డా: వి. త్రివేణి
ఉపోద్ఘాతం :
కథారచన తొలిరోజుల్లో సాహిత్యమంతా అగ్రవర్ణాల కేంద్రకమై కొనసాగింది. నాటి బ్రిటీష్ విద్యావిధానంలో తెలుగు సాహిత్యమంతా ఆంగ్ల (పాశ్చాత్య) సాహిత్య ప్రభావానికి లోనైంది. పాశ్చాత్య సాహిత్య ప్రభావ కబంధహస్తాల్లో చిక్కుకొన్న అగ్రవర్ణాల రచయితలు దానికనుగుణమైన వాతావరణాన్నే కథారచనలో ప్రవేశపెట్టారు. పాశ్చాత్య భావనలు, భావుకతలు, కాల్పనికతలు మొదలైన తొలినాటి కథల్లో కన్పించే అంశాలు.
కాని 1980లో మొదలైన సామాజిక పరివర్తన దక్షిణ భారతదేశంలో వేగంగా పుంజుకొంది. సాహితీ రంగంలో కూడా తనదైన స్థానాన్ని సుస్థిరం చేసింది. దీని పర్యవసా నంగా తెలుగు సాహిత్యంలో గతం కంటే ఎక్కువగా బి.సి. స్త్రీలు కథారచన చేసేందుకు అవకాశం ఏర్పడింది. గత తరం కథా రచయిత్రుల కంటే ప్రస్తుత బి.సి. కథా రచయిత్రుల కథల్లో చాలా వ్యత్యాసం కన్పిస్తుంది. వస్తువులో, భాషలో, శైలిలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తుంది. గతంలో కాల్పనికత లేదా ఆదర్శ జీవన చిత్రణ ఉంటే, నేటి రచనల్లో వాస్తవికత లేదా సహేతుక జీవన చిత్రణ ఉంటుంది. ప్రస్తుత కథా రచయిత్రుల పరిశీలన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. సమకాలీన సమాజం, సమాజంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు, కళ్లముందు కదలాడే వ్యక్తులు వీరి కథల్లో జీవం పోసుకొన్నాయి. జీవన విధానంలో భాగంగా కులవృత్తుల ప్రాధాన్యం చోటుచేసుకొంది. వారి కథారచనలను పరిశీలిద్దాం.
బొమ్మ హేమాదేవి గారు తొలినాటి కథారచయిత్రులలో పేరెన్నికగన్నవారు. ఆమె జననం 14-9-1932. జన్మస్థలం నిజామాబాదు. బొమ్మ హేమాదేవి పూర్వీకులంతా నిజాం పాలనలోనే ఇందూరు ప్రాంతంలోని ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకొన్నారు. స్థానికంగా ప్రజలు హేమాదేవి వంశీకులను చాలా గౌరవభావంతో చూసేవారు. హేమాదేవి అసలుపేరు రుక్మిణీ. ఆమె తాతగారు నర్సాగౌడ్. వీరు పేదలయందు కరుణభావం కలవారు. దానధర్మాలలో వీరిది ఎముకలేని చేయి. నిజాం ప్రభువులు నర్సాగౌడ్ సేవాదృక్పథానికి సంతోషించి ”రాజా బిరుదు”ను ప్రదానం చేశారు. నర్సాగౌడ్ కొడుకు రామాగౌడ్. రామాగౌడ్ కూతురు హేమాదేవి.
1975 నాటికే ఈ రచయిత్రి 13, 14 సం||లుగా కథలు రచిస్తున్నారు. అంటే దాదాపు 1950వ దశకం నుంచి సాహిత్య వ్యాసంగం ప్రారంభించినట్లు తెలుస్తుంది. కానీ చాలా సంకలన గ్రంథాల్లో, రచయిత్రుల డైరెక్టరీలలో ఈ రచయిత్రిని విస్మరించటం జరిగింది. ఎందుకు అలా జరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్నిబట్టి ఒక్క విషయం తెలుస్తుంది. రచయిత్రి కేవలం తన సాహిత్యం ద్వారా సమాజాన్ని సంస్కరించాలనే అనుకోవటం కారణం కావచ్చు. కాని వాటిని భద్రపరిచి పుస్తకాలను ప్రచురించుకోవాలనే ఉద్దేశం లేకపోవచ్చు. కథానిలయం ట్రస్టు వారు వేసిన సంకలన గ్రంథంలో మాత్రమే బొమ్మ హేమాదేవిని గూర్చి ప్రాథమిక సమాచారం తెలుస్తుంది.
రచయిత్రి రచించిన కథలు – ప్రచురణ సంస్థలు, పత్రికలు :
1. ”నవతరం” కథ – 1975 సం|| – కలాసాగర్ మద్రాసు ట్రస్టు
2. ”అన్నపూర్ణ” కథ – 1976 సం|| – జయశ్రీ మాస పత్రిక – సంక్రాంతి సంచిక
3. ”శాంతినిలయం” కథ – 1977 సం|| – కలాసాగర్ మద్రాసు ట్రస్టు
4. ”కమ్లి” కథ – 1977 సం|| – కలాసాగర్ మద్రాసు ట్రస్టు
5. ”ఫాల్స్ ప్రైడ్” కథ – 1979 సం|| – కలాసాగర్ మద్రాసు ట్రస్టు
6. ”చోటీ చోటి బాతే” – 1981 సం|| – కలాసాగర్ మద్రాసు ట్రస్టు
రచయిత్రి పై కథలను హేమ, యమున, దేవిరమ అనే కలం పేర్లతో ప్రచురించారు. వీటికంటే ముందుగా 1974లో ఆంధ్రజ్యోతిలో రామాయణంలో రెండు ఉత్తరాలు, తరుణి మాసపత్రికలో ”బంగారుగూడు”, ”కుంకుమపూలు” అనే కథలు ప్రచురించారు. కరీంనగర్‌కు చెందిన బొమ్మ నారాయణగౌడ్ భార్యయైన హేమాదేవి 22-11-1996లో మరణించారు.
పి. సరళాదేవి గారు 1937లో విజయనగరంలో జన్మించారు. భర్త పి. కుమారస్వామి గారి ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో రెండు, మూడు దశాబ్దాల పాటు నివసించారు. అందులోనూ ఒక దశాబ్దకాలం హైద్రాబాదులో ఉన్నారు. ”కాలాతీతవ్యక్తులు” నవల రాసిన పి.శ్రీదేవిగారి ప్రోత్సాహంతో రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. సామాజికపరంగా, కుటుంబపరంగా స్త్రీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కథావస్తువులుగా గ్రహించి 1960వ దశకంలోనే కథలూ, గేయాలూ రచించారు. మొదటి కథాసంపుటి 1962లో ”కుంకుమరేఖలు” వెలువరించగా, 1978లో ”సరళాదేవి కథలు” అనే పేరుతో రెండవ కథాసంపుటి ఆవిష్క రించారు. కథలూ, గేయాలే గాక నవలలు, తెలుగువారి జీవన విధానాన్ని అద్దంపట్టే సామెతలకు సంబంధించిన ”సామెత” అనే గ్రంథాన్ని రచించారు.
1960వ దశకంలో కథాకల్పనా రచయిత్రులలో పి. సరళాదేవి గారు అగ్రగణ్యులుగా నిలిచారు. ”లింగభేదమనేది వ్యాకరణంలోనే గాని, సాహిత్యంలో ఉండనేరదనేది నైసర్గిక సత్యం” – గోరాశాస్త్రి (కుంకుమరేఖలు) స్త్రీ చైతన్యాన్ని కాంక్షించిన వారిని గుర్తు చేసుకోవటంలో భాగంగా అన్నమాట. అలాంటి సమాజాన్ని స్థాపించటం ఆమె కథానికల సంకల్పం. కథా సాహిత్య సృష్టిని ఒక ఉత్తమమైన ఆత్మసాధనగా మార్చి, భవిష్యత్తు పట్ల అభ్యుదయ కాంతిరేఖలను ప్రసరింపజేశారు. పరిణతి పొందిన సృజనాత్మక శక్తి, నిబిడీకృతమైన మేధోశక్తి ఆమె కథల్లో సాక్షాత్కరిస్తాయి.
రచయిత్రి కథాలక్షణాల్లో సంస్కృతి, భాష, మానవ మనస్తత్త్వ పరిశీలన ముఖ్యమైనవి. కథాసాహిత్యం ద్వారా సంస్కృతిని గౌరవించటం, పరిరక్షించటం ప్రధాన లక్ష్యమైతే, దానికి అనుగుణంగా కథావస్తువును చిత్రీకరించటంలో అపారమైన నిగ్రహం చూపటం ఆమె ప్రత్యేకత. ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఇంద్రియ చపలత్వాలు, దుష్ట సమాజ చిత్రీకరణ ఆమె సంస్కృతికే వ్యతిరేకం. ఆమె విగ్రహమే నిగ్రహం. అది ఆమెకొక ఆభరణం.
పూర్తిగా భాషపైన స్వాధీనతను ఏర్పరచుకొన్న రచయిత్రి శైలి అత్యంత సరళంగా, సహజంగా ఉంటుంది. అంటే ఒకే చాలులో మొలకెత్తిన మొక్కల్లాగా పొందికైన పదాలు కథాగమనానికి హాయి గొలుపుతాయి. ఒక సాహితీపరుడికి మానవత్వం పట్ల ఎంత ప్రేమ అవసరమో రచయిత్రికి తెలుసు. అందుకే తన కథలల్లో వివిధ పాత్రలపై సానుభూతిని కల్గి ఉన్నా, నిశితమైన మానవ స్పర్శ చేశారు. ఆమె కథలన్నీ స్త్రీల చుట్టూ తిరిగినా, ఏ ఒక్కదానిని ఉద్దేశించినవి గానీ, ద్వేషించినవి గానీ లేవు. మధ్యతరగతికి చెందిన పి. సరళాదేవి స్వాభావికంగానే పాతకొత్తల మధ్యలో నలిగి నేటి యుగసంధిలో గమ్యమేదో తెలియని ఆధునిక యువతుల బాధలను ఎంతో నేర్పుతో చిత్రీకరించి, స్త్రీల హృదయాలను, వారి సున్నితమైన భావాలను తన కథల ద్వారా ఆవిష్కరించారు. ఇవేగాక మధ్యతరగతి కలుషహృదయాలు, గర్వాటోపాలు, అల్పత్వ మనస్తత్వాలు కన్పిస్తాయి.
”కుంకుమరేఖలు” కథలో లోకంలో బతకడం నేర్చుకోవాలనే హితువు దాగి ఉంది. ఇందులో హేమలత విద్యావంతురాలైనా లోకం చదవని యువతి. ఏ పనిచేసినా, ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా నిజం మాట్లాడటమే గానీ, తప్పు చేయకపోవటమనేది ఆమెకు అలవాటు. తనకు నచ్చినది ఏదైనా, ఏమైనా ఎదుటివాళ్లతో కరాఖండిగా చెప్పటమనేది ఇతరులకు నచ్చకపోయేది. తను అత్తవారింటికి వెళ్లినప్పుడు తోడుకోడళ్లు వారి వారి పుట్టింటి వంశాదులను గూర్చి లేని గొప్పలు చెప్పుకోవటం, పుట్టింటికి వెళ్లినప్పుడు తను ఎంత మంచిగా, ఆరోగ్యంగా ఉన్నా చిక్కిపోయావని అనటం మొదలైన పైపై మాటలు హేమలతకు గిట్టేవి కావు. కాని చివరకు ఎదుటివారికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం, ప్రవర్తించటం నేర్చుకొంటుంది.
”ఎదురుచూసిన ముహూర్తం” కథలో మధ్యతరగతి దిగువన ఉన్న జీవితాల చిత్రణం ఉంది. చాలా పేద కుటుంబాలలో భార్య కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులను భర్తలు తమ పేకాటలకు, తాగుడుకు తగలేయటం గమనిస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒకనాడు భర్త సంపాదించినా ఇలాంటి వ్యవహారాలే గానీ ఇంటి అవసరాలకు ఇవ్వకపోవటం గమనిస్తున్నాం. ఆ కుటుంబాల్లోని మగపిల్లలు బలాదూరుగా ఊరిమీద పడి తిరగటం, వేళకు ఇంటికి వచ్చి తినటం తప్ప మరే పని చేయరు. ఇలాంటి కుటుంబాల్లో ఆడపిల్లల స్థితిగతులను గూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చదువుసంధ్యల మాట అటుంచి, కేవలం ఇతరుల ఇండ్లల్లో పనిమనుషులుగా మారిపోవటం కన్పిస్తుంది. పూర్తిగా ఇలాంటి పరిస్థితులే ఉన్న ఈ కథలో ఒక ఆడపిల్ల అంతో ఇంతో చదువుకొని, చిన్నపాటి ఉద్యోగం చేసి సంపాదించినా గానీ, తనను ఎవరూ పట్టించుకోకపోవటం, తనకోసమంటూ ఎవరూ ఆలోచించుకోకపోవటం ఆమె హృదయాన్ని కలచివేస్తుంది. ఇంకా తన సంపాదనతో చెల్లెలిని చదివించాలి. అప్పులను తీర్చాలి. సంసారం నడిపించాలి. అప్పుడు ఆమెకు తన కర్తవ్యమేమిటో తెలిసొచ్చింది. ఇంతటి భారాన్ని మోస్తున్నా ఆమె తల్లిదండ్రులు గానీ, చెల్లెలు గానీ, భర్త గానీ, కొడుకూ, కూతుళ్లు గానీ ఆమె మనోవేదనను అర్థం చేసుకోలేకపోయారు.
”నీకోసం తెచ్చానమ్మా” అంటే మురిసిపోయి తీసుకొనే అదృష్టం ఆమెకు లేదు. కనీసం ఓ పెన్సిల్ ముక్కైనా తెచ్చి యిచ్చిన వారు లేరు. కొత్త బట్టలు, కొత్త గాజులు, కొత్త రిబ్బను… ఈపాటి భాగ్యం – అసలే లేదు. చివరకు ఆమె మృత్యువాత పడ్డప్పుడు మాత్రమే తను ఎదురుచూసిన ముహూర్తం సమీపిస్తుంది.
పై కథంతా స్త్రీ పరమైన బలమైన కోరిక చుట్టూ తిరుగు తుంది. రచయిత్రి మధ్యతరగతి ఉద్యోగినుల జీవనస్థితిగతులను వెల్లడించి, సున్నితమైన వారి వారి గుండె చప్పుళ్లను అనంతమైన ఆత్మఘోషలో ఐక్యం చేశారు. విరామం లేని జీవితవిధానం ఆధునిక స్త్రీల పాత్రల్లో ప్రతిబింబిస్తుంది.
సహజమైన లోకరీతి, జీవిత నిజస్వరూపం చాలా కథల్లో ఆమె సృష్టించిన వివిధ పాత్రలో కన్పిస్తుంది. ఉదా : ”ఉద్యోగం వచ్చిన దుర్గకు తన మీద తనకే ఆశ. తన జీతం మీద ఆశ. తన జీవితం మీద ఆశ. జీవితచక్రం తిరిగిపోతుంది కాని దుర్గ ఆశ ఆశలాగే ఉంది.” ది పి.సరళాదేవి గారి సుందరమైన శైలికి ఒక మచ్చుతునక మాత్రమే.
కె. వరలక్ష్మి గారు తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించారు. సాహిత్యరంగంలో అవిరామమైన కృసి సలుపుచూ వందకు పైగా కథలు, వాటికి కొలమానం కాని పురస్కారాలను పొందారు. కథలే గాక నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు అనేకం రచించారు. ఇవన్నీ సంపుటాలుగా వెలువడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో ప్రచురించబడ్డాయి. రచయిత్రి చేసిన సేవను గుర్తించి వివిధ సంస్థల వారు అనేక అవార్డులను ప్రదానం చేశారు. రచయిత్రి కథలకు గాను ఎ.జి. ఆఫీస్ వారి రంజని అవార్డ్స్ రాజాలక్ష్మీ న్యూజెర్సీ పురస్కారాలు సహృదయ, విమలాశాంతి, హసన్ ఫాతిమా అవార్డ్స్ అప్పాజోస్యుల-విష్ణుబొట్ల ఫౌండేషన్ అవార్డ్ రంగవల్లి అవార్డు ఆఐఊఏ ధర్మనిధి పురస్కారం చాసో స్ఫూర్తి పులికంటి సాహితీ సత్కృతి ఆర్.ఎస్. కృష్ణమూర్తి అవార్డ్ వంటివే గాక మూడు పర్యాయాలు ”ఆటా”, ”తానా” సభలకు వెళ్లి వచ్చారు.
కె.వరలక్ష్మి గారు సామాజిక అభ్యుదయం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, వర్గసంఘర్షణ లేని వ్యవస్థ కోసం కథాసాహిత్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకొన్నారు. సమాజంలో స్త్రీల జీవిత సమస్యలు, అతిసామాన్యమైన వ్యక్తుల జీవన పోరాటాలు, నిస్సహాయతలు, రాగద్వేషాలు, ప్రేమలు-అసూయలు, అహంభావాలు మొదలైనవి రచయిత్రి కథావస్తువులు అయినా, వాటి ద్వారా మార్పును సాధించటానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంతో గల కథలను మూడు సంపుటాలుగా రచించారు. అవి 1. జీవరాగం, 2. మట్టి-బంగారం, 3. అతడు-నేను. కథలంటే ఇష్టపడే రచయిత్రి కథనొక కథలా గాక ఒక జీవితంగా చదవటం నేర్చుకొంది. ఎందరో జీవితాలను ధైర్యం ఇచ్చి నిలిపింది. కథాసాహిత్యం ఆమెలో గల అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించింది. అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి వరకు గల అన్ని కోణాలను కథల ద్వారా స్పృశించారు. ఆర్ద్రతతో కూడి గుండె తలుపులను తెరిచిన కథలు రచయిత్రికి ఆయా సామాజిక రంగాలపై గల సానుభూతిని వ్యక్తపరుస్తుంది. ఏ తరగతికి చెందిన స్త్రీలు అయినా చుట్టూ ఉన్న నిర్బంధవలయాలను ఛేదించుకొని ముందుకు రావాలనే సంకల్పం రచయిత్రి కథలకుంది.
ఆడపిల్లగా పుట్టకముందునుంచే కష్టాలు ప్రారంభం అయితే పుట్టిన తర్వాత ప్రతి ఒక సంఘటనలో బాధను అనుభవిస్తూనే ఉంది. చివరికి అది మరణం వరకు కొనసాగి విషాదాంతమౌతుంది. ”జీవరాగం”లోని ”పాప” కథలో ఏడెనిమిదేళ్ల చిన్న పాప దీనగాథ ఉంది. ఒక రైలు ప్రయాణంలో పాప తప్పిపోయినపుడు రైలుస్టేషన్‌లో గల ప్లాట్‌ఫారమ్‌లో నివసించే బాలిగాడికి దొరుకుతుంది. అడుక్కొని తినే బాలిగాడు ఏమీ దొరకనప్పుడు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు. ఆకలి అనేది బాలిగాడి పాలిట ఏ విధంగా పరిణమించిందంటే – ”ఆకలి వాడికి కష్టపడ్డం తప్ప అన్ని రకాల విద్యలూ నేర్పింది” అంటారు రచయిత్రి. అలాంటి బాలిగాడికి పాప దొరుకుతుంది. పాప ఒంటిపై గల నగలపై దృష్టిపడినా, పాపను ఎత్తుకొన్నప్పుడు ఆ స్పర్శ మనసుకు ఎంతో హాయి గొలుపుతుంది. ఎక్కడో ఓ మూల బాలిగాడికి పాపపై సానుభూతి కలుగుతుంది. మరుక్షణంలోనే మనసు మార్చుకొని నగలను తీసుకొని, కల్లుపాక రావులమ్మకి అమ్మివేస్తాడు. ఇదిలా ఉండగా పాపను పోగొట్టుకొన్న తల్లి పడే వేదన దయనీయంగా ఉంది. ”ఆ దుఃఖస్థితిలో ఆవిడ అమ్మకి పర్యాయపదంలా ఉంది” అని రచయిత్రి అమ్మకు ఇచ్చిన నిర్వచనం అపురూపమైంది. పాప తల్లిలో తన తల్లిని చూసిన బాలిగాడు, ఇంతకాలం ద్వేషించిన ”అమ్మ” పదంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. చివరికి తల్లీబిడ్డను ఒకటి చేయాలనుకొన్న బాలిగాడి ఆశ సఫలం కాకముందే మరొక దొంగల ముఠా పాపను తీసుకొని పోవటమనేది అత్యంత విషాదాంతమౌతుంది.
ఈ కథలో లోకం తెలియని పాప ఏడుపు, కష్టాలు, ఆకలి, పాపకు చీమలు కరవటం, ఏడుపును మాన్పించటం కోసం రావులమ్మ పాపకు నల్లమందు తాగించటం, చివరికి తల్లి దగ్గరికి చేరే సమయానికి మరొకరి కోరల్లో చిక్కుకోవటం వంటి అత్యంత హృదయవిదారకమైన సన్నివేశాల్ని చూసినవారు ఎంతటి కఠినపాషాణులైనా కరిగి కన్నీరు కార్చక తప్పదు.
”జీవరాగం” అనే కథలో రచయిత్రి కేవలం కొందరు వ్యక్తులు తమ స్వార్ధానికి పరిస్థితులను వినియోగించటం లాంటివి చిత్రించారు. జీవితాన్ని తమ సౌఖ్యం కోసం ఉపయోగించుకొంటూ ఎప్పటికప్పుడు సమయాన్ని నిర్దేశించుకొన్నప్పటికీ అందులోనూ ఆందోళనలను అనుభవించేది స్త్రీ కావటం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. ఎంతో బాధను, మనోవేదనను అనుభవిస్తున్నానని శృతికి ఉత్తరంలో తెలిపిన మూర్తి కొద్దిరోజుల తర్వాత మూర్తిని శృతి కలిసినప్పటికీ ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా కన్పిస్తాడు. ఈ నాటకంలో చిక్కుకొంది శృతి మాత్ర.
”ఏ గూటి సిలక” అనేక కథలో అత్యంత పేదరికపు జీవితాలను, పిల్లలు లేని తల్లి మానసిక పరిస్థితిని అద్భుతంగా వర్ణింపబడింది. పిల్లలు లేని భార్యాభర్తల మానసిక వ్యధ వారి జీవితాలను ఏ విధంగా దహించుకుపోతుందో ఈ కథాంశం తెలియజెపుతుంది. డాబూ, దర్పం ఎంత ఉన్నా మానసికాందోళనలు, బలహీనతలు కుటుంబ వినాశనానికి దారితీస్తుంది. ఒకవేళ వేరొకరి పిల్లను పెంచుకొన్నప్పటికీ పిల్ల తండ్రి నుంచి తరుచూ ”బ్లాక్‌మెయిలింగు” ఎదుర్కోవలసి వస్తుంది. మానసిక దౌర్భల్యాన్ని ఆసరాగా చేసుకొని మాటిమాటికి డబ్బులు అడగటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులన్నింటిని అధిగమించినా గానీ పెంచిన మమకారం వైపు గాక కన్నవారివైపే మొగ్గుచూపుతే, ఆ పెంచిన హృదయం ఆక్రోశం వర్ణనాతీతం. ఈ కథలో పెంపుడుతల్లి మణెమ్మ. ఈమె ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో రచయిత్రి మాటల్లో చూద్దాం –
”మణెమ్మ ఇప్పుడు మహారాణి కాదు
పెంచిన మమకారం అనే ”కీ” నడిపిస్తున్న బొమ్మ”
ఇంతటి పదునైన భావాన్ని మాటల్లో చెప్పటం రచయిత్రి ప్రగాఢమైన శైలికి నిదర్శనం.
తండ్రి కట్టిన ఇంటిని రక్షించే నేపథ్యంలో మిథిల పాత్రను పెట్టి ”పుట్టిల్లు” అనే కథను రచయిత్రి రచించారు. ఈ కథలో స్త్రీలకోసం మంచి సందేశాన్ని ఇస్తూ – ”ఆడదానికి పట్టుచీరలు, బంగారునగలే జీవిత పరమావధి కాదు. ఈ ప్రపంచంలో అన్నార్తులు, బాధాసర్పదష్టులు ఎందరున్నారో తెలుసుకొని ఉండాలి” అని అంటారు.
”మట్టి బంగారం” కథలో గొల్లకులం వారి జీవనవిధానం కన్పిస్తుంది. మేకల పెంపకం, మేకల పాకలు, మేక పాలు, మేక మాంసం వంటి విషయాలను చాలా వివరణాత్మకంగా తెలిపారు. తప్పెట గుళ్ళోళ్ల కళాప్రదర్శన, కళాకారుల వేషధారణ, సిమ్మాద్రి అప్పన్న పాటలు, గ్రామదేవతలు (రాయిలమ్మ) – ఆచార వ్యవహారాలు, పూజలు, కొండరాజుల పండుగలు మొదలైన సన్నివేశాలెన్నో ఈ కథలో అడుగడుగున దర్శనమిస్తాయి. అయితే ఈ కథలో అంతర్లీనంగా పెంకుల మిల్లులు, సిరామిక్సు మిల్లులు, సగ్గుబియ్యం మిల్లుల గూర్చిన ప్రస్తావన ఉంది. అంటే గ్రామాల్లో కులవంతులు వదిలేసి వ్యాపార ప్రభావంలో పడిపోయిన ప్రజలు ఈ కథలో కన్పిస్తారు.
ఈ కథలో రచయిత్రి చేసిన వర్ణన కూడా కుల వాతావర ణాన్ని ప్రతిబింబిస్తుంది. ”ఎక్కడైనా పేణం ఉన్న జీవాలమ్ముకుని పేణం లేని మిల్లు కొనుక్కుంటాడంట్రా?” అన్న కథానాయకుడి నాన్నమ్మ మాటల్లో ఎంతో జీవితసత్యం ఉంది. రచయిత్రి శైలిని, కథలో తాను లీనమైన స్థితిని తెలియజేసే వర్ణన – ”తూరుపున మేకపాలు ఒలకబోసినట్టుంది.” ఉదయాన్నే సూర్యుని రాకకంటే ముందే వచ్చే కాంతి నేలంతా పరిచినప్పుడు వెలవడిన వెలుగు మేకపాల వెలుగుతో పోల్చటం వరలక్ష్మి గారి ప్రతిభకు అద్దం పడుతుంది. మేకపాలతో బెల్లం వేసి కాఫీ కాయటం, మేకపాలతో పరమాన్నం వంటివి ఎంతో బలవర్ధకమైన ఆహారంగా, రుచికరమైనవిగా చెప్పిన తీరు పాఠకులకు ఆరోగ్యసూత్రాలను వల్లెవేసినట్లుగా ఉంది. ఇంకా ఈ కథలో అడుగడుగునా అనేక సామెతలు, నీతిసూత్రాలు కన్పిస్తాయి. కులబలం అనేది ఒక వ్యక్తి పతనావస్థలో ఎంత సహాయకారిగా ఉంటుందో తెలియజేస్తుంది. ఈ కథ కథల పోటీలో మొదటి బహుమతిని సాధించి వరలక్ష్మిగారి పేరుప్రఖ్యాతులు ఇనుమడింపజేసింది.
”అతడు-నేను” కథలో భార్యను భర్త సరిగా చూడకపోయినా, భార్య మాత్రం అతనికి ఆజన్మాంత సేవకురాలిగా మారిపోయిన వైనం కన్పిస్తుంది. కథానాయిక తన భర్త ద్వారా అనేక కష్టాలు అనుభవించినా, తనలోని కోరికలను చంపుకొని, అతడు లేవలేని పరిస్థితిలో, పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం అయిన వేళలో అతడికే అంకితం అయ్యింది. ”మనకి దొరికిన ఈ జీవితం ఏడ్వడానికి, అంతం చేసుకోవడానికి కాదు” అనే గొప్ప సూక్తిపై నమ్మకమున్న కథానాయిక నిస్సహాయుల్ని ప్రేమించటం నేర్చుకొంది. మధ్యతరగతి నుంచి అట్టడుగు వర్గాల వరకు కరువుకాటకాలతో, జీవనసమరంతో మానవుని మనుగడే సంక్లిష్టమైన నేపథ్యం ఈ కథలో కన్పిస్తుంది. గిరిజన నేపథ్యం ఈ కథలో కన్పించినా, అక్కడక్కడ చాకలి, గొల్లకులాల ప్రసక్తి ఉంది. తర్వాత ఈ కథలో నాగరిక సమాజం చోటుచేసుకొంటుంది. కథానాయిక తన జీవితసౌఖ్యం కంటే సేవాసంస్థలో పనిచేయటం వల్ల ఆమె పొందిన ఆత్మానందం అచంచలమైంది. ”మనం జీవించాలంటే – జీవితం మీద ప్రేమ ఉండాలి. ఇతరుల్ని జీవింపజేయాలంటే – మనుషులమీద నమ్మకం, జాలి, దయ, ప్రేమ ఉండాలి.” అంటూ కథను ముగించిన కె. వరలక్ష్మి గారి రచనాశైలి కేవలం జీవన సంస్కృతికే అంకితమైనట్లు భావించవచ్చు.
శీలా సుభద్రాదేవి 1949లో విజయనగరంలో జన్మించారు. ప్రముఖ చిత్రకారుడు శీలా వీర్రాజుతో 1971లో వివాహం జరిగింది. 1970లోనే సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రి మొదటగా ”పరాజిత” కథను రచించారు. కథారచన పైనే గాక భర్త ప్రోత్సాహంతో వచనకవిత్వంపై కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1988లో మొదటి కథాసంపుటి ”దేవుడిబండ” 2008లో రెండవ కథాసంపుటి ”ర్కెల చూపు” సాహిత్యరంగంలో కథాపరంగా నూతన వస్తువును ఆవిష్కరించాయి. కథారచయిత్రి పి. సరళాదేవి, కొడవంటి కాశీపతి సోదరి సోదరులు కావటం, జన్మస్థలం గురజాడ వారి విజయనగరం కావటం వల్ల తానొక సవ్యసాచియై కవిత్వాన్ని, కథలను సాహిత్యలోకం వైపు సంధించారు.
సమాజంలో జరిగిన ఒక దృశ్యం, ఒక సంఘటన దాని చుట్టూర పాత్రలు, సంభాషణలు అన్నింటినీ సహజసిద్ధంగా అల్లుకుపోయే గుణం శీలా సుభద్రాదేవి కథలకుంది. కాలక్షేప కథలుగా గాక, రచయిత్రి కథలు ఒకానొక సమాజ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. కథల్లోని సంఘటనలకు, బాహ్య ప్రపంచంలోని దృశ్యాలకు ఏ మాత్రం భేదం లేని పొందిక ఈ కథలకుంది. పాఠక హృదయాన్ని విశాలపరిచి చైతన్యవంతమైన వస్తుకాంతిని అందిస్తాయి. అలా పాఠకులను అత్యంత ప్రభావితం చేసిన కథలు ”దేవుడి బండ”, ”వానా వానా కన్నీరు” మొదలైన మార్దవమైన సామాజిక స్పృహ కలవిగా పేర్కొనవచ్చు. రోడ్డు పక్కన రోళ్లు చెక్కేవారి జీవితాన్ని నేపథ్యంగా రచించిన కథ ”దేవుడిబండ”, రోడ్డు పక్కన చిత్తు కాగితాలను ఏరుకొనే వీధి బాలల దుస్థితిని నేపథ్యంగా రచించిన కథ ”వానా వానా కన్నీరు”. దిక్కులేని జీవితాలను కలిగిన బతుకుల కథలు ఆమె కన్నీటి కలం నుంచి జాలువారాయి. ఈ కథల్లోని ప్రతి సంఘటన సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజంలో ఆవేదనలకు, ఆరాటాలకు, ఆందోళనలకు ప్రతిఘటనగా ఆమె కథలు నిలుస్తాయనటంలో అతిశయోక్తి లేదు.
స్త్రీపరమైన సమస్యలే గాక, సామాజికంగా వెనుకబడినవారి జీవనచిత్రణం, అట్టడుగు వర్గాల దీనస్థితి, పొట్టకూటి కోసం కూలీ బతుకులు శీలా సుభద్రాదేవి కథల్లో కన్పిస్తాయి. సమాజాన్ని నిశితంగా అనుశీలించిన రచయిత్రి విభిన్న వస్తు వైవిధ్యాన్ని పాటించారు.
సామాజిక దృష్టిపథం గల వస్తువు :
1. ఓటర్లను మభ్యపెట్టి ఏ ఎండకా గొడుగు పట్టే నాయకులు
2. మతాహంకారంతో దురుసుగా ప్రవర్తించే వ్యక్తులు
3. సామాజిక ఆర్థిక అసమానతలు, ఆంతర్యాలు
4. పట్టెడు తిండికి, మూరెడు బట్టకు నోచుకోని నిరుపేద బాలల బతుకులు
5. వివిధ పనులలో ఉన్న పనివాళ్లకు తగిన జీతభత్యాలు ఇవ్వకపోవటం వారి సంరక్షణను పట్టించుకోకపోవటం.
6. నేటి నాగరికుల కర్కశత్వం – వలసల హృదయ విదారక బతుకులు.
స్త్రీ దృష్టిపథం గల వస్తువు :
1.చాలా వివాహాలు లాటరీల్లాగా ముగియటం
2.గృహిణికి ఇంట్లో ఆలనా పాలనా లేకపోవటం
3.ఆఫీసుల్లో ఇతర ఉద్యోగుల వ్యంగ్యాత్మక మాటలను ఉద్యోగినులు అనుభవించటం
4.వ్యాపార వస్తువుగా మారిన స్త్రీల జీవితాలు
5.ఆర్థిక స్వేచ్ఛ లేని స్త్రీల జీవితాలు
సమాజపరంగా, స్త్రీ పరంగా అభ్యున్నతిని సాధించటానికి శీలా సుభద్రాదేవి కథారచనను ఒక సాధనంగా వినియోగించుకొంది. సమాజంలో ఎన్ని అస్తవ్యస్త పరిస్థితులు ఎదురైనా స్త్రీ ధైర్యంగా నిలబడి నిర్భయంగా జీవించాలనే దేశం ఆమె కథల్లో ఉంది. ఎన్నుకొన్న త్యాగమార్గంలోనే నడిచి, సేవాపరిధిని పెంపొందించుకొన్న మహిళలు, అన్ని పోగొట్టుకొని జీవితంలో తన పాపతోడితే బతుకు అని నిర్ణయించుకొన్న మహిళలు, కురూపి ముందు ”పరాజిత”గా నిలబడిన సౌందర్యవతియైన మహిళలు ఆమె కథల్లో కన్పిస్తారు.
కథావస్తువును సూటిగా, స్పష్టంగా కథాగమ్యానికి చేరే తీరులో మలచిన శిల్పం, కథాంశంలో ధ్వనించే అంతర్లీన సందేశం రచయిత్రి శైలికి తార్కాణం.
తెలంగాణ మట్టి పరిమళాన్ని తెలుగు నేలకంతటికి విర జిమ్మిన అనిశెట్టి రజితగారు సాహితీపరులందరికీ చిరపరిచితురాలు. వరంగల్ వనితయైన రచయిత్రి కవిత్వంలో మంచి ప్రావీణ్యం కలది. కథలు చదవటం బాగా అలవాటు గల రచయిత్రి సాహితీమిత్రుల ప్రోత్సాహంతో కథలు రచించటం ప్రారంభించారు. ఆమె కథలు కల్పనలు కావు. వివిధ వాస్తవ సంఘటనలు, విషయాలు ఆమె కథలకు వస్తువైంది. రచయిత్రి స్వాభావిక నేపథ్యం ఆమె కథల్లో ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. నూరేళ్ల కథా సాహిత్య రచనలను పరిశీలించి అపారమైన లోకజ్ఞానాన్ని పొంది, తదనుగుణమైన కథారచనకు స్ఫూర్తిని సాధించారు.
రజిత గారి కథల్లో శిల్పసౌందర్యాల కంటే కథావస్తువే ప్రాణమై నిలుస్తుంది. ఆమె అనుభవాలు, స్పందనలు, వ్యాసాలు, లేఖలు మొదలైనవి కథావస్తువులుగా మారి సామాజిక సందేశాన్ని అందిస్తాయి. పేదల సమస్యలను, స్త్రీలపై పెరిగిన ఒత్తిళ్లను ఈ కథలు చిత్రించాయి. సామాజిక న్యాయంపై గల ఆటంకాలను అధిగమించటానికి కథాసాహిత్యాన్ని సాధనంగా వినియోగించు కొన్నారు. బడుగుజీవులు బతుకుతెరువు కోసం, జీవితాస్తిత్వం కోసం, అనేక రకాలుగా వారిపై గల అణచివేతలను ధిక్కరించటం కోసం ఆమె అవలంబించిన విధానం కథామార్గం. ఆ మార్గం దిశలో కథలోని ప్రతి సంఘటనా వాస్తవ దృక్పథంతో రచించి, ప్రతి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. కథావస్తువు సమాజంలో జరిగిన సంఘటనలే అయినా, అవి అసాధారణ జీవిత విశ్లేషణను చేస్తాయి.
రజిత గారి ”మట్టిబంధం” కథాసంపుటిలో పల్లెజీవితాన్ని ప్రతిబింబించే అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా ”మట్టిబంధం” అనే కథలో నేటి గ్రామాల్లో ప్రతి కులాల వారి కులవృత్తులు అంతరించి, కూలీలుగా బతుకు సాగిస్తున్న తీరు వర్ణింపబడింది. దారిద్య్రం, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు ఈ కథలో దొరలకు, మిగతా కులాలకు మధ్య తేడా గోచరిస్తుంది. ఇంకా వ్యవసాయభూముల్లో గల వ్యత్యాసం సాంఘిక అసమానతలను అధికం చేస్తుంది. పూర్తిగ జీవనవిధానమే ఎగుడుదిగుడుగా కన్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిల్లిపాది కూలీపనులు చేసి ఇంటి బరువు మోయవలసి వచ్చేది. ఇక ఈ ఇండ్లలో ఆడపిల్లలకి బడికి వెళ్లి చదువుకొనే అవకాశం ఉండేది కాదు. క్రమంగా వారి చదువులు అటకెక్కేవి. గ్రామాల్లో చాలా పేద కుటుంబాలలో ఆడపిల్లల పనులు అత్యంత నికృష్టంగా ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలను ఎత్తుకొని ఆడించటం, బావుల వద్ద నుంచి నీళ్లు చేదుకొని రావటం, పొయ్యిలోకి కట్టెల కోసం ఊరి శివార్లలోకి పోయి తుమ్మకంపలు కొట్టుకొని రావటం, తంగేడు మొట్లు కొట్టుకొని రావటం, గంపల కొద్దీ పిడకలను ఏరుకొని రావటం, అప్పుడప్పుడూ బర్రెలను కాయటం – ఇదంతా ఆడపిల్లల చాకిరీ చట్రం.
ఈ కథలో రచయిత్రి జీవితసత్యాన్ని తెలియజేస్తూ ”ఒక సంబంధం పూర్తిగా తెగిపోతున్నప్పుడు గానీ, ఒక అనుబంధాన్ని పూర్తిగా కోల్పోతున్నప్పుడు గానీ గతమంతా గుర్తుకొస్తుంటుంది” అని అంటారు. ఊరి నుంచి దూరంగా వెళ్లిన తర్వాత ఆ ఊరితో ఉండే అనుబంధ జ్ఞాపకాలు స్మరణకు వస్తుంటాయి. ఈ స్థితిలో రాముడి పాత్రలో కలిగిన భావప్రాప్తిని రచయిత్రి ఈ విధంగా తెలియజేసింది. ”రాముడి అంతరంగం పూడిక తీసిన బావిలో ఊరుతున్న ఊటలా దుఃఖంతో నిండుకొంది.” రాముడి మనసులో గతాన్ని తవ్వినాకొద్ది విషాదం ఉబికివచ్చే విధానం కన్పిస్తుంది.
పట్నాల్లోని మానవ సంబంధాలు పల్లె జీవన విధానం కంటే విరుద్ధంగా కన్పిస్తాయి. వస్తు వ్యామోహ సంస్కృతిలో పడి మానవప్రేమలు అడుగంటుతున్నాయి. వెల గల వస్తువుపై చూపే ఆదరణ వెలలేని మనస్సులపై చూపని బతుకులవి. సుఖాన్వేషణ, భోగలాలసత్వం, ఆడంబరాల ప్రదర్శన మొదలైన పట్టణ ప్రజల తీరుతెన్నులను రచయిత్రి చక్కగా విశ్లేషించారు.
కాని పల్లెల్లో ఆర్థిక అంతరాలు ఎన్ని ఉన్నా సమిష్టి జీవన సంస్కృతి ఉట్టిపడుతుంది. అనేక కులాలవాళ్లు ఉన్నా అంతరాలను అధిగమించి ప్రేమలూ ఉంటాయి. తమ తమ కులాలతో పిలుచుకొన్నా ఆపేక్షలతో జీవిస్తారు. ఇతర కులవృత్తులకు గౌరవమిస్తారు. చాకలి, మంగలి, గౌండ్ల, గొల్ల, ఉప్పరి, కుమ్మరి, పద్మశాలి, వడ్రంగి, కంసాలి, మాల, మాదిగ ఇలా అందరూ సహకరించుకొంటూ సహజీవనం సాగిస్తారు. ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో కులం పట్టింపులు ఎక్కువే అయినా అవి నిత్య జీవిత పనులకు అడ్డురావు.
ఊళ్లలో పంటలు పండక, కులవృత్తులకు ఆదరణ దక్కక పట్నానికి వలసలు వెళ్లే వారి జీవితాలు ఈ కథలో కన్పిస్తాయి. ధనవంతులకు వలసలు ఒక అందమైన మలుపు అయితే, వృత్తి కులాలకు చెందిన వారికి అనుక్షణం జీవనమరణం లాంటిది. సహజమైన మట్టితో సంబంధం తెగిపోవడమంటే దానితో కూడిన అనుబంధాలనెన్నింటినో తెంచుకోవడమే అవుతుంది. అంటే ఊరిని విడిచి పోవటమంటే ఒక సంస్కృతిని, సాంఘిక జీవితాన్ని పాతిపెట్టి పోవటమేనని రచయిత్రికి గల ఆవేదనను వెల్లడిచేస్తుంది.
స్త్రీ వైవాహిక కుటుంబ జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను, అస్తిత్వపు ఆంక్షలను అధిగమింపజేసిన కథలు ”గాజులు”, ”రాజవ్వ”, ”బ్యూటీపార్లర్”, ”సజిత” మొదలగునవి. ఆపద సమయాల్లో ఆయుధాలు లేని ఆడవాళ్లు తమ సహజ సౌందర్య సూచికమైన గాజులను ఉపయోగించుకొని ఆడపులుల్లాగా దాడిచేయటం ”గాజులు” కథలో కన్పిస్తుంది. స్త్రీ తన స్థానం కోసం ప్రయత్నిస్తూ బతుకుబాటలో ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా ఎదురొడ్డి నిలిచిన ”రాజవ్వ” కథ ప్రతి స్త్రీకి ధైర్యం నింపుతుంది. అధిక శరీర సౌందర్య సాధనలో చిక్కిన తులశమ్మ, అత్యంత ఆవేదనతో కూడిన మానసిక సంక్షోభంతో దానినుంచి బయటపడిన సజిత వంటి విలక్షణమైన స్త్రీ పాత్రలు రజిత గారి కథల్లో కన్పిస్తాయి.
అభ్యుదయ పరంపరలో మార్పుకోసం ప్రయత్నించటం ”కొత్తపాట”లో తెలుస్తుంది. ఈ కథ చేనేత రంగం స్థితిగతులను విశ్లేషిస్తుంది. కుంటుబడుతున్న చేనేతరంగం, దానిని ఆశ్రయించి జీవనం సాగిస్తున్న నేతగాళ్ల ఆర్థిక ఇబ్బందులు ఈ కథ వివరిస్తుంది. మానవతా స్పర్శ గల కథ ”పాలకూనలు”. పశుపక్ష్యాదులలో కూడా తారతమ్య వివక్షతను ఈ కథ చూపుతుంది. స్వార్థం, ఎవరికి వారే తమ చుట్టూ తాము గిరిగీసుకొని బతికే లోకంలో ప్రతిమ నాలుగు కుక్కపిల్లలను రక్షించి పెంచే దృశ్యం ఎంతో స్ఫూర్తిదాయకం.
తెలంగాణా పల్లె జీవితాల్లోని కరువుకాటకాలకు బలై, వలసలుగా జీవనం గడుపుచున్నవారిని గూర్చి రచయిత్రి ”మూడు వలసలు”, ”మట్టిబంధం” అనే కథలు రచించారు. వానలు పడక పంట పొలాలన్నీ బీడ్లు పారే స్థితిని ”వానమ్మ-వానమ్మ” అనే కథ తెలుపుతుంది.
రజితగారి ప్రత్యేకమైన శైలిని తెలియజేసే కథ ”దేవునావూ… దేశదిమ్మరి” సంఘంలోని నాయకుల బాధ్యతారహితమైన ప్రవర్తనను సునిశిత హాస్య వ్యంగ్య శైలిలో విమర్శించారు. ”నినాగాడు”, ”బుచ్చెమ్మ”, ”యాపచెట్టు” వంటి కథలన్నీ జీవితాన్ని బరువెక్కించే యదార్థ విషయాలను వెల్లడి చేస్తాయి.
ప్రతి కథలో విషమ పరిస్థితులకు వ్యతిరేకంగా సంఘ ర్షించటం, కొత్త జీవితంవైపు దృష్టి సారించటం రజితగారి కథల ప్రత్యేకత. ముగింపు సంక్షిప్తంగా ఉన్నా, ముగింపు నుంచే జీవితపు కొనసాగింపు ఉంటుంది.
‘తాయమ్మ’ కరుణ గారి జన్మస్థలం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండలంలో గల ‘తాటికల్లు’ గ్రామం. ఈమె అసలు పేరు పద్మ. 1970లో ఆమె జన్మించారు. ఆమె కథారచనకు ప్రోత్సహించి, వెన్నెంటి నిలిచినవారు ఇద్దరున్నారు. ఒకరు మాష్టారు (ఐ.వి. సాంబశివరావు), ఇంకొకరు మంజీర (కరుణ జీవిత సహచరుడు). రావిశాస్త్రి కథలు, నవలలు చదివి ప్రభావితురాలైన కారణంగా అతడు మరణించినప్పుడు ”ఛాత్రి బాబుకు ముత్యాలమ్మ నివాళీ” అనే కవితను రచించారు.
1994లో రచయిత్రి రచించిన మొట్టమొదటి కథ ”తాయమ్మ కథ”. ఈ కథ రచయిత్రికి మంచిపేరును సాధించిపెట్టింది. కథా సాహితీ వారి కథలను, విపుల వారి కథలను బాగా చదవటం వల్ల, వాటి ప్రభావం ఆమె కథలపై పడింది. పటిష్టత, ఏకధాటిగ చదివించగల సామర్థ్యం ఆమె కథలకు ఉంది. జీవితం మీద గల ఆలోచనలు, అభిప్రాయాలు కథలనిండా కన్పిస్తాయి. హృదయ గతమైన స్పందనలు, మేధోగతమైన భావనలు కథల్లో ప్రతిధ్వనిస్తాయి. సమాజ ఆచార వ్యవహారాలకు సంబంధించిన కథాంశం తాయమ్మకథలో ఉంది. అందుకే జూచీరిబీ శ్రీళిఖీలిజి అంత ప్రాధాన్యం తాయమ్మకథకు ఉందని ప్రశంసించినవారున్నారు (కె. శివారెడ్డి).
తాయమ్మ కథ తర్వాత రచయిత్రి మరికొన్ని కథలు రచించారు. ఆమె రాసినవి సామాజికపరమైనవి కాగా, మరికొన్ని ఉద్యమ కథలు. ఉద్యమ కథలను ”టుంబ్రి” అనే పేరుతో, సాంఘిక కథలు ”కరుణ” పేరుతో రచించారు. కాని 1997 నుండి 2001 వరకు దాదాపు నాలుగు సం||లలో ఆమె కథలు రాయలేదని, అది చూసి ఆ కాలంలో ఎవరో ”కరుణ” అనే పేరుతో కథలు రాసారని ఆమెతో ఫోన్‌లో సంభాషించినప్పుడు తెలిసింది. మళ్లీ 2001 నుంచి కథలు రాయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ”తాయమ్మ కరుణ” అనే పేరుతో కథలు రాస్తున్నారు. ”తాయమ్మకథ” అనే కథాసంపుటిలో మొత్తం 16 కథలున్నాయి. ఇవేగాక మరికొన్ని కథలు కూడా ఆమె రచించినట్లు తెలుస్తుంది. కొంతకాలం ”విప్లవ మహిళ” అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా పనిచేశారు.
నాలుగు దశాబ్దాల కాలంలో తెలంగాణాలో ప్రజాపోరాటాలు, భూసమస్య నేపథ్యంలో వచ్చిన అద్భుతమైన కథ ”తాయమ్మకథ”. గత జీవితానికి సంబంధించిన అనుభవాల్ని, కొత్త వెలుగులోంచి విశ్లేషించుకొని, దానికనుగుణంగా నూతన సృష్టి చేయగల సామర్థ్యం ఈ కథకు ఉంది. ”తాయమ్మకథ” నాటికి కరుణ గారు అజ్ఞాతంలో ఉండి ఉండవచ్చుననేది పెద్దల అభిప్రాయం. అజ్ఞాత జీవితం గడుపుచూ, సాయుధులై తిరుగుచూ, ప్రజల్ని కదిలిస్తూ, చైతన్యవంతం చేస్తూ, గిరిజన సమాజాల సంస్కృతుల్ని అధ్యయనం చేస్తూ సంచరిస్తున్నప్పటికీ ”తాయమ్మకథ”తో సాహిత్య సామ్రాజ్యాన్ని అంతే ఒడుపుతో పలకరించారు. కరుణ గారు తన స్థానాన్ని నిలబెట్టుకోవటం కోసం ఒకానొక కొత్త చూపులో, కొత్త దృక్పథంలో రచించిన కథ ఇది.
తెలంగాణా ప్రాంతపు జనజీవితాన్ని ముఖ్యంగా ఉమ్మడికుటుంబాలు క్రమంగా అంతరించే సందర్భంలో ఒక స్త్రీ పడ్డ కష్టాలు, చేసిన పోరాటాలు వర్ణించే కథ. ఇందులో గత చరిత్రంతా తాయమ్మ రూపంలో కళ్లముందు కదలాడుతుంది. ”తెలంగాణా ప్రాంతంలో అదనంగా స్త్రీ పడుతున్న ఇక్కట్లు, దయనీయమైన బతుకు, కుటుంబ సామాజిక హింస – దాన్నెలా ఎదుర్కొందో వర్ణించి చెప్పిన తీరు అపూర్వం. అందుకే ఇది ”క్లాసిక్ స్టోరీ”గా విజయవంతమవటానికి ఒక అపూర్వ కళాఖండంగా రూపుదిద్దుకుంటానికి గల కారణం. కార్యకర్తగా కరుణ, తాయమ్మ జీవితంలో జోక్యం చేసుకోకపోవటమే” అని కె. శివారెడ్డి గారు తెలియజేశారు. తాయమ్మకథ పూర్తిగా వాస్తవానికి తలొగ్గిన కథ. వాస్తవాన్ని దృశ్యమానం చేసిన ఒకానొక గొప్ప కళాఖండం.
సహజాతి సహజమైన ముగింపు ఈ కథకు ఉంది. అంతేగాని ఆవేదన, ఆక్రోశం, దుఃఖం, కడుపుకోత మొదలైన బలవంతపు ముగింపులు ఈ కథలో కన్పించదు. కాని అనంతమైన ఆవేదన, కష్టం, దుఃఖం వంటివి దాదాపు 50 సం||ల తెలంగాణా సామాజిక చరిత్ర ఇందులో దాగిఉంది. తరాలు మారిన స్త్రీ దుఃఖం మాత్రం అధికమవుతున్న నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తద్వారా కథానాయిక తాయమ్మ పోరాట వనితగా ఎదిగే తీరు వర్ణించబడింది.
ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మారుతున్న సామాజిక సంక్లిష్ట జీవన సందర్భాన్ని, దాదాపు నాలుగు దశాబ్దాల స్త్రీల జీవితాన్ని కళ్లకు గట్టినట్టు చిత్రించిన కథ ”కవులమ్మ ఆడిదేనా”. ఈ కథ తాయమ్మ కథంత గొప్పది, అంతే విస్తృతమైన నిడివి గలది, కాని దానికంటే ఇది సంక్లిష్టమైంది. కష్టాలూ, దుఃఖాలూ, అవమానాలూ, హింసలూ తాయమ్మ కంటే కవులమ్మే అధికంగా అనుభవించింది. కాని ఎక్కడా పరిస్థితులకు లొంగిపోదు. తనెరిగిన వ్యక్తి జీవితం, అనుభవం తాయమ్మ కథాప్రస్తానం అయితే, కవులమ్మ తనే వ్యక్తిగా నిజజీవితంలోని ఆంతరికమైన అనుభవంగా కథాంశం నడుస్తుంది. ఈ రెండు కథల్లో కుటుంబం, సమాజం రెండూ వ్యక్తి జీవితంతో పెనవేసుకొని సజీవమైన వస్తురూపాన్ని ప్రదర్శిస్తాయి. అనుభవం, జీవితం ఒక క్రమంలో నిబద్ధింపబడి ఒకానొక నూతన సంక్రమిత దృష్టిని వెల్లడి చేస్తాయి. జీవితంలోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ ఒక కొత్త కాంతిని కలిగిస్తాయి. ఈ రెండు పాత్రలు జీవితమంత విశాలంగా, లోతుగా సంక్లిష్టంగా, సంకీర్ణంగా ఉన్నా అంతే సహజంగా పాఠకుల ముందు నిలబడుతాయి. చివరకు ఈ పాత్రలు మరణంతో ముగుస్తాయి. ఒక విధంగా ఇవి విషాదాంత కథలుగా పరిగణించవచ్చు.
కరుణ గారు రచించిన మరికొన్ని కథల్లో ”రేపటి గెరిల్లాలు”, ”మీ చరిత్రను చెబుతాం”, ”మహిళలు ధైర్యంగా నిలబడగలరా”, ”నీళ్లూ-చేపలు”, ”నందే”, ”పోరాడ్డంలో తేడా” అనేవి ప్రత్యేక కథావస్తువు గలవి. ఇవి కేవలం అజ్ఞాత జీవితం గడిపేవాళ్లు రాయగలిగే కథలు. శ్రీకాకుళం, గోదావరి లోయల్లో, కరీంనగర్ పోరాటాల తర్వాత గల నూతన వస్తువును ఈ కథలు ఆవిష్కరిస్తాయి. నాలుగు దశాబ్దాల పాటు పోరాటం నేపథ్యంగా గిరిజన జీవితాల్లో వచ్చిన మార్పులతో పై కథాంశాలు ముగుస్తాయి. కరుణ పూర్తిగా తను చూసిన, అనుభవించిన జీవితాలను, ఇలాంటి వారి జీవితాలతో పెనవేసుకొన్న సాయుధ నాయకుల జీవితాలను కథావస్తువుగా గ్రహించటంలో సఫలం చెందారు.
గిరిజన జీవితం, పోరాట నేపథ్యం గల కరుణ కథలు ఒక నూతన సాహిత్య స్రవంతిని దృష్టి పథమందుంచుతాయి. తాయమ్మగాని, కవులమ్మగాని కరుణ జీవితంలో భాగస్వామ్యం గలవి అనేదానికంటే కరుణే వాళ్ల జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకొన్నారని భావించవచ్చు.
పి. రాజ్యలక్ష్మి గారు వర్ధమాన కథా రచయిత్రులలో వృద్ధి పొందుతున్న మేటితరం కథా రచయిత్రి. ”ఎంప్లాయిస్ వాయిస్” అనే పత్రికకు సంపాదకులుగా నిర్వహిస్తూనే, మరోవైపు రచనా రంగంలో మున్ముందుకు వెళ్లుచున్నారు.
