శైలజామిత్ర
ప్రశ్న మొదలవుతోంది
ఆకాశానికి…అవనికి మధ్య
అతివ నాలోసగం నాలోసగం అంటూ…
వాటికి తెలియదు ఎక్కడున్నా
ఆమెకు ఒరిగేదంటూ ఏమీ లేదని…
కుప్పలూర్చి, గంపలెత్తి,
కూడు లేక గూడు లేక..కట్టుకునేందుకు కోకలేక,
కట్టుకున్న మగాడు సరిలేక..
బతికేందుకు దారిలేక…
కన్నీటితో కాపురం చేసే స్త్రీని
కార్యేషుదాసీ అంటూ పిలిస్తే చాలుకదా…
నిత్యం కొత్త పెళ్లికూతురై తళతళలాడడానికి…
యుగాల తరబడి…తరతరాల తరబడి…
మాయచేస్తూ…మోసం చేస్తూ…
అమ్మోరు అని మంత్రాలు, శ్లోకాలు, పురాణాలు వల్లెవేస్తూ
సూక్తులు, సామెతలు తిరగరాస్తూ
మహిళకు మహత్తర స్థానం ఇస్తున్నామని తెలియజేస్తూ
మాటకు విలువ నీయక మసిగుడ్డను చేసిన స్త్రీని
కరణేషు మంత్రి అంటూ పీఠాన్నిస్తే చాలదా…
చరిత్ర కొత్తపేజీలతో నింపుకోవడానికి…
వంటింట్లో అంట్లగిన్నెల మధ్య
ఒక సత్తు గిన్నెగా మారిపోయి…
ఒకో కడుపూ ఒక్కోసారి నింపుతూ
నచ్చిందంటే చెంచాలగుంపులా నవ్వుతూ…
చేతికి నోటికి నీటిని అందిస్తూ
మిగిలిన మెతుకులను మగతలో తింటూన్న స్త్రీని
భోజ్యేషుమాతా అని తలుచుకుంటే చాలదా…
మానవత్వం ఇంకా వుందని మాట్లాడుకోవడానికి…
మనసులో లేకున్నా అర్ధాంగిగా అంగీకరిస్తూ
పరమాత్ముడైనా, పరమనీచుడైనా పాదాలను వత్తుతూ
తాగొచ్చినా, తన్ని తగలేసినా, తన్నుతాను అర్పించుకుంటూ
వేరొకరి భార్యను కోరినా, బిడ్డనే భోంచేసినా…
అమ్మేసినా, అంగడిసరుకును చేసినా
ప్రేమపేరున హత్యచేసినా… పురిటిలోనే పంపేసినా…
శయనేషురంభ అనే ఒక్క బిరుదు సరిపోదా స్త్రీకి
పురుష సమాజం మరొక్కమారు కాలర్ సర్దుకోవడానికి…
అమ్మగా బిడ్డల్ని మోస్తూ, ఆలిగా భర్తను భరిస్తూ
అడ్డాల బిడ్డలే అనుకుంటూ
కన్నకొడుకు ఎప్పుడు చస్తావు అని ముఖంపై అడిగినా
మనవడు ఓ ముసలిదానా అన్నా
జబ్బుచేస్తే జబర్‌దస్తీగా రోడ్డుపై పారేసినా
బతికుండగానే కాల్చేసినా… స్త్రీకి
క్షమయా ధరిత్రి అంటూ ఆశీర్వదిస్తే చాలదా
పుడమి మరింతకాలం పూతోటలా మారడానికి…
ఇన్నింటిని మూటకట్టుకున్న అమ్మ స్థానానికి
ఇవన్నీ భరిస్తున్న అర్ధాంగి ఓపికకు
కాలం కలిసిరాక ఎదురుచూస్తూ సేవచేస్తున్న వృద్ధాప్యానికి
మీరిచ్చే కానుక ఆత్మీయతకు బదులు
సంవత్సరానికొక్కమారు మహిళాదినోత్సవమా?
బతికుండగానే మీరు పెడుతున్న దినమా…?
స్త్రీని ఆలి, ప్రియురాలు రెండు దశలలోనే వెదుక్కుంటున్న
ఓ పురుష సమాజమా..!!
ఆదరించకున్నా… అవతలపారేసినా నువ్వు
కోల్పోతున్నది కోటికాంతి సంవత్సరాలు వెదకినా
దొరకని నీ వునికినే…
భూమాత లేనిదే బతుకులేదు…
స్త్రీ లేనిదే నీకు పుట్టుకే లేదు…!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
చాల బాగుంధి