ఇంద్రగంటి జానకీబాల
ఒకరోజు వున్నట్టుండి నా ఫోన్ ఫ్రండ్ ఫోను చేసి ”మేడం! ఎలా వున్నారు అని క్షేమం అడిగి మీతో మాట్లాడాలి. మన పాత సినిమాల్లో అన్నీ కాపీ పాటలే అంటూ నా ఫ్రండొకరు వాదిస్తున్నారండీ” అన్నారు.
”అన్నీ అంటే ఒప్పుకోకండి. కొన్ని అంటే వాదించకండి” అన్నాను ”అదేమిటండీ మీరూ అలాగే అంటే ఎలా” – నేను నవ్వాను. మరో గంటలో ఆయన నాముందున్నాడు.
పాటలే కాదు. సినిమాకథలు – సినిమాలు కూడా ఇతర భాషల నుంచీ తీసుకునే పద్ధతి వుంది. అయితే చెప్పీ చెప్పకుండా కొట్టేయడం, పట్టుబడకుండా చిన్నచిన్న మార్పులు చేసేయడం జరుగుతూండేది. ఒకప్పుడు ‘కథకోసం కలకత్తా వెళ్ళారు’ అనే నానుడి వుండేది. అలా దిగుమతైన కథల్లో, సినిమాల్లో ఎంతో సున్నితత్వం వుండేది. అలాగే వచ్చిన పాటల్లో లాలిత్యం మాధుర్యం (మెలోడీ) వుండేవి. ఆ గొప్పగుణాల్ని చూసి మన దర్శకులు, సంగీతదర్శకులు అదే విధానం అనుసరించేవారు. ఎన్నో బెంగాలీ నవలలు సినిమాలుగా వచ్చాయి. దేవదాసు, అర్ధాంగి, వాగ్దానం, బాటసారి ఇలా ఎన్నో మంచి మంచి నవలలు తెలుగు సినిమాలుగా వచ్చి, సూపర్‌హిట్టయ్యాయి -, ఇంక, కొన్ని సినిమాలే తీసుకుని, మన తారాగణంతో తీయడం జరిగేది. అందులో పాటలు మూడొంతులు అవే ట్యూన్స్ వుంచేవారు. ఇలా కాకుండా కొన్ని చాలా పాప్యులరైన హిందీ పాటల్ని మన సినిమాల్లో పెట్టేవారు. ఒక్కొక్కసారి అవి అసందర్భంగా కూడా వుండేవి. అయితే ఆ ట్యూన్స్ మీద వున్న మోజుతో అలా చేసేవారు. ఎలా చేసినా అవి కాపీ పాటలని చెప్పక తప్పదు.
‘కులదైవం’ అనే సినిమాలో ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో – పాడైపోయెను గూడూ’ అనే పాటకి ‘చలె వుడ్ జారే పంచీ’ వుందని తెలియని వాళ్ళుండరు. అలాగే ‘పదపదవె వయ్యారి గాలిపటమా’ కూడా అయితే ‘నా హృదయంలో నిదురించే చెలి’ (ఆరాధన – ఏ.ఎన్.ఆర్.) మక్కీమక్కీ బెంగాలీ పాటని చాలామందికి తెలీదు. ఆ సినిమా బెంగాలీ సినిమా. కానీ అన్ని పాటలు కాదుగానీ ఇది మాత్రం ఎంతో ఇష్టపడి తీసుకున్నారని పిస్తుంది. దీనికి శ్రీశ్రీ వ్రాసిన సాహిత్యం, వేరే భాషలోని గీతానికి వ్రాసినట్లుగా వుండక పోవడం చాలా గొప్ప విషయం. ఆయనంత ఒరిజినల్‌గా వ్రాశారు.
‘శాంతినివాసం’ సినిమాకి ఘంటసాల సంగీతం చేశారు. కానీ అందులో రెండు శంకర్ జైకిషన్ పాటలున్నాయి. అందులో ‘రావె రాధా రాణీ రావే’ అనే పాట ‘ఝంతమోసమ్’ అనే ఉజాలాలోని పాటని చాలామందికి తెలుసు. ఇంతకీ అసలు సంగతేమంటే ప్రొడ్యూసరుగారమ్మాయి, శంకర్ జైకిషన్ పాటలంటే యిష్టమనీ, అప్పట్లో మారుమోగిపోతున్న ‘ఉజాలా’ పాటలు ఆమె కోరగా పెట్టారని అంతా చెప్పుకున్నారు. నిజం మనకి తెలీదు. అయితే మిగిలిన పాటలన్నీ ఘంటసాల అద్భుతంగా సమకూర్చారు.