రచయిత్రి జన్మస్థలం గుంటూరు జిల్లా. విద్యాభ్యాసం మాత్రం తండ్రి ఉద్యోగ బదిలీ రీత్యా పలు ప్రాంతాల్లో కొనసాగింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు వంటి జిల్లాల్లో చదువును సాగించి, అక్కడి ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. ఒంగోలులో పట్టుపరిశ్రమ శాఖలో టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రచయిత్రి కవితలు, కథలు, వ్యాసాలు రచించటం అలవరుచుకొంది. ఎక్కువగా ఆమె కథల్లో స్త్రీ సమస్యలను గూర్చి, ఉద్యోగుల సమస్యలను గూర్చి వివరించటం కన్పిస్తుంది. ఆమె రాసిన కథలు ”ఎంప్లాయిస్ వాయిస్” ఉద్యోగుల మాసపత్రిక, భూమిక, అస్మిత వంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కథల పోటీల్లో కూడా ఉత్తమ, ప్రథమ, ద్వితీయ బహుమతులను పొందాయి. బహుమతి కంటే కూడా కథావస్తువు అత్యంత ప్రాధాన్యత కలదిగా గుర్తించవచ్చు.
”క్షమించు” అనే కథలో మాతృత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం ఇమిడి ఉంది. క్షణం తీరిక లేని పట్టణ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులై, తమకు సంతానం కలుగకుండా కొంత టైమ్ తీసుకోవటం వంటి అంశాలను గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ వారికి పిల్లలు పుడితే, వారి పోషణ ఎంత కష్టమౌతుందో మాటల్లో చెప్పలేం. వారి రక్షణ బాధ్యతను మరొకరికి అప్పగించినా, తల్లి హృదయం పదేపదే పిల్లవాడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, పిల్లలను చూసుకోవటం నేటి ఉద్యోగినులకు కత్తి మీద సాముగా పరిణమించింది. ఉమ్మడి కుటుంబాలు లేక, భార్యాభర్తలిద్దరు ఉద్యోగస్తులై ఉన్న కుటుంబాల్లో పిల్లల ఆలనా పాలనా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ లభించక, కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు గొడువపెట్టుకొనే సమయాలలో భయపడి పిల్లలు మానసిక పరివర్తన అనేది చెడుదారిపట్టే సూచనలూ ఉంటాయి. అందుకే ఈ కథలో కథానియిక సుజాత తన పిల్లవాడిని మంచి హాస్టల్‌లో చేర్పించింది. ఇంట్లో తాము అందించని ప్రేమ అక్కడ తన బాబుకు కల్పించింది.
ఈ కథలో రచయిత్రి సాధారణ ఉద్యోగినుల అంతస్సంఘ ర్షణను ఎంతో సహజంగా చిత్రించారు. రచయిత్రి స్వయంగా అనుభవించిన సంఘటనలే ఈ కథలో చోటుచేసుకొని ఉంటాయి. ఉదా : ఒక సన్నివేశం – ”ఒకరోజు పెద్ద వర్షం పడుతుంటే చుట్టుపక్కల అందరూ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. బబ్లూ స్కూలు బస్సు దిగి వర్షంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తడిచి, ఇంటిపంచలో పడుకొని నిద్రపోతున్నాడు. సుజాత వచ్చి చూసి బావురుమని ఏడ్చింది. ఏమిటి తన ఖర్మ?… ఉద్యోగం మానివేద్దామా లేదా కొంతకాలం సెలవు పెడదామంటే ఆర్థికసమస్యలు పెనుభూతంలా వెంటాడుతూనే ఉన్నాయి.” మాతృత్వాన్ని అడ్డుకొనే ఆర్థికభారం మధ్యతరగతి తల్లుల కడుపుకోతగా మారిన విధానం తెలియజేయబడింది.
”తలాఖ్” కథ ”భూమిక”లో ద్వితీయ బహుమతిని పొందింది. ముస్లిం మైనారిటీ జీవితాల్లోని ఆర్థిక ఇబ్బందులు, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లిన వలసల బతుకులు, ముస్లిం వనితలు అనునిత్యం అవమానాలు భరిస్తూ, ఒంటరి జీవితాల్ని ఈదుకొచ్చే వైనం కళ్లకు కట్టినట్టుగా రచయిత్రి చిత్రించారు. ఎక్కడో బయటిదేశంలో ఉన్న మగవాళ్లు కూడా ఇక్కడి తమ భార్యల్ని అనుమానించటం కన్పిస్తుంది. గంపెడు పిల్లల్ని కని గల్ఫ్ దేశాలకెళ్లి ఇక్కడి భార్యాపిల్లలకి డబ్బులు పంపించక, పిల్లల చదువుసంధ్యల గూర్చి ఆలోచించక జులాయి ల్లాగా తిరిగేవారు ఉన్నారు. ముస్లింలలో ఎక్కువగా చాలా వయస్సు గల పురుషులకు చాలా చిన్నవయస్సు గల అమ్మాయిలతో వివాహం జరుగుతుంటుంది. వారి వయసులో అంతరాలు, వారి జీవితాల్లో అంతరాలు ముస్లిం వనితలను అధఃపాతాళంలోకి నెట్టివేస్తుంది. కాని ఈ కథా ముగింపులో కథానాయిక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తన జీవితలక్ష్యం వైపు పయనించటం కన్పిస్తుంది.
రాష్ట్ర స్థాయి కథల పోటీలో 2009లో ”అస్మిత” వారు నిర్వహించిన కథల పోటీల్లో ఉత్తమ బహుమతిని పొందిన కథ ”తొలి అడుగు”. ఉత్తమ పురుషలో రచించబడిన ఈ కథలో కథానాయిక రైలు ప్రయాణంలో రెండు నిండు ప్రాణాలు ఆత్మహత్య చేసుకోబోతుండగా కాపాడింది. తల్లీబిడ్డను కాపాడి, ఆ తల్లియైన రంగి ఈ స్థితికి రావటానికి గల కారణాన్ని తెలుసుకొంది. ఆమె బిడ్డతో సహా ప్రాణాలు వదులుకోవాలని ప్రయత్నించటానికి కారణం ఆమె భర్తనే అని తెలుసుకొంటుంది. పదవ తరగతి వరకు చదువుకొని ఏ పనీ చేయక, కూలీ పని చేయటానికి నామోషి అయ్యి, ఇంకా కూలీ చేసి అంతో ఇంతో సంపాదించి తెచ్చిన పెండ్లాన్ని అనేక అవమానాలకు గురిచేస్తూ, శారీరకంగా, మానసికంగా బాధపెడుతూ, చిత్రహింసలు పెట్టే కూలీరంగి భర్త ఈ కథలో కన్పిస్తాడు. తన భార్యాబిడ్డ ప్రాణాన్ని కాపాడిన కథానాయికను కూడా తన మాటలతో కంపెనీలకు ఆడవాళ్లని అమ్మే పెద్దమనిషిని వ్యంగ్యంగా తిడతాడు. తన ప్రాణాల్ని కాపాడినామెను తన భర్త మూర్ఖంగా తిడుతుంటే భరించలేని రంగి పులిలా ఎదురుతిరిగి తన బతుకు బాటేదో తను వెతుక్కొంది.
అందుకే రచయిత్రి కథానాయిక స్థాయిలో ఈ విధంగా పలికింపజేస్తుంది. ”రంగికి నాలాంటివాళ్ల ఆసరా కావాలి. అస్మిత హృదయం, స్నేహహస్తం, భుజం తట్టి నడిపించగల శక్తి వుంటే రంగి లాంటి వాళ్లకు సహాయం చేయటం పెద్ద కష్టమేమీ కాదు.” ఆ చేయూతతో నిశ్చయంగా ”తొలి అడుగు” వేసింది రంగి.
పి. రాజ్యలక్ష్మి గారు బహుమతులు పొందిన కథలే గాక ”బ్రతుకుపోరు”, ”స్పృహ”, ”పేటంటు”, ”పొదుపు”, ”గృహప్రవేశం”, ”మిస్టర్ మాధురి”, ”శ్రామిక”, ”ఎన్‌కౌంటరు” వంటి సాంఘిక కథలు రచించారు. ”బ్రతుకుపోరు”లో కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తలు, సహ ఉద్యోగులతో సమరం చేసిన ఝాన్సీ ”స్పృహ”, భర్త ఒక నియంతగా మారి తన భార్యనొక ”పేటంటు”గా భావించటం, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకొని కొన్ని బలహీన క్షణాల్లో తటాలున క్రిందపడిపోయిన రజిని జీవితం ”పొదుపు” కథలో ప్రత్యక్షమౌతుంది.
ఈ విధంగా సమాజంలోని అసమానతల్ని దూరం తరిమివేయటానికి, కులమతరహిత సమాజాన్ని స్థాపించటానికి ఆమె కథలు ప్రయత్నిస్తాయి. జీవితంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఎదుర్కోవాలని స్త్రీ జాతికి మంచి సందేశాన్నిచ్చే కథల్ని పాఠకులకు అందించారు. రచనా రంగంలోనే గాకుండా సేవారంగంలో కూడా తన ప్రతిభ చాటుకొన్నారు. ఆదర్శాలను కథల రూపంలో, కవితల రూపంలో వల్లించటమే గాక జుఆశ్రీస్త్రం అసోసియేషన్ ప్రకాశం జిల్లా ఆర్గనైజింగు సెక్రటరీగా నియమింపబడి నేటి సమాజంలో ఆచరించి చూపడంలో సఫలీకృతమౌతుంది.
కొక్కుల పద్మావతి గారు 1958వ సం|| నాగపూర్‌లో జన్మించారు. నేడు జగిత్యాలలో నివసిస్తున్నారు. ఆమె పాఠశాల విద్యనంతా మరాఠీ మీడియంలో చదివి, వివాహానంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి తెలుగులో డిగ్రీ చేశారు. మరాఠీ కథలు చదవటమంటే ఆమెకు చాలా ఇష్టం. అదే స్థాయిలో తెలుగు కథలపై కూడా అభిమానాన్ని పెంచుకొని, మరాఠీ నుంచి తెలుగు భాషలోకి కథలను అనువాదం చేయటం ప్రారంభించారు. అందులో ముఖ్యంగా పేర్కొనదగినవి ”విహార్”, ”అతనికథ”, అంతేగాక రచయిత్రి స్వతంత్ర కథలను కూడా రచించారు. అవి ”పాలమీగడ”, ”ప్రశంస” కథలు.
”విహార్”లో బౌద్ధబిక్షువుల సేవా మానవతా స్పర్శ కన్పిస్తుంది. మరాఠీలో వచ్చిన బహుజన వాతావరణ చిత్రణ కలిగిన కథల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. బౌద్ధమతం వారు నిర్మించుకొన్న ”విహార్” ఆశ్రమం, కొన్నిరోజుల తర్వాత ధర్మదీక్షా కార్యక్రమాలకు కొదువ ఏర్పడుతుంది. దానికి కారణం ధర్మకార్యాలు నిర్వహించేవారు లేకపోవటం, వారి ఆర్థిక స్థితిగతులు తారుమారు కావటం వంటివి గుర్తించవచ్చు. కాని ఒకప్పుడు విహార్‌లో జరిగే కార్యక్రమాలను రచయిత్రి విశ్లేషిస్తూ – ధర్మవందనం, ప్రవచనం, ధ్యానధారణా ఇత్యాది కార్యాలను వివరించారు. ”యోగిరాజ్ వాఘ్‌మారే” రచించిన ”విహార్” అనే కథకు తెలుగు అనువాదం చేసిన రచయిత్రి కూర్పు అద్భుతమైంది.
అరుణ్ దా. ఢావళే అనే మరాఠీ రచయిత రచించిన కథను ”అతని కథ”గా కొక్కుల పద్మావతి గారు అనువదించారు. ఇది సాంఘిక జీవితాన్ని ప్రతిబింబించే కథ. ఈ కథలో కథానాయకుడి ఆత్మవేదన, సహ ఉద్యోగుల అవమానాలు, కులవివక్షత కన్పిస్తుంది. అదే విధంగా కుటుంబంలో గల గొడువలు ఆయనకు ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఈ కథ మరాఠీ సాహిత్యంలో బహుజన దళిత నేపథ్యం నుంచి వచ్చిన కథగా భావించవచ్చు. కథానాయకుడు దళితుడు, మంచి కవి. అయినా అతడి చుట్టూ కూడా కులతత్త్వ విషబీజాలు చుట్టుముట్టాయి. నీళ్లు తాకనీయని వారి మూర్ఖత్వానికి బాధపడి ”ఈ భూమిని అందరు ముట్టుకుంటారు కదా!” అనే సందేహాన్ని వ్యక్తపరుస్తాడు.
రచయిత్రి కథల్లో హృదయవేదన, మానవస్పర్శ, ఆత్మీయ గుణం వంటి అసాధారణ లక్షణాలు కొత్తదనాన్ని పెంపొందిస్తాయి. ఈ లక్షణాలతో ఆమె అనువాద రచయిత్రిగా మంచి ప్రావీణ్యాన్ని సాధించారు.
వడ్నాల సూర్య గారు ఆధునిక కథారచయిత్రుల చిరునామా డైరెక్టరికీ ఇంకా చిక్కని రచయిత్రి. ఇప్పుడిప్పుడే కథలు రాసి వివిధ పత్రికలో ప్రచురిస్తున్నారు. వీరి జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల గ్రామం. రచయిత్రి స్థానిక పరమైన సమస్యలను తీసుకొని కథారచనను చేయటం ఆరంభించారు. ఆమె కథల్లో ముఖ్యమైనవి ”నమ్మకం, ఆకలి, అమ్మమ్మకథ, సంపూర్ణ, నల్ల బంగారం” వంటివి నేటినిజం, పద్మపీఠం, పద్మకెరటం మొదలైనవి పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
మధ్యతరగతి వర్గాల నిత్యజీవన సమస్యలు, స్త్రీల జీవితంలో చోటుచేసుకొన్న పరిణామాలు రచయిత్రి కథావస్తువులుగా నిలిచాయి. బడుగువర్గాల కూలీ నాలీ బతుకులు, పేదరికపు కష్టాలు అత్యంత దయనీయంగా చిత్రించారు. ముసలి తల్లిదండ్రుల పట్ల కొడుకుల కర్కషత్వం, ఉద్యోగినులపై సహ ఉద్యోగుల వ్యంగ్యమాటలు వంటివి సమాజంలో విభిన్నరీతిని తెలుపుతాయి. పూర్తిగా రచయిత్రి కథలు ఒకానొక సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రదర్శించబడ్డాయి. ఈ కథలో శైలి అత్యంత సులువుగా, సులభంగా బోధపడుతుంది.
ఉపసంహారం :
బహుజన స్త్రీ కథా సాహిత్యాన్ని పరిశీలించినట్లైతే పూర్తిగా వారి కథలన్నీ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. సమకాలీన సమాజం, స్త్రీల జీవితం, కులవృత్తుల చిత్రణం, వలస విధానం, ఉద్యోగబాధ్యతలు వంటివి స్పష్టంగా తెలియజేయబడ్డాయి. రచయిత్రుల కథలన్నీ ప్రస్తుత వాస్తవ జీవితాన్ని ప్రతిబింబిస్తాయే తప్ప ఎక్కడా అభూత కల్పనలకు ఆస్కారం లేదు. ముఖ్యంగా స్త్రీ నేపథ్యంగా గల కథలు సమాజంలో, కుటుంబంలో, ఉద్యోగ జీవితంలో స్త్రీలు పడుతున్న బాధలను, కష్టాలను హృదయ విదారకంగా వివరించాయి.
(పైన తెలిపిన బహుజన కథా రచయిత్రులే గాక జి. విజయలక్ష్మి గారి ”చీకట్లో వేగుచుక్క” కథను, సుజాతాదేవి గారి ”చేపలు” కథ, నాగమ్మఫూలే, జ్వలిత, పద్మజ, ఎం. లలిత మొదలైన వారి సమాచారాన్ని సేకరించలేకపోయినందుకు చింతిస్తున్నాను.)
ఆధారగ్రంథాలు
1. స్వామి, డా|| బి.వి.ఎన్. – అందుబాటు – సమైక్య సాహితీ ప్రచురణలు – కరీంనగర్, 2008., 2.సుభద్రాదేవి, శీలా – రెక్కలచూపు – హైదరాబాదు, 2008., 3.సుభద్రాదేవి, శీలా – దేవుడిబండ – హైదరాబాదు, 1990. 4.సరళాదేవి, పి – కుంకుమరేఖలు – శర్వాణీ ప్రచురణలు – విజయనగరం, 2003., 5.సరళాదేవి, పి – సరళాదేవి కథలు – శర్వాణీ ప్రచురణలు – విజయనగరం., 6.రజిత, అనిశెట్టి – మట్టిబంధం – ప్రజాహిత ప్రచురణలు – వరంగల్లు, 2006.,7.కరుణ, తాయమ్మ – తాయమ్మకథ – విప్లవ రచయితల సంఘం ప్రచురణలు – 2009. 8.వరలక్ష్మి, కె – అతడు- నేను – ఎన్.కె.పబ్లికేషన్స్ – విజయనగరం, 2004. 9.వరలక్ష్మి, కె – జీవ రాగం – శ్రీ రవీంద్ర ప్రచురణలు – జగ్గంపేట, 1996. 10.వరలక్ష్మి, కె – మట్టి బంగారం – శ్రీ రవీంద్ర ప్రచురణలు – జగ్గంపేట, 2002. 11. విద్మహే, కాత్యాయనీ – ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ. 12. విద్మహే, కాత్యాయనీ – తెలుగు నాట మహిళల ఉద్యమం – సాహిత్య అకాడెమీ. 13.విద్మహే, కాత్యాయనీ – జండర్ స్పృహ – కాకతీయ విశ్వవిద్యాలయం – వరంగల్లు, 2005. 14.రాజ్యలక్ష్మి, పి – క్షమించు కథ – ఎంప్లాయిస్ వాయిస్ పత్రిక – 2005. 15.రాజ్యలక్ష్మి, పి – తలాఖ్ కథ – భూమిక పత్రిక – 2009. 16.రాజ్యలక్ష్మి, పి – తొలి అడుగు కథ – అస్మిత – 2009. 17.పద్మావతి, కొక్కుల – విహార్ (అనువాద కథ) – విపుల – 1999. 18.పద్మావతి, కొక్కుల – అతని కథ – గబ్బిలం మాసపత్రిక – 1999. 19.పద్మావతి, కొక్కుల – ప్రశంస కథ – కరీంనగర్ జిల్లా కథలు – ఆధునిక కథా సరిత్సాగరం. 20.పద్మావతి, కొక్కుల – పాలమీగడ కథ – మార్గదర్శి – 1999.
అనువాద కథ