ఇంతలావు సంప్రదాయ, రాజకీయ, ఉద్యమ, అస్తిత్వ ఉద్యమకారుల ఇంట్లో అయినా సరే ఏ ఇల్లాలయినా ఇంటిపేరు మార్చడానికి నిరాకరించడంతోబాటు, వాదనకు కూడా నిలిచిందనుకోండి. అప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల సంగతి తెచ్చి వీళ్ళ అస్తిత్వమేమిటి అని ప్రశ్నిస్తారు. వీళ్ళు ఎవరి ఇంటిపేరు నిలబెట్టాలి, పోనీ చెడగొట్టాలి అని అడుగుతారు. పది అంకెలు లెక్కపెట్టేలోపు జవాబు చెప్పెయ్యాలి. చెప్పలేరూ అయితే, అందరూ దూకిన గంగలో వీరూ దూకక తప్పదు. వ్యక్తిత్వాన్ని బలి పెట్టక తప్పదు. ఒక పక్క పుట్టిన బిడ్డకి తల్లే సహజ గార్డియన్ అని తీర్పు వున్నా సరే, కాగితాలకీ జీవితానికీ మధ్య దూరమెంతో మనకి తెలీకపోతే కదా..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చాలా అసమగ్రంగా, తప్పులుగా ఉంది. ఈ సబ్జక్టు మీద ఇప్పటికే చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. రంగనాయకమ్మ రాసిన “ఇంటి పేర్లు ఎలా వుండటం సరైనది” అన్న పుస్తకం చదవండి. సమానత్వం గురించి సరి అయిన అవగాహన లేకపోతే, ఇలాంటి వ్యాసాలే పుట్టుకొస్తాయి. తల్లిదండ్రుల ఇద్దరి అసలు పేర్ల లోని భాగాలతో బిడ్డ ఇంటి పేరు తయారు చేయడం ఒక్కటే తర్క బద్ధమైన విషయం. మిగతావన్నీ తప్పు, తప్పు విషయాలే!
– సావిత్రి
ప్రకటించిన అసహనానికి చాలా సంతోషం సావిత్రిగారూ.
నేను రాసినది సిద్ధాంత వ్యాసం కాదు.
రెగ్యులరు కాలం.
అందులో సాధారణంగా నాచుట్టూ మనుషుల జీవితమే వుంటుంది. అతిశయోక్తులు లేవు.
.నా ధోరణి తప్పులుగా, అసమగ్రంగా వుందన్నారు బావుంది. మరి, ఎక్కడ తప్పుగా, అసమగ్రంగా వుందో చెప్పగలగాలి. అప్పుడే అది సహేతుక విమర్శ అవుతుంది. దానివల్ల రాసిన నాకూ, చదివిన పాఠకులకూ ఉపయోగం.
ఈ వస్తువు మీద ఎంత మందో రాసేశారని అంటున్నారు. మంచిదే కదా. రంగనాయకమ్మ సూచన ఎవరైనా పాటించారా..? పోనీ మీఇంట్లో అయినా…?
అయినా ఇది రాయాలి, ఇది వద్దు అని మీరు రచయిత్రికి డిక్టేషను ఇచ్చే పనిపెట్టుకోవడం ఏమిటండీ.., సిల్లీగా లేదూ..?
మీ పని మీరు చూసుకోండి మేడం.
నిర్మల గారూ,
ముందస్తుగా నా harsh comments కి క్షమాపణలు. బాగా ఆలోచించకుండా హడావిడిగా రాశాను. అది నేను చేసిన మొదటి తప్పు. మీకు చిరాకు కలిగించడం నా వుద్దేశ్యం కాదు. రెండోది ఇలాంటి విషయాల్ని comments section లో పైపైన ప్రస్తావించడం ఇంకో తప్పు. ఈ రెండు తప్పులకూ క్షమాపణలు కోరుకుంటూ,
సావిత్రి