కలనిజమాయగా కోరిక తీరెగా – జియ బేకరార్ హై -ఇటుపై నా గతేమీ – అబ్ మెరా కౌన్ సహారా-ఇలా ఎన్నో పాటలు న్నాయి. అనార్కలి లాంటి సినిమాల్లో పాటలన్నీ దగ్గరదగ్గరగా హిందీ అనార్కలి పాటల్ని పోలి వుంటాయి. కొన్ని పాటలు హాస్యానికి వుపయోగించిన సందర్బాలూ వున్నాయి.
ముత్యాలు – వస్తావా – రూప్ తెరా మస్తానా లాంటి పాటలు.ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వుంటూనే వుంటాయి. ఇవి చూస్తే పాట వెనుక పాట అనుకోవాల్సి వస్తుంది. మన పాటలు ఎక్కువగా అటువైపు వెళ్ళడం లేదనే చెప్పాలి. ‘సువర్ణసుందరి’ హిందీలోకి తర్జుమా చేసినప్పుడు, సంగీతదర్శకులు ఆదినారాయణరావుకి మంచి గుర్తింపు లభించింది. బొంబాయి కా బాబు సినిమాలో ఎస్.డి. బర్మన్ ఏరువాకా సాగరో పాట పల్లవిని ముచ్చటపడి వాడుకున్నారు.
తర్వాత సినిమా పాట చాలా మారింది. మనమీద, మన సంగీతం, మన సినిమా మీద బెంగాలీ ప్రభావం తగ్గి తమిళ ప్రభావం వచ్చినప్పటి నుంచి మోటతనం పెరిగింది. నటనలోను, కథను నడపడంలోనూ సున్నితత్వం తగ్గింది. అరిచి మాట్లాడటం, అతిగా హావభావాలు ప్రదర్శించటం వచ్చింది. మనకది నచ్చింది కూడా. మన సంగీత దర్శకులతో బాటు తమిళులు కె.వి. మహదేవన్ – ఎమ్.ఎస్. విశ్వనాథన్ మంచి సంగీతం తెలుగు సినిమాకిచ్చారు.
ఇళయరాజా వచ్చాక మన పాటల ట్యూన్స్ బాలీవుడ్‌కి బాగా వెళ్ళాయి. ఎ.ఆర్. రెహమాన్, ఎల్లలు లేకుండా తెలుగు, తమిళ, హిందీ అన్నిట్లోనూ విజయం సాధించారు. ఆస్కార్ తెచ్చుకుని ప్రపంచస్థాయికి చేరుకున్నారు. ఈ మధ్య మనకి బొంబాయి నుంచి ట్యూన్స్ రావడం లేదు. తమిళం నుంచే ఎక్కువ. అందుకే దూరం నుంచి వింటే తెలుగుమాటలు ఒక్కటీ అర్థం కావు. తమిళంలాగే వినిపిస్తుంది. అయితే మన వాళ్ళకి తెలుగుమీద, మన భాష మీదా పెద్ద పట్టింపులు లేవు కనుక సాగిపోతోంది. ఇప్పుడున్న సినిమా పాటకి శబ్దమే ముఖ్యం. మెలోడిని చంపేశారు కనుక ధ్వనినే సంగీతంగా మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాం. పాతవి అర్ధవంతంగా వుంటున్నాయి అందువల్ల పాతపాటలైనా, అవి హిందీ ట్యూన్లకి తెలుగు పాటలు అయినా ఆనందంగా అవే వింటున్నాం. గొంతు కలిపి పాడుకుంటున్నాం.
”మిమ్మల్ని కదిలిస్తే కష్టమే మరి – వస్తానండి” మా ఫోన్ ఫ్రండ్ ఆకలేస్తోందేమో – నేను ఊ అనేలోగా గేటు దాటారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